RightClickBlocker

22, ఫిబ్రవరి 2011, మంగళవారం

శ్రీమచ్ఛంకరాచార్య కృత కాశీ పంచకము - తాత్పర్యము

వారణాశి
అయోధ్యా మథురా మాయా కాశీ కాంచీ అవంతికా
పురీ ద్వారావతీ చైవ సప్తైత మోక్షదాయికాః

అయోధ్య, మథుర, మాయ (హరిద్వార్), కాశి (వారణాశి), కంచి, అవంతిక (ఉజ్జయిని), పురీ, ద్వారక అనే ఏడు పుణ్యధామములు మోక్షమును ప్రసాదించే క్షేత్రములు.  ఈ క్షేత్రములు దర్శించి భక్తి, శ్రద్ధలతో కొలిచే వారికి మోక్షము కలుగుతుందని భారతీయ ఆధ్యాత్మిక వేత్తల ప్రగాఢ విశ్వాసం. దీనికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఈ అన్ని క్షేత్రాలలోకీ అత్యంత మహిమాన్వితమైనది వారణాశి. కాశ్యాం హి మరణాన్ముక్తిః - కాశీలో మరణం పొందిన వారికి ముక్తి వెంటనే కలుగుతుంది అని ఇంకో ఆర్యోక్తి. వరుణ మరియు ఆశి నదులు గంగానదిలో సంగమమయ్యే ప్రాంతంలో ఉన్న పట్టణం కాబట్టి కాశిని వారణాశిగా పిలుస్తారు. 

ఆది శంకరులు దేశమంతా పర్యటిస్తూ కాశీ పట్టణంలో చాల కాలం గడిపారు. ఆ నగరంలోనే ఆయన కాశీ పంచకం, మనిషి తానూ ఎవరో తెలుసుకునే సాధనమైన మనీషా పంచకం రచించారు.  ఇదివరకే మహత్కర మనీషా పంచకము ఈ బ్లాగ్ లో వివరించాను. ఈ వ్యాసంలో కాశీ పంచకము, తాత్పర్యము మీకోసం.

మణికర్ణికా ఘట్టము

మనోనివృత్తిః పరమోపశాంతిః
సా తీర్థవర్యా మణికర్ణికా చ
జ్ఞానప్రవాహా విమలాదిగంగా
సా కాశికాహం నిజబోధరూపా  ౧

యస్యామిదం కల్పితమింద్రజాలం
చరాచరం భాతి మనోవిలాసం
సచ్చిత్సుఖైకా పరమాత్మరూపా
సా కాశికాహం నిజబోధరూపా  ౨

కోశేషు పంచస్వధిరాజమానా
బుద్ధిర్భవానీ ప్రతిదేహగేహం
సాక్షీ శివః సర్వగతోఽంతరాత్మా
సా కాశికాహం నిజబోధరూపా  ౩

కాశ్యాం హి కాశ్యతే కాశీ కాశీ సర్వప్రకాశికా
సా కాశీ విదితా యేన తేన ప్రాప్తా హి కాశికా  ౪

కాశీక్షేత్రం శరీరం త్రిభువన జననీ వ్యాపినీ జ్ఞానగంగా
భక్తిః శ్రద్ధా గయేయం నిజగురుచరణధ్యానయోగః ప్రయాగః
విశ్వేశోఽయం తురీయః సకలజనమనఃసాక్షిభూతోఽంతరాత్మా
దేహే సర్వం మదీయే యది వసతి పునస్తీర్థమన్యత్కిమస్తి  ౫

తాత్పర్యము: 

మనసులోని ప్రశ్నలకు నివృత్తి, అత్యుత్తమమైన ఉపశాంతి, తీర్థ రాజమైన మణి కర్ణిక , జ్ఞాన ప్రవాహమైన, శుద్ధమైన గంగానదికి  రూపమైన, నిజ ఆత్మ రూపమైన ఆ కాశికను నేనే.

మాయా పూరితమైన (ఇంద్రజాలము వలె) ఈ చరాచర సృష్టికి నిలయమైన, సచ్చిదానందమునకు రూపమైన, పరమాత్మ రూపమైన, నిజ ఆత్మ రూపమైన ఆ కాశికను నేనే. 

పంచ కోశముల జ్ఞాన ప్రకాశమైన, భవాని అనే దేహమునందు అర్థ భాగముగా ప్రకాశించుచు, అంతరాత్మకు ప్రభువైన, సాక్షియైన శివునిగా,  నిజ ఆత్మ రూపమైన ఆ కాశికను నేనే. 

కాశి కాశిలోనే యుండి అన్నిటినీ ప్రకాశింప చేయును. అటువంటి కాశిని తెలుసుకున్న వాడు కాశికి చేరును. 

నా దేహమే కాశిలో ఉన్న విశ్వనాథుని దేవాలయము. నా భక్తియే విశ్వవ్యాప్తమైన త్రిభువన జనని గంగానది. నా శ్రద్ధయే గయా క్షేత్రము. గురుదేవుని నిజ పాద ధ్యానమే నాకు ప్రయాగ. నా అంతరాత్మయే ఈ సకల జగత్ప్రాణి మనస్సాక్షీ  భూతమైన ఆ విశ్వేశ్వరుడు. దేహములో అంతటా ఈ విధముగా నివశించి యుండగా వేరే తీర్థములతో పని ఏమున్నది?

శంకరావతారులు జగద్గురువులు

పరిశీలన:

ప్రత్యక్షముగా కనిపిస్తున్న కాశీ క్షేత్రము మరియు తన దేహములోని ఆత్మ ఒకటే అని నిస్సందేహముగా ఈ స్తోత్రము ద్వారా చాటారు ఆది శంకరులు. పరిపూర్ణ ఆత్మ జ్ఞాన అనుభూతుడైన శంకర గురువులకు తన శరీరమే దేవాలయము, అందులోని జీవుడే (ఆత్మ) పరమాత్మ, సనాతన దైవము. ఈ భావాన్ని శంకరులు ఈ కాశీ పంచకము ద్వారా  -భక్తి శ్రద్ధలే సజల స్రవంతి యైన గంగ మరియు మోక్ష ధామమైన గయలని, అహంకారమును నాశనము చేసి, జ్ఞాన జ్యోతిని వెలిగించి ఆత్మ సాక్షాత్కారములో మార్గ సహాయకుడైన సద్గురువు పాద పద్మములే ప్రయాగయని -  అద్వైతములోని జీవాత్మ పరమాత్మ ఏకత్వమును అత్యున్నతమైన స్థాయిలో ఉదహరించారు. 

దేహములోని పంచకోశములలోని ప్రకాశమును ఆ భవానీశంకరుని రూపముగా, ఆ దేహమును చరాచర సృష్టికి సంకేతముగా, మాయారూపముగా,  మోక్ష సాధనకు సాధనముగా ఈ స్తుతిలో వర్ణించారు ఆది శంకరులు.  కాశీ క్షేత్రములో కనిపించే యోగము, జీవన్ముక్తి, గంగా నది మహత్తు, ఆ నదీమ తల్లి సర్వ వ్యాపకత, అక్కడి మణి కర్ణికా ఘట్టములో జరిగే నిరంతర దేహ కాష్టము, నదిలో ప్రవహించే అనేకములు, విశాలాక్షీ విశ్వేశ్వరులు - మొత్తం కాశీ పట్టణమే మహదనుభవైక  వేద్యముగా భావించి, ఆ భావనను పరిపూర్ణముగా ఆత్మకు ఆలయమైన దేహములో అనుభూతి చెంది రచించారు శంకరులు. అందుకే, ఆయన శంకారవతారులు, జగద్గురువులు అయినారు. 

శ్రీ గురుభ్యో  నమః.

20, ఫిబ్రవరి 2011, ఆదివారం

తులసీదాస కృత రామచంద్ర స్తుతి - శ్రీ రామచంద్ర కృపాళు


అందాల రాముని వర్ణించటం రామభక్తుని ప్రథమ లక్షణం. ఆ ఇందీవర శ్యాముని శరీర సౌందర్యమును వర్ణనలో కమలములతో ఉపమానము చేయనిదే అది సంపూర్ణము కాదు, మనసును హత్తుకోదు. ప్రతి శ్రీహరి స్తుతిలో ఈ ఉపమానము ఉండవలసిందే. అలాగే, రాముని నుతిలో ఆయన ధర్మ సంరక్షణలో చేసిన దుష్ట సంహారము, ఆయన ధనుస్సు, అస్త్రములు గురించి కూడా ప్రస్తావన తప్పకుండా జరుగుతుంది.

ఇదే శైలిని, భావాన్ని గోస్వామి తులసీ దాసు తన రామచంద్ర స్తుతిలో వ్యక్త పరచారు. తులసీదాసు హృదయములో వికసించిన మనోజ్ఞ  మాధుర్య భక్తి సుమం రామచంద్ర స్తుతి. అవధ భాషలోనే కాకుండా సంస్కృతములో కూడా ఆయన గొప్ప రచనలు చేసాడు అనటానికి ఈ నుతి ఒక గొప్ప ఉదాహరణ. తులసీ దాసు కొన్ని అద్భుతమైన ఉపమానములు, పదప్రయోగాలు ఈ నుతిలో చేసారు - హరణ భవ భయ దారుణం - దారుణమైన సంసారమనే భయాన్ని హరించే వాడు...అంతకన్నా రాముని మహిమను చెప్పే భావన ఏముంటుంది?.  అలాగే కమలమునకు కంజము అనే పదము ఉపయోగించి, ఆ రాముని అందమైన కన్నులు, చేతులు, పాదములు, ముఖము అన్నీ ఆ వికసించే కలువలా అందముగా ఉన్నాయి అనే భావాన్ని ముత్యాల వరుసలా, కాసుల పేరులా పేర్చారు తులసీ దాసు. నవ నీల నీరద సుందరం అనే పద మాలికతో రాముని నీల మేఘ శ్యామ రూపాన్ని కన్నులకు కట్టినట్టుగా రచించారు. రఘువంశ కులతిలకుడు, కోసల రాజ్యమనే ఆకాశానికి చంద్రుడు, దశరథ పుత్రుడు అనే భావాన్ని 'రఘునంద ఆనందకంద కోసల చంద దశరథ నందనం' అనే పద రత్న మాలికతో వర్ణించారు. ఎంత అందమైన ప్రాస?.

అలాగే, ప్రతి శ్లోకములోనూ మనోహరమైన పద ప్రయోగం - (భయ దారుణం, కంజారుణం), (నీరద సుందరం, జనక సుతావరం), (దైత్య వంశ నికందనం, దశరథ నందనం),  (అంగ విభూషణం, జిత ఖర దూషణం),  (ముని మనరంజనం, ఖలదళ గంజనం) - ఇలా కవలల వంటి కలువలైన పదాలను ప్రయోగించి, కమలలోచనుని, కమలనాభుని, కమల ప్రియుని భక్తితో, భావముతో నుతించారు గోస్వామి. అందుకే ఈ స్తుతి ఎంతో ప్రాచుర్యం పొందింది. 

రామచంద్ర స్తుతి సాహిత్యము, తాత్పర్యము మీకోసం. ఇంత ఆహ్లాదమైన, అందమైన భక్తి నుతిని భారత రత్న, గాన గోకిల లతా మంగేష్కర్ గొంతులో వినండి.


శ్రీరామచంద్ర కృపాళు భజ మన హరణ భవభయ దారుణం
నవకంజలోచన కంజముఖ కరకంజ పదకంజారుణం  ౧

కందర్ప అగణిత అమిత ఛవి నవ నీల నీరద సుందరం
పటపీత మానహు తడిత రుచి శుచి నౌమి జనక సుతావరం   ౨

భజ దీన బంధు దినేశ దానవ దైత్యవంశ నికందనం
రఘునంద ఆనందకంద కోసల చంద దశరథ నందనం   ౩

శిరముకుట కుండల తిలక చారు ఉదార అంగ విభూషణం 
ఆజానుభుజ శర చాపధర సంగ్రామ జిత ఖరదూషణం  ౪

ఇతి వదతి తులసీదాస శంకర శేష ముని మనరంజనం
మమ హృదయకంజ నివాస కురు కామాదిఖలదళ గంజనం   ౫

తాత్పర్యము:

ఓ మనసా! వికసించిన కమలముల వంటి కన్నులు, ముఖము, చేతులు, పాదములు కల,  అమితమైన కృప కలిగిన, ఈ జీవనములోని భయాలను పారద్రోలే శ్రీ రామచంద్రుని భజించుము.  

కోటి మన్మథుల కన్నా అందమైన వాడు, క్రొత్తగా ఏర్పడిన నీలి మేఘమువలె సుందరుడు, ఎల్లప్పుడూ శుచియైన పీతాంబరములు (పచ్చని పట్టు వస్త్రములు) ధరించి అందముగా ఉండేవాడు, సీతాదేవి వరుడు అయిన రామునికి నమస్కారములు. 

దీన బంధువు, సూర్యవంశమున జన్మించిన వాడు, రాక్షస వంశములను నిర్మూలనము చేసిన వాడు, రఘు కులమునకు ఆనందకారుడు, కోసల రాజ్యానికి చంద్రుని వంటి వాడు, దశరథుని పుత్రుడు అయిన శ్రీ రాముని భజించుము. 

ఆ శ్రీరాముడు శిరసుపై కిరీటమును ధరించిన వాడు, కుండలములు ధరించిన వాడు, ఎన్నో ఆభరణాలతో శోభిల్లే శరీరము కలవాడు, మోకాళ్ళ వరకు ఉన్న చేతులకు ధనుస్సు, శరములు కలిగిన వాడు, యుద్ధములో ఖర దూషణ రాక్షసులను సంహరించిన వాడు.

"నా హృదయ కమలములో నివసించే ఓ రామచంద్రా! నాలోని కామాది దుష్ట గుణముల సమూహమును నాశనము చేసే ప్రభూ! " - అని శంకరుడు, అది శేషుడు, ఇతర మునుల మనసు రంజిల్ల చేసే తులసీ దాసు ఈ విధంగా నుతిస్తున్నాడు.

17, ఫిబ్రవరి 2011, గురువారం

త్యాగరాజ రామభక్తి - ఎంత వేడుకొందు రాఘవాశ్రీమాన్ అంబుజ సంభవాన్వయ లసత్కాకర్ల వంశాగ్రణీః
న్యాయ వ్యాకరణ ప్రమాణగతి విద్విద్వజ్జనారాధితః
సాన్గాధీత విలోడిత శృతి శిఖా దుగ్ధాగ్ధిలబ్ధామృతః
జ్యోతిర్మార్గ విదాం వరోవిజయతే శ్రీ త్యాగరాజో గురుః 
(త్యాగరాజ స్వామిని నుతిస్తూ వారి శిష్యులు శ్రీ వాలాఝీపేట వేంకటరమణయ్య భాగవతార్ గారు రాసిన శ్లోకము)
పవిత్రమైన కాకర్ల వంశములో జన్మించి, న్యాయ, వ్యాకరణ శాస్త్రముల యందు సంపూర్ణమైన పరిశోధనలు చేసి, వేద వేదాన్తములనే క్షీర సాగరమునందు జన్మించిన అమృత పానము చేయుచు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుచున్న కోవిదులలో ఉత్తముడైన శ్రీ త్యాగరాజ గురువునకు విజయము కలుగు గాక!

రామ భక్తాగ్రేసరుడు, కలియుగ నారదులు కాకర్ల త్యాగరాజు వారు రాసిన ఎంత వేడుకొందు రాఘవా అనే కీర్తన నా మనసును చాల హత్తుకున్న కీర్తన. కారణం దాని రాగం లక్షణం, ఆలాపన, గతి. 

భక్తీ మార్గములో ఉన్నప్పుడు వేడుకొనుట, అలసట, గగుర్పాటు, ఆనంద బాష్పములు, ప్రశ్న, పరి ప్రశ్న, అంతర్మథనం, నిష్ఠూరం, ఆవేదన, శరణాగతి లాంటి వేర్వేరు భావనలు, ప్రతిక్రియలు కలుగుతుంటాయి. వీటిలో ప్రశ్న, అలసట, ఆవేదన ఈ కీర్తన లక్షణాలు. నీ దర్శన భాగ్యం కోసం ఎంతని వేడుకునేది? అని రాముని ప్రశ్నిస్తున్నాడు త్యాగరాజు. అలా ప్రశ్నిస్తున్నప్పుడు ఆయన ఉనికిని గాని, మహత్తును గాని, కీర్తిని గాని ప్రశ్నిచటం లేదు. కేవలం - ఇంత నమ్మినా కూడా తనకు ఎంత కాలం ఈ పరీక్ష అని ఆవేదన. 

సరస్వతీ మనోహరి రాగంలో ఈ కీర్తన కూర్చబడినది. కీర్తన సాహిత్యం, తాత్పర్యము. శ్రవణం ఓ ఎస్ త్యాగరాజన్ గారి గళంలో.

సాహిత్యం: 

ఎంత వేడుకొందు రాఘవా | ఎంత వేడుకొందు|

పంతమేలరా ఓ రాఘవా | ఎంత వేడుకొందు| 

చింత దీర్చుటకెంత మోడి రా  అంతరాత్మ చెంత రాక నే |  నెంత వేడుకొందు| 

చిత్తమందు నిన్ను జూచు సౌఖ్యమే ఉత్తమంబనుచు ఉప్పొంగుచును 
సత్తమాత్రమా! చాల నమ్మితిని సార్వభౌమ శ్రీ త్యాగరాజనుత | ఎంత వేడుకొందు| 


తాత్పర్యము: 
ఓ రామా! నిన్నెంత వేడుకొందును? నా పట్ల నీకేల పంతము? నా చింత తీర్చుటకు నీకు ఎందుకు ఇంత బింకము? నా అంతరాత్మ నీవే అయి కూడా నా వద్దకు రాకుండా యున్నావు. నా మనసులో నిన్ను దర్శించే సౌఖ్యమే అన్నిటి కన్నా ఉత్తమమని ఉప్పొంగుచున్నాను. ఈ బాహ్యప్రపంచము నందలి ప్రతి వస్తువులోను, అంతటా నీ శక్తి వ్యాపించి యున్నదని చాలా నమ్మితిని. ఓ సార్వభౌమా! త్యాగరాజునిచే నుతించబడిన రామా! నిన్నెంత వేడుకొందును? 

తులసీదాసు హనుమాన్ చాలీసా - ఎమ్మెస్ రామారావు గారి తెలుగు హనుమాన్ చాలీసా

ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం 
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం 

బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగాతా 
ఆజాడ్యం వాక్పటుత్వం చ హనుమాత్ స్మరణాద్భవేత్ 

హనుమాన్ అంజనా సూనుః వాయుపుత్రో మహాబలః
రామేష్టః ఫల్గుణస్సఖః పింగాక్షో అమిత విక్రమః
ఉదధిః క్రమణశ్చైవ సీతాశోకవినాశకః
లక్ష్మణః ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పః
ద్వాదశైతాని నామాని కపీన్ద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్మ మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ హనుమద్ తత్త్వము:

మానవ జన్మ అవరోధాలు, కష్టాలతో నిండి ఉంటే, మన ధర్మం నిర్వర్తించటం ఎలా? మానసిక దౌర్బల్యం, శారీరక అశక్తత ఉంటే, మన కర్తవ్య పాలన ఎలా?. అందుకనే, మనకు రామాయణంలో హనుమంతుని పాత్రను ఉంచారు వాల్మీకి మహర్షి. భగవంతునిపై పరిపూర్ణమైన నమ్మకం, శరణాగతి ద్వారా వానరుడైన హనుమంతుడు ఎటువంటి ఊహించలేని అవరోధాలను దాటి ధర్మ పాలనలో తన ప్రభువైన రామచంద్రునికి తన వంతు సాయం చేశాడు?.

మరి ఆ హనుమంతునికి ఎన్ని అవరోధాలు? - మొదట కోతి జన్మ వలన చంచలమైన మనస్సు, తన శక్తి తను తెలుసుకోలేని బుద్ధి. వీటిని స్థిరపరుచుకొనుటకు రాముని పట్ల అచంచలమైన భక్తి, పూర్తి సమర్పణ ఉపయోగ పడింది.  తరువాత రామభక్తుడనే ముద్ర బిళ్ళ కలిగి ఉండటం వలన సాగరం దాటే సమయంలో ఎంతోమంది సహాయం పొందుతాడు. అలాగే, రామ నామ జపంతో రాక్షసులను సంహరించి మాత చెంతకు చేరుతాడు. తన మనసు చలించినప్పుడల్లా, ఆ ప్రభు నామ స్మరణ, దాని వలన ఆయన పట్ల తన కర్తవ్యము గుర్తుకు వచ్చి ముందుకు సాగుతాడు. సుందరకాండలో దీనికి ఉదాహరణలు ఎన్నో? - మండోదరిని చూసి సీత అనుకుని భ్రమించటం, సీతాదేవి కాన రాక, దాని వలన ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఊహించుకొని, దాని వలన నిరాశ, నిస్పృహ చెందటం, అప్పుడు మరల రామ నామ బలంతో, శుభ సూచనలు కలిగి ముందుకు వెళ్ళటం, సీతాదేవి ముంగిట రాముని గుణ కీర్తన వలన ఆమెను సంతోషపరచటం, ఆత్రుతలో లంకాదహనం కావించి చిన్తిస్తున్నప్పుడు రాముని స్మరణ వలన, సీతెదేవికి ఎటువంటి హాని కలుగదు అనే దృఢ విశ్వాసం కలిగే స్థైర్యం కలగటం...ఇలా సుందరకాండ వెదికితే మానసిక చాంచల్యం, దానికి పరిష్కారం అనే విషయానికి ఉదాహరణలు కోకొల్లలు. అలాగే యుద్ధ సమయంలో హనుమంతుని శౌర్యము, సంజీవని పర్వతం తెచ్చుట, రామ లక్ష్మణులను మైరావణుని బారి నుండి కాపాడుట - వీటన్నిటిలో హనుమంతుని పాత్ర అనిర్వచనీయమైనది. అంతటి మహా శక్తి సంపన్నుడు హనుమంతుడు. ఆ శక్తికి మూలం అచంచలమైన రామభక్తి, దాస్యము, శరణాగతి. మరి అంతటి మహనీయుని స్మరిస్తే మన బాధలు, పీడలు తొలగకుండా ఉంటాయా? దీనికి ఉదాహరణగా కొన్ని కోట్ల మంది, కొన్ని వందల వేల సంవత్సరాలుగా హనుమనుతుని ఉపాసనతో శక్తి మంతులై, దీమంతులై తరించిన వారు ఉన్నారు.   ఒక్క హనుమాన్ చాలీసాను పూర్తి విశ్వాసంతో నిరంతర పారాయణ చేసి అధిగమించలేని బాధలను, రోగాలను, పీడలను, మానసిక శారీరిక దృఢత్వము కలిగి ముందుకు వెళ్ళిన వారు ఎంతో మంది.  అంత మహత్తు గలవి హనుమంతుని స్తోత్రాలు, మంత్రాలు.


ఎమ్మెస్ రామారావు గారి చాలీసా


మహానుభావులకు దైవానుగ్రహం ఎలా ఎప్పుడు కలుగుతుందో చెప్పలేము. తెలుగులో తొలి సినీ నేపథ్యగాయకులైన మోపర్తి ఎమ్మెస్ రామారావుగారికి హనుమంతుని కృప అలాగే కలిగింది. తెనాలిలో మోపర్తి రంగయ్య-మంగమ్మ దంపతులకు 1921 జూలై 3న జన్మించిన ఎమ్మెస్ రామారావు గారు నిడుబ్రోలులో పాఠశాల విద్యనభ్యసించి గుంటూరు హిందూ కళాశాలలో డిగ్రీ చదివారు. కాలేజీలో పాటల పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకున్న ఆయనను నండూరి సుబ్భారావు గారు చలనచిత్రాలలో పాడాలని ప్రోత్సహించారు. దానితో చెన్నై వెళ్లి నేపథ్య గాయకునిగా పేరొందారు. 1944-64 మధ్య ఇరవై ఏళ్ల పాటు చలన చిత్రాలలో పాటలు పాడారు. సినిమారంగంలో అవకాశాలు తగ్గిపోవటంతో రాజమండ్రిలో సత్యసాయి గురుకులంలో వార్డెన్  ఉద్యోగంలో చేరారు. తరువాత హనుమంతుని అనుగ్రహంతో తొలుత చాలీసా, తరువాత సుందరకాండ తెలుగులో రచించారు. అప్పటినుంచి ఆయన పేరు చెప్పగానే ఆ హనుమద్భక్తుని రూపమే ఆంధ్రదేశమంతా ప్రకటితమయ్యింది.

సాధారణంగా ఒక మహా రచనను ఇంకొక భాషలోకి అనువదిస్తే అందులో ఉన్న నిజ భావన, మాధుర్యము, సందర్భము, ఆ కవి అనుభూతి సంపూర్ణంగా అనువాదనలో కనిపించదు. ఎందుకంటే, ఆ సమయములో ఆ కవి అనుభవించిన భావన ఒక ప్రత్యేకమైన దైవిక శక్తి సంకల్పంతో  కూడి, జరిగితేనే అది మహా రచన అయ్యింది కాబట్టి, అదే అనుభూతి ఈ అనువాదం చేసే కవికి కలిగే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి. కానీ, హనుమాన్ చాలీసా విషయంలో తులసీదాసు పొందిన భావన, చూపించిన భక్తి, శరణాగతి మన తెలుగులోకి అనువదించిన శ్రీ ఎమ్మెస్ రామారావు గారు దాదాపు చూపించారు. అందుకే ఆయన రచించి ఆలపించిన సుందరకాండ, హనుమాన్ చాలీసా హనుమద్భక్తుల నోట మారు మ్రోగుతూనే ఉంది. ఆయన రచనలు బాగా ప్రాచుర్యం చెందటానికి కారణం భక్తి, భాష, భావన మూడు బాగా సమ్మిళితం చేయటం వలన మరియు అటువంటి రచనలు ఫలాపేక్ష లేకుండా, హనుమంతుని స్మరిస్తూ, అనుభవైకవేద్యమై అమృత గానం చేయటం వలన. కలియుగంలో భక్తి, స్తుతిని మించిన మోక్ష సాధనం లేదని ఎన్నో శృతి స్మృతి పురాణాలు ఘోషించాయి. ఆ మార్గాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకుని ఎమ్మెస్ రామారావు గారు తులసీదాస్ రచించిన చాలీసాను తెలుగులోకి అద్భుతంగా అనువదించారు, పాడారు. స్వతహాగా మంచి లలితా సంగీత, నేపథ్య గాయకులైన రామారావు గారు ఈ మార్గంలోకి వెళ్లి సంపూర్ణమైన అనుభూతిని మనకు పంచి ఇచ్చారు. ఆ మహానుభావునికి హృదయ పూర్వక నివాళులు.

తులసీదాసు హనుమాన్ చాలీసా సాహిత్యం:


శ్రీగురు చరణ సరోజ రజ నిజ మను ముకుర సుధారి
వరణౌ రఘువర విమల యశ జో దాయక ఫల చారి
బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవనకుమార్
బల బుద్ధి విద్యా దేహి మోహి హరహు కలేశ వికార్

జయ హనుమాన జ్ఞాన గుణ సాగర  జయ కపీశ తిహు లోక వుజాగర

రామ దూత అతులిత బల ధామా అంజనిపుత్ర పవనసుత నామా

మహావీర విక్రమ బజరంగీ కుమతి నివార సుమతి కే సంగీ

కంచన వరణ విరాజ సువేశా కానన కుండల కుంచిత కేశా

హాథ వజ్ర ఔర్ ధ్వజా విరాజై కాంధే మూంజ జనేవూ సాజై

శంకర సువన కేసరీనందన తేజ ప్రతాప మహా జగ వందన

విద్యావాన గుణీ అతి చాతుర రామ కాజ కరి వే కో ఆతుర

ప్రభు చరిత్ర సుని వే కో రసియా రామ లఖన సీతా మన బసియా

సూక్ష్మ రూప ధరి సియహి దిఖావా వికట రూప ధరి లంక జరావా

భీమ రూప ధరి అసుర సంహారే రామచంద్ర కే కాజ సవారే

లాయ సజీవన లఖన జియాయే శ్రీరఘువీర హరఖి వురలాయే

రఘుపతి కీన్హీ బహుత బడాయీ తుమ మమ ప్రియ భరతహి సమ భాయీ

సహస వదన తుమ్హరో యశ గావై అస కహి శ్రీపతి కంఠ లగావై

సనకాదిక బ్రహ్మాది మునీశా నారద శారద సహిత అహీశా

యమ కుబేర దిగపాల జహా తే కవి కోవిద కహి సకై కహా తే

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా రామ మిలాయ రాజ పద దీన్హా

తుమ్హరో మంత్ర విభీషణ మానా లంకేశ్వర భయే సబ జగ జానా

యుగ సహస్ర యోజన పర భానూ లీల్యో తాహి మధుర ఫల జానూ

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ జలధి లాంఘి గయే అచర జనాహీ

దుర్గమ కాజ జగత కే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే

రామ దుఆరే తుమ రఖవారే హోత న ఆజ్ఞా బిను పైఠారే

సబ సుఖ లహై తుమ్హారీ శరనా తుమ రక్షక కాహూ కో డరనా

ఆపన తేజ సమ్హారో ఆపై తీనోం లోక హాంకతే కాంపై

భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జబ నామ సునావై

నాసై రోగ హరై సబ పీరా జపత నిరంతర హనుమత వీరా

సంకట తే హనుమాన ఛుడావై మన క్రమ వచన ధ్యాన జో లావై

సబ పర రామ తపస్వీ రాజా తిన కే కాజ సకల తుమ సాజా

ఔర మనోరథ జో కోయీ లావై సోయీ అమిత జీవన ఫల పావై

చారో యుగ పరతాప తుమ్హారా హై పరసిద్ధ జగత ఉజియారా

సాధు సంత కే తుమ రఖవారే అసుర నికందన రామ దులారే

అష్ట సిద్ధి నౌ నిధి కే దాతా అస వర దీన జానకీ మాతా

రామ రసాయన తుమ్హరే పాసా సదా రహో రఘుపతి కే దాసా

తుమ్హరే భజన రామ కో పావై జనమ జనమ కే దుఖ బిసరావై

అంత కాల రఘుబర పుర జాయీ జహాం జన్మ హరిభక్త కహాయీ

ఔర దేవతా చిత్త న ధరయీ హనుమత సేఈ సర్బ సుఖ కరయీ

సంకట కటై మిటై సబ పీరా జో సుమిరై హనుమత బలవీరా

జై జై జై హనుమాన గోసాయీ కృపా కరహు గురు దేవ కీ నాయీ

జో సత బార పాఠ కర కోయీ ఛూటహి బంది మహా సుఖ హోయీ

జో యహ పఢై హనుమాన చలీసా హోయ సిద్ధి సాఖీ గౌరీసా

తులసీదాస సదా హరి చేరా కీజై నాథ హృదయ మహ డేరా

పవనతనయ సంకట హరణ మంగల మూరతి రూప
రామ లఖన సీతా సహిత హృదయ బసహు సుర భూప


ఎమ్మెస్ రామారావు గారి తెలుగు హనుమాన్ చాలీసా సాహిత్యంశ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు
బుద్ధిహీనతను గలిగిన తనువులు బుద్బుదములని తెలుపు సత్యములు 

జయహనుమంత జ్ఞాన గుణ వందిత జయ పండిత త్రిలోక పూజిత
రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుత నామ

ఉదయభానుని   మధుర ఫలమని భావన లీల అమృతమును గ్రోలిన
కాంచన వర్ణ విరాజిత వేష కుండల మండిత కుంచిత కేశ 

రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజ పదవిని సుగ్రీవున నిలిపి
జానకీపతి ముద్రిక దోడ్కొని జలధి లంఘించి లంక జేరుకొని 

సూక్ష్మ రూపమున సీతను జూచి వికట రూపమున లంకను గాల్చి 
భీమరూపమున అసురుల జంపిన రామ కార్యమును సఫలము జేసిన

సీత జాడ గని వచ్చిన నిను గని శ్రీ రఘువీరుడు కౌగిట నినుగొని 
సహస్ర రీతుల నిను గొనియాడగ కాగల కార్యము నీపై నిడగ 

వానరసేనతో వారధి దాటి లంకేశునితో తలపడి పోరి
 హోరుహోరున పోరు సాగిన అసుర సేనల వరుసను గూల్చిన

లక్ష్మణ మూర్ఛతో రాముడడలగ సంజీవి దెచ్చిన ప్రాణ ప్రదాత
రామలక్ష్మణుల అస్త్రధాటికి అసురవీరులు అస్తమించిరి 

తిరుగులేని శ్రీరామబాణము జరిపించెను రావణ సంహారము 
ఎదురులేని ఆ లంకాపురమున ఏలికగా విభీషణు  జేసిన 

సీతారాములు నగవుల గనిరి ముల్లోకాల హారతులందిరి
అంతులేని ఆనందాశ్రువులే అయోధ్యాపురి పొంగిపొరలే 

సీతారాముల సుందర మందిరం శ్రీకాంతుపదం నీ హృదయం 
రామ చరిత కర్ణామృత గాన రామ నామ రసామృత పాన 

దుర్గమమగు ఏ కార్యమైనా సుగామమే యగు నీ కృపజాలిన
కలుగు సుఖములు నిను శరణన్న తొలగు భయములు నీ రక్షణయున్న 

రామ ద్వారపు కాపరి వైన నీ కట్టడి మీర బ్రహ్మాదుల తరమా     
భూత పిశాచ శాకిని ఢాకిని భయపడి పారు నీ నామజపము విని

ధ్వజా విరాజా వజ్ర శరీరా భుజబల తేజా గదాధరా 
ఈశ్వరాంశ సంభూత పవిత్ర  కేసరీ పుత్ర పావన గాత్ర 

సనకాదులు బ్రహ్మాది దేవతలు శారద నారద ఆదిశేషులు
యమకుబేర దిక్పాలురు కవులు పులకితులైరి నీ కీర్తి గానముల 

సోదర భరత సమానా యని శ్రీరాముడు ఎన్నిక గొన్న హనుమా 
సాధుల పాలిట ఇంద్రుడవన్నా అసురుల పాలిట కాలుడవన్నా

అష్టసిద్ధి నవనిధులకు దాతగ జానకీ మాత దీవించెనుగ  
రామ రసామృత పానము జేసిన మృత్యుంజయుడవై వెలసిన 

నీ నామ భజన శ్రీ రామ రంజన జన్మ జన్మాంతర దుఃఖ భంజన 
ఎచ్చటుండినా రఘువరదాసు చివరకు రాముని చేరుట తెలుసు
  
ఇతర చింతనలు మనసున మోతలు స్థిరముగా మారుతి సేవలు సుఖములు
ఎందెందున శ్రీరామ కీర్తన అందందున  హనుమాను నర్తన

శ్రద్ధగ దీనిని ఆలకింపుమా శుభమగు ఫలములు కలుగు సుమా
భక్తి మీరగా గానము చేయగ ముక్తి గలుగు గౌరీశులు సాక్షిగా 

తులసీదాస హనుమాన్ చాలీసా  తెలుగున సుళువుగ నలుగురు పాడగ
పలికిన సీతారాముని పలుకున దోషములున్న మన్నింపుమన్న 

మంగళ హారతి గొను హనుమంత సీతా రామ లక్ష్మణ సమేత
నా అంతరాత్మ నిలుమో అనంత నీవే అంతా శ్రీ హనుమంత

పరిశీలన:

మొట్ట మొదట: రామారావు గారి చాలీసాలోని శ్లోకాలు తులసీదాసు చాలీసాలోని శ్లోకాల వరుసలో లేవు. కొంత రామాయణ గాథను అనుసరించి తన అనువాదాన్ని చేసినట్టు అర్థమవుతున్నది.

ఎమ్మెస్ రామారావు గారి ప్రయత్నం పూర్తి అనువాదం కాదు.  తులసీదాసుని హృదయాంతరంగము నుండి వెలువడిన మహామంత్ర సమానమైన చాలీసా పూర్తిగా రామాయణంలో హనుమంతుని భక్తిని, వీరత్వమును, రాక్షస సంహారమును, రామ చరణారవింద దాస్యమును, రామభక్తి మహాత్మ్యమును విషాద పరచి, ఆ హనుమంతుని స్మరణ సామాన్య మానవుల కష్టాలను, దౌర్బల్యాలను దూరం చేయటానికి దోహద పడుతుంది అని ఉద్బోధిస్తుంది. ఇదే భావనను, కొంత కుదించి, కొంత ఆధ్యాత్మికంగా మెరుగు దిద్ది, సీతారామచంద్రుల కీర్తిని, వారియందు హనుమంతునికి గల భక్తిని, ఆయన గుణ గణములను అచ్చ తెలుగులో మన ముందుంచారు రామారావు గారు. 

ముందు ధ్యాన శ్లోకము చూడండి:

తులసీదాసు 'నా మనసు అనే మలిన పడ్డ అద్దాన్ని శ్రీ గురు చరణ కమలములతో శుద్ధి చేసి, నేను రఘువరుని విమలమైన యశస్సును కీర్తిస్తున్నాను. దాని వలన ఆ ప్రభువు నాకు నాలుగు (బహు విధములు అని అర్థము) విధములైన ఫలము ఇస్తున్నాడు. బుద్దిహీనుడ నైన నేను ఆ వాయుపుత్రుని నా మనసు యందు ధ్యానించి, నాకు బలము, బుద్ధి, విద్య ఇచ్చి, నాకున్న క్లేశములన్నీ తొలగించుము అని ఆ హనుమంతుని ప్రార్థిస్తున్నాను. ' అని నుతిస్తే రామారావు గారు - 'ఆ హనుమంతుని చరణములు ఇహము, పరము సాధనకు శరణములు అని, బుద్ధి హీనత కలిగిన శరీరము నీటి బుడగ వంటి సత్యమును తెలిపేవి' అని ఇంకొంచెం వైరాగ్యము, పై మెట్టు అధ్యాతిమిక భావన కలిగించారు.

వీలైనంత తులసీదాసు ఉపయోగించిన ప్రాకృత భాషా పదాలను అలాగే ఉంచి ఆ మహానుభావుని పట్ల తన గౌరవాన్ని, తులసీదాసు అక్షరమాలలో ఉన్న దైవ బలాన్ని పునరుద్ఘాటించారు. మిగిలిన చాలీసాలో చాలా మటుకు సరళ అక్షరాలను వాడి, కష్టమైన ఒత్తులు, గుణింతాలు లేకుండా రచించారు.

రామారావుగారి చాలీసా సరళమైన తెలుగులోనే ఉంది కాబట్టి తులసీ చాలీసా భావార్థము తెలుగు చాలీసా సాహిత్యంలో తేలిగ్గానే అర్థమవుతుందని భావిస్తున్నాను. 

గోస్వామి తులసీదాస కృత శ్రీరుద్రాష్టకమ్ - తాత్పర్యము

తులసీ దాస జీవన సంగ్రహము:
 


గోస్వామి తులసీదాస్ రామభక్తి సామ్రాజ్యంలో మహా భక్త శిరోమణి. ప్రస్తుతపు ఉత్తరప్రదేశ్ లోని చిత్రకూట ప్రాంతమైన రాజాపూర్ లో క్రీస్తు శకం 1532 వ సంవత్సరంలో ఆత్మారాం దుబే మరియు హుల్సీ దేవి దంపతులకు జన్మించాడు. భవిష్యత్ పురాణంలోని ప్రతిసర్గ పర్వంలో శివుడు పార్వతితో వాల్మీకి మహర్షి హనుమంతునిచే పొందిన వరాన్ని వివరిస్తూ, 'వాల్మీకిస్తులసీదాసః కలౌ దేవి భవిష్యతి | రామచంద్ర కథామేతాం భాషాబద్ధాం కరిష్యతి| '  -    కలియుగంలో తులసీ దాసు అనే మహాభక్తుడు వాల్మీకి అంశతో జన్మించి ప్రాంతీయ భాషలో రాముని వైభవాన్ని రచించి నుతిస్తాడని చెబుతాడు. అందుకనే, తులసీదాసును వాల్మీకి అవతారంగా భావిస్తారు. భక్తి, కావ్య రచన, తాదాత్మ్యత, భాష - వీటిని చూస్తే ఆయన అపర వాల్మీకి అనటానికి ఏ సందేహమూ లేదు. 

అవధ్ భాషలో (భోజ్‍పురీ, వ్రజభాష,బుందేలి పద ప్రయోగం కూడా కనిపిస్తాయి) ఆయన రచించిన లోక విఖ్యాతి గాంచిన రామాయణం 'రామచరిత మానస్'. కొంత వాల్మీకి రామాయణం తో విభేదించే కథా ప్రవాహం కనిపించినా, రామావతారము, హనుమంతుని మహత్తు మొదలైన వాటిని అద్భుతంగా వర్ణించినట్టు పారాయణ చేసిన వారు, చరిత్రకారులు, సాహితీ విమర్శకులు, పరిశీలకులు చెబుతారు. ఇక హనుమాన్ చాలీసా గురించి చెప్పేదేముంది? ఇంటింటా, ప్రతి వ్యక్తికీ నోటికి వచ్చే ఈ స్తుతి మహిమ దానిని పఠించి ఫలితాలు పొందిన వారిని అడిగితే అవగతమవుతుంది. భీతి, విచారము, సంకటము, రోగము మొదలైన శారీరిక మానసిక బాధలు కలిగినప్పుడు ఆధ్యాత్మికంగా మొట్ట మొదట సూచించ బడే స్తోత్రము హనుమాన్ చాలీసా. ఇవే కాక ఈయన వినయపత్రిక, కవితావళి, కృష్ణ గీతావళి, దోహావళి మొదలైన రచనలు ఆ ప్రాంతంలోని ప్రతి సామాన్యునికి అర్థమయ్యేలా రచించారు. ఇవే కాక, హనుమాన్ బాహుక్, సాఠికా, సంకట మోచన మొదలైన ఎన్నో అత్యంత మహిమాన్వితమైన స్తోత్రాలను రచించారు. భారత దేశంలో హనుమద్ మరియు రామ భక్తులకు ఒక స్పష్టమైన, మహత్తరమైన దిశా నిర్దేశం చేశాయి తులసీదాస్ రచనలు. 

మరి ఇంత గొప్ప కవి, భక్తుడు పుట్టుకతోనే ఇలా ఉన్నాడా? లేదు. మనలాగే సామాన్య మానవుడిగా పుట్టి, పెళ్లి చేసుకుని భార్యపై అమితమైన ప్రేమ కలిగిన వాడు. ఆయన ధర్మ పత్ని బుద్దిమతి. ఒకసారి ఆమె పుట్టింటికి వెళుతుంది. భార్యా విరహం భరించలేని తులసీదాస్ ఆమె కోసం అర్ధ రాత్రి బయలుదేరి ఆమె పుట్టింటికి వెళతాడు. తన కోసం వచ్చిన భర్తతో బుద్దిమతి 'నాపై చూపే మమకారం శ్రీరామునిపై సగం చూపించినా నువ్వు ఈ సంసార సాగరాన్ని దాటగలవు' అని హితవు పలుకుతుంది. ఆమె మాటలతో జ్ఞానోదయం కలిగిన తులసీదాస్ ఇంటికి వచ్చి రామభక్తి సాగరంలో మునుగుతాడు. ఆ యాత్ర అనంతమైన, అవ్యాజమైన భక్తిగా మారి, ఆయన నోట రాముని కథను, మరెన్నో అద్భుతమైన రచనలను చేయిస్తుంది. అయోధ్య, వారణాసి పట్టణాల్లో జీవించి ఆయన 91 ఏళ్ల పూర్ణ జీవనం తరువాత ఆ రామునిలో 1623 సంవత్సరంలో ఐక్యమయ్యాడు. 

ఆయన చేసినవి ఎంత గొప్ప రచనలు? దాదాపు 500 ఏళ్ల తరువాత కూడా ప్రతి ఇంటా అయన రచన పారాయణం, గానం జరుగుతూనే ఉన్నాయి. అఖండ రామభక్తి జ్యోతి వెలుగుతూనే ఉంది.

రామభక్తుడిగా పేరు గాంచి, శివుని గురించి ఆయన ఈ గొప్ప అష్టకం ప్రాకృత భాషలో రచించారు.  నిర్గుణ పరబ్రహ్మమైన పరమాత్మను రామునిగా నుతించినా, శివునిగా కొలచినా ఒక్కటే అని చెప్పటానికి ఈ రచన ఇంకొక ఉదాహరణ. రామభక్తిలో మునిగిన తులసీదాసు, శివుని తత్త్వాన్ని ఎంత బాగా అనుభూతి పొందారో ఈ స్తోత్రం కళ్ళకు కట్టినట్టు వివరిస్తుంది. కాబట్టి దైవారాధనలో పరిధులు, ఒకటి చేస్తే ఇంకొకటి పనికి రాదు - ఇవన్నీ మనం సృష్టించుకున్న మిథ్యే. ఈ విశాల భిన్నత్వంలో ఏకత్వ భావనను మన జీవన విధానంలో అనుక్షణం ఆచరించి భారతీయ ఆధ్యాత్మిక సమాజాన్ని ఏకం చేద్దాం.
మనకు ఇట్టి ఆధ్యాత్మిక సంపదను ఇచ్చిన మహా భక్తుడు, కవి తులసీ దాసుకు సాష్టాంగ నమస్కారములు. 

తులసీదాస కృత రుద్రాష్టకం, తాత్పర్యం. శ్రవణం అనురాధా పోడ్వాల్ గళంలోగోస్వామి తులసీదాస కృత శ్రీరుద్రాష్టకమ్ 

నమామీశమీశాన నిర్వాణరూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపమ్ .
అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశమాకాశవాసం భజేఽహమ్ .. ౧..

నిరాకారమోంకారమూలం తురీయం గిరా జ్ఞాన గోతీతమీశం గిరీశమ్ .
కరాళం మహాకాల కాలం కృపాలం గుణాగార సంసారపారం నతోఽహమ్ .. ౨..

తుషారాద్రి సంకాశ గౌరం గభీరం మనోభూత కోటిప్రభా శ్రీ శరీరమ్ .
స్ఫురన్మౌళి కల్లోలినీ చారు గంగా లసద్ఫాలబాలేందు కంఠే భుజంగా .. ౩..

చలత్కుండలం భ్రూ సునేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాలమ్ .
మృగాధీశచర్మాంబరం రుండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి .. ౪..

ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం అజం భానుకోటిప్రకాశమ్ .
త్రయః శూల నిర్మూలనం శూలపాణిం భజేఽహం భవానీపతిం భావగమ్యమ్ .. ౫..

కలాతీత కల్యాణ కల్పాంతకారీ సదా సజ్జనానందదాతా పురారీ .
చిదానంద సందోహ మోహాపహారీ ప్రసీద ప్రసీద ప్రభో మన్మథారీ .. ౬..

న యావత్ ఉమానాథ పాదారవిందం భజంతీహ లోకే పరే వా నరాణామ్ .
న తావత్ సుఖం శాంతి సంతాపనాశం ప్రసీద ప్రభో సర్వభూతాధివాసమ్ .. ౭..

న జానామి యోగం జపం నైవ పూజాం నతోఽహం సదా సర్వదా శంభు తుభ్యమ్ .
జరా జన్మ దుఃఖౌఘ తాతప్యమానం ప్రభో పాహి ఆపన్నమామీశ శంభో .. ౮..

రుద్రాష్టకమిదం ప్రోక్తం విప్రేణ హరతోషయే .
యే పఠంతి నరా భక్త్యా తేషాం శంభుః ప్రసీదతి ..

ఇతి శ్రీగోస్వామితులసీదాసకృతం శ్రీరుద్రాష్టకం సంపూర్ణమ్ 

తాత్పర్యము: 

నిర్వాణ రూపమైన  ఈశాన మూర్తికి నమస్కారములు (శివుని పంచ ముఖ రుద్ర రూపములలో ఈశాన ముఖము ఒకటి).విభుడు (రక్షకుడు, శుభకరుడు, ప్రభువు అని అర్థం), సర్వ వ్యాపకుడు, పర బ్రహ్మం,  వేద స్వరూపుడు, సత్యమైన వాడు, గుణములు లేని వాడు, వికల్పము లేని వాడు, విశ్వ వ్యాపుడు, ఆకాశ రూపుడు, దివ్యాకాశంలో నివశించే వాడు అయిన శివుని భజిస్తున్నాను.

నిరాకారుడు (ఆకారము లేని వాడు), ఓంకారానికి మూలమైన వాడు, తురీయుడు (జాగ్రత్, సుషుప్త, స్వప్నావస్థలను దాటిన అత్యుత్తమమైన అవస్థ),  గిరిపై నివశించే వాడు, పర్వతములకు అధిపతి,  కరాళుడు (దుష్ట శిక్షణలో) , యముని పాలిటి మృత్యువు (మృత్యువుని జయించుటకు సాధనం అని అర్థం),  కృపాకరుడు,  గుణములకు అతీతమైన వాడు, సంసార వారధిని దాటించే వాడు అయిన పరమ శివునికి నమస్కారములు.

హిమాలయములు, శంఖము కంటే మిక్కిలి తెల్లని దేహకాంతి కలవాడు, గంభీరుడు, కోటి మన్మథుల మించిన దేహ సౌందర్యము కలవాడు, తన జటా ఝూటములో తరంగాలతో ఉప్పొంగే గంగను, నుదుట నెలవంక, మెడలో నాగరాజును ధరించిన పరమ శివునికి నా నమస్కారములు.

ఊగే కర్ణ కుండలములు ధరించిన వాడు, విశాలమైన మంచి నేత్రములు,  ప్రసన్నమైన ముఖము కలవాడు, నీలకంఠుడు, దయాళువు, మృగరాజు చర్మాన్ని ధరించిన వాడు, మెడలో కపాలమాల కలిగిన వాడు, అందరికి ప్రియుడు అయిన శంకరుని నేను భజిస్తున్నాను.

ప్రచండుడు(భీషణుడు, ప్రజ్వలించే వాడు), ఉత్కృష్టమైన వాడు, గంభీరమైన భాషణ చేసే వాడు* , సమర్థుడు, దివ్యమైన వాడు, అఖండుడు,జన్మ లేని వాడు, కోటి సూర్యుల ప్రకాశము కలవాడు, త్రిశూలముతో దుష్ట సంహారము చేసే వాడు, శూల పాణి, భవానీ పతి, భావ గమ్యమైన వాడు అయిన శంకరుని భజిస్తున్నాను.

కాలమునకు (మృత్యువుకు) అతీతమైన, కల్పాంతమున (ప్రళయ కాలమున) సమస్తమును నాశనము చేసే, సజ్జనులకు మంచి చేసే, త్రిపురారి, మోహమును నాశనము చేసి చిదానందమును ప్రసాదించే, మన్మథుని సంహరించిన ఓ పరమ శివా! నన్ను అనుగ్రహించుము.

నీ పద కమలముల మ్రొక్కి శరణు కోరే వరకు జనులకు ఈ లోకములో కానీ, పర లోకములో కానీ దుఖములనుండి విముక్తి కలిగి సుఖము, శాంతి కలుగదు. కావున, సర్వ భూతములలో నివసించే పరమశివా! నన్ను అనుగ్రహించుము, అనుగ్రహించుము.

ఓ శంభో! నాకు యోగము, జపము, పూజ తెలియవు. కానీ, ఎల్లప్పుడూ నీ భక్తుడను. నేను ముసలి తనము, జన్మ, మృత్యువు మొదలైన వాటిలో చిక్కుకొని యున్నాను. ప్రభో!  పాహి పాహి. శంభో! నన్ను ఈ ఆపత్తుల నుండి కాపాడుము.

శివుని ప్రీతికి బ్రాహ్మణుడైన తులసీదాసు చెప్పిన ఈ రుద్రాష్టకం భక్తితో పఠించిన జనులకు ఆ పరమశివుని అనుగ్రహం కలుగును.

* (ప్రగల్భం అనేది కొంత వ్యతిరేక భావన కలిపిస్తుంది కాబట్టి దానిలోని అంతరార్థమైన గాంభీర్యాన్ని అర్థంగా రాస్తున్నాను)

16, ఫిబ్రవరి 2011, బుధవారం

కమలాకుచచూచుక కుంకుమతో - శ్రీ వేంకటేశ్వర స్తోత్రము, తాత్పర్యము


నారాయణ సమారంభాం నాథయాముని మాధ్యమం 
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం

నారాయణునితో మొదలుకొని, ఆళ్వారులు, రామానుజులు మొదలైన వారి వరుసలో యున్న నా గురుదేవులకు, ఈ గురు పరంపరకు వందనములు.

తిరుమలేశునికి నిత్యము సుప్రభాత సమయాన పాడే వెంకటేశ్వర సుప్రభాతము, స్తోత్రము, ప్రపత్తిని  రచించింది మహా వైష్ణవ గురువులైన మనవాళ మాముని శిష్యులైన ప్రతివాది భయంకర అణ్ణన్గరాచార్యులు. మనవాళ మామునికి అష్టదిగ్గజములుగా పిలవబడిన ఎనిమిది మంది శిష్య శిఖామణులు. వారిలో అణ్ణన్ (అణ్ణన్గరాచార్యులు) ప్రముఖులు. వీరు 15వ శతాబ్దములో ప్రస్తుతపు తమిళనాట జీవించారు. శ్రీరంగం రంగనాథుని సేవలో ఆచార్యులతో పాటు తాను కూడా తరించారు. వైష్ణవ సంప్రదాయంలోని ప్రతి స్తోత్రంలో మనవాళమాముని ప్రస్తావన ఉంటుంది అంటే అందులో అతిశయోక్తి లేదు. ప్రతి వైష్ణవ దివ్య క్షేత్రంలో దివ్య ప్రబంధాల పారాయణం ముందు ఈ క్రింద శ్లోకం చదువుతారు.

శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం

- శ్రీశైలేశార్ గా పిలవబడిన ఆచార్యులు తిరువైమొళి పిళ్లై దయకు పాత్రుడైన, ధీమంతము, భక్తి మొదలగు సుగుణములకు నిలయమైన, రామానుజాచార్యులను ఎల్లప్పుడూ ధ్యానించే మనవాళ మామునికి వందనము.

ఆ విధముగా ప్రసిద్ధి చెందిన మనవాళ మాముని శిష్యాగ్రగణ్యుడు అయిన ప్రతివాది భయంకర అణ్ణన్గరాచార్యులు మనకు దివ్యమైన, శ్రావ్యమైన,  వెంకటేశ్వర సాహితీ సంపదను ఇచ్చారు. ఆ ఆచార్యులకు శత సహస్ర వందనములు సమర్పించుకుంటూ, శ్రీ వేంకటేశ్వర స్తోత్రము, తాత్పర్యము. శ్రవణం సుస్వరలక్ష్మి సుబ్బులక్ష్మి గారిగళంలో .

అద్భుతమైన ప్రాస, పద ప్రయోగము, సర్వస్య శరణాగతి, భక్తి, ప్రపత్తి  ఈ స్తోత్రం లక్షణాలు. ప్రతి దినము వైష్ణవ ఆలయాలలో మార్మోగే ఈ స్తోత్రము మనకు భక్తిని, ముక్తిని ప్రసాదించు గాక.కమలాకుచచూచుక కుంకుమతో నియతారుణితాతులనీలతనో |
కమలాయతలోచన లోకపతే విజయీ భవ వేంకటశైలపతే || ౧||

సచతుర్ముఖషణ్ముఖపంచముఖప్రముఖాఖిలదైవతమౌలిమణే |
శరణాగతవత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే || ౨||

అతివేలతయా తవ దుర్విషహై రనువేలకృతైరపరాధశతై|
భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే || ౩||

అధివేంకటశైలముదారమతేజనతాభిమతాధికదానరతాత్ |
పరదేవతయా గదితాన్నిగమైః కమలాదయితాన్న పరం కలయే || ౪||

కలవేణురవావశగోపవధూ శతకోటివృతాత్స్మరకోటిసమాత్ |
ప్రతిపల్లవికాభిమతాత్సుఖదాత్ వసుదేవసుతాన్న పరం కలయే || ౫||

అభిరామగుణాకర దాశరథే జగదేకధనుర్ధర ధీరమతే |
రఘునాయక రామ రమేశ విభో వరదో భవ దేవ దయాజలధే || ౬||

అవనీతనయాకమనీయకరం రజనీకరచారుముఖాంబురుహమ్ |
రజనీచరరాజతమోమిహిరం మహనీయమహం రఘురామమయే || ౭||

సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుకాయమమోఘశరమ్ |
అపహాయ రఘూద్వహమన్యమహం న కథంచన కంచన జాతు భజే || ౮||

వినా వేంకటేశం న నాథో న నాథః సదా వేంకటేశం స్మరామి స్మరామి |
హరే వేంకటేశ !ప్రసీద ప్రసీద ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ || ౯||

అహం దూరతస్తే పదాంభోజయుగ్మప్రణామేచ్ఛయాఽఽగత్య సేవాం కరోమి |
సకృత్సేవయా నిత్యసేవాఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వేంకటేశ || ౧౦||

అజ్ఞానినా మయా దోషానశేషాన్ విహితాన్ హరే |
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైలశిఖామణే || ౧౧||

తాత్పర్యము:

లక్ష్మీదేవి స్తన్యముల కుంకుమ వలన ఎరుపెక్కిన శరీరము కల నీలమేఘ శ్యాముడు, కమలముల వంటి కన్నులు కలవాడు, లోకపతి అయిన వేంకటాచల పతికి విజయము కలుగు గాక.

బ్రహ్మ, మహేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు మొదలైన దేవతలలో శిరోమణి యైన, శరణు కోరిన వారి పాలిటి వాత్సల్య సారమునకు నిధి వంటి వృష శైలపతి అయిన వేంకటేశా! నన్ను కాపాడుము.

ఓ వృషాద్రి పతీ! శ్రీ హరీ! అనేక పాపములు, తప్పులు చేసినందుకు చింతించుచు, శరీరము వణుకుచు, నీ శరణు కోరుటకు నీ వద్దకు వేగముగా వచ్చితిని. నీ అపారమైన కృపను నాపై కురిపించుము.

ఓ లక్ష్మీ పతీ! స్వతహాగా కరుణా సాగరుడవై వేంకటాచలముపై యున్నావు , కోరిన వారికి అడిగిన దానికన్నా ఎక్కువగా ఇచ్చెడి వాడవు, దేవతలచే పూజించ బడిన వాడవు, వేదములకు సారము, గతి యైన నిన్ను మించిన  దైవము లేదు.

వేణు రవముతో గోపికలను సమ్మోహనం చేసే, శత కోటి తపస్సులను, అనేక కోట్ల ఇతర దేవతల కొలువును మించి ప్రతి ఒక్క గోపిక అభిమతము నెరవేర్చి వారికి సుఖమునిచ్చిన వసుదేవ తనయుడవైన నీకు సమానమైనది ఏదియును లేదు.

సకల గుణాభిరాముడు, దశరథ తనయుడు, జగత్తులో కెల్లా ఉత్తముడైన ధనుర్ధారి, ధీరుడు, రఘు వంశములో జన్మించిన, రమాపతి యైన ఓ రామా! దయా జలధీ! నాకు వరములిమ్ము.

సీతాదేవి చెట్టపట్టిన అందమైన చేతులు కల, చంద్రుని వలె, కలువ వలె అందమైన ముఖము కల, నిశీధిలో రాజు వలె సంచరించి సూర్యుని వలె అంధకారాన్ని నాశనము చేసే ఓ రఘు రామా! నీ శరణు కోరుతున్నాను.

ఓ ప్రభూ! నీవు సోదరులతో అలరుతూ, అమోఘమైన శరములతో, ప్రసన్నమైన ముఖము కల వాడవు, సుహ్రుదయుడవు, భక్త సులభుడవు, సుఖమునిచ్చే వాడవు. ఓ రఘు వంశోత్తమా! కావున నిన్ను విడచి, ఒక్కసారి,  ఒక్క క్షణము కూడా నేను వేరేవ్వరినీ ప్రార్థించను.

వేంకటేశుడు తప్ప నాకెవ్వరు నాథుడు లేడు, నాథుడు లేడు. నేను ఎల్లప్పుడూ వేంకటేశునే స్మరింతును, స్మరింతును. కావున ఓ వేంకటేశా! హరీ! నాపై దయ చూపి నీకు తగినది, ప్రియమైనదే నాకు ప్రసాదించుము, ప్రసాదించుము.

ఓ వేంకటేశా! నీ పాద పద్మముల సేవకై ఎంతో దూరమునుండి నేను వచ్చితిని. కావున ఓ ప్రభూ! నీ సేవ చేసుకునే భాగ్యమును నాకు ప్రసాదించుము, ప్రసాదించుము.

ఓ శేష శైల శిఖామణీ! నేను అజ్ఞానముతో, నిస్సహాయతతో చేసిన అశేషమైన దోషములను హరించి, నన్ను క్షమించుము, క్షమించుము. 

15, ఫిబ్రవరి 2011, మంగళవారం

శంకర విరచిత భవాన్యష్టకం, తాత్పర్యము

సర్వోన్నతమైన వైరాగ్యము, శరణాగతిలో ఆది శంకరుల స్తోత్రాలను మించినవి లేవు. ఇది లోక విదితం. శక్తి పీఠాలు అనగానే శంకరులు మనకు ఇచ్చిన మహా ఆధ్యాత్మిక వారసత్వ సంపద,  ఎందరో యోగుల, యోగినుల, సాధువుల, భక్తులకు ఆలవాలమైన దేవాలయాలు, ముక్తి స్థానములు గుర్తుకు వస్తాయి. ప్రధానమైన మహా అష్టాదశ శక్తి పీతాలలో - లంకలో శాంకరి, కంచిలో కామాక్షి, ప్రద్యుమ్నంలో శృంఖల, మైసూర్ లో చాముండేశ్వరి, అలంపురంలో జోగుళాంబ, శ్రీశైలంలో భ్రమరాంబ, కొల్హాపూర్లో మహాలక్ష్మి, నాందేడ్ లో ఏకవీర, ఉజ్జయినిలో మహాకాళి, పిఠాపురంలో  పురుహూతిక, జాజ్పూర్ లో విరజ, ద్రాక్షారామంలో మాణిక్యాంబిక, గౌహతిలో కామరూప, ప్రయాగలో మాధవేశ్వరి, జ్వాలాలో వైష్ణవి, గయలో సర్వమంగళ, వారణాసిలో విశాలాక్షి, దంతేవాడలో దంతేశ్వరి, కాశ్మీరంలో సరస్వతి -  ఈ క్షేత్రాలలో సతీదేవి యొక్క వివిధ దేహ భాగాలను ఆయా రూపాలలో కొలుస్తున్నాము.

ఇక భవానీ రూపానికి వస్తే, మన దేశంలో సుప్రసిద్ధ శక్తి పీఠం తుల్జాపూర్ భవాని క్షేత్రం. శివాజీ మహారాజు సంతతము కొలిచిన మాత ఈ భవాని. స్వయంభు ఐన భవాని విగ్రహం ఇక్కడ అష్ట భుజములతో సింహాసన స్థితయై యున్నదట. శివాజీకి మాత ప్రత్యక్షమై అతనికి భవాని ఖడ్గము ప్రసాదిన్చిందిట. దానితో ఆ ఛత్రపతి అరివీర భయంకరుడై విజయాలు సాధించాడుట.

తుల్జాపూర్ భవాని

ఆది శంకరులు ఈ స్తుతి ద్వారా ఆ జగన్మాత పట్ల తన సర్వస్య శరణాగతిని, పరిపూర్ణ ఆధ్యాత్మిక వికాసాన్ని, ఔన్నత్యాన్ని మరో మారు ప్రస్ఫుటంగా ప్రకటించారు.సామాన్య మానవుని లక్షణాలను అద్భుతంగా వర్ణిస్తూ, వాటిని తనకు ఆపాదించుకుంటూ, అజ్ఞానమనే అంధకారములో, సంసార సాగరములో మునిగి తేలుతున్న, సర్వ అవలక్షనములతో కొట్టుమిట్టాడుతున్న తనను కాపాడుమని, మాతయే శరణాగతి యని ఈ స్తోత్రము ద్వారా వేడుకుంటున్నారు శంకరులు.

ఆది శంకర విరచిత భక్తి సుగంధం - భవాన్యష్టకం, తాత్పర్యము. శ్రవణం.

న తాతో న మాతా న బన్ధుర్న దాతా న పుత్రో న పుత్రీ న భృత్యో న భర్తా
న జాయా న విద్యా న వృత్తిర్మమైవ గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని  ౧

భవాబ్ధావపారే మహాదుఃఖభీరు పపాత ప్రకామీ ప్రలోభీ ప్రమత్తః
కుసంసారపాశప్రబద్ధః సదాహం  గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని  ౨

న జానామి దానం న చ ధ్యానయోగం న జానామి తంత్రం న చ స్తోత్రమంత్రమ్
న జానామి పూజాం న చ న్యాసయోగం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని  ౩

న జానామి పుణ్యం న జానామి తీర్థం న జానామి ముక్తిం లయం వా కదాచిత్
న జానామి భక్తిం వ్రతం వాపి మాతః గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని  ౪

కుకర్మీ కుసంగీ కుబుద్ధిః కుదాసః కులాచారహీనః కదాచారలీనః
కుదృష్టిః కువాక్యప్రబంధః సదాహం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని  ౫

ప్రజేశం రమేశం మహేశం సురేశం దినేశం నిశీథేశ్వరం వా కదాచిత్
న జానామి చాన్యత్ సదాహం శరణ్యే గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని  ౬

వివాదే విషాదే ప్రమాదే ప్రవాసే జలే చానలే పర్వతే శత్రుమధ్యే
అరణ్యే శరణ్యే సదా మాం ప్రపాహి గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని  ౭

అనాథో దరిద్రో జరారోగయుక్తో మహాక్షీణదీనః సదా జాడ్యవక్త్రః
విపత్తౌ ప్రవిష్టః ప్రనష్టః సదాహం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని  ౮

 ఇతి శ్రీమదాదిశంకరాచార్య విరచితా భవాన్యష్టకం సంపూర్ణం


శంకరులచే నుతించబడిన జగన్మాత

తాత్పర్యము: 

తల్లి తండ్రులు, బంధువులు, స్నేహితులు, సంతానము, సేవకులు, భర్త, భార్య, విద్య, వృత్తి - ఇవేవి నాకు గతి కాదు. ఓ భవానీ! నీవే నాకు ఏకైక గతి.

నేను జనన మరణమనే సంసార సాగరములో యున్నాను. పిరికి వాడనై దుఃఖమును ఎదుర్కొన లేకున్నాను. పాపము, ప్రలోభముతో నిండి యున్నాను. కామము, మోహములతో కూడిన కుసంసార పాశములో బద్ధుడనై యున్నాను. ఓ భవానీ! నీవే నాకు ఏకైక గతి.

నాకు దానము చేయుట తెలియదు, ధ్యానము తెలియదు.  నాకు తంత్రము, మంత్రము, స్తోత్రం, పూజ, న్యాసము (దేహములోని వివధ భాగములను చేతుల ముద్రలతో తాకి శుద్ధి చేసుకొనుట), యోగము తెలియవు.  ఓ భవానీ! నీవే నాకు ఏకైక గతి.

నాకు పుణ్యము, తీర్థములు తెలియవు. నాకు ముక్తి ఏమిటో తెలియదు, నీ యందు ఏకాగ్రముగా చిత్తమును ఉంచుట తెలియదు. నాకు భక్తి తెలియదు, వ్రతములు, దీక్షలు తెలియవు. ఓ భవానీ! నీవే నాకు ఏకైక గతి.

నేను చెడు కర్మలను చేస్తూ, దుష్టుల సాంగత్యములో ఉన్నాను. నేను దుష్ట బుద్ధి, చెడు ఆలోచనలు కలవాడను. నేను చెడు ఆచారములు కలవాడను, చెడ్డ ప్రభువుల సేవలో ఉన్నాను, చెడ్డ కులములో ఉన్నాను. నేను చెడు ఆలోచనలలో మునుగుతూ చెడ్డ దృష్టి కలవాడను, చెడు వాక్యములను వ్రాసెడి వాడను. ఓ భవానీ! నీవే నాకు ఏకైక గతి.

నేను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రులు ఎవరో తెలియని అజ్ఞానమున ఉన్నాను. నాకు వేరే దేవతలు ఎవరూ తెలియదు. నేను ఎల్లప్పుడూ శరణు కోరే ఓ భవానీ! నీవే నాకు ఏకైక గతి.

నేను వివాదములలో, విషాదములో, ప్రమాదములో, ప్రయాణములో, నీటి యందు, అగ్ని యందు, పర్వతముపై, శత్రువుల మధ్య చిక్కుకొని, అరణ్యంలో యున్నప్పుడు పాహి కోరే ఓ భవానీ! నీవే నాకు ఏకైక గతి.

నేను అనాథగా, దారిద్ర్యములో, ముసలితనము వలన కలిగే రోగములతో పీడిన్చబడుతూ, క్షీణించి, దీనుడనై, సమస్యలలో చిక్కుకుని, విపత్కర పరిస్థితులలో యున్నప్పుడు శరణు కోరే ఓ భవానీ! నీవే నాకు ఏకైక గతి. 

14, ఫిబ్రవరి 2011, సోమవారం

సుబ్రహ్మణ్య తత్త్వము, సుబ్రహ్మణ్యాష్టకం, తాత్పర్యము

|| ఓం శరవణ భవ ||

పత్నీ సమేత శిఖి వాహన షణ్ముఖుడు

దక్షిణాదిన, ముఖ్యంగా, శివారాధన ప్రాబల్యంగా ఉన్న తమిళ నాట సుబ్రహ్మణ్య స్వామి ఒక ప్రధాన ఆరాధ్య దైవం. ఆరు పడి అని  ఆరు పుణ్య క్షేత్రాలైన పళని, స్వామి మలై, తిరుచ్చెందూర్, త్రిపురకుంద్రం, పళముదిర్ చోలై, తిరుత్తణి క్షేత్రాలు మహా సుబ్రహ్మణ్య క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. పిల్లలు పుట్టని వారికి, నాగ దోషమున్న వారికి, కుజ దోషమున్న వారికి ఈ క్షేత్రాలు గొప్ప ఫలితాలు ఇస్తాయని గట్టి నమ్మకం. అలాగే, కర్ణాటకలోని కుక్కే లో  సుబ్రహ్మణ్యస్వామి క్షేత్ర కూడా అత్యంత మహిమాన్వితమైనదిగా చెప్పబడింది. ఈ క్షేత్రాలలో ఈ స్వామి సౌందర్యము, భోగము చెప్పనలవి కాదు. గుళ్ళ సంగతి పక్కకు పెట్టి, సుబ్రహ్మణ్య తత్త్వము గురించి కొంచెం చెప్పుకుందాం.

అవిద్య మరియు జ్ఞానము, దేవతలు మరియు అసురుల మధ్య జరిగే నిరంతర యుద్ధము, వాటి పరిణామమైన దైవిక శక్తుల విజయం - ఇదే సుబ్రహ్మణ్యుని లీలల సారము. స్కందుని జననం గురించి శ్రీమద్రామాయణం లో వాల్మీకి మహర్షి వివరంగా చెప్పారు. శివుని తేజస్సు (వీర్య రూపంలో) ఆయన ఆజ్ఞా చక్రమునుండి పెల్లుబుకి స్కందుని రూపము పొందినదట. అందుకనే స్కందుడు జ్ఞాన జ్యోతిగా ప్రతీక. శరవణమను సరస్సులో రెల్లు గడ్డి పెరిగే చోటనున్న ఆరు కమలముల నుండి పార్వతీ దేవి ఈ స్కందుని తీసుకున్నదట. సర్వోన్నత ఆధ్యాత్మిక అనుభూతి (అపరోక్షానుభూతి) అనేది యోగములో షడ్చక్రముల భేదన ద్వారా  కలుగుతుంది. ఈ ఆరు చక్రముల భేదన ద్వారా జీవ శక్తి సహస్రార చక్రమున పూర్ణ యొక స్థితిని అనుభూతి పొందుతుంది. దీనికి సంకేతమైన ఆరు కమలములనుండి ఆవిర్భవించిన స్కందుడు సర్వోన్నత జ్ఞానమునకు, బుద్ధికి ప్రతీకగా నిలిచాడు. అందుకనే స్కందుడు అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించే( ఈ ప్రపంచములో అజ్ఞాన రూపమైన అసురులను సంహరించే దైవిక శక్తి) పరిపూర్ణ జ్ఞాన స్వరూపముగా కొలవబడుతున్నాడు.

శ్రీ వల్లీ దేవసేనా పతి

స్కందుని జననము, వృత్తాంతము:

కుమార, కార్తికేయ, సుబ్రహ్మణ్య, షణ్ముఖ మొదలైన నామములతో పిలవబడే స్కందుడు పరమశివుని రెండవ పుత్రుడు. కోడి పుంజు (కుక్కుటం) ఇతని ధ్వజము, నెమలి ఇతని వాహనము. ఈయన శక్తులు (పత్నులు) వల్లి మరియు దేవసేన.  తన తపస్సు చేయుచుండగా భంగము చేయ వచ్చిన మన్మథుని శివుడు తన మూడో నేత్రముతో దగ్ధము చేస్తాడు. ఆ అగ్నిని అగ్నిదేవుడు, వాయుదేవుడు ఆకాశ మార్గమున గంగానదిలో పడవేస్తారు. దాని తేజోశక్తిని భరించలేక గంగాదేవి దానిని ఒడ్డున ఉన్న రెల్లుగడ్డిలోకి నెడుతుంది. ఆ విధముగా పంచ భూతముల శక్తితో శివుని దివ్య తేజము ఏకమై ఆరు ముఖములు గల స్కందునిగా జన్మిస్తాడు. జ్ఞాన రూపమైన శివుని మూడో నేత్రమునుండి జన్మించిన వాడు కాబట్టి కార్తికేయుడు జ్ఞానావతారునిగా పేరు పొందాడు. ఇతని ఆయుధము శూలము. కేవలము స్కందుడు మాత్రమే అసురులైన శూరపద్ముడు, సింహముఖుడు, తారకుడు సంహరించగలడని బ్రహ్మ తనను వేడుకో వచ్చిన దేవతలకు తెలుపుతాడు. అప్పుడు స్కందుడు దేవతల సేనకు అధిపతి అవుతాడు. అప్పటినుంచి అతను సేనాపతిగా కూడా పిలవబడ్డాడు. స్కందుడు అసురులను జయించే వృత్తాంతాన్ని స్కాందపురాణంలో వివరించ బడింది. ఈ అసురులను జయించే రోజునే స్కంద షష్టిగా పూజించబడుతున్నది.

ఈ సుబ్రహ్మణ్య లక్షణాలు అన్నీ సంపుటంగా ఈ ధ్యాన శ్లోకంలో వివరించ బడ్డాయి.

శ్రీ గాంగేయం వహ్నిగర్భం శరవణ జనితం జ్ఞానశక్తిం కుమారం 
బ్రహ్మణ్యం స్కందదేవం గుహమమల గుణం రుద్ర తేజస్వరూపం
సేనాన్యం తారకఘ్నం గురుమచలమతిం కార్తికేయం షడాన్యం
సుబ్రహ్మణ్యం మయూరధ్వజ రథ సహితం దేవదేవం నమామి

గంగాదేవి  శివుని శక్తిని కొంత సేపు మోసి, శక్తిని భరించ లేక రెల్లు గడ్డిలోకి త్రోయటంవలన గాంగేయుడు అని, అగ్ని శివుని శక్తిని తన వద్ద ఉంచుకొని గంగలో విడుచుట వలన అగ్నిగర్భుడని, జ్ఞాన శక్తి పరబ్రహ్మమని, గుహుడని, అమలమైన గుణము కలవాడని, రుద్రుని తేజస్స్వరూపమని, దేవతల సేనాపతియని, తారకాసురిని చంపిన వాడని, జ్ఞానానికి నిధియై గురు స్వరూపమని, అచలమైన బుద్ధి కలవాడని, రెల్లు గడ్డి నందు పుట్టినందు వలన శరవణ భవుడని, ఆరుముఖములు ఉండుట వలన షడాననుడు అని, నెమలిని అధిరోహించినందు వలన మయూర ధ్వజుడని, రథముని అధిరోహించిన వాడు అని ఈ ధ్యాన శ్లోకము ద్వారా ప్రార్ధించ బడినాడు.

ఆ సుబ్రహ్మణ్యుని అష్టకం, తాత్పర్యము, శ్రవణం 2. దీనినే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రంగా కూడా పిలుస్తారు.

పళని మురుగన్ 

హే స్వామినాథ కరుణాకర దీనబంధో
శ్రీ పార్వతీ సుముఖ పంకజపద్మబంధో
శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. ౧

దేవాధిదేవనుత దేవగణాధినాథ
దేవేంద్రవంద్య మృదుపంకజ మంజుపాద
దేవర్షి నారద మునీంద్ర సుగీతకీర్తే
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. ౨

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్
తస్మాత్ర్పదాన పరిపూరిత భక్తకామ
శ్రుత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. ౩

క్రౌంచామరేంద్ర మదఖండన శక్తిశూల
పాశాదిశస్త్ర పరిమండితదివ్యపాణే
శ్రీ కుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. ౪

దేవాధిదేవ రథమండల మధ్యవేద్య
దేవేంద్ర పీఠ నగరం దృఢ చాపహస్తం
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. ౫

హారాదిరత్న మణియుక్తత కిరీటహార
కేయూరకుండల లసత్కవచాభిరామ
హే వీర తారకజయామరబృందవంద్య
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. ౬

పంచాక్షరాది మనుమంత్రితగాంగతోయైః
పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. ౭

శ్రీకార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా
కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తమ్
సిక్త్వా తు మా మవ కళాధరకాంతకంత్యా
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. ౮
సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్యప్రసాదతః.
సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాతరుత్థాయ యః పఠేత్
కోటిజన్మకృతం పాపం తత్క్షణా దేవ నశ్యతి. ౯

ఇతి సుబ్రహ్మణ్యాష్టకమ్

తిరుచ్చెందూర్ సుబ్రహ్మణ్య స్వామి

తాత్పర్యము:

హే స్వామినాథ! (స్వామిమలై కొండలపై ఉన్న వాడు స్వామినాథుడు) ! కరుణాకరా! దీనబంధో! కలువ వంటి ముఖము కల పార్వతీ దేవి కుమారా! విష్ణువు మొదలగు దేవతలచే పూజించబడిన పద్మముల వంటి పాదములు కలవాడా! వల్లీ నాయకా! నాకు నీ చేతి సహాయమునిమ్ము (నన్ను కాపాడుము).

దేవాది దేవుడైన శివునిచే నుతించ బడినవాడా! దేవ గణములకు అధిపతీ! దేవేన్ద్రునిచే పూజించబడిన కలువలవంటి పాదములు కలవాడా! , దేవర్షి యైన నారదుడు మొదలైన మునులుచే గానము చేయబడి, నుతించబడిన కీర్తి కలవాడా! వల్లీ నాయకా! నాకు నీ చేతి సహాయమునిమ్ము (నన్ను కాపాడుము).

ప్రతిదినము అన్నమునిచ్చే వాడా! అన్ని రోగములను హరించే వాడా! భక్తులు కోరిన కోరికలన్నీ తీర్చీ వాడా! వేదములలో చెప్పబడిన ప్రణవమునకు  నిజ రూపుడా! వల్లీ నాయకా! నాకు నీ చేతి సహాయమునిమ్ము (నన్ను కాపాడుము).

క్రౌంచము, రాక్షసుల, దేవేంద్రుని గర్వమును అణచిన వాడా! శక్తి శూలము, పాశము మొదలగు శస్త్రములు శోభతో చేతులయందు కలవాడా! కుండలములు ధరించి, అందమైన మెడ కల నెమలిని అధిరోహించిన వల్లీ నాయకా! నాకు నీ చేతి సహాయమునిమ్ము  (నన్ను కాపాడుము).

దేవాది దేవా! రథమండలము మధ్యలో యున్న వాడా! దేవేంద్రుని నగరాన్ని కాపాడిన వాడా! హస్తములతో వేగముగా బాణములు వేయగలవాడా! అసురుడైన శూరుని చంపి దేవతలచే పొగడబడిన వల్లీ నాయకా! నాకు నీ చేతి సహాయమునిమ్ము (నన్ను కాపాడుము). 

హారములు, మణులతో పొదగబడిన కిరీటమును ధరించిన వాడా! కేయూరములు, కుండలములు, కవచము ధరించి అందముగా యున్న వాడా! వీరుడా! తారకుని జయించి దేవతల బృందముచే మ్రొక్క బడిన వాడా!  వల్లీ నాయకా! నాకు నీ చేతి సహాయమునిమ్ము (నన్ను కాపాడుము). 

పంచాక్షర జపముతో, గంగా నదీ స్నానముతో, పంచామృత స్నానముతో దేవతలు, మునులు కొనియాడి కొలుచు చుండగా 
దేవేంద్రునిచే సేనాపతిగా అభిషిక్తుడవైన  వల్లీ నాయకా! నాకు నీ చేతి సహాయమునిమ్ము (నన్ను కాపాడుము). 

 కరుణతో నిండిన పూర్ణమైన చూపులతో కామము, రోగము నాశనము చేసి, కలుషితమైన మనస్సును శుభ్రపరిచే ఓ కార్తికేయ! సకల కళలకు నిధీ! శివుని తేజస్సుతో వెలిగే వల్లీ నాయకా! నాకు నీ చేతి సహాయమునిమ్ము (నన్ను కాపాడుము). 

ఈ  సుబ్రహ్మణ్యాష్టకం పఠించే బ్రాహ్మణులకు ఆ స్వామి ముక్తి ప్రసాదించును. ఉదయముననే ఈ అష్టకము పఠించే వారికి కోటి జన్మలలో చేసిన పాపములు ఒక్క క్షణములో నశించును. 

11, ఫిబ్రవరి 2011, శుక్రవారం

రథ సప్తమి - ఆదిత్యహృదయం - తాత్పర్యము

రథ సప్తమి సందర్భంగా ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుని ఆదిత్య హృదయ స్తోత్రము మీకోసం.

కార్య సాధనకు, శత్రుంజయమునకు, సర్వ రోగ నివారణకు కొన్ని యుగాలుగా పఠించబడుతున్న మహిమాన్విత స్తోత్రం ఆదిత్య హృదయం. ఈ స్తోత్రం వాల్మీకి రామాయణం యుద్ధ కాండలో 107 వ సర్గలో అగస్త్యుని నోట రామునికి చెప్పబడింది. రామావతారంలో ఆయన మానవునిగా జన్మ ఎత్తి, ఆ జీవితాన్ని గడుపుతూ, అందులో ఉండే బాధలను అనుభవిస్తూ, అధిగమిస్తూ, ధర్మ పరిపాలన చేస్తూ - వీటిలో భాగంగో ఎందరో మహర్షుల ద్వారా ఉపదేశములు, ఆశేర్వాదములు, సమస్యా పరిష్కరణలు పొందాడు. తానెప్పుడూ దైవ స్వరూపమని చెప్పలేదు, ఆ మహిమలు ప్రదర్శించ లేదు. అందుకనే, రామాయణంలోని ప్రతి అంశము మనకు ఒక దిశానిర్దేశము చేసే సందేశము కలిగి యుంటాయి.

సూర్య ప్రభ వాహనుడైన తిరుమలేశుడు


అటువంటి ఉపదేశాలలో శ్రేష్ఠమైనది యోగవాశిష్ఠం. రాముడు వశిష్ఠుని అడిగిన ప్రశ్నలకు ఆ మహర్షి ఇచ్చిన సమాధానాలు యోగముగా ప్రశస్తి చెందింది. పరబ్రహ్మమే తానైన శ్రీహరి అవతారుడైన రామునికి యోగవాశిష్ఠం ఏల?  రాముడంటే సచ్చిదానంద పరబ్రహ్మ తత్త్వము, ఇంద్రియాలకు అందని శుద్ధ చైతన్య స్వరూపమని స్వయంగా సీతాదేవి చెప్పింది. అయినా, రామాయణంలో విశ్వామిత్రుడు, భరద్వాజుడు, జాబాలి, గౌతముడు, వశిష్ఠుడు, శతానందుడు, అత్రి మొదలైన మహర్షుల నోట రామునికి ధర్మాన్ని, దైవ బలాన్ని వినిపించారు వాల్మీకి మహర్షి. ఇవి కేవలం మానవ జాతి మనుగడ కోసం, విజ్ఞానం కోసం. ఇటువంటి సంభాషణలు సామాన్య మానవునిలో కలిగే మానసిక మార్పులు, ప్రతిక్రియలు మొదలైన బాహ్యానికి సంబంధించిన విషయాలను ఎలా ఎదుర్కోవాలి, అధిగమించాలి అనే వాటి కోసం. అందుకనే రామాయణం మనకు జీవన శైలిని, ధర్మాన్ని, గమ్యాన్ని, చివరకు మోక్ష మార్గాన్ని చూపించే మహాకావ్యం.

సప్తాశ్వరథమారూఢం

ఆదిత్య హృదయానికి వేదిక రామ రావణ యుద్ధ ఘట్టము. రావణుడు మహా శక్తి బల మంత్ర సంపన్నుడు. కేవలం స్త్రీలోలత్వమనే దుర్గుణము వీటన్నిటినీ మాయలా కప్పివేసి పెడదారి పట్టిస్తుంది. మరి రాముడో? రామో విగ్రహవాన్ ధర్మః . ధర్మానికి మూర్తి రాముడు. ఇంతటి యోధులు యుద్ధంలో ఒకరికొకరు ఎదురుగా నిలిచి పోరు సల్పితే? . ఇక్కడ యుద్ధం ధర్మం అధర్మం మధ్య. ఈ పరిస్థితి మనకు ప్రతిరోజూ మన మనసులో, కుటుంబంలో, సమాజంలో ఎదురవుతూనే ఉంటుంది. మరి అటువంటి క్లిష్టమైన సమయంలో మనం ఏ విధంగా స్పందిస్తాము? చింత, క్రోధము లేదా పరాక్రమము మొదలైన మార్పులను మనం బాహ్యంగా ప్రదర్శిస్తాము. అదే మానవ స్పందనను రాముడు ఒక రోజు యుద్ధము ముగిసిన పిమ్మట ప్రదర్శిస్తాడు. కొంత అలసట, ప్రత్యర్ధిని ఎలా ఓడించాలన్న చింత రామునిలో చూసి అగస్త్యుడు ఈ ఆదిత్య హృదయాన్ని ఆయనకు చెప్పినట్టు వాల్మీకి ఉవాచ.

జగద్గురువు ఆది శంకరుల వారు మన దేశంలో ఆ సమయంలో ఉన్న ఐదు ప్రధాన దేవతారాధనలు, వాటిని అనుకరించే వివిధ ఉపమతాలవారిని ఒకే తాటిపైకి తీసుకురావటానికి పంచాయతన విధానాన్ని రూపకల్పన చేశారు. విష్ణు, శివ, శక్తి, సౌర, గణపతి - ఈ ఐదు దేవతారాధనలను ప్రతి ఆరాధనా ప్రదేశంలో జరిగేల ఏర్పాటు చేశారు. దీని అంతరార్థం ఏమిటి? ఈ దేవతలు వారి వారి ప్రత్యేకమైన శక్తులు కలిగినా అందరు ఒకటే - భిన్నత్వంలో ఏకత్వము - అదే సచ్చిదానంద పరబ్రహ్మము. కాబట్టి, ఆ యుద్ధ సమయంలో నిత్య ప్రకాశకుడు అయిన సూర్య భగవానుని స్తుతించమని అగస్త్య ముఖంగా రామునికి చెప్పబడినది. ఈ కాల-విశ్వ చక్రమనే మాయలో ఉన్న పగలు రాత్రి వలన మనకు సూర్యుని ఉదయం, అస్తమయము కనిపించినా, ఈ భూమండలము దాటితే, ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడే కదా? అదే విధంగా మనలోని అరిషడ్వర్గములను దాటి, దేహమును తాత్కాలికమని,  ఆత్మ నిత్యమని చూడగలిగితే మనమే సచ్చిదానందం, పరబ్రహ్మము. అటువంటి స్థితిని చేరటానికి ఈ ఆదిత్య హృదయము మనకున్న ఒక సాధనము.

ఆదిత్య హృదయ స్తోత్రము, తాత్పర్యము. శ్రవణం శుభా ముద్గల్ మరియు బృందం గళంలో. యూట్యూబ్ లో చాలా మంది పాడినవి ఉన్నాయి.

తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితం
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం  ౧
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం
ఉపాగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవానృషిః  ౨

రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం
యేన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి  ౩

ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం
జయావహం జపేన్నిత్యమక్షయం పరమం శివం  ౪

సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం
చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం  ౫

రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతం
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం  ౬

సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః
ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః  ౭

ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః  ౮

పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః
వాయుర్వహ్నిః ప్రజాప్రాణ ఋతుకర్తా ప్రభాకరః  ౯

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్
సువర్ణసదృశో భానుర్హిరణ్యరేతా దివాకరః  ౧౦

హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్
తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తాండాంఽశుమాన్ ౧౧

హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః
అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః  ౧౨

వ్యోమనాథస్తమోభేదీ ఋగ్యజుఃసామపారగః
ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీథీ ప్లవంగమః  ౧౩

ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః
కవిర్విశ్వో మహాతేజాః రక్తః సర్వభవోధ్భవః  ౧౪

నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావనః
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోఽస్తు తే  ౧౫

నమః పూర్వాయ గిరయే పశ్చిమో గిరయే నమః
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః  ౧౬

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః  ౧౭

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః  ౧౮

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః  ౧౯

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః  ౨౦

తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే 
నమస్తమోఽభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే  ౨౧

నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః  ౨౨

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః
ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం  ౨౩

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః  ౨౪

     ఫల శ్రుతిః
ఏనమాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ
కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవ  ౨౫

పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం
ఏతత్త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి  ౨౬

అస్మిన్క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
ఏవముక్త్వా తదాఽగస్త్యో జగామ చ యథాగతం  ౨౭

ఏతచ్ఛ్రుత్వా మహాతేజా నష్టశోకోఽభవత్తదా
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్  ౨౮

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్  ౨౯

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్  ౩౦

అథ రవిరవదన్నిరీక్ష్య రామం
     ముదితమనాః పరమం ప్రహృష్యమాణః
నిశిచరపతిసంక్షయం విదిత్వా
     సురగణమధ్యగతో వచస్త్వరేతి  ౩౧

జీవరాశిని ఉత్తేజపరచే సూర్యోదయం

తాత్పర్యము: 

ఆనాటి యుద్ధానంతరము అలసి విశ్రాంతిలో ఉన్న రాముడు మరల రావణుని పై యుద్ధము గురించి ఆలోచనలు కలిగి చింతలో యుండగా,  ఇతర దేవతలతో కలసి యుద్ధము తిలకిస్తున్న అగస్త్య మహాముని రాముని ఇలా సంబోధించెను.

ఓ దశరథ కుమారా! గొప్ప బాహువుల కల రామా! ఈ రహస్యమును వినుము. దీని వలన నీకు ఈ యుద్ధములో విజయము కలుగును గాక!

ఈ ఆదిత్య హృదయము వలన పుణ్యము, శత్రు నాశనము కలుగును. దీనిని పఠించుట వలన జయము, శుభము, శాశ్వత పరము కలుగును.

ఈ ఆదిత్య హృదయము అత్యంత శుభకరమైనది, సంపూర్ణమైన సౌభాగ్యమును కలిగించునది. అన్ని పాపములను నాశనము చేయునది. చింత, శోకము, ఒత్తిడి మొదలగు వాటిని తొలగించి ఆయుర్వృద్ధి కలిగించునది. 

పూర్తిగా ఉదయించి ప్రకాశాకుడైన, దేవతలు, రాక్షసులచే పూజించ బడిన, తన ప్రకాశాముచే లోకాన్ని ప్రకాశింప చేసే ఆ భువనేశ్వరుని పూజించుము.

సూర్య భగవానుడు సర్వ దేవతల యందు కలవాడు, తేజస్వి, తన కిరణములచే లోకాన్ని ముందుకు నడిపే వాడు. తన శక్తితో దేవతలను అసురులను, సమస్త లోక జీవరాశికి జీవము కలిగించి కాల చక్రాన్ని ముందుకు నడిపే వాడు.

ఆ సూర్య భగవానుడే బ్రహ్మ, విష్ణువు, శంకరుడు, సుబ్రహ్మణ్యుడు, ప్రజాపతి, ఇంద్రుడు, కుబేరుడు, కాలుడు, యముడు, సోముడు, వరుణుడు.

ఆయనే పితరుడు, వసువు, సాధ్యుడు, అశ్విని దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రాణము, ప్రభాకరుడు, ఆరు ఋతువులను కలిగించే వాడు.

సూర్య భగవానుడు అదితి పుత్రుడు, విశ్వకర్త, కార్యములకు ప్రేరణ కలిగించే వాడు, ఆకాశము, వివిధ లోకముల యానము చేసేవాడు, స్థితికారకుడు, బంగారు కాంతితో ప్రకాశించే వాడు, దినకరుడు.

సూర్య భగవానుడు తన కిరణములతో ప్రకాశిస్తూ సర్వ వ్యపకుడైన వాడు. ఆయన సప్తేన్ద్రియములకు మూల శక్తి, అంధకారమును పోగొట్టేవాడు, ఆనందాన్ని, శుభాన్ని కలిగించే వాడు, సర్వ క్లేశములు తొలగించి జీవ చైతన్యము నింపేవాడు.

సూర్య భగవానుడు త్రిమూర్తుల రూపములో వ్యక్తమైన సనాతనుడు, దినమునకు కారకుడు, బ్రహ్మకు గురువు, అగ్ని గర్భుడు, అదితి పుత్రుడు, శంఖమును ధరించిన వాడు, నీరసమును తొలగించి మానసిక ఉత్తేజమును కలిగించే వాడు.

సూర్య భగవానుడు ఆకాశానికి అధిపతి, అంధకారాన్ని తొలగించే వాడు, సకల వేద పారంగుడు, కుబేరునికి, వరుణునికి మిత్రుడు, వర్ష కారకుడు. ఆయన వింధ్య పర్వతములను దాటి బ్రహ్మ నాడిలో క్రీడిస్తున్నాడు.

సూర్య భగవానుడు వృత్తాకారములో, పచ్చని కాంతితో, తీక్షణమైన కిరణములతో తాపమును కలిగించే వాడు. లయకారకుడు, విశ్వమంతా వ్యాపించి యున్నవాడు, మహాతేజము కలవాడు, రక్త వర్ణుడు, సమస్త చరాచర సృష్టి స్థితి లయకారకుడు.

సూర్య భగవానుడు నక్షత్రములు, వాటి సమూహములకు, గ్రహములకు అధిపతి. విశ్వములో ప్రతి వస్తువుకు మూలము, తేజస్సు కల్గిన వారికి కూడా తేజస్సును కలిగించే వాడు. ద్వాదశాదిత్య రూపములలో కనిపించే ఆ సూర్యునికి నమస్కరించుము.

తూర్పున, పడమరన ఉన్న పర్వతములకు నమస్కారములు (వాటిపై నుంచి సూర్య భగవానుడు ఉదయించి అస్తమిస్తాడు కాబట్టి). తారా గణములకు, దినమునకు అధిపతి అయిన సూర్య భగవానునికి నమస్కారములు.

జయమును కలిగించే, దాని వలన కలిగే సంపదను, శుభంను కాపాడే సూర్య భగవానునికి నమస్కారములు. వేయి (అనంతమైన) కిరణములు కలిగిన ఆదిత్యునికి నమస్కారములు.

ఉగ్రుడు, వీరుడు, అమిత వేగముగా ప్రయాణించే సూర్య భగవానునికి నమస్కారములు. తన ఉదయముతో పద్మములను వికసింప చేసే వాడు, మార్తాండుడు (తీక్షణమైన తేజము కలవాడు) అయిన ఆదిత్యునికి నమస్కారములు.

బ్రహ్మ, విష్ణు మహేశ్వరులకు అధిపతి, వర్చస్సు కలవాడు అయిన ఆ సూర్యునికి నమస్కారములు. ప్రకాశించేవాడు, శక్తిమంతుడు, అన్నిటినీ దాహించేవాడు, తీక్షణమైన రుద్ర రూపము కల ఆదిత్యునికి నమస్కారములు.

సూర్య భగవానుడు అంధకారాన్ని తొలగించే వాడు, భయమును తొలగించే వాడు, శత్రు నాశనము చేసేవాడు, సర్వ వ్యాప్తమైన ఆత్మ స్వరూపుడు. క్రుతఘ్నులను నాశనము చేసేవాడు, దేవుడు, నక్షత్ర గ్రహ కూటమికి అధిపతి అయిన ఆ సూర్యునికి నమస్కారములు.

కరిగించిన బంగారము కాంతి కలవాడు, అగ్ని రూపుడు, సర్వ జ్ఞాన ప్రకాశకుడు, విశ్వ కర్మ, అంధకారమును తొలగించేవాడు, రుచి, లోకానికి సాక్షి అయిన సూర్యునికి నమస్కారములు.

సమస్త సృష్టిని నాశనము చేసి మరల సృష్టించేవాడు, నీటిని ఆవిరి చేసి, మరల వర్షరూపములో మనకు ఇచ్చే ఆ గగన మండల అధిపతి అయిన సూర్యునికి నమస్కారములు.

సూర్య భగవానుడు సుషుప్తావస్థలో (నిద్రా సమయములో) యున్న జీవరాశి హృదయములో జాగ్రదావస్థలో ఉండేవాడు, అగ్నిహోత్రములోని అగ్ని మరియు ఆ అగ్నిహోత్ర ఫలము తానే యైన వాడు.

సూర్య భగవానుడు వేద సారుడు, క్రతువులు, వాటి ఫలము తానెయైన వాడు, ఈ సమస్త జగత్తులో అన్ని క్రియలకు కారణభూతుడు, ప్రభువు.

ఫల శృతి:

రాఘవా!  ఈ స్తోత్రమును ఆపద సమయములలో, బాధలు, కష్టములు కలిగిన సమయములో, దిక్కుతోచక యున్నప్పుడు, భీతితో యున్నప్పుడు పఠించుట వలన ధైర్యము, స్థైర్యము కలుగును.

రాఘవా! దేవ దేవుడు, జగత్పతి యైన సూర్య భగవానుని ఏకాగ్ర చిత్తముతో పూజించుము. ఈ స్తోత్రమును మూడు మార్లు పఠించుట వలన నీకు ఈ యుద్ధములో విజయము కలుగును.

ఓ మహా బాహువులు కల రామా! నీకు ఈ క్షణము నుండి విజయమే. రావణుని వధించుము. అని చెప్పి అగస్త్యుడు తన యథా స్థానమునకు వెళ్ళెను.

ఇది విన్న రాముడు శోకమును, విచారమును వీడి, ప్రీతుడై, ధైర్యం పొందెను.

రాముడు సూర్యుని వైపు ఏకాగ్రతతో చూస్తూ ఈ స్తోత్రమును మూడు మార్లు పఠించి సచ్చిదానందు డయ్యెను. మూడు మార్లు ఆచమనము చేసి శుద్దుడై ధనుర్బాణములు ధరించెను.

రావణుడు యుద్ధమునకు వచ్చుట చూచి, ధైర్యముతో రాముడు రావణుని సంహరించుటకు సమస్త శక్తులు ఒడ్డుటకు కృత నిశ్చయము చేసుకొనెను.

అప్పుడు, దేవతా సమూహముతో యుద్ధము తిలకించుచున్న సూర్యుడు, రావణుని మరణ సమయము ఆసన్నమైనదని గ్రహించి, తనవైపు చూస్తున్న రామునిపై సంతుష్టుడై, ప్రసన్నమైన వదనముతో, రామా! ముందుకు సాగుము!  అని పలికెను.

9, ఫిబ్రవరి 2011, బుధవారం

సీతారామ వైభవం-1 - 'మా జానకి చెట్ట బట్టగా'

సీతమ్మతోనే కదా నిజంగా రామాయణం అంతా? శివధనుర్భంగము ద్వారా స్వామిని వరించినా, ఒక్క ప్రశ్న వేయకుండా సమస్త రాజభోగములు త్యజించి అడవులకు ఆయన వెంట నడచినా, హనుమంతుని భుజాలపై రాముని  చేరటానికి తిరస్కరించినా అన్నీ స్వామి ధర్మనిబద్ధతకే, ఆ రామునికి కీర్తి కలిగించుట కొరకే.  లోకమాతయై కూడా, ఆయనలో సగభాగమై సామాన్య మానవ జీవితం గడిపి ఎన్నో కష్టాలు అనుభవించింది . త్యాగరాజస్వామి మా జానకి చెట్టపట్టగా మహారాజువైతివి  అనే కీర్తనలో ఈ విషయాన్ని చక్కగా వివరించారు.  భక్తి జ్ఞాన వైరాగ్యములే కాకుండా చమత్కారంతో కూడిన కీర్తనలు త్యాగయ్య రచించాడు అనటానికి నిదర్శనం ఈ మా జానకి కీర్తన. నీ గొప్పతనము ఏమి లేదు, అంతా సీతమ్మ వలెనే నీకు కీర్తి అని రామునిపై చమత్కరిస్తు త్యాగయ్య నుతిస్తాడు. కాంభోజి రాగము గురించి చెప్పేది ఏముంది?. పైర గాలికి ఊగే పచ్చని వరిచేల నృత్యంలా, లయబద్ధంగా సాగే సీతారాముల డోలోత్సవంలా మృదువుగా సాగుతుంది ఈ రాగం. అటువంటి రాగానికి త్యాగరాజస్వామి స్వారి కీర్తన, మహారాజపురం సంతానం వంటి విద్వాంసుల గళము కూడితే అది ఒక సుందర దృశ్య కావ్యమే. సీతమ్మ వైభవాన్ని తెలిపే ఈ కీర్తన వివరాలు.సాహిత్యము:

పల్లవి: మా జానకి చెట్ట బట్టగా మహారాజువైతివి

అనుపల్లవి: రాజ రాజవార! రాజీవాక్ష విను! రావణారియని రాజిల్లు కీర్తియు ||మా జానకి||

చరణం: 
కానకేగి యాజ్ఞ మీరక మాయాకారమునిచి శిఖి చెంతనే యుండి 
దానవుని వెంటనే చని యశోక తరు మూలనుండి
వాని మాటలకు కోపగించి కంట వధియించకనే యుండి 
శ్రీనాయక! యశము నీకే కల్గజేయలేదా త్యాగరాజ పరిపాల  ||మా జానకి||

అర్థము: 

మా సీతాదేవి నీ సహధర్మ చారిణి కావటం వలన నీవు మహారాజువైతివి. ఓ సార్వభౌమా! రావణుని సంహరించిన వాడు అనే గొప్ప కీర్తి నీకు సీతాదేవి వల్లనే కలిగింది. ఓ సీతాపతి! త్యాగరాజ పరిపాలా! నీతో అరణ్యమునకు వెళ్లి, నీ ఆజ్ఞ మీరక ప్రవర్తించుచు ఉన్నంతలో రావణుడు బలాత్కారముగా ఆమెను అపహరింప, వాని దగ్గర తన మాయా రూపమునే ఉంచి, తన నిజరూపుమును అగ్నిదేవుని చెంతనే ఉంచి, రావణునితో లంకకు పోయి, అక్కడ అశోక వృక్షము నీడన ఉంది. రావణుని బెదిరింపు మాటలకు కనుచూపుతోనే వాని వధించే శక్తి కలిగియున్నా కూడా, రాక్షస స్త్రీలు మరియు రావణుడు పెట్టిన బాధలన్ని సహించి నీకు యశము కలిగించినది. 

పరిశీలన: 

సీతాదేవి అయోనిజ, అసమాన పతివ్రత. తండ్రి మాట నిలుపుట కొరకు సాక్షాత్తు శ్రీహరి అవతారమైన తన భర్త పదునాలుగేండ్ల వనవాసానికి బయలుదేరుతుండగా, ఆయన ఎంత వారించినా, 'ధర్మపత్నిగా నీ సేవలో ఉండుటే నాకు నిజమైన భోగము, యోగము, ధర్మము' అని స్పష్టంగా, దృఢ సంకల్పముతో రాముని ఒప్పించి ఆయనతో అడవులకు నారచీరలో అనుగమిస్తుంది.  ఇక అప్పటినుంచి ప్రతి అడుగు ఆయన కను సన్నలలోనే. దండకారణ్య ప్రవేశము ముందు సీతారాములు అత్రి అనసూయల ఆశ్రమము దర్శిస్తారు. అక్కడ అతి వృద్ధులైన ఆ దంపతులకు సేవ చేస్తారు. ఆ సాధ్వి అనసూయ స్వయంగా సీతాదేవి పాతివ్రత్యాన్ని ఎంతో పొగడి ఆశీర్వదిస్తుంది. త్రిమూర్తులకు తల్లియైన ఆ అనసూయ (అసూయలేనిది) మన్ననలను పొంది సీత పతివ్రతా శిరోమణి అవుతుంది.  

రావణుడు తనను అపహరించ వచ్చినప్పుడు తన నిజరూపాన్ని అగ్నిదేవుని వద్ద దాచి, మాయా రూపములో రావణునితో వెళ్లి, వాని సంహారమునకు కారణయై, ఆ కీర్తి భర్తకు కలిగేలా పరిస్థితులు కలిగిస్తుంది ఆ లోకపావని.  యుద్ధానంతరము అగ్నిదేవుడు ఈ సీతాదేవి నిజరూపాన్ని తిరిగి రామునికి అప్పగించినట్లు కొన్ని రామాయణాల్లో ఉంది.

తరువాత లంకలోని అశోవనంలో తనలోని సంకల్పాన్ని తనను వెదకుతూ వచ్చిన రామదూత హనుమంతునికి అద్భుతంగా వివరిస్తుంది. 'అమ్మా! నీవు నా భుజాలపై ఎక్కు, చక్కగా నేను నిన్ను రాముని ముంగిట ఉంచుతాను' అని హనుమంతుడు మాతను వేడుకుంటాడు. అప్పుడు సీత, తనను వక్షస్థలములో పొడిచిన కాకాసురునిపై రాముడు బ్రహ్మాస్త్రము ప్రయోగించుట, ఆ కాకి ముల్లోకాలు తిరిగి, చివరకు రాముని శరణు వేడుట అనే కాకాసుర వృత్తాంతాన్ని ఉదాహరించి, అంత చిన్న కాకిపైన అంత క్రోధాన్ని చూపిన రామునికి తనపై గల ప్రేమను వివరించి, అటువంటి రఘువంశ తిలకుడు, దశరథ కుమారుడు స్వయంగా వచ్చి రావణుని సంహరించి నన్ను తీసుకువెళ్తాడు అని హితవు పలుకుతుంది. అంతకు మునుపు తనను బెదిరించ వచ్చిన రావణునికి, తన చుట్టూ చేరిన రాక్షస స్త్రీలకు కూడా రాముని యశమును, శౌర్యమును గట్టి మాటలతో త్రిప్పి కొడుతుంది. తన భర్తపై అంతటి సడలని నమ్మకము, ప్రేమ కలిగిన సీతాదేవిని, ఆమె సుగుణములను, పాతివ్రత్యాన్ని చమత్కారముగా ఈ కీర్తనలో నుతించారు త్యాగయ్య.

శ్రవణం మహారాజపురం సంతానంగారి గళంలో. ఈ లంకెలోని ఆల్బంలో మూడవ ట్రాక్ పై క్లిక్ చెయ్యండి (13:57 నిమిషాల దగ్గర). 

4, ఫిబ్రవరి 2011, శుక్రవారం

త్యాగరాజ రామ భక్తి - తెలియలేరు రామ భక్తి మార్గమును

సద్గురు త్యాగరాజ స్వామి  భక్తితో వేదాంతాన్ని బోధిస్తూ, సంఘంలో నెలకొని యున్న కొన్ని చేష్టలు, కుసంస్కారాలను తన కీర్తనల ద్వారా ఖండించే ప్రయత్నం చేశారు. అటువంటి ఒక కృతి తెలియలేరు రామ భక్తి మార్గమును. రామ నామమును ఉచ్చరిస్తూనే, నిజమైన రామభక్తిని తెలియని వారిని ఉద్దేశించి రచించినది ఈ కీర్తన. ధేనుక రాగం ఆది తాళంలో ఈ కీర్తన కూర్చబడినది. త్యాగయ్య ఈ రాగాన్ని మొట్ట మొదట ఉపయోగించారు.


సాహిత్యము:

తెలియలేరు రామ భక్తి మార్గమును

ఇలనంతట తిరుగుచును కలువరించేరే గాని |తెలియలేరు|

వేగలేచి నీట మునిగి భూతి బూసి వేళ్లనెంచి వెలికి శ్లాఘనీయులై
బాగ పైక మార్జన లోలులైరే గాని త్యాగరాజ వినుత |తెలియలేరు| 

అర్థము:

ఓ రామా! ఈ కుసంస్కారులు, దొంగ భక్తులు ప్రపంచమంతా తిరుగుతూ నిన్ను కలువరిస్తూ ఉంటారు. కానీ, నిజమైన శ్రీ రామ భక్తిని తెలియలేకున్నారు.

ఈ దొంగ భక్తులు, తాము మహా భక్తులమని లోకానికి తెలియటానికి - పొద్దునే లేచి, స్నానము చేసి, విభూతిని శరీరానికి పూసుకొని, చేతి వ్రేళ్ళను లెక్కించుకొనుచు (జపము చేస్తున్నట్టుగా నటన), అన్ని ప్రదేశాలు తిరుగుతూ, సామాన్య ప్రజలచే పొగడబడుతూ, బాగా డబ్బు సంపాయించటంలో మునిగి తేలుతూ ఉన్నారే కానీ రామ భక్తి మార్గమును తెలియలేకున్నారు.

పరిశీలన: 

ఈనాటి దొంగ స్వాములు, ఊరూరా వెలసిన పీఠాలు, మఠాలు వాటిలో జరుగుతున్న అత్యాచారాలు, దురాచారాలు, దుశ్చర్యలు - వీటన్నిటినీ త్యాగయ్య రెండువందల ఏళ్ల నాడే గమనించి, ఊహించి తన కీర్తనలో మనకు కళ్ళకు కనిపించేలా రచించారు.

సన్యాసులై రాసలీలలు, డబ్బుకోసం సన్యాసి వేషం వేసి రాయలేని, చెప్పలేని చెడు కార్యాలు చేసే ఎంతో మంది దొంగ స్వాములు, బయటికి కాషాయ వస్త్రాలు ధరించి, కొంగ జపంలా దొంగ భక్తి ప్రకటిస్తూ, నాలుగు గోడల మధ్య అత్యంత విలాసవంతమైన, భోగవంతమైన,   నీచ నికృష్ట కార్యాలు చేస్తున్న ఎంతో మంది స్వాములను మనము ప్రతి రోజు వార్తా మాధ్యమాల ద్వారా చూస్తూనే ఉన్నాము, చదువుతూనే ఉన్నాము. ధర్మ పరి రక్షణ కోసం, ధర్మ ప్రచారం కోసం ఉపయోగించుకోవలసిన సన్యాసాశ్రమాన్ని భ్రష్టు పట్టించి, విద్య, విద్వత్తు, మంత్ర శక్తి, మహత్తు గల నిజమైన స్వాములకు, గురువులకు  కూడా హేతువాదులు, నాస్తికులు, అన్యమతస్థుల నోట చెడు పేరు ఆపాదిస్తున్న దొంగ భక్తులు, స్వాములు మన సమాజంలో ఉన్న అతి ప్రమాదకరమైన చీడ పురుగులు. ఎందుకంటే, ఇది విశ్వాసాన్ని పూర్తిగా వమ్ము చేసే వ్యవస్థ. భగవంతుని కనుగొనే మార్గంలో సహాయకునిగా ఉండవలసిన స్వాములు ప్రజల బలహీనతలను అవకాశంగా తీసుకుని వారిని మానసిక దౌర్బల్యానికి గురిచేసి మోసగించే ఒక భయంకరమైన వ్యవస్థ పుట్టగొడుగుల్ల మన దేశంలో వ్యాపిస్తోంది. దాన్ని ఖండించి, త్రుంచివేసి, అర్హత, నిరాడంబరత, సద్భక్తి కలిగిన గురువులను అనుకరించ వలసిన సమయం ఇది. ఈ కీర్తన ద్వారా దొంగ భక్తిని అద్భుతంగా వివరించారు త్యాగరాజు వారు.

కాబట్టి మనిషి యొక్క బాహ్య అలంకారములైన కట్టు, బొట్టు, రుద్రాక్షలు, విభూతి, నామములు, మాయ మాటలు, వారు చూపించే మాయలు, లోభాలకు మోస పోకుండా, వారికి తమ వ్యక్తిత్వాన్ని, శరీరాలను, ఆస్తులను తాకట్టు పెట్టకుండా, మనకు వారసత్వంగా వచ్చిన ఆధ్యాత్మిక సంపదను కాపాడే సద్గురువులను ఆశ్రయిద్దాము. మూఢ భక్తిని కాకుండా సద్భక్తిని, సత్సాంగత్యమును పెంపొందిన్చుకుందాం. రాముడు ఎటువంటి జీవనం గడిపాడు? దీని సమాధానంలో మనకు ఎటువంటి వారైతే సరైన గురువో అర్థం అవుతుంది. ఎక్కడైతే మన మనసుకు ప్రశాంతత కలుగుతుందో, ఎక్కడైతే మనలను ప్రలోభ పెట్టని వాతావరణం ఉంటుందో, ఎక్కడైతే వ్యక్తిత్వ వికాస ప్రాధాన్యత ఉంటుందో, ఎక్కడైతే మన వ్యక్తిగత పరిధిలోకి శక్తులు ప్రవేశించే ప్రయత్నం జరగదో అక్కడ సద్గురువు ఉన్నట్లు. సద్గురు పాదుకాభ్యాం నమామి.

ఈ కీర్తనను రంజని, గాయత్రి యుగళ స్వరంలో చూడండి.గాయనీమణులు తమిళురు కావటం వలన  ఈ గాత్రంలో  కొన్ని ఉచ్చారణ దోషాలు ఉన్నాయి. వాటిని వారి గురువులకు, తెలుగు పరిజ్ఞానానికి వదిలేద్దాము. నేను యూట్యూబ్లో ఈ దోషాలను ప్రచురించాను.