2, మే 2015, శనివారం

నిరవధి సుఖద నిర్మల రూప నిర్జిత ముని శాప



నిరవధి సుఖద నిర్మల రూప నిర్జిత ముని శాప 

శరధి బంధన నత సంక్రందన
శంకరాది గేయమాన సాధు మానస సుసదన

మామవ మరకతమణినిభ దేహ
శ్రీమణి లోల శ్రితజన పాల
భీమ పరాక్రమ భీమ కరార్చిత
తామస రాజస మానవ దూర త్యాగరాజ వినుత చరణ

అవధిలేని సుఖాన్ని ఇచ్చే వాడు, నిర్మలమైన రూపము కలవాడు, అహల్యకు శాపవిముక్తి కలిగించిన వాడు రాముడు. వారధిని నిర్మించిన వాడు, ఇంద్రునిచే నుతించబడిన వాడు, శంకరాదులచే స్తుతించబడిన వాడు, సాధు జనులు మనసులలో నివసించేవాడు రాముడు. మరకతమణి వలె ప్రకాశించే దేహము కలవాడు, లక్ష్మీదేవికి బద్ధుడైన వాడు, ఆశ్రితులను పాలించే వాడు, అత్యంత పరాక్రమవంతుడు, భీమునిచే పూజించ బడిన వాడు, మానవులను తామస రాజస గుణములనుండి దూరం చేసే వాడు, శివునిచే అర్చించ బడిన చరణములు కలవాడు రాముడు!

త్యాగరాజ స్వామి వారు రాముని ఎన్ని విధాల నుతించాడో? ఒక్కొక్క కీర్తనలో ఒక్కొక్క భావం, గుణ వర్ణనతో పాటు నిగూఢమైన ఆధ్యాత్మిక సందేశం కూడా అయన సంకీర్తనలలో ఉన్నాయి. అనంతమైన ఆనందాన్ని ఇచ్చే వాడు రాముడు అన్నది సారాంశం. దానికి నిర్మలమైన రూపం, అహల్య శాపవిముక్తి ఉపోద్ఘాతాలు. నిర్మలమైన రూపం ఎలా వచ్చింది? ధర్మానికి కట్టుబడటం వలన. ఎన్ని కష్టాలు వచ్చినా, తనకు నేర్పబడిన ధర్మాన్ని వీడలేదు. గౌతమముని సామాన్యమైన ఋషి కాదు. సకల విద్యా పారంగతుడు, అమిత తపోబల సంపన్నుడు. ఆయన శాపానికి గురైన అహల్య కొన్ని వందల ఏళ్లపాటు పాషాణమై నిలిచింది. రాముని ధర్మ బద్ధత, నిర్మల రూపం ఆ పాషాణానికి ప్రాణం పోసింది. అదీ రాముని గొప్పతనం. మనమందరమూ కూడా అటువంటి రాతిబండల బ్రతుకే గడుపుతాము చాలా మటుకు. మనకు నిజమైన జీవాన్ని ఇచ్చేది రాముని వంటి ధర్మ బద్ధతే. ఆయన జీవితాన్ని అర్థం చేసుకొని వీలైనంత నిర్మలంగా ఉండి ధర్మాన్ని పాటిస్తే, ఈ పాషాణపు హృదయాలు కరిగి జీవి ఉన్నతిని పొందుతాడు. రాముని జీవితాన్ని గమనించి ధర్మాన్ని పాటిస్తే మనలోని రాజస తామస గుణాలు నశిస్తాయి.

త్యాగరాజస్వామి అనుభవంతో, అనుభూతులతో రాసిన ఇటువంటి సంకీర్తనలు మనలను సరైన మార్గంలో పెట్టాలి..మనం కూడా అవధిలేని సుఖాన్ని అనుభవించాలి. ఈ దుర్లభమైన మానవ జన్మకు సార్థకత కలిగించాలి.

సద్గురువులు కాకర్ల త్యాగబ్రహ్మ స్వామి వారికి శతసహస్ర వందనాలు. డాక్టర్ బాలమురళీకృష్ణ గారి గళంలో ఈ కృతి వినండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి