25, నవంబర్ 2011, శుక్రవారం

శ్రీమదాంధ్ర మహాభాగవతము ప్రథమ స్కంధము - ప్రార్థన పద్యములు

అమ్మకు అంకితం

భాగవతంలోని ప్రార్థనా పద్యాల తరువాత తన సంకల్పాన్ని, లక్ష్యాన్ని, భాగవత కావ్య లక్షణాలను పోతన గారు గొప్పగా మన ముందుంచారు. అందులో మూడు:

ఇమ్మనుజేశ్వరాధములుకిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములు గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము బాసి కాలుచే
సమ్మెటపోటులం బడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పె నీ
బమ్మెరపోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్

ఈ పవిత్ర గ్రంధమును అధములు, హీనచరితులైన ఈ రాజులకు అంకితమిచ్చి, వారిచ్చే ధనధాన్య వస్తువాహన గృహగ్రామాదులను స్వీకరించి, చివరకు యమధర్మరాజు తాడనములకు లోనగుటకంటె, ఈ బమ్మెరపోతన లోకహితార్థమై తన కావ్యకన్యయైన భాగవతమును ఆ శ్రీహరికే సమర్పించదలచెను.

ఈ పద్యంలో పోతన తన రచనలను అశాశ్వతమైన మానవులకు అంకితం ఇచ్చి చివరకు నరకయాతన పడటం కన్నా శాశ్వతుడైన ఆ శ్రీహరికే అంకితమిచ్చి లోకకళ్యాణమునకు సంకల్పము తెలిపారు. అది పోతన ఆదర్శాలకు, జీవనశైలికి, భగవద్భక్తికి, భోగభాగ్యాల పట్ల నిరాసక్తతకు నిదర్శనము. రాజులు తమను పొగిడినంత కాలం, తమకు ధనసంపద, రాజ్యమున్నంత కాలం, తామున్నంత కాలం ఆ కవిని పోషిస్తారు. తరువాత? అలాగే ఒక రాజును పొగడిన కవి ఇంకొక రాజుకు ఆప్తుడు కాలేడు కదా? ఇవన్నీ భగవంతుని విస్మరించి రాజులు శాశ్వతమని భావించి చేసినందువలన, నరకలోక ప్రాప్తి కలిగి నానా యాతనలు అనుభవించవలసినదేగా? భగవద్భక్తుడైన పోతన ఈ విషయము నిరంతరము స్ఫురణలో నిలుపుకొని శాశ్వతమైన, సచ్చిదానందమైన శ్రీహరికే తన కావ్యాన్ని అంకితమిచ్చి ధన్యుడైనాడు.



పలికెడిది భాగవతమట పలికించువిభుండు రామభద్రుండట నే
బలికిన భవహరమగునట పలికెద వేరొండుగాథ బలుకగ నేలా

నేను చెప్పబోవునది పరమపవిత్రమైన భాగవతమట, నాచే చెప్పించే నాథుడు సాక్షాత్తు ఆ శ్రీరామచంధ్రుడేనట, నేనీ భాగవతగాథను చెపితే సంసార బంధము నశిస్తుందట. అందుచేత నేనీ భాగవతమునే పలికెదను. మరివేరొక గాథను చెప్పడమెందుకు?.

తాను కేవలం కర్తను మాత్రమే అన్న భావనను తెలుపటానికి పోతనగారి ఈ పద్యం చక్కటి నిదర్శనము. అంతా ఆ రాముని సంకల్పముతో జరుగుతున్నదే, ఆ గాథను పలికితే అన్ని బంధాలు తొలగి మోక్షమార్గోన్ముఖుల మవుతామట, ఇంక వేరే గాథలు ఎందుకు చెప్పాలి? ఇది ఆయన లక్ష్యముపై గల తదేక దీక్ష, దృఢత్వానికి సంకేతము. కాబట్టే వ్యాస భగవానులు రచించిన బృహత్తరమైన భాగవతాన్ని పోతనగారు అత్యంత రమణీయంగా రచించారు.

లలితస్కంధము గృష్ణమూలము శుకాలాపాభిరామంబు మం
జులతాశోభితమున్ సువర్ణసుమనస్సుజ్ఞేయమున్ సుందరో
జ్జ్వలవృత్తంబు మహాఫలంబు విమలవ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్యకల్పతరువుర్విన్ సద్ద్విజశ్రేయమై

ఈ భాగవతము లలితమైన గ్రంథము. శ్రీకృష్ణభగవానుని చరిత్రయే దీనికి మూలము. శుకమహర్షిచే అందముగా ఆలాపించబడిన మంజులమైన గానము, బంగారములా శుద్ధి చేయబడిన మనసు గలవారికి తేటతెల్లము. అతిసుందరముగా శోభించే కథావస్తువు గలది. చాలా గొప్ప ఫలప్రదమైనది, విమలుడైన వ్యాసభగవానునిచే నిర్మితమైన భాగవతమనే కల్పవృక్షము, మంచి బ్రాహ్మణులకు శ్రేయస్కరమై వెలయునట్టిది.

భాగవత లక్షణాలను తెలిపే ఈ పద్యం అందులోని మార్దవాన్ని, సౌశీల్యాన్ని, శోభను, భావ సారూప్యాన్ని, మహిమను మనోజ్ఞంగా రూపొందించారు పోతన. ఇటువంటి లక్షణాలు, పదజాలము, భావజాలము కలిగిన పద్యాలు పోతన భాగవతంలో కోకొల్లలు. పోతన భాగవత ప్రొయులకు ఈ పద్యలక్షణాలను సుళువుగా గుర్తుపట్టగలరు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి