17, ఫిబ్రవరి 2011, గురువారం

గోస్వామి తులసీదాస కృత శ్రీరుద్రాష్టకమ్ - తాత్పర్యము

తులసీ దాస జీవన సంగ్రహము:
 


గోస్వామి తులసీదాస్ రామభక్తి సామ్రాజ్యంలో మహా భక్త శిరోమణి. ప్రస్తుతపు ఉత్తరప్రదేశ్ లోని చిత్రకూట ప్రాంతమైన రాజాపూర్ లో క్రీస్తు శకం 1532 వ సంవత్సరంలో ఆత్మారాం దుబే మరియు హుల్సీ దేవి దంపతులకు జన్మించాడు. భవిష్యత్ పురాణంలోని ప్రతిసర్గ పర్వంలో శివుడు పార్వతితో వాల్మీకి మహర్షి హనుమంతునిచే పొందిన వరాన్ని వివరిస్తూ, 'వాల్మీకిస్తులసీదాసః కలౌ దేవి భవిష్యతి | రామచంద్ర కథామేతాం భాషాబద్ధాం కరిష్యతి| '  -    కలియుగంలో తులసీ దాసు అనే మహాభక్తుడు వాల్మీకి అంశతో జన్మించి ప్రాంతీయ భాషలో రాముని వైభవాన్ని రచించి నుతిస్తాడని చెబుతాడు. అందుకనే, తులసీదాసును వాల్మీకి అవతారంగా భావిస్తారు. భక్తి, కావ్య రచన, తాదాత్మ్యత, భాష - వీటిని చూస్తే ఆయన అపర వాల్మీకి అనటానికి ఏ సందేహమూ లేదు. 

అవధ్ భాషలో (భోజ్‍పురీ, వ్రజభాష,బుందేలి పద ప్రయోగం కూడా కనిపిస్తాయి) ఆయన రచించిన లోక విఖ్యాతి గాంచిన రామాయణం 'రామచరిత మానస్'. కొంత వాల్మీకి రామాయణం తో విభేదించే కథా ప్రవాహం కనిపించినా, రామావతారము, హనుమంతుని మహత్తు మొదలైన వాటిని అద్భుతంగా వర్ణించినట్టు పారాయణ చేసిన వారు, చరిత్రకారులు, సాహితీ విమర్శకులు, పరిశీలకులు చెబుతారు. ఇక హనుమాన్ చాలీసా గురించి చెప్పేదేముంది? ఇంటింటా, ప్రతి వ్యక్తికీ నోటికి వచ్చే ఈ స్తుతి మహిమ దానిని పఠించి ఫలితాలు పొందిన వారిని అడిగితే అవగతమవుతుంది. భీతి, విచారము, సంకటము, రోగము మొదలైన శారీరిక మానసిక బాధలు కలిగినప్పుడు ఆధ్యాత్మికంగా మొట్ట మొదట సూచించ బడే స్తోత్రము హనుమాన్ చాలీసా. ఇవే కాక ఈయన వినయపత్రిక, కవితావళి, కృష్ణ గీతావళి, దోహావళి మొదలైన రచనలు ఆ ప్రాంతంలోని ప్రతి సామాన్యునికి అర్థమయ్యేలా రచించారు. ఇవే కాక, హనుమాన్ బాహుక్, సాఠికా, సంకట మోచన మొదలైన ఎన్నో అత్యంత మహిమాన్వితమైన స్తోత్రాలను రచించారు. భారత దేశంలో హనుమద్ మరియు రామ భక్తులకు ఒక స్పష్టమైన, మహత్తరమైన దిశా నిర్దేశం చేశాయి తులసీదాస్ రచనలు. 

మరి ఇంత గొప్ప కవి, భక్తుడు పుట్టుకతోనే ఇలా ఉన్నాడా? లేదు. మనలాగే సామాన్య మానవుడిగా పుట్టి, పెళ్లి చేసుకుని భార్యపై అమితమైన ప్రేమ కలిగిన వాడు. ఆయన ధర్మ పత్ని బుద్దిమతి. ఒకసారి ఆమె పుట్టింటికి వెళుతుంది. భార్యా విరహం భరించలేని తులసీదాస్ ఆమె కోసం అర్ధ రాత్రి బయలుదేరి ఆమె పుట్టింటికి వెళతాడు. తన కోసం వచ్చిన భర్తతో బుద్దిమతి 'నాపై చూపే మమకారం శ్రీరామునిపై సగం చూపించినా నువ్వు ఈ సంసార సాగరాన్ని దాటగలవు' అని హితవు పలుకుతుంది. ఆమె మాటలతో జ్ఞానోదయం కలిగిన తులసీదాస్ ఇంటికి వచ్చి రామభక్తి సాగరంలో మునుగుతాడు. ఆ యాత్ర అనంతమైన, అవ్యాజమైన భక్తిగా మారి, ఆయన నోట రాముని కథను, మరెన్నో అద్భుతమైన రచనలను చేయిస్తుంది. అయోధ్య, వారణాసి పట్టణాల్లో జీవించి ఆయన 91 ఏళ్ల పూర్ణ జీవనం తరువాత ఆ రామునిలో 1623 సంవత్సరంలో ఐక్యమయ్యాడు. 

ఆయన చేసినవి ఎంత గొప్ప రచనలు? దాదాపు 500 ఏళ్ల తరువాత కూడా ప్రతి ఇంటా అయన రచన పారాయణం, గానం జరుగుతూనే ఉన్నాయి. అఖండ రామభక్తి జ్యోతి వెలుగుతూనే ఉంది.

రామభక్తుడిగా పేరు గాంచి, శివుని గురించి ఆయన ఈ గొప్ప అష్టకం ప్రాకృత భాషలో రచించారు.  నిర్గుణ పరబ్రహ్మమైన పరమాత్మను రామునిగా నుతించినా, శివునిగా కొలచినా ఒక్కటే అని చెప్పటానికి ఈ రచన ఇంకొక ఉదాహరణ. రామభక్తిలో మునిగిన తులసీదాసు, శివుని తత్త్వాన్ని ఎంత బాగా అనుభూతి పొందారో ఈ స్తోత్రం కళ్ళకు కట్టినట్టు వివరిస్తుంది. కాబట్టి దైవారాధనలో పరిధులు, ఒకటి చేస్తే ఇంకొకటి పనికి రాదు - ఇవన్నీ మనం సృష్టించుకున్న మిథ్యే. ఈ విశాల భిన్నత్వంలో ఏకత్వ భావనను మన జీవన విధానంలో అనుక్షణం ఆచరించి భారతీయ ఆధ్యాత్మిక సమాజాన్ని ఏకం చేద్దాం.
మనకు ఇట్టి ఆధ్యాత్మిక సంపదను ఇచ్చిన మహా భక్తుడు, కవి తులసీ దాసుకు సాష్టాంగ నమస్కారములు. 

తులసీదాస కృత రుద్రాష్టకం, తాత్పర్యం. శ్రవణం అనురాధా పోడ్వాల్ గళంలో



గోస్వామి తులసీదాస కృత శ్రీరుద్రాష్టకమ్ 

నమామీశమీశాన నిర్వాణరూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపమ్ .
అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశమాకాశవాసం భజేఽహమ్ .. ౧..

నిరాకారమోంకారమూలం తురీయం గిరా జ్ఞాన గోతీతమీశం గిరీశమ్ .
కరాళం మహాకాల కాలం కృపాలం గుణాగార సంసారపారం నతోఽహమ్ .. ౨..

తుషారాద్రి సంకాశ గౌరం గభీరం మనోభూత కోటిప్రభా శ్రీ శరీరమ్ .
స్ఫురన్మౌళి కల్లోలినీ చారు గంగా లసద్ఫాలబాలేందు కంఠే భుజంగా .. ౩..

చలత్కుండలం భ్రూ సునేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాలమ్ .
మృగాధీశచర్మాంబరం రుండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి .. ౪..

ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం అజం భానుకోటిప్రకాశమ్ .
త్రయః శూల నిర్మూలనం శూలపాణిం భజేఽహం భవానీపతిం భావగమ్యమ్ .. ౫..

కలాతీత కల్యాణ కల్పాంతకారీ సదా సజ్జనానందదాతా పురారీ .
చిదానంద సందోహ మోహాపహారీ ప్రసీద ప్రసీద ప్రభో మన్మథారీ .. ౬..

న యావత్ ఉమానాథ పాదారవిందం భజంతీహ లోకే పరే వా నరాణామ్ .
న తావత్ సుఖం శాంతి సంతాపనాశం ప్రసీద ప్రభో సర్వభూతాధివాసమ్ .. ౭..

న జానామి యోగం జపం నైవ పూజాం నతోఽహం సదా సర్వదా శంభు తుభ్యమ్ .
జరా జన్మ దుఃఖౌఘ తాతప్యమానం ప్రభో పాహి ఆపన్నమామీశ శంభో .. ౮..

రుద్రాష్టకమిదం ప్రోక్తం విప్రేణ హరతోషయే .
యే పఠంతి నరా భక్త్యా తేషాం శంభుః ప్రసీదతి ..

ఇతి శ్రీగోస్వామితులసీదాసకృతం శ్రీరుద్రాష్టకం సంపూర్ణమ్ 

తాత్పర్యము: 

నిర్వాణ రూపమైన  ఈశాన మూర్తికి నమస్కారములు (శివుని పంచ ముఖ రుద్ర రూపములలో ఈశాన ముఖము ఒకటి).విభుడు (రక్షకుడు, శుభకరుడు, ప్రభువు అని అర్థం), సర్వ వ్యాపకుడు, పర బ్రహ్మం,  వేద స్వరూపుడు, సత్యమైన వాడు, గుణములు లేని వాడు, వికల్పము లేని వాడు, విశ్వ వ్యాపుడు, ఆకాశ రూపుడు, దివ్యాకాశంలో నివశించే వాడు అయిన శివుని భజిస్తున్నాను.

నిరాకారుడు (ఆకారము లేని వాడు), ఓంకారానికి మూలమైన వాడు, తురీయుడు (జాగ్రత్, సుషుప్త, స్వప్నావస్థలను దాటిన అత్యుత్తమమైన అవస్థ),  గిరిపై నివశించే వాడు, పర్వతములకు అధిపతి,  కరాళుడు (దుష్ట శిక్షణలో) , యముని పాలిటి మృత్యువు (మృత్యువుని జయించుటకు సాధనం అని అర్థం),  కృపాకరుడు,  గుణములకు అతీతమైన వాడు, సంసార వారధిని దాటించే వాడు అయిన పరమ శివునికి నమస్కారములు.

హిమాలయములు, శంఖము కంటే మిక్కిలి తెల్లని దేహకాంతి కలవాడు, గంభీరుడు, కోటి మన్మథుల మించిన దేహ సౌందర్యము కలవాడు, తన జటా ఝూటములో తరంగాలతో ఉప్పొంగే గంగను, నుదుట నెలవంక, మెడలో నాగరాజును ధరించిన పరమ శివునికి నా నమస్కారములు.

ఊగే కర్ణ కుండలములు ధరించిన వాడు, విశాలమైన మంచి నేత్రములు,  ప్రసన్నమైన ముఖము కలవాడు, నీలకంఠుడు, దయాళువు, మృగరాజు చర్మాన్ని ధరించిన వాడు, మెడలో కపాలమాల కలిగిన వాడు, అందరికి ప్రియుడు అయిన శంకరుని నేను భజిస్తున్నాను.

ప్రచండుడు(భీషణుడు, ప్రజ్వలించే వాడు), ఉత్కృష్టమైన వాడు, గంభీరమైన భాషణ చేసే వాడు* , సమర్థుడు, దివ్యమైన వాడు, అఖండుడు,జన్మ లేని వాడు, కోటి సూర్యుల ప్రకాశము కలవాడు, త్రిశూలముతో దుష్ట సంహారము చేసే వాడు, శూల పాణి, భవానీ పతి, భావ గమ్యమైన వాడు అయిన శంకరుని భజిస్తున్నాను.

కాలమునకు (మృత్యువుకు) అతీతమైన, కల్పాంతమున (ప్రళయ కాలమున) సమస్తమును నాశనము చేసే, సజ్జనులకు మంచి చేసే, త్రిపురారి, మోహమును నాశనము చేసి చిదానందమును ప్రసాదించే, మన్మథుని సంహరించిన ఓ పరమ శివా! నన్ను అనుగ్రహించుము.

నీ పద కమలముల మ్రొక్కి శరణు కోరే వరకు జనులకు ఈ లోకములో కానీ, పర లోకములో కానీ దుఖములనుండి విముక్తి కలిగి సుఖము, శాంతి కలుగదు. కావున, సర్వ భూతములలో నివసించే పరమశివా! నన్ను అనుగ్రహించుము, అనుగ్రహించుము.

ఓ శంభో! నాకు యోగము, జపము, పూజ తెలియవు. కానీ, ఎల్లప్పుడూ నీ భక్తుడను. నేను ముసలి తనము, జన్మ, మృత్యువు మొదలైన వాటిలో చిక్కుకొని యున్నాను. ప్రభో!  పాహి పాహి. శంభో! నన్ను ఈ ఆపత్తుల నుండి కాపాడుము.

శివుని ప్రీతికి బ్రాహ్మణుడైన తులసీదాసు చెప్పిన ఈ రుద్రాష్టకం భక్తితో పఠించిన జనులకు ఆ పరమశివుని అనుగ్రహం కలుగును.

* (ప్రగల్భం అనేది కొంత వ్యతిరేక భావన కలిపిస్తుంది కాబట్టి దానిలోని అంతరార్థమైన గాంభీర్యాన్ని అర్థంగా రాస్తున్నాను)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి