30, జులై 2010, శుక్రవారం

శివుడు - హాలాహల భక్షణం

దేవతలు, రాక్షసులు పాల కడలిని అమృతం కోసం చిలకటంలో భాగంగా మందర పర్వతం, వాసుకి, కూర్మావతరమైన విష్ణువు - ఇవి చాలా సార్లు చదివే ఉంటాము.

కూర్మావతారము


ఈ క్షీర సాగర మథనంలో అమృతం కన్నా ముందు కాలకూట విషం బయట పడింది. దాన్ని హాలహాలంగా వర్ణించారు. ఈ కథను శ్రీమదాంధ్ర మహాభాగవతంలో పోతన మనోజ్ఞంగా వర్ణించాడు. అష్టమ స్కంధములో వీటి వివరాలు ఉన్నాయి. 

జలధిన్ కడవ సేయ శైలంబు కవ్వంబు
సేయ భోగిన్ త్రాడు సేయన్ తరువ
సిరియుసుధయున్ బడయ శ్రీవల్లభుడు దక్క
నొరుడు శక్తిమంతుడొకడు గలదే

సిరి సంపదలకు, అమృతమును పొందటానికి క్షీర సాగరమును కడవగా చేసి, పర్వత రాజమైన మందరగిరిని కవ్వముగా చేసి, సర్పరాజమైన వాసుకిని తాడుగా చేసి, సముద్రమును చిలుకే కార్యమును ఆ శ్రీ మహావిష్ణువు తప్ప ఇంకొక శక్తిమంతుడు ఎవ్వడైనా చేయ గలడా?.

ఆలోల జలధిలోపలన్
ఆలోనహి విడిచి సురలు నసురులు బరవం
గీలా కోలాహలమై
హాలాహలవిషము పుట్టె నవనీనాథ!

ఆ కల్లోలితమైన సముద్రము లోపల విషజ్వాలలు పుట్టుటచే, కోలాహలముతో ఆ వాసుకిని విడిచి దేవ దానవులు చెల్లాచెదరుగా పారిపోయారు.

అప్పుడు దేవతలు ఆ శివుని హాలహలమునుండి రక్షించమని స్తుతించారు. ఏమని?.

కొందరు కలడందురు నినున్
కొందరు లేదండు రతడు గుణిగాడనుచున్
కొందరు కలడని లేడని
కొందలమందుదురు నిన్నుగూర్చి మహేశా!

మూడుమూర్తులకును మూడులోకములకు
మూడుకాలములకు మూలమగుచు
భేదామగుచు దుదినభేదమై యొప్పారు
బ్రహ్మ మనః నీవ ఫాలనయన! 

సదసత్తత్త్వచరాచర
సదనంబగు నిన్ను బొగడ జలజభవాదుల్
పెదవులు గదలుప వెరతురు
వదలక నిను బొగడ నెంతవారము దేవా! 

నీకంటె నొండెరుగము
నీకంటెం బరులు గావనేరరు జగముల్
నీకంటె నొడయడెవ్వడు
లోకంబులకెల్ల నిఖిలలోకస్తుత్యా!

దేవ దేవా! నీవే మాకు శరణ్యము. కొందరు నీవు ఉన్నావు అంటారు, కొందరు నీవు సాకారుడవై లేవని అంటారు, మరి కొందరు నీవు కలవో లేవో అని తికమక పడతారు. నీయొక్క నిజతత్వము ఎవ్వరికి తెలియదు కదా పరమశివా! . ఓ త్రినేత్రా! త్రిమూర్తులకు, మూడు లోకాలకు, మూడు కాలాలకు మూలమై ఉంటూ బాహ్యమైన భేదాలు కనిపించినను, నిజానికి ఏకైక పరబ్రహ్మ అభేద తత్త్వమై నీవు ఉన్నావు. సత్యము, అసత్యములతో కూడియున్న ఈ చరాచర సృష్టికి ఆశ్రయమై యున్న నిన్ను పొగడుటకు బ్రహ్మాది దేవతలు కూడా పెదవులను కదుపుటకు సాహసింపలేరు. ఇక మేమెంత?. ఓ సర్వలోక పూజ్యా! మేము నిన్ను తప్ప ఇంకెవరినీ ఎరుగము. నీవు తప్ప ఇంకెవ్వరు ఈ లోకములను ఈ హాలాహలాన్నుండి కాపాడలేరు. ఈలోకములన్నిటా నీకన్నా గొప్పవాడు ఇంకెవ్వడూ లేడు.

అప్పుడు శివుడు ప్రసన్నుడై, వారిపై జాలి కలిగి, పార్వతితో ఇలా అన్నాడు.

ప్రాణేచ్ఛ వచ్చి చొచ్చిన
ప్రాణుల రక్షింపవలయు ప్రభువులకెల్లన్
ప్రాణులకిత్తురు సాధులు
ప్రాణంబులు నిమిషభంగురములని మగువా!

పరహితము సేయునెవ్వడు
పరమహితుండగును భూతపంచకమునకున్
పరహితమె పరమధర్మము
పరహితునకు నెదురులేదు సర్వేందుముఖీ!

హరి మది నానందించిన
హరిణాక్షి! జగంబులెల్ల నానందించున్
హరియును జగములు మెచ్చగ
గరళము వారింపుటొప్పు కమలదళాక్షీ!

ఓ పార్వతీ! ప్రాణములను రక్షించుకొను కోరికతో వచ్చి, శరణు జొచ్చిన ప్రాణులను ప్రభువులందరూ రక్షింపవలెను. సాధువులు, మహాత్ములు ఇతరులకు తమ ప్రాణములను, అవి క్షణంలో పోగలవని తెలిసి ఇచ్చెదరు కదా!. ఇతరులకు ఉపకారము చేసే వాడు పంచభూతములకు, సమస్త జీవరాశికి పరమ హితుడగును. పరోపకారమే పరమ ధర్మము. ఇతరుల మంచి కోరేవాడికి ఎందులోనూ ఎదురులేదు కదా. ఇతరులకు మంచి చేస్తే ఆ విష్ణువు కూడా సంతోషించును. విష్ణువు సంతోషిస్తే లోకాలన్నీ ఆనందిస్తాయి. శ్రీహరిని, సర్వ లోకములను ఆనందింప చేయటానికి విషాన్ని నివారించటం మంచిదికదా!.

అప్పుడు ఆ లోకమాత ఐన పార్వతి ఎలా ఆ శంకరుడు హాలాహలాన్ని తన కంఠంలో ఉంచుకోటానికి ఒప్పుకుందో పోతన గారు ఇలా వర్ణించారు.

మ్రింగెడివాడు విభుండని
మ్రింగెడిది గరళమని మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మదినమ్మినదో!

మూడు లోకాలను దహించనున్న హాలాహాల జ్వాలలను తానే స్వీకరించదలుచుకున్న శివునకు శివాని లోకకల్యాణార్థమై అనుమతి ఇచ్చింది.  మింగ వలసినది ఘోరమైన విషమని తెలిసి, మింగేవాడు తన పతి దేవుడైనా,  జీవరాసులను రక్షించవలసి ఉన్నందున సర్వమంగళయైన ఆ పార్వతి, గరళమును మింగుమని పతి దేవునికి అనుమతినిచ్చెను. మరి ఆ సర్వలోక జనని తన మాంగల్య బలమును ఎంతగా నమ్మినదో కదా!. అప్పుడు శివుడు,

హాలాహాల భక్షణము

తన చుట్టున్ సురసంఘముల్ జయజయధ్వానంబులన్ బొబ్బిడన్
ఘన గంభీరరవంబుతో శివుడు లోకద్రోహి! హుం! పోకు ర
మ్మని కెంగేల దెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలం
బన సర్వంకషమున్ మహావిషము నాహారించె హేలాగతిన్

ఉదరము లోకంబులకును
సదనంబగుటెరిగి శివుడు చటుల విషాగ్నిన్
గుదురుకొన గంఠ బిలమున
బదిలంబుగ నిలిపె సూక్ష్మఫలరసము క్రియన్

హరుడు గళమునందు హాలాహలము వెట్ట
గప్పుగలిగి తొడవుకరణినొప్పె
సాధురక్షణంబు సజ్జనునకు నెన్న
భూషణంబు గాదె భూవరేంద్ర!


తన చుట్టూ దేవతా సమూహములు జయ జయ ధ్వనులతో కేకలు వేస్తుండగా, గంభీర స్వరముతో ఆ విషమేఘమును ఆజ్ఞాపించుచు, 'ఓ లోకద్రోహీ! ఎక్కడికీ పోకుండా నా దగ్గరకు రమ్ము' అని చెప్పి చెయ్యి చాచి ఆ మహావిషాన్ని అంతటా ఒకచోట చేర్చి ఒక్క ముద్దగా నేరేడు పండు లాగ విలాసముగా ఆరగించాడు. తన పొట్ట లోకములన్నిటికి నిలయమని తెలిసియున్న మహేశ్వరుడు చెదిరి ఉన్న విషాగ్నిని ఒకచోట కుదురుకునేలా కంఠంలో పదిలముగా, చిన్న ఫలరసమా అన్నట్లు నిలుపుకొన్నాడు. ఆ కంఠంలో విషము నలుపు పట్టిన ఆభరణంలా అలరారింది. సాధురక్షణ కూడా సజ్జనునకు ఒక ఆభరణమే కదా!.  అప్పుడు,

గరళంబు గంఠబిలమున
హరుడు ధరించుటకు మెచ్చి యౌనౌ ననుచున్
హరియు విరించియు నుమయున్
సురనాథుడు బొగడిరంత సుస్థిరమతితోన్


శివుడు గొంతుకలో గరళము ఉంచుకోవటం చూసి భళిభళి అంటూ శ్రీహరి, బ్రహ్మ, పార్వతి, ఇంద్రుడు మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు.

అలా ఆ పరమశివుడు నీలకంఠుడై ప్రపంచాన్ని ఆ విషాగ్ని నుంచి కాపాడాడు. ఈ క్షీర సాగర మథనం, హాలాహాల భక్షణం, జగన్మోహిని అవతారం (వివరాలు ఇంకొక వ్యాసంలో) అన్నీ మన ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతంలో గోదావరి జిల్లాల్లో జరిగింది అని ప్రజల నమ్మకం. పురాణాలు కూడా వీటిని సమర్థిస్తున్నాయి. ఇవి అంతర్వేది, ర్యాలి ప్రాంతంలో జరిగి ఉండవచ్చు. చారిత్రిక ఆధారాలుగా ఇక్కడ పుణ్యక్షేత్రాలు వెలశాయి.  అంతర్వేది వివరాలు.

ఓం నమః శివాయః


మహా మృత్యుంజయ మంత్రం:
 ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి