RightClickBlocker

31, ఆగస్టు 2010, మంగళవారం

కృష్ణం వందే జగద్గురుం

సుందర నాస మౌక్తిక శోభిత కృష్ణం
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్

పుట్టుకనుంచి అవతార సమాప్తి దాకా, ఆయన లీలలు, మహిమలు, పాత్రలు అనంతం. పాలు తాగే వయసులోనే పూతనాది రాక్షసులను చంపి, ఆడే పాడే వయసులో కంసాది దానవులను సంహరించి, రాధాది గోపికలతో రాసక్రీడలు సల్పి, యాదవుల సంరక్షకుడై గోవర్ధన గిరిని చిటికెన వేలితో ఎత్తి, ధర్మ సంరక్షణకై పాండవులకు అండగా నిలిచి, విహ్వల, వివస్త్రయైన ద్రౌపది మానము కాపాడి, రాగము, భయము, క్లైబ్యముతో సమరాన అస్త్రములను విడిచిన అర్జునునికి మహాద్భుత గీతోపదేశము చేసిన పూర్ణ అవతారము ఆ శ్రీకృష్ణుడు. మనలో ఒకడిగా ఉంటూ, మనకు జీవన గతిని, కర్మ ఫల సారాన్ని అందజేసి మనకు మార్గ దర్శకుడయ్యాడు కాబట్టే ఆయన జగద్గురువు. ఉరసా మనసా శిరసా ఆ లీలా మానుష మూర్తి సహస్ర పాద పద్మములకు నా నమస్కారములు.

ఆ సుందర మనోహర సునయన సుచరణ శుభగాత్రుడైన నల్లని వానిని వర్ణించటం ఎవరి తరం? వల్లభాచార్యులు మధురాష్టకంలో ఆ వేణుగోపాలుని సర్వ సులక్షణ రస ప్రవాహంలా రచించారు.  ఆయన, ఆయన చుట్టూ ఉన్నవి, ఆయన శరీరంపైన ఉన్నవి, మొత్తం, అంతటా, అన్నీ మధురమే. ఈ అష్టకం వింటూ ఉంటే ఆ స్వామి శోభాయమాన మైన రూపం కళ్లలో మెదలి రోమ రోమము ఆయన భక్తి సుధారసాస్వాదనలో తరించాలిసిందే. ఈ కృష్ణాష్టమి నాడు మీ అందరు ఆ బాలకృష్ణుని అనుగ్రహాన్ని పొందాలని నా కామ్యము.

అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురం
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతేరఖిలం మధురం

వచనం మధురం చరితం మధురం
వసనం మధురం వలితం మధురం
చలితం మధురం భ్రమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురం

వేణూర్మధురో రేణూర్మధురః
పాణిర్మధురః పాదౌ మధురం
నృత్యం మధురం సఖ్యం మధురం
మధురాధిపతేరఖిలం మధురం

గీతం మధురం పీతం మధురం
భుక్తం మధురం సుప్తం మధురం
రూపం మధురం తిలకం మధురం
మధురాధిపతేరఖిలం మధురం

కరణం మధురం తరణం మధురం
హరణం మధురం రమణం మధురం
వమితం మధురం శమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురం

గుంజా మధురా మాలా మధురా
యమునా మధురా వీచి మధురా
సలిలం మధురం కమలం మధురం
మధురాధిపతేరఖిలం మధురం

గోపీ మధురా లీలా మధురా
యుక్తం మధురం ముక్తం మధురం
దృష్టం మధురం శిష్టం మధురం
మధురాధిపతేరఖిలం మధురం

గోపా మధురా గావో మధురా
యష్టిర్మధురా సృష్టిర్మధురా
దళితం మధురం ఫలితం మధురం
మధురాధిపతేరఖిలం మధురం

శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః

శ్రీకృష్ణాష్టమి - కొన్ని తరంగాలు

నారాయణ తీర్థులు కృష్ణభక్తి సామ్రాజ్యంలో తన్మయత్వం చెంది సంస్కృత భాషలో రాసిన అమృతం లాంటి కీర్తనలు తరంగాలుగా ప్రసిద్ధి చెందాయి. రేపు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆ సుందర మోహనాన్గుడిని వర్ణిస్తూ ఆయన రచించిన కొన్ని తరంగాలు:

౧. బాల గోపాల కృష్ణా  - మోహన రాగం ఆది తాళం

(కూచిపూడి కళాప్రదర్శనలలో సంప్రదాయబద్ధంగా ప్రదర్శింపబడే జనరంజక తరంగం)

బాల గోపాల కృష్ణ పాహి పాహి ||
నీల మేఘ శరీరా నిత్యానందం దేహి ||

కలభ సుందర గమన కస్తూరి శోభితానన
నళిన దళాయత నయన నందనందన
మిళిత గోపవధూజన మీణాంక కోటి మోహన
దళిత సంసారబంధన దారుణ వైరినాశన ||

యజ్ఞ యజ్ఞ సంరక్షణ యాదవ వంశాభరణ
యజ్ఞ ఫల వితరణ యతి జనతారణ
అజ్ఞాన ఘనసమీరణ అఖిల లోకకారణ
విజ్ఞాన దళితావరణ వేదాంత వాక్యప్రమాణ ||

వ్యత్యస్త పాదారవింద విశ్వవందిత ముకుంద
సత్యాఖండ బోధానంద సద్గుణబృంద
ప్రత్యస్తమిత భేదకంద పాలిత నంద సునంద
నిత్యద నారాయణతీర్థ నిర్మలానంద గోవింద ||
 ౨. ఆలోకయే - హుస్సేనీ రాగం ఆది తాళం

ఆలోకయే శ్రీ బాలకృష్ణం - సఖి ఆనంద సుందర తాండవ కృష్ణం ||

నవనీత ఖండ దధి చోర కృష్ణం భక్త భవ పాశ బంధ మోచన కృష్ణం || 
 
నీల మేఘ శ్యామ సుందర కృష్ణం నిత్య నిర్మలానంద బోధ లక్షణ కృష్ణం ||
చరణ నిఖ్హ్వణిత నూపుర కృష్ణం కర సంగత కనక కంకణ కృష్ణం ||
కింకిణీజాల ఘణ ఘణిత కృష్ణం లోక శంకిత తారావళీ మౌక్తిక కృష్ణం ||
సుందర నాసామౌక్తిక శోభిత కృష్ణం నందనందనం అఖండ విభూతికృష్ణం ||
కంఠోప కంఠ శోభి కౌస్తుభ కృష్ణం కలి కల్మశ తిమిర భాస్కర కృష్ణం ||
వంశీ నాద వినోద సుందర కృష్ణం పరమ హంస కులశంసిత చరిత కృష్ణం ||
గోవత్స బృంద పాలక కృష్ణం కృత గోపికా జాల ఖేలన కృష్ణం ||
నంద సునందాది వందిత కృష్ణం శ్రీ నారాయణ తీర్థ వరద కృష్ణం ||


౩. పరమపురుష -  బేహగ రాగం ఆది తాళం

పరమ పురుష మను యామవయం సఖి పరమ పురుషమను యామ ||

సురుచిర హాసం సుందర నాసం తరుణారుణ కిరణాధర సరసం ||

నంద కుమారం నగవర ధీరం
బృందావన భువి వివిధ విహారం
బృందారక గణ వందిత
చరణా
వింద మిళిత మణి మధుకర నికరం ||

  భావుక చరణం భవ సంతరణం
భవ్యసేవక జన భాగ్య వితరణం
ఆవ్యయ విమల విభూతి విజృంభిత 
దివ్య మణి రచిత వివిధాభరణం ||

పరమోదారం పాపవిదూరం 
స్మర సాయక స్రగ్ధ రమయతి చతురం
విరచిత మురళీ గీత రసామృత
భరిత ఘనం ఘన కౌస్తుభహారం ||

యువతీ గీతం యోగి సులలితం
కవిజన మానస కమలవిలసితం
శివ నారాయణ తీర్థవిరచితం
శ్రీ గోపాల దయా రస మిళితం ||

 
౪. కృష్ణం కలయ సఖి - ముఖారి రాగం

కృష్ణం కలయ సఖి సుందరం - బాల ||

కృష్ణం గత విషయ తృష్ణం జగత్ప్రభ
విష్ణుం సురారి గణ జిష్ణుం సదా - బాల ||నృత్యంత మిహ ముహురత్యంతమపరిమిత
భృత్యానుకూల మఖిల సత్యం సదా - బాల ||ధీరం భవ జలధి పారం సకల వేద
సారం సమస్త యోగి తారం సదా - బాల ||శృంగార రస భర సంగీత సాహిత్య
గంగా లహరీ ఖేల సంగం సదా - బాల ||రామేణ జగదభి రామేణ బలభద్ర
రామేణ సహావాప్త కామేన సదా - బాల ||రాధారుణాధర సుధా పరి సచ్చిదానంద
రూపం జగత్రయ భూపం సదా - బాల||దామోదరమఖిల కామాకరం ఘన
శ్యామాకృతిం అసురభీమం సదా - బాల ||అర్థం శిధిలీకృతానర్థం శ్రీనారాయణ
తీర్థం పరమపురుషార్థం సదా - బాల ||

30, ఆగస్టు 2010, సోమవారం

యాభై సామెతలు

తెనుగుదనం వంటి తీయదనము లేదు 
తెలుగు కవుల వంటి ఘనులు లేరు 
తెనుగు తల్లి సాధుజన కల్పవల్లి రా
లలిత సుగుణజాల! తెలుగు బాల!

నిన్న తెలుగు భాషా దినోత్సవం. ఈ సందర్భంగా ఒక యాభై సామెతలు మీకోసం. సందర్భాన్ని బట్టి మీరు కూడా సామెతలు వాడుతూ ఉండండి. భాష నిలుస్తుంది, మీరు చెప్పాల్సిన మాటలో సందేశం ఎదుటి వారికి బాగా అందుతుంది. తెలుగు భాష పరిస్థితి ఏమిటి నేను ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. మన వంతు కృషి చేద్దాం. మాతృభాషను కాపాడుదాం.

 1. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని (ఎప్పుడూ నసుగుతూ, అసంతృప్తితో ఉండే వాళ్ల గురించి)
 2. హనుమంతుని ఎదుట కుప్పి గంతులా (సమర్థులు, తెలిసిన వారి ముందు తెలిసీ తెలియని విద్యని ప్రదర్శించటం)
 3. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు (అన్ని అయిన తర్వాత నేను చెప్పిన మాట వినలేదు, అలా చేసి  ఉండాల్సింది, ఇలా చేసి ఉండాల్సిని అనే వాళ్ల గురించి)
 4.  సూదిలా వచ్చి దబ్బనంలా తేలినట్లు (బాగు పడటం గురించి)
 5. అందరికీ శకునం చెప్పే బల్లి కుడితి తొట్లో పడిందిట (నలుగురికి చెప్పేది తనకు పనికి రాలేదు అని)
 6. శుభం పలకరా పెళ్లి కొడకా అంటే పెళ్లి కూతురు ముండ ఎక్కడ ఉంది అన్నాడుట (ఎదుటి వాళ్ళు ఏమి చెపుతున్నారు అర్థం చేసుకోలేని మూర్ఖుల గురించి, వాళ్ల ధోరణి)
 7. అందితే జుట్టు అందకుంటే కాళ్లు (స్వార్థ పరులు)
 8. శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు (ప్రతి దానికి ఒక పధ్ధతి, సరైన మార్గం ఉంటుంది అని)
 9. అక్క మనది అయితే బావ మన వాడా? (సంబంధాన్ని బట్టి వ్యవహారం అని)
 10. విగ్రహ పుష్టి నైవేద్య నష్టి (తిండికి తప్ప దేనికి పనికి రాని దేహ పుష్టి ఉన్న సోమరుల గురించి)
 11. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ (మన మంచి కోరి చెప్పే వాళ్ళను గౌరవించాలి అన్న భావన)
 12. వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి (భారతం, గారెలు మధ్య ఉపమానం)
 13. అడగందే అమ్మైనా పెట్టదు (మనకు కావాల్సింది అడిగి తీసుకోవాలి అని)
 14. వాన రాకడ ప్రాణం పోకడ తెలియదు (అన్ని మన చేతుల్లో ఉండవు అని)
 15. అత్త లేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు (అత్తా కోడళ్ళ మధ్య సంబంధం ఎప్పుడూ ఉత్తమంగా ఉండదు అని వ్యంగ్యం)
 16. వడ్డించే వాడు మన వాడైతే కడ పంక్తిని కూర్చున్నా ఒక్కటే (ఇచ్చే వాడు మనకు కావలిసిన వాడు అయితే, మనం ఎక్కడ ఉన్నా ఫలం మనకు అందుతుంది అని)
 17. అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలా? (పారాడే వయసులో కొడుకు తల్లి మధ్య ఉండే అనుబంధం, గడ్డాలు, మీసాల వయసులో ఉండదని)
 18. లోగుట్టు పెరుమాళ్ళ కెరుక (నిజం భగవంతునికి తెలుసు)
 19. ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు, వలపు సిగ్గు ఎరుగదు (పరిస్థితిని బట్టి సంతృప్తి, రుచి, సుఖం అని)
 20. లేడికి లేచిందే పరుగు (ముందు వెనక చూడకుండా, ఆలోచించకుండా, అనుకోగానే రంగంలో దూకే వాళ్ల గురించి)
 21. ఇంటి కన్నా గుడి పదిలం (భగవంతుని కోవెలలో ప్రశాంతత, భద్రత ఎక్కువ అని)
 22. లాభం గూబల్లోకి వచ్చింది (దురాశకు పొతే అసలుకే మోసం వస్తుంది అని)
 23. ఇల్లలకగానే పండగ అవుతుందా (ఏదో ఒక పని అయ్యింది కనా పొంగి పోయి హడావిడి చెయ్యటం కాదు, అన్ని అయ్యేదాకా ప్రణాళికతో, జాగ్రత్తగా ఉండాలి అని)
 24. లంకలో పుట్టిన వారందరూ రాక్షసులే (కాదు కదా!)
 25. ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కునా (మన సామర్థ్యాన్ని బట్టి చేసే పని, కలలు ఉండాలి)
 26. రౌతు కొద్దీ గుర్రం (చేసే వాడి సామర్థ్యాని బట్టి ఫలితం)
 27. ఎక్కడైనా బావా అనొచ్చు కానీ వంగతోట దగ్గర మాత్రం కాదు (వంగతోటలో అందరు బావ మరదళ్ళు ఉంటారు, అక్కడ బావా అంటే వేరే ఎవరైనా రావచ్చు. అందుకని, సందర్భాన్ని బట్టి సంబోధన ఉండాలి అని)
 28. రోలు వెళ్లి మద్దెలతో మొర పెట్టుకున్నట్టు (ఎప్పుడు రోలును రోకలితో బాడుతూనే ఉంటారు, అలాగే మద్దెలను కూడా. కాబట్టి కష్టాలు అందరికీ ఉంటాయి, వాటి గురించి సరైన చోట, సరైన వ్యక్తుల వద్ద మాత్రమే మాట్లాడాలి)
 29. ఎలుకకు పిల్లి సాక్ష్యం (నిజ నిర్ధారణలో సరైన వ్యక్తులను సాక్ష్యం కోరాలి అన్న దానికి వ్యంగ్యం)
 30. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు (అదృష్టం కలిసి వస్తే)
 31. కండ్లార్పినమ్మ ఇండ్లార్పును (నిలకడ లేని స్త్రీ ఉన్న చోట వృద్ధి ఉండదు అన్నదానికి)
 32. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమి కావాలన్నట్టు (ప్రశ్న ఏదో అడగాలి కాబట్టి అడిగి, చెప్పేది సరిగ్గా వినని వాళ్లకి)
 33. కందకు లేని దురద బచ్చలికి ఏల (అనుభవించే వాడికి లేని బాధ నీకెందుకు అని)
 34. మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు వెక్కిరించినందుకు విచారం (ఇంకొక స్త్రీ వలన పొందే అవమానం ఎంత బాధాకరం గా ఉంటుందో అన్న దానికి ఉపమానం)
 35. బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయలంత అన్నాడుట (మాటలలో కోతలు ఎంతగా ఉండొచ్చో అన్న దానికి ఉదాహరణ)
 36. కాకి ముక్కుకు దొండ పండు (వధూ వరుల పొందిక గురించి)
 37. బావ మరిది బ్రతక కోరును, దాయాది చావ కోరును (తోబుట్టువును ఇచ్చాడు కాబట్టి బావమరది నీ మంచి కోరతాడు, నువ్వు చస్తే ఆస్తి వాళ్ళది కాబట్టి దాయాది నీ చావు కోరతాడు).
 38. భోజనానికి ముందు స్నానానికి వెనక (మొదట భోజనం చేస్తే వేడిగా, అన్ని వంటకాలు అందుతాయి. అలానే, చివరన స్నానం చేస్తే వేడి నీళ్లన్నీ నీవే)
 39. పిన తండ్రి పెళ్ళాం పిన తల్లి కాదు, మేన మామ పెళ్లాం మేనత్తా కాదు (ప్రేమలు కొన్ని రక్త సంబంధాలలో ప్రత్యేకంగా ఉంటాయి) 
 40. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ (మాటను ఒక్క సారే చెప్పించుకోవాలి)
 41. పితికే బర్రెను ఇచ్చి పొడిచే దున్నను తెచ్చుకున్నట్టు (తెలిసి తెలిసి తప్పులు చెయ్యటం)
 42. నిత్యమూ చచ్చే వారికి ఏడ్చే వారెవరు (ఆత్మ స్థైర్యంతో ఉండమని)
 43. దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే (ఎక్కువ మంది పెద్దరికం చేస్తే ఎలా ఉంటుందో అన్న సందర్భం)
 44. తా వలచినది రంభ తా మునిగింది గంగ (తన అభిప్రాయమే నిజము, మంచి అనుకునే వాళ్ల గురించి)
 45. సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చింది (పెళ్ళిళ్ళలో పని వాళ్లకు ఉండే శ్రమ గురించి)
 46. తా దూర కంత లేదు మెడకో డోలు  (వసతిని, పరిస్థితి, సామర్థ్యాన్ని బట్టి పని చేసుకోవాలి అని)
 47. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో (ఎప్పటి పని అప్పుడే చేసుకొని జాగ్రత్త పాడమని)
 48. తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు (సోమరిపోతుల గురించి)
 49. తా చెడ్డ కోతి వనమెల్లా చెరచింది (చెడ్డ వాని సాంగత్యం మంచి వాళ్ళను కూడా చెడగొడుతుంది)
 50. డబ్బు లేనివాడు డుబ్బుకు కొరగాడు (డబ్బు లేని వాడు ఈ లోకంలో గౌరవించ బడడు)

27, ఆగస్టు 2010, శుక్రవారం

హరివరాసనం

హరిహరసుతాష్టకం

హరివరాసనం విశ్వమోహనం
హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకం
అరివిమర్దనం నిత్యనర్తనం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

శరణకీర్తనం భక్తమానసం
భరణలోలుపం నర్తనాలసం
అరుణభాసురం భూతనాయకం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

ప్రణయసత్యకం ప్రాణనాయకం
ప్రణతకల్పకం సుప్రభాజితం
ప్రణవమందిరం కీర్తనప్రియం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

తురగవాహనం సుందరాననం
వరగధాయుధం వేదవర్ణితం
గురుకృపాకరం కీర్తనప్రియం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

త్రిభువనర్చితం దేవతాత్మకం
త్రినయనం ప్రభుం దివ్యదేశికం
త్రిదశపూజితం చింతితప్రదం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

భవభయాపహం భావుకావహం
భువనమోహనం భూతిభూషణం
ధవళవాహనం దివ్యవారణం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

కలమృదుస్మితం సుందరాననం
కలభకోమలం గాత్రమోహనం
కలభకేసరీ వాజివాహనం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

శ్రితజనప్రియం చింతితప్రదం
శృతివిభూషణం సాధుజీవనం
శృతిమనోహరం గీతలాలసం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

మైత్రీం భజత - పరమాచార్యుల రచన

కంచి పరమాచార్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి రచన. చూడండి.

నడిచే దైవం పరమాచార్యులు

మైత్రీం భజత అఖిల హ్రుజ్జేత్రీం
ఆత్మవదేవ పరానపి పశ్యత
యుద్ధం త్యజత స్పర్ధా త్యజత
త్యజత పరేష్వ క్రమమాక్రమణం
జననీ ప్రుథివీ కామదుఘాస్తే
జనకో దేవః సకలదయాళుః
దామ్యత దత్త దయధ్వం జనతాః
శ్రేయో భూయాత్ సకలజనానాం

తాత్పర్యం:
అందరి హృదయాలను జయించే మైత్రిని పెంపొందించు. ఇతరులను నీవలెనే చూచుకొనుము. యుద్ధం, పోరు (స్పర్ధ) త్యజించు. ఇతరుల మీద నీ తామస పరాక్రమాన్ని చూపించకు. ఈ జన్మభూమి మన కోర్కెలను తీర్చటానికి సిద్ధంగా ఉంది. అత్యంత దయాళువైన ప్రభువు మనకు తండ్రిగా ఉన్నాడు. ప్రజలారా! దయతో, కరుణతో మీకు చేతనైన సాయం ఇతరులకు చేయండి. మీరందరు సుఖ సంతోషాలతో వర్ధిల్లండి.

26, ఆగస్టు 2010, గురువారం

ఉప్పెనంత ఈ ప్రేమకీ - ఆర్య-౨

ప్రేమలో కసి, సున్నితత్వం ఒకే చోట ఉండి, కొంత భావోద్వేగం దారితప్పిన ప్రేమికుడి ప్రేమగీతం ఇది. బాగా ప్రాచుర్యం పొందింది. ఆర్య-2 చిత్రంనుంచి. బాలాజీ సాహిత్యం, దేవిశ్రీప్రసాద్ సంగీతం, కేకే పాడారు. అల్లు అర్జున్ పాత్రకు బాగా సరిపోయే సాహిత్యం ఈ పాటలో ఉంది. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతం సమకూర్చారు ఈ చిత్రానికి. ప్రతిపాట సూపర్ హిట్. ఆర్య-2 తర్వాత పూర్తిగా వైవిధ్యమైన పాత్రలో వేదంలో బాగా నటించాడుట అర్జున్ (నేను వేదం చిత్రం చూడలేదు).గంగ నుంచి వేదం వరకు చాలా పరిణతి చెందాడు అని చాలా మంది అన్నారు. కొంత షారుఖ్ ఖాన్ ని అనుసరించినట్టు అనిపిస్తుంది నాకు. కానీ, తెలుగులో ఇలాంటి నటన చేసే వాళ్ళు లేరు ఇప్పుడున్న యువతరంలో.

ఉప్పెనంత ఈ ప్రేమకి..గుప్పెడంత గుండె యేమిటో..
చెప్పలేని ఈ హాయికి..భాషే ఎందుకో..
తియ్యనైన ఈ బాధకి..ఉప్పు నీరు కంట దేనికో
రెప్పపాటు దూరానికే..విరహం ఎందుకో..
నిన్ను చూసే ఈ కళ్ళకి..లోకమంత ఇంక ఎందుకో..
రెండు అక్షరాల ప్రేమకి..ఇన్ని శిక్షలెందుకో..

ఐ లవ్ యూ..నా ఊపిరి ఆగిపోయినా..
ఐ లవ్ యూ..నా ప్రాణం పోయినా..
ఐ లవ్ యూ..నా ఊపిరి ఆగిపోయినా..
ఐ లవ్ యూ..నా ప్రాణం పోయినా..

ఉప్పెనంత ఈ ప్రేమకి..గుప్పెడంత గుండె యేమిటో..
చెప్పలేని ఈ హాయికి..భాషే ఎందుకో..

కనులలోకొస్తావు..కలలు నరికేస్తావు..
సెకనుకోసారైనా చంపేస్తావు..
మంచులా ఉంటావు..మంట పెడుతుంటావు..
వెంట పడి నా మనసు మసి చేస్తావు..
తీసుకుంటే నువ్వు ఊపిరి..పోసుకుంటా ఆయువే చెలి
గుచ్చుకోకే ముల్లులా మరి..గుండెల్లో సరా సరి

ఐ లవ్ యూ..నా ఊపిరి ఆగిపోయినా..
ఐ లవ్ యూ..నా ప్రాణం పోయినా..
ఐ లవ్ యూ..నా ఊపిరి ఆగిపోయినా..
ఐ లవ్ యూ..నా ప్రాణం పోయినా..

ఉప్పెనంత ఈ ప్రేమకి..గుప్పెడంత గుండె యేమిటో..
చెప్పలేని ఈ హాయికి..భాషే ఎందుకో..

చినుకులే నిను తాకి మెరిసిపోతానందే..
మబ్బులే పోగేసి కాల్చెయ్యనా
చిలకలే నీ పలుకు..తిరిగి పలికాయంటే
తొలకరే లేకుండా పాతెయ్యనా
నిన్ను కోరి పూలు తాకితే..నరుకుతాను పూల తోటనే
నిన్ను చూస్తూ ఉన్నచోటనే..తోడేస్తా ఆ కళ్లనే..

ఐ లవ్ యూ..నా ఊపిరి ఆగిపోయినా..
ఐ లవ్ యూ..నా ప్రాణం పోయినా..
ఐ లవ్ యూ..నా ఊపిరి ఆగిపోయినా..
ఐ లవ్ యూ..నా ప్రాణం పోయినా..
ఐ లవ్ యూ..నా ఊపిరి ఆగిపోయినా..
ఐ లవ్ యూ..నా ప్రాణం పోయినా..

ఉప్పెనంత ఈ ప్రేమకి..గుప్పెడంత గుండె యేమిటో..
చెప్పలేని ఈ హాయికి..భాషే ఎందుకో..

21, ఆగస్టు 2010, శనివారం

గాయత్రి మరియు మహా మృత్యుంజయ మంత్ర సారము

గాయత్రీ మంత్రం:

ఓం భూర్భువస్సువః |
తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి |
ధియో యో నః ప్రచోదయాత్ |

తాత్పర్యం: ప్రణవ మంత్రంగా, భూః భువః సువః అనే మూడు వ్యాహృతులుగా ఉంటూ ఎవరు మన బుద్ధిని ప్రేరేపిస్తారో, సమస్తాన్ని సృష్టించే ఆ జ్యోతిర్మయ రూపాన్ని ధ్యానిద్దాం.


గాయత్రి మంత్రంలో ఉన్న మూడు భాగాలు:

1. మొదటి భాగం ప్రణవ మంత్రమైన ఓం.
2. రెండవ భాగం ప్రణవ మంత్రాన్ని విప్పి చెప్పే భూః, భువః, సువః అనే మూడు వ్యాహృతాలు. ఇవి స్థూల స్థితిలో భూమి, పితృలోకం, దేవలోకాన్ని సూచిస్తాయి. సూక్ష్మ స్థితిలో మన చేతన యొక్క మూడు స్థితులు - మనసు, శరీరం, ప్రాణం అనే మూడు స్థితులలోను పనిచేసి మన జీవితాన్ని పరిపోషణ గావిస్తాయి.
3. ఇక మూడో భాగం తత్...ప్రచోదయాత్ అనేది సావిత్రీ మంత్రంగా చెప్పబడింది.

మొత్తం మీద, ప్రణవం, వ్యాహృతి, సావిత్రి - ఈ మూడు కలిసిందే గాయత్రి. గాయాతం త్రాయతే ఇతి గాయత్రి - అంటే, జపించేవారిని తరింపజేస్తుంది కాబట్టి ఇది గాయత్రీ అని పేరు పొందింది. ఋగ్వేదంలో చెప్పబడింది.

మహా మృత్యుంజయ మంత్రం:

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం |
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ ||

తాత్పర్యం: సుగంధం వెదజల్లేవాడు, ఆహారం ఇచ్చి పోషించేవాడు, త్రినేత్రుడు అయిన పరమశివుడిని ఆరాధిద్దాం. దోసపండు కాడ నుండి విడిపడేటట్లు మరణం పట్టు నుండి విడివడెదము గాక! ఆత్మ స్థితి నుండి విడివడక ఉందాం గాక!


మరణాన్ని జయించడమంటే శరీరం పతనం కాకుండా వేలాది సంవత్సరాలు జీవించి ఉండటం అని అర్థం కాదు. శరీరం నుండి ప్రాణం విడివడడం మరణం, దీన్ని బుద్ధిపూర్వకంగా, అంటే, జీవిస్తున్నప్పుడే శరీరాన్ని తనకు భిన్నమైనదని అనుభూతి మూలంగా తెలుసు కోవటమే మరణాన్ని జయించటం.  తాను శరీరం కాదు, దాన్లో నెలకొని ఉన్న నాశనం లేని ఆత్మ అని వైరాగ్య భావనతో జీవిస్తున్న వ్యక్తి తెలుసుకుంటాడు. అతడు మరణాన్ని జయిస్తాడు. అటువంటి స్థితి కోసం ఈ మంత్ర ప్రార్థన.  దోసపండు బాగా పండి ఇక కోయటానికి తయారుగా ఉన్నప్పుడు కాడనుండి చాలా తేలికగా, బాధ లేకుండా విడిపోతుంది. అటువంటి మానసిక స్థితికోసమే ఈ మంత్ర పఠనం. శుక్ల యజుర్వేదంలో చెప్పబడింది.

18, ఆగస్టు 2010, బుధవారం

సామాజిక స్పృహ - మన ఆరోగ్యం

ఇదేమైన మీ ఆట స్థలమా?
రోడ్డు ఏమైనా మీ బాత్రూమా?
మీ ఇల్లు ఇలా ఉంటే మీరు బతుకుతారా?
మనమేమైన ఆటవికులమా?


మన దైనందిన చర్యలో మనం చేసే కొన్ని తప్పులు మన సమాజాన్ని ఎలా పీడిస్తున్నాయో రాస్తున్నాను:
 1. బహిరంగ ప్రదేశాల్లో (రోడ్లు, ఫుట్ పాత్లు వగైరా వగైరా)  ఉమ్మివేయటం, మూత్ర విసర్జన చెయ్యటం - ఉమ్మి ద్వారా ప్రాణాంతకమైన వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యమైనవి క్షయ (టీ.బీ), కాలేయ వ్యాధి (హెపటైటిస్). ఇవి భారత దేశ జనాన్ని పట్టి ధనికుడు, పేడ అని లేకుండా పీడిస్తూనే ఉన్నాయి.  మూత్రం ద్వారా కూడా హెపటైటిస్ లాంటి ఎన్నో వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. అంతే కాదు, ఈ రెండూ, అతి అపరిశుభ్రతను సూచిస్తాయి. మూత్రం మీద నివసించి, పెరిగే దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికున్ గన్యా వంటి ఎన్నో విష జ్వరాలు రావచ్చు. ఉమ్మటం, మూత్ర విసర్జన -  ఏ షాపులో ఉన్న బాత్రూం లోనైనా  పూర్తి చేసుకోవచ్చు కదా?. లేకపొతే బయలు దేరేటప్పుడు పూర్తిచేసుకోవచ్చు కదా?. ఉమ్మటానికి రుమాలు వాడుకోవచ్చు కదా?. రుమాలులో  ఉమ్మటం మీకు అపరిశుభ్రం,అసహ్యమైతే, మరి రోడ్డు మీద ఉమ్మితే అది వేరే వాళ్లకు ఎంత అసహ్యం, నీచం కావాలి?.
 2. మన చెత్తను చెత్తకుండీలో కాకుండా బయట రోడ్డు మీద వెయ్యటం - చెత్తలో నానా రకాల సూక్ష్మ క్రిములు ఉంటాయి. వీటివల్ల అన్ని రకాల జబ్బులు (విష జ్వరాలు, రక్త, చర్మ సంబంధమైన వ్యాధులు, డయేరియ, కలరా లాంటివి ఎన్నో) రావచ్చు. చెత్త పారెయ్యటానికి చెత్త కుండీలు, ఇంటి ముందుకు వచ్చి చెత్త తీసుకువెళ్ళే ప్రైవేట్ సర్వీసులు చాలా వచ్చాయి ఇప్పుడు. అవి ఎందుకు వాడరు?. మీ శుభ్రత,ఆరోగ్యం కోసం నెలకు ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టలేరా?.
 3.  ఇంటిని, పరిసరాలను పట్టించుకోక పోవటం - ఇంట్లో పాత డబ్బాలు, అవసరానికి మించి నీళ్ళు నిల్వ చేసుకోవటం, మొక్కలున్న ప్రదేశాలను శుభ్రం చెయ్యక పోవటం - వీటి వల్ల మలేరియా, డెంగ్యూ, చికన్ గన్యా వంటి జ్వరాలు ఎన్నో. ఇంట్లో ఎక్కువగా దుమ్ము, ధూళి పెరుకోవటం వలన ఎలర్జీలు, జలుబులు, దగ్గులు, ఆయాసాలు. అవి ముదిరితే ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్లు. మీ ఇంటి లోపల, బయట శుభ్రంగా ఉంచుతున్నారా?. రెండు మూడు నెలలకొకసారి ఇంట్లో అవసరం లేని వస్తువులు, చెత్త పారేస్తున్నారా?.
 4. పరిమితులకు మించి శబ్ద కాలుష్యం - మన ఇంట్లో జరిగే పెళ్లిళ్లు వగైరా శుభకార్యాలకు, పూజలకు, ఉత్సవాలకు (వినాయక చవితి, అయ్యప్ప పడి పూజ, క్రిస్మస్ లాంటివి) హోరెత్తించే లౌడ్ స్పీకర్లు పెట్టటం వలన కర్ణభేరి, మెదడులోని కణాలు, కళ్ళలోని కణాలు, నాళాలు దెబ్బతినే అవకాశం ఉంది. వీటన్నిటికి ప్రభుత్వ అనుమతి, శబ్ద స్థాయికి పరిమితి ఉన్నాయి. అవి పాటిస్తున్నారా?. మీ ఆనందం కోసం మీ పక్కవాళ్ళకు అసౌకర్యం కలిగిస్తారా?.
 5. మన చుట్టూ ఉన్న నీటి వనరులను పూర్తిగా డంప్ యార్డ్స్, మురుగు నీటి నిల్వలుగా మార్చటం, లేకపొతే ఆ స్థలాలను ఆక్రమించటం. ఒకప్పుడు హైదరాబాదులో యాభైకి పైగా మంచినీటి చెరువులు ఉండేవిట. అవి చాలా మటుకు ఆక్రమించి లేక డ్రైనేజీ గా మార్చి ఈ నగరం మంచినీటి కొరకు కృష్ణా,గోదావరి దాక వెళ్ళాల్సిన పరిస్థితి. అంతేకాదు, భూగర్భ జల నిల్వలు అట్టడుగు స్థాయికి పడిపోయింది. హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ చెరువు, షామీర్ పేట చెరువు, మియాపూర్ చెరువులు, గండిపేట చెరువు - ఇవన్ని ఈ సమస్య బారిన పాడినవే. 
 6. వాహనాలు నడిపే వాళ్లు - మీ లాగే ప్రతి ఒక్కరు గమ్యానికి ముందు చేరాల్సిన వాళ్లే. మరి వాళ్లకు మీరు ఆ అవకాశం ఇస్తున్నారా?. మీ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తున్నారా?. జామ్ అయినప్పుడు ముందుకు దూరకుండా, దాన్ని పరిష్కరించటానికి సహకరిస్తున్నారా?. రోడ్డు దాటే వారికోసం ఆగుతున్నారా?. అటువైపునుంచి వచ్చే ట్రాఫిక్ కోసం ఉన్న రోడ్డును మీకోసం వాడకుండా వేచి ఉంటున్నారా?. 
 ప్రతిదానికి ప్రభుత్వంపై బాధ్యత మోపటం మనకు బాగా అలవాటు అయ్యింది. పైన చెప్పిన అయిదు పాయింట్లలో పౌరుల బాధ్యతే ఎక్కువ ఉంది. డెబ్భై లక్షల జనాభాకు ప్రభుత్వం ఎంత చెయ్యగలదు?. పౌరులుగా మీ హక్కులతో పాటు బాధ్యతను కూడా నిర్వర్తించాలి కదా?. పైన చెప్పిన విషయాలలో ఒక్కటి కొన్నాళ్ల పాటు పాటించి మీ పక్కన వాళ్ల చేత పాటింప చేయించండి. మన నగరం తప్పకుండా బాగుపడుతుంది. ఇది మన నగరం. దీన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచాల్సిన బాధ్యత అందరిదీ.

17, ఆగస్టు 2010, మంగళవారం

క్రీడా స్ఫూర్తి - విజయం - ఏమి చెయ్యాలి?

"అబ్బ, మన వాళ్లు ఇంతే. ఏదో ఒక మ్యాచ్ గెలిచి పది ఓడిపోతారు...". "అసలు మనవాళ్ళు అయిదు రోజుల ఆట ఆడుతున్నారా లేక వన్డే నా?. బ్యాట్ నిలిపి క్రీజ్ లో ఉండలేరు ఎందుకని?. టప టప పడిపోవటమే పేక ముక్కల్లా వికెట్లు".."అబ్బ మనవాళ్ళ ఫీల్డింగ్ ఘోరం..వంగితే నిన్చోలేరు, నించుంటే వంగలేరు".."వాడి సెంచరీ కోసమే కాని మ్యాచ్ గెలిపిద్దాము/కాపాడుదాము అని కాదు"... "అంతా ఆరంభ శూరత్వం సార్. మొదట్లో పేరు రావాలని బాగా ఆడతారు. తర్వాత డబ్బు, పేరు, గుర్తింపు వచ్చేసరికి ఆట మీద శ్రద్ధ పోతుంది"... "ఆ పాకిస్తాన్ వాళ్లు చూడు ఎంత పోరాట పటిమ చూపించారో?. ఎందుకు మనవాళ్ళు ఆ తామసం చూపించరు క్రీడల్లో?"... "అవార్డులు/అడ్వర్టైజ్మెంట్లు తీసుకుంటారు కానీ, ఆటకొస్తే సున్నా"... - ఇదండీ మనం రోజు వినే భారతీయ క్రీడాకారుల మీద ఆరోపణలు.  క్రికెట్ ఒక్కటే కాదు - టెన్నిస్, హాకీ, ఇలా ప్రజాదరణ కలిగిన ప్రతి క్రీడలోను విమర్శ తప్పట్లేదు. ఎందుకని?.
 1. క్రీడాకారులకు శారీరిక, మానసిక దారుఢ్యం తక్కువ - పెరిగే వయస్సులో శరీర సౌష్టవం మీద శ్రద్ధ లేకుండా, నెట్టుకు వచ్చి ఆటలో ఆటుపోట్లు తిని గాయాలకు తల ఒంచుతున్నారు మన క్రీడాకారులు. దీనికి కారణం - వారి వృత్తి అయిన క్రీడకు కావలిసిన శారీరిక శక్తి మీద అవగాహన లేకపోవటం, ఉన్నా, దాన్ని పెంపొందించు కోవటానికి ఇంట్లో వసతులు, జీవన శైలి, బయట వసతులు లేకపోవటం. అంటే - సరైన తిండి, అవగాహన, ప్రేరణ ఉన్న సరైన గురువు, వ్యాయామం చేసే సదుపాయాలు - వ్యాయామశాలలు మరియు వాటికి కావలసిన పరికరాలు. ఇవేవీ పెరిగే వయసులో సరిగ్గా లేక పోవటం శరీరం ఫిట్ గా ఉండకపోవటానికి కారణం.
 2. క్రీడ అనేది జాతీయ జీవన శైలిలో ముఖ్యమైన భాగము కాదు. మనకు ఎంత సేపూ పిల్లలు ఐ.ఐ.టి లో ఎలా చేరాలి, లేక డాక్టర్ ఎలా చెయ్యాలి అనే రంధి తప్ప వారి శారీరిక మానసిక వికాసం పై అవగాహన లేదు, దాని వల్ల ఎంత ఉపయోగమో అంత కన్నా తెలీదు. ట్యాలెంట్ అంటే కేవలం పరీక్షల్లో మార్కులు అన్నది మన నిఘంటువు లో ఉన్న అర్థం. ట్యాలెంట్ లో శారీరిక, మానసిక వికాసం (వాటికి కావలిసిన దారుఢ్యం) లేవు. పిల్లలకు ఆటమీద కన్నా టీవీలో వచ్చే టాం అండ్ జెర్రీ చాలా కిక్కుని ఇస్తుంది. బయటకి వెళ్లి ఆడాలంటే మన పిల్లలకు మహా బాధ. ఎందుకంటే తల్లిదండ్రులు చిన్నప్పటినుంచి వాళ్లు అడిగింది ఇచ్చారు కదా?. జీవితం అంటే శ్రమ అని నేర్పలేదు కదా?
 3. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ, నలుగురిలో పరీక్షించబడి, గుర్తించబడి, ప్రోత్సహించబడి ముందుకు వెళ్లి క్రీడను ఒక వృత్తిగా ఎంచుకునే విద్యా వ్యవస్థ, సామాజిక స్పృహ, దృక్పథం లేదు. ఉన్న సదుపాయాలను వాడుకునే జిజ్జ్ఞాస, కుతూహలం, ఉత్సాహం తల్లిదండ్రుల్లో, బాలల్లో, యువతీయువకుల్లో చాలా తక్కువ. మూస చదువులు, మూస ఆలోచనలు.ఒత్తిడిని తట్టుకునే మానసిక శక్తి చిన్న వయసునుంచే రావాలి. అది చాలా తక్కువమంది తల్లిదండ్రులు ఇస్తున్నారు పిల్లలకు. ఇంతకు ముందు తరంలో అసలు లేదు. ఇప్పుడు క్రీడల్లో ఒత్తిడి చాలా ఎక్కువ. దానికి సరిపడే మానసిక ప్రశాంతత, పరిపక్వత క్రీడాకారుల్లో ఉండాలంటే ఎన్నో ఏళ్ళు వారిని కఠోరమైన పరీక్షలకు గురిచేసి, ప్రోత్సాహం ఇచ్చి, వెన్నుదన్నుగా నిలిచే తల్లిదండ్రులు, గురువులు, సమాజం మన దగ్గర లేదు. మనం వికాసం కన్నా భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. 
 4. క్రీడాకారుల్లో, అధికారులలో అవినీతి - ఎడారిలో ఆముదం చెట్టులా, మనకున్న గుంపులోంచి ఎన్నుకున్నవాళ్లకు పూర్తి క్రీడా సామర్థ్యం, తమ వృత్తి పట్ల అంకిత  భావం ఉండవు.  దేశలాభం కన్నా స్వలాభం ముఖ్యమనుకునే వ్యాపార ధోరణి. విపరీతమైన డబ్బు కొన్ని క్రీడలకు ఉండటం, మిగతా వాటికి లేకపోవటం. సమతుల్యత లోపించటం వలన చాలా క్రీడల మీద ఉత్సాహం కూడా తగ్గిపోయింది. క్రీడ వ్యవహారాలు చూసుకునే అధికారులు అంతా రాజకీయ నిరుద్యోగులే. దీనితో అవి పూర్తిగా అవినీతి మయం. మన బీ.సి.సి.ఐ, ఐ.పీ.ఎల్, ఐ.హెచ్.ఎఫ్, ఏ.సి.ఏ కుంభకోణాలు వీటికి ఉదాహరణలు. ఇవి కాకపొతే క్రీడాకారుల మ్యాచ్ ఫిక్సింగ్. ఇది అత్యంత దారుణమైనది. ఒక ప్రపంచ కప్ క్రికెట్ పోటీలో మన సారథి ప్రత్యర్ధి విజయం కోసం డబ్బుకు కక్కుర్తి పడి ఆటను వదులుకున్నాడు అనే ఆరోపణ ఎంత ఘోరమైనది?
 5. విజయం వచ్చినప్పుడు మునగ చెట్టు మనం ఊహించనంత ఎక్కించి, ఒక్క పరాజయం రాగానే కింద పడేసి ఘోరమైన వ్యాసాలు రాసి, టీవీ చానెళ్ళలో భయంకరంగా విమర్శించి చితకబాడే సంస్కృతి. వాళ్లు కూడా మనలాగే మనుషులు, ఓటమి జీవితంలో ఒక సహజమైన భాగమే అన్న భావన లేకపోవటం, పనీ పాటలేని మీడియా చానల్స్ రంధ్రాన్వేషణ చెయ్యటం. క్రీడాకారులకు సరైన సమీక్ష చేసి, వారి లోపాలను సరిదిద్దే వ్యవస్థ, ప్రజలు, మీడియా లేవు. విపరీతమైన వ్యక్తి పూజా, ఆరాధన. ఇది కొంత అవసరమే, కానీ, వాళ్లు కూడా మనుషులే కదా?. సచిన్ చాలా గొప్ప క్రీడా కారుడే. కానీ, అతడిని దేవుడి లాగ పూజించటం వలన అతడు సరిగా ఆడనప్పుడు అతని మీద తీవ్ర విమర్శలు. అతనికి తట్టుకునే పరిపక్వత ఉంది కాబట్టి ఇన్నాళ్ళు నిలిచాడు. సానియా మిర్జా లాంటి వాడు అయితే రెండేళ్లలో క్రికెట్ వాడికి పారిపోయే వాడు.
 మన సానియా మిర్జా సంగతే చూడండి?. - ఆ అమ్మాయికి ఆట కొంత వచ్చు. కాని, ఆట మీద పట్టు, అవగాహన, అనుభవం, విజయాలు రాక ముందే మనం మునగ చెట్టు ఎక్కించి ఎక్కడో కూర్చోబెట్టాము. ఆ అమ్మాయికి మనం ఇచ్చిన గౌరవం, గుర్తింపు చాలా మటుకు ఆ అమ్మాయి సౌన్దర్యానికే తప్ప ఆటకు కాదు.  ఏ ఒక్క ముఖ్యమైన ట్రోఫి గెలవకుండా, ఎటువంటి గుర్తింపును ఇచ్చే విజయాలు లేకుండా, ఆ అమ్మాయిని మీడియాలో తెగ చూపించి, చివరికి మనం పద్మశ్రీ అవార్డ్ కూడా ఇచ్చేశాము. ఏమయ్యింది ఇప్పుడు?. 35 ర్యాంకు నుంచి 150 ర్యాంకుకి దిగజారింది. కామన్వెల్త్ క్రీడల్లో మనదేశం తరపున ఆ అమ్మాయి ఆడే సామర్థ్యం లేకుండా పోయింది. అలాగే, ఎంతో మంది కను మరుగు అయిపోయ్యారు పైన చెప్పిన ఏదో ఒక కారణం వల్ల.

క్రీడాకారులు మారాలంటే, మనం మారాలి. తల్లిదండ్రులు మారాలి, క్రీడా వ్యవస్థలో రాజకీయనాయకులకు స్థానం లేకుండా చెయ్యాలి. క్రీడాకారులను సరైన మోతాదులో విమర్శించాలి, ప్రోత్సహించాలి. అన్ని క్రీడలను గౌరవించాలి, ఆదరించాలి. క్రీడను జీవన విధానంలో ముఖ్యమైన భాగం చెయ్యాలి. చదువుల్లో క్రీడను, దానిలో ప్రతిభను తప్పనిసరి చెయ్యాలి.

జయ కృష్ణా ముకుందా మురారీ

పాండురంగని కథ మనకు తెలిసిందే. నిత్య నూతన వనితా సాంగత్య లాలసుడై, భగవంతుణ్ణి దూషిస్తూ, తల్లిదండ్రులను అగౌరవిస్తూ, ధర్మ పత్నిని తిరస్కరించి, గృహస్థు ధర్మాన్నివిస్మరించి విటుడై సాని ఇంట సమయం గడుపుతున్న పాండురంగడు పరిస్థితులు తారుమారు అయ్యి ఆ పండరిపురం పాండురంగని చెంతకు చేరుతాడు. ఆ రంగని అనుగ్రహంతో కష్టాలను అధిగమించి తల్లిదండ్రులకు మోక్షం కలిగించి, మహా భక్తుడై తాను కూడా ఆ రంగనిలో ఐక్యం అవుతాడు. ఈ కథా సన్నివేశాన్ని 1957 లో పౌరాణిక చిత్ర బ్రహ్మ కమలాకర కామేశ్వర రావు గారు ఎన్.టి.ఆర్, అంజలి, బి.సరోజ, నాగయ్యలతో చిత్రీకరించారు. చిత్రం అద్భుత విజయం సాధించి ప్రేక్షకుల మనస్సులో భక్తి భావాన్ని నింపింది. దీన్నే, ఈ మధ్య బాలకృష్ణ నటనలో రాఘవేంద్ర రావు గారు తిరిగి వెగటుగా, అసహ్యంగా  చిత్రీకరించి ఘోరంగా బోల్తా కొట్టారు. కొన్ని అందుకనే, అసలు అసలుగానే, ఒకటిగానే ఉంచితే మంచిది అన్న పాఠం సినీ నిర్మాతలు, దర్శకులు గుర్తు పెట్టుకుంటే బాగుంటుందేమో?.

పాత చిత్రంలో, పాండురంగడు ఆ శ్రీకృష్ణుని వర్ణనను తన తండ్రికి దృశ్య రూపకంగా చూపిస్తూ ఈ క్రింది పాటను మనకు అందించారు. సముద్రాల గారి రచన, టి.వి.రాజు గారి సంగీతం, ఘంటసాల వారి గళం అన్నీ కలసి అమృతంలా తయారయ్యి మనకు ఒక అద్భుతమైన భక్తి గీతం అందజేశారు. ఆ గీతం మీకోసం.  


పల్లవి
జయ కృష్ణా ముకుందా మురారీ జయ గోవింద బృందా విహారీ |జయ కృష్ణా|

చరణం 1
దేవకి పంట వసుదేవు వెంట యమునను నడిరేయి దాటితివంటా
వెలసితివంటా నందుని ఇంటా వ్రేపల్లె ఇల్లాయెనంటా  |కృష్ణా ముకుందా|

చరణం 2
నీ పలుగాకి పనులకు గోపెమ్మ కోపించి నిను రోట బంధించెనంటా
ఊపున బోయి మాకుల గూలిచి శాపాలు బాపితివంటా  |కృష్ణా ముకుందా|

చరణం 3
అమ్మా! తమ్ముడు మన్ను తినేనూ.. చూడమ్మా! అని రామన్న తెలుపగా
అన్నా! అని చెవి నులిమి యశోద ఏదన్నా! నీ నోరు చూపుమనగా
చూపితివట నీ నోటను, బాపురే! పదునాల్గు భువన భాండమ్ముల
ఆ రూపము గనిన యశోదకు తాపము నశియించి జన్మ ధన్యత గాన్చెన్  |కృష్ణా ముకుందా|

చరణం 4
కాళీయ ఫణి ఫణ జాలాన ఝణ ఝణ కేళీ ఘటించిన గోపకిశోరా
కంసాది దానవ గర్వాపహార హింసా విదూర పాప విదార  |కృష్ణా ముకుందా|

చరణం 5
కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళీం
గోప స్త్రీ పరివేష్ఠితోం విజయతే గోపాల చూడామణీ

చరణం 6
లలిత లలిత మురళీ స్వరాళీ పులకిత వనపాళీ గోపాళీ పులకిత వనపాళీ
విరళీకృత నవ రాసకేళీ వనమాలీ శిఖిపింఛమౌళీ  |కృష్ణా ముకుందా|

ముగింపు
హే! కృష్ణా! ముకుందా! మురారీ!

14, ఆగస్టు 2010, శనివారం

శ్రీలు పొంగిన జీవగడ్డయి

జయజయజయ జన్మభూమి జయజయోస్తు మాతృభూమి

నా  ఉన్నత పాఠశాల విద్యలో తెలుగు మొదటి భాషగా చదువుకున్నప్పుడు ఈ రాయప్రోలు సుబ్బారావు గారి గేయం చాలా ఆకట్టుకుంది. మా తెలుగు అధ్యాపకురాలు రెంటాల పార్వతీ దేవి గారు చాలా బాగా ఈ గేయం వివరించారు మాకు. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఈ మధ్యనే లీడర్ చిత్రంలో ఈ గేయాన్ని మనకు వినిపించారు శేఖర్ కమ్ముల గారు. భారతమాత గొప్పతనాన్ని అచ్చ తేట తెలుగులో రాయప్రోలు వారు మనకు అందించారు.  ఆధునిక నన్నయగా పేరొందిన సుబ్బారావు గారు గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించి 'ఏ దేశమేగినా ఎందుకాలిడినా' లాంటి రోమరోమాలను ఉత్తేజపరిచే దేశభక్తి గీతాలను రచించారు. అందులో ఒకటి ఈ శ్రీలు పొంగిన జీవగడ్డయి. అరవై మూడవ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా నా తెలుగు సోదరసోదరీమణుల కోసం.

శ్రీలు పొంగిన జీవగడ్డయి
పాలు పారిన భాగ్యసీమయి
వ్రాలినది ఈ భరతఖండము
భక్తిపాడర తమ్ముడా!

వేదశాఖలు వెలసెనిచ్చట
ఆది కావ్యంబలరె నిచ్చట
బాదరాయణ పరమఋషులకు
పాదు సుమ్మిది చెల్లెలా!

విపిన బంధుర వృక్షవాటిక
ఉపనిషన్మధువొలికెనిచ్చట
విపుల తత్వము విస్తరించగ
విమల తలమిది తమ్ముడా!

పాండవేయుల పదనుకత్తుల
మండి మెరసిన మహితరణకథ
పండగల చిక్కని తెలుంగుల
కలిపి పాడవె చెల్లెలా!

దేశగర్వము దీప్తి చెందగ
దేశచరితము తేజరిల్లగ
దేశమరసిన ధీరపురుషుల
తెలిసి పాడర తమ్ముడా!

లోకమంతకు కాక పెట్టిన
కాకతీయుల కదనపాండితి
చీకిపోవని చేవపదముల
చేర్చి పాడవె చెల్లెలా!

తుంగభద్రా భంగములతో
పొంగి నింగిని బొడిచి త్రిళ్ళీ
భంగపడని తెలుంగునాథుల
పాటపాడర తమ్ముడా!

మేలి కిన్నెర మేళవించి
రాళ్లు కరగగ రాగమెత్తి
పాలతీయని బాలభారత
పథము పాడవె చెల్లెలా!

13, ఆగస్టు 2010, శుక్రవారం

రాజకీయ ముఖ చిత్రంఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మారుతోంది, స్పష్టమవుతోంది. మన రాష్ట్ర రాజకీయ చతుర్ముఖ పారాయణం ఎలా ఉందంటే:
 1. కాంగ్రెస్: అంతర్గతంగా, జగన్మోహన్ రెడ్డి వర్గాన్ని అణచివేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం దాదాపు నిర్ణయించినట్టే.  వారిని అన్ని విధాల పరీక్షించి, ముప్పతిప్పలు పెట్టి, అవినీతి, అక్రమాల కేసులు త్రవ్వి వాటి ద్వారా వారిని చెక్ లో పెట్టాలన్నది వారి వ్యూహం. ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జగన్ తో పది-పదిహేను కన్నా ఎమ్మెల్యేలు వెళితే గొప్ప అని రాజకీయ వర్గాల ఉవాచ. ఒక వేళ జగన్ ఓర్పు నశించి పార్టీ నుంచి బయటకు వెళ్లినా రోశయ్య ప్రభుత్వానికి ముప్పు లేకుండా ప్రజారాజ్యం పార్టీని తమవైపు తిప్పుకోవటంలో సఫలమయ్యారు కాంగ్రెస్ అధినేతలు.  ఇక రెండోవైపు,  ప్రతిపక్షమైన తెలుగుదేశాన్ని బలహీన పరచటానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్ని వైపులనుంచి వ్యూహం చేస్తున్నట్టు అనిపిస్తున్నది. తెలంగాణా రావటం దాదాపు ఖాయం కాబట్టి ఆ విషయంలో పైపైన తప్ప పెద్దగా  తాము మాట్లాడటం అనవసరం అనే ధోరణిలో ఉన్నారు కాంగ్రెస్ వాళ్లు. ఇక రోశయ్యగారి పాలన ఉప్పు వెయ్యని ముద్ద పప్పులా చప్పగా ఉంది. ప్రజల వ్యతిరేకం ఇప్పుడు లేకపోయినా నాలుగేళ్లలో గట్టి నాయకత్వం లేకపొతే ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవటం కష్టమే. 
 2. తెలుగుదేశం: దిక్కుతోచని, అయోమయం పరిస్థితిలో ఈ పార్టీ ఉంది. ఒకపక్క చంద్రబాబుగారు తెలంగాణా మీద ఏమి మాట్లాడలేక, పార్టీలో చీలిక రాకుండా త్రాసును అటు ఇటు  బ్యాలెన్స్ చెయ్యటంలో సతమతమవుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ + ప్రజారాజ్యం లోపాయకారి ఒప్పందంతో దెబ్బతిన్న తర్వాత ఆ పార్టీ ఆ ఓటమి నుంచి ఇంకా బయటకు రానట్టే. బాబ్లీ గోల, బాబు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. పార్టీలో ఆత్మ విశ్వాసం దెబ్బ తిని మళ్లీ వలస మొదలవ్వకుండా బాబు ఎన్నాళ్లు ఆపగలరో సమయమే చెప్పాలి.
 3. టీ.ఆర్.ఎస్: తెలంగాణ ఉపఎన్నికల్లో ఘోరపరాజయాన్ని చూసిన తెలుగుదేశం పార్టీని ఇంకా దెబ్బతీయటానికి టీ.ఆర్.ఎస్ మాటల తూటాలు పేల్చి టీ.డీ.పీ నాయకుల్లో నిరాశ నిస్పృహలు సృష్టించి వారిని ఆ పార్టీ లోనుంచి బయటకు లాగాలని తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఉపఎన్నికల విజయాలతో తన వ్యూహరచన ఫలించినట్టే అని కే.సి.ఆర్ భావన. టీ.డీ.పీ, కాంగ్రెస్ నాయకుల మీద పదునైన మాటల దాడి ప్రయత్నంలో ఉన్నారు ఆయన. మొత్తానికి ఉద్వేగ పూరిత పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ దివాళాకోరుతనం టీ.ఆర్.ఎస్ పునరుత్థానానికి కారణమయ్యాయి.
 4. ప్రజారాజ్యం: టీ.డీ.పీ వోటుబ్యాంకును చీల్చి తన ఉనికిని నిలుపుకోవాలని తహ తహలాడుతున్న ప్రజారాజ్యం పార్టీ దీని కోసం కాంగ్రెస్ జట్టు కట్టి వారి సాయంతో ఈ కార్యంలో ముందుకు సాగాలని ఆశ.   విమర్శలే కాదు ప్రభుత్వం చేసే మంచి పనులను మెచ్చుకొని ప్రతిపక్షమనే పదానికి కొత్త అర్థం ఇస్తున్నాము అని చిరంజీవి గారు ఎంత చెప్పినా, ఆయనకు రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రాంతపు ముఖ్యమంత్రి కుర్చీపై కన్ను ఉంది, దాని కోసం కాంగ్రెస్ నాయకత్వంతో అపవిత్రమైన లోపాయకారి ఒప్పందం చేసుకున్నారు అన్నది గట్టి ఊహాగానం. అది నిజం అయ్యే అవకాశాలు ఎక్కువే.

మొత్తం మీద:

కాంగ్రెస్: ఎక్కడి గొంగళి అక్కడే, వర్గాలు, కుమ్ములాటలు;
టీ.డీ.పీ: అయోమయం, నిరాశ;
ప్రజారాజ్యం: కలల ఊహల్లో ఆశావహం;
టీ.ఆర్.ఎస్: సమరోత్సాహం, ప్రత్యేకరాష్ట్ర దిశలో స్పష్టమైన అడుగు.

3, ఆగస్టు 2010, మంగళవారం

అంబరీషుడు - ద్వాదశీవ్రతం - దుర్వాసుడు

అంబరీషుడు
అంబరీషుడు మహా విష్ణు భక్తుడు. రాజర్షిగా పేరు పొందాడు. ఈతడు అభాగుని కుమారుడు. సద్గుణశ్రేష్ఠుడైన ఈ అంబరీషుడు నిరంతర విష్ణు సేవా తత్పరుడై, అశ్రద్ధ, అలసత్వము లేకుండా ఈ భూమిని పాలించాడు. ఈయన సుగుణాల గురించి, భక్తి మహిమ గురించి శ్రీమద్భాగవతంలో నవమ స్కంధంలో వ్యాస భగవానులు వివరించారు. దాన్ని తేట తేనె తెలుగులో రచించారు బమ్మెర పోతరాజు గారు. ఆ పోతన విరచిత శ్రీమదాంధ్ర భాగవతంలోని అంబరీషోపాఖ్యానం నుంచి ఈ వ్యాసం రాస్తున్నాను.

అంబరీషుని భక్తి

అంబరీషుని భక్తి లక్షణాలను పోతన కమ్మని తెలుగులో ఇలా రచన చేశారు. 

చిత్తంబు మధురిపు శ్రీపాదములయంద పలుకులు హరిగుణ పఠనమంద
కరములు విష్ణుమందిర మార్జనములంద శ్రవములు హరికథాశ్రవణమంద
చూపులు గోవిందరూపవీక్షణమంద శిరము కేశవనమస్కృతులయంద
పదములీశ్వరగేహపరిసర్పణములంద కామంబు చక్రికైంకర్యమంద

సంగమచ్యుతజనగుణసంగమంద
ఘ్రాణమసురారి భక్తాంఘ్రికమలమంద
రసన తులసీదళములంద రతులు పుణ్య
సంగతులయంద యా రాజచంద్రమునకు

ఆయన మనసు ఎప్పుడు ఆ శ్రీహరి పాదపద్మములపైనే, వాక్కు ఆ పరమాత్మ నామ సంకీర్తనలో, చేతులు విష్ణు మందిరాన్ని శుభ్రం చేయటంలో, చెవులు ఆ శ్రీహరి కథా శ్రవణంలోనే, చూపులు ఆ గోవిందుని మోహన రూపాన్ని చూడటంపైనే, శిరము కేశవునికి మొక్కటంపైనే, కోరికలు శ్రీహరి సేవకొరకే లగ్నమై ఉంటాయిట. ఆయన చెలిమి విష్ణు భక్తులతోనే, విష్ణు గుణగణాల వర్ణన, చర్చ ఉండే సత్సాంగత్యంలోనే. ఆయన నాలుక తులసీ దళం యొక్క రుచిని ఆస్వాదించటం లోనే, ముక్కులు ఆ మురారి పాదపద్మాల నుండి వెలువడే సుగంధమునందే, ప్రీతి శ్రీహరికి చెందిన పుణ్య విషయముల యందె లగ్నమై ఉన్నాయిట.  అంటే అన్ని ఇంద్రియములు వాటి వాటికి సంబంధించిన రుచులు, పనులు, ఆలోచనలు, మనస్సు పూర్తిగా ఆ శ్రీహరి మీదనే. ఎంత భాగ్యమో అలాంటి జన్మ పొందటానికి.

అంబరీషుని లక్షణాలు:

హరియని సంభావించును
హరియని దర్శించు నంటు నాఘ్రాణించున్
హరియని రుచిగానదలచును
హరిహరి ఘను నంబరీషు నలవియె పొగడెన్

అతని కీహమానె హరులందు గరులందు
ధనములందు  గేళి వనములందు
బుత్రులందు బందుమిత్రులయందు
బురమునందు నంతిపురమునందు

ఆయన 'హరి' అనుకొనుచు ఆలోచిస్తూ, 'హరి' అనుచు చూస్తూ, 'హరి' అనుచు వాసన చూస్తూ, 'హరి' అనుచు చవి చూస్తూ ఉన్నాడుట. అటువంటి ఘనుడైన అంబరీషుని పొగడ వశమా!. ఆయన జీవనంలో ప్రతి అడుగు 'హరి'మయమే అన్నమాట. ఆ మహాత్మునికి ఏనుగులు, గుర్రాలయందు (రాచరికపు హంగులు), ధనసంపదలయందు, ఉద్యానవనాలలో విహారాల యందు, పుత్రులు, బంధువులయందు, రాజధాని, అంతఃపురమందు వాంఛలు తొలగి పోయినవి.

ద్వాదశీ వ్రతము:

ఒక సంవత్సరము ఆ అంబరీషుడు భార్యతో కూడి ద్వాదశీ వ్రతము చేయ దలచాడు. వ్రతము చేసి, వ్రత సమాప్తిలో కార్తీక మాసంలో మూడు రాత్రులు ఉపవాసముండి, కాళింది జలాలలో స్నానం చేసి, మధువనములో మహాభిషేకము చేసి, అందమైన గంధ పుష్పాక్షతలు సమర్పించి, పూజకు పనికి వచ్చే అత్యుత్తమమైన పుష్పాలతో పూజ చేశాడు.  ఈ వ్రత సమాప్తి సందర్భంగా, వేదవేత్తలైన బ్రాహ్మణులకు మంచి రుచి కరమైన భోజనము పెట్టి, అరువది కోట్ల గోవులను దానమిచ్చాడు.  ఎటువంటి గోవులు?. - ఏరులుగా ప్రవహించే అన్ని పాలిచ్చేవి, లేత వయస్సులో ఉన్నవి, సాధుస్వభావము కలవి, కొమ్ములకు, కాలి గిట్టలకు బంగారు, వెండి తొడుగులు కలవి, తమ దూడలను ప్రేమతో నాకుచున్నవి.

దుర్వాసుని ఆగమనం:

దుర్వాస మహాముని

అంబరీషుడు దానాల తర్వాత, తాను పారణ (ఉపవాస విరమణ) చేయబోతుండగా,  తేజోమయుడు, వేదాలను విశ్లేషించ గలిగినవాడు, ఉత్తమ తపశ్శక్తి సంపన్నుడు, ప్రకాశ వంతుడైన దుర్వాస (చాలా మంది దూర్వాసుడు అని పలుకుతారు. అది తప్పు) ముని ఆ అంబరీషుని ఇంటికి వచ్చాడు. అంబరీషుడు ఆ మునికి ఆసనమిచ్చి, పాదములు కడిగి, పూజించి, యోగ క్షేమములు అడిగి, భోజనము చేయుమని నమస్కరించాడు. ఆ ముని సంతోషించి, భోజనానికి అంగీకరించి, స్నానానికి కాళింది జలాలవద్దకు వెళ్ళాడు. అక్కడ ధ్యానం చేస్తూ, మునిగి లేచి రాక ఆలస్యం చేశాడు. ద్వాదశి ఘడియలు దాటిపోతున్నందున, అంబరీషుడు వ్రతభంగామౌతుందేమో అని భయపడి పండితులతో 'ద్వాదశి దాటిపో లోపల పారణ చెయ్యాలి. అతిథికి అపరాథము జరుగకుండా, వ్రతభంగము కాకుండా, ఉపాయమును ఆలోచించి చెప్పండి' అంటాడు.


అప్పుడు, పండితులు - "రాజా! శుద్ధ జలము కొంచెం సేవిస్తే ఉపవాస విరమణ చేసినట్లే. భోజనం చెయ్యకుండా అతిథి గురించి వేచి ఉన్నట్లు అవుతుంది. కాబట్టి నీరు తీసుకోవచ్చు. ఇది ధర్మ సమ్మతమే" అంటారు. అంబరీషుడు వారు చెప్పినట్లే నీరు తీసుకుని, దుర్వాసుని కొరకు ఎదురు చూశాడు.

దుర్వాసుడు వచ్చి అంబరీషుడిని -  'ధర్మభంగం చేసి దుష్కర్ముడవైతివి' అని దూషించాడు. 'నా కోపాగ్ని ప్రతాపం చూపిస్తాను. నిన్ను రక్షించే వాడెవ్వడు' అని రెట్టించాడు. పట పట పళ్లు కొరుకుతూ, కళ్లలో నిప్పులు కురిపిస్తూ, తన జటాలలోంచి ఒక శాఖను పెరికి రాక్షసిగా అంబరీషుడిపై ప్రయోగించాడు. కాలానలంలా, శూలాయుధ హస్తయై ఉన్న రాక్షసి ఆ అంబరీషుని మీదకు దుమికింది.

సుదర్శన ప్రయోగం

అప్పుడు ఆ శ్రీహరి , ఆ వెర్రి తాపసి చేసిన అహంకారపు దుశ్చర్యకు కోపగించి ఆ భక్త అంబరీషుని రక్షించటానికి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్రం ఆ రాక్షసాన్ని దహించి, దాన్ని సృష్టించిన దుర్వాసుని వెంబడించింది.ఎలా?. పోతన గారు ఇలా వర్ణించారు.

శ్రీహరి సుదర్శనాన్ని ప్రయోగించుట

భువి దూరన్ భువి దూరు నబ్ధిజొరనబ్ధింజొచ్చు నుద్వేగియై
దివిబ్రాకన్ దివి బ్రాకు దిక్కులబో దిగ్వీథులం బోవు, జి
క్కివెసంగ్రుంగిన గ్రుంగు, నిల్వ నిలుచున్, గేడింప గేడించు, నొ
క్కవడిన్ దాపసువెంటనంటి హరిచక్రంబన్యదుర్వక్రమై

ఆ సుదర్శనము దుర్వాసుడు ఎక్కడికి పొతే అక్కడికి పోతూ, అతడు భూమిలో దూరితే చక్రమతని వెంబడించి భూమిలో దూరింది. అతడు సముద్రంలో దూరితే, అది కూడా సముద్రంలో చొచ్చింది. భయంతో అతడు ఆకాశానికి పాకితే అక్కడికి ఎగ బాకింది. అతడు ఏ దిక్కులో పోయి తలదాల్చుకున్నా ఆ చక్రం అక్కడికి వెంబడించింది. అతడు ఆగిపోతే చక్రం ఆగిపోయింది. అతడు నెమ్మదిగా నడిస్తే, చక్రం కూడా తన వేగాన్ని తగ్గించి వెంబడించింది. అలా వెంబడించి ఆ ఋషికి దిక్కు తోచకుండా చేసింది.

అప్పుడు దుర్వాసుడు బ్రహ్మదేవున్ని రక్షించమని ప్రార్థిస్తాడు. ఆ బ్రహ్మ ఆ శ్రీహరి చక్రాన్ని ఆపటానికి తాను ఆశక్తుడనని చెప్తాడు. దుర్వాసుడు శ్రీహరి శరణుకై  వైకుంఠానికి వెళ్తాడు. అక్కడ విష్ణువు లక్ష్మీ దేవి పక్కన ఉండగా మధుర మనోహర భాషణలతో క్రీడించు చుండగా, ఆ దూర్వాసుడు ప్రార్థిస్తూ - "ఓ వరదా!, భక్త రక్షకా! ఈ చక్రాగ్ని జ్వాలలనుంది రక్షింపవా!" అని వాపోతాడు.

పోతన గారు ఆ దుర్వాసుడు నారాయణుని ప్రార్థించిన విధానాన్ని ఇలా వర్ణించారు.

నీ మహిమార్ణవంబుతుది నిక్కముగా నెరుగంగలేక నీ
ప్రేమకు వచ్చు దాసునకు గ్రించుదనంబున నెగ్గుచేసితిన్
నామరపున్ సహింపుమట నారకుడైన మనంబులో భవ
న్నామము చింతచేసిన ననంతసుఖస్థితి జెందకుండునే

"ఓ ప్రభూ! నీ అనంతమైన మహిమాసాగర తీరము తెలుసుకోలేక, నీకు చాలా ప్రేమ పాత్రుడైన నీ దాసునకు, నా నీచ గుణంతో కీడు చేయ తలచాను. నా పొరపాటును మన్నింపుము దేవా! నరకానికి పోవలసిన వాడు కూడా మనస్సులో నీ దివ్యనామము స్మరించగానే అనంతమైన సుఖములు పొందుతాడు కదా!"

అప్పుడు విష్ణువు ఇలా హితవు పలుకుతాడు. పోతన అద్భుతంగా రాసారు ఇక్కడ పద్యాలు.

తనువు మనువు విడిచి తనయుల చుట్టాల
నాలివిడిచి సంపదాలి విడిచి
నన్నెకాని యన్యమెన్నడు నెరుగని
వారి విడువనెత్తివారినైన

సాధులహృదయము నాయది
సాధులహృదయంబు నేను జగముల నెల్లన్
సాధుల నేనే ఎరుగుదు
సాధులెరుంగుదురు నాదుచరితము విప్రా!

నా తేజము సాధులలో
నాతతమైయుందు వారి నలచుజనులకున్
హేతిక్రియ భీతినిచ్చును
చేతోమోదంబు చెరుచు సిద్ధము సుమ్మీ

"ఓ దుర్వాసా! నన్ను స్తుతించువాడు నా భక్తుడగును.  నా భక్తులకు నేనే పరమగతిని. నా భక్తుడు ఎక్కడికి పోయినా, గోవు వెంట పోవు కోడె ఎద్దులా,  నేనతిని వెంటనే పోయెదను. దేహధ్యాస విడిచి, మనుగడను విడిచి, భార్యాపుత్రులను, బంధువర్గమును విడిచి, ధన సంపదలను విడిచి, నన్నే తప్ప వేరేదేది ఎరుగని వారిని, వారెట్టి వారైన సరే, నేను రక్షింప కుండా విడిచి పెట్టాను. సాధువులు తమ హృదయములను నాకు అర్పింతురు. వారి హృదయాలలో ఉండేది నేనే. వారిని నేనే ఎరుగుదును. నా చరిత్ర వారే ఎరుగుదురు. వారిలో నా తేజము విరివిగా ఉందును. వారిని పీడించే వారికి నా తేజం అగ్నిజ్వాలలా భయం కలిగిస్తుంది. అలా పీడించే వారి మనస్సులోని సంతోషాన్ని ఆ తేజస్సు చెడగొడుతుంది సుమా. కావున పోయి ఆ అంబరీషుడినే శరణు వేడు" - అంటాడు.

దుర్వాసుని శరణాగతి, అంబరీషుని దయ:

అప్పుడు, శక్తిహీనుడైన, భయముతో పరిగెత్తి అలసి  సొలసి ఉన్న దుర్వాసుడు వేగంగా పోయి కరుణాస్వరూపుడు, దోషాలు లేని వాడు, ఉదార స్వభావము కలవాడు, బుద్ధిమంతుడు, మృదుమధుర భాషి అయిన అంబరీషుడిని శరణు వేడాడు. అప్పుడు ఆ చక్రవర్తి, దయాళువై, కరుణతో ఆ సుదర్శనాన్ని ఇలా ప్రార్థించాడు.

సుదర్శన చక్రము


నీవె పావకుడవు నీవ సూర్యుండవు నీవ చంద్రుండవు నీవ జలము
నీవ నేలయునింగి నీవ సమీరంబు నీవ భూతేంద్రియనికరములును
నీవ బ్రహ్మంబును నీవ సత్యంబును నీవ యజ్ఞంబును నీవ ఫలము
నీవ లోకేశులు నీవ సర్వాత్మవు నీవ కాలంబును నీవ జగము

నీవ బహుయజ్ఞభోజివి నీవ నిత్య
మూల తేజంబు నీకు నే మ్రొక్కువాడ
నీరజాక్షుండు చాలమన్నించు నట్టి
శస్త్రముఖ్యమ! కావవే చాలు మునిని

విహితధర్మమందు విహరింతునేనియు
నిష్టమైన ద్రవ్యమిత్తునేని
ధరణిసురుడు మాకు దైవతంబగునేని
విప్రునకు శుభంబు వెలయుగాక

"శ్రీ మహావిష్ణువు మిక్కిలి మన్నించునట్టి ఓ అస్త్ర రాజమా! నీకు నేను మొక్కెదను . నీవే అగ్నివి, సూర్యుడవు, చంద్రుడవు, నీరు, భూమివి. నీవే ఆకాశము, గాలివి. నీవే భూత, ఇంద్రియ సమూహానివి. నీవే బ్రహ్మము, సత్యము, యజ్ఞము, యజ్ఞఫలము. నీవే లోకాధిపతివి, సర్వాత్మవు, నీవే కాలము, జగత్తువి కూడా. నీవే యజ్ఞఫలాన్ని అందుకునేది, నీవే నిత్యమైన మూల తేజము. నీకు నా నమస్కారములు. ఇక ఈ మునిని కాపాడుము, విడువుము. నేను నా విద్యుక్త ధర్మములను సక్రమంగా నిర్వహించే వాడినైతే, యోగ్యులకు కోరిన, ఇష్టమైన దానాలు ఇచ్చేవాడినైతే, ఈ బ్రాహ్మణునికి శుభము కలుగుగాక!"

ఆ ప్రార్థనను విని సుదర్శన చక్రము శాంతించి, తిరిగి తన యథా స్థానమునకు వెళ్ళెను.

అప్పుడు దుర్వాసుడు శాంతి చెంది, మెల్లని మేలిమి మాటలతో రాజుని దీవించి ఇలా అన్నాడు: "ఓ రాజా! నా తప్పు మన్నించి, నాకు చాలా మేలు చేసితివి. నీ వంటి భక్తులని కాచుటకు శ్రీహరి ఈ విధంగా వచ్చుట ఎంతో ఆశ్చర్యకరం. నేను ధన్యుడనైతిని. నీకు శుభము కలుగుగాక. అలవోకగానైన ఎవ్వని నామము ఒక్కమారు చెవులకు వినపడితే సకల పాపాలు పోతాయో, అత్యంత శుభకరుడు, మంగళకరుని,హరిని, విష్ణువుని, దేవదేవుని - నీవంటి స్వచ్చమైన భక్తులు కొలిచెదరో, వారికి ఎటువంటి అడ్డంకులు కలుగబోవు".

అప్పుడు, ఆ అంబరీషుడు ఆ ముని పాదములకు మొక్కి,  ఆయనకు ప్రీతికరమైన భోజనము పెట్టి తృప్తి పరచెను. దుర్వాసుడు ఆతని ఆతిథ్యానికి మెచ్చి, దీవించి, కీర్తించి బ్రహ్మలోకమునకు తిరిగి వెళ్ళాడు. అంతట, అంబరీషుని ద్వాదశీ వ్రతం సంపూర్ణమైనది. హరిని కొలిచేవారికి వైకుంఠము తప్ప మిగిలిన పదములన్నీ నరకతుల్యములు కావున అంబరీషుడు రాజ్యభారాన్ని పుత్రులకు అప్పగించి, కామ విజయుడై, హరి భక్తుడై అడవులకేగాడు.

'అంబరీషుని చరిత్ర వినిన వారికి, చదివిన వారికి ధైర్యం, సంపదలు కలిగి పుణ్యులు అగుదురు గాక' అని శుకమహర్షి పరీక్షిత్తు మహారాజుకు తెలిపాడు.