RightClickBlocker

28, మే 2010, శుక్రవారం

సంక్రాంతి శోభలు

చలికాలం మధ్యలో వచ్చే పండుగ, ఆంగ్లకొత్తసంవత్సరంలో వచ్చే మొదటి పండుగ, కొత్త పంటతో కూడిన పండగ కాబట్టి మంచి ఊపులో ఉత్సాహంలో ఉంటారు తెలుగు ప్రజలు. పొగమంచుతో మొదలయ్యే సూర్యోదయం - అబ్బో వర్ణిస్తే ఏడు సముద్రాలైన చాలదు.

భానుప్రకాశుడి అరుణ కిరణాలు ఆ తెలిమంచుతో సరసాలు, దోబూచులు ఆడుతూ చివరకి తానే సునాయాసంగా విజయుడై సప్తాశ్వరథారూఢుడై చలిని పారద్రోలే శిశిర ఋతువులో వచ్చే పండగ సంక్రాంతి. మూడురోజుల పండగ కాబట్టి కొంత అట్టహాసంగానే ఉంటుంది. కొత్తబియ్యం, కొత్త బట్టలు, బొమ్మలకొలువులు, రకరకాల వంటలు, రంగురంగుల రంగవల్లులు, ముగ్ధ మనోహరంగా పూచే ముద్ద బంతులు, సువర్ణవర్ణమైన, దోసిట్లో పట్టనంత గుమ్మడి పూలు, తీయగా, పుల్లగా, వగరుగా రేగి, వెలగ పళ్ళు, అప్పుడే కోతకు వచ్చిన సుమధుర రస చెరకుగడలు, పుట్టింటికి వచ్చే తనయలు, జామాతలు, బుల్లిబుల్లి బుడతలు, సప్తవర్ణ శోభితమైన గాలి పటాలు, పోటీలు, కోడిపందాలు, నవరత్న, వస్త్ర శోభితమైన గంగిరెద్దులు, సన్నాయిగాళ్ళు, వైజయంతిమాలా శోభిత, నిరంతర హరినామ సంకీర్తనాతరంగులైన హరిదాసులు, వారి వెంట తిరిగే బాలబాలికా గణము - ఎన్నో ఎన్నెన్నో..

అబ్బ చాలండి ప్రసాదు గారు మీ వర్ణన ఈ పండగ ఈ హడావిడి మా హైదరాబాద్, అమెరికాలో ఉండవండి. వివరానికి రండి అనుకుంటున్నారా - ఇదిగో వచేస్తున్నానండీ నా సోదరసోదరీమణులారా.

(తెలుగునాట కొంతమందికి సంక్రాంతికి బొమ్మలు పెట్టటం సంప్రదాయం. తమిళనాట, దాన్ని అనుకొన్న కొన్నిజిల్లాలలో మరియు కోనసీమ జిల్లాల్లో దసరాకు పెట్టటం రివాజు. ఎప్పుడైతేనేమి చెప్పండి మనకు ఇంట్లో హడావిడి, చేసే వంటలు, ఆర్భాటం ముఖ్యం)

ఇక రంగప్రవేశం, మొదటి ఘట్టం:

బొమ్మలకొలువుకు సమాయత్తం అవ్వటం. మా ఇంట్లో కొలువు ప్రత్యేకత ఏమిటి అంటే అమ్మ ఒక హరితవనం (పార్క్) ఏర్పాటు చేసేది. ఒక వారం ముందు ఒక పెద్ద ఇనుప రేకు మీద మట్టితో కట్టలుకట్టి ఒకవరుస నల్లమట్టి పోసి, బాగా సాంద్రంగా వరిగింజలు వేసేది. రోజు నీళ్ళు పోసి అవి పండగనాటికి మంచి మొలకలు వచ్చి ఒక అంగుళంకి పైగా పైరు ఉండేలా దట్టంగా పెంచేది. అప్పుడు దాంట్లో వివిధ రకాల జంతువులూ, పక్షులు, చెట్లు అమర్చి ఒక అడవిని తలపించేలా చేసేది.

ఈ హరితవనం తర్వాత బొమ్మల కొలువుకి కావలసిన వరుసక్రమం ఏర్పాటు. ఇంట్లో పాత ఇనపబల్ల ఒకటి ఉండేది మడతబెట్టే రకం. అది గట్టి కాళ్ళతో మొదటి వరుస. రెండు, మూడు వరుసలు మా ఇంట్లో బొమ్మలకోసం అని రెండు చెక్కపెట్టెలు ఉండేవి (ఇప్పటికి ఉన్నాయి అనుకుంటా). ఆ తర్వాతి వరుసలు చిన్న ఇనపపెట్టెలు, చెక్క స్టూలు లాంటివాటితో చేసి వాటిమీద చక్కగా పట్టు చీరలు కప్పి వరుస మెట్లు తయారు చేసే వాళ్ళు అమ్మ, అక్క. దీనికి దాదాపు ఒక పూట పట్టేది.

తర్వాత, వీటి మీద బొమ్మలను పేర్చటం. అమ్మ కొన్ని ఏళ్ళనుంచి మంచి మంచి మట్టి, చెక్క, ప్లాస్టర్ అఫ్ పారిస్ బొమ్మలు సమకూర్చింది. రాధాకృష్ణులు, సీతారామలక్ష్మణ, హనుమంతులు, వెంకటేశ్వర స్వామి కొండపల్లి బొమ్మ, లక్ష్మి దేవి విగ్రహం, శివుడు, బాజమేళం బృందం, రైతు, ఎడ్లబండి, గడ్డిమోపు, ఎడ్లు, ఆవు, క్రూరమృగాలు, ఇలా అన్ని రకాల బొమ్మలు ఉండేవి. ఇప్పటికి చాలా ఉన్నాయి వీటిల్లో. దేవుళ్ళు, పెద్ద బొమ్మలు పైన మెట్టు మీద, వనం, మృగాలు నేలమీద అమర్చి మిగిలిన బొమ్మలు మధ్య వరుసలలో పెట్టేది. ఈ పనిలో మేము అమ్మకి సహాయం చేసేవాళ్ళం. అప్పట్లోనే అమ్మ రంగుల లైట్లు పెట్టేది కొలువుకి. ఇవన్ని అమర్చేసరికి భోగి ముందురోజు రాత్రి చాలా ఆలస్యం అయ్యేది.

ఇక వీటితోపాటు, పాత పనికిరాని వస్తువులు అన్ని పారేయటం. భోగిమంటలు వేయటానికి  పనికి వచ్చే కట్టెలు, చెక్క ముక్కలు లాంటివి అన్ని సేకరించి పెట్టటం.

రెండవ ఘట్టం:

భోగి రోజు -

భోగిమంటలు:

తెల్లవారుఝామునే లేచి సూర్యోదయం కన్నా ముందు భోగి మంటలు వేయటం. ఇది అన్నిట్లోకి నాకు నచ్చిన అంశం. బాగా చలి కాచుకుని ఇంట్లోకి వెళ్లి అమ్మ చేత తల అంటించుకుని తలస్నానానికి తయారు.

భోగి రోజు ముగ్గు:

ముందుగానే ఏ పండగ రోజు ఏ ముగ్గు వేయాలో నిర్ణయించుకొని ఈనాడు పేపర్లో వచ్చిన ముగ్గులు, ఆంధ్రప్రభలో వచ్చిన ముగ్గులు కట్ చేసి లేదా నోట్సులో చుక్కలతో సహా రాసుకొని పెట్టుకోనేవాళ్ళు అమ్మ, అక్క.  ఉదయం తెల్లారకముందే ముగ్గు వేసి, రంగులు పెట్టి, గొబ్బెమ్మలు పెట్టేవాళ్ళు. ఆ గొబ్బెమ్మల కొప్పుల్లో మంచి ముద్దబంతి బెట్టి అలంకరించేవాళ్ళు. వీధి మొత్తంలో వీళ్ళ ముగ్గే ఆకర్షణ. అదొక తృప్తి, ఆనందం. రంగులు అద్దటంలో మేము సహాయం చేసే వాళ్ళం.

భోగి తలంట్లు, భోగి పండ్లు:

ముందు రోజు నాన్న తెచ్చిన రేగి పళ్ళతో తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకోవటం. మా ఇంట్లో ఎందుకో భోగి రోజే కొత్త బట్టలు వేసుకుంటారు. ఆ తర్వాత అమ్మ వంట వగైరా. సాయంత్రం కొలువుకి దీపం, నైవేద్యం పెట్టటం. అమ్మలక్కలని పేరంటానికి పిలవటానికి అక్క, అమ్మ వెళ్ళే వాళ్ళు. మర్నాటి పేరంటానికి కావలసిన పళ్ళు, తమలపాకులు, వక్కలు వగైరా, కూరగాయలు (చిక్కుడు కాయ కూర ఉండల్సినే మాయింట్లో సంక్రాంతి నాటికి) నాన్న బాధ్యత.

అరిసెలు వండటం:

అమ్మ బియ్యం నానా పోసి రోట్లో దంచేది. చాలా కష్టమైనా పని ఇది. రోటి పైన చెక్క కుదురు పెట్టి, పొడవాటికి రోకలితో ఒక రెండు గంటలు దంచితే ఆ బియ్యం పొడి అయ్యేవి. తర్వాత దాన్ని జల్లించి, మెత్తటి పిండి తయారు చేసేది. జల్లించి మిగిలిన పిండిని మళ్ళీ రోట్లో వేసి దంచి అలా అలా మొత్తానికి మెత్తటి బియ్యప్పిండి స్టీల్ బేసిన్లో పెట్టుకునేది. తర్వాత సమపాళ్ళలో బెల్లం పాకం చేసుకొని, పిండిలో వేసి కలిపేది. ఆ తర్వాత నేను, నాన్న, ఎవరు వీలయితే వాళ్ళు ప్లాస్టిక్ కవర్ మీద నూనె వేసుకుని అరిసె అద్ది అమ్మకు  ఇస్తే, అమ్మ వాటిని బాగా వేయించి చేతులు బలంగా ఉన్న నాన్న,అమ్మ వొత్తేవాళ్ళు. చిల్లుల గరిటెలు ఉండేవి ఇంట్లో. వాటితో ఈ కాల్చిన అరిసెల పని పట్టేవాళ్ళం నూనె అంత కారే పోయేదాకా. అప్పుడు వాటిని ఒక పెద్ద అల్యూమినియం డబ్బాలో వేసి పెట్టేది. నాకు, నాన్నకు నువ్వులు వేసిన అరిసెలు ఇష్టమని అమ్మ కొన్ని అవి చేసేది.

గాలి పటాలు:

మేము గాలి పటాలు కొనుక్కుని, మాంజా, చరఖా సరిచూసుకుని వాటిని ఎగరవేయటానికి సిద్ద్ధం అయ్యేవాళ్ళం. రంగురంగుల గాలిపటాలు ఐదు, పది పైసలకు వచ్చేవి. వీలయితే ఆరోజే ఎగురవేసేవాళ్ళం. పక్కన నాగరాజు, శ్రీను, భాను ఇలా ఎవరు మా వయసు మొగపిల్లలు ఉంటే వాళ్ళతో పోటీపడి ఎగురవేసి కొన్నిట్ని కోసి, మావి కోయిన్చుకుని, తెగినవాటిని పరిగెత్తి పట్టుకొని...అలా అలా రెండు మూడు విడతలుగా సాగేది ఈ ప్రహసనం.

మూడవ ఘట్టం:

సంక్రాంతి ముగ్గు:

సంక్రాంతి ముగ్గు మొత్తం పండగకి మకుటం. అమ్మ, అక్క చాలా సంక్రాంతి పండుగలకి కలశాల ముగ్గు వేసారు. నాలుకు వైపులా నాలుగు కలశాలు (తెలుగుతల్లి పూర్ణకుంభంలా), వాటిమధ్యలో పద్మం. అద్భుతంగా ఉండేది ఆ రంగవల్లి. పసుపు, నెమలిపించం రంగు, ఊదా రంగు, గులాబి రంగు, ఆకుపచ్చ, నీలం ఇలా అన్ని రంగులను సమంగా ముగ్గులోని గళ్ళలో నింపి వాటిపైన గొబ్బెమ్మలు పెట్టి అలంకరించేవాళ్ళు. ఈ కలశాలముగ్గు మా అమ్మ/అక్క బ్రాండ్, పేటెంట్ లాగ ఉండేది.  ఏ ఊరిలో ఉన్నా ఆ వీధిలో అమ్మ,అక్క వేసిన ఈ ముగ్గు మహారాణి ముగ్గు.

సంక్రాంతి వంట:

సంకురాత్రి రోజు అమ్మ పులగం (పెసరపప్పు, జీలకర్రతో అన్నం), చిక్కుడుకాయ కూర, నువ్వుల పొడి. ఇది మా ఇంట్లో మాములుగా ఉండే వంటలు. వీటికి తోడు పాయసం, కారప్పూస, అరిసెలు ఉన్నాయి కదా. సంక్రాంతి పెద్దల పండగ కదా అమ్మ దేవుడి దగ్గర బామ్మకు, తాతయ్యకు బట్టలు పెట్టి నమస్కారం చేసేది. భోజనం బాగా తిన్న తర్వాత అమ్మకు కొంత విశ్రాంతి.

సాయంత్రం పేరంటం:

పిలిచిన అమ్మలక్కలు అందరు వచ్చి బొమ్మలకొలువుని చాలా పొగిడే వాళ్ళు. అందులో ముఖ్యంగా వనం, బొమ్మలో ఉండే కళ (అమ్మ వెతికి వెతికి కొనేది), పేర్చిన పధ్ధతి అందరిని బాగా మురిపించి ఆకర్షించేది. అక్క చాలా పాటలు పాడేది. మంచి గొంతు, స్వరం, అమ్మ స్ఫూర్తి అన్ని కలిసి మాకు అక్క పాట అమృతంలాగ ఉండేది. వచ్చిన వాళ్ళు కూడా పాడి ఆనందిచేవాళ్ళు. సన్నిహితులకి అమ్మ చేసిన అరిసెలు, కారప్పూస లాంటివి పంచి త్రుప్తిపొందేది.

అలా సాగేది మా సంక్రాంతి లక్ష్మి ఆహ్వానం. చాలా హాయిగా, వివిధ రకాల పనులు, కళలు, సందడి, పోటీ వాతావరణంలో ఎంతో ముచ్చటగా సాగేది.

నా శ్రీమతి ఇప్పటికి ఈ సంప్రదాయాన్ని హైదరాబాద్ అపార్ట్మెంట్లో ఉండి కూడా నడిపిస్తోంది. బొమ్మల కొలువు, పేరంటం, ముగ్గు, అరిసెల యాత్ర అమ్మ నుంచి బాధ్యత తీసుకొని మా అమ్మాయి సరదాకోసం ముందుకు విజయవంతంగా నడిపిస్తోంది జ్యోత్స్న.

27, మే 2010, గురువారం

తద్దినపు రోజు ప్రహసనం

===== నాకు తద్దినం, దాని ప్రాముఖ్యత, విశిష్టత తెలుసు. కేవలం కొంత హాస్యం కొరకు ఈ వ్యాసం. మీ మనోభావాలను కించపరచటానికి మాత్రం కాదు ==========

తద్దినం అనగానే గారెలు, అల్లం పచ్చడి, పప్పు ధప్పలమే కాదండి, మా ఇంట్లో చాలా నాటకం జరిగేది.  మా బామ్మ మా నాన్న పాకే పిల్లాడిలా ఉన్నప్పుడే పోయింది పాపం అందుకని మా అమ్మ పెళ్లి అయినప్పటినుంచి బామ్మ తద్దినాలు పెడుతూనే ఉంది. ఇప్పటికి అమ్మ అక్కిరాజు వారింటికి వచ్చిన తర్వాత 43 బామ్మ తద్దినాలు, 26 తాతయ్య తద్దినాలు పెట్టాము. ఇప్పుడంటే పెద్దవాళ్ళు అయ్యాం, వంట వాళ్ళు ఉన్నారు, వ్యవహారం కూడా సులభమయ్యింది కానీ అప్పట్లో మా తాడు తెగేది ఆ రోజు.

ఒక  మూడు నాలులు రోజుల ముందు నాన్న భోక్తలకు, మంత్రం చెప్పే బ్రాహ్మణులకు, మా లలితత్తయ్యకు చెప్పటంతో మొదలయ్యేది. బామ్మ తద్దినం అయితే ముత్తైదువ కావాలి భోజనానికి అందుకని అత్తయ్య వస్తుందో రాదో కనుక్కుని ఇంకొక మహిళామణికి చెప్పి ఉంచుకోవాలి.  ఇక ముందు రోజు సాయంత్రం మార్కెట్టుకి వెళ్లి అరటి ఆకులు, కూరలు, నెయ్యి, నూనె, నువ్వులు లాంటి వస్తువులు తెచ్చుకోవాలి.  పిండాలు తినిపించటానికి గొల్లవాళ్లకి ఆవుకి చెప్పాలి, లేదా చెరువు దాక వెళ్లి కలిపే ఏర్పాటు చేసుకోవాలి. ఆవుకు చెప్పేటప్పుడు గొల్ల వీరమ్మ చూపించేదండి ఒక స్టైల్ - అదేదో వాళ్ళ ఆవు చాలా బిజీ అయినట్టు, మాకేదో అప్పాయింట్మెంట్ ఇచ్చినంత ఫీల్ చూపించేది. ఏదో ఆమెను బతిమిలాడుకొని ఒక ఆవును "బుక్" చేసుకునేవాళ్ళం.  దాదాపుగా వంకాయ, దొండకాయ/చిక్కుడుకాయ, అరటికాయ కూరలు, అల్లం పచ్చడి, దోసకాయ ముక్కల పచ్చడి, నువ్వుల పొడి, నీళ్ళ చారు (ముక్కలు లేని చింతపండు నీళ్ళు అనుకోండి), ఉత్త పప్పు (పెసర పప్పుతో), పెరుగు - ఇవీ వంటకాలు. ప్రతిసంవత్సరం రిపీట్.

ఇక ఆరోజు ఉదయం - పాపం అమ్మ ఇల్లు, వాకిలి శుభ్రం చేసుకోవాలి, తుడవాలి (పనిమనిషా పాడా అప్పట్లో అన్నీ అమ్మే - దశావధానం చేసేది అమ్మ). మేము నిద్రలు లేవకుండా దున్నపోతుల్లా పడుకునేవాళ్ళం. లేచి అమ్మకు సాయం చేద్దామనే ఆలోచనే ఉండేది కాదు. కాసేపటి దాక అమ్మ ఓపిగ్గానే చేసుకునేది. ఇక మొదలయ్యేది యుద్ధకాండ. తిట్ల పర్వం. వరుసగా ముగ్గురిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసి పనిలో మునిగేది అమ్మ. ఈ లోపల చన్నీళ్ళ స్నానం చేసి, మడి బట్టలు ఆరేసి తను మడి (తడిచీర కట్టుకుని ఎవ్వరిని తాకకుండా ఉంటె మడి కింద) కట్టుకుని ఇక వంటింట్లోకి దూరేది. ఏదో నాన్న కూరలు కడగటం, ఆకులు శుభ్రం చెయ్యటం, దొప్పలు, దక్షిణలు సమకూర్చుకోవటంలో ఉండేవారు. మధ్యమధ్యలో అమ్మ విసుర్లు, నాన్న ప్రతివిసుర్లు మాకు శ్రవణానందంగా ఉండేది. కష్టపడి అమ్మ గారెల పిండి రోట్లో రుబ్బుకొని, పచ్చళ్ళు రోట్లే వేసి రుబ్బి, పొడి కొట్టి, కూరలు తరుక్కుని వంటకు సిద్ధపడుతు రుసరుసమనడం.

ఎప్పుడన్నా మా పుణ్యం పుచ్చి అత్తయ్య రంగంలోకి దిగింది అనుకోండి ఆరోజు ఇహ రణరంగమే. ఆవిడ చిన్నముక్కలు కోయమంటే పెద్దవి, చెక్కు తీయవద్దు అంటే తీయటం, ముక్క చేదు కోసం రుచి చూడొద్దు అంటే చూడటం, బియ్యం 2 కిలోలు పోయమంటే 3 కిలోలు పోయటం లాటి తమాషాలు చాల చేసేది. అసలు విషయం ఏమిటి అంటే ఆవిడకి బొత్తిగా పని అలవాటు లేదు, రెండోది మతిమరుపు. ఆవిడ చేసే ప్రయోగాలను సవరించలేక అమ్మ ఇంకొక ఉగ్రరూప అవతారం..

ఇక 11 అయ్యేసరికి మాకు కడుపులో నకనకలు. తద్దినం రోజు టిఫిన్లు ఉండవు కదా. అందుకని మాకు పాలతో సరిపెట్టుకొని ఏకంగా 2 ఇంటికి భోజనం కోసం చకోర పక్షుల్లా కాచుకొని ఉండేవాళ్ళం. విసుగు, నీరసం.

నాకు బాగా గుర్తు. రెండు మూడు సార్లు బ్రాహ్మణులు రాకుండా ఎగ్గొట్టారు. దాదాపు పన్నెండు అయ్యింది. ఇక నాన్న ఉగ్ర నరసింహావతారం, అమ్మకు వణుకు ఎలా అని. ఆయన బయటికి లోపాలకి ఒక వందసార్లు తిరిగి ఇక ఫోన్ తిప్పటమో, సైకిల్ వేసుకొని పురోహితుడు సుబ్రహ్మణ్యంగారింటికి వెళ్ళటమో జరిగేది. మళ్ళా బ్రాహ్మణులు దొరికి తద్దినం మొదలయ్యేదాకా తకిటతోం తకిటతోం. బ్రాహ్మణులు సమయానికి రాకపోయినా తరికిటతోం తరికిటతోం. వాళ్లకు రాగానే నాన్న క్లాసు పీకి తలంటి పోస్తే గానీ కార్యక్రమము మొదలయ్యేది కాదు.

ఇంట్లో ఎప్పుడు అరటి పళ్ళు ఉండేవి కాబట్టి నేను ఈ 11 నుంచి 2 లోపల ఒక డజను అరటి పళ్ళు లాగించేవాడిని. పాపం అక్క, అన్న ఏదో వాళ్ళ అవస్థ వాళ్ళు పడే వాళ్ళు.  మధ్యలో నైవేద్యం తర్వాత ప్రాణాలు నిలపటానికి తలా ఒక గారెను ఇచ్చేవాళ్ళు. అది అమృతంలా అనిపించేది. మొత్తానికి తిట్లు, విసుర్లు, ఛలోక్తులు, వ్యంగ్యాస్త్రాల మధ్య తద్దినం కార్యక్రమం పూర్తి అయ్యేది. నాన్న వెళ్లి ఆవుకు పిండాలు తినిపించి లేదా చెరువులో వాటిని కలిపి వచ్చేదాకా వేచి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇవన్ని ఎందుకని అమ్మ అగ్నిహోత్రం పెట్టి అందులో పిండాలు హుతం చేస్తుంది. అప్పుడూ అమ్మ చేసిన వంటలన్నీ బాగా లాగించి, కింద పడి దొర్లి నవ్వుకునేవాళ్ళం. అదండీ మా బామ్మ/తాతల తద్దినం రోజు భాగవతం.

(తద్దినం అనేది ఒక యజ్ఞ్యం. అది మన పితృదేవతలను సంతృప్తి పరచే కార్యక్రమం: వారికి ఇష్టమైన పదార్థాలు వండి, పిండాలలోకి మూడు తరాల వాళ్ళను పిలిచి, భోక్తలకు భోజనం పెట్టి వారికి దక్షిణ, తాంబూలం సమర్పించి ప్రసాదాన్నిమనం భుజించటం. భక్తీ శ్రద్ధలతో సంవత్సారానికి ఒక్కసారి ఆ పిత్రుదేవతను గుర్తు చేసుకొని త్రుప్తిపరచటం దీని ఉద్దేశం).

మన సూర్యకాంతం గారు


చచ్చి ఏ లోకంలో ఉందోగాని ఆ మహాతల్లి కొన్ని దశాబ్దాలు కోడళ్ళ, సవితి కూతుళ్ళ, తోడికోడళ్ళ, మొగుళ్ళ ప్రాణాలని తోడేసి, ఉతికి ఆరేసిందంటే నమ్మండి. అమ్మో అమ్మో అదెక్కడ అఘాయిత్యమో, ఆ పుర్రచేయి వాటమేందో, ఒక ఊపు ఊపి గరిటె కాల్చి వాతలు పెట్టిందండి ఆయా పాత్రలు వేసిన వాళ్ళందరికీ.  ఒకళ్ళా ఇద్దరా ఎంత మంది నటేనటులు ఆమె చేత దెబ్బలు, శాపనార్థాలు తిన్నారో.

నిస్సహాయులైన భర్తలుగా రేలంగి, రమణారెడ్డి, గుమ్మడి, ఎస్వీ రంగారావు గారు, నాగయ్య గారు - ఆమె కళ్ళకు, చేతులకి భయపడి పిల్లిలాగ ఉన్నవాళ్ళే. పాపం మహానటి సావిత్రి అయితే  చీపురు, గరిటె దెబ్బలు కూడా తిన్నారు ఈ తల్లి చేతుల్లో. ఇలా జమున, వాణిశ్రీ వగైరా వగైరా అందరు ఆమె బాధితులే.

అయ్యిందండి ఆమె పరిచయం - అదేనండి మన సూర్యకాంతం గారే. ఇంకెవరుంటారు చెప్పండి?.  అంత ధాటిగా, దీటుగా, కర్కశంగా ఆ అమాయక పక్షులపైన?. పాపం హైకోర్ట్ జడ్జీ అయిన ఆ పెద్దిభొట్ల చలపతిరావు గారు ఎలా భరించారో కానీ ఈవిడని భార్యగా.

ఆ తల్లికి జోహార్లు అర్పిస్తూ ఈ చిన్న వ్యాసం:

ఆమె అభినయచాతుర్యం, ఆ భాష, ఆ పదాలు, ఆ వేషం - ఆవిడకి వేరే సాటి లేనే లేరు.  ఆ చేతులు తిప్పుతూ తిట్ల దండకం మొదలెట్టిందంటే ఎదురుగా ఎన్టీఆర్ అయిన సరే ఏఎన్నార్ అయిన సరే గజ గజ వణికి పోవాల్సిందే. ఆరణాల తెలుగు కోనసీమ, మన తూర్పుగోదావరి జిల్లాలో పుట్టిన ఆ మహాతల్లి మన భాషను, అందులో ఉన్న అద్భుతమైన పదప్రయోగాలు, ప్రాసలు, సామెతలు, యాసలు ఉపయోగించి అది ఒక చలనచిత్ర సంభాషణలా కాకుండా ఒక నిజ జీవితంలో ఘట్టంలా పాత్రలలో తాదాత్మ్యం చెంది జీవించింది.

ఆమె కౌశలాన్నితెలుగు చలనచిత్ర ప్రేక్షకులు విస్తుపోయి, నోళ్ళు వెళ్ళబెట్టి చూసారు. అది ప్రతినాయిక పాత్ర అయిన సరే దాని చప్పట్లతో హర్షించారు, జేజేలు కొట్టారు. అత్త, సవితితల్లి, తోడికోడలు, గయ్యాళి కోడలు అంటే సూర్యకాంతమే అనుకునేలా మన మనస్సుల్లో నిలిచిపోయింది ఆ కళామతల్లి ముద్దు బిడ్డ.

ఇక్కద రెండు పాత్రలు ఉదహరించాలి:

1. గుండమ్మ కథ

ఈ చిత్రం పేరు ఆవిడ పాత్ర పేరును బట్టి పెట్టారు అంటే ఆవిడ పాత్ర ఎంత ప్రాముఖ్యమైనదో తెలుస్తుంది. ఇక్కడ అసలు కథ ఇద్దరు అన్నదమ్ములు గుండమ్మగారి ఇద్దరు కూతుళ్ళని ఎలా పెళ్ళిచేసుకుంటారు అన్నది. రామారావుగారు, నాగేశ్వరరావుగారు, సావిత్రి, జమున - వీరు ప్రధాన పాత్రలు. కానీ వీరందరినీ మించి సినిమా మొత్తం గుండమ్మ గారి చుట్టూ తిరుగుతుంది ఎందుకంటే ఆవిడకు డబ్బున్న అహంకారం, సవితి కూతురైన సావిత్రిని పెట్టిన బాధలు, గారాబంతో కూతురిని (జమున) జీవితపు విలువలు తెలియకుండా పెంచటం, తల్లి నోటికి భయపడి కొడుకు (హరనాథ్) చాటుగా ప్రేమించి తర్వాత ఎదిరించటం , నమ్మిన తమ్ముడు గంటయ్య (రమణారెడ్డి) మోసం చెయ్యటం, ఇలా సినిమా మొత్తం ఆవిడ పాత్రమీద అల్లుకుని ఉంటుంది.

తెలుగు సినీ స్వర్ణయుగంలో హేమాహేమీలున్న సమయంలో, అందరిని ఆదరకొట్టే ఎస్వీరంగారావు, నటనాశిఖరంపై ఉన్న రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి, జమున పాత్రలను మించి కాంతమ్మ గారి పాత్రకు అగ్రతాంబూలం వేసి, దానికి తగ్గ పోటీ పాత్రలో ఛాయాదేవిని పెట్టి అద్భుతంగా తీసారు సినిమా దర్శకులు.

అలా పేరు పెట్టి, ఆమె పాత్రకు ప్రాణం పోసి, ఆమె అనిర్వచనీయమైన నటనతో ఆ సినిమా విజయభేరి మోగించి స్వర్ణయుగపు సినిమాలలో కలికితురాయిగా మిగిలింది.

2.  తోడికోడళ్ళు

ఈ చిత్రంలో ఈవిడ రేలంగి గారి భార్య. మహానటి కన్నాంబ, మహానటి సావిత్రి ఈవిడ తోడికోడళ్ళు. నాగేశ్వరరావు గారు ఈవిడ మరిది, ఎస్వీ రంగారావు గారు బావగారు. ఇంత మంది అతిరధుల మధ్య ఒక అత్యాస, అసూయలు కలిగిన ఒకే ఒక ప్రతినాయిక పాత్ర మన కాంతమ్మ గారిది. క్షణక్షణం తన అత్యాశకు అడ్డుపడే చిన్న తోడికోడలిని  పెట్టిన తిప్పలు చెప్పనలవి కాదు. పరాయి పిల్లల్ని, తన పిల్లల్ని నిజ జీవితంలో ఒక దురాశ ఉన్న గృహిణి ఎలా భేదంతో చూసి సాధిస్తుందో సినిమా చూసి ఆస్వాదిస్తే కానీ అర్థం కాదు. పని తక్కువ, ఆకలి ఎక్కువ అన్న కోణంలో రాత్రి పూట దొంగతనంగా భోజనం చేసే సన్నివేశంలో ఆమె నటన అద్భుతం.

ఇలా ఎన్ని పాత్రలో - పాశ్చాత్యపు పోకడలు ఉన్న స్టైలిష్ తల్లి పాత్ర, తెలివైన అమ్మమ్మ, వంటమనిషి రూపంలో  పచ్చని ఇంట్లో సెగలు రేపే పాత్ర,  వీరమాత హిడింబిగా - ప్రతి పాత్ర ఒక కళాఖండం, ప్రతి సన్నివేశం ఒక రసప్రవాహం.

తెలుగుదనాన్ని నింపి, గుప్పించి, పాత్రకు వందశాతం న్యాయం కూర్చి స్వర్ణయుగపు మహారథుల సాటిగా నిలిచింది ఆ పెద్దిభొట్ల వారికోడలు. ఎక్కడో చదివాను - ఆవిడ నిజ జీవితంలో వెన్నలాంటి మనసు ఉన్న తల్లి అట. కష్టంలో ఉన్న ఎంతోమంది నటీనటులకు మానసిక,ధన సహాయం చేసిన మహామహిళ ఆవిడ. భానుమతి అంత మహానటికి నచ్చిన ఏకైక నటి ఈ కాంతమ్మగారు.

ఆ తల్లి మళ్ళా మన గోదావరి జిల్లాలోనే పుట్టి మళ్ళీ వెండితెరను ఏలాలని నా కోరిక. జోహార్లు తల్లీ!!!

26, మే 2010, బుధవారం

అమ్మ - ఆమె జీవితంలో ఒక సువర్ణాధ్యాయం నిజామాబాద్

నిజామాబాదు అనేది చిన్న పట్టణం అప్పట్లో. మేము ఊరి చివర క్వార్టర్స్లో ఉండే వాళ్ళం. మంచి గాలి, చుట్టూ చెరకు తోటలు, కొన్ని వందల ఇళ్ళు, ఆ ఇళ్ళలో ఉండే వాళ్ళ మధ్య అనుబంధాలు, ఆప్యాయతలు - అదొక భూతల స్వర్గం అనుకోండి. అప్పట్లో ఈ తెలంగాణా, నక్సలిజం లాంటి సమస్యల ఊసే లేదు సుమండీ అక్కడ.  అన్ని ప్రాంతాల వాళ్ళు, వివిధ రాష్ట్రాల వాళ్ళు, మతాల వాళ్ళు, కులాల వాళ్ళు - అందరం కలిసి మెలసి ఒక మంచి కాలనీ వాతావరణంలో నివసించాం.

ఈ కంఠేశ్వర్ హౌసింగ్ బోర్డు కాలనీలో మేము ఎల్.ఐ.జీ లో ఉండే వాళ్ళం. ఉన్న 150 గజాల స్థలంలో మా అమ్మ తన ప్రతిభనంత చూపించి అన్ని రకాల మొక్కలన్నీ పెంచింది. మంచి మట్టి తెప్పించి వేసి, ఎరువుగా మేక, బర్రె పేడ, కంపోస్ట్ తయారు చేసి మంచి సారవంతం గా చేసి విత్తనాలు, మొలకలు, పిలకలు, అంట్లు నాటించింది.

ఒక పక్క అంతా గులాబీల వనం, వాటికి ఒక పక్క చేమంతుల వనం, మరొక పక్క లిల్లీలు, మరువం, దవనం, మాచుపత్రి  లాంటి సుగంధ పత్రపు మొక్కలు, చుట్టూరా బంతి చెట్లు. అబ్బో చూస్తె అదొక నందనవనంలా ఉండేది.  ఎన్ని రంగుల గులాబీలో - ఎరుపు, పసుపు, తెలుపు, రెక్క, ముద్ద - ఎండాకాలం వస్తే ఇవన్ని ఆకు కనిపించకుండా పూసేవి. అలాగే దసరా పండగ సమయానికి తెలుపు, పచ్చ, ఎరుపు చేమంతులు, ముద్ద బంతులు తెలుపు, పసుపు, కాషాయం రంగులలో రెండు చేతులలో  పట్టనంత పూలు పూసేవి. ఆరోజులలో మా దగ్గర కెమెరా లేదు కాని, ఉంటె అమ్మ ఎన్నో పోటీలలో గెలిచేది.

మా దేవుడికి, గడపలకు, కాలనీలో చాల మందికి మా పూలే. చాలారోజులు చుట్టూ చెట్లతోనే కంచే ఉండేది. తరవాత తడికేలతో పెట్టాము. అలా గేటు తెరిస్తే పూల వాసన, ఆ చెట్లనుంచి ఆహ్లాదమైన అనుభూతి కలిగేది. నిజామాబాదు వాతావరణం చలి, వేడితో కూడినది కాబట్టి పచ్చదనం బాగా ఉండేది. నేలలో కూడా మంచి సారం ఉండేది కాబట్టి వేసింది వేసినట్టు బాగా పెరిగేవి. నీళ్ళ వసతి అంతగా లేకపోయినా అమ్మ బోరేవేల్ కొట్టి నీళ్ళు పోసేది. చాల కష్ట పడి పెంచింది అమ్మ వాటిని.  కష్టపడటం, దాని ఫలితాన్ని నలుగురితో పంచుకోవటం ఆమెకు చాలా తృప్తినిచ్చేది.

ఇంకొక పక్క కూరగాయల చెట్లు - వంకాయ, దొండకాయ, బెండకాయ, టమాటో, సొరకాయ, బీరకాయ, పొట్ల కాయ; ఆకు కూరలు - చుక్క కూర, తోటకూర, గోంగూర, బచ్చలి కూర, మెంతికూర, కొతిమీర, కరివేపాకు - ఆ మొక్కలన్నీ అమ్మ పెంచి పండించింది నాలుగేళ్ళపాటు -1979 -1983 .

ఇంటి పెరట్లోకి వెళితే అరటి చెట్లు. అవి ఎంత కాసేవి అంటే 365 రోజులు గెలలు ఉండేవి. ఇంటి వెనకాల భాస్కర శర్మ గారికి, చుట్టూ పక్కల చాలా మందికి అమ్మ పంచేది. ఒక్క పిలక వేస్తె వంద పిలకలు వచ్చాయి. అరటి తోట అనుకునే వాళ్ళు.

ఇంకొక పక్క తీగ పాదులు. బూడిద గుమ్మడి కాయ చెట్టు పెడితే ఒక సంవత్సరం వంద కాయలు కాసింది. మా చుట్టాల అమ్మాయి గాయత్రి వచ్చి రిక్షా లో తీసుకు వెళ్ళేది. మామిడి చెట్టు కూడా వేసింది అమ్మ. ఆ చెట్టు మేము హైదరాబాద్ వచ్చేసిన తర్వాత కాపుకు వచ్చి కొన్న వందల బంగినపల్లి పండ్లు కాసిందిట. అమ్మ చేతిలో ఏదో ఉంది ఆ మొక్కలలో అంత జీవశక్తి ఉండటానికి.

ఈ మొక్కలన్నీ, ఇలాంటి వాతావరణం వదిలిపెట్టి మా చదువులకోసం కష్టాల ఊబి అనే హైదరాబాద్ కి వచ్చాము మేము 1983లో. ఆ తర్వాత నిజంగా అమ్మ పెద్ద మానసిక ఆనందం, శారీరిక సౌఖ్యం పొందలేదు. ఏదో ఒక సమస్య, చికాకు వాతావరణం, పిల్లలు దూరం వెళ్ళటం, నాన్న వేరే ఊళ్ళో పనిచెయ్యటం ఇవన్ని ఆమె సామర్థ్యాన్ని కొంత వరకు నిర్వీర్యం చేసాయి. కానీ ఆమె ఎప్పుడు తన ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం కోల్పోలేదు. ఎవ్వరికి తలవంచలేదు. ఇప్పటికి అలాగే దేవుడు పెట్టిన పరీక్షలను అధిగమిస్తూ అలానే సాగుతోంది ముందుకు...

ఆణిముత్యం మాయాబజార్

మాయాబజార్ (రంగులో) విడుదల అయ్యి వంద రోజులయ్యింది. హైదరాబాద్ ప్రజలు ఈ చిత్రాన్ని బాగా ఆదరించారు. ఇన్నేళ్ళ తర్వాత కూడా ప్రజల మనస్సులో ఆ అసలు సిసలు కళాఖండానికి మంచి స్థానం ఉంది అని నిరూపించారు. ఆ ప్రేక్షకులందరికీ నా జోహార్లు.

ఏంటండీ అంత గొప్ప ఈ చిత్రంలో?  నన్నడిగితే ఏది గొప్ప కాదో చెప్పండి అని ప్రశ్న వేస్తాను. అవరోహణాక్రమంలో ఇవన్ని గొప్పే:

1 . మహానటి సావిత్రి - శశిరేఖ పాత్రలో జీవించి ప్రతి క్షణం అభినయ శిఖరాన్ని అధిరోహించింది. మాయ శశిరేఖ పాత్రలో హావ భావాలు, నటనా చాతుర్యం, మూర్తీభవించే అందం - అన్నీ ఓహో ఆహా అనుకునేలా ఉంటుంది - అందుకనే ఆమెకు ఈ సినిమాలో అగ్ర తాంబూలం ఇచ్చి బంగారు పతకం.

2 .  విలక్షణ మహానటుడు ఎస్వీ రంగారావు గారు - భీకరమైన ఘటోత్కచుడిగా, సున్నితమైన వీర, హాస్య రసాలను మేళవిస్తూ ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలలో మున్చెత్తించారు. ఆయన మాట భీషణ మేఘగర్జనలా ఉంటుంది ఈ చిత్రంలో. ఆయన వేషభూషణ ముమ్మూర్తులా ఘటోత్కచుడిని  తలపిస్తుంది.  ఆయన రంగప్రవేశం ఒక కమనీయ దృశ్యం. ఆయనకు కూడా సావిత్రితో బంగారు పతకం.

3 నటరత్న, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ - తన సమ్మోహనారూపంతో, సందర్భోచితంగా ఆధ్యాత్మిక, ఆధిభౌతిక సందేశం ఇమిడియున్న మృదు, మధుర, కఠిన భాషణతో,  ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన మహనీయుడి నటనా కౌశల్యానికి రజత పతకం. సావిత్రి, ఎస్వీఆర్ తో పోలిస్తే పాత్ర కొంత తక్కువ కాబట్టి రజత పతకం అని నా అభిప్రాయం.

స్త్రీల సంభాషణలు (ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అన్ననానుడిని తలపిస్తూ), వీర, శృంగార, హాస్య రసాలను సమ పాళ్ళలో కలిపి సంగీతంతో రంగరించి తేనెలా తెరపైకి ఎక్కించిన కెవి రెడ్డి గారికి కృతజ్ఞతాభివందనాలు.

ఇకపోతే ఘంటసాల వారి సంగీతం, పింగళి వారి సాహిత్యం, మార్కస్ బార్ట్లీ అద్భుత ఛాయాగ్రాహం, అక్కినేని, గుమ్మడి, రేలంగి, ఛాయాదేవి, రుష్యేన్ద్రమణి, సంధ్య, రమణారెడ్డి, వంగర, అల్లు రామలింగయ్యల నటన....ఇవన్నీ కూడా వెలలేని శోభలు. ఈ చిత్రంలోని కొన్ని సంభాషణలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.

సమాజంలో ఎందుకు సంక్షోభం?

ఈ వ్యాసం ఎవ్వరిని ఉద్దేశించింది కాదు. అన్యథా భావించక నా అభిప్రాయంగా మాత్రమే చదవండి.

  • మేము పెంచినప్పుడు ఇంత కష్టం పడలేదమ్మా, ఏదో ఇంత చద్ది అన్నం, ఆవకాయ ముక్క, కాస్త నెయ్యో, నూనో కంచంలో పడేస్తే పిల్లలు అమృతంలా తినే వాళ్ళు. ఒక్క రోజు కూడా  ఇలా అడిగింది వండి, బతిమిలాడి గంటలు గంటలు పెట్టలేదండి. ఇలా అయితే మేము ఏమి పెంచే వాళ్లం పిల్లల్ని?.....
  • ఇదెక్కడి కాలమో, ఇంటికి తాళం పెట్టి వెళ్లేటట్టు లేదు. దోచుకు పోతున్నారు...మన సొమ్మే మనకు ప్రాణసంకటంగా అయ్యింది.....
  • మా చిన్నప్పుడు హైదరాబాద్ లో 24 గంటలు పంపు నీళ్ళు, ఇప్పుడు వారానికి ఒక్కసారి......
  • ఏమి ఎండలు బాబోయ్ ఇంత ఎండలు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు..... 
  • ఇదెక్కడి వరదలు, శ్రీశైలం ఆనకట్ట మీదినుంచి కృష్ణమ్మ ఉగ్ర రూపం. .....
  • మా వాడికి రక్తపోటు, చక్కర ఉన్నాయి. ౩౦ ఏళ్లకే ఏంటి ఈ నరకం?........
  • పాపం విజయవాడలో వైష్ణవి అనే పాపని ఎంత దారుణంగా చంపాడండి మేనమామ. ఎంత అన్యాయం?......

ఇలా ఎన్నో సంభాషణలు ఈ సమాజం లో ఈరోజు వినిపిస్తున్నాయి. ఇందులో ఎవరి తప్పు ఉంది?. ఎవరి యుగ ధర్మం, కాల ధర్మం ప్రకారం, ఎవరి అవసరం, శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళు చేస్తున్నారు.ఇక్కడ అవసరం అనేది చాల బలమైన కారణం అన్ని అనర్థాలకి. అవసరాన్ని ధర్మ మార్గంలో కాకుండా అధర్మ మార్గంలో పొందటం ఇప్పటి యుగ లక్షణం. కానీ, మనం చేయ్యాల్సింది కూడా ఉంది కదా?.  కారణాలు వెతికితే ఇవి కనిపించాయి నాకు:

1 . పూర్వ కాలంలో వనరులు, వసతులు, ఆలోచనా పరిధి అన్ని తక్కువగా ఉండేవి. ప్రచార మాధ్యమాలు, పోలికలు, ఆశలు,  ఆశయాలు తక్కువ ఉండేవి పెంచే తల్లికి, పిల్లకు. ఇప్పుడు పుట్టకముందు నుంచే ప్రణాళిక, పొదుపు, మనం అందరికన్నా బాగుందాలన్న దురాశ ఎక్కువయ్యాయి. అప్పుడూ ఉన్నారు కాని ఇప్పటి అంత కాదు. నాలుగేళ్ల వయసులో నాకు ఇప్పుడు నా  కొడుకుకి ఉన్నన్ని ప్రశ్నలు, ఆలోచనలు, ఏడుపులు, పెడబొబ్బలు లేవు అని మా అమ్మ చెప్తుంది. కొంత కన్నప్రేమ తీసేసినా, చాల నిజం ఉంది అందులో. ఆలోచనా పరిధి మనం ఇచ్చే అవకాశాలు, మాధ్యమాలు బట్టి ఉంటుంది.

2 . ఆ కాలంలో ఉన్నది పంచుకునే మనస్తత్వాలు, వ్యవస్థ ఉండేవి.  మనం ఇస్తే మనకు వస్తుంది అన్న ఆలోచనా పధ్ధతి ఉండేది. ఇప్పుడు మనది మనకే, ఇంకొకళ్ళకి వివరం, విలువ తెలియ కూడదు, మనకు ఉన్నది అర్బుదాలు నిర్బుదాలుగా పెరగాలి. పక్కవాడి గురించి మనకు అనవసరం. మా అమ్మాయికి ప్రతి సంవత్సరం చాల డాబుగా పుట్టినరోజు పండగ కావాలి. అది మేము అలవాటు చేసిందేగా?.

3. వాతావరణం, ఆహారం, జీవిత నియమాలు పూర్తిగా కల్తి అయిపోయ్యాయి. పసుపు, మంచి నీళ్ళ దగ్గరనుంచి ప్రాణాల్ని కాపాడే మందుల దాక అన్నీ కల్తీయే. వీటి వల్ల మనుషుల ఆలోచనలు, శారీరిక బాధలు, రోగాలు, మానసిక బాధలు పెరిగాయి. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం వలన మానవుడి ఆయుష్షు అయితే పెరిగింది కాని సుగుణ జీవనం కనిపించటం లేదు. కార్బైడ్ వేసి పండించని మామిడి పండు ఎంత ఖరీదో, ఎంత అరుదో మీ అందరికి తెలుసు. ఎంత మంది పొట్టకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారో మీకు తెలుసు. వాళ్ళు అందరు యుక్తవయస్కులే...

4 . చాలామటుకు మన పూర్వికులు అనుసరించిన పద్ధతులు, సంప్రదాయం, ఆధ్యాత్మిక మార్గం వదిలేసి కొత్త వృత్తులు, కొత్త నగరాలూ, కొత్త ఆచారాలు, కొత్త వ్యవహారాలు నిర్మించి ఆచరిస్తున్నాము. ఏమి చెయ్యక్కర్లేదండి, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మీరు ఏమి చేస్తున్నారో ఆలోచించండి - అదే పధ్ధతి, సంప్రదాయం.

ఇక్కడ ఏది తప్పు, ఏది ఒప్పు అని తీర్పు చెప్పటం సరియైనది కాదు, లక్ష్యం కూడా కాదు. ఏమి చేస్తే మనకు ఒక మంచి ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవన విధానం అలవడుతుంది అనేది ముఖ్యం. ఇంకొంచెం శోధిస్తే, ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడతాయి. వాటి సారాంశమే ఈ క్రింది సమాధానాలు.

1 . ప్రకృతికి విరుద్ధంగా ఏది చేసినా దాని వల్ల కొన్ని తరాల పాటు మనకి శిక్ష తప్పదు. ఆ శిక్షే మనము అనుభవిస్తున్న బాధలు - అకాల వర్షాలు, విపరీతమైన ఎండలు, సునామీలు, భూకంపాలు., క్షామము. కొన్ని దశాబ్దాలు పారిశ్రామిక విప్లవం పేరిట వృక్ష సంపదను నాశనం చేసుకున్నాం మనం. వనరులను దుర్వినియోగం చేశాం. వనాలు, అడవులు, సెలయేళ్ళు, నదీ నాదాలు అంతరించి లేదా పూర్తిగా విషపూరితమైపోయే స్థితికి తీసుకొచ్చింది మనమే. దీన్ని మార్చటం చాల తేలిక. ఇది చాల ముఖ్యమైనది ఎందుకంటే ఎక్కడైతే ప్రాకృతిక వనరులు పుష్కలంగా ఉంటాయో అక్కడ మానవజాతి వికాసం చెందుతుంది. మీరు ఏమి చెయ్యాలో కూడా మీకు తెలుసు. కాబట్టి వెంటనే మీ వంతు మీరు చెయ్యండి. ప్రకృతికి ఒక సమతుల్యం ఉంది. దాన్ని కదిలించి, మార్చి, మసి పూసే హక్కు మనకు లేదు.

2 . మన స్వధర్మాన్ని కాలానుగుణంగా మార్చుకోవటం తప్పు కాదు కాని పూర్తిగా స్వధర్మాన్నే మర్చిపోవటం వల్ల మన పీఠం కదిలి ఆలోచనలు, శరీరంలో, సమాజంలో ఊహించలేని మార్పులు వస్తాయి. అదే ఇప్పుడు జరుగుతున్నది - రోగాలు, వ్యక్తిగత, సామాజిక అంతర్యుద్ధాలు, కలహాలు, హత్యలు, మానభంగాలు....అందుకని మీ స్వధర్మమేదో తెలుసుకొని దాన్ని కొంత వరకైనా ఆచరించండి.

3 . ఇవ్వండి-పొందండి: ఈ మూలసిద్దాంతాన్ని మళ్లీ మీ ఆలోచనలలోకి రానివ్వండి; ఆ ఆలోచనను పెంపొందించండి, నలుగురికి చెప్పండి. మీరు ఇస్తే, మీకు పదింతలు వస్తుంది. అదే రూపంలో కాక పోవచ్చు, ఇంకొక రూపంలో, మీకు తెలియకుండా. దీన్ని నమ్మి ఆచరించకపోతే ఇంకా విపత్కర పరిణామాలకు సిద్ధంకండి.

4  సులువైన, నిరాడంబరమైన జీవితానికి మార్గం మీకు తెలుసు, దాన్ని మీ మనసాక్షిగా ఎంచుకుని, కష్టమైనా దానికి కట్టుబడి జీవించండి. మీరు అనుకున్న ఆనందం, తృప్తి, సామాజిక సంతులన తప్పకుండ కనిపిస్తాయి.

మార్పు అనేది మానవ జీవితానికి అతి సహజం మరియు కావాలి కూడా. లేకపోతే అందులో పస ఉండదు. అందుకని తప్పు/ఒప్పుల్ని ఎంచకుండా కొంత మీ పూర్వీకుల మార్గాన్ని మీ ప్రస్తుత జీవనశైలికి ఆపాదించుకుంటే మంచిది. ఎందుకు పూర్వీకుల మార్గం అంటున్నాను అంటే  - అది కాలచక్రంలో ఎన్నో ఆటుపోటులకు నిలిచి ఎందరో మహానుభావులనోట మనకు గేయ, కావ్య, గ్రంథ రూపాలలో చెప్పబడింది. దానిని మనం కొత్తగా నిరుపించాల్సిన అవసరం లేదు, ఆగత్యం లేదు. మనం ఏది కొత్తగా కనిపెట్టిన అది కొన్ని తరాల పాటు పరిశోధించబడి, విమర్శించబడి, రూపాంతరం చెందితే తప్ప ఒక ప్రామాణికం కాదు. అంత అవసరం ఉందా అని ఒక్క సారి ఆలోచించండి.

"అవసరం" అనేదానికి అంతులేదు.  అవసరం మనచేత ఎంతటి దుర్మార్గమైన చేయిస్తుంది. అందుకని అవసరాలని ఎలా నియంత్రించాలో ఆలోచించండి.

నేను ఈ వ్యాసంలో ఎక్కడ డబ్బు గురించి కాని, విదేశీ/స్వదేశీ నివాసం గురించి కాని, మూఢ ఆచారాల గురించి కాని ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని మాట్లాడలేదు, అది నా ఉద్దేశం కూడా కాదు. మీకు ఏది కావాలో అది మీ చేతుల్లో ఉంది అనేదే నా ఏక వాక్య తీర్మానం.

25, మే 2010, మంగళవారం

వందనములు

మొదట నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు సరస్వతి, రామారావు గారికి,  తర్వాత నా గురువులు బ్రహ్మశ్రీ నిడుగొంది రమణారావు గారికి, శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారికి, సద్గురు సాయినాథ్ మహారాజులకు, నా జన్మభూమి భారతదేశానికి, తెలుగు సీమ ఆంధ్ర ప్రదేశ్ కి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.

నిర్విఘ్నంగా ఈ బ్లాగింగు కొనసాగించటానికి ఆ గణపతిని ప్రార్థిస్తూ:

ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోక రక్షకం
అనాయకైక నాయకం వినాశితే భదైత్యకం నతా శుభాశునాశకం నమామి తం వినాయకం

చదువుల తల్లి సరస్వతిని కొలుస్తూ:

యాకుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్వితా
యావీణా వరదండ మండిత కరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతిర్దేవైసదావందితా
సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపః

పరిచయం

నా పరిచయం ఇది:

నేను అక్కిరాజు వారింట రామారావు, సరస్వతి దంపతులకు హైదరాబాద్ మహా పట్టణంలో 1971 జూలై 8న పుట్టాను. నాకు ఒక అక్క (పద్మ), అన్న (వెంకటరమణ). అన్న, వాడి కుటుంబం ఏడేళ్ళ క్రితం ఒక రైలు దుర్ఘటనలో ఈ లోకం విడిచారు. అక్క, కుటుంబం అమెరికా లో fremont లో ఉంటారు. నా బాల్యం, విద్యాభ్యాసం నిజామాబాదు పట్టణంలో, హైదరాబాద్ లో గడిచింది. మొదటి ఉద్యోగం బెంగుళూరు పట్టణంలో, తర్వాత అమెరికాలో, 2003 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ మళ్ళీ జన్మస్థానంలో. 1998 లో  నా వివాహం అమంచెర్ల వారి ఆడపడుచు జ్యోత్స్నతో జరిగింది. మాకు 8 ఏళ్ల అమ్మాయి మౌక్తిక, 2 ఏళ్ల బాబు స్కందసాయి.

ఇదీ క్లుప్తంగా నా పరిచయం.

సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై

షిర్డీ సాయినాథుని చరితామృతం చదివే భాగ్యం నాకు నా సహధర్మచారిణి సాంగత్యము, నా గురువు గారి ఆశీర్వాదం వల్ల కలిగింది. ఏంటి దాని విశిష్టత అని చెప్పేంత అర్హత నాకు లేదు. కాని నేను అర్థం చేసుకున్నది ఇది. ఒక మహాపురుషుడు ఈ యుగలక్షణాలకు అనుగుణంగా ఆధ్యాత్మిక జీవితం ఎలా గడపాలి అన్నది ప్రత్యక్షంగా తన భక్తులకు శిష్యులకు చూపించాడు. గీత, రామాయణం, భాగవతం - ఈ పురాణ, ఇతిహాసాల సారాంశాన్ని జీవన విధానం లో మనకు అందచేసాడు ఆ సద్గురువు.

ఆ సాయినాథునికి నమస్సుమాంజలి తో ఈ బ్లాగ్ ఆరంభిస్తున్నాను.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.

ఎందుకు ఉగాది పచ్చడి?

నేను ఈ బ్లాగుకు ఉగాదిపచ్చడి అని ఎందుకు పెట్టాను అంటే

జీవితంలో నేను కొన్ని సంఘటనలు ఊహించలేదు కలలో కూడా. వాటి వల్ల నేను చెప్పలేని వేదనను అనుభవించి, ఇంకా అనుభవిస్తూ ఒక మజిలీకి వచ్చాను...ఏమిటి ఎలా అన్న వివరాలు నా సన్నిహితులకి తెలుసు. కాబట్టి ఇక్కడ రాయదలుచుకోలేదు. మూగమనసులు సినిమా లో కవి అన్నట్టు 'కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతదీ కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది, కలలే మనకు మిగిలిపోవు కలిమి చివరకు ఆ కలిమి కూడా దోచుకునే దొరలూ ఎందరో'. మనసు కొంచెం కుడుతూ పడుతున్న సమయం లో ఒక గురువు, ఒక బాధ్యత ప్రవేశం జరిగింది జీవితంలో. ఆ గురువు ఆశీర్వాదంతో బాధ్యతలో మునిగితేలుతూ ఇలా ఈ బ్లాగ్ కి వచ్చాను.

జీవితం తీపి, చెడు, బాధ, ఆనందం, కష్టం, సుఖం - వీటన్నిటి మిశ్రమం అని ఇదివరకు చాలాసార్లు చదివాను. ఇప్పుడు నాకు అర్థం అయ్యింది అది ఏంటో.

షడ్రుచులమయం అయిన ఉగాదిపచ్చడి లా జీవితం సాగుతోంది కాబట్టి ఇలా దీనికి శీర్షిక పెట్టాను.