24, డిసెంబర్ 2010, శుక్రవారం

శ్రీమచ్ఛంకరాచార్యకృత శ్రీకృష్ణాష్టకం - తాత్పర్యము

శ్రీ కృష్ణుడు - ఈ జగదేక మోహన సుందర మూర్తిని వర్ణించటానికి ఆ పరమశివుడే దిగి వస్తే?  అప్పుడు పదాలు, భక్తి, వర్ణన అన్ని తమంతట తామే వచ్చి నిలబడతాయి. అందుకనే ఆది శంకరులు రచించినది ఏదైనా ఇన్ని వందల ఏళ్ళు నిలిచింది. సచ్చిదానంద అనుభూతిలో ఆ అపర శివుడు రచించిన ఈ శ్రీ కృష్ణాష్టకం ఆ నంద నందనుని అశేష గుణ గణములను, అద్వితీయమైన మహిమలను భక్తి రస మాలగా అందిస్తుంది. భక్తి నిండితే ఛందము, ప్రాస అవే పరుగిడుతూ ముత్యాల పేరలో చేరుతాయి అనటానికి ఈ స్తోత్రము ఒక గొప్ప నిదర్శనము.


యశోదా కృష్ణ

ఒక్కసారి ఇందులో పదాలు గమనించండి -

మండనం, ఖండనం, రంజనం, నందనం, మస్తకం, హస్తకం, సాగరం, నాగరం, మోచనం, లోచనం, శోచనం, భూధరం, సుందరం, దారణం, వారణం, కుండలం, మండలం, దుర్లభం, వల్లభం, దాయకం, సాయకం, గాయకం, నాయకం, పంకజం, నిజం, మాలకం, బాలకాం, శోషణం, పోషణం, మానసం, లాలసం, తారకం, దారకం, కిశోరకం, చోరకం, భంగినం, సంగినం, నవం, సంభవం, కందనం, నందనం, లంపటం, లసత్పటం, పాయినం, శాయినం, రంజితం, శోభితం, కారిణం, విహారిణం 

- ఇలా ఆ నీల మేఘ శ్యాముని గుణ వర్ణన అందమైన జడ కుప్పెలలా, చిరు గజ్జెలలోని మువ్వలలా, హారంలో పొదిగిన రత్నాలలా, మల్లె మాలలోని పూలలా, పసి పిల్లల సమూహంలా శుద్ధంగా, చిదానందంగా పొదగబడ్డాయి ఈ స్తోత్రంలో. అది ఆదిశంకరుల శంకరత్వము. అందుకే ఆయన భగవత్పాదులు, జగద్గురువులు, లోక పూజ్యులు అయ్యారు.

కృష్ణాష్టకం, తాత్పర్యము, శ్రవణం.

భజే వ్రజైకమండనం సమస్తపాపఖండనం
స్వభక్తచిత్తరంజనం సదైవ నందనందనం
సుపిచ్ఛగుచ్ఛమస్తకం సునాదవేణుహస్తకం
అనంగరంగసాగరం నమామి కృష్ణనాగరం

మనోజగర్వమోచనం విశాలలోలలోచనం
విధూతగోపశోచనం నమామి పద్మలోచనం
కరారవిందభూధరం స్మితావలోకసుందరం
మహేంద్రమానదారణం నమామి కృష్ణవారణం

కదంబసూనకుండలం సుచారుగండమండలం
వ్రజాంగనైకవల్లభం నమామి కృష్ణదుర్లభం
యశోదయా సమోదయా సగోపయా సనందయా
యుతం సుఖైకదాయకం నమామి గోపనాయకం

సదైవ పాదపంకజం మదీయ మానసే నిజం
దధానముక్తమాలకం నమామి నందబాలకం
సమస్తదోషశోషణం సమస్తలోకపోషణం
సమస్తగోపమానసం నమామి నందలాలసం

భువో భరావతారకం భవాబ్ధికర్ణధారకం
యశోమతీకిశోరకం నమామి చిత్తచోరకం
దృగంతకాంతభంగినం సదా సదాలసంగినం
దినే దినే నవం నవం నమామి నందసంభవం

గుణాకరం సుఖాకరం కృపాకరం కృపాపరం
సురద్విషన్నికందనం నమామి గోపనందనం
నవీనగోపనాగరం నవీనకేళిలంపటం
నమామి మేఘసుందరం తడిత్ప్రభాలసత్పటం

సమస్తగోపనందనం హృదంబుజైకమోదనం
నమామి కుంజమధ్యగం ప్రసన్నభానుశోభనం
నికామకామదాయకం దృగంతచారుసాయకం
రసాలవేణుగాయకం నమామి కుంజనాయకం

విదగ్ధగోపికామనోమనోజ్ఞతల్పశాయినం
నమామి కుంజకాననే ప్రవ్రద్ధవహ్నిపాయినం
కిశోరకాంతిరంజితం దృగంజనం సుశోభితం
గజేంద్రమోక్షకారిణం నమామి శ్రీవిహారిణం

యదా తదా యథా తథా తథైవ కృష్ణసత్కథా
మయా సదైవ గీయతాం తథా కృపా విధీయతాం
ప్రమాణికాష్టకద్వయం జపత్యధీత్య యః పుమాన
భవేత్స నందనందనే భవే భవే సుభక్తిమాన

ఇతి శ్రీమచ్ఛంకరాచార్యకృతం శ్రీకృష్ణాష్టకం సంపూర్ణం ..
            శ్రీ కృష్ణార్పణమస్తు ..

గోవర్ధన గిరిధారి

తాత్పర్యము:

వ్రజ కులైక భూషణుడు, సర్వ పాప హరుడు, భక్తుల మనస్సులను రంజింప చేసే వాడు, నందుని ఆనంద దాయకుడు, నెమలి పింఛం మస్తకముపై కలవాడు, తీయని గానము వినిపించే వేణువు చేతిలో కలవాడు, ప్రేమ సాగరుడు అయిన కొంటె కృష్ణుని  భజిస్తున్నాను.

కామదేవుని గర్వము అణచిన వాడు, అందమైన, విశాలమైన కన్నులు కలవాడు, గోపకుల శోకాన్ని పోగొట్టే వాడు, పద్మ లోచనుడు, గోవర్ధన పర్వతమును ఎత్తిన వాడు, చక్కని చిరునవ్వు, చూపులు కలవాడు, ఇంద్రుని గర్వము అణచిన వాడు, గజ రాజు వంటి వాడు అయిన శ్రీ కృష్ణునికి వందనములు.

కదంబ పుష్పముల కర్ణ కుండలములు ధరించిన వాడు, అందమైన కపోలములు (బుగ్గలు) కలవాడు, వ్రజ గోపికల ఏకైక వల్లభుడు, (భక్తి తప్ప ఇతర మార్గముల ద్వార) దుర్లభుడు, గోపికలు, నందుడు, అమితమైన ఆనందములో ఉండే యశోద తన దగ్గర కలవాడు, భక్తులకు ఆనందాన్ని ఇచ్చే వాడు, గోప కుల నాయకుడు అయిన శ్రీ కృష్ణునికి నమస్కారములు.

నందుని కుమారుడు, తన పాదపద్మములను నా హృదయమందు ఉంచిన వాడు, చక్కని కేశములు కలవాడు, సర్వ దోషములను హరించే వాడు, లోకాన్ని పోషించే వాడు, గోప కులము మనసులో ఉండేవాడు, నందునిచే లాలించబడిన వాడు అయిన శ్రీ కృష్ణునికి వందనములు.

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ద్వారా భూ భారాన్ని తగ్గించే వాడు, భవ సాగరాన్ని దాటించే వాడు, యశోద తనయుడు, అందరి మనసులను దోచుకునే వాడు, నందుని కుమారుడు, అందమైన కళ్ళు కలవాడు, ఎప్పుడూ సత్పురుషుల సాంగత్యములో ఉండేవాడు, ప్రతి రోజు కొత్త కొత్తగా కనిపించే వాడు అయిన శ్రీ కృష్ణునికి నా నమస్కారములు.

సర్వ శుభలక్షణములు కలవాడు, సుఖము, కృప ఇచ్చే వాడు, అనంతమైన కృప కలవాడు, రాక్షసులను సంహరించే వాడు, గోపులకు ఆనందాన్ని ఇచ్చే వాడు, గోపాలకుడు, కొత్త కొత్త ఆటలయందు ఆసక్తి చూపించే వాడు, నల్లని మేఘము వంటి శరీరము కలవాడు, మెరుపు వలె మెరిసే పీతాంబరము ధరించే వాడు అయిన శ్రీ కృష్ణునికి నా నమస్కారములు.

గోపకుల జనులను ఆనంద పరచి వారి మధ్య కుంజములో (పొదలలో) ఉండే వాడు, సూర్యుని వలె వెలిగి భక్త జన హృదయమనే కమలములను వికసింప చేసే వాడు, భక్త జన కామ్యములను తీర్చె వాడు, బాణముల వంటి చూపులు కలవాడు, మంచి నాదముతో వేణువును వాయించే వాడు, కుంజ (పొదలకు) నాయకుడు, అయిన శ్రీ కృష్ణునికి నా నమస్కారములు.

ఎల్లప్పుడూ తన గురించి ఆలోచించే మనోజ్ఞమైన గోపికల మనసులు అనే తల్పముపై శయనించే వాడు, గోపకులాన్ని కాపాడుటకు అడవి దావాగ్నిని మ్రింగిన వాడు, నల్లని అంజనముతో, లేత ప్రాయముతో శోభిల్లే కళ్ళు కలవాడు, గజేంద్రునికి మోక్షము కలిగించిన వాడు, లక్ష్మీ పతి అయిన శ్రీ కృష్ణునికి నా నమస్కారములు.

ఫల శృతి:

ఓ శ్రీ కృష్ణా! నీ గుణ, కథ కీర్తన నేను చేసేలా నన్ను అనుగ్రహించుము. ఈ అష్టక ద్వయం (ఇది మరియు కృష్ణాష్టకం) పఠించే వారికి ప్రతి జన్మలోను శ్రీ కృష్ణుని భక్తి కలుగును.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి