RightClickBlocker

18, జులై 2011, సోమవారం

మహాలక్ష్మీ వైభవం - కొల్హాపూర్ మహాలక్ష్మిలక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం


ఓ శ్రీమహాలక్ష్మీ! భాగ్యానికి నిలయమైన, పాలకడలి నుండి ఉద్భవించిన, శ్రీరంగములో వెలసిన దేవీ, దేవ లోక స్త్రీల నందరిని దాసీజనంగా చేసుకొన్న, లోకాని దీపంగా భాసిస్తున్న, ఎవరి మృదుల కటాక్షంతో ఇంద్రుడు, శివుడు వైభవము పొందుతున్నారో, మూడు లోకాలను తన కుటుంబముగా చేసుకున్న, తామర కొలనులో ఉద్భవించిన, మహావిష్ణువుకు ప్రియమైన నీకు నమస్కరిస్తున్నాను. 

భౌతిక, ఆధ్యాత్మిక సంపదలకు, సమృద్ధి, తేజస్సు, జ్ఞానము, అదృష్టము, సంతానము, ధైర్యము మొదలైన లక్షణాలకు నిలయమైన విష్ణుపత్ని శ్రీమహాలక్ష్మి. ఆ విశ్వాత్ముని శక్తికి సంకేతంగా మాయా స్వరూపిణి అయిన జగన్మాత సకల సంపదలకు, సౌభాగ్యానికి నిలయమై, భక్తులపాలిటి కల్పతరువై లోకాన్ని పాలిస్తున్నది. స్థితికారకుడైన శ్రీహరికి ఉపయుక్తంగా ఐహికాముష్మిక ఐశ్వర్యాభివృద్ధిని ఇచ్చే వరాల తల్లిగా మానవాళి దురితక్షయకారకమైనది.  ధర్మ సంస్థాపనకు ఆ శ్రీమహావిష్ణువుతో పాటు పూర్ణావతరములతో పాటు ఇతర రూపాలలో ఈ జగన్మాత మరల మరల వెలస్తూనే ఉంది.

శ్రీ సూక్తంలో లక్ష్మీదేవి వైభవాన్ని వేనోళ్ల పొగడబడినది.

శ్రీ సూక్త సారం:

ఓ అగ్నిదేవా! బంగారు మేని ఛాయ గల, పాపాలను  నాశనము చేసే, బంగారు మరియు వెండి ఆభరణాలతో అలంకరించబడిన, చంద్రుని వలె చల్లగా ఆహ్లాదకరంగా, సువర్ణమయమైన యున్న మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము. ఎవరి కరుణ,  కటాక్షములతో నాకు బంగారము, ఆవులు, గుర్రాలు, బంధువులు సంప్రాప్తమైనవో ఆ మహాలక్ష్మిని నా వద్దకు ఆవాహనము చేయుము. ఆమె నా వద్ద నుండి వీడిపోకుండా చూడుము.గుర్రాలతో ఉన్న రథం మధ్యలో ఆసీనమైనది, తన రాకను ఏనుగు ఘీంకార నాదంతో సూచిస్తున్న ఆ శ్రీదేవిని ఆహ్వానిస్తున్నాను. తల్లీ! నీవు నా వద్ద సంతోషముగా నెలకొని ఉండుము. చక్కని చిరునవ్వుతో, బంగారు కోటలో నివసించే, కరుణ, తేజస్సు, ఆనంద రూపిణియై, ఆనందము ప్రసాదించునది, పద్మములో ఆసీనురాలై, పద్మము వంటి ఛాయకలది అయిన ఆ శ్రీదేవిని ఇక్కడ సాక్షాత్కరించమని ప్రార్థిస్తున్నాను.
చంద్రుని పోలినది, తేజోవంతమైనది, తన కీర్తి చంద్రికలతో ప్రకాశించుచున్నది, దేవతలచే పూజిన్చబడుచున్నది, కరుణా స్వరూపిణి, పద్మమును ధరించినది, 'ఈం' అనే బీజమంత్రానికి భావంగా ఉన్నది అయిన మహాలక్ష్మిని నేను శరణు వేడుతున్నాను. ఓ దేవీ! నిన్ను ప్రార్థిస్తున్నాను, నా దారిద్ర్యం పోయేలా కరుణించు.

సూర్యుని తేజస్సు కలిగిన ఓ తల్లీ! వనానికి అధిపతియైన బిల్వవృక్షం (మారేడు చెట్టు) నీ తపోమహిమచే ఉద్భవించినది. నీ తపస్సు వలన కలిగిన దాని ఫలాలు అజ్ఞానము మనే లోని ఆటంకాన్ని, అమంగళకరమైన బయటి ఆటంకాన్ని తొలగిస్తాయి గాక!  కుబేరుడు, కీర్తి ఐశ్వర్యాలతో నన్ను వెన్నంటి రావాలి. నీ అనుగ్రహం పూర్తిగా నిండిన ఈ దేశంలో నేను జన్మించాను. సకల సంపదలను నాకు ప్రసాదించు! ఆకలి దప్పికలతో కృశించినది, శ్రీదేవి కంటే ముందుగా జన్మించిన జ్యేష్టాదేవిని  (అలక్ష్మి) నేను నాశనం చేస్తాను. నా గృహము నుండి అభాగ్యము, కొరతలను పూర్తిగా నిర్మూలించి నన్ను అనుగ్రహించు. సుగంధానికి నిలయమైనది, జయింప అలవికానిది, ఎల్లప్పుడూ పుష్టినిచ్చేది, సకల సంపదలు కలిగిన, సమస్త జీవులకు అధినాయిక యైన మహాలక్ష్మిని ఇక్కడ ఆవాహన చేస్తున్నాను.
ఓ శ్రీదేవి! మనస్సులో జనించే ఉత్తమమైన కోరికలూ, సంతోషము, వాక్కులో సత్యము, గోసంపద చే, ఆహార సమృద్ధిచే కలిగే ఆనందాన్ని నేను చవి చూడాలి. నాకు కీర్తి కలుగచేయుము. కర్దమ మహర్షి! నీకు పుత్రికగా జన్మించిన మహాలక్ష్మి నాకు సాక్షాత్కారించాలి. తామరపువ్వుల మాల ధరించిన, సిరిసంపదలకు అధిదేవత, తల్లి అయిన ఆమెను నా కులములో ఎల్లప్పుడూ నివసింప చేయాలి.  మహాలక్ష్మి పుత్రుడవైన ఓ చిక్లీత! నీరు, చక్కని ఆహారపదార్థాలను ఉత్పత్తి చేయుగాక! నా ఇంట నీవు నివసించాలి.  దేవీ, నీ మాత అయిన ఆ మహాలక్ష్మి నా కులములో నిరంతరమూ నివసించేలా అనుగ్రహించు. ఓ అగ్నిదేవా! కరుణ కలిగిన మనసు కలది, పద్మవాసిని, లోకానికి ఆహారము ఇచ్చి పోషించేది, కుంకుమ రంగు కలది, తామరపువ్వుల మాల ధరించినది, చంద్రునివలె ఆహ్లాదకరమైనది, బంగారుమయమైనది అయిన మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము. అగ్నిదేవా! దయకలిగినది, గంభీరముగా యుండెడిది, దండము చేత బూనినది, అందమైన శరీరచాయ కలిగినది, సూర్యునివలె ప్రకాశించునది, బంగారుమయమైనది అయిన మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము. 

అగ్నిదేవా! ఎవరి వలన నేను అంతులేని బంగారుము, గోవులు, సేవకులు, గుర్రాలు ప్రాప్తించుకుంటానో , అట్టి మహాలక్ష్మిని నన్ను వదలి వెళ్లిపోకుండా కృప చూపుము. ఎవరు లక్ష్మీదేవి కృప కొరకు ప్రార్తిస్తున్నారో, వారు ఇంద్రియాలు నిగ్రహించి, ప్రతిరోజూ ఆజ్యముతో హోమము చేయాలి. పైన తెలిపిన పదిహేను మంత్రాలను సదా జపిస్తూ ఉండాలి. సుప్రసిద్ధులు, ఋషులు అయిన ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు ముగ్గురు ఈ సూక్తంలోని ఋషులు, మహాలక్ష్మియే దేవత. పద్మము వంటి ముఖము, ఊరువులు, కన్నులు కలదానా! పద్మము నుండి ఉద్భవించిన తల్లి!, నేను దేని వలన సుఖాన్ని పొందుతానో దాన్ని ప్రసాదించు. గుర్రాలను, గోవులను, సంపదలను ఇచ్చే, ధనానికి అధిదేవతయైన మహాలక్ష్మి! కోరికలన్నీ నెరవేరేటప్పుడు కలిగే సుఖాన్ని ఇచ్చే సంపదను నాకు ప్రసాదించు. పుత్రులు, గోవులు, ధనధాన్యాలు, ఏనుగులు, గుర్రాలు, రథాలు మొదలైన సకల సంపదలు ప్రసాదించు. జనులకు నువ్వు తల్లిగా భాసిస్తున్నావు. నన్ను ఆయుష్మంతునిగా చేయుము. 

అగ్ని, వాయువు, సూర్యుడు, అష్టవసువులు, దేవేంద్రుడు, బృహస్పతి, వరుణుడు - తమ తమ సంపదలను నీ కృపతో అనుభవిస్తున్నారు. చంద్రునివలె చల్లగా, దేవతల శక్తిగా, సూర్యుని తేజస్సుతో ప్రకాశిస్తున్నది, శ్రీదేవి, ఈశ్వరి, చంద్రుడు, సూర్యుడు, అగ్ని - మువ్వురినీ తన మహత్తుగా కలదీ అయిన శ్రీమహాలక్ష్మిని కొలుస్తున్నాను. 
ఓ గరుత్మంతుడా! సోమరసం కోసం వచ్చిన వృత్రాసురుని సంహరించిన ఇంద్రుడు సోమరసం గ్రోలనీ. సోమయాగం నిర్వర్తించాలని సంకల్పించిన నాకు పుష్కలముగా ధనాన్ని ప్రసాదించనీ! పుణ్యము చేసిన భక్తులకు కోపము రాదు, మాత్సర్యము ఉండదు, లోభము నశిస్తుంది, దుర్బుద్ధి పుట్టదు. భక్తిని పొంద కోరేవారు శ్రీ సూక్తాన్ని సదా జపము చెయ్యాలి. నీ కృపతో మేఘాలు ఎల్లప్పుడూ వర్షించనీ! విత్తనాలు చక్కగా మొలకెత్తి బాగా పెరగనీ! భగవంతుని నిందించేవారు నిష్క్రమించు గాక! 
పద్మము అంటే ఇష్టపడేదానా! పద్మములు చేతిలో ధరించిన జగన్మాతా! పద్మములో జన్మించి, నివసించే తల్లీ! తామర రేకులవంటి విశాలమైన కన్నులు కలిగి, విష్ణువు మనస్సుకు అనుకూలమైన మాతా! నీ పాదపద్మములతో నన్ను అనుగ్రహించు.  పద్మము మీద ఆసీనురాలై ఉన్నదేవరో, విస్తారమైన పిరుదులు కలిగిన, తామర రేకులవంటి నేత్రములు కలవారెవరో, లోతైన నాభి కలిగి, స్తన భారముతో వంగి ఉన్న వారెవరో, స్వచ్చమైన వస్త్రాలు, ఉత్తరీయము ధరించిన దెవరో, రత్నాలు పొదిగిన కలశాల జలంతో దేవలోకములోని అత్యుత్తమైన గజములతో అభిషేకించ బడుతున్న దెవరో, పద్మాన్ని చేత ధరించిన దెవరో,  సర్వ మంగళ స్వరూపిణియైన దెవరో అట్టి మహాలక్ష్మి నా గృహములో సదా సర్వవేళలా నివసించుగాక!


సిద్ధులను ఇచ్చే, ముక్తిని అనుగ్రహించే, విజయాన్ని సిద్ధింప చేసే లక్ష్మీ రూపాలలో, సరస్వతిగాను, సంపదలిచ్చే శ్రీదేవిగాను, వరాలిచ్చే వరలక్ష్మిగా నువ్వు సదా నాకు ప్రసన్నురాలవుగా ఉండుగాక!  వర, అభయ ముద్రలు చేత దాల్చిన, పాశము, అంకుశములు చేత ధరించిన, పద్మములో నివసిస్తున్న, కోటి బాల సూర్యుల ప్రకాశము కలదీ, మూడు నేత్రములు కలదీ, ఆదిశక్తి, జగదీశ్వరి అయిన ఆమెను నేను స్తుతిస్తాను.  శుభములలో శుభానివి, సకల శుభాలను సాధించి, ప్రసాదించే దానవు, శరణు పొందటానికి యుక్తమైన దానవు, మూడు కన్నులు కాలిగిన ఓ దేవీ, నారాయణీ! నా నమస్కారము.  పద్మ వాసిని, పద్మమును చేత ధరించినది, పవిత్రమైన తెల్లని వస్త్రములు, సుగంధభరితమైన మాలను ధరించి శోభిస్తున్న, భగవతి, హరిపత్ని, కామ్యదాయిని, ముల్లోకాలను పోషించి కాపాడే నువ్వు నన్ను అనుగ్రహించు. విష్ణుపతిని, భూదేవి, తులసి గా అలరారుతున్నది, మాధవుని ప్రియురాలు, ప్రియసఖి, విష్ణువుతో కూడిన దేవీ! నేను నమస్కరిస్తున్నాను. 

మహాలక్ష్మిని తెలుసుకుందాము. విష్ణుపత్నియైన  ఆమెను అందుకై ధ్యానిద్దాం. ఆ లక్ష్మీదేవి మనకు ప్రేరణనిచ్చు గాక! మహాలక్ష్మీ! వర్చస్సు, లోటు లేని జీవితం, మంచి ఆరోగ్యం - నాకు ప్రసాదించే పవనాలు సదా వీచనీ. ధన ధాన్యాలు, పశు సంపద, పుత్రులు, నూరేళ్ళ దీర్ఘాయుష్షు నాకు చేకూరనీ. ఋణము, రోగము, దారిద్ర్యము, ఆకలి, అకాల మరణము, భయము, శోకము, మానసిక వ్యథలు నశించు గాక!.శ్రీదేవి చేరే వారిని ఐశ్వర్యం వరిస్తుంది; సంపద, దీర్ఘాయుష్షు చేకూరుతుంది. వారు ఐశ్వర్యాలతో తులతూగుతూ మరణం లేని స్థితికి చేరుకుంటారు. సత్వరమే వారు కీర్తిని, విజయాన్ని పొందుతారు. మంచివి అన్నీ లక్ష్మే దేవియే - ఇలా తెలుసుకున్న వాడు లక్ష్మీ దేవిని చేరుకుంటాడు. మంత్రయుక్తముగా ఎల్లప్పుడూ యాగము చేయాలి. అలా చేసే వాడికి పుత్ర సంపద, పశు సంపద లభిస్తుందని గ్రహించాలి. మహాలక్ష్మిని తెలుసుకుందాము. విష్ణుపత్నియైన  ఆమెను అందుకై ధ్యానిద్దాం. ఆ లక్ష్మీదేవి మనకు ప్రేరణనిచ్చు గాక!

కొల్హాపూర్ మహాలక్ష్మి:


ఈ విధంగా నుతించబడిన లోకపావని శ్రీ మహాలక్ష్మి భువిన మహారాష్ట్రలోని సహ్యాద్రి కనుమలలో పంచగంగా నదీ తీరంలో వెలసింది. దేవీ భాగవతంలో ఈ కొల్హాపూర్ ప్రస్తావన ఉంది. కోల్హాపూర్ పట్టణం చోళులు, పాండ్యుల మధ్య అంతర్యుద్ధానికి సాక్షిగా నిలబడింది. అష్టాదశ శక్తిపీఠాలలో కామ్యమోక్ష కారక పీఠంగా ఈ క్షేత్రం పేరుగాంచింది. ప్రళయకాలంలో కూడా లక్ష్మీ నారాయణులు ఈ క్షేత్రాన్ని విడువకుండా ఇక్కడే ఉంటారని విశ్వాసం. అందుకే క్షేత్రానికి అవిముక్త క్షేత్రమని పేరు కూడా వచ్చింది.కరవీరనివాసినిగా ఇక్కడి తల్లి పేరు పొందింది. ఈ ప్రాంతం జగన్మాత కుడిచేత ఉన్నది కాబట్టి ప్రళయాతీతమైనదిగా భావించబడుతోంది. సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి ఇక్కడ నివసించటం వలన ఆ దేవదేవుడైన శ్రీహరి నిరంతరం ఇక్కడే ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడని ప్రగాఢ విశ్వాసం. అందుకనే ఈ ప్రాంతం అనేకమంది ఋషులను, యోగులను, మహాపురుషులను ఆకర్షించి వారికి మోక్షకారకమైనది. త్రిమూర్తిరూపుడైన దత్తాత్రేయుడు ప్రతి మధ్యాహ్నము ఇక్కడ భిక్షకు వస్తాడని అనేక స్తుతులలో చెప్పబడినది. షిర్డీ సాయి ఆరతులలో కాశీలో స్నానము, జపము, కొల్హాపూరులో భిక్ష అనే దత్త స్తుతి - 'కాశీ స్నాన జప ప్రతిదివసీ కొల్హాపుర భిక్సేసి నిర్మలనది తుంగా జల ప్రాశీ, నిద్రా మాహుర దేశీ'...ఈ విశ్వాసాన్ని మరింత చాటుతుంది.

ఇక్కడి మందిరం విశాలమైన ప్రాంగణంలో చోళుల సాంప్రదాయ శిల్పకళా నైపుణ్యంతో కట్టబడినది. నాలుగు దిక్కులా ముఖ ద్వారాలు, గర్భగుడిలో అంబాబాయిగా పిలువబడే మహాలక్ష్మీ మూర్తి, దీనికి చెరొకపక్కన మహాకాళీ మహా సరస్వతీ రూపాలు, గర్భగుడి వెనుక భాగమున శ్రీ వేంకటేశ్వరుడు, ఎదురుగా గణపతి, బయట బాల దత్తాత్రేయుడు, దత్త పాదుకలు మరియు ఔదుంబరం, సీతారామలక్ష్మణులు, హనుమంతుడు వెలసి ఉన్నారు. పురాతనమైన కట్టడంగా కనిపించే ఈ దేవాలయ ప్రాంగణంలో అమ్మకు అర్పించటానికి పసుపు, ఆకుపచ్చని గాజులు, చీరలు, పుష్పాలు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రాంగణంలో మేడి చెట్టు, దాని వెనుక భగవాన్ శ్రీధరులు స్థాపించిన దశావతార మూర్తులు, అమ్మవారు ఉంటారు. ఇంకొకపక్క ఖండోబా మందిరము, శివుని మందిరము ఉంటాయి.గర్భగుడిలోని అమ్మవారి విగ్రహం 5000-6000 ఏళ్ల నాటిది. ఇది నలభై కిలోల బరువు, రాతిపీఠంపై ప్రతిష్ఠించబడింది. అమ్మవారి ఆభరణాలు వెలకట్టలేని మణులతో శోభిల్లుతూ ఉంటుంది. ఈ మహాలక్ష్మి చతుర్భుజయై క్రింది కుడి చేత మాతులింగ ఫలమును (బత్తాయి), పైన కుడిచేత నేలను తాకుతున్న గద, పైన ఎడమచేత ఖేతకమనే రక్షణకవచం (డాలు), క్రింద ఎడమచేత పానపాత్ర కలిగి ఉంటుంది. కిరీటముపై నాగ పడుగ క్రింద శివలింగము, యోని ఆకారము ఉంటాయి. అందుకే ఈ మూర్తిని మూలప్రకృతిగా, విష్ణుమాయా స్వరూపిణిగా భావిస్తారు. విగ్రహము వెనుక సింహవాహనము కనిపిస్తుంది. భారతదేశంలోని మిగిలిన క్షేత్రాలకు భిన్నంగా ఇక్కడ మూలవిరాట్టు పడమర ముఖంగా ఉంటుంది. సంవత్సరానికి రెండుమార్లు మూడురోజులపాటు  సూర్యాస్తమయ కాలమున కిరణాలు పడమటి చిన్న కిటికీ గుండా అమ్మవారి ముఖమును తాకుతాయి. ఈ ప్రత్యేక దర్శనానికి భక్తులు తరలి వస్తారు.


మహారాష్ట్రలో ఉన్న నాలుగు శక్తి పీఠాలు కొల్హాపూర్ మహాలక్ష్మి, తుల్జాపూర్ భవాని, మాహుర్ రేణుక, వణి సప్తశృంగిమాత. ఇవి నాలుగూ మహిమాన్వితమైనవే. అయినా, కొల్హాపూర్ మహాలక్ష్మికి అత్యంత పురాతనమైన,అత్యంత మహిమా క్షేత్రముగా పేరు వచ్చింది. ఆదిశంకరులు ఈ క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ తపస్సు చేసుకున్నట్లు గాథలు. ఇక్కడ దక్షిణామ్నాయ పీఠమైన శృంగేరివారి శంకరమఠం కూడ ఉంది. మొదట ఒక్క మూలవిరాట్టే ఉండగా కాలక్రమేణా మహాకాళి, మహా సరస్వతీ మూర్తులను కూడా ప్రతిష్ఠించి పూర్తి ఆది శక్తి పీఠంగా దీన్ని చోళ, మరాఠా రాజులు, పాలకులు తీర్చిదిద్దారు. ఆదిశంకరుల కాలంలోనే ఇక్కడి దీపపు స్థంభం కట్టబడినది. 11వ శతాబ్దంలో గండరాదిత్య హయాంలో గుడి మరమ్మత్తులు, గుడి చుట్టూ ప్రదక్షిణానికి బాట, మహాకాళీ, మహా సరస్వతుల విగ్రహ ప్రతిష్ఠ జరిగాయి. మూల విరాట్టుకు, మహా కాళికి మధ్య ఒక మహాలక్ష్మి యంత్రము స్థాపించబడింది. దీనిని మనం దర్శించేలా గాజు పలక కింద ప్రతిష్ఠించారు. అభిషేకాలతో కాలదోషం పట్టిన మూలవిరాట్టును 195లో వజ్రలేపనం ద్వారా గట్టి పరచారు. మొత్తం ప్రాంగణం, సమీపంలో 5 ముఖ్య గుడులు, ఏడు దీపమాలలు ఉన్నాయి. గుడికి దగ్గరలో 35 చిన్న పెద్ద గుళ్లు ఉన్నాయి.


గర్భగుడికి మొదటి తోరణం శివ శక్తులకు సంకేతంగా నల్లని రాతితో నిర్మించారు. ఈ తోరణపు లలాటబిందులో గణేషుడు ఉంటాడు. దీనిని గణేష పట్టిక అంటారు. దీని తరువాత  రంగమంటపం, కూర్మ మంటపం ఉన్నాయి. అటు తరువాత మంటపంలో (అమ్మవారికి ముందు వైపు) జయ విజయులు ఉంటారు. అమ్మవారికి ఎదురుగా ఉన్న గణపతికి ఇరువైపులా లోపాముద్ర, అగస్త్యులు ఉంటారు. వేంకటేశ్వరుని మందిరానికి దగ్గరగా కాత్యాయని కూడా ఉంది. మొత్తం దేవాలయం ఐదు గోపురాల క్రింద ఉంటుంది. మధ్యలో ఒక గోపురం, నాలుగు దిక్కులా నాలుగు. తూర్పు వైపు ఉన్న గోపురం క్రింద మహాలక్ష్మి మూల విగ్రహం. మధ్య ఉన్న గోపురం క్రింద కుమార మండపం, పడమర గోపురం కింద గణపతి, ఉత్తర దక్షిణ గోపురాల క్రింద మహాకాళి మహా సరస్వతులు ఉంటారు. నాలుగు వైపులా ఉన్న ద్వారాలను మహాద్వారము (పడమర వైపు), ఘటీ దర్వాజా (ఉత్తరం వైపు),విద్యాపీఠ్ దర్వాజా( దక్షిణంవైపు),  పూర్వ దర్వాజా అంటారు. ఉత్తర ద్వారంవైపు నవగ్రహ దేవాలయం, దక్షిణద్వారం వైపు రాధాకృష్ణ, కాలభైరవ, సిద్ధి వినాయక, సింహవాహిని, తుల్జాభవాని, లక్ష్మీనారాయణ, అన్నపూర్ణ, ఇంద్ర సభ, రామేశ్వర, నారాయణ స్వామి మహారాజ్ మందిరాలు ఉన్నాయి. తూరుపు ద్వారము వైపు శేషశాయి మందిరం అష్ట భుజాకారంలో అద్భుతంగా ఉంటుంది. మొత్తం ముఖ్య దేవాలయ ప్రాంగణంలోని అన్ని బయట గోడలపై సురసుందరిలు, నాట్యం చేసే అప్సరసలు, చతుష్షష్టి యోగినులు నల్లని రాతిపై అద్భుతంగా చెక్కబడి ఉంటాయి. గోపురాలన్నీ నవీన మహారాష్ట్ర సంస్కృతికి ప్రతిబింబంగా ఉంటాయి. వీటికి పసుపు ఎరుపు రంగులు వేసి కళకళలాడుతూ ఉంటాయి.

మహాలక్ష్మి క్షేత్రం విశ్రాంతిగా ఒక రోజు మొత్తం గడపగలిగిన దివ్యధామం. పట్టణం మధ్యలో ఉంది కాబట్టి వెళ్ళటానికి ఇబ్బంది ఉండదు. కొల్హాపుర్ పట్టణం పచ్చని సహ్యాద్రి కనుమలకు దగ్గరగా మంచి సారవంతమైన భూమిలో పచ్చని పొలాలతో, మంచినీటి వసతి ఉన్న ప్రాంతం. కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మిక సంపద, ప్రకృతి అందాలు పుష్కలం. దత్తాత్రేయుని కలియుగంలో రెండవ అవతారమైన నృసింహ సరస్వతి ఇక్కడికి అరవై కిలో మీటర్ల దూరంలో కృష్ణా, పంచగంగ నదుల సంగమ స్థానమైన నృసింహవాడి (నర్సోబావాడి) వద్ద కొన్ని ఏళ్లు గడిపారు. అక్కడ పచ్చని ప్రకృతి మధ్య గొప్ప దత్తాత్రేయ క్షేత్రం ఉంది. అలాగే, కొల్హాపూర్ పట్టణానికి సమీపంలో పన్హాలా కొండలు ప్రకృతి సౌందర్యానికి నెలవు. ఇక్కడ కొండపై శివాజీ మహారాజు కట్టించిన జ్యోతిబా పుణ్యక్షేత్రంలో శివుడు ప్రధాన దైవంగా ఎందరో దేవతల మందిరాలు కొండపై రమణీయమైన వాతావరణంలో మనకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. ఇవే కాక, రెండు, మూడు రోజులు గడిపే పర్యాటక స్థలాలు కొల్హాపూర్ కి దగ్గరలో ఉన్నాయి. కొల్హాపూర్ కు హైదరాబాద్ దాదాపు 540 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి కొల్హాపూర్ కి రైలు వసతి ఉంది కానీ దాదాపు ఒక రోజు ప్రయాణం. బస్సు అయితే రాత్రి ప్రయాణం. కాబట్టి బస్సు ప్రయాణం సౌకర్యం. ఎస్.బీ.ఆర్ నకోడా మరియు సంగీతా ట్రావెల్స్ వారి బస్సులు హైదరాబాద్ నుండి ఉన్నాయి. తప్పకుండా వెళ్లి ఈ శక్తిపీఠాన్ని దర్శించి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందండి.

ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగారు  సుమధురంగా ఆలాపించిన మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి స్తోత్రం వినండి.
 మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్నీచ ధీమహి తన్నో లక్ష్మిః ప్రచోదయత్

2 వ్యాఖ్యలు: