RightClickBlocker

30, జూన్ 2015, మంగళవారం

కొలువుడీ భక్తి కొండల కోనేటి నిలయుని శ్రీనిధియైన వాని

కొలువుడీ భక్తి కొండల కోనేటి నిలయుని శ్రీనిధియైన వాని కొలువుడీ భక్తి కొండల కోనేటి నిలయుని శ్రీనిధియైన వాని 

ఆది దేవుని అభవుని సామవేద నాద వినోదుని 
నెరవాది జితప్రియుని నిర్మల తత్వవాదుల జీవనమైన వాని

దేవదేవుడైన దివ్యుని సర్వభావాతీత స్వభావుని
శ్రీవేంకటగిరి దేవుడైన పరదేవుని భూదేవ తత్పరుని

ఏడుకొండలలో కోనేటి సమీపాన వెలసి సిరితో కూడిన వేంకటేశ్వరుని భక్తితో కొలవండి!

ఆదిదేవుడైన, పుట్టుకలేని, సామగానప్రియుని, సమర్థుడైన వాని, ద్వేషాన్ని జయించిన వాని, నిర్మలమైన మనసులు కలిగిన వారికి జీవనమైన వేంకటేశుని భక్తితో కొలువండి!

దేవతలకే దేవుడైన వాని, దివ్యమైన వాని, అన్ని భావనలకు అతీతమైన స్వభావము కలవాని (ఆలోచనకు, దృష్టికి, వర్ణనకు అందని స్వభావము కలవాడు), శ్రీవేంకటగిరికి దేవుడైన వాని, పరమేశ్వరుని, భూమికి ప్రభువైన శ్రీవేంకటేశ్వరుని భక్తితో కొలువండి!

అన్నమాచార్యులంటే శృంగార సంకీర్తనలు అని అనుకునే వారికి ఈ సంకీర్తన ఒక కనువిప్పు. అత్యున్నతమైన ఆధ్యాత్మిక భావాన్ని తన ఎన్నో సంకీర్తనలలో సద్గురువులు పొందుపరచారు. అందులో ఈ కొలువుడీ భక్తి ఒకటి. ఆధ్యాత్మిక మార్గంలో ముఖ్యమైనది భక్తి.   శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం ఆత్మనివేదనం అనేవి తొమ్మిది విధాలైన భక్తి మార్గాలు అని ఆర్యోక్తి.  వీటిలో కలియుగంలో కీర్తనం అత్యుత్తమమైనది. ఆ కీర్తన భక్తి మార్గానికి అన్నమాచార్యుల వంటి వాగ్గేయకారులు సంకీర్తనలను సాహిత్యంగా అందించి వాటిని భగవంతునికి నివేదన చేసి వాటిని మంత్రసమానం చేశారు. నిగమాలలో పొదిగిన దివ్యమంత్రాలకు ఈ సంకీర్తనలు ఏమాత్రమూ తగ్గవు. భాష, సందర్భం, కాలం వేరైనా, వాగ్గేయకారుల కృతులు మనిషికి ఆధ్యాత్మిక మార్గనిర్దేశకాలు.

మరి ఆ భక్తిలో కావలసినది ఏమిటి? జ్ఞానం. పరమాత్మ తత్త్వాన్ని   ఎరిగి కొలిచితే అది అనుభవైకవేద్యము. సంకీర్తనల ప్రధాన లక్ష్యం ఆ తత్త్వాన్ని వర్ణించి చాటటం.

ఏడుకొండలలో నివాసం ఏర్పరచుకున్న శ్రీవేంకటేశ్వరుని మహిమలను ఈ కీర్తనలో అన్నమాచార్యుల వారు మనకు తెలియజేస్తున్నారు. ఆయన తన సంకీర్తనలలో స్వామి పుష్కరిణిని కోనేటి గా సంబోధించారు. యోగులు, సిద్ధులు ఇప్పటికీ తమ దివ్య దేహాలతో అక్కడ నిత్యము స్నానమాచరించే పుణ్య తీర్థం తిరుమలలోని దేవాలయం ప్రక్కనే ఉన్న పుష్కరిణి. అంతటి పవిత్రమైన పుష్కరిణిలో స్నానం చేసి స్వామి దర్శనం చేసుకోవటం చాలా ముఖ్యమైనది. తిరుమలలో స్వామి విగ్రహంలో సిరి ఆయన వక్షస్థలంలో కనిపిస్తుంది. కాబట్టి ఆయనకు శ్రీనిధి అని పేరు వచ్చింది.

ఆదిదేవుడు అంటే? మొట్టమొదటి వాడు. సృష్టి అంతటా తానే అయినవాడు, సృష్టిని చేసేవాడు మరి ఆది దేవుడే కదా? సనాతనుడైన ఆద్యంతములు లేవు కాబట్టి ఆయనను అభవుడు అని అన్నమాచార్యులు కొలిచారు. ఓంకారమునుండి ఉద్భవించిన నాదం సామ గానరూపంలో స్వామిని అలరిస్తుంది. అందుకనే ఆయన సామగాన ప్రియుడైనాడు. శ్రీవేంకటేశ్వరుడే కాదు, ఏ పరదేవతా రూపానికైనా సామగానం ప్రియమైనదే. అన్నమాచార్యుల వారు స్వామియొక్క సమర్థతకు సూచికగా నెరవాది అన్న పాదం వాడారు. భాషలో జనుల నోట నానే పదాలు ఉపయోగిస్తే వారికి భావం తొందరగా అంది సందేశం మరింత ప్రభావవంతంగా హత్తుకుంటుంది. అందుకే నెరవాది అన్నాడు స్వామిని. జితప్రియు అన్న పదంలో అన్నమయ్య ఎంతో నిగూఢమైన భావాన్ని నింపారు. ద్వేషాన్ని జయించిన వాడు అని దీనికి అర్థం.  ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కృష్ణభగవానుడు చెప్పినట్లు  ప్రతియుగంలోనూ ఎన్నో మార్లు ద్వేషం వలన విశ్వంలో కలిగే అశాంతిని జయించటానికి పరమాత్మ ఎన్నో అవతారాలను ఎత్తాడు. దానికి సూచిక ఈ జితప్రియు అన్న పదం. నిర్మలమైన మనస్సు కలవారి జీవన తత్త్వమే ఆయన అన్నారు అన్నమయ్య. నిర్మలంగా జీవించటం అంటే కల్మషం లేకుండా అని అర్థం. దానికి ఎంతో త్యాగం, జ్ఞానం, సత్సాంగత్యం కావాలి. వీటన్నిటిలోనూ పరమాత్మ నిండి ఉన్నాడు అని చెప్పి అన్నమయ్య పరమాత్మ ఏదో ఒక లక్షణమని కాకుండ ప్రతి క్షణమూ ఆయనే అన్న సందేశాన్ని అందించారు.

దేవతలకు దేవుడు అన్నదానిలో పరమాత్మయొక్క పరమేశ్వర స్వరూపాన్ని మనకు తెలుపుతున్నారు. దివ్యమైన వాడు ఎందుకు? అగణిత గుణ గణ మహిమా వైభవాలను సృష్టి ఆదినుండి అంత్యము వరకు మనకు ప్రకటితం చేస్తూనే ఉన్నడు కాబట్టి. సర్వభావాతీత స్వభావుడు ఎల అయినాడు? ఆది అంత్యము లేని వాడు, దేని యందు లేని వాడు, అన్నీ తానే అయిన వాడిని ఏ భావజాలంతో ఒక రూపం ఇవ్వగలం. ఆయన లక్షణాలను ఏ భావమూ సంపూర్ణంగా ప్రతిబింబించలేదు. వేంకటాద్రిపై వెలసిన స్వామి పరదేవుడని అన్నాడు అన్నమాచార్యుల వారు. ఇహములో మన పాపసంచయాన్ని తీసుకొని పరము వైపు మార్గాన్ని సూచిస్తున్నాడు కాబట్టి ఆయన అన్ని దివ్యశక్తులను మించిన పరమేశ్వరుడు. భూదేవి భారాన్ని కాలానుగుణంగా అవతారాలతో తగ్గిస్తూ, మానవాళికే కాక భూమాతకు ప్రభువైనాడు ఆయన. ఆ సంకల్ప తత్పరుడు స్వామి.

మొత్తంగా, ఈ సంకీర్తనలో పరమాత్మ తత్త్వాన్ని ఒక భక్తిగుళికలో అందించారు అన్నమయ్య.

వాగ్గేయకారుల సంకీర్తనలకు సార్థకత వాటిలోని భావాని తెలుసుకొని, పాడి, సమాజాన్ని ప్రభావితం చేసే గాయకులు లభించటం. భక్తి ప్రాధాన్యమైన గాత్ర ధర్మానికి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు నిలువుటద్దం. ఆ మహాగాయని ఈ సంకీర్తనను భావగర్భితంగా, భక్తిరసధారగా ఆలపించారు. ఆమె గళంలో ఈ సంకీర్తన వినండి

వరాల బేరమయా వనరౌ బేరమయా - గోమాత ప్రాశస్త్యం


వరాల బేరమయా వనరౌ బేరమయా - గోమాత ప్రాశస్త్యంవరాల బేరమయా వనరౌ బేరమయా
పరాకు చేయకు పదే పదే దొరుకదయా

ఓ.......అయ్యా
దేవతలు దీవించి పంపిన పశరమయ్యా
కొన్నవారికన్ని సిరులు కూర్చు గంగిగోవయ్యా

మనిషికున్న తెలివున్నది మనిషిలోని చెడులేనిది
కొందామని అందరు కొమ్ము కడితే కుమ్ముతుంది
కోరుకున్నవారి వెంట గోవులాగే వస్తుంది వరాల బేరమయా

పచ్చని లచ్చిమికి పసుపు కుంకుమ పెట్టి దినము
ప్రొద్దునే మొక్కుకుంటే పోతుంది పాపము
పాత్ర చూసి పాలను మనసు చూసి మంచిని
ఇచ్చేది ఈ ఆవు ఇదే కామధేనువు వరాల బేరమయా

గోవు ఈ భూలోకములో మానవులను ఉద్ధరించే కామధేనువు. ఈ సందేశాన్ని మనకు ఆర్యులు వేదవేదాంగాల ద్వార, ఉపనిషత్తుల ద్వారా యజ్ఞయాగాది క్రతువులు ద్వారా, పురాణముల ద్వారా మనకు తెలియజేశారు. గోవును పూజిస్తే వచ్చే ఫలితాలు, గోపంచకము (పాలు, పెరుగు, నెయ్యి, మూత్రము, పేడ) దివ్యౌషధములుగా ప్రాణికోటిని అనాదిగా కాపాడుతునే ఉన్నాయి. ఇటీవలి శాస్త్రపరిశోధనలు కూడా ఈ విషయాన్ని నిర్థారించాయి. 

శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం చిత్రంలో తపస్సు చేస్తున్న శ్రీనివాసుని కోసం బ్రహ్మ రుద్రులు లక్ష్మీదేవితో కలసి ధరించిన రూపాలు ఈ గీతం యొక్క సందర్భం. పౌరాణిక చిత్రాలలో మంచి సందేశమున్న గీతాలను తెలుగు సినీదర్శకులు అప్పట్లో రూపొందించేవారు. గోమాత ప్రాధాన్యతను, వైశిష్ట్యాన్ని జానపద తెలుగు భాషలో, వేషభూషణములతో ఈ గీతం పొందుపరచబడినది. అర్హత కలిగిన యజమాని కోసం లక్ష్మీదేవి ఈ గోవును వీధుల తిప్పుతూ పాడే పాట ఈ వరాల బేరమయా. 

ఎస్ వరలక్ష్మి గారి గొంతులో గాంభీర్యము, మాధుర్యము, తెలుగు భాషపై పట్టు చక్కగా పండేవి. ఒక ప్రత్యేకమైన గొంతు ఆవిడది. తన పాత్రలకు తానే పాడుకునే బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్ వరలక్ష్మి గారు. అద్భుతమైన నటనా కౌశలంతో పాటు సంగీతప్రవేశం కలిగి ఎన్నో చలనచిత్రాలలో నేపథ్యగాయనిగా ఆమె పాడారు. 

ఈ గీతంలో ఆచార్య ఆత్రేయ గారు గోమాత ప్రాశస్త్యాన్ని అద్భుతంగా తెలిపారు. 

వరాలను కురిపించే ఆవు, మంచి వనరులను (పాలు మొదలైనవి) ఇచ్చే దీనిని నిర్లక్ష్యం చేయద్దు, ఇటువంటి ఆవు పదే పదే దొరకదు. దేవతలు దీవించి పంపిన పశువు ఇది. కొన్నవారికి సకల సంపదలను ఇచ్చే గంగిగోవు ఇది. మనిషికున్న తెలివి ఆ గోవుకు ఉంది. కానీ, మనిషిలో ఉన్న చేదులేనిది. (ఎటువంతి స్వార్థం లేకుండా   మానవాళి మంచికోసం అద్భుతమైన పంచకాలను ప్రపంచానికి ఇస్తుంది). ఎవరు పడితే వారు కొందామని ముందుకు వస్తే కుమ్ముతుంది. సరైన అర్హత కలిగిన యజమాని వెంట అతి సాధుస్వభావంతో నడుస్తుంది. ఈ గోవు లక్ష్మీ దేవి ప్రతిరూపం. ఈ గోవును ప్రతి రోజు ఉదయం పసుపుకుంకుమలతో పూజించి మ్రొక్కితే పాపాలు తొలగిపోతాయి. పాత్రను చూసి పాలను, కొలిచే వాని మంచిని చూసి వారికి మంచిని ఇచ్చేది ఈ ఆవు. ఇది కామధేనువు.  వరాలను, వనరులను ఇచ్చే మంచి బేరము. అవకాశం పోగొట్టుకోకుండా కొనండి. 

ఆత్రేయగారి సాహిత్యంలో గోవు వైభవాన్ని మనకు సందర్భోచితంగా అందించారు. సమస్త పాపనాశిని, సకల కామితార్థ దాయిని, సమస్త పుణ్యదేవతా నివాసిని అయిన గోవును కాపాడుకోవటం సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి భారతీయుని కర్తవ్యం. మాంసం పేరిట పరమపూజనీయమైన, అతి పవిత్రమైన సాధుజంతువులను నిర్దాక్షిణ్యంగా, అతి దారుణంగా హింసించి వధించి భారతదేశ గోసంపదను నాశనం చేయటమే కాక, ఈ పవిత్రభూమికి అతి నికృష్టమైన పాపాన్ని అంటగడుతున్నారు ఈరోజు. గోవులను పెంచి, వాటి ఉత్పత్తుల వలన కలిగే అద్భుతాలను ప్రపంచానికి అందించేలా చేయవలసిన సమాజం వాటిని వధిస్తుంటే చూస్తూ ఊరుకోవటం మహాపాపం. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించి గోమాతకు రక్షణ కలిపిద్దాం. 

పెండ్యాల సంగీతం, ఆత్రేయ సాహిత్యం, ఎస్ వరలక్ష్మి గారి నటన మరియు గాత్రంలో ఈ గోమాత గీతం చూడండి.

గావో రక్షతి రక్షితః!!


29, జూన్ 2015, సోమవారం

శ్రీకృష్ణ జనన సమయమున దేవకీ వసుదేవుల స్తుతి - పరమాత్మ తత్వము, సృష్టిరహస్యము

శ్రీకృష్ణ జనన సమయమున దేవకీ వసుదేవుల స్తుతి - పరమాత్మ తత్వము, సృష్టిరహస్యము

(పోతన విరచిత శ్రీమదాంద్ర మహాభాగవతం దశమస్కంధము నుండి)సుతుగనె దేవకి నడురేయతి శుభగతిన్ తారలును గ్రహంబులు నుండన్
దితిసుతనిరాకరిష్ణున్ శ్రితవదనాలంకరిష్ణు జిష్ణున్ విష్ణున్

అర్థరాత్రియందు దేవకీదేవి శ్రీమన్నారాయణుని పుత్రునిగా కనెను. ఆ ప్రభువు దానవుల మదమును అణచేవాడు, తనను శరణు కోరిన వారిని ఆదుకొని వారి మనసులలో ఆనందము నింపెడివాడు. ఆ సర్వవ్యాపకుడు సకలశుభలక్షణ సంపన్నుడు. ఆయన అవతరించినప్పుడు అశ్వని మొదలగు నక్షత్రములు సూర్యచంద్రాది గ్రహములు ఉచ్చ స్థానములో శుభయోగకారకములై ఉండెను.

జలధరదేహున్ ఆజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షున్
చారు గదా శంఖ చక్ర పద్మ విలాసున్ కంఠ కౌస్తుభమణి కాంతిభాసున్
కమనీయ కటిసూత్ర కంకణ కేయూరు శ్రీవత్సలాంఛనాంచిత విహారున్
ఉరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు

బాలున్ పూర్ణేందు రుచిజాలు భక్తలోకపాలు సుగుణాలవాలున్ కృపావిశాలున్ 
చూచి తిలకించి పులకించి చోద్యమంది యుబ్బి చెలరేగి వసుదేవుడుత్సహించె

అప్పుడు ఆ శిశువు దేహము నీలమేఘ కాంతులతో ప్రకాశించుచుండెను. అతను ఆజానుబాహువై, కలువల వంటి కన్నులతో, విశాలమైన వక్షముతో, నాలుగు చేతులయందు శంఖము, చక్రము, గద, పద్మము శోభిల్లుచుండెను. కంఠమున కౌస్తుభమణి కాంతులను వెదజల్లుతుండెను. ఆ పసిబాలునికి అలంకృతమైన మొలత్రాడు, కంకణములు, భుజకీర్తులు అందముగానుండెను.  శ్రీవత్స చిహ్నము అద్భుతముగా ఉండెను. ఉత్తమజాతికి చెందిన కుండలముల వెలుగులు, నుదుటిపైకి యున్న ముంగురులు ఎందో అందముగా ఉండెను. కిరీటమునందు వైఢూర్యముల ప్రకాశములు నిండు పున్నమి చంద్రుని వలె ప్రకాశించుచున్నవి. భక్తుల పాలిటి కల్పవృక్షము, సమస్త సద్గుణములకు నిధి, కృపాసాగరుడు అయిన ఆ అద్భుత శిశువును చూసి వసుదేవుడు పులకించిపోయెను. ఆయన మనసు ఉబ్బితబ్బిబ్బై ఎంతో ఆశ్చర్యపడెను. ఆయనలో ఉత్సాహము పొంగి పొరలెను.

ఆ శిశువుని చూసిన వసుదేవుడు ఇలా స్తుతించెను:

ఏ నిన్ను నఖిల దర్శను జ్ఞానానంద స్వరూపు సంతతునపరా
ధీనుని మాయాదూరుని సూనునిగా గంటి నిట్టి చోద్యము గలదే

అచ్చుగ నీ మాయను మును చెచ్చెరన్ త్రిగుణాత్మకముగన్ చేసిన జగముం
జొచ్చిన క్రియన్ చొరకుందువు చొచ్చుటయును లేదు లేదు చొరకుండుటయున్

ప్రభూ! నీవు అన్నిలోకాలను దర్శింపగలవాడవు, జ్ఞానమునకు, ఆనందమునకు ఆకృతివి. శాశ్వతుడవు, సర్వ స్వతంత్రుడవు, మాయ నీకు దూరము, అటువంటి నీవు నాకు కుమారునిగా జన్మించుట వింతగా ఉన్నది. నీ యోగమాయచే ఈ జగములో సత్వరజస్తమోగుణములతో ప్రాణులను సృష్టించినావు. నీవు ఆ ప్రాణులయందు ప్రవేశించియున్నట్లుగా ప్రకాశించుచున్నావు. కానీ, యదార్థముగా వాటికి అతీతుడవు. నిజము చెప్పాలంటే నీవు వాటి యందు ప్రవేశించినట్లున్నను ఆ గుణములు నీకు అంటవు.

ఆదియునెట్లన మహదాదులన్ పోలెడిదై వేరువేరయై యన్ని విధము
లగు సూక్ష్మభూతంబులమర షోడశ వికారములతోన్ కూడి విరాట్టనంగన్
పరమాత్మునకు నీకున్ పరపైన మేను సంపాదించి యందులోన్ పడియున్ పడక
యుండు సృష్టికి మున్న యున్న కారణమున వానికి లోని భవంబు గలుగ

దట్లు బుద్ధి నెరుగననువైన లాగునన్ కలుగు నింద్రియముల కడలనుండి
వాని పట్టులేక వరుస జగంబులన్ కలసియుండియైనన్ కలియవెపుడు

అది ఎట్లనగా - ఈ ప్రపంచములో మహత్తత్వము నీ నుండే ఉత్పన్నమగుచున్నది. దానినుండి అహంకారము, అహంకారము నుండి పంచతన్మాత్రలైన శబ్దస్పర్శరూపరసగంధములు, వాటినుండి పంచమహాభూతములు కలుగుచున్నవి. అవి మహదాదులుగా చెప్పబడినవి. ఈ మహదాదులు షోడశవికారములతో (పంచ ప్రాణములు, ప్రంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, అంతఃకరణము) కూడి విరాట్స్వరూపము నీవలననే ఏర్పడుచున్నది. ఈ విరాట్స్వరూపము నీకు శరీరముగా ప్రకాశించుచున్నది. ఈ విరాట్ స్వరూపమునందు నీవు ఉండియు దీనికి అతీతముగా వెలుగుచున్నావు. నీవు ఈ మహదాదులకంటే ముందు ఉన్నందున నీకు జన్మ లేదు. ఈ విషయములను ఇట్లు తెలుసుకొనుటకు, ఊహించుకొనుటకు అనువైన విధముగా ఇంద్రియములకు అతీతుడవై యున్నావు. పదునాలుగు లోకములలో ఉండియు వాటికి అతీతుడవు నీవు.

సర్వము నీలోనిదిగా సర్వాత్ముడవాత్మవస్తు సంపన్నుడవై
సర్వమయుడవగు నీకును సర్వేశ్వర! లేవు లోను సందులు వెలియున్
ఆత్మవలనన్ కలిగి యమర దేహాదుల నాత్మకంటె వేరులవి యటంచున్
తలచువాడు మూఢతముడు గావున నీశ! విశ్వమెల్ల నీవ వేరు లేదు

సర్వేశ్వరా! ఈ ప్రపంచమంతయూ నీలోనే ప్రకాశించుచున్నది. అంతటా నీవే వ్యాపించియున్నావు. సర్వపరిపూర్ణుడవైన నీకు పుట్టుక, ఉనికి, మృత్యువు అన్నవి లేవు. చరాచరాత్మకమైన ప్రాణులన్నీ పరమాత్మవైన నీవలనే సృష్టించబడియున్నవి. అవి అన్నియు నీకంటే వేరు అని పలుకువాడు మూర్ఖుడు. తర్కించి చూడగా విశ్వమంతయు నీవే. నీకంటే వేరైనది ఏదియులేదు.

గుణము వికారంబున్ కోరికయును లేని నీ వలన జగములు నెరి జనించున్
ప్రబ్బు లేదగు నంచున్ పలుకుట తప్పుగా దీశుండవై బ్రహ్మమీవ యైన
నినున్ కొల్చు గుణములు నీ యానతులు సేయ భటుల శౌర్యంబులు పతికి వచ్చు

నీవు రక్త ధవళ నీల వర్ణంబుల జగము సేయన్ కాన సమయన్ చూడన్
తనరునట్లు నేడు దైత్యుల దండింపన్ పృథివి గావ నవతరించి తీశ!

అంతేగాక, నీవు త్రిగుణములు గాని, జననమరణములు మొదలైన వికారములు గాని, ఎటువంటి కోరికలుగాని లేని వాడవు. అట్టి నీవలన ఈ జగత్తు యొక్క  సృష్టిస్థితిలయములు జరుగుచున్నవి అని పలుకుట తప్పుకాదు. త్రిగుణములు పరబ్రహ్మవైన నీ ఆనతి ప్రకారమే ఈ జగములో ప్రవర్తించుచుండును. భటులయొక్క శౌర్యపరాక్రమ లక్షణములు రాజునందే ఆపాదించబడునట్లు ఈ గుణముల వైభవములన్నియు  నీకు చెందినవే అని తోచుచుండును. నీవు నీ మాయతో గూడి త్రిగుణాత్మకమైన జగత్తును సృష్టించి, పాలించి, లయింపజేసెదవు. కావున దేవా! నీవు దుష్టశిక్షణ శిష్టరక్షణ చేయుటకు అవతరించితివి.

అప్పుడు దేవకి ఇలా పలికెను:

అట్టిట్టిదనరానిదై మొదలై నిండుకొన్నదై వెలుగుచు గుణము లేని
దై యొక్క చందంబుదై కలదై నిర్విశేషమై క్రియ లేక చెప్పరాని
దే రూపమని శ్రుతులెప్పుడు నొడివెడి నా రూపమగుచు నధ్యాత్మదీప
మై బ్రహ్మ రెండవ యర్థంబు తుది జగంబులు నశింపగన్ పెద్ద భూత గణము

సూక్ష్మ భూతమందున్ చొరగ నా భూతంబు ప్రకృతిలోన చొరగన్ ప్రకృతి వోయి
వ్యక్తమందున్ చొరగ వ్యక్తమడంగను శేషసంజ్ఞ నీవు చెలువమగుదు

దేవా! నీ రూపము అట్టిది-ఇట్టిది అని వర్ణించుట అసాధ్యము. అది సృష్టికి మూలమైనది. అంతటను వ్యాపించి వెలుగొందునది. త్రిగుణముల స్పర్శలేనిది, సర్వకాలములయందు వృద్ధి క్షయాది వికారములు లేనిది. శబ్దస్పర్శాది పంచతన్మాత్రల ఊసు లేనిది, పుణ్యపాపప్రక్రియలు లేనిది, వాక్కునకు, మనసునకు అందనిది. వేదములు కూడా నీ రూపము వర్ణించుటకు అలవికానిదని తెలుపుచున్నవి. ఈ రూపము దివ్యమైన ఒక ఆధ్యాత్మిక తేజస్సు, చతుర్ముఖ బ్రహ్మయొక్క ద్వితీయపరార్థమునకు అంత్యమున జగములన్నీ నశించును. ప్రంచమహాభూతములైన పృథివ్యాపస్తేజోవాయురాకాశములు అహంకారమందు ప్రవేశించును. ఆ సూక్ష్మభూతమైన అహంకారము మొలప్రకృతియందు (మహత్తత్త్వము) లయమును పొందును. ఆ మహత్తత్త్వము వ్యక్తమందు లీనమగును. ఆ వ్యక్తము కూడా అవ్యక్తమగు పరమాత్మలో విలీనము చెందును. అప్పుడు పరబ్రహ్మమైన నీవు శేషసంజ్ఞతో విరాజిల్లుచుందువు.

విశ్వము లీలన్ త్రిప్పుచున్ అవిద్యకున్ చుట్టమువైన నీకున్ తా
శాశ్వతమైన కాలమిది సర్వము వేడబమందురట్టి వి
శ్వేశ్వర మేలుకుప్ప నినునెవ్వడు గొరి భజించువాడె పో
శాశ్వత లక్ష్మి మృత్యుంజయ సౌఖ్యయుతుండభయుండు మాధవా


మాధవా! నీవు విశ్వేశ్వరుడవు. శుభములకు నిధివి. ప్రళయానంతరము ఈ విశ్వమును సృష్టి స్థితి లయముల రూపములో లీలగా త్రిప్పుచుందువు. సకల ప్రాణులు నీ మాయకు లోనై పరిభ్రమించుచుండును. యదార్థముగా నీవు జన్మలేనివాడవు, కానీ లోకకల్యాణమునకై అవతారములను దాల్చుట నీకొక వేడుక. అని విజ్ఞులు పేర్కొనుచుందురు. త్రికరణశుద్ధిగా అనన్యభక్తితో నిన్ను సేవించువాడే నిర్భయుడై మృత్యువును జయించును. శాశ్వతమైన పరమపద సౌఖ్యమును అనుభవించును.

ఒంటిని నిల్చి పురాణయోగులు యోగమార్గ నిరూఢులై 
కంటిమందురు కాని నిక్కము కానరీభవదాకృతిం
గంటి భద్రమున్ కంటి మాంసపున్ కన్నులంగనబోలదీ
తొంటి రూపున్ తొలంగబెట్టుము తోయజేక్షణ! మ్రొక్కెదన్

కమలాక్షా! పూజ్యులైన ప్రాచీన యోగులు ఏకాంతప్రదేశములో నిలిచి తపస్సమాధుల ద్వారా నిన్ను చూచినట్లుగా పలుకుచుందురు. కానీ, నిజముగా నీ అలౌకిక రూపమును చూచియుండరు. కల్యాణప్రదమైన నీ దివ్యాకృతిని నా చర్మచక్షువులతో దర్శించితిని. వాస్తవముగా నీ చతుర్భుజ రూపమును చూచుట అసాధ్యము. కనుక ఈ రూపమును ఉపసంహరించి లౌకిక శిశువుగా మారుము. నేను నీకు ప్రణమిల్లుచున్నాను.

విలయకాలమందు విశ్వము నీ పెద్ద కడుపులోన దాచు కడిమి మేటి
నటుడ నీవు నేడు నా గర్భజుడవౌట పరమపురుష వేదబంబు గాదె

పురుషోత్తమా! నీవు ప్రళయకాలమందు ఈ సమస్త విశ్వమును నీ పొట్టలో దాచుకొనగల సమర్థుడవైన గొప్ప నటుడవు. అట్టి నీవు నా గర్భమున అవతరించుట నీకు ఒక లీలావిలాసమే కదా!

నలినలోచన నీవు నిక్కము నాకు బుట్టెదవంచు నీ
ఖలుడు కంసుడు పెద్దకాలము కారయింట నడంచె దు
ర్మలినచిత్తుని నాజ్ఞ సేయుము మమ్మున్ కావుము భీతులన్
నులుసులేక ఫలించె నోచిన నోములెల్లను నీవయై 

కలువలవంటి కన్నుల కల ప్రభూ! నీవు నిజముగా నాకు పుత్రునిగా జన్మించెదవని తలచి దురాత్ముడైన కంసుడు మమ్ములను చాలా కాలముగా ఈ చెరసాలలో బంధించియుండెను. దుష్టస్వభావము గల ఈ కంసుని శిక్షించుము, భయముతో వణికిపోవుచున్న మమ్ము కాపాడుము. నీవు నాకు కుమారుడవై జన్మించుటవలన నేను నోచిన నోములన్నీ పూర్తిగా ఫలించినవి. 

26, జూన్ 2015, శుక్రవారం

శ్రీరామకర్ణామృతం ద్వితీయాశ్వాసము

శ్రీరామకర్ణామృతం ద్వితీయాశ్వాసముసకలభువనరత్నం సచ్చిదానందరత్నం
సకలహృదయరత్నం సూర్యబింబాంతరత్నం
విమలసుకృతరత్నం వేదవేదాంతరత్నం
పురహరజపరత్నం పాతు మాం రామరత్నం
ఇక్ష్వాకువంశార్ణవజాతరత్నం
సీతాంగనాయౌవనభాగ్యరత్నం
వైకుంఠరత్నం మమ భాగ్యరత్నం
శ్రీరామరత్నం శిరసానమామి

నిగమశిశిరరత్నం నిర్మలానందరత్నం
నిరుపమగుణరత్నం నాదనాదాంతరత్నం
దశరథకులరత్నం ద్వాదశాంతస్థరత్నం
పశుపతిజపరత్నం పాతు మాం రామరత్నం
శతమఖసుఖరత్నం షోడశాంతస్థరత్నం
మునిజనజపరత్నం ముఖ్యవైకుంఠరత్నం
నిరుపమగుణరత్నం నీరజాంతస్థరత్నం
పరమపదవిరత్నం పాతు మాం రామరత్నం

సకలసుకృతరత్నం సత్యవాక్యార్థరత్నం
శమదమగుణరత్నం శాశ్వతానందరత్నం
ప్రణయనిలయరత్నం ప్రస్ఫుటద్యోతిరత్నం
పరమపదవిరత్నం పాతు మాం రామరత్నం

నిఖిలనిలయమంత్రం నిత్యతత్త్వాఖ్యమంత్రం
భవకులహరమంత్రం భూమిజాప్రాణమంత్రం
పవనజనుతమంత్రం పార్వతీమోక్షమంత్రం
పశుపతినిజమంత్రం పాతు మాం రామమంత్రం

ప్రణవనిలయమంత్రం ప్రాణినిర్వాణమంత్రం
ప్రకృతిపురుషమంత్రం బ్రహ్మరుద్రేంద్రమంత్రం
ప్రకటదురితరాగద్వేషనిర్నాశమంత్రం
రఘుపతినిజమంత్రం రామరామేతిమంత్రం

దశరథసుతమంత్రం దైత్యసంహారమంత్రం
విబుధవినుతమంత్రం విశ్వవిఖ్యాతమంత్రం
మునిగణనుతమంత్రం ముక్తిమార్గైకమంత్రం
రఘుపతినిజమంత్రం రామరామేతిమంత్రం

సంసారసాగరభయాపహవిశ్వమంత్రం
సాక్షాన్ముముక్షుజనసేవితసిద్ధమంత్రం
సారంగహస్తముఖహస్తనివాసమంత్రం
కైవల్యమంత్రమనిశం భజ రామమంత్రం

జయతుజయతుమంత్రం జన్మసాఫల్యమంత్రం
జననమరణభేదక్లేశవిచ్ఛేదమంత్రం
సకలనిగమమంత్రం సర్వశాస్త్రైకమంత్రం
రఘుపతినిజమంత్రం రామరమేతిమంత్రం

అన్నిలోకములలోను ఉత్తముడైనట్టి, సత్యజ్ఞానాంద శ్రేష్ఠుడైనట్టి, అందరి హృదయములలో రత్నదీపమైనట్టి, సూర్యబింబము యొక్క మధ్యభాగమందు రత్నమువలె వెలుగుచున్నట్టి, నిర్మలమైన సత్కర్మలలో శ్రేష్ఠుడైనట్టి, వేదవేదాంతములకు రత్నమైనట్టి, ఈశ్వరుడు జపించే ఉత్తమమైనట్టి శ్రీరామ అనే రత్నం నన్ను రక్షించుగాక. 

ఇక్ష్వాకు వంశమనే సాగరమందు పుట్టిన రత్నమైనట్టి, సీతయొక్క యౌవన భాగ్యమునకు రత్నమైనట్టి,  నా భాగ్యమునకు రత్నమైనట్టి, శ్రీరామునిరూపంలో ఉన్న రత్నమునకు శిరసుతో నమస్కరించుచున్నాను.

వేదములకు చల్లని రత్నమైనట్టి, స్వచ్ఛమైన ఆనందము వలన శ్రేష్ఠమైనట్టి, సామ్యములేని గుణములనెడు రత్నములు కలిగినట్టి, నాదమునకు మూలమైన ప్రణవము యొక్క మధ్యమందు రత్నమైనట్టి, దశరథ వంశములో ఉత్తముడైనట్టి,  ద్వాదశదళపద్మమందు రత్నమైనట్టి, ఈశ్వరుడు జపించే ఉత్తముడైనట్టి రాముడనే రత్నము నన్ను రక్షించు గాక. 

ఇంద్రునిచే స్తోత్రము చేయబడు వారిలో శ్రేష్ఠుడైనట్టి, షోడశదళపద్మమందు రత్నమైనట్టి, మునులజపమునకు రత్నమైనట్టి,  వైకుంఠానికి ముఖ్యమైన రత్నమైనట్టి, సామ్యములేని రత్నములవంటి గుణములు కలిగినట్టి, హృదయమనే పద్మమునందలి రత్నమైనట్టి, పరమపదమునకు రత్నమైనట్టి రాముడనే రత్నము నన్ను రక్షించు గాక.

సమస్తపుణ్యములు గలవారిలో ఉత్తముడైనట్టి, సత్యము జ్ఞానము మొదలైన వాక్యార్థములలో శ్రేష్ఠమైనట్టి, శమదమాది గుణములనెడి రత్నములు కలిగినట్టి, శాశ్వతమైన ఆనందము గలవారిలో ఉత్తముడైనట్టి, ప్రేమకు నిలయమైన రత్నమైనట్టి, ప్రస్ఫుటంగా ప్రకాశించు రత్నమైనట్టి,  పరమపదమునకు రత్నమైనట్టి రాముడనే రత్నము నన్ను రక్షించు గాక.

అన్నిటానిలయమైనట్టి మంత్రము, నిత్య తత్త్వమును (మోక్షమునిచ్చేది) గలిగిన మంత్రము, సంసారభారాన్ని హరించే మంత్రము, సీతకు ప్రాణమైనట్టి, ఆంజనేయునిచే స్తోత్రము చేయబడునట్టి, పార్వతికి మోక్షమిచ్చునట్టి, ఈశ్వరునికి ముఖమైన మంత్రమైనట్టి రామ మంత్రము నన్ను రక్షించు గాక

ఓంకారము నిలయమైనట్టి, ప్రాణులకు మోక్షమిచ్చునట్టి, ప్రకృతిపురుషుల రూపమైనట్టి, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు జపించే మంత్రము, దుష్కరమైన పాపములను, రాగద్వేషములను నశింపజేయునట్టి, రామ రామ యనే మంత్రము, రాముని యొక్క ముఖ్యమైన మంత్రము.

దశరథపుత్రుడైన రాముని మంత్రమైనట్టి, రాక్షసులను సంహరించునట్టి, దేవతలచే స్తోత్రము చేయబడినట్టి, లోకమున ప్రసిద్ధమైనట్టి, మునిసముదాయముచే స్తోత్రము చేయబడినట్టి, మోక్షమార్గమునకు ముఖ్యమైనట్టి, రామ రామ యను మంత్రము రాముని ముఖ్య మంత్రము. 

సంసారమనే సాగర భయాన్ని పోగొట్టునట్టి, సమస్త మంత్ర రూపమైనట్టి, మోక్షమును కోరుకునే వారిచే సేవింపబడు సిద్ధమంత్రమైనట్టి, ఈశ్వరుడు మొదలైన వారి హస్తములయందు నివాసము గల మంత్రము, మోక్షమంత్రమైన రామ మంత్రమును ఎల్లపుడు సేవింపుము. 

జన్మకు సాఫల్యము కలిగించునట్టి, జననము మరణము మొదలగు భేదములు గల కష్టములను నాశనము చేయునది, సర్వవేదములలో ప్రధానమైనట్టిది, సర్వశాస్త్రములలో ముఖ్యమైనట్టి, రామ రామ అనునట్టి, రాముని ప్రధాన మంత్రము సర్వోత్కృష్టమై యుండు గాక.
  

17, జూన్ 2015, బుధవారం

గజేంద్ర మోక్షము

గజేంద్ర మోక్షము(పోతన విరచిత శ్రీమదాంధ్రమహాభాగవతము అష్టమ స్కంధము నుండి)

నీరాటవనాటములకున్
పోరాటంబెట్లు గలిగెన్ పురుషోత్తముచే
నారాటమెట్లు మానెను
ఘోరాటవిలోని భద్రకుంజరమునకున్

పరీక్షిత్తు మహారాజు శుకుని ఇట్లు ప్రశ్నించెను. ఓ మహాత్మా! నీటిలో సంచరించే మొసలికి, వనములో తిరిగే ఏనుగుకు పోరాటమెలా, ఎందుకు జరిగింది? ఆ ఘోరారణ్యములో ఆ మదగజమునకు శ్రీహరివలన వ్యథ ఎలా తొలగెను?

అన్యాలోకనభీకరంబులు జితాశానేకపానీకముల్
వన్యేభంబులు కొన్ని మత్తతనులై వ్రజ్యావిహారాగతో
దన్యత్వంబున భూరిభూదరదరీద్వారంబులందుండి సౌ
జన్యక్రీడల నీరుగాల్వివడిన్ కాసారావగాహార్థమై

శుకుడు ఇలా అన్నాడు:

అతి భీకరముగా కనిపించు అడవి ఏనుగుల మంద ఒకటి మదించిన శరీరములతో, పెద్ద పెద్ద కొండ గుహలనుండి విహారము కొరకై బయటకు వచ్చి చల్లని గాలి, నీరు అనుభవించుటకై, నీటిలో మునిగి జలక్రీడలనాడుకొనుటకు ఒక పెద్ద మడుగులో ప్రవేశించెను.

తొండంబుల మదజలవృత
గండంబులన్ కుంభములను ఘట్టనసేయం
కొండలు దలక్రిందై పడు
బెండుపడున్ దిశలు సూచి బెగడున్ జగముల్

ఆ మదపుటేనుగులెలా ఉన్నాయి? తొండములను, చిమ్ముతున్న కొవ్వుతో నిండియున్న చెక్కిళ్లను, మిక్కిలి పటిష్ఠమైన కుంభములను కదిలించుకొనుచు, ఒరిపిడి చేసుకొనుచు, కొండలు బెండులై పడునా, లోకాలు దిక్కులు చూచుచు భయముతో హడలిపోవునా అన్నట్లుగా సంచరించుచున్నవి.

ఎక్కడ జూచిన లెక్కకు
నెక్కువయై యడవినడచు నిభయూథములో
నొక్కకరినాథుడెడతెగి
చిక్కెనొక్క కరేణుకోటి సేవింపంగన్

ఎక్కడ చూచినను లెక్కించలేనన్ని ఏనుగుల మందలు అడవి అంతా నిండి ఇటు అటు నడుచుచుండగా ఒక కరిరాజు మాత్రం వానినుండి విడిపడి ఒక ఆడఏనుగుల సమూహంలో చేరి సరససల్లాపములతో వానిచే సేవింపబడుచుండెను.

ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చం
డభమార్గంబున కెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప నా
రాభటిన్ నీరములోన బెల్లెగసి నక్రగ్రాహపాఠీనముల్
నభమందాడెడు మీనకర్కటములన్ బట్టెన్ సురల్ మ్రాంపడన్

ఆ గజేండ్రుడు తొండమునిండా నీరు నింపుకొని, ఆకాశము వైపు యెత్తి, ఇటు అటు కదిలించి నీరు చిమ్మగా ఆనీటితో పాటు తాబేళ్లు, చేపలు, పీతలు, మొసళ్లు పైకెగసి జ్యోతిష్య చక్రమునందలి మీన కర్కాటకములను పట్టుచున్నవా అన్నట్లు కనబడుచుండగా అది జూసి దేవతలు ఆశ్చర్యచకితులైనారు.

భుగ భుగాయిత భూరి బుద్బుదచ్ఛటలతో గదలుచు దివికి భంగంబు లెగయ
భువన భయంకరపూత్కారరవమున ఘోరనక్రగ్రాహకోటి బెగడ
వాలవిక్షేపదుర్వారఝంఝానిలవశమున ఘుమఘుమావర్త మడరన్
కల్లోలజాలసంఘట్టనంబుల దటీతరులు మూలములతో ధరణి గూల

సరసిలోనుండి పొడగని సంభ్రమించి
యుదరి కుప్పించి లంఘించి హుంకరించి
భానున్ కబళించి పట్టుస్వర్భానుపగిది
నొక్కమకరేంద్రుడిభరాజు నొడిసిపట్టె

భుగభుగ ధ్వనులతో పెద్ద పెద్ద నీటి బుడగల ప్రవాహమును కలిగించుచు, ఆకాశమునంటునట్లు అలలను రేపుచు, భువనములకు భయము కల్గించి పూత్కార శబ్దములు చేయుచు, మొసలి సమూహములు కూడా హడలిపోవుచుండ, తోక కదలికలచే ఝంఝామారుతముల సుడిగాలులుద్భవించగా, ఆ తాకిడికి ఒడ్డున ఉన్న వృక్షములు సమూలముగా పెకలిపోగా, సరస్సునుండి, కరి రూపమును చూసి, ఊపిరి బిగపట్టి, వేగముగా ఎగిరి హుంకరించి, సూర్యుని కబళించిన రాహువువలెనొక మకరేంద్రుడు వచ్చి గజేంద్రుని ఒడిసి పట్టుకొనెను.

కరి దిగుచు మకరి సరసికిన్
కరి దరికిని మకరి దిగుచున్ కరకరిబెరయన్
కరికి మకరి మకరికిన్ కరి
భరమ్న నిట్లతలకుతలభతు లదరిపడన్

ఏనుగును మొసలి నీటిలోనికి లాగును, మొసలిని ఏనుగు సరస్సూ ఒడ్డునకు లాగును. ఇట్లు కరిమకరులు పరస్పరము భయముతోను, బరువైన మనస్సుతోను అతలాకుతలమగుచు తమతమ భృత్యులు భయముతో అదిరిపోవునట్లుగా పోరాడుచుండిరి.

జీవనంబు తనకు జీవనంబై యుంట
నలవు చలమునంతకంతకెక్కి
మకరమొప్పె డస్సె మత్తేభమల్లంబు
బహుళపక్షశీతభానుపగిది

జలమే తనకు జీవనమై యుండుటచేత, మొసలికి స్థానబలముచుఏ శక్తి, సులువు, అంతకంతకు యెక్కువై, ధైర్యము కలిగెను. కరికి నిలకడ తప్పి, యలసట వచ్చి, కృష్ణపక్ష చంద్రునివలె శక్తి సన్నగిల్లెను.

పృథుశక్తిని గజమాజలగ్రహముతో బెక్కేండ్లు పోరాడి సం
శిథిలంబై తనలావు వైరి బలముంజింతించి మిథ్యా మనో
రథమింకేటికి దీనిగెల్వ సరి పోరంజాలరాదంచు స
వ్యథమై యిట్లను పూర్వపుణ్యఫలదివ్యజ్ఞానసంపత్తితోన్ 

గొప్పశక్తితో ఆ గజరాజు ఘోరమైన మొసలితో అనేక సంవత్సరములు పోరాడి బాగా శిథిలమై తన బలము, శత్రు బలము సరిపోల్చుకొని, మకరిని గెల్చేది తన మిథ్యావాంచ ఇక యేల, దీనిని గెలువలేను సరికదా యుద్ధమైనను చేయలేను అని వ్యథతో కూడిన మనసుతో, పూర్వ జన్మల పుణ్యఫలముచే కల్గిన దివ్య జ్ఞానము వలన ఇట్లు తెలిసికొనెను.

ఎవ్వనిచే జనించు జగమెవ్వనిలోపలనుండు లీనమై
యెవ్వనియందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం
బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానెయైన వా
డెవ్వడు వాని నాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్

ఈ విశ్వము ఎవని వలన ఉద్భవించినదో, ఎవ్వనియందు లీనమై యుండునో, ఎవ్వనియందు లయించునో, పరమేశ్వరుడెవ్వడో, అన్నిటికీ మూలకారణమైన వాడెవ్వడో, ఆది మధ్య అంత్యములు లేని వాడెవ్వడో, సర్వమూ తానేయైయున్నవాడెవ్వడో, అట్టి స్వయంభువైన ఈశ్వరుని నేను శరణు వేడుచున్నాను

ఒకపరి జగములు వెలినిడి
యొకపరి లోపలికి గొనుచున్ ఉభయముదానై
సకలార్థ సాక్షియగు న
య్యకలంకుని నాత్మమూలునర్థి దలంతున్

లోకములను ఒకసారి తననుండి ఉద్భవింపజేసి, ఇంకొకమారు తనలోనికి తీసుకొనుచు, వెలుపల, లొపల తానేయై ఉంటూ, సర్వమునకు సాక్షిగా ఉంటూ, నిర్మలుడైన ఆ పరమాత్మను (నా ఆత్మకు మూలమును) నేను ఆసక్తితో ధ్యానించెదను.

లోకంబులు లోకేశులు
లోకస్థులు దెగిన తుదిలోకంబగు పెం
జీకటి కవ్వలనెవ్వం
డేకాకృతి వెలుగు నతని నే సేవింతున్

ఈ లోకములు, లోకులు, లోకపాలకులందరూ కూడ అంతమైన పిమ్మట, లోకములేవీ లేని శూన్యస్థితిలోని గాఢాంధకార తమస్సుకు అవతల ఎవ్వడు ఏకైక పరంజ్యోతి రూపములో నుండునో వానిని నేను సేవింతును.

నర్తకుని భంగి బెక్కగు
మూర్తులతో నెవ్వడాడు మునులును దివిజుల్
కీర్తింపనేరరెవ్వని
వర్తన మొరులెరుగరట్టి వాని నుతింతున్

నటుని వలె అనేకమైన ఆకృతులతో ఎవ్వడు నటించుచుండునో, ఋషులు, దేవతలు ఎవ్వరిని సంపూర్ణంగా కీర్తించలేరో, ఎవ్వని చేష్టల గురించి ఎవ్వరును ఎరుగలేరో అట్టి ప్రభువును నేను స్తుతించెదను.

కలడందురు దీనులయెడ
కలడందురు పరమయోగి గణములపాలన్
కలడందురన్ని దిశలను
కలడు కలండనెడువాడు కలడో లేడో

మకరి కాటు బాధ ఎక్కువవుచుండగా గజేంద్రుడు నిస్పృహ చెంది ఇట్లనెను. దేవునికి నా మొర వినబడలేదా? దీనులయెడల దయగలిగి యుండునని యందురు కదా? పరమయోగుల చెంతనే నుండునని యందురు కదా? భగవంతుడంతటా అన్ని దిక్కులలో యుండునని చెప్పెదరు కదా! ఉన్నడున్నాడని అందరూ చెప్పే ఆ భగవంతుడు నిజముగా ఉన్నాడో? లేడో?

లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్
ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చె దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవేతప్ప నితః పరంబెరుగ మన్నింపదగున్ దీనునిన్
రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!

ఓ భగవంతుడా! నాలో శక్తి ఏమాత్రమూ లేదు, ధైర్యము సడలి పోయి ఊగిసలాడుచున్నది. ప్రాణములు నిలకడ తప్పినవి. మూర్ఛ వచ్చెను. శరీరము డస్సిపోయినది, అలసట ఆవరించినది. నీవే తప్ప నాకిక వేరేదియు తెలియదు. ఈ దీనుని నీవే ఆదుకొనుట సమంజసము. ఓ ఈశ్వరా రావా! ఓ వరములిచ్చె ప్రభూ నన్ను కాపాడవా! ఓ జగద్రక్షకా నన్ను రక్షింపవా! నా భయమును బాపవా ప్రభూ!

ఓ కమలాప్త! యో వరద! యో ప్రతిపక్షవిపక్షదూర! కు
య్యో! కవియోగి వంద్య! సుగుణోత్తమ! యో శరణాగతామరా
నోకహ! యో మునీశ్వరమనోహర! యో విపుల ప్రభావ! రా
వే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను గావవే

ఓ కమలప్రియా! వరదాతా! శత్రువులపట్ల కూడా శత్రుత్వము లేని దయామయా! కుయ్యో! ఓ కవులచేత, యోగుల చేత ఆరాధించబడు స్వామీ! సుగుణోత్తమా! శరణాగతులకు కల్పవృక్షమైన వాడా! ఓ మునిమానస చోరా! ఓ అనంతమైన ప్రభావము కలవాడా! రావా! నన్ను కరుణింపవా! నా ఆర్తిని గురించి తలంపవా! శరణార్థియైన నన్ను కావవా!

అలవైకుంఠపురంబులో నగరిలో నామూలసౌధంబుదా
పల మందారవనాంతరామృత సరఃప్రాంతేందుకాంతోపలో
త్పలపర్యంకరమావినోదియగు నాపన్న ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహి పాహి యన గుయ్యాలించి సంరంభియై

అక్కడెక్కడో ఉన్న వైకుంఠ ధామంలో, దూరముగా నున్న సౌధమునకు ఆవలనున్న మందార వనములోనున్న అమృత సరోవర ప్రాంతమున చంద్రకాంత శిలలతోను, కలువలతోను అమర్చబడిన శయ్యపై లక్ష్మీదేవితో వినోదించుచు, ఆపదలోనున్నవారి పట్ల అనుగ్రహము చూపు శ్రీహరి, భయకంపితుడైన గజేంద్రుడు పాహి పాహి అని మొరపెట్టుచుండగా, ఆ ఆర్తనాదము విని అతి శీఘ్రముగా వెడలుటకుపక్రమించెను.

సిరికింజెప్పడు శంఖచక్రయుగముం జేదోయి సంధింపడే
పరివారంబును జీరడభ్రగపతిం బన్నింపడాకర్ణికాం
తరధమ్మిల్లము జక్కనొత్తడు వివాదప్రోత్థిత శ్రీకుచో
పరిచేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై

గజేంద్రుని ప్రాణములను రక్షింపవలెనను ఉత్సాహము ఉరకలు వేస్తుండగా ఆ శ్రీహరి, శ్రీదేవికైన చెప్పడు, శంఖచక్రములను ధరించడు, అనుచరులనెవ్వరిని పిలువడు, పక్షిరాజైన గరుడుని సిద్ధపడుమని తెలుపడు. చెవుల వరకు జాలువారిన కేశములనైనను సవరించడు. తనవ్రేళ్లకు చుట్టుకొనిన శ్రీదేవి యొక్క పైటచెంగును కూడా విడిచి పెట్టకుండా అట్లే లేచి వడి వడిగా ఆకాశ మార్గమున నడచి పోసాగెను

తనవెంటన్ సిరి, లచ్చి వెంట నవరోధవ్రాతమున్, దాని వెన్
కను బక్షీంద్రుడు వానిపొంతను ధనుఃకౌమోదకీశంఖచ
క్రనికాయంబును నారదుండు ధ్వజినీకాంతుండు రావచ్చిరొ
య్యన వైకుంఠపురంబునం గలుగువారాబాలగోపాలమున్

శ్రీహరి వెంట లక్ష్మీదేవి, ఆమెవెంట అంతఃపుర స్త్రీ జనము, వారి వెంట గరుడుడు, ఆతని ప్రక్కనే ధనుస్సు, గద, శంఖ చక్ర పరికరములు, వాని వెంట నారదుడు, విష్వక్సేనుడు బయలుదేరగా వారి వెంట వైకుంఠములోనున్న వారందరూ ఆబాలగోపాలముగ వెంట వచ్చిరి.

చనుదెంచెన్ ఘనుడల్లవాడె హరిసజ్జం గంటిరే లక్ష్మి శం
ఖనినాదంబదె చక్రమల్లదె భుజంగ ధ్వంసియున్ వాడె క్ర
న్నన నేతెంచె నటంచు వేల్పులు నమో నారాయణాయేతి ని
స్వనులై మ్రొక్కిరి మింట హస్తిదురవస్థావక్రికిం చక్రికిన్

అడుగో మహనీయుడగు మహావిష్ణువు వచ్చుచున్నాడు. వెనువెంటనే లక్ష్మిని చూచితిరా? అదిగో శంఖ నినాదము, సుదర్శన చక్రమదిగో! అదిగో సర్ప సంహారకుడైన గరుత్మంతుడు కూడా శీఘ్రముగా వచ్చుచున్నాడు చూడండీ ఆ దివ్యదర్శనము "ఓం నమో నారాయణాయ" యని దేవతలు ప్రణామములు జేశారు.

కరుణాసింధుడు శౌరి వారిచరమున్ ఖండింపగా బంపె స
త్వరితాకంపితభూమిచక్రము మహోద్యద్విస్ఫులింగచ్ఛటా
పరిభూతాంబరశుక్రమున్ బహువిధబ్రహ్మాండభాండచ్ఛటాం
తర నిర్వక్రమున్ పాలితాఖిలసుధాంధశ్చక్రముం జక్రమున్

కరుణాసాగరుడైన శ్రీహరి మకరిని ఖండించుటకు తన సుదర్శన చక్రమును పంపెను. ఆ చక్రము సాధుజనులను రక్షించునట్టిది. భూమండలములను కంపింపజేయగల వెగము గలది, తననుండి వెలువడే అగ్ని కణములతో ఆకాశమును చుట్టివేయగలది. అనేక బ్రహ్మాండ భాండములను కాంతిపుంజముతో నింపివేయగలది. తిరుగులేనట్టి ఆ సుదర్శన చక్రము పోయి పర్వతము లాంటి మేనుగల మకరి తలను త్రుంచి వేసెను.

తమముంబాసిన రోహిణీవిభుక్రియన్ దర్పించి సంసార దుః
ఖము వీడ్కొన్న విరక్తచిత్తునిగతిన్ గ్రాహంబుపట్టూడ్చి పా
దము లల్లార్చి కరేణుకావిభుడు సౌందర్యంబుతో నొప్పె సం
భ్రమదాశాకరిణీకరోజ్ఝిత సుధాంభస్స్నాన విశ్రాంతుడై

రాహువు విడిచిన చంద్రుని వలె, వైరాగ్యము పొంది, సంసార దు@ఖమును తొలగించుకున్న గృహస్థుని వలె, మొసలి పట్టు నుండి విడుదల పొందిన కరిరాజు, పాదములను ఇటు అటు కదిలించి, స్వస్థుడై, సుందరుడై, ఆడ యేనుగులు స్నానము చేయించి సేవలు చేయగా విశ్రాంతుడయ్యెను.

పూరించెన్ హరి పాంచజన్యమున్ కృపాంభోరాశిసౌజన్యమున్
భూరిధ్వానచలాచలీకృతమహాభూతప్రచైతన్యమున్
సారోదారసితప్రభాచకితపర్జన్యాదిరాజన్యమున్
దూరీభూతవిపన్న దైన్యమును నిర్ధూతద్విషత్సైన్యమున్

అప్పుడు శ్రీహరి పాంచజన్య శంఖమును పూరించెను. ఆ శంఖమెట్టిది? ఆయన యొక్క కరుణారస సముద్రమునుండి మంచితనమును స్రవింపజేయునట్టిది. దానియొక్క మేఘగర్జనవంటి ధ్వనిచే పంచమహాభూతములను చైతన్యవంతం చేసి కదలికలను కలిగించునట్టిది, మిక్కుటమైన తేజోపుంజముతో ఇంద్రాది దేవతలను కూడఆ ఆశ్చర్యపరచునట్టింది, ఆపన్నుల భయమును, దైన్యమును దూరము చేయునట్టిది. శత్రుసైన్యమును తొలగించునట్టిది.

నిడుదయగుకేల గజమును
మడువున వెడలంగ దిగిచి మదజలరేఖల్
దుడుచుచు మెల్లన పుణుకుచు
నుడిపెన్ విష్ణుండు దుఃఖముర్వీనాథా!

పొడవైన తొండమును పట్టుకొని, శ్రీహరి గజేంద్రుని మడుగునుండి వెలికిదీసి చెక్కిళ్లపై కారిన మదజల రేఖలను తుడిచి చేతితో నిమురుచు, దాని బాధను, దుఃఖమును బాపెను.దీనులకుయ్యూలింపను
దీనుల రక్షింప మేలుదీవెన బొందన్
దీనావన! నీ కొప్పును
దీనపరాధీన! దేవదేవ మహేశా!

గజేంద్రుడు రక్షింపబడిన పిమ్మట తన వెంట వచ్చిన లక్ష్మితో పరిహాసమాడిన విష్నువు లక్ష్మి ఇట్లనెను: ఓ దీనపరాధీన! దేవదేవా! మహేశా! దీనులయొక్క మొరలనాలకించుటకును, వారిని రక్షించుటకును, వారి స్తుతులను పొందుటకును, నీకే తగును స్వామీ!

గజరాజ మోక్షణంబును
నిజముగ బఠియించునట్టి నియతాత్ములకున్
గజరాజ వరదుడిచ్చును
గజతురగస్యందనములు కైవల్యంబున్

ఈ గజేంద్రమోక్షమను గాథను శ్రద్ధగా పఠించు నిష్ఠాపరులకు, కరిరాజ వరదుడైన శ్రీహరి సర్వకామ్యములనే గాక, కైవల్యపదమును కూడా అనుగ్రహించును.

16, జూన్ 2015, మంగళవారం

సుందరకాండ - క్రోధం గురించి హనుమంతుని స్వానుగతం

సుందరకాండ - క్రోధం గురించి హనుమంతుని స్వానుగతంక్రోధం గురించి సుందరకాండ 55వ సర్గలో ప్రస్తావన:

ధన్యాస్తే పురుష శ్రేష్ఠా యే బుద్ధ్యా కోపముత్థితం
నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభసా

క్రుద్ధః పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి
క్రుద్ధః పరుషయా వాచా నరః సాధూనధిక్షిపేత్

వాచ్యావాచ్యం ప్రకుపితో న విజానాతి కర్హిచిత్
నాకార్యమస్తి క్రుద్ధస్య నావాచ్యం విద్యతే క్వచిత్

యః సముత్పతితం క్రోధం క్షమయైవ నిరస్యతి
యథొరగస్త్వచం జీర్ణాం స వై పురుష ఉచ్యతే

ధిగస్తు మాం సుదుర్భద్ధిం నిర్లజ్జం పాపకృత్తమం
అచింతయిత్వా తాం సీతామగ్నిదం స్వామిఘాతకం 

యది దగ్ధత్వియం లంకా నూనమార్యాపి జానకీ
దగ్ధా తేన మయా భర్తుర్హతం కార్యమజానతా

ఈషత్కారమిదం కార్యం కృతమాసీన్న సంశయః
తస్య క్రోధాభిభూతేన మయా మూల క్షయః కృతః

మయా ఖలు తదేవైదం రోష దోషాత్ ప్రదర్శితం
ప్రథితం త్రిషు లోకేషు కపిత్వమనవస్థితం

ధిగస్తు రాజసం భావం అనీశమనవస్థితం
ఈశ్వరేణాపి యద్రాగాన్మయా సీతా న రక్షితా 

తదహం భాగ్య రహితో లుప్త ధర్మార్థ సంగ్రహః
రోగ దోష పరీతాత్మా వ్యక్తం లోక వినాశనః

శ్లోకార్థం:

ఎవరు ప్రజ్జ్వలించు అగ్నిని నీటితో చల్లార్చినట్లు తమకు కలిగిన కోపమును తమ బుద్ధితో నిరోధించగలరో అట్టి మహాత్ములగు పురుష శ్రేష్ఠులు ధన్యులు.

కోపము హద్దు మీరినప్పుడు పాపము చేయనివాడెవరు? కోపించినవాడు పెద్దలను కూడా చంపును. కోపించినవాడు కఠినోక్తులతో సత్పురుషులను అపేక్షించును.

ఈ లంక పూర్తిగా తగులబడినచో పూజ్యురాలగు సీత తప్పక అందులో తగులబడి ఉంటుంది. కావున, తెలియకనే నేను నా ప్రభుకార్యమును పాడుచేసితిని.

సందేహములేకుండా నేను పనిని అరకొరగా చేసితినే కానీ సమగ్రముగా కాదు. కోపపూరితుడనై నేను నా కార్యమునకు మూలమైన సీతాదేవినే నాశనం చేసికొంటిని.

నేను నా రోషపు దోషముచే కోతుల స్వభావమైన, ముల్లోకములలో ప్రసిద్ధమైన చంచలత్వమును ప్రదర్శించితిని.

రజోగుణము వలన ఏర్పడిన నా యీ చేష్ట ఎందుకు పనికిరానిది, నిలకడ లేనిది. నేను యీ రజోగుణ మూలకమగు క్రోధమునకు లోబడి సీతాదేవిని రక్షించుకోలేకపోతిని.

మిక్కిలి కోపముతో ఉన్నవాడు ఏది పలుకవలెనో, ఏది పలుకరాదో ఎరుగడు. కోపించినవానికి చేయరాని పనిలేదు. ఎక్కడైనా పలుకరానిది లేదు.

ఎవడు తనలో పెల్లుబికిన క్రోధాన్ని, పాము నలిగిపోయిన కుబుసుమను వీడినట్లు, ఓర్పుతో తొలగించుకొనునో అతడు పురుషుడనబడును.

దుర్బుద్ధిని, సిగ్గులేని వాడిని, మహాపాపము చేసిన వాడను, ముందువెనుక ఆలోచించకుండా సీతాదేవిని కాల్చి స్వామిఘాతుకుడనైన నాకు నిందయగు గాక.

భాగ్యహీనుడనైన నేనిట్లు ధర్మార్థ సంగ్రహము చేయక రోషమను దోషము పట్టి పీడించగా లోకమునకే చేటు తెచ్చితిననుట స్పష్టము.

 భావార్థం:

రావణాసురుడి సేన హనుమంతుని తోక తగులబెట్టగా, క్రోధముతో ముందు వెనుక ఆలోచించకుండా ఆ మండుతున్న వాలముతో లంకను తగులబెడతాడు. అటు తరువాత ఆ దహనంలో అశోకవనంలో సీతకూడా తగులబడినదేమో అని చింతించి తన క్రోధంపై సిగ్గుపడతాడు. మహాజ్ఞాని అయిన హనుమ సంగతి అటుంచి మనకు ఈ సన్నివేశంలో హనుమంతుని మనోగతం నుండి గొప్ప పాఠాలు అందుతున్నాయి. 

కోపములో ఉన్న మనిషి ఎలా విచక్షణ కోల్పోయి, మతి చలించి మాటలు, చేష్టలలో అకృత్యాలకు పాల్పడి భాగ్యహీనుడవుతాడు అన్నది క్లుప్తమైన సందేశం. రజోగుణమునుండి జన్మించే క్రోధం మనలోని  ధర్మార్థ సంగ్రహ శక్తిని కోల్పోయేలా చేసి అధోగతి పాలు చేస్తుంది. ఇది మనం ప్రతిదినమూ ఇంటా బయటా చూసే లక్షణమే. ఆ సమయంలో పాము కుబుసాన్ని ఓర్పుతో విడిచినట్లు ఓర్పుతో క్రోధాన్ని విడువగలిగితే వాడు ఎంతో పురోగతి చెందుతాడు. క్రోధమనే అగ్నిపై ఓర్పు అనే నీటిని చల్లి ఆ పొంగును చల్లార్చితే విచక్షణ మనతో నిలిచి ప్రతి అడుగులోనూ ధర్మము, అర్థము మన మనసు గ్రహించి నడుచుకుంటాము. లేకుంటే, క్షణికోద్రేకంలో మనవారిని కోల్పోయి, కార్యసిద్ధికి విఘాతం కలిగించుకొని, ఆ క్రోధం చల్లారిన తరువాత చింతిస్తాము. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమి ఉపయోగము? క్రోధమనే అగ్నిలో మన భవిష్యత్తు, మన అలోచనా శక్తి దగ్ధమై మనకు ఫలితాలు అందవు. 

తత్త్వజ్ఞానియైన హనుమంతుడు సీతామాత అనుగ్రహంతో, రాముని వెనుబలంతో అంతటి కష్టతరమైన కార్యాన్ని సాధించగలిగాడు. కారణం? ఎన్ని మానసిక సంఘర్షణలు, ఎన్ని నిరాశ నిస్పృహలు, భయోత్పాతాలు కలిగినా, నమ్ముకున్న స్వామిపట్ల గల శరణాగతి, కావలసిన కార్యంపై గల పట్టుదల. ప్రతి అడుగులోనూ అతనిని ముందుకు నడిపించింది రామభక్తి, సీతాన్వేషణ అనే పవిత్రమైన కార్యం. 

అటువంటి సంకల్పం, భక్తి ఉన్నప్పుడు ఒడిదుడుకులు కలిగినా తట్టుకొని, తేరుకొని కార్యసిద్ధి పొందగలం అన్నది మనకు సుందరకాండ అందించే సందేశం. క్రోధమనే అగ్నిని జయించిన వాడే నిజమైన పురుషుడు అన్నది అక్షరాలా నిజం. కానీ, నేటి పురుషుడిలో ఉన్నదే క్రోధం. కారణం? పునాదులు సరిగా లేకపోవటం వలన. జీవితాశయం, మూలకాలైన విలువలపై నమ్మకం లేకపోవటం. వీటిని పెంపొందించుకోవడానికి రామాయణం, ముఖ్యంగా సుందరకాండ ఎంతో తోడ్పడుతుంది. పారాయణ ముఖ్య లక్ష్యం మనకో మార్గాన్ని కనుగొనటానికి. ఆర్యులు ఎంతో సాధన చేసి, శోధన చేసి మనకు ఇటువంటి సాధనాలను అందించారు. 

ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని సాగరాన్ని దాటి, దుర్భేద్యమైన లంకా నగరాన్ని జయించి మహాత్ముడైనాడు హనుమంతుడు. సంసారం ఒక సాగరం, అతి దుర్భేద్యమైనవి అరిషడ్వర్గాలనే లంకానగరం. భక్తితో, నమ్మకంతో, సత్సంకల్పంతో వీటిని దాటవచ్చు అని మనకు వాల్మీకి మహర్షి మహత్తరంగా తెలియజేశాడు. 

10, జూన్ 2015, బుధవారం

రామజోగి మందు గొనరే ఓ జనులారా


రామజోగి మందు గొనరే  ఓ జనులారా

రామజోగి మందు మీరు  ప్రేమతో భుజియించరయ్యా
కామక్రోధములనెల్ల కడకు పారద్రోలే మందు

కాటుక కొండలవంటి కర్మములెడబాపే మందు
సాటిలేని జగమునందు స్వామి రామజోగి మందు

కోటి ధనములిత్తునని కొన్నను దొరకని మందు
సాటిలేని భాగవతులు స్మరణజేసి తలచు మందు

వాదుకు చెప్పిన గాని వారి పాపములు గొట్టి
ముదముతోనే మోక్షమిచ్చే ముద్దు రామజోగి మందు

ముదముతో భద్రాద్రియందు ముక్తిని పొందించే మందు
సదయుడైన రామదాసు సద్భక్తితో గొలిచే మందు


ఓ జనులారా! రామనామమనే ఔషధాన్ని సేవించండి.  ఈ మందు ప్రేమతో భుజించండి. కామక్రోధాదులను పూర్తిగా పారద్రోలే మందు ఇది. నల్లని కొండల వంటి కర్మఫలములనుండి విముక్తి కలిగించే మందు ఇది. ఈ మందుకు ప్రపంచంలో సాటి లేదు. కోట్ల ధనమిచ్చి కొందామనుకుంటే దొరకని మందు, సాటిలోని భగవద్భక్తులు స్మరణ జేసి నిత్యము తలచే మందు ఇది. వాదంకోసం చెప్పినా సరే వారి పాపాలను పోగొట్టి సంతోషముగా మోక్షమిచ్చే ముద్దైన మందు ఇది. ఆనందముతో భద్రాచలములో మోక్షాన్ని ప్రసాదించే మందు ఇది, సహృదయుడైన రామదాసు సద్భక్తితో కొలిచే మందు ఇది. ఈ మందును పొందండి.

రామజోగి మందు అనే పేరుతో రామ నామ వైశిష్ట్యాన్ని పామరులకు కూడా అర్థమయ్యేలా తెలియజేస్తున్నారు వాగ్గేయకారులు భక్త రామదాసు గారు. రామ నామ మహిమను తెలిసిన యోగులు దానిలో తరించటమే కాకుండా లోక కళ్యాణార్థమై దానిని ప్రజలకు అనేక విధాలుగా తెలియజేసిన పుణ్యభూమి మనది. అటువంటి మహనీయులలో మన వాగ్గేయకారులు అగ్రగణ్యులు. రామమంత్రామృత పానం చేసిన త్యాగయ్య, రామదాసు దానిని కోట్లాది జనులకు తరతరాల పాటు తమ సంకీర్తనల ద్వారా అందజేస్తున్నారు. ఈ గంగా ప్రవాహంలో తరించి ముక్తిని పొందిన మానవులు ఎందరో. అందుకే ఈ వాగ్గేయకారులు దివ్యమైన అవతారపురుషులుగా భావించబడుతున్నారు.

సంగీతంలో నామ మహిమను తెలియజేసే బృహద్కార్యాన్ని పరమాత్మ ఇటువంటి వాగ్గేయకారుల అవతారానికి కారణంగా చేశాడు. మహారామభక్తుడైన కబీరు వద్ద రామతారక మంత్రోపదేశం పొంది నిరంతరం రామభక్తిలో ఓలలాడిన రామదాసు ఆ మంత్ర రుచిని తన కీర్తనలలో ఎంతో మనోజ్ఞంగా వర్ణించారు. తారక మంత్రము కోరిన దొరికెను, ఓ రామ నీ నామమెంత రుచిరా, రామనామమే జీవనము వంటి ఎన్నో కీర్తనల ద్వారా అయన మనకు దివ్యౌషధమైన రామ మంత్ర మహాత్మ్యాన్ని తెలియజేశారు. అందులో ఈ రామజోగి మందు గొనరే ఒకటి.

అరిషడ్వర్గాలను, ఎంతో కఠినమైన కర్మఫలాలను పోగోట్టే మహత్తరమైన ఔషధం ఈ రామనామం. ఎలా? రామ అనే అక్షరాలు నారాయణాయ, నమశ్శివాయలోని కీలకాక్షరాలైన రా మరియు మ కలిస్తే ఏర్పడినది. రామనామాన్ని జపిస్తే శ్రీహరి వేయినామాలు పఠించినట్లు అని శివుడు పార్వతితో స్వయంగా విష్ణు సహస్రనామ ఫలశ్రుతిలో తెలియజేశాడు. అంత శక్తివంతమైన రామ మంత్రానికి ఓం బీజం, ధర్మబద్ధత శక్తి, శౌర్యం కీలకం.

దీనిని సాధన చేసి సిద్ధి పొందాడు రామదాసు. ఆ రాముని అనుగ్రహంతో భద్రాద్రిలో ఒక దివ్యక్షేత్రాన్ని నెలకొల్పి మానవాళికి భవతారకాన్ని ఇచ్చాడు.  భవసాగరాన్ని దాటడానికి రామ నామము అద్భుతమైన నావ. ఆ మంత్రాన్ని ఔషధమని రామదాసు తెలుపటంలో ఆంతర్యం మనలోని మాలిన్యాలను తొలగించే సాధనమని చెప్పటం. అరిషడ్వర్గాలు, పాపసంచయాలు, కర్మఫలాలు తొలగించుకోవటానికి రామనామం సంజీవని.

రామ నామమృత పానం చేసి అందరమూ తరిద్దాం. రామదాసు చెప్పిన మాటలు సత్యపు మూటలు. అనుభవైకవేద్యములు.

రామజోగి మందు గొనరే బృందగానం 

9, జూన్ 2015, మంగళవారం

కంజదళాయతాక్షి కామాక్షి

కంజదళాయతాక్షి కామాక్షి కమలా మనోహరి త్రిపురసుందరి


కంజదళాయతాక్షి కామాక్షి కమలా మనోహరి త్రిపురసుందరి

కుంజర గమనే మణిమండిత మంజుల చరణే మామవ శివ
పంజర శుకి పంకజముఖి గురుగుహ రంజని దురిత భంజని నిరంజని

రాకా శశివదనే సురదనే
రక్షిత మదనే రత్న సదనే
శ్రీకాంచన వసనే సురసనే
శృంగారాశ్రయ మంద హసనే
ఏకానేకాక్షరి భువనేశ్వరి
ఏకానందామృత ఝరి భాస్వరి
ఏకాగ్ర మనోలయకరి శ్రీకరి
ఏకామ్రేశ గృహేశ్వరి శంకరి

ఎర్రని కలువలవంటి కనులు గల ఓ కామాక్షీ! శ్రీమహాలక్ష్మికి ప్రియమైన ఓ త్రిపుర సుందరీ!

ఏనుగువలె అందముగా మెల్లగా నడిచే తల్లీ! మణులతో అలంకరించబడిన మృదువైన పాదముల కల అమ్మా! శివుని హృదయమనే పంజరములో యున్న చిలుక వంటి పార్వతీ! కలువ వంటి ముఖము గల అమ్మా! కార్తికేయునికి ఆనందం కలిగించే తల్లీ! పాపాలన్నిటినీ నాశనం చేసే పవిత్రమైన తల్లీ! 

నిండు పున్నమి నాటి చంద్రుని వంటి ముఖము కల అమ్మా! మంచి పలువరుస కల తల్లీ! మన్మథుని కాపాడిన తల్లీ! రత్న సింహాసనాన్ని అధిరొహించి బంగారు వస్త్రాలను ధరించిన తల్లీ! అద్భుతమైన సౌందర్యము మరియు చిరునవ్వు కలిగిన అమ్మా! ఒకటి లేదా అనేక అక్షరములతో కొలువబడిన తల్లీ! సమస్తభువనములకు ఈశ్వరివి! సచ్చిదానందమనే అమృతాన్ని ప్రవహిస్తూ ప్రకాశించే తల్లీ! ఏకాగ్రమైన మనసుకు లయకారిణివి! శుభములు కలిగించే తల్లీ! ఏకామ్రేశ్వరుని పత్నివి! శంకరీ! 

కంచిలోని శివుడు ఏకామ్రేశ్వరుడు, పార్వతి కామాక్షీ రూపం. ఆ కామాక్షిపై కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితులు రచించిన ఈ కృతి ఎంతో ప్రాచుర్యం పొందింది. దేవీ ఉపాసనలో దీక్షితులవారు అమ్మ సాక్షాత్కారము పొంది సిద్ధులైనారు. శ్రీచక్ర నివాసిని అయిన ఆదిపరాశక్తి వైభవానికి ముత్తుస్వామి దీక్షితుల కీర్తనలు ఆనంద నిలయాలు.

సంగీత త్రయంలో దీక్షితులవారు, శ్యామశాస్త్రుల వారు కంచి కామాక్షి అమ్మపై ఎన్నో కీర్తనలను రచించారు.  కామాక్షీ వైభవాన్ని వీరిరువురూ తమ కీర్తనల ద్వారా ఎంతో ప్రభావవంతంగా ప్రచారం చేశారు. 

దీక్షితుల వారు పల్లవిలోనే రాగముద్రను కమలామనోహరి అన్న పదం ద్వార ఉపయోగించారు. ఓంకార పంజర శుకీం అన్న శ్లోకానికి దగ్గరగా ఆయన శివ పంజర శుకి అన్న అమ్మవారిని వర్ణించారు. శివుని హృదయంలో శక్తి నివసించటం ఈ విశ్వతత్త్వానికి ప్రతీక. అందుకే ఈ శివ పంజర శుకి అన్నది చాల నిగూఢార్థమైన ప్రయోగం. గురుగుహ అన్నది ఆయన ముద్ర. 

దీక్షితుల వారి రచనలు ఎక్కువ మటుకు సంస్కృత భాషలోనే చేశారు. ఇసుకతో చేసిన లింగాన్ని మామిడి చెట్టు కింద అర్చించి వివాహమాడిన సన్నివేశానికి ప్రతీక కంచిలోని కామాక్షీ ఏకామ్రేశ్వరుల దేవాలయం. శక్తి పీఠాలలో ఒకటైన కంచి ఆది శంకరులు ఇక్కడి అమ్మవారిని కొలిచిన తరువాత ప్రాభవాన్ని పొందింది. ఏకామ్రేశ గృహేశ్వరి శంకరి అని దీక్షితులు ఈ ఆది దంపతుల దివ్యక్షేత్ర మహిమను చాటారు.

ఈ కృతి చివరలో చిట్ట స్వరం దీనికి ఎంతో అందాన్నిచ్చింది. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి మధురమైన గాత్రంలో వినండి.


8, జూన్ 2015, సోమవారం

నిను వినా నామదెందు

నిను వినా నామదెందు నిలువదే శ్రీహరి హరి 


నిను వినా నామదెందు నిలువదే శ్రీహరి హరి

కనులకు నీ సొగసెంతో గ్రమ్మి యున్నది గనుకను 

నీదు కధలు వీనులందు నిండి యున్నది
శ్రీద నీ నామము నోట జెలగి యున్నది గనుక 

నేను ఎచట జూచినను నీవై యున్నది
భాను వంశ తిలక నీదు భక్తుడనుచు పేరు గనుక

కపటమౌ మాటలెల్ల కమ్మనైనది
తపము యాగ ఫలము నీవె త్యాగరాజ సన్నుత

ఓ శ్రీహరీ! నీపైన కాకుండా వేరే ఏ దానిపై నా మనసు నిలువదు. నీ రూపవైభవమంతా నా కళ్లకు కమ్మి యున్నది, నీ కథలు నా చెవుల యందు నిండి యున్నవి, నీ నామము నా నోట నిరంతరము యున్నది, నేను ఎక్కడ చూసినా నీవే కనిపిస్తున్నావు. ఓ సూర్య వంశ తిలకమా! నీ భక్తుడనని నాకు పేరు. కపటమైన మాటలు తీయగా ఉండవచ్చు. కానీ, నావి అటువంటి మాటలు కావు. నా తపస్సు, యోగ ఫలము నీవే శ్రీరామా!

త్యాగరాజస్వామి రామునిపై గల భక్తిని ఆయనతోనే ఈ సంకీర్తనలో విన్నవిస్తున్నారు. ప్రహ్లాదుడు నిరంతరం హరి ధ్యాసతో ఎలా తరించాడో అలాగే త్యాగరాజ స్వామి రామతారక మంత్ర జపంతో పరిపూర్ణ చైతన్య స్థితిని పొందారు. దాదాపు ముప్ఫై ఎనిమిదేళ్ల వయసుకే కోటి రామ మంత్రానుష్ఠానాన్ని పూర్తిజేసి, మంత్ర సిద్ధి, తదుపరి రామసాక్షాత్కారం పొందారు. అటు తరువాతనే 24వేల సంకీర్తనలను రచించారు. జీవనోపాధికి ఉంఛవృత్తిని ఎన్నుకొని విషయలోలుడు కాకుండా అతి నిరాడంబరంగా జీవించి జీవబ్రహ్మైక్యం పొందాడు త్యాగయ్య.

ఈ సంకీర్తనలో త్యాగయ్య రామునిపై గల నిరంతర దృష్టిని తెలుపుతున్నారు. పంచేద్రియములను విషయ వాంఛలపై, ప్రాపంచిక విషయాలపై కాకుండా అణువణువున నిండిన శ్రీహరిపై నిలిపి అపర రామభక్తుడిగా పేరొందాడు త్యాగయ్య. ఆ భక్తికి కలికితురాయి ఈ కీర్తన.

త్యాగయ్య ఎంతటి భక్తితో రచించారో ఈ కీర్తనను అంతే అద్భుతంగా గానం చేశారు సుస్వరలక్ష్మి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు. నవరస కన్నడ రాగంలో త్యాగరాజ హృదయావిష్కరణ హృద్యంగా, మనోజ్ఞంగా, రమ్యంగా మనకు అందించారు ఆమె.

సంగీతానికి భక్తి ఆయువు పట్టు. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు భక్తితో వచ్చిన తాదాత్మ్యతకు దర్పణం. అందుకే ఈ కీర్తన ఆమె గొంతులో త్యాగయ్య భావాన్ని అక్షరాలా ప్రతిబింబింపజేసింది.

చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ


చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ


చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ
కూడున్నది పతి చూడి కుడుత నాంచారి
సోబానే సోబానే సోబానే సోబానే

శ్రీమహాలక్ష్మియట సింగారాలకేమరుదు
కాముని తల్లియట చక్కదనాలకేమరుదు
సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు
కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి

కలశాబ్ధి కూతురట గంభీరాలకేమరుదు
తలపలోక మాతయట దయ మరి ఏమరుదు
జలజనివాసినియట చల్లదనమేమరుదు
కొలదిమీర ఈ చూడి కుడుత నాంచారి

అమరవందితయట అట్టీ మహిమ ఏమరుదు
అమృతము చుట్టమట ఆనందాలకేమరుదు
తమితో శ్రీవేంకటేశు తానె వచ్చి పెండ్లాడె
కొమెర వయస్సు ఈ చూడి కుడుత నాంచారి 

చూడికుడుత నాంచారి: గోదాదేవి (చూడి కుడుత అనేది తమిళ పదం. తాను ధరించిన మాలను స్వామికి ఇచ్చిన అని దాని అర్థం, అలా చేసింది  గోదాదేవి కాబట్టి ఆమెను చూడికుడుత్త నాచ్చియార్ అంటారుట).

సతులారా! మన గోదాదేవి పతితో కూడియున్నది. పెండ్లిపాటలు పాడండి. (సోబాన అనే పదం కలిగిన పాటలు పెళ్లి పాటలుగా ప్రాచుర్యం పొందాయి)

ఈమె శ్రీమహాలక్ష్మి యట, అలంకారాలకు (శృంగారమునకు) ఏమి తక్కువ?  మన్మథుని తల్లియట, చక్కదనాలు ఏమి తక్కువ? చంద్రుని తోబుట్టువట (క్షీర సాగర మథనంలో లక్ష్మితో పాటు చంద్రుడు కూడా ఆవిర్భవించాడు కాబట్టి వారిద్దరు తోబుట్టువులయ్యారు), ప్రసన్నత మరియు కళకు ఏమి తక్కువ? ఈ గోదాదేవి చాల కోమలమైన శరీరము కలది. 

ఈమె సముద్రుని కూతురట, గంభీరానికేమి తక్కువ? తలచితే లోకానికి తల్లియట దయకేమి తక్కువ? నీటినుండి పుట్టిన కమలంలో నివసిస్తుందట చల్లదనానికేమి తక్కువ?  ఈ గోదాదేవి అన్నీ అపరిమితంగా కలిగినది.

ఈమె దేవతల వందనాలు పొందినదట, అటువంటి మహిమలకేమి తక్కువ?  అమృతానికి చుట్టమట (క్షీర సాగర మథనంలో అమృతము కూడా ఉద్భవించింది కాబట్టి) మరి ఆనందాలకేమి తక్కువ? కౌమార్యంలో ఉన్న ఈమెను ఆత్రుతతో శ్రీవేంకటేశుడు తానే వచ్చి పెండ్లాడాడు. 

అన్నమాచార్యుల వారు గోదా వైభవాన్ని ఈ సంకీర్తన ద్వారా అద్భుతంగా వివరించారు. శ్రీరంగనాథుని పుట్టుకతోనే కొలిచిన గోదా శ్రీమహాలక్ష్మి అవతారంగా దర్శించి ఈ సంకీర్తనను మనకు అందించారు. గోదాదేవి శృంగారాన్ని, సౌందర్యాన్ని, తల్లి ప్రేమను, కరుణను, కళలను, మహిమలను, గాంభీర్యాన్ని, కోమలత్వాన్ని అద్భుతమైన ఉపమానములతో లక్ష్మీదేవితో పోల్చి ఈ కీర్తనకు దివ్యత్వాన్ని చేకూర్చారు. ఆమె ఈ గుణాలను గమనించి శ్రీరంగనాథుడు వచ్చి పెండ్లాడిన సందర్భంగా సతులను సోబాన పాడరమ్మా అని కోరుతున్నాడు సంకీర్తనాచార్యుడు. పదకవితా పితామహుని భావ సంపద, భక్తి జ్ఞాన సౌరభాలు ఈ సంకీర్తన ద్వారా ప్రకాశిస్తున్నాయి. తల్లిలో ఉండే సర్వ సులక్షణాలను అన్నమయ్య ఇందులో పొందుపరచారు.

విష్ణుచిత్తుని ఇంట జన్మించిన ఆ లోకమాత శ్రీరంగనాథునితో ఏకమయ్యే అద్భుతమైన అవతరణిక తిరుప్పావై.  ఆ తిరుప్పావైలోని ఘట్టాలను ఎందరో సంకీర్తనాచార్యులు తమ భావాలలో వ్యక్తపరచారు. గోదావైభవాన్ని స్వయంగా శ్రీవిల్లిపుత్తూరులో దర్శించి తరించిన అన్నమాచార్యుల వారు దానిని తిరుమల-తిరుపతిలో వెలసిన వేంకటేశుడు-అలమేల్మంగల వైభవానుభూతికి సారూప్యంగా వర్ణించారు. తన జీవితాన్ని శ్రీరంగంలోని రంగనాథునికి సమర్పించిన గోదా 'నేను' అన్న భావాన్ని త్యజించి స్వామిలో ఐక్యమయ్యింది. అందుకే లోకవంద్య అయ్యింది.

అన్నమాచార్యుల వారు అమ్మవారిని ఎన్నో కీర్తనలలో నుతించారు. మెరుగు బోడి అన్నా, చూడికుడుత నాంచారి అన్నా, క్షీరాబ్దికన్యక అన్నా, జయలక్ష్మి అన్నా, ఆ అమ్మను ప్రతి ఒక్క సంకీర్తనలోనూ ప్రత్యేకంగా, ఒక వినూత్నమైన భావాన్ని మన ముందు ఆవిష్కరించారు.  పరమాత్మ యొక్క మాయా స్వరూపిణిగా కూడా మనకు వివరించారు. స్వామితో సరస శృంగార సల్లాపాలు సలిపే అమ్మ, లోకమాతగా, మనలను అపారమైన కరుణతో అనుగ్రహించే తల్లిగా, చల్లని చూపులతో కాపాడే కల్పవల్లిగా, సకల సద్గుణాల రాశిగా అన్నమాచార్యుల వారు ఎన్నో కీర్తనలలో ప్రస్తుతించారు. వాటిలో ఈ చూడరమ్మ సతులాలా ప్రత్యేకమైనది.

వివాహమనేది మానవ జన్మలో ఎంతో పవిత్రమైనది. దానికి సంబంధించిన వేడుకలను, ముచ్చటలను అన్నమాచార్యుల వారు తమ పదశోభలలో ఎంతో మధురంగా జనులకు అర్థమయ్యే భాషలో, అనాటి సమాజానికి అద్ధం పట్టేలా రచించారు. పిడికిట తలంబ్రాల పెళ్లికూతురని పాడినా, సోబాన పాడరమ్మా అని నుతించినా ఆయా వేడుకలను మనకు ఇప్పటికీ తెలిసేలా సాహిత్యాన్ని గుప్పించారు. ఇదే మన సంస్కృతిలోని గొప్పతనం. అది ఒక గంగా ప్రవాహంలాంటిది. మహానుభావుల భావ స్పందనలు రచనలుగా మారి, తర తరాల వారసత్వంగా మనకు అందుతోంది.

అన్నమాచార్యుల పదకవితా వైభవం, ఆధ్యాత్మిక ఉన్నతికి ఈ కీర్తన ఒక కలికితురాయి.  గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ గారి గళంలో ఈ సంకీర్తనను వినండి.6, జూన్ 2015, శనివారం

తిరుమల తిరుపతి వేంకటేశ్వరా - మహామంత్రి తిమ్మరుసు


తిరుమల తిరుపతి వేంకటేశ్వరా కూరిమి వరముల కురియుమయా 

చెలిమిని విరిసే అలర్మేల్మంగమ చెలువములే ప్రియ సేవలయా 

నయగారములను నవమల్లికలా 
మమకారాలను మందారములా 
మంజుల వలపుల మలయానిలముల 
వింజామరమున వీతుమాయా 

ఆశారాగమే ఆలాపనగా 
సరస రీతుల స్వరమేళనగా 
అభినయ నటనలే ఆరాధనగా 
ప్రభునలరించి తరింతుమయా

మహామంత్రి తిమ్మరుసు చిత్రంలో పింగళి నాగేంద్రరావు గారి సాహిత్యం, పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీతంలో ఎస్ వరలక్ష్మి, పి. సుశీల గారు కలిసి పాడిన గీతం.

చలనచిత్రాలు సందేశానికి, సంగీత సాహిత్యాలకు, భక్తికి మంచి మాధ్యమాలు అని నిర్మాతలు, దర్సకులు అనుకున్న కాలం 1950-60 దశాబ్దాలు. మహామంత్రి తిమ్మరుసు అనే చిత్ర కథ చరిత్రకు సంబంధించినది, రాచరికానికి సంబంధించినది. అందులో, విజయనగర సామ్రాజ్యాధీశుడు సాహితీ ప్రియుడు, బహుభాషా కోవిదుడు, ఎన్నో దేవాలయాలకు నిధులు ఇచ్చి, నిర్మించిన వాడు. సనాతన ధర్మం నిలబడి ముందుకు వెళ్లటానికి ఎంతో తోడ్పడిన మహనీయుడు. తెలుగు భాష మాధుర్యాన్నిఆస్వాదించి రచనలు చేసిన కోవిదుడు ఆయన. అటువంటి రాజు కొలువులో మంత్రి తిమ్మరుసు. మహామేధావి, విద్యా సంపన్నుడు. ఇటువంటి నేపథ్యం కలిగిన చిత్రం ఈ మహామంత్రి తిమ్మరుసు.మహారాజుల సంగీత సాహిత్యాభిలాషలు అంతఃపురములలో రాణుల వద్ధ కూడా  వికసించేవి. దీనికి చరిత్ర సాక్ష్యం. మంచి సంగీత నృత్య కళాకారులు ఆస్థానాలలో పేరు పొందారు. అలాగే స్వయంగా రాజులు, రాణులు సంగీత సాహిత్య నృత్య ప్రావీణ్యం పొందారు. అందుకు మచ్చు తునకగా ఈ భక్తి గీతాన్ని మహామంత్రి తిమ్మరుసు చిత్రంలో పొందుపరచారు. రాయలే వీణ వాయించగా రాణులు గానం చేయగా నర్తకి ఈ మధుర భక్తి సుమాన్ని మన ముందు ఆవిష్కరించారు. రాయలంటే అన్న ఎన్ టీ ఆర్ అనేలా ఆయన నటించారు. అలాగే ఎస్ వరలక్ష్మి, దేవిక గాత్ర ధర్మానికి అనుగుణంగా నటించారు. ఇక ఎల్ విజయలక్ష్మి సంగతి చెప్పేదేముంది? భరత నాట్య కౌశలాన్ని ఊహించలేని స్థాయికి తీసుకువెళ్లిన మహా నర్తకి ఆమె. ఈ గీతంలోని భావనను తన ఆహార్యముతో, ఆంగికముతో అద్భుతంగా నృత్యసేవగా ప్రదర్శించారు.

తిరుమల వేంకటేశుని నుతించే ఈ గీతంలో శరణాగతి భావన కన్నా సేవలో కలిగే మధుర భావాలను పొందు పరచారు. కృష్ణదేవరాయల రాణులపై చిత్రీకరించిన ఈ పాటలో తమలో కలిగే భావనలను ఎలా స్వామి సమర్పిస్తున్నారో కవి మనకు తెలియజేశారు.

ఓ వేంకటేశ్వరా! ప్రేమను, వరములనివ్వు స్వామీ! స్నేహాన్ని విరిసే అలమేలుమంగ యొక్క సౌందర్యమే నీకు ప్రియమైన సేవలు! మృదుత్వముతో కూడిన మాటలే నవ మల్లికలుగా, మమకారమే మందార పుష్పాలుగా, మంజులమైన వలపులే పిల్లగాలులుగా వింజామరలు వీస్తాము స్వామీ! ఆశతో కూడిన రాగమే ఆలాపనగా, సరసముతో కూడిన హావభావములే స్వరాల కలయికగా, నాట్యాభినయాలే ఆరాధనగా నిన్ను అలరించి తరించెదము స్వామీ!

శృంగార రసంతో కూడిన భక్తిని మధురభక్తి అంటారు. అన్నమాచార్యుల నుండి క్షేత్రయ్య వరకు ఈ మధురభక్తిని తమ పదాలలో విశదీకరించారు. మనలో కలిగే ఏ భావననైనా స్వామికి అహంకారం లేకుండా సమర్పించ గలిగితే అది ఆయనకు స్వీకారమే. అందుకే మహా వాగ్గేయకారుల శృంగార ప్రాధాన్యమైన సంకీర్తనలు  స్వామి పాదాల వద్ద శాశ్వత సుగంధ పూరితమైన పుష్పాలుగా నిలిచాయి. అటువంటి గీతమే ఈ తిరుమల తిరుపతి వేంకటేశ్వరా. కళాకారులలో స్వతహాగా కలిగే మానవీయ భావనలకు దివ్యత్వం కలిగించే రీతిలో సాగుతుంది ఈ గీతం.

పింగళి నాగేంద్ర కవి యొక్క రస హృదయస్పందనే ఈ మంచి గీతం. దీనికి పెండ్యాల వారి మాధుర్య భరితమైన సంగీతం తోడై ఒక పరిపూర్ణమైన గీతంగా నిలిచింది. మాధుర్యానికి మారుపేరైన సుశీలమ్మ గారి గొంతు, గాంభీర్యానికి, భావానికి నెలవైన ఎస్ వరలక్ష్మి గారి గొంతు ఈ గీతానికి సాధనాలై ఇప్పటికీ మధుర భక్తి సువాసనలను చిందింపజేస్తున్నాయి. 

5, జూన్ 2015, శుక్రవారం

మోక్షము గలదా


మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు గాని వారలకుమోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు గాని వారలకు

సాక్షాత్కార! నీ సద్భక్తి సంగీత జ్ఞాన విహీనులకు

ప్రాణాలన సంయోగము వల్ల ప్రణవ నాదము సప్తస్వరము బరగ
వీణావాదనలోలుడౌ శివమనోవిత మెరుగరు త్యాగరాజ వినుత

ప్రపంచమున దేహేంద్రియములతో జీవించియుండు కర్మబంధములకు అంటనివారు కానిచో భువిలో మోక్షము గలదా?

ఎల్లప్పుడూ ప్రత్యక్ష సిద్ధమైయున్న రూపము గలవాడా! నిన్ను తెలియుటకు సాక్షాత్సంబంధము గలది నాదోపాసనమే. ప్రాణవాయువు, అగ్ని యొక్క కలయిక వలన ప్రణవనాదము ఉద్భవించింది. ఆ నాదమే సప్తస్వరములై సంగీతమైనది. సంగీతజ్ఞానము, భక్తిలేని మానవులకు మోక్షము కలుగదు. వీణావాదన తత్త్వజ్ఞుడైన శివుని మనసు తీరును సంగీతజ్ఞానవిహీనులు తెలియలేరు. ఆ మర్మము ఎరిగిన వారికి ప్రణవరూపుడగు శివుడు సాక్షాత్కరించును. కావున నాదస్వరూపమును గుర్తెరిగి పరమాత్మను కీర్తించుట ముక్తికి మార్గము. ఓ దేవా! త్యాగరాజు నిన్ను వినుతించుచున్నాడు.

కలౌ నామ సంకీర్తనం అన్నాడు నారదుడు. కలియుగంలో నామ సంకీర్తనే మోక్షమునకు ఉత్తమమైన మార్గము. ఎందుకు? యుగ లక్షణాలను బట్టి మోక్ష పథము మారుతుంది. పాప పురుషుడు అధర్మాన్ని మూడు పాళ్లు ధర్మాన్ని ఒక పాలుగా చేసే సమయం ఈ కలియుగం. పాపపుణ్యముల మూటలను కేవలం నామ సంకీర్తన పటాపంచలు చేస్తుంది. ఈ పనికోసమే పరమాత్మ శ్రీవేంకటేశ్వర స్వామిగా, షిర్డీ సాయి వంటి ఇతర సద్గురువుల రూపంలో అవతరించాడు. వస్తువులలోను, జనుల ఆలోచనలలోని కలుషితం వలన క్రతువులు కలియుగంలో మోక్షాన్ని ప్రసాదించలేవు. అన్నమాచార్యులు, త్యాగరాజస్వామి వంటి మహాపురుషులు ఈ విషయాన్ని తెలుసుకొని తమ సంకీర్తనల ద్వారా పరమాత్మను నుతించి మోక్షాన్ని పొందారు. మోక్షమనగా బంధనములనుండి విముక్తి పొందటమే. అది జరిగిన తరువాత దేహి, దేహము యొక్క జ్ఞానము శాశ్వతమై మానవుడు దుఃఖరహితుడవుతాడు.

సంకీర్తనకు సాహిత్యము, సంగీతము తల్లిదండ్రులు. ఆ సంగీత జ్ఞానము భక్తికి, తద్వారా మోక్షానికి ఏ విధంగా ఉపయుక్తమో ఈ కీర్తన ద్వారా త్యాగరాజస్వామి వివరించారు. విశ్వానికి మూలమైన ప్రాణవాయువు మరియు అగ్ని కలయిక నుండి ఓంకారం జనించింది. ఓంకారమునుండి సప్తస్వరములు ఉద్భవించాయి. ఈ సప్తస్వర విన్యాసమే సంగీతము. కాబట్టి విశ్వానికి మూలమైన ప్రాణానలముల శక్తి సంగీతములో ఉంది. అందుకే అతి పవిత్రమైనది, మహత్తరమైనది. ఆ సప్తస్వరముల మేళనలో భావం కలిస్తే ఇక అది మంత్రసమానమే. అటువంటి సంకీర్తనలను శరణాగతితో పాడితే మనలోని మాలిన్యాలు తొలగి, ప్రణవ ప్రేరితమైన దివ్య శక్తి ప్రవేశించి మనలను ఆత్మ సాక్షాత్కారమువైపు నడిపిస్తాయి. కావలసినది ఈ మహత్తు యొక్క జ్ఞానము, పరమాత్మ పట్ల భక్తి మరియు శరణాగతి.

సంగీత జ్ఞానముతో, సంకీర్తనలతో శివతత్త్వాన్ని, తద్వారా మోక్షాన్ని పొందగలమని త్యాగరాజుల వారు సారమతి రాగంలో మనకు తెలియజేస్తున్నారు.

ఈ భావపూరితమైన త్యాగరాజస్వామి వారి కృతిని ఎమ్మెల్ వసంతకుమారి గారి గాత్రంలో వినండి.

4, జూన్ 2015, గురువారం

ఆనంద తాండవమాడే శివుడు

ఆనంద తాండవమాడే శివుడు అనంత లయుడు చిదంబర నిలయుడు


ఆనంద తాండవమాడే శివుడు అనంత లయుడు చిదంబర నిలయుడు

నగరాజ సుత చిరునగవులు చిలుకంగ సిగలోన వగలొలికి ఎగిరి ఎగిరి దూకంగ సురగంగ

ప్రణవనాదం ప్రాణం కాగా
ప్రకృతి మూలం తానం కాగా
భువనమ్ములే రస భూమికలు కాగా
భుజంగ భూషణుడు అనంగ భీషణుడు 
పరమ విభుడు గరళ ధరుడు 
భావ రాగ తాళ మయుడు సదయుడు

ఏమి శాంభవ లీల!! ఏమా తాండవ హేల!!
అణువణువులోన దివ్యానంద రసడోల
సురగరుడులు ఖేచరులు విద్యాధరులు
నిటల తట ఘటిత నిజకర కమలులై
నిలువగా కురువరా యని పిలువగా కొలువగా

ధిమి ధిమి ధిమి ధిమి ఢమరుధ్వానం ధిక్కటముల మార్మ్రోయగా
కిణ కిణ కిణ కిణ మణి నూపురముల ఝణత్కారముల మ్రోయగా
విరించి తాళము వేయగా 
హరి మురగలు మ్రోయింపగా 
ప్రమథులాడగా అప్సరలు పాడగా 
ఆడగా పాడగా ఆనంద తాండవమాడే

అమెరికా అమ్మాయి చిత్రానికి డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డిగారు రచించిన శివతాండవ గీతం ఇది. అమెరికాలో జన్మించిన స్త్రీ భారతదేశపు కోడలుగా వచ్చి ఈ గీతంలోని భావాన్ని అనుభూతి చెందుతుంది. ఒక శివాలయంలో కలిగే ఈ అనుభవానికి సినారెగారి గీతం, జి.కె.వెంకటేష్ గారి సంగీతం తోడు కాగా సుశీలమ్మ గారి గొంతులో తేటతేనె తెలుగులో అమృతాన్ని కురిపించింది.

కైలాసంలో పరమశివుని ఆనంద తాండవ హేలను కవి మధుర మనోజ్ఞంగా ఆవిష్కరించారు. అనంతమైన లయలో నిమగ్నుడైన వాడు, ఆకసమంతా నిండియున్న శివుడు ఆనంద తాండవమాడుతున్నాడు.  (చిదంబర నిలయుడు అనగా చిదంబర క్షేత్రంలో వెలసిన నటరాజస్వామి అని కూడా అర్థం చెప్పవచ్చు. కానీ, లయకారకుడైన శివుడు ఆకాశమంతా నిండి ఉన్నాడు అన్నది సముచితము అనిపించింది)

హిమవంతుని కుమార్తె అయిన పార్వతి చిరునవ్వులొలికిస్తూ ఉండగా, శిరసులో జటాఝూటమునందు దేవగంగ వగలు ఒలికిస్తూ ఎగిసి ఎగిసి దూకుచుండంగా, శివుడు ఆనందతాండవం చేస్తున్నాడు.. ప్రణవనాదమైన ఓంకారం ప్రాణమవగా, ప్రకృతికి మూలమైన కాలం తాళం కాగా. సమస్తలోకాలు నవరసాల పాత్రను పోషిస్తుండగా, సర్పములను ఆభరణములుగా కలిగిన వాడు, మన్మథుని దహనం చేసిన వాడు, సర్వేశ్వరుడు, కంఠంలో విషాన్ని ధరించిన వాడు, భావము, రాగము, తాళములలో లయమైన వాడు, అపారమైన దయ కలిగిన వాడు అయిన పరమశివుడు ఆనంద తాండవం చేస్తున్నాడు.

ఆహా! ఎంత అద్భుతమా శివుని లీల? ఏమిటా నృత్య విన్యాసము?  అణువణువులో దివ్యమైన ఆనంద రసం పొంగి పొరలుతున్నది! దేవతలు, గరుత్మంతుడు, ఆకాశములో సంచరించే దేవగణములు, జీమూతవాహనుడు మొదలైన దేవ వర్గము (విద్యాధరులు) ముక్కంటి అయిన శివునికి చేతులతో నమస్కరించుచు నిలువగా, కైలాసపతీ అని పిలువగా, కొలువగా పరమశివుడు ఆనందతాండవం చేస్తున్నాడు.

ధిమి ధిమి ధ్వనులతో దిక్కులన్నీ మారుమ్రోగగా, కిణ కిణ కిణ అనే రావముతో గజ్జెలు ఝణత్కారము చేయగా, బ్రహ్మ తాళము వేయగా, విష్ణువు నాదస్వరము వాయించగా, ప్రమథ గణములు ఆడగా,  అప్సరసలు పాడగా పరమశివుడు ఆనందతాండవం చేస్తున్నాడు.

సినారె గారి భావ సంపద, భాషా కౌశలం, పద విన్యాసం ఈ తాండవహేలలో ఒక దివ్య పారిజాత సుమంలా వికసించాయి. తెలుగులో మాధుర్యాన్ని, క్రొత్తదనాన్ని కురిపించటంలో సినారె గారికి సాటి ఎవ్వరూ లేరు. ఈ గీతంలోని భావగర్భితమైన ప్రాస దీనికి తార్కాణం. నటేశుని నాట్యాన్ని సమస్త దేవతల నృత్య వాయిద్య గాత్ర సహకారాన్ని, ఆ లయకారుని అద్భుత విన్యాసాన్ని మనకు కళ్లకు కట్టీనట్లుగా సినారె గారి కలంలో జాలువారింది.  తాళ వాద్యముల అద్భుత సమన్వయముతో, పార్వతి చిరునవ్వుతో, గంగమ్మ చిందుతో స్వామి ఆనంద పరవశములో నర్తన చేస్తుంటే ఆహా! ఆ భావనే కైలాస గిరి రమణీయ దృశ్య కావ్యావిష్కరణ కనుల ముందు కలుగ జేస్తుంది.ఇక చిత్రం విషయానికొస్తే, నాయిక ఆన్నె ఒక ఫ్రెంచ్ నర్తకి. ఆమె భారతదేశం వచ్చి వెంపటి చిన సత్యం గారి వద్ద కూచిపూడి అభ్యసించి, ఆ కళలో, భరతనాట్య శాస్త్త్రములో ప్రావీణ్యము సంపాదించి, దేవయాని అనే పేరుతో గొప్ప కళాకారిణిగా పేరు పొందారు. పద్మశ్రీ బిరుదు కూడా పొందారు. మనం స్వధర్మాన్ని, మన ప్రాచీన కళలను వదులుకొని పాశ్చాత్య నాగరికత వెంట పడుతున్న సమయంలో మన కళలలోని దివ్యత్వాన్ని గ్రహించి ఆ కళను ఆరాధించిన ఈమె మనకు మార్గదర్శకురాలు. భాష, సంస్కృతి, సాంప్రదాయము, భావము తెలియని విదేశీ వనిత అన్నీ నేర్చుకొని అత్యున్నత స్థాయికి చేరుకుందంటే అది సామాన్యమైన పట్టుదల కాదు. ఆమెలోని తృష్ణకు, శ్రమకు జోహార్లు. ఇలాంటి వారి  మన కళలలోని అద్భుతాలను కనుగొని, వాటిని సముచితంగా గౌరవించే ప్రయత్నం ఇకనైనా చేయాలి.

సుశీలమ్మ గళంలో ఈ పాట మాధుర్యాన్ని, దేవయాని గారి నాట్యంలో ఈ భావ వ్యక్తీకరణను ఆస్వాదించండి.