16, జూన్ 2015, మంగళవారం

సుందరకాండ - క్రోధం గురించి హనుమంతుని స్వానుగతం

సుందరకాండ - క్రోధం గురించి హనుమంతుని స్వానుగతం



క్రోధం గురించి సుందరకాండ 55వ సర్గలో ప్రస్తావన:

ధన్యాస్తే పురుష శ్రేష్ఠా యే బుద్ధ్యా కోపముత్థితం
నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభసా

క్రుద్ధః పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి
క్రుద్ధః పరుషయా వాచా నరః సాధూనధిక్షిపేత్

వాచ్యావాచ్యం ప్రకుపితో న విజానాతి కర్హిచిత్
నాకార్యమస్తి క్రుద్ధస్య నావాచ్యం విద్యతే క్వచిత్

యః సముత్పతితం క్రోధం క్షమయైవ నిరస్యతి
యథొరగస్త్వచం జీర్ణాం స వై పురుష ఉచ్యతే

ధిగస్తు మాం సుదుర్భద్ధిం నిర్లజ్జం పాపకృత్తమం
అచింతయిత్వా తాం సీతామగ్నిదం స్వామిఘాతకం 

యది దగ్ధత్వియం లంకా నూనమార్యాపి జానకీ
దగ్ధా తేన మయా భర్తుర్హతం కార్యమజానతా

ఈషత్కారమిదం కార్యం కృతమాసీన్న సంశయః
తస్య క్రోధాభిభూతేన మయా మూల క్షయః కృతః

మయా ఖలు తదేవైదం రోష దోషాత్ ప్రదర్శితం
ప్రథితం త్రిషు లోకేషు కపిత్వమనవస్థితం

ధిగస్తు రాజసం భావం అనీశమనవస్థితం
ఈశ్వరేణాపి యద్రాగాన్మయా సీతా న రక్షితా 

తదహం భాగ్య రహితో లుప్త ధర్మార్థ సంగ్రహః
రోగ దోష పరీతాత్మా వ్యక్తం లోక వినాశనః

శ్లోకార్థం:

ఎవరు ప్రజ్జ్వలించు అగ్నిని నీటితో చల్లార్చినట్లు తమకు కలిగిన కోపమును తమ బుద్ధితో నిరోధించగలరో అట్టి మహాత్ములగు పురుష శ్రేష్ఠులు ధన్యులు.

కోపము హద్దు మీరినప్పుడు పాపము చేయనివాడెవరు? కోపించినవాడు పెద్దలను కూడా చంపును. కోపించినవాడు కఠినోక్తులతో సత్పురుషులను అపేక్షించును.

ఈ లంక పూర్తిగా తగులబడినచో పూజ్యురాలగు సీత తప్పక అందులో తగులబడి ఉంటుంది. కావున, తెలియకనే నేను నా ప్రభుకార్యమును పాడుచేసితిని.

సందేహములేకుండా నేను పనిని అరకొరగా చేసితినే కానీ సమగ్రముగా కాదు. కోపపూరితుడనై నేను నా కార్యమునకు మూలమైన సీతాదేవినే నాశనం చేసికొంటిని.

నేను నా రోషపు దోషముచే కోతుల స్వభావమైన, ముల్లోకములలో ప్రసిద్ధమైన చంచలత్వమును ప్రదర్శించితిని.

రజోగుణము వలన ఏర్పడిన నా యీ చేష్ట ఎందుకు పనికిరానిది, నిలకడ లేనిది. నేను యీ రజోగుణ మూలకమగు క్రోధమునకు లోబడి సీతాదేవిని రక్షించుకోలేకపోతిని.

మిక్కిలి కోపముతో ఉన్నవాడు ఏది పలుకవలెనో, ఏది పలుకరాదో ఎరుగడు. కోపించినవానికి చేయరాని పనిలేదు. ఎక్కడైనా పలుకరానిది లేదు.

ఎవడు తనలో పెల్లుబికిన క్రోధాన్ని, పాము నలిగిపోయిన కుబుసుమను వీడినట్లు, ఓర్పుతో తొలగించుకొనునో అతడు పురుషుడనబడును.

దుర్బుద్ధిని, సిగ్గులేని వాడిని, మహాపాపము చేసిన వాడను, ముందువెనుక ఆలోచించకుండా సీతాదేవిని కాల్చి స్వామిఘాతుకుడనైన నాకు నిందయగు గాక.

భాగ్యహీనుడనైన నేనిట్లు ధర్మార్థ సంగ్రహము చేయక రోషమను దోషము పట్టి పీడించగా లోకమునకే చేటు తెచ్చితిననుట స్పష్టము.

 భావార్థం:

రావణాసురుడి సేన హనుమంతుని తోక తగులబెట్టగా, క్రోధముతో ముందు వెనుక ఆలోచించకుండా ఆ మండుతున్న వాలముతో లంకను తగులబెడతాడు. అటు తరువాత ఆ దహనంలో అశోకవనంలో సీతకూడా తగులబడినదేమో అని చింతించి తన క్రోధంపై సిగ్గుపడతాడు. మహాజ్ఞాని అయిన హనుమ సంగతి అటుంచి మనకు ఈ సన్నివేశంలో హనుమంతుని మనోగతం నుండి గొప్ప పాఠాలు అందుతున్నాయి. 

కోపములో ఉన్న మనిషి ఎలా విచక్షణ కోల్పోయి, మతి చలించి మాటలు, చేష్టలలో అకృత్యాలకు పాల్పడి భాగ్యహీనుడవుతాడు అన్నది క్లుప్తమైన సందేశం. రజోగుణమునుండి జన్మించే క్రోధం మనలోని  ధర్మార్థ సంగ్రహ శక్తిని కోల్పోయేలా చేసి అధోగతి పాలు చేస్తుంది. ఇది మనం ప్రతిదినమూ ఇంటా బయటా చూసే లక్షణమే. ఆ సమయంలో పాము కుబుసాన్ని ఓర్పుతో విడిచినట్లు ఓర్పుతో క్రోధాన్ని విడువగలిగితే వాడు ఎంతో పురోగతి చెందుతాడు. క్రోధమనే అగ్నిపై ఓర్పు అనే నీటిని చల్లి ఆ పొంగును చల్లార్చితే విచక్షణ మనతో నిలిచి ప్రతి అడుగులోనూ ధర్మము, అర్థము మన మనసు గ్రహించి నడుచుకుంటాము. లేకుంటే, క్షణికోద్రేకంలో మనవారిని కోల్పోయి, కార్యసిద్ధికి విఘాతం కలిగించుకొని, ఆ క్రోధం చల్లారిన తరువాత చింతిస్తాము. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమి ఉపయోగము? క్రోధమనే అగ్నిలో మన భవిష్యత్తు, మన అలోచనా శక్తి దగ్ధమై మనకు ఫలితాలు అందవు. 

తత్త్వజ్ఞానియైన హనుమంతుడు సీతామాత అనుగ్రహంతో, రాముని వెనుబలంతో అంతటి కష్టతరమైన కార్యాన్ని సాధించగలిగాడు. కారణం? ఎన్ని మానసిక సంఘర్షణలు, ఎన్ని నిరాశ నిస్పృహలు, భయోత్పాతాలు కలిగినా, నమ్ముకున్న స్వామిపట్ల గల శరణాగతి, కావలసిన కార్యంపై గల పట్టుదల. ప్రతి అడుగులోనూ అతనిని ముందుకు నడిపించింది రామభక్తి, సీతాన్వేషణ అనే పవిత్రమైన కార్యం. 

అటువంటి సంకల్పం, భక్తి ఉన్నప్పుడు ఒడిదుడుకులు కలిగినా తట్టుకొని, తేరుకొని కార్యసిద్ధి పొందగలం అన్నది మనకు సుందరకాండ అందించే సందేశం. క్రోధమనే అగ్నిని జయించిన వాడే నిజమైన పురుషుడు అన్నది అక్షరాలా నిజం. కానీ, నేటి పురుషుడిలో ఉన్నదే క్రోధం. కారణం? పునాదులు సరిగా లేకపోవటం వలన. జీవితాశయం, మూలకాలైన విలువలపై నమ్మకం లేకపోవటం. వీటిని పెంపొందించుకోవడానికి రామాయణం, ముఖ్యంగా సుందరకాండ ఎంతో తోడ్పడుతుంది. పారాయణ ముఖ్య లక్ష్యం మనకో మార్గాన్ని కనుగొనటానికి. ఆర్యులు ఎంతో సాధన చేసి, శోధన చేసి మనకు ఇటువంటి సాధనాలను అందించారు. 

ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని సాగరాన్ని దాటి, దుర్భేద్యమైన లంకా నగరాన్ని జయించి మహాత్ముడైనాడు హనుమంతుడు. సంసారం ఒక సాగరం, అతి దుర్భేద్యమైనవి అరిషడ్వర్గాలనే లంకానగరం. భక్తితో, నమ్మకంతో, సత్సంకల్పంతో వీటిని దాటవచ్చు అని మనకు వాల్మీకి మహర్షి మహత్తరంగా తెలియజేశాడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి