19, నవంబర్ 2014, బుధవారం

అర్చక వృత్తి - అర్హతలు




దేవస్థానాలలో అర్చక వృత్తిలో ఉన్నవారికి కావలసిన అర్హతలు:

1. ప్రతిష్ఠించ బడిన దేవతా మూర్తిపై అచంచలమైన భక్తి, విశ్వాసము మరియు శరణాగతి
2. ఆ దేవతామూర్తి యొక్క నిత్య పూజా విధానము, తత్సంబంధమైన ఆగమ శాస్త్రముపై పట్టు మరియు స్పష్టత
3. దృష్టి పళ్లెంలో వేసే డబ్బులపై, దక్షిణపై, వచ్చే భక్తుల ఆర్థిక స్థోమతపై కాకుండా భగవంతునికి భక్తునికి మధ్య నిరంతర అనుసంధానంగా ఎలా ఉండాలి అన్న దానిపై కలగాలి.
4. బాహ్య శుద్ధి, అంతశ్శుద్ధితో కూడిన నిరాడంబరమైన జీవితము. 
5. భక్తుల సమస్యలను, బలహీనతలను దుర్వినియోగం చేయని ఉన్నతమైన వ్యక్తిత్వము. 

ఈ ఐదూ నేటి అర్చక సమాజంలో చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టే, వారంటే ప్రజలకు, ప్రభుత్వాలకు గౌరవం పోయింది, వారి సేవకు తగినంత ఉపాధి లభించటం లేదు. ఎప్పుడైతే ఈ లక్షణాలతో అర్చకుడు తన పవిత్రమైన వృత్తిని చేపడతాడో అప్పుడు అతని భుక్తికి, కుటుంబం గౌరవ ప్రదంగా జీవించటానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. జ్ఞానము, సద్బుద్ధి, శుచి ఉన్న అర్చకుడు ఏ యుగంలోనూ ప్రజలచే, పాలకులచే నిరాదరించబడలేదు.

ఈ లక్షణాలకు సాత్వికాహారం, వేదవాఙ్మయ జ్ఞానం, పురాణేతిహాసముల ఆకళింపు, నేటి సామాజిక పరిస్థితులపై అవగాహన తప్పనిసరి. జన్మతో వచ్చిన బ్రాహ్మణత్వమొక్కటే అర్చకత్వానికి అర్హత కాదు. ఎక్కడ జన్మించినా వికసించిన హృదయకమలం, తెరుచుకున్న జ్ఞాన చక్షువులు, సత్సాంగత్యమునందు ఆసక్తి కలిగి ఉంటే అర్చకత్వానికి అర్హుడే. 

ఇటువంటి పవిత్రమైన వృత్తికి పవిత్రమైన మనుషులను మనమే జన్మతో వచ్చే కులాలకు అతీతంగా తయారు చేయలి, వెదకాలి, ప్రోత్సహించాలి. అప్పుడే దేవాలయ వ్యవస్థ యొక్క పవిత్రత పునరుత్థానమవుతుంది, కలకాలం నిలబడుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి