22, జనవరి 2011, శనివారం

త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు - ఘన రాగ పంచ రత్న కీర్తన - దుడుకు గల నన్నే

ఎన్నాళ్ళైనా ఆ రాముడు తనను బ్రోవుట లేదని త్యాగరాజ స్వామి తనలో ఏమైనా లోపముందేమో అని బాహ్య ప్రపంచములో ఉన్న మానవులు చేస్తున్న తప్పిదాలను తనకు ఆపాదించుకుని ఈ కీర్తన రాసినట్టు కనిపిస్తున్నది. ఈ సమాజంలో ఉన్న దుర్విషయములు, వ్యసనములతో ఇతరులు చేస్తున్న కాల వ్యర్థమును ఈ కీర్తనలో తనను పాత్రధారిగా చేసుకుని త్యాగయ్య అద్భుతంగా వివరించారు. లేకుంటే రాముని సేవ కొరకు మహారాజుల కానుకలు, ఆస్థాన మర్యాదలు, భోగములు వదులుకున్న మహానుభావుడు దుడుకుగల వ్యక్తి ఎలా అవుతాడు?.

నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా నిజముగా బల్కు మనసా అని తన మానసిక భావాన్ని వ్యక్త పరచిన వాగ్గేయకారుడు పేదరికంలో రాముని సేవయే పెన్నిధి అని జీవించి తరించాడు. ఆ రాముడు తనను ఇంకను కరుణించ లేదని దుర్లక్షణాలను తనలో ఉన్నాయేమో అని ఈ కీర్తనలో చెపుతున్నారు త్యాగయ్య. గౌళ రాగం ఆదితాళం తో కట్టబడింది ఈ పంచ రత్న కీర్తన.


సాహిత్యము:

దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ఎంతో

కడు దుర్విషయాకృష్టుడై గడియ గడియకు నిండారు

శ్రీ వనితా హృత్కుముదాబ్జ అవాంగ్మానస గోచర |దుడుకు గల|

సకల భూతముల యందు నీ వైయుండగ మదిలేక పోయిన |దుడుకు గల|

చిరుత ప్రాయము నాడే భజనామృత రసవిహీన కుతర్కుడైన |దుడుకు గల|

పర ధనముల కొరకు నొరుల మది కరగబలికి కడుపు నింప తిరిగినట్టి |దుడుకు గల|

తనమదిని భువిని సౌఖ్యపు జీవనమే అనుచు సదా దినములు గడిపే |దుడుకు గల|

తెలియని నటవిటక్షుద్రులు వనితలు స్వవశమగుట కుపదేశించి 
సంతసిల్లి స్వరలయంబు లెరుంగకను శిలాత్ముడై సుభక్తులకు సమానమను |దుడుకు గల|

దృష్టికి సారంబగు లలనా సదనాఽర్భక సేనాఽమిత ధనాదులను
దేవాది దేవ నెరనమ్మితిని గాక నీ పదాబ్జ భజనంబు మరచిన  |దుడుకు గల|

చక్కని ముఖ కమలంబును సదా నా మదిలో స్మరణ లేక నే
దుర్మదాంధ జనుల కోరి పరితాపములచే దగిలి నొగిలి
దుర్విషయ దురాశలను రోయలేక, సతతమపరాధినై, చపల చిత్తుడనైన |దుడుకు గల|

మానవతను దుర్లభ మనుచు, నెంచి, పరమానందమొందలేక
మద మత్సర కామ లోభ మోహములకు దాసుడై మోసబోతి గాక
మొదటి కులజుడగుచు భువిని శూద్రుల పనులు సల్పుచునుంటినిగాక
నరాధములను రోయ సారహీన మతములను సాధింప తారుమారు |దుడుకు గల|

సతులకై కొన్నాళ్ళాస్తికై సుతులకై కొన్నాళ్ళు ధన
తతులకై తిరిగితినయ్య త్యాగరాజాప్త ఇటువంటి |దుడుకు గల|


అర్థము:
దుడుకుగల నన్ను ఏ భగవంతుడు రక్షించును?  అనుక్షణము, ఎడతెగక, చెడ్డ పనులతో నా మనస్సు నిండి యున్నది. ఈ చెడ్డ బుద్ధి నన్ను చుట్టుకుని యున్నది. అటువంటి నన్ను ఏ దొర కొడుకు (రాజ కుమారుడైన రాముడు) బ్రోచును? 

ఓ శ్రీ రామా! నీవు లక్ష్మీ దేవి యొక్క హృదయ పద్మములా ఉన్నావు. వాక్కు చేతగాని, మనసుచేత గానీ గోచరము కావు నీవు. దుడుకుగల నన్ను ఏ భగవంతుడు రక్షించును?

 ప్రపంచము నందు గల ప్రతి వస్తువులో నీవే యున్నావు. కానీ నాలో లేకపోవుట కేవలం నా దుర్మార్గపు ప్రవర్తన వలననే అని భావిస్తున్నాను. దుడుకుగల నన్ను ఏ భగవంతుడు రక్షించును?

చిన్నతనము నుండి అమృత రసము వంటి నీ భజన యొక్క మహిమ తెలియలేక చేదు వాదనలు చేస్తున్న దుడుకుగల నన్ను ఏ భగవంతుడు రక్షించును?

ఇతరుల ధనము కొరకు వారి వద్ద చేరి ప్రియమైన మాటలతో, పొగడ్తలతో వారి మనసును సంతోషింప చేసి వారిచ్చు ధనమునకు ఆశపడే దుడుకుగల నన్ను ఏ భగవంతుడు రక్షించును?

మనసులో ఈ ప్రాపంచిక సుఖమే పరమావధిగా భావించి ఎల్లపుడు సమయము గడుపుతున్న దుడుకుగల నన్ను ఏ భగవంతుడు రక్షించును?

అమాయకులు, అజ్ఞానులు, నటులు, విటులు, క్షుద్రులు మొదలైన వారి వద్ద జ్ఞానిగా నటించి వారికి బోధలు చేసి వారిని తన శిష్యులుగా చేసుకుని వారిని తన అదుపులో ఉంచుకుని సంతోషముగా యున్నాను. తనకు స్వర లయ జ్ఞానములు లేకనే తానొక గొప్ప విద్వాంసుడని అనుకుని ఇతరులను తాను మహా భక్తుడనని కూడా భ్రమింప చేసినాను. ఇట్టి దుడుకుగల నన్ను ఏ భగవంతుడు రక్షించును?

ఓ దేవాది దేవ! అందమైన వనితా, ఇల్లు, పిల్లలు, సేవకులు, అమిత ధనము, ఆస్తి మొదలైన అశాశ్వతములైన ప్రాపంచిక కోరికల యందు ఆసక్తి కలిగి, అవియే సర్వస్వముగా భావించి  నీ పాదములను భక్తితో భజన చేయుట మరచిన, దుడుకుగల నన్ను ఏ భగవంతుడు రక్షించును?

గర్వముచే గుడ్డియైన వారితో స్నేహము చేసి, చెడ్డ పనులు చేయుచు, దురాశలను వదల లేక దుర్మార్గుడునై యుండుట చేత నీ చక్కని కమలము వంటి ముఖమును ఎల్లప్పుడూ నా మదిలో స్మరించ లేకుండుంటిని. నా ప్రవర్తనకు నేను చింతిస్తున్నాను. నా చపల చిత్తమును నిగ్రహించుకోలేకున్నాను. పశ్చాత్తాపము నన్ను దహించుచున్నది. దుడుకుగల నన్ను ఏ భగవంతుడు రక్షించును?

మానవ జన్మను పొందుట ఎంతో కష్టము. అటువంటి అదృష్టము కలిగినందుకు సంతోషించక - గర్వము, ఈర్ష్య, కామము, క్రోధము, పిసినారి తనము, మొదలగు దురాలోచనలకు, చెడు కార్యములకు లొంగిపోయి మోసపోతిని. జ్ఞానమే పరమావధిగా కలిగిన కులములో పుట్టి కూడా అజ్ఞానినై ప్రవర్తిన్చితిని. ఇటువంటి విషయములను అసహ్యించుకొనక, మొత్తం తలక్రిందులై నేను కూడా వాటినే చేయు యున్నాను. దుడుకుగల నన్ను ఏ భగవంతుడు రక్షించును?

యౌవనములో భార్యల కొరకు, మరి కొన్నాళ్ళు ఆస్తుల కొరకు, మరి కొన్నాళ్ళు పిల్లల కొరకు, ధనము కొరకు జీవన సమయమంతా వ్యర్థము చేస్తూ తిరిగితిని. ఓ త్యాగరాజునికి ఆప్తుడవైన రామా! దుడుకుగల నన్ను ఏ భగవంతుడు రక్షించును?

పరిశీలన: 
మానవ జన్మ ఎత్తుట మనకు భగవంతుడు ఆయనను తెలుసుకొనుటకు ఇచ్చిన మహదవకాశం.  కానీ, జీవిత సమయమంతా, విషయ వాంఛలలో, దుర్వ్యసనములలో, చెడు ఆలోచనలో దుర్వినియోగము చేసి, ఆ పరమాత్మను తెలుసుకునే గొప్ప అవకాశాన్ని, అదృష్టాన్ని చేజేతులా పోగొట్టుకుని మరల మరల ఈ భువిపై పశువుల, క్రిమి కీటకములలా పుట్టి, మరణించి మళ్లీ మళ్లీ  జన్మలెత్తుతూ విషయ పాప చక్రములో బంధించ బడుతున్నాము. ఈ భావననే త్యాగరాజుల వారు ఈ కీర్తన ద్వారా, తననే ఉదాహరణగా, పాత్రగా తీసుకుని మానవ జన్మను వివరించారు. 

శారీరిక వాంఛలు, ధన సముపార్జన - వీటి కొరకు ఆరు దుర్లక్షణములకు (కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము) లోనై, ఇతరులను హింసించి, తాన దైవత్వమును మరింత దిగజార్చుకుని, మళ్లీ మళ్లీ అదే ఊబిలో చిక్కుకుని ఉన్నాడు మానవుడు. అస్థిరములైన యౌవనము, కామము, ధనము, భార్యా బిడ్డల కొరకు శాశ్వతమైన దేవుని తెలుసుకునే మార్గమును వదులుకోవాలా?. అలాగని మనకు మనము చేస్తున్నది తప్పని తెలియక కాదు. తెలిసి, లోపల పశ్చాత్తాప పడుతూ, అధిగమించటానికి ఆశక్తులమై ఉంటాము. ఇటువంటి సమయములోనే, మనకు దారి చూపటానికి గురువులు కావాలి. వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థ మనలను సరైన మార్గములో నడిపించి, లోపాలను సరిదిద్దుతూ భగవంతుని మార్గములో నడిపిస్తుంది. 

మనలో ప్రతి వారికి ఒక గమ్యము ఉంది. అది మనము ఏమిటి, మనలో ఉన్న బ్రహ్మము ఏమిటి అని తెలుసుకొనుట. దాని కొరకే మనకు వర్ణ వ్యవస్థ, ఆశ్రమ వ్యవస్థ, చదువు, సంస్కారములు, పురుషార్థములు కలిపించబడ్డాయి. వాటిని వదలి, ఆత్మ విమర్శ లేక, నిరంతరమూ నటిస్తూ, తనలోని శుద్ధ తత్త్వముపై తొలగించటానికి అతి కష్టమైన పొరలను కప్పివేస్తాడు మానవుడు. ఇంతటి దుడుకుతనము గల నన్ను (మనలను) ఏ రాముడు రక్షిస్తాడు? కాబట్టి మన ధర్మానికి కట్టుబడి, వాటిని నిర్వర్తిస్తూ, మనకు ఇచ్చిన జన్మను శాశ్వతమైన ఆ ప్రభువును తెలుసుకొనుటకు ఉపయోగిస్తే, ఆయనే మనలను కాపాడుతాడు అని త్యాగయ్య సందేశం.

నా ఉద్దేశంలో పంచరత్న కీర్తనలలో అత్యున్నత ఆధ్యాత్మిక సందేశము కలది ఈ కృతి. బాలమురళీకృష్ణ గారి గళంలో విని, సందేశాన్ని అర్థం చేసుకుని తరిద్దాం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి