RightClickBlocker

18, ఆగస్టు 2010, బుధవారం

సామాజిక స్పృహ - మన ఆరోగ్యం

ఇదేమైన మీ ఆట స్థలమా?
రోడ్డు ఏమైనా మీ బాత్రూమా?
మీ ఇల్లు ఇలా ఉంటే మీరు బతుకుతారా?
మనమేమైన ఆటవికులమా?


మన దైనందిన చర్యలో మనం చేసే కొన్ని తప్పులు మన సమాజాన్ని ఎలా పీడిస్తున్నాయో రాస్తున్నాను:
  1. బహిరంగ ప్రదేశాల్లో (రోడ్లు, ఫుట్ పాత్లు వగైరా వగైరా)  ఉమ్మివేయటం, మూత్ర విసర్జన చెయ్యటం - ఉమ్మి ద్వారా ప్రాణాంతకమైన వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యమైనవి క్షయ (టీ.బీ), కాలేయ వ్యాధి (హెపటైటిస్). ఇవి భారత దేశ జనాన్ని పట్టి ధనికుడు, పేడ అని లేకుండా పీడిస్తూనే ఉన్నాయి.  మూత్రం ద్వారా కూడా హెపటైటిస్ లాంటి ఎన్నో వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. అంతే కాదు, ఈ రెండూ, అతి అపరిశుభ్రతను సూచిస్తాయి. మూత్రం మీద నివసించి, పెరిగే దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికున్ గన్యా వంటి ఎన్నో విష జ్వరాలు రావచ్చు. ఉమ్మటం, మూత్ర విసర్జన -  ఏ షాపులో ఉన్న బాత్రూం లోనైనా  పూర్తి చేసుకోవచ్చు కదా?. లేకపొతే బయలు దేరేటప్పుడు పూర్తిచేసుకోవచ్చు కదా?. ఉమ్మటానికి రుమాలు వాడుకోవచ్చు కదా?. రుమాలులో  ఉమ్మటం మీకు అపరిశుభ్రం,అసహ్యమైతే, మరి రోడ్డు మీద ఉమ్మితే అది వేరే వాళ్లకు ఎంత అసహ్యం, నీచం కావాలి?.
  2. మన చెత్తను చెత్తకుండీలో కాకుండా బయట రోడ్డు మీద వెయ్యటం - చెత్తలో నానా రకాల సూక్ష్మ క్రిములు ఉంటాయి. వీటివల్ల అన్ని రకాల జబ్బులు (విష జ్వరాలు, రక్త, చర్మ సంబంధమైన వ్యాధులు, డయేరియ, కలరా లాంటివి ఎన్నో) రావచ్చు. చెత్త పారెయ్యటానికి చెత్త కుండీలు, ఇంటి ముందుకు వచ్చి చెత్త తీసుకువెళ్ళే ప్రైవేట్ సర్వీసులు చాలా వచ్చాయి ఇప్పుడు. అవి ఎందుకు వాడరు?. మీ శుభ్రత,ఆరోగ్యం కోసం నెలకు ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టలేరా?.
  3.  ఇంటిని, పరిసరాలను పట్టించుకోక పోవటం - ఇంట్లో పాత డబ్బాలు, అవసరానికి మించి నీళ్ళు నిల్వ చేసుకోవటం, మొక్కలున్న ప్రదేశాలను శుభ్రం చెయ్యక పోవటం - వీటి వల్ల మలేరియా, డెంగ్యూ, చికన్ గన్యా వంటి జ్వరాలు ఎన్నో. ఇంట్లో ఎక్కువగా దుమ్ము, ధూళి పెరుకోవటం వలన ఎలర్జీలు, జలుబులు, దగ్గులు, ఆయాసాలు. అవి ముదిరితే ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్లు. మీ ఇంటి లోపల, బయట శుభ్రంగా ఉంచుతున్నారా?. రెండు మూడు నెలలకొకసారి ఇంట్లో అవసరం లేని వస్తువులు, చెత్త పారేస్తున్నారా?.
  4. పరిమితులకు మించి శబ్ద కాలుష్యం - మన ఇంట్లో జరిగే పెళ్లిళ్లు వగైరా శుభకార్యాలకు, పూజలకు, ఉత్సవాలకు (వినాయక చవితి, అయ్యప్ప పడి పూజ, క్రిస్మస్ లాంటివి) హోరెత్తించే లౌడ్ స్పీకర్లు పెట్టటం వలన కర్ణభేరి, మెదడులోని కణాలు, కళ్ళలోని కణాలు, నాళాలు దెబ్బతినే అవకాశం ఉంది. వీటన్నిటికి ప్రభుత్వ అనుమతి, శబ్ద స్థాయికి పరిమితి ఉన్నాయి. అవి పాటిస్తున్నారా?. మీ ఆనందం కోసం మీ పక్కవాళ్ళకు అసౌకర్యం కలిగిస్తారా?.
  5. మన చుట్టూ ఉన్న నీటి వనరులను పూర్తిగా డంప్ యార్డ్స్, మురుగు నీటి నిల్వలుగా మార్చటం, లేకపొతే ఆ స్థలాలను ఆక్రమించటం. ఒకప్పుడు హైదరాబాదులో యాభైకి పైగా మంచినీటి చెరువులు ఉండేవిట. అవి చాలా మటుకు ఆక్రమించి లేక డ్రైనేజీ గా మార్చి ఈ నగరం మంచినీటి కొరకు కృష్ణా,గోదావరి దాక వెళ్ళాల్సిన పరిస్థితి. అంతేకాదు, భూగర్భ జల నిల్వలు అట్టడుగు స్థాయికి పడిపోయింది. హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ చెరువు, షామీర్ పేట చెరువు, మియాపూర్ చెరువులు, గండిపేట చెరువు - ఇవన్ని ఈ సమస్య బారిన పాడినవే. 
  6. వాహనాలు నడిపే వాళ్లు - మీ లాగే ప్రతి ఒక్కరు గమ్యానికి ముందు చేరాల్సిన వాళ్లే. మరి వాళ్లకు మీరు ఆ అవకాశం ఇస్తున్నారా?. మీ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తున్నారా?. జామ్ అయినప్పుడు ముందుకు దూరకుండా, దాన్ని పరిష్కరించటానికి సహకరిస్తున్నారా?. రోడ్డు దాటే వారికోసం ఆగుతున్నారా?. అటువైపునుంచి వచ్చే ట్రాఫిక్ కోసం ఉన్న రోడ్డును మీకోసం వాడకుండా వేచి ఉంటున్నారా?. 
 ప్రతిదానికి ప్రభుత్వంపై బాధ్యత మోపటం మనకు బాగా అలవాటు అయ్యింది. పైన చెప్పిన అయిదు పాయింట్లలో పౌరుల బాధ్యతే ఎక్కువ ఉంది. డెబ్భై లక్షల జనాభాకు ప్రభుత్వం ఎంత చెయ్యగలదు?. పౌరులుగా మీ హక్కులతో పాటు బాధ్యతను కూడా నిర్వర్తించాలి కదా?. పైన చెప్పిన విషయాలలో ఒక్కటి కొన్నాళ్ల పాటు పాటించి మీ పక్కన వాళ్ల చేత పాటింప చేయించండి. మన నగరం తప్పకుండా బాగుపడుతుంది. ఇది మన నగరం. దీన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచాల్సిన బాధ్యత అందరిదీ.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి