22, మే 2015, శుక్రవారం

రామ నీల మేఘ శ్యామ కోదండరామ


రామ నీల మేఘ శ్యామ కోదండరామ


జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం
జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం
సకల నిగమ మంత్రం సర్వ శాస్త్రైక మంత్రం
రఘుపతి నిజమంత్రం రామ రామేతి మంత్రం
-  శ్రీరామకర్ణామృతం

రామ నీల మేఘ శ్యామ కోదండరామ
రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘ శ్యామ
రఘురాం రాం రాం రఘురాం జయరాం రాం రాం జయరాం

తల్లితండ్రి గురువు నీవే తోడు నీడ నీవే
ధరణినెల్ల పాలన చేసే పరంజ్యోతివే
జాగు ఇక చాలును రామయ్య దాసులను బ్రోవగ రావయ్య
తెలియ తరమా పలుక వశమా నీదు మహిమ రాఘవా

రామ నీల మేఘ శ్యామ కోదండరామ
రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘ శ్యామ
రఘురాం రాం రాం రఘురాం జయరాం రాం రాం జయరాం

రాతినైన నాతిని జేసే నీ దివ్య పాదము
కోతినైన జ్ఞానిని చేసే నీ నామము
నీదు సరి దైవము లేరయ్యా నిన్ను నే నమ్మితి రామయ్యా
నీదు చరణం పాప హరణం మాకు శరణం రాఘవా

రామ నీల మేఘ శ్యామ కోదండరామ
రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘ శ్యామ
రఘురాం రాం రాం రఘురాం జయరాం రాం రాం జయరాం

- శ్రీ గబ్బి వేంకటరావు గారు (రామాంజనేయ యుద్ధం చలన చిత్రానికి రాసిన పాట)


రాముని నుతి హనుమ నోట వస్తే అది భక్తి పూరితమై, శరణాగతిని పరిపూర్ణంగా కలిగిన అర్చనగా నిలుస్తుంది. రామభక్తికి సామ్రాజ్యానికి దొర హనుమంతుడు అని పాలగుమ్మి విశ్వనాథం గారు హనుమంతుని వైశిష్ట్యాన్ని మనకు నాలుగు పదాలలో చెప్పారు. ఆ హనుమంతుని నోట రామస్తుతి ఈ రామాంజనేయ చిత్రంలోని పాట. గబ్బిట వేంకటరావు గారు రచించిన ఈ గీతాన్ని కొత్త రఘురామయ్య గారు ఎంతో భక్తితో పాడారు.

పాట ముందు రామ మంత్ర మహిమను శ్లోకం ద్వారా మనకు తెలియ జేశారు. ఈ శ్లోకం  శ్రీరామకర్ణామృతం  లోనిది.

అర్థం:

జన్మకు సాఫల్యాన్ని ఇచ్చే మంత్రము, జనన మరణాల వలన కలిగే దుఃఖము, కష్టములను నాశనం చేసే మంత్రం, సమస్త వేద వాజ్ఞమయము మరియు శాస్త్రముల సారమైన ఏకైక మంత్రం రఘుపతి నిజమంత్రమైన రామ రామ అనే మంత్రం.దానికి జయము జయము.

గీతం యొక్క భావం:

రామా! నల్లని మేఘములు వంటి శరీర ఛాయ కలిగి, కోదండమును ధరించిన రామా ! రఘుకులమనే సాగరానికి చంద్రుని వంటి రామా ! పరమాత్మా! సార్వభౌమా!

రఘురామా! రామా! రామా! రఘురామా! జయరామా! రామా! రామా! జయరామా!

తల్లి, తండ్రి, గురువు నీవే! తోడు నీడ నీవే! ఈ భూమినంతిటినీ పాలించే సర్వేశ్వరుడివే! ఇంక ఆలస్యము చాలు రామయ్య! దాసులను బ్రోవటానికి రావయ్యా! నీ మహిమ పరిపూర్ణంగా తెలియుట ఎవరికి తరము? పలుకుటకు ఎవరికి వశము? ఓ రాఘవా!

చలనరహితమై రాయిగా మారిన అహల్యను చైతన్యపూరితం చేసింది నీ పవిత్రమైన పాదము. చంచలత్వం కలిగిన కోతిని కూడా జ్ఞాని చేసింది నీ తీయని నామము. నీకు సాటి దైవము లేరయ్యా! నిన్ను నేను నమ్మినాను రామయ్యా! నీ పాదాలే మా పాపములను హరిస్తాయి, అవే మాకు శరణం రాఘవా!

ఈ మంత్ర సారం, మహిమ హనుమంతుని కన్నా ఎవరికి తెలుస్తుంది? మహా జ్ఞాని, అతి బలవంతుడు, మాటల నేర్పరి, మహా భక్తుడు, వినయ సంపన్నుడు, సమయస్ఫూర్తి కలవాడు, రాజుకు నమ్మిన బంటు, ప్రభువుకు ఉత్తమ సేవకుడు...ఇలా ఎన్నో సుగుణాలు హనుమకు రామ నామము వలన కలిగాయి. హనుమంతుని నుండి నేటి సద్గురువుల వరకు తారక రామ మంత్రముతో తరించిన వారే.

యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకానజలిం
బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం

ఎక్కడెక్కడైతే రాముని నామ సంకీర్తనం జరుగుతుందో అక్కడ శిరసువంచి అంజలి ఘటించి, ఆనంద బాష్పాలు నిండిన కనులతో నిలిచి ఉండే రాక్షాసంతకుడైన మారుతిని ధ్యానిస్తున్నాను.

ఈ శ్లోకం హనుమ ప్రగాఢమైన రామభక్తిని చక్కగా సూచిస్తుంది. రాముని నామం పలుకబడే ప్రతిచోటా హనుమ ఉంటాడట. ఆ నామస్మరణలో తనను తాను మరిచే నిజభక్తుడు హనుమ. అటువంటి హనుమ రాముని గురించి పాడితే ఎలా ఉండాలో అలాంటి గీతమే అందించారు గబ్బిత వేంకటరావు గారు.

కవి హనుమ హృదయంలోని భావనను ఎంత హృద్యంగా, వీనులకు విందుగా సర్వస్యశరణాగతితో వ్యక్తపరచారు. పరమాత్మ పాదాలు శరణు అని పరిపూర్ణంగా  భావించేవాడు  నిత్యం వచ్చే సమస్యలతో పాటు జనన మరణాలకు సంబంధించ బాధలను కూడా అవలీలగా దాటగలడు అన్నది సారాంశం. తల్లి తండ్రి గురువు నీవే అని భావించాలంటే పరమాత్మను అన్నిటా దర్శించగలిగే స్థాయికి ఎదగాలి. దానికి కఠోరమైన సాధనతో పాటు జన్మనిచ్చిన తల్లిదండ్రుల విలువ, గురువల ప్రాధాన్యత తెలిసి ఉండాలి. దీనికి తదనుగుణమైన పెంపకం ఎంతో అవసరం. పరమాత్మ సర్వేశ్వరుడని భావించటానికి అన్నిటి పట్ల సమభావం కలగాలి. అజ్ఞానాన్ని తొలగించే గురువులు కావాలి. అన్నిటికీ నీవే దిక్కు అన్న భావనతో కొలిచే భక్తునికి ఆయన మహిమలు అనంతముగా, నిరంతరముగా ప్రవహిస్తాయి. అదే ఇక్కడ హనుమకు కలిగిన భావన.

భర్త శాపవశాత్తు శిలయైన అహల్య నిర్దోషి. కానీ, ఇంద్రుడు గౌతముని తపమునకు భంగము కలిగించే సంకల్పంలో అహల్య ఒక పాత్రధారియై వేల ఏళ్ల పాటు శిలగా నిలుస్తుంది. అటువంటి అహల్యను తిరిగి చైతన్యవంతమైన ఋషిపత్నిగా చేసింది రామ పాదం. అలాగే వానర సమూహంలో తన శక్తిని తెలియక ఉన్న హనుమను, ఇతర వానరములను జ్ఞానులుగా చేసింది రామ నామం. అజ్ఞాన తిమిరాంధకారములనుండి జ్ఞానసుధారసం వైపు తీసుకు వెళ్లింది ఈ రామ నామం. ఈ భావనను ఎంతో చక్కగా ప్రస్తావించారు కవి. హనుమ హృదయాన్ని మన ముందు ఆవిష్కరించారు. అందుకే ఈ గీతం అజరామరమైంది. బీ. గోపాలం గారు అదే రీతిలో సంగీతం అందించగా కొత్త రఘురామయ్య గారు శ్రావ్యంగా పాడారు. రంగస్థల కళాకారులైన వీరు తమ గొంతులోని మాధుర్యాన్ని భక్తి భావంలో మేళవించి గీతానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు.

ఇక్కడ ఆర్జా జనార్దనరావు గారి గురించి చెప్పుకోవాలి. తెలుగు చలన చిత్రాలలో హనుమ అంటే ఆయనే అనేలా ఎన్నో చిత్రాలలో ఆంజనేయుడిగా నటించారు. దేహ సౌష్ఠవం కలిగిన ఆయన లవ కుశ, శ్రీకృష్ణావతారం, రామాంజనేయ యుద్ధం, వీరాంజనేయ, ఆంజనేయ చరిత్ర, సంపూర్ణ రామాయణం, త్యాగయ్య వంటి ఎన్నో చిత్రాలలో హనుమంతునిగా నటించాడు. ఆయన కనులలో భక్తి, వానర లక్షణాలు, నటనలో బుద్ధిర్బల యశోధైర్యాలు అద్భుతంగా పండించేవారు. ఆయనను చూస్తే హనుమ రూపం కళ్లకు కనబడినట్లే. ఈ గీతంలో ఆర్జా జనార్దన రావు గారు భక్తిపూరితమైన నటన అనుపమానం. అందుకే ఈ గీతం పరిపూర్ణతను పొందింది.

కొత్త రఘురామయ్య గారి గళంలో ఈ పాట వినండి.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి