RightClickBlocker

17, ఫిబ్రవరి 2018, శనివారం

దక్షిణ భారత శాస్త్రీయ నృత్యాంశం - జావళి


నాయికల శృంగార మనోభావనలను ఆవిష్కరించే జావళులు 19వ శతాబ్దంలో దేవదాసీ వ్యవస్థ ద్వారా బాగా ప్రాచుర్యం పొందాయి. జావళిలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. సాహిత్యం ప్రాంతీయ మాండలికాల పదాలతో కూడి అక్కడి సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. సాధారణంగా ఇవి నృత్య ప్రదర్శనల చివరలో ప్రదర్శించబడతాయి. మంచి సంగీతంతో పాటు సాహిత్యంలో నాయిక మనోభావనలను విశదీకరించడానికి ఈ జావళులు ప్రసిద్ధి. పదాలు జావళులకు మూలం అని చరిత్రకారుల అభిప్రాయం. పదాలలో సంగీతానికి మరింత ప్రాధాన్యత ఉంటుంది. ఒకప్పుడు తంజావూరు వంటి సంస్థానాలలో ఈ పదాలు జావళులు నర్తకీమణులు మహారాజులపై రచించ బడిన అనేక జావళులను ప్రదర్శించే వారు. తరువాత దేవదాసీ వ్యవస్థ రద్దు కావడంతో ఈ అంశం సంగీత ప్రపంచంలో నుండి కాస్త కనమురుగైంది. క్షేత్రయ్య, ఘనం శీనయ్య, ఘనం కృష్ణయ్య, ధర్మవరం రామకృష్ణమాచార్యులు, దాసు శ్రీరాములు వంటి తెలుగు రచయితలు ఈ జావళులు రచించారు. ఇవి తెలుగు, తమిళ, కన్నడ భాషలలో వ్రాయబడ్డాయి. కన్నడ దేశాన దాస సాంప్రదాయంలో ఒక విభాగానికి చెందిన వారు అనేక జావళులు రచించారు. అలాగే తమిళనాట పట్నం సుబ్రహ్మణ్య అయ్యరు తిరుపనండల్ పట్టాభిరామయ్యర్, ధర్మపురి సుబ్బరాయరు, రామనాథపురం శ్రీనివాస అయ్యంగారు మొదలైన వారు జావళులు రచించారు. అయితే, అందరి కన్నా మహారాజా స్వాతి తిరునాళ్ గారి రచనలు బాగా ప్రసిద్ధి. ప్రముఖ వాగ్గేయకారులు మైసూరు వాసుదేవాచార్యుల వారు కూడా జావళులు రచించారు.

రసోత్పత్తిని అద్భుతంగా చేసే జావళులు ప్రధానంగా నాయికా-నాయకుల శృంగారా భావనలపైనే రచించబడ్డాయి. అభినయంలో హావభావాలను వేగంగా మార్చి చూపేందుకు జావళులు ప్రసిద్ధి. భరతనాట్య సాంప్రదాయంలో జావళి ఓ ముఖ్యమైన అంశం. ట్రావెన్‌కోర్, మైసూరు మరియు విజయనగర మహారాజులు పోషించిన నృత్యాంశం జావళి. మనం గమనించవలసిన ఓ ముఖ్యమైన విషయం - రచయిత ఏ ప్రాంతానికి చెందిన వారైనా, 90 శాతం జావళులు తెలుగులోనే రచించబడ్డాయి. జావళి అనే పదం కన్నడ/మరాఠీ భాషల నుండి వచ్చి ఉండవచ్చని సంగీత చరిత్రకారుల అభిప్రాయం. శివరామయ్య అనే రచయిత తెలుగు-తమిళ భాషల మణిప్రవాళంలో జావళులు రచించారు. అలాగే పట్టాభిరామయ్యరు గారు ఆంగ్ల భాషలో జావళులు రచించారు. కన్నడ దేశంలో మాత్రం శృంగారం కాకుండా వైరాగ్య జావళులను కప్పన రచించారు. ప్రజల మనసులను ఆకట్టుకునే విధంగా జావళులను కూర్చారు సంగీతకారులు. ఇవి ఎక్కువ భాగం మధ్యమ లేదా విలంబ కాలంలోనే స్వరపరచబడ్డాయి. పల్లవి, అనుపల్లవి, చరణాల రూపంతోనే ఖమాస్, జంఝూటి, కాపి, హమీర్ కళ్యాణి, బేహాగ్ మొదలైన రాగాలలో ఎక్కువ జావళులు ప్రచారంలోకి వచ్చాయి. రాగ మాలికలలో కూడా జావళులు స్వరపరచబడ్డాయి. సంచార భావాన్ని సంగతులతో, ఆహార్యంతో అద్భుతంగా ప్రదర్శించటానికి జావళులు ప్రసిద్ధి.

మన తెలుగునాట ప్రముఖ సంగీత శాస్త్రజ్ఞులు, రచయిత, సంగీత పరిశోధకులు డాక్టర్ పప్పు వేణుగోపాలరావు గారు జావళులపై విశేషమైన పరిశోధన చేశారు. వారి ప్రకారం దక్షిణ భారత దేశంలో వెయ్యికి పైగా జావళులు అందుబాటులో ఉండగా, వాటిలో 50 మాత్రమే నాట్యప్రదర్శనలలో ప్రచారంలో ఉన్నాయి. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఎమ్మెల్ వసంతకుమారి, రాధ జయలక్ష్మి, శూలమంగళం సోదరీమణులు మొదలైన సంగీత విద్వాంసులందరూ జావళులు తమ కచేరీలలో పాడారు. పద్మా సుబ్రహ్మణ్యం, బాలసరస్వతి, కమలా లక్ష్మణ్, టీ బృంద, వెంపటి చినసత్యం వంటి నృత్య సంగీత మహామహులు ఈ జావళులపై పరిశోధన చేసి తమ శిష్య పరంపర ద్వారా కళాప్రపంచంలో నిలిచేలా చేశారు. తెలుగు తమిళ సినీ జగత్తులో కూడా 1960వ దశకం వరకు జావళులు బాగా ఉండేవి. పూజాఫలం చిత్రంలో ఘనం శీనయ్య గారి శివదీక్షాపరురాలనురా అనే జావళిని ప్రముఖ నర్తకి ఎల్. విజయలక్ష్మి గారు అద్భుతంగా ప్రదర్శించారు. ఈ గీతాన్ని జానకి గారు ఆలపించారు. ఆ గీతం యొక్క సాహిత్యం, సంగీత శైలి, నృత్యాభినయం చూస్తే జావళుల గురించి పూర్తిగా అర్థమవుతుంది. అలాగే, బొబ్బిలియుద్ధం చిత్రంలో సుశీలమ్మ గారు పాడిన నిను చేర మనసాయెరా అన్న జావళిని శ్రీశ్రీ గారు రచించారు. ఇది కూడా చాలా వేగంగా శృంగరా రసోత్పత్తితో సాగే జావళి.

ప్రముఖ సంగీతజ్ఞులు బాలమురళీకృష్ణ గారు కూడా జావళులను రచించారు. అందులో ఒకటి మరులు మించేరా అనే జంఝూటి రాగంలోని ఈ జావళి.

మరులు మించేరా! సఖా నిన్ను విడనాడలేరా! రా! రా రా!

పరమ సుందరాకారా! నా వలపంతా నీవేరా!
మరల వచ్చెదనని తరలి పోబోకురా! రా! రా రా!

కన్నుల కరవు తీర లో కనినంత నీ రూపు
మిన్నుల విహరించేరా మదనా నా ఆశలు రా రా!

నాయిక నాయకుడైన ఆ కృష్ణుని ప్రేమలో ఆనందపరవశయై ఆలపించే ఈ జావళి నృత్యాభినయానికి అద్భుతమైన అంశం. ఈ నృత్యాంశాన్ని భరతనాట్య సాంప్రదాయంలో రాజశ్రీ వారియర్ గారు ప్రదర్శించారు. శివ దీక్షాపరురాలనురా వేగంగా సాగే జావళి అయితే, బాలమురళి గారి ఈ జావళి నిదానంగా సాగుతుంది. రెండిటిని చూసి ఆనందించండి.

4, అక్టోబర్ 2017, బుధవారం

చేర రావదేమిరా? రామయ్యా! - త్యాగరాజస్వామి కృతిచేర రావదేమిరా? రామయ్యా! 

మేరగాదురా ఇక మహామేరుధీర! శ్రీకర! రామయ్య!

తల్లి తండ్రి లేని బాల తన నాథు గోరు రీతి పలుమారు వేడుకొంటే పాలించ రాదా?
వలచుచు నేను నీదు వదనారవిందమును తలచి కరుగ జూచి త్యాగరాజ సన్నుత!

ఓ రామయ్యా! నన్ను చేర రావేమిరా! మేరు పర్వతమంతటి మహా ధీరుడవు, శుభకరుడవు, ఇక నా వల్ల గాదురా రామయ్యా! తల్లి తండ్రి లేని బాలిక తన రక్షణను కోరే రీతి నేను అనేకమార్లు నిన్ను వేడుకొన్నాను.నన్ను పాలించ రాదా!  శివునిచే నుతించబడిన ఓ రామా! నీ మనసు కరుగుటకై,  నిన్నే కోరుచు,  నీ ముఖారవిందమును తలచుచున్నాను. నన్ను చేర రావేమిరా!

- సద్గురువులు త్యాగరాజస్వామి

మల్లాది సోదరులు గానం చేసిన ఈ కృతి రీతిగౌళ రాగంలో స్వరపరచబడినది.


శివకామేశ్వరీం చింతయేహం - దీక్షితులవారి చిదంబర క్షేత్ర కృతి


శివకామేశ్వరీం చింతయేహం
శృంగారరస సంపూర్ణకరీం

శివ కామేశ్వర మనః ప్రియకరీం
శివానంద గురుగుహ వశంకరీం

శాంత కళ్యాణ గుణ శాలినీం శాంత్యతీత కళా స్వరూపిణీం
మాధుర్య గానామృత మోదినీం మదాలసాం హంసోల్లాసినీం
చిదంబర పురీశ్వరీం చిదగ్ని కుండ సంభూత సకలేశ్వరీం

శృంగార రసాన్ని సంపూర్ణం చేసే శివకామేశ్వరీ అమ్మను నేను ధ్యానిస్తున్నాను. శివకామేశ్వరుని మనసును రంజిల్ల జేసే, శివానందయైన, గురుగుహుని నిర్దేశించే అమ్మను నేను ధ్యానిస్తున్నాను. శాంతము మొదలైన శుభకరమైన గుణములతో ప్రకాశిస్తూ, శాంతికి అతీతమైన కళలకు స్వరూపిణియై, మధురమైన గానామృతమును ఆనందించే, ఆనందాతిశయయై హంసపై భాసిల్లే, చిదగ్నికుండము నుండి జన్మించిన, సకల జీవరాశులకు రాజ్ఞియైన, చిదంబరపురానికి ఈశ్వరి అయిన శివకామసుందరిని నేను ధ్యానిస్తున్నాను.ముత్తుస్వామి దీక్షితుల వారి క్షేత్ర కృతులలో చిదంబరంలో నటరాజునితో కూడి యున్న శివకామసుందరి అమ్మవారిని కొలిచిన కృతి ఇది. చిత్సభలో నటరాజుడు శివకామసుందరీ దేవిల వైభవం కళ్లారా చూడవలసినదే. అద్భుతమైన శైవక్షేత్రం చిదంబరం. తమిళనాడులో చెన్నైకి దక్షిణాన 231కిలోమీటర్ల దూరంలో కడలూరు జిల్లాలో చిదంబరం ఉంది. సనాతనమైన ఈ దేవాలయాన్ని చోళులు, పాండ్యులు, చేరులు, విజయనగర రాజులు పోషించారు. ఇప్పుడున్న కట్టడం 12వ శతాబ్దం నాటిది. 40 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో అనేకదేవతా సమూహమై యున్న ఈ దేవాలయం పంచభూత స్థలములలో ఆకాశాన్ని సూచించేది. శివరాత్రికి జరిగే నాట్యాంజలి ఉత్సవాలకు ఈ దేవస్థానం పేరొందింది. నాలుగు వైపుల నాలుగు గోపురముల ద్వారా ఈ దేవస్థానంలోకి ప్రవేశించ వచ్చు. ఐదు సభలకు ఈ క్షేత్రం ప్రసిద్ధి - చిత్సభ (గర్భగుడి), కనకసభ (నిత్యసేవలు జరిగే మంటపము), నాట్యసభ, వేయి స్థంభములతో సహస్రార చక్రాన్ని సూచించే రాజసభ, దేవసభ (గణేశుడు, సోమస్కందుడు,  శివానందనాయకి, చండికేశ్వరులకు నిలయమైన సభ). 14వ శతాబ్దంలో హిందూ ద్వేషి అయిన ఇస్లాం రాజు మాలిక్ కఫూర్ దాడులలో ఈ గుడిని కూడా ధ్వంసం చేయగా తరువాత దానిని పునరుద్ధరించారు.

దీక్షితుల వారు శివకామేశ్వరీ రూపంలో ఈ శివకామసుందరిని దర్శించి ఉపాసన చేశారు. ఈ కృతిలో లలితా సహస్రనామావళిలో చిదగ్ని కుండ సంభూతగా పలుకబడిన అమ్మవారిని ప్రస్తావించారు. అలాగే ఈ క్షేత్రంలో ఉన్న శివానంద నాయికను, స్కందుని కూడా ప్రస్తావించారు. శివుని ఆనందతాండవానికి చిదంబరం రంగస్థలం. ఆ తాండవంలో శివకామసుందరిని శృంగార రస సంపూర్ణకరిగా, హంసోల్లాసినిగా వర్ణించి స్థల పురాణానికి సార్థకత కలిగించారు. కళ్యాణి రాగంలో కూర్చబడిన ఈ కృతిని మల్లాది సోదరులు గానం చేశారు.


22, సెప్టెంబర్ 2017, శుక్రవారం

పంచాశత్పీఠ రూపిణీ - దీక్షితుల వారి కృతి


పంచాశత్పీఠ రూపిణీ! మాం పాహి శ్రీ రాజరాజేశ్వరీ!

పంచదశాక్షరి! పాండ్యకుమారి! పద్మనాభ సహోదరి! శంకరి!

దేవీ! జగజ్జననీ! చిద్రూపిణి!
దేవాది నుత గురుగుహ రూపిణి!
దేశకాల ప్రవర్తిని! మహాదేవ మనోల్లాసిని! నిరంజని!
దేవరాజ ముని శాప విమోచని! దేవగాంధార రాగ తోషిణి!
భావ రాగ తాళ విశ్వాసిని! భక్త జన ప్రియ ఫల ప్రదాయిని!

ఏబది శక్తిపీఠములలో వెలసిన రాజరాజేశ్వరీ! నన్ను కాపాడుము! పదిహేను బీజాక్షరములు కల మంత్రరూపిణి! పాండ్యరాజుని కుమార్తెగా జన్మించిన మీనాక్షీ! శ్రీహరి సోదరీ! శంకరుని అర్థాంగీ! నన్ను కాపాడుము! ఓ దేవీ! నీవు లోకాలకే అమ్మవు! జ్ఞాన స్వరూపిణివి! దేవతలచే నుతించిబడిన కుమారుని తల్లివి! ఎల్లవేళలా అంతటా ప్రకాశించే అమ్మవు! పరమశివుని మనసును రంజిల్లజేసే నిర్మల మూర్తివి! మునులచే శపించబడిన ఇంద్రుని శాపవిముక్తుని చేసిన అమ్మవు! దేవగాంధార రాగములో అలరారి, భావ రాగ తాళములను విశ్వసించెదవు! భక్తుల కామ్యములను తీర్చెదవు! నన్ను కాపాడుము!

- ముత్తుస్వామి దీక్షితులు

శూలమంగళం సోదరీమణులు గానం చేసిన ఈ దీక్షితుల వారి కృతి దేవగాంధారి రాగంలో స్వరపరచబడింది. సగీత త్రయంలో దీక్షితుల వారి సాహిత్యంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.  వ్యాకరణము, మంత్రము, యోగము, భక్తి, క్షేత్ర వర్ణన, శ్రీ విద్యా ఉపాసన, తిరుత్తణి గురుగుహోపాసన దీస్ఖితుల వారి సాహిత్యంలో ప్రకాశిస్తూ ఉంటాయి. దీక్షితుల వారు తమ అనేక కీర్తనలలో తమ మంత్రశాస్త్ర ప్రావీణ్యంతో పాటు రాగం పేరును కూడా ప్రస్తావించారు. దేశమంతటా తిరిగి అనేక క్షేత్రాలలోని దేవతామూర్తులను దర్శించుకొని వారిని సంకీర్తనల ద్వారా నుతించారు. ఎక్కువ భాగం కీర్తనలను సుబ్రహ్మణ్యునిపైన, తరువాత అమ్మవారిపైన రచించారు. వీరిద్దరిని ఆయన బాగా ఉపాసించి సిద్ధి పొందారు. దేశంలో ఉన్న యాభై శక్తిపీఠాలను కూడా ఆయన సందర్శించారని ఆయన చరిత్ర చెబుతోంది. క్షేత్ర వైభవాలను మనకు అందించిన మహనీయులలో దీక్షితుల వారు అగ్రగణ్యులు. దేహాన్ని త్యజించే సమయంలో కూడా ఆయన అమ్మను స్మరించగలిగిన అపర భక్తులు. 

వావిళ్ల రామస్వామి శాస్త్రులు-వేంకటేశ్వర శాస్త్రులు - వావిళ్ల ప్రెస్వావిళ్ల రామస్వామి శాస్త్రులు - వీరు తెలుగు వారికి అందించిన సాహితీ సంపద వెలకట్టలేనిది. ఈనాటికీ మనకు శుద్ధమైన తెలుగులో పుస్తకాలు, పురాణేతిహాసాలు, వ్రతకల్పాలు అందుబాటులో ఉన్నాయంటే అది వీరి చలవే. విఖ్యాతమైన సంస్థ వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ వ్యవస్థాపకులైన వీరు సంస్కృతాంధ్ర పండితులుగా, వేదవిద్యా కోవిదులుగా పేరొందారు. 1826వ సంవత్సరంలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో వీరు జన్మించారు. వీరు చిన్న వయసులోనే ఉభయభాషలలో ప్రావీణ్యం పొంది తాళపత్ర గ్రంథాలను సేకరించి, పరిష్కరించి టీకా తాత్పర్యం వ్రాసి, వాటిని ముద్రించి శాశ్వతంగా సాహిత్యాభిమానులకు అందుబాటులో ఉండేలా చేశారు. వీరి సేవను గుర్తించిన బ్రౌన్ మహాశయుడు చేతి వ్రాత పుస్తకాలు చదువుకునే రోజుల్లో శ్రీవావిళ్ల రామస్వామి శాస్త్రుల వారు ముద్రణాలయం స్థాపించి పాఠకులకు ఎంతో సౌకర్యం కలిగించారు అని కొనియాడారు. వావిళ్ల రామస్వామి శాస్త్రులు వారు ముద్రించి ప్రకటించిన గ్రంథములు 1876 సంవత్సరంలో ప్రచురితమైన లండన్ మ్యూజియంలోని గ్రంథాలయ పట్టికలో నమోదు చేయబడినవి. శ్రీమద్రామాయణమునకు టీకా తాత్పర్య విశేషార్థములతో మొట్ట మొదట ప్రచురించింది వీరే. వీరి సంపాదకత్వంలో అనేక సంస్కృతాంధ్ర గ్రంథములు పరిష్కరించి ముద్రణా భాగ్యమును పొందాయి.

1851వ సంవత్సరంలో రామస్వామి శాస్త్రులు గారి హిందూ భాషా సంజీవని అనే ప్రెస్ ద్వారా ఈ సంస్థను స్థాపించారు. తరువాత ఆది సరస్వతీ నిలయాన్ని కూడా ఆయనే స్థాపించారు. 50కి పైగా పుస్తకాలను తన జీవిత కాలంలో ఆయన ప్రచురించారు. 1891వ సంవత్సరంలో వీరు కాలం చెందారు. వీరికి వావిళ్ల వేంకటేశ్వర శాస్త్రులు 1884 జన్మించారు. వేంకటేశ్వర శాస్త్రులు గారు 1906లో ఈ సంస్థకు నేతృత్వం వహించి వావిళ్ల ప్రెస్‌గా పేరు మార్చారు. ప్రచురణా పద్ధతికి మెరుగు దిద్ది సంస్థను అభివృద్ధి చేశారు. గోరఖ్‌పూర్ వారి గీతా ప్రెస్, వారణాసి వారి చౌఖంభా ప్రెస్‌తో అనుసంధానం చేసుకొని మనకు అమూల్యమైన వాఙ్మయాన్ని ముద్రిత రూపంలో అందజేశారు. ఉత్తమ ప్రమాణాలు గల ముద్రణంతో, సంపాదకీయ ప్రతిభతో వారు 900కు పైగా సంస్కృతాంధ్ర తమిళ ఆంగ్ల భాషలలో పుస్తకాలను ప్రచురించారు. వేంకటేశ్వర శాస్త్రులు గారి మహా దేశభక్తులు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. ఎన్నో దేశభక్తిని కలిగించే పుస్తకాలను ప్రచురించారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారి చేత ప్రభావితులైనారు. అలాగే బంకించంద్ర ఛటర్జీ గారి ఆనందమఠాన్ని తెలుగులోకి అనువదించారు. ఆంధ్రకేసరి ప్రకాశం గారికి ఎస్. సత్యమూర్తిగారికి ఎంతో ఆర్థిక సహాయం చేశారు. మహాభారతం, రామాయణం, పోతన భాగవతం మొదలైన వాటిని ప్రచురించారు. వీరి సమయంలో ఈ సంస్థను ఇంగ్లాండులోని మెక్‌మిలన్ మరియు లాంగ్‌మాన్ సంస్థలతో పోల్చారు.1916లో వీరు మా పూర్వీకులు, ఉభయ భాషా పారంగతులు అయిన అక్కిరాజు ఉమాకాంతం పంతులు గారితో కలిసి త్రిలింగ అనే పత్రికను స్థాపించారు. 1941లో ఈ పత్రిక రజతోత్సవం కూడా జరుపుకుంది. వావిళ్ల వేంకటేశ్వర శాస్త్రులు గారు 1927లో ఫెడరేటెడ్ ఇండియా అనే ఆంగ్ల పత్రికను కూడా స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు నడిపించారు. తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి గారితో కలిసి బాలవినోదిని అనే తమిళ మాస పత్రికను నడిపారు. వీరి షష్టిపూర్తి సమయంలో అభిమానులు వీరికి స్మారక ముద్రణను కూడా బహుమతిగా అందజేశారు. ప్రజా జీవితంలో ఎంతో పేరు పొందిన వీరు 1938లో ఆంధ్ర మహాసభ రజతోత్సవ సభకు అధ్యక్షునిగా పని చేశారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఎంతో కృషి చేశారు. పచయప్ప ట్రస్ట్ బోర్డు అధ్యక్షునిగా, హానరరీ మెజిస్ట్రేటుగా, మద్రాస్ పోర్ట్ ట్రస్ట్, కాస్మోపాలీటన్ క్లబ్, మాసోనిక్ లాడ్జ్, సుగుణ విలాస సభలతో అనుబంధం కలిగి సేవలు చేశారు. ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపకులు వీరే. ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యునిగా కూడా పని చేశారు. వీరు సెమ్మంగూడి మరియు అలగప్ప మొదలైన ప్రముఖులకు సన్నిహితులు.

శ్రీనాథుని శృంగార సాహిత్యాన్ని వీరు ప్రచురించగా పిఠాపురం రాజావారు, జయంతి రామయ్య గారు వీరిపై అవి అసభ్యంగా ఉండే సాహిత్యం అని దావా వేసినా అది నిలబడలేదు. తరువాత వీరు వాత్సాయన కామసూత్రాలను కూడా ప్రచురించారు. 1931-33 మధ్య 18 భాగాల మహాభారతాన్ని వీరు సంస్కృతంలో ముద్రించారు.  వారణాసి పండితులు వీరికి శాస్త్ర ప్రచార భూషణ అనే బిరుదునిచ్చారు. వీరు చేసిన భాషా సేవకు భాషోద్ధారక బిరుదు కూడా వచ్చింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు వీరిని 1955లో కళాప్రపూర్ణ బిరుదుతో గౌరవించారు. ధనవంతురాలైన భార్యతో విభేదాలతో వీరి సంసార జీవితం మాత్రం ఒడిదుడుకులు గానే నడించింది. 1942లో పక్షవాతం పాలైన వీరు 1956లో తన 67వ ఏట మరణించారు. వీరికి సంతానం లేదు. ఆయన తరువాత వీరి ఆస్తులకై ఎన్నో న్యాయ పోరాటాలు నడిచాయి. ప్రచురణ సంస్థ మూత పడింది. చెన్నైలో వీవీస్ ట్రస్ట్ నామమాత్రంగా నడుస్తోంది. దీనికి అల్లాడి స్వామినాథన్ గారు ట్రస్టీ. కొన్నేళ్ల క్రితం హైదరాబదులో ముద్రణను పరిమితిగా ఈ ట్రస్ట్ ప్రారంభించింది.

ఈ తండ్రి-కొడుకులు తెలుగు భాషకు చేసిన సేవ చిరస్మరణీయం. ఇటీవలే వావిళ్ల వారి సహితీ సంపదల 150వ జయంతి కూడా జరిగింది. ఎందరో మహానుభావులు అందరికి వందనాలు. 

17, సెప్టెంబర్ 2017, ఆదివారం

శరవణభవ గుహ షణ్ముఖ - తంజావూరు శంకర అయ్యర్ కృతి


శరవణభవ గుహ  షణ్ముఖ
తిరుమరుళ్ పురియ వా వా

మరువుం వళ్లీ దేవయాని మనాళ
కరుణై మళి పొళియ వా దయాళ

కుణ్డ్రు తోరుం ఆడుం కుమరనే  
కురైగళ్  తీర్థరుళ విరైవినిల్ నీ వా
ఎణ్డ్రుం ఇంబం తరుం  తమిళిసైక్క వా
ఇరంగి ఎంగళుక్కు జ్ఞానం తళైక్క వా

రెల్లు గడ్డి నుండి జన్మించి, ఆరు ముఖములు కలిగిన ఓ సుబ్రహ్మణ్యా! నీ కరుణతో మాకు శుభములు కురిపించుటకు రావయ్యా!  ఓ దయాళుడవైన వల్లీ దేవసేనా పతీ! నీ కరుణావృష్టిని కురిపించుటకు రావయ్యా! కొండలలో తిరుగుతూ ఆడుకునే ఓ కుమారా! మా కామ్యములు తీర్చుటకు రావయ్యా! నిత్యానందమునిచ్చే తమిళమును పాడుటకు రావయ్యా! మాపై కరుణ చూపించి జ్ఞానాన్ని ప్రసాదించుము.

(తమిళనాట భాషకు దైవ స్వరూపంగా కుమారస్వామిని కొలుస్తారు. అగస్త్య మహాముని కుమారస్వామిని ఉపాసించగా, ఆయన నోట ఈ భాష ఆ ప్రాంతంలో పలుక బడి ప్రసిద్ది పొందిందని వారి నమ్మకం)

- తంజావూరు శంకర అయ్యర్

షణ్ముఖుని నుతించే ఈ కృతిని కర్త శహానా రాగంలో స్వరపరచారు. ఈ రాగం ఆర్తికి, భక్తికి, శరణాగతికి ప్రతీక. కృతిలోని భావానికి సముచితమైన రాగంలో స్వరపరచటం వాగ్గేయకారుని పూర్ణప్రజ్ఞను సూచిస్తుంది. తంజావూరు శంకర అయ్యరు గారు 1924లో తిరుచిరాపల్లి జిల్లలోని తోగమరైలో జన్మించారు. టైగర్ వరదాచాయులు మొదలైన వారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. ఈయన శిష్యులలో టీవీ శంకరనారాయణన్, నేవేలి సంతానగోపాలన్, చిత్రవీణ రవికిరణ్ మొదలైన మహామహులెందరో ఉన్నారు. ముంబై షణ్ముఖానంద సభ ద్వారా ఎందరో శిష్యులకు శిక్షణనిచ్చారు. కలైమామణి బిరుదును పొందారు. ఈ కృతి సాహిత్యంలో ఆర్తిని రాగం ద్వారా అందించటంలో ఆయన కృతకృత్యులైనారు. రంజని-గాయత్రి సోదరీమణులు ఈ కీర్తనను గానం చేశారు. 

10, సెప్టెంబర్ 2017, ఆదివారం

గడప దాక వచ్చి మరలి పోయావు - డాక్టర్ శోభారాజు గారి మధురభక్తి గీతం


గడప దాక వచ్చి మరలి పోయావు
వెను దిరిగి రమ్మని నే పిలుచు లోపే
పిలుపందనంత దూరానికేగావు! స్వామీ! 

గుడిసెనంతా అలికి ముగ్గులేశాను
తోరణాలను కట్టి తలుపు తెరిచుంచాను
దీపాలు వెలిగించి ధూపమేసే లోపు
గడప దాకా వచ్చి మరలి పోయావు
వెను దిరిగి రమ్మని నే పిలుచు లోపే
పిలుపందనంత దూరానికేగావు! స్వామీ! 

భక్ష్యభోజ్యాదులను ప్రేమార చేశాను
కొసరి నీవు తినగా విస్తరేశాను
విశ్శ్రాంతి గొందువని పానుపేసే లోపు
గడప దాకా వచ్చి మరలి పోయావు
వెను దిరిగి రమ్మని నే పిలుచు లోపే
పిలుపందనంత దూరానికేగావు! స్వామీ!

ఏర్పాట్లలో మునిగి ఏమరను ఇకను
కటిక చీకటిగుంది చిరుదివ్వె చేబట్టి
కాలాన్ని మరచి నే ఎదురు చూస్తున్నాను
వస్తావుగా స్వామి మరియొక్క మారు

కాళ్లు వణకేను కళ్ళు చెదరేను
వంటి చేవంతా కంటి నీరాయెను
పెనుగాలికీ దివ్వె పెనుగులాడేను
వస్తావుగా స్వామి మరి యొక్క మారు

- డాక్టర్ శోభారాజు గారు

పదకవితా పితామహుని సంకీర్తనలను ప్రచారంలోకి తీసుకు రావటంలో అగ్రగణ్యులైన డాక్టర్ శోభారాజు గారి అద్భుతమైన మధురభక్తి గీతం ఇది. కృష్ణభక్తి వారికి చిన్ననాడే ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలుగా జీవితంలో అంతర్భాగమై పోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కళను పరమాత్మ సేవకు అంకితం చేసి  పదకవితా పితామహుడు అన్నమాచార్యుల వారి అమూల్యమైన సంకీర్తనా సంపదలోని భావాన్ని ప్రత్యేకమైన మార్గంలో ప్రచారం చేస్తున్నారు పద్మశ్రీ దాక్టర్ శోభారాజు గారు. ఈ మహాయజ్ఞంతో పాటు వారు ఎన్నో సంకీర్తనలను రచించారు. అందులో ఒకటి ఈ గడప దాకా వచ్చి అనే రచన. రాధ, మీరాల మధురభక్తి ఈ గీతంలో స్పష్టంగా కనబడుతుంది. స్వామి వస్తున్నాడన్న ఆనందంలో ఇల్లు అలికి, ముగ్గేసి, తోరణాలు కట్టి, ధూప దీపాలు వెలిగించి, చక్కని భోజనము ఏర్పాటు చేసి, సేదదీరేందుకు పానుపు వేసేలోపు  భక్తురాలు అంతలో స్వామి వెళ్లిపోయాడన్న విచారంలోని మనోభావన ఈ గీతం. ఈ ఏర్పాట్లలో మునిగి స్వామి రాకను ఏమరచేనేమో అని కారు చీకటిలో దివ్వెను చేతబట్టి ఎదురు చూస్తున్న కృష్ణ భక్తురాలి హృదయ సవ్వడులను మనోజ్ఞంగా తెలిపే గీతం ఇది. ఎదురు చూపులో శరీరం బలహీనమై, శక్తి అంతా కన్నీరు ధార కాగా, గాలీ దీపం ఊగిసలాడుతుండగా స్వామిని మరల రమ్మని వేడుకునే గీతం అమ్మ శోభారాజు గారు అద్భుతంగా రచించారు.

భక్తికి శరణాగతి అతి ముఖ్యం. ఈ శరణాగతిని నేను శోభారాజు అమ్మలో పరిపూర్ణంగా గమనించాను. కృష్ణభక్తిలో ఉన్న వారిలో ఈ శరణాగతితో పాటు, ప్రశాంతత, స్థితప్రజ్ఞత, దృఢమైన వ్యక్తిత్వం, పరమాత్మతో ఓ విలక్షణమైన అనుబంధం కలిగి ఉంటారు. శోభారాజు గారు చేస్తున్న సేవ అమూల్యమైనది. ఆధ్యాత్మిక సంపదతో పాటు వ్యక్తిత్వ వికాసంతో కూడిన సామాజిక స్పృహ కలిగిన శోభారాజు గారు మన సమాజాన్ని, నేటి హిందుత్వాన్ని పట్టి పీడిస్తున్న ఎన్నో సమస్యల గురించి సుస్ఫటమైన భావనలు కలిగిన వారు. డొల్లతనాన్ని, ద్వంద్వ ప్రమాణాలను, కుహనా వాదాలను, దురాచారాలను ఖండిస్తూ ఈ సమాజంలో  పోరాటం సాగిస్తున్న యోధురాలు అమ్మ. ఒక్క గీతంలో ఇన్ని భావనలను వ్యక్తపరచటం అనేది ఆ స్వామి అనుగ్రహమే. ఆధ్యాత్మిక సాధనలో, భక్తి సంగీతం ద్వారా భావకాలుష్య నివారణ అనే అద్భుతమైన లక్ష్యంతో ముందుకు వెళుతున్న శోభారాజు గారు ఇటువంటి గీతాలను ఎన్నో రచించారు. వారి భావ సంపద ఈ సమాజంలో మరింత ప్రచారంలోకి రావాలని నా ప్రార్థన.

శోభారాజు గారు ఈ గీతం ఆలపించిన రీతి అత్యంత మధురం. చరణాలు ముందుకు సాగిన కొద్దీ భావనలకు అనుగుణంగా గాత్రాన్ని మార్చి వేర్వేరు రసాలను పండించారు. స్వామీ అని పిలిచే రీతి మనసును కరగించి వేస్తుంది. బద్ధుడై స్వామి రావలసిందే అని మనసు నిశ్చయమయ్యేలా గానం చేశారు. చివరి చరణంలో శృతిని మార్చి ఆర్తితో వారు పాడిన పద్ధతి మధురభక్తికి నిదర్శనం. గీతాన్ని లలితంగా, భావనలకు అనుగుణంగా స్వరపచటంలో శోభారాజు గారి సాధన ప్రతిబింబిస్తుంది. ఈ గీత భావం అనుభవైకవేద్యం.  అన్నమాచార్య భావనా వాహిని ద్వారా ఈ గీతానికి రమణీయమైన, సముచితమైన చిత్రాలను పొందుపరచి వీడియో రూపొందించిన పార్థసారథి గారికి నా అభిననందలు, కృతజ్ఞతలు.