RightClickBlocker

28, అక్టోబర్ 2014, మంగళవారం

మరల మానవ జన్మనిమ్ము

మరల జన్మ రాకున్న ఎటుల తనివితీర అనుభూతి చెందు నేనీ అద్భుత ప్రపంచమును?
మరల జన్మ లేకున్న ఎటుల మనసారా సేవింతు నేనీ అనంతకోటి మోహనరూపములను?
మరల జన్మ చెందకున్న ఎటుల ప్రీతుడనై అనుభవింతు నేను మాతృప్రేమానురాగమును?
మరల జన్మ పొందకున్న ఎటుల నే స్పృశింతు ఓ కరుణామూర్తి పాద పద్మములను?
మరల భువికి రాకున్న ఎవ్విధమున నే దర్శింతు హిమశైల సమున్నత శిఖరమును?
మరల మరల రాకున్న ఎటుల కైమోడ్పులర్పింతు సద్గురు కృపావీక్షణములకు?

నీ అద్భుతలీలావేష్టితములను చవిచూడ మరి మరి మానవ జన్మనిమ్ము
నీ దివ్యమంగళ చరణములవద్ద పుష్పములుంచ శతకోటి అవకాశములిమ్ము
నాలోని నిన్ను అనుక్షణము నుతించి దర్శించి తరించే భాగ్యమునిమ్ము
అమ్మగా, అయ్యగా, గురువుగా, సఖునిగా నీ ప్రేమను పొందే వరములిమ్ము

ప్రభూ! మరల మానవ జన్మనిమ్ము! మరల నిజమైన మానవునిగా జీవించనిమ్ము!

విశ్వనాటకము

రంగులు పులిమిన అందమైన ముఖాల వెనుక ఎంతటి మనో మాలిన్యమో?
బాహ్యము పట్టని మురికి భిక్షుకుని లోన ఎంతటి ఆత్మ సౌందర్యమో?
వయ్యారంగా నడిచే అప్సరసల లోన ఎంతటి రాక్షసత్వమో?
కఠోర సత్యం పలికే బైరాగి లోన ఎంతటి దివ్యత్వమో?
తీయని పలుకులు పలికే నాయకుడి లోన ఎంతటి కాఠిన్యమో? 
మౌనముగా నిలిచిన ముదిమి అవ్వ లోన ఎంతటి కరుణయో?
చూచిన వానికి చూచినంత, అనుభూతి చెందిన వానికి చెందినంత.
అనంతకోటి జీవరాశులలోన, స్థావర జంగమములలోన వైవిధ్య భరితమైన ఈ మాయ ఏమిటో?
తానే సృష్టించి తానే నటించి, తానే మరపించి, తానే కనులు తెరపించే ఈ విశ్వనాటకమున నేనొక పాత్రధారినా? లేక సాక్షీభూతుడనా? పరమాత్మకే ఎరుక.