RightClickBlocker

31, ఆగస్టు 2015, సోమవారం

చందమామా! అందాల మామా!


చందమామా! అందాల మామా!

నీ ఎదుట నేను వారెదుట నీవు 
మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు?

నీ ఎదుట నేను వారెదుట నీవు 
మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు?

పెళ్లి చూపులకు వారొచ్చారు చూడాలని నే ఓరగ చూశా
పెళ్లి చూపులకు వారొచ్చారు చూడాలని నే ఓరగ చూశా
వల్లమాలిన సిగ్గొచ్చింది కన్నులదాకా కన్నులు పోక
మగసిరి ఎడదనే చూశాను మగసిరి ఎడదనే చూశాను తలదాచుకొనుటకది చాలన్నాను

నీ ఎదుట నేను వారెదుట నీవు 
మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు?

పెళ్లి చూపులలో బిగుసుకొని పేరేమి? చదువేమి? ప్రేమిస్తావా? వయసెంత?
పెళ్లి చూపులలో బిగుసుకొని పేరేమి? నీ చదువేమి? నను ప్రేమిస్తావా? వయసెంత?
అని అడిగారా? అసలొచ్చారా?
నాలో వారు ఏం చూశారో నా వారయ్యారు
అందులకే మా ఇద్దరి జంట అపురూపం అంటా

నీ ఎదుట నేను వారెదుట నీవు 
మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు?

చల్లని వెన్నెల దొరవంటారు తీయని నవ్వుల సిరివంటారు
చల్లని వెన్నెల దొరవంటారు తీయని నవ్వుల సిరివంటారు
ఆ వెన్నెలలోని వేడి గాడ్పులు నవ్వులలోని నిప్పురవ్వలు
అనుభవించి అనమంటాను వయసుకు వైరివి నీవంటాను

నీ ఎదుట నేను వారెదుట నీవు 
మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు?

చందమామా! అందాల మామా!

చందమామకు స్త్రీపురుషుల ప్రేమకు ఎంత విడదీయరాని బంధమో? చంద్రుడు ప్రేమకు ప్రాణం పోసి, ఆ ప్రేమకు ఒక రూపాన్ని కలిగించి ప్రేమికుల మనసులలో వలపులు రేపుతాడు. అందులో సందేహమే లేదు. ఈ భావాన్ని తెలుగు చలన చిత్రాలలో ఎన్నో సన్నివేశాలలో గీతాలుగా పొందుపరచారు. రావోయి చందమామ, ఏమిటో ఈ మాయా ఓ చల్లని రాజా వెన్నెలరాజా, ఓ నెలరాజా వెన్నెలరాజా, వెన్నెల రేయి ఎంతో చలి చలి, ఎంత హాయి ఈ రేయి, ఇది తీయని వెన్నెల రేయి, మామ చందమామ వంటి ఎన్నో పాటలు బహుళ ప్రాచుర్యం పొందాయి. అటువంటి  ఆణిముత్యాల కోవకు చెందినదే తెలుగులో తొలి రంగుల చలన చిత్రం ' తేనె మనసులు ' లోని ' చందమామ అందాల మామా ' అన్న ఈ గీతం. చంద్రునితో సంభాషిస్తున్న ఇద్దరు కొత్తగా పెళ్లైన వనితల మీద ఈ గీతం చిత్రీకరించబడినది. ప్రేమ సామ్రాజ్యానికి చంద్రుని వెన్నెలలోని చల్లదనం, తెల్లని జాబిలు వెలుగు ప్రతీకలు. అందుకే ఏ వలపుల జంటను చూసినా ఆరుబయట చంద్రునితో సంభాషణలలో తమ భావాన్ని చాల అందంగా వ్యక్తపరచుతారు. ఈ గీతంలో కూడా అంతే. మనోజ్ఞమైన భావాలను మనసు కవి ఆత్రేయ గారు మనకు ఈ గీతం ద్వారా అందించారు. సులభమైన తెలుగు పదాలను ఉపయోగించి ఇద్దరు స్త్రీల హృదయకమలాలను విరియింపజేశారు. ప్రేమికులకు చంద్రుడు మామ ఎలా అయ్యాడు? మేనమామతో మనకు ఉండే సాన్నిహిత్యానికి, చనువుకు ఈ చందమామ అన్నది సంకేతం. తల్లిదండ్రులతో చెప్పలేని విషయాలను కూడా మేనమామతో చెబుతాం కదా? అలాగే తెలుగు సినీ సంగీతంలో నాయికానాయకులు తమ తమ భావాలను చందమామకు చెప్పుకొని ఆయన ద్వారా ఒకరితో ఒకరు సంభాషించిన సందర్భాలు ఎన్నో.

ఒక యువతి పెళ్లి చూపులనాటి మధురజ్ఞాపకాలను మొదటి చరణంలో ఆత్రేయగారు అద్భుతంగా ఆవిష్కరించారు. అబ్బాయి వచ్చినప్పుడు ఓరగా చూసి సిగ్గుతో కనులు కనులు కలవకముందే తలదించుకుందిట. అతని మగసిరిని హృదయముతోనే చూసిందట. యువతీ యువకులు కళ్లు కళ్లు కలవకనే పెళ్లి చూపులు ముగిసి పెళ్లి జరగటమేమిటని ఈనాటి సమాజంలో వారికి ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ, ఆ రోజుల్లో పెళ్లిళ్లు కుటుంబం యొక్క వివరాలను బట్టి, బంధువర్గంలో తెలిసినవారితో జరిగేవి. అందుకే స్త్రీపురుషులు పెద్దగా పరిచయం, అవగాహన లేకుండానే వివాహం చేసుకునే వారు. ఆనాటి సగటు స్త్రీ మనోగతం మొదటి చరణం.

రెండు మూడు చరణాల్లో కొంత చదువుకొని భిన్నమైన మనస్తత్వంగల స్త్రీ యొక్క హృదయాన్ని ఆవిష్కరించారు ఆత్రేయగారు. పెళ్లి చూపులు, అందులో ప్రశ్నలు ఏమీ లేకుండానే నాలో ఏదో నచ్చి నన్ను ఎన్నుకున్నారు. అందుకే మా జంట అపురూపమైనది అని ఆ స్త్రీ మనోగతం. చల్లదనమంటే చంద్రునిది, తీయనైన నవ్వులకు రాజు చంద్రుడని పేరు. కానీ, వయసులో ఉన్నవారికి ఆ వెన్నెలలోనూ వెచ్చదనం, నవ్వులలోనూ నిప్పురవ్వల అనుభూతులు కలుగుతాయి అని ఆమె భావన. అవి అనుభవైకవేద్యమని ఆమె ఈ చరణంలో భావిస్తుంది. చల్లదనం, నవ్వులు ఒలికించే చంద్రుడు యువతీయువకుల వయసుకు శత్రువని తలచుతుంది ఆ యువతి.

మొత్తానికి రెండు వేర్వేరు స్త్రీ మనస్తత్వాలు, అభిరుచులు మనకు ఈ గీతం ద్వారా అవగతమవుతాయి. తేనెమనసులు చిత్రం యొక్క ప్రత్యేకత దాని ప్రధాన పాత్రధారులు. నాయికానాయకులు నలుగురికీ ఇది మొదటి చిత్రం. కృష్ణ, రామ్మోహన్, సుకన్య, సంధ్యారాణి గార్లు ఈ పాత్రలను పోషించారు. ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వం, కేవీ మహదేవన్ గారి సంగీతంతో ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలోని ప్రతి పాట ఆణిముత్యమే.

సుశీలమ్మ అంటే మాధుర్యానికి మారు పేరు. ఆ తల్లి ఈ గీతంలోని ప్రతి పదం యొక్క భావనను సహజంగా అక్షరాలా తేనె వంటి తీయని గొంతుతో పలికించారు. సాహిత్యానికి ప్రాణం పోశారు. వీడియోను చూడండి

26, ఆగస్టు 2015, బుధవారం

ఆది అనాదియు నీవే దేవా


ఆది అనాదియు నీవే దేవా నింగియు నేలయు నీవే కావా
అంతటి నీవే ఉండెదవు శాంతివై కాంతివై నిండెదవు
నారద సన్నుత నారాయణా నరుడవో సురుడవో శివుడవో లేక శ్రీసతి పతివో
దానవ శోషణ మానవ పోషణ శ్రీచరణా భవహరణా
కనక చేల! భయ దమన శీల! నిజ సుజన పాల! హరి సనాతనా!
క్షీరజలధి శయనా! అరుణ కమల నయనా! గాన మోహనా! నారాయణా!

సృష్టి రహస్యము, బ్రహ్మాది దేవతల ఆవిర్భావము, మనువుల సృష్టి, లోకములు మొదలైన వివరాలు అన్నీ వ్యాసుల వారు భాగవతంలో పొందుపరచారు. భగవంతుని భక్తుల గురించి కూడా ఎన్నో వివరాలు తెలిపారు. హరి భక్తులు అనగానే గుర్తుకు వచ్చే వారు ప్రహ్లాదుడు, అంబరీషుడు. శ్రీహరి భక్తిలో మునిగి ప్రహ్లాదుడు దానవుడైన తండ్రి పెట్టిన బాధలన్నీ అధిగమించి దుష్ట శిక్షణకు తోడ్పడ్డాడు. అంబరీషుడు దుర్వాసుడు ఎంత తన సహనాన్ని పరీక్షించినా అకుంఠితమైన హరిభక్తితో వాటిని దాటగలిగాడు. అసలు హరిభక్తిని విశ్వానికి చాటింది నారదుడు. నిరంతరం నారాయణ నామస్మరణతో, నారద మహర్షి పరమాత్మ లీలావినోదములలో విడదీయని భాగమైనాడు.  వ్యాసులవారి భాగవతాన్ని అత్యంత మధురంగా తెలుగులోకి అనువదించారు మహాకవి పోతన.

దాశరథి గారు తెలుగుజాతి కన్న ఒక మాణిక్యం.  భాషా పాండిత్యంతో పాటు భక్తి సుగంధాన్నిఈ గీతానికి అణువణువున అలదిన గొప్ప కవి ఆయన.  మన తెలంగాణా ముద్దు బిడ్డే.  ఈ గీతంలో పోతన గారి భావజాలానికి దగ్గరగా వెళ్లారు దాశరథిగారు.

ఈ విశ్వం యొక్క నాందికి కారణం పరమాత్మ అని భాగవతంలో స్పష్టంగా తెలియజేశారు. అందుకనే దాశరథి గారు పరమాత్మను ఆది అన్నారు. కానీ, ఆ పరమత్మకు మొదలు లేదు. ఆయన సనాతనుడు. పంచభూతములు ఆయనచే సృజించబడినవి కాబట్టి నింగి నేల నీవే అని అన్నారు కవి. నారదుడిచే నుతించబడిన ఆ నారాయణుడు తానే మానవునిగా, శివునిగా, విష్ణుమూర్తిగా అవతరించాడు. దానవులను శిక్షించి మానవాళిని రక్షించే మన పాపములను హరించే శుభచరణములు కలవాడు.

చరణంలో పరమాత్మ రూప లక్షణాలను వర్ణిస్తున్నారు కవి. బంగారు వస్త్రములు ధరించిన వాడు, ఎర్రని కలువల వంటి కనులు కలవాడు, తన వేణు గానముతో లోకాన్ని మోహింపజేశేవాడు, భయాన్ని పోగొట్టే సుగుణములు కలవాడు, సుజనులైన నిజభక్తులను పాలించే వాడు, సనాతనుడు, పాలకడలిలో ఆదిశేషునిపై శయనించేవాడు ఆ నారాయణుడు అని అందమైన తెలుగు సాహిత్యంలో వర్ణించారు దాశరథి గారు. నారదునిపై చిత్రించిన ఈ గీతం నారదభక్తికి నిలువెత్తు దర్పణం.

ఒక గీతానికి సాహిత్యం సాద్గుణ్యత అయితే సంగీతం, గానము సాఫల్యాన్ని ఇస్తాయి.  రసాలూరించే సాలూరి వారు భక్త ప్రహ్లాద చిత్రంలో ఈ గీతానికి సంగీతం సమకూర్చగా గానగంధర్వులు మంగళంపల్లి బాలమురళి గారు  నటించి, గళమాధుర్యంతో అమృతాన్ని కురిపించారు. దాశరథిగారు శ్రీవైష్ణవుడైనా అద్వైత భావాన్ని ఈ గీతంలో కురిపించి తమ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని నలుదెసల వెదజల్లారు.  రాగమాలికలో ఒక పాటను కూర్చాలంటే ఏయే రాగాలు కూడితే బాగుంటుందో తెలియాలి. దానికి సంగీతం మూర్తీభవించిన సరస్వతీపుత్రులు సాలూరి వారి కన్నా ఎవరు మిన్న?  రాగాలను గంగా ప్రవాహంలా పలికిచే బాలమురళి గారి గొంతులో ఈ గీతం నారాయణ మంత్రంలా ప్రకాశించింది.    త్రిమూర్త్యాత్మకమైన ఈ గీతం భక్తి భావ సంగీత సుధలను కురిపించింది.  అందుకే ఇన్నేళ్ల తరువాత కూడ ఇంకా శ్రోతలకు శ్రీమన్నారాయణుని స్తుతులలో తలమానికంగా నిలిచింది. ఎందరో మహానుభావులు వారందరికీ శతసహస్ర వందనాలు!

బాలమురళీకృష్ణ గారి గళంలో ఈ పాట వినండి

25, ఆగస్టు 2015, మంగళవారం

ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు


ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు
అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి యన్నట్లు

కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు పర బ్రహ్మంబనుచు

తలతురు మిము శైవులు తగిన భక్తులను శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులాది భైరవుడనుచు

సరినెన్నుదురు శాక్తేయులు శక్తిరూపు నీవనుచు
దరిశనములు మిము నానా విధులను తలపుల కొలదుల భజింతురు

సిరుల మిము నే అల్పబుద్ధి తలచిన వారికి అల్పంబౌదువు
గరిమల మిము నే ఘనమని తలచిన ఘనబుద్ధులకు ఘనుడవు

నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు
ఆవల భాగీరధి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు

శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని వున్న దైవమని
ఈవలనే నీ శరణనెదను ఇదియే పరతత్వము నాకు

అసలు పరమాత్మ తత్త్వము ఏమిటి? మన తలపులకు పరమాత్మ యొక్క అభివ్యక్తీకరణకు తద్వారా అనుగ్రహానికి గల సంబంధం ఏమిటి? దీనికి సమాధానం మన సనాతన ధర్మ వాఙ్మయం ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నా కొంత మంది మహానుభావులు ఆ సమాధానాన్ని చాలా ప్రభావవంతంగా, సుళువుగా అర్థమయ్యేలా తెలియజేశారు. అందులో అన్నమాచార్యుల వారి ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అనే సంకీర్తన అగ్రగణ్యము.

మనము ఏ విధంగా తలచితే ఆ విధంగానే పరమాత్మ అనుభూతి, అనుగ్రహం కలుగుతుందని మనకు ఈ సంకీర్తన ద్వారా అన్నమాచార్యుల వారు తెలియజేస్తున్నారు. మన అంతరాంతరములో శ్రద్ధగా పరిశీలిస్తే పిండి కొలది రొట్టె లాగా మన భావనైర్మల్యము బట్టి పరమాత్మ అని అన్నమాచార్యులవారు చెబుతున్నారు.

ప్రీతితో, స్నేహముతో విష్ణుభక్తులు విష్ణువని కొలిచితే, వేదాంతులు పరబ్రహ్మయని తెలిపారు. శైవులు శివునిగా తలచితే, కాపాలికులు భైరవునిగా ఆనందంతో నుతించారు. శాక్తేయులు ఆదిపరాశక్తిగా భావించి ఆరాధించారు. ఈ విధముగా పరమాత్మను నానా విధాలుగా తలచి కొలుస్తారు.

అజ్ఞానంతో, సంకుచితమైన ఆలోచనతో, అల్పబుద్ధితో పరమాత్మను అల్పంగా ఆలోచినవానికి ఆయన అల్పమే. గొప్పతనంతో, సద్బుద్ధితో, జ్ఞానంతో పరమాత్మను గొప్పగా తలచినవానికి ఆయన గొప్పగా అనుగ్రహిస్తాడు. ఎలాగైతే కొలనులో నీటి కొద్దీ తామరలో, అలాగే మన సంకల్పము, భావ వికాసము బట్టి ఆయన అనుగ్రహము. పరమాత్మ వలన ఎటువంటి కొరత ఎప్పుడూ లేదు.  గంగానదీ పరీవాహక ప్రాంతంలో బావులలో ఆజలమే ఊరుతుంది. వేరొక దానికి స్థానంలేదు. అలాగే మన మనసు ఎంత శుద్ధిగా ఉంటే దానికి నిష్పత్తిలో ఫలితం. మనకు దగ్గరలో ఏడుకొండలలో నెలకొన్న వేంకటేశ్వరుడే ఆ పరమాత్మ. అదే భావనతో ఆయన శరణు కోరుదాము. అదే పరమార్థము, పరమానందము.

మనలో భావ నైర్మల్యానికి, సంకల్పానికి పరమాత్మ అనుగ్రహం ఎలా ముడిపడి ఉందో ఈ సంకీర్తన ద్వారా తెలిపారు అన్నమాచార్యుల వారు. ఏ స్వరూపంగా కొలచినా తలచినా ఆ స్వరూపంగా అనుగ్రహిస్తాడు పరమాత్మ. కావలసినది మన సాధన, ఆ సాధనలో త్రికరణ శుద్ధి మరియు శరణాగతి ముఖ్యమైన ప్రాతిపదికలు.

పురాణేతిహాసములలో భక్తిప్రపత్తులతో ఏ రూపాన్ని కొలచినా అనుగ్రహం ఎలా కలిగిందో అనంతమైన ఉదాహరణలు ఉన్నాయి. ఈ సంకీర్తన ద్వారా మనకు వస్తు గుణ రూప సమన్వితమైన సగుణోపాసననుండి అన్నీ ఆయనే అన్న పరమాత్మ యొక్క ఏకత్వ భావనను, ఆయన అనుగ్రహానికి మనలో కావలసిన లక్షణాలను సద్గురువులు సామాన్యులకు అర్థమయ్యేలా తెలియజేశారు. యద్భావం తద్భవతి అన్నది పరమాత్మ. భావానికి భక్తి, శరణాగతి, నిశ్చలమైన విశ్వాసం తోడైతే ఆయన ఏ రూపమైనా మనలో దర్శించవచ్చు.

వాగ్గేయకారులు మనకు ఆధ్యాత్మిక సందేశాన్ని ఎంత కరతలామలకం చేశారన్నది వారి యొక్క ఉన్నతికి సూచిక. అన్నమాచార్యుల వారు నందకాంశులు. పరమాత్మను నిరంతరం అనుభూతి చెంది, ఆ ఆనందంలో రమిస్తూ మనకు ఆ తత్త్వాన్ని కళ్లకు కట్టినట్లుగా మధుర భక్తితో కూడిన శృంగార రచనలతో పాటు అత్యద్భుతమైన ఎంతమాత్రమున వంటి ఆధ్యాత్మిక సంకీర్తనలను కూడా అందించారు. వారికి మన తెలుగుజాతి ఎప్పటికీ రుణపడి ఉంది.

ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి గళంలో ఈ సంకీర్తన వినండి

24, ఆగస్టు 2015, సోమవారం

శ్రీకాళహస్తీశ్వర దండకం - భక్త కన్నప్ప

శ్రీకాళహస్తీశ్వర దండకం - భక్త కన్నప్ప
జయ జయ మహాదేవ శంభో హరా శంకరా సత్య శివ సుందరా నిత్య గంగాధరా!
బ్రహ్మ విష్ణుల్ సురల్ తాపసుల్ నిన్ను వర్ణించలేరన్న నేనెంతవాడన్ దయాసాగరా!
భీకరారణ్య మధ్యంబునన్ బోయనై పుట్టి పశుపక్షి సంతానముల్ కూల్చి భక్షించు పాపాత్ముడన్!
దివ్య జప హోమ తప మంత్ర కృషి లేని జ్ఞానాంధుడన్!
దేవుడే లేడు లేడంచు దూషించు దుష్టాత్ముడన్!
విశ్వరూపా! మహామేరు చాపా! జగత్సృష్టిసంరక్షసంహారకార్యః కలాపా!
మహిన్ పంచభూతాత్మ నీవే కదా! దేవ దేవా! శివా!
పృథ్వి జల వాయురాకాశ తేజో విలాసా! మహేశా! ప్రభో!
రంగు బంగారు గంగా తరంగాల రాజిల్లు కాశీపురాధీశ విశ్వేశ్వరా!కాశీపురాధీశ విశ్వేశ్వరా!
నీలిమేఘాల కేళీ వినోదాలలో తేలు శ్రీశైల మల్లేశ్వరా! శ్రీశైల మల్లేశ్వరా!
కోటి నదులందు సుస్నాముల్ చేయు ఫలమిచ్చు క్షేత్రాన వసియించు శ్రీరామలింగేశ్వరా!శ్రీరామలింగేశ్వరా!
నిత్య గోదావరీ నృత్య సంగీత నీరాజనాలందు ద్రాక్షారమా వాస భీమేశ్వరా!భీమేశ్వరా!
దివ్య ఫల పుష్ప సందోహ బృందార్చితానంద భూలోక కైలాస శైలాన వసించు శ్రీకాళహస్తీస్వరా! శ్రీకాళహస్తీస్వరా!
దేవ దేవా! నమస్తే నమస్తే! నమస్తే! నమః! 

శివుని పంచభూత తత్త్వాలకు ప్రతీక పంచభూతలింగ క్షేత్రాలు - పృథివీ లింగ రూపంలో కాంచీ ఏకాంబరేశ్వరుడు, జలలింగ రూపంలో తిరుచిరాపల్లిలో జంబుకేశ్వరుడు, తేజోలింగం రూపంలో తిరువణ్ణామలైలో అరుణాచలేశ్వరుడు, వాయులింగ రూపంలో శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వరుడు, ఆకాశలింగ రూపంలో చిదంబరంలోని నటరాజస్వామిగా వెలశాడు శివుడు. అటువంటి మహిమాన్విత పంచభూతలింగ క్షేత్రం కాళహస్తి. సాలెపురుగు, నాగుపాము, ఏనుగు కొలచిన క్షేత్రం కాబట్టి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది ఈ వాయులింగ క్షేత్రానికి. స్వర్ణముఖీ నదీతీరాన తిరుపతికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్షేత్రం రాహు-కేతు గ్రహదోషము మరియు సర్పదోష నివారణ పూజలకు ప్రసిద్ధి.భక్త కన్నప్పగా ప్రసిద్ధి చెందిన తిన్నడు శ్రీకాళహస్తిలో వెలసిన కాళహస్తీశ్వరుని కొలచి తరించిన మహా శివభక్తుడు. బోయవాని కుటుంబంలో కాళహస్తి వద్ద జన్మించాడు. అతనికి తల్లిదండ్రులు తిన్నడుగా నామకరణం చేశారు. వేటగాడైనందువలన శివుని శాస్త్రోక్తంగా కొలిచే విధి తెలియకపోయినా అమితమైన భక్తితో నోటి నీటిని తెచ్చి స్వామికి అభిషేకము చేశాడు, వేటమాంసాన్ని నైవేద్యంగా సమర్పించాడు. పత్రం పుష్పం ఫలం తోయం అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు భక్తితో తిన్నడు సమర్పించినవన్నీ శంకరుడు ప్రీతితో స్వీకరించాడు. ఒకసారి ఆతని భక్తిని పరీక్షించటానికి శంకరుడు కాళహస్తీశ్వర దేవాలయ సమీపంలో భూప్రకంపనలు సృష్టిస్తాడు. దేవాలయం కప్పుభాగం ఊగి పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మిగిలిన వారంతా భయంతో పారిపోగా ఒక్క తిన్నడు మాత్రం లింగాన్ని తన శరీరంతో కప్పి దానిని ధ్వంసం కాకుండా కాపాడుతాడు. అటు తరువాత అతను ధీరన్నగా పిలువబడతాడు.

ఒకసారి కన్నప్ప శివుని లింగంపై ఒక కంటిలో రక్తం స్రవించటం గమనిస్తాడు. వేదన చెంది ఎటువంటి సంకోచం లేకుండా వెంటనే బాణంతో తన కంటిని పెళ్లకించి ఆ కంటి స్థానంలో పెడతాడు. అప్పుడు ఆ కంటి రక్తస్రావం ఆగుతుంది కానీ శివుని మరో కన్ను స్రవించటం మొదలవుతుంది. అప్పుడు తిన్నడు తన రెండో కన్ను పెకళించటానికి సిద్ధపడతాడు. తాను గుడ్డివాడైతే కన్నును శివుని కంటి స్థానంలో పెట్టలేనేమోనని తన కాలి బొటనవ్రేలిని స్రవించే కన్నుపై పెట్టి, తన రెండవకన్నును పెరికి కాలిబొటనవేలు ఆనవాలుతో స్రవించే శివుని కంటి స్థానంలో నిలుపుతాడు. అతని అపారమైన భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై అతనికి రెండు కళ్లు ప్రసాదించి కన్నప్పగా నామకరణం చేస్తాడు. కన్నప్ప పరమశివుభక్తునిగా ముక్తిని పొందుతాడు. శైవ సాంప్రదాయంలో నాయనార్లు పరమభక్తులుగా గుర్తింపబడి చరిత్రకెక్కారు. వారిలో కన్నప్ప నాయనారు ఒకడు.

శైవులు కన్నప్పను అర్జునిని అవతారంగా పరిగణిస్తారు. ద్వాపరయుగంలో శివుని అర్జునినికి యుద్ధం జరుగుతుంది. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం శివునికై తపస్సు చేస్తాడు. శివుడు అతను పరీక్షించదలచి బోయవాని వేషంలో వచ్చి అతని ముంగిట మూకాసురుని ఒక అడవపందిగా సృష్టిస్తాడు. తన తపస్సుకు భంగం కలిగించిన పందిని అర్జునుడు బాణం వేసి సంహరించబోగా శివుడు ఆ పందిని ముందే బాణంతో సంహరిస్తాడు. ఆ పందిని నేను సంహరించానని బోయవాడు అర్జునినితో వాదిస్తాడు. వారిద్దరి మధ్య జరిగిన యుద్ధంలో అర్జునుని శౌర్య పరాక్రమాలకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై అతనికి అభేద్యమైన పాశుపతాస్త్రం ప్రసాదిస్తాడు. ఇది కిరాతార్జునీయంగా ప్రసిద్ధి చెందిన గాథ. ఆ జన్మలో శివుని ముందే గుర్తించని దానికి ఫలితంగా అర్జునుడు కలియుగంలో తిన్నడుగా జన్మించి శివుని కొలచి సాఫల్యం పొందుతాడు. ఇదీ కన్నప్ప గాథ.

కాళహస్తి మహాత్మ్యం అనే చలన చిత్రంలో ఈ తిన్నడి గాథను రమణీయంగా తెరకెక్కించారు కన్నడ దర్శకేంద్రులు హెచ్ ఎల్ ఎన్ సింహ గారు. ఆ చిత్రంలో కన్నడ కంఠీరవగా పేరొందిన మహానటుడు రాజ్ కుమార్ గారు అద్భుతంగా నటించారు. బోయవాని పాత్రలో ఆయన జీవించారు. ఆ చిత్రంలో తోలేటి వేంకటరెడ్డి గారు రచించిన కాళహస్తీశ్వర దండకం ఘంటసాల గారికి ఎంతో పేరు తెచ్చింది. భూకైలాస్ వంటి చిత్రాలకు సంగీతం కూర్చిన గోవర్ధనం-సుదర్శనం గార్ల సంగీతం ఈ చిత్రానికి కలికితురాయి.

దండకాలు భారతదేశ ఉపాసనా విధులలో ఒక విశేషమైన స్థానం కలిగి ఉన్నాయి. దండకం అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది కాళిదాసు రచించిన శ్యామాలా దండకం - మాణిక్యవీణాం. అలాగే శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం అనే ఆంజనేయ దండకం..ఇవి చాలా  ప్రసిద్ధి చెందాయి. దక్షిణ భారతదేశ భాషలలో తెలుగులోనే ఎక్కువ దండకాలు రచించబడ్డాయి. అనర్గళంగా, ఒకరకమైన ఆవేశంతో కూడిన భక్తి సుమాలు దండకాలు. విశేషమైన వర్ణన, ఆర్తి,భక్తితో, పొడవైన వాక్యములతో భక్తుడు భగవంతునితో చేసే విన్నపం దండకం. అటువంటి దండకాలలో ఈ కాళహస్తీశ్వర దండకం ఎంతో పేరుపొందింది.

ఈ దండకంలో తోలేటివారు కన్నప్ప భక్తిని, బోయవానిగా తన అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని ప్రతిబింబిస్తూ అదే సమయంలో అతని అనన్య సామాన్యమైన శివభక్తిని చాటేలా రచించారు. శివుని పంచభూత తత్త్వాన్ని, మహామహిమాన్వితమైన కాశీ, శ్రీశైలం, రామేశ్వరం, ద్రాక్షారామం మరియు కాళహస్తుల ప్రస్తావన చేశారు.

ఘంటసాల గారి గళంలో, రాజ్ కుమార్ గారి నటనలో ఈ దండకాన్ని వీక్షించండి

23, ఆగస్టు 2015, ఆదివారం

మది శారదాదేవి మందిరమేమది శారదాదేవి మందిరమే కుదురైన నీమమున కొలిచే వారి

రాగభావమమరే గమకముల నాదసాధనలే దేవికి పూజ
సరళ తానములే హారములౌ వరదాయిని కని గురుతెరిగిన వారి

స్థిరమైన మనసుతో, నియమ నిష్ఠలతో కొలిచే వారి మది శారదాదేవి నిలయము అని కవి మల్లాది రామకృష్ణశాస్త్రి గారు మనకు ఈ శాస్త్రీయ గీతం ద్వారా తెలియజేస్తున్నారు. సరిగమలతో కూడిన గమకముల ద్వారా రాగము, భావము కూర్చబడగా, నాదోపాసనే దేవికి పూజ అవుతుంది. మృదువైన తాళమే దేవికి హారములవుతాయి. వరములొసగే ఆ దేవిని చూచి గ్రహించిన వారి మది శారదాదేవి మందిరము.

ఏ గురువు చెప్పినా, ఏ వాఙ్మయం చెప్పినా ఒకటే మాట. స్థిరమైన మనసు, నియమ నిష్ఠలతో విద్యను అభ్యసించితే ఆ సకలకళామతల్లి శారదాదేవి అనుగ్రహించి ఆ దేహమున నిలిచి అద్భుత పాండిత్యము, మనోవికాసముతో కూడిన కళా ప్రతిభను వెలువరుస్తుంది.

పరమాత్మ యొక్క ఏ దేవతా స్వరూపం యొక్క నామావళి పరిశీలించినా, సామగాన ప్రియము, చతుష్షష్టి కళా ప్రియము అనే నామాలు తప్పక ఉంటాయి. అందుకే పరమాత్మ యొక్క కళారాధనలో సంగీతానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే సంగీతంలో దేవతామూర్తిని వర్ణించే సాహిత్యాన్ని రాగ భావ లయ యుక్తంగా ఆవిష్కరిస్తారు. కాబట్టి సంగీత సేవలో సగుణోపాసన విడదీయరాని అంతర్భాగం. దేవతామూర్తి అనుగ్రహాన్ని పొందిన వాగ్గేయకారుల సాహిత్యం మంత్ర సమానం. అందుకే వాటిని శుద్ధ అంతఃకరణంతో భక్తి విశ్వాసాలతో గానం చేస్తే తప్పక అనుగ్రహం గాయకులకు కూడా లభిస్తుంది. నియమ నిష్ఠలు ఏ సాధనకైనా ముఖ్యం. కారణం? మనసు చంచలమైనది కాబట్టి నియమంతో, శ్రధ్ధతోనే కుదురు కలిగి అభ్యాసం సఫలీకృతమవుతుంది.

నాదాన్ని తనువంతా కలిగిన వాడు శివుడు అని త్యాగరాజస్వామి నాదతనుమనిశం అనే కృతిలో నుతించారు. పరమశివుడు సరిగమపదినస సప్తస్వర లోలుడని ఈ కీర్తనలో తెలియజేశారు త్యాగరాజస్వామి. నటరాజుగా ఆయన పార్వతీదేవితో కలసి ఆనందహేలలో సప్తస్వర మేళనమైన ఝణత్కారముల మధ్య నర్తిస్తాడు. అలాగే కచ్ఛపి, విపంచి మొదలైన నామములు గల వీణలను నిరంతరం వాయిస్తూ నాదలోలయై ఉంటుంది సరస్వతి. నారదుడు నిరంతరం మహతీ వీణా నాదంలో నారాయణుని నుతిస్తాడు. ఈ సందేశాన్నే రామకృష్ణశాస్త్రిగారు మనకు మది శారదాదేవి మందిరమే అన్న గీతం ద్వారా తెలియజేశారు.

సంగీతోపాసనలో త్రికరణశుద్ధికి మరింత ప్రాముఖ్యత ఉంది. సాహిత్యం యొక్క అవగాహన, రాగలక్షణాలపై పట్టు, భావ ప్రాధాన్యత, దేవతామూర్తిపై నమ్మకం...ఇలా ఎన్నో కోణాలు నాదోపాసనా విధిలో గురువులు శిష్యులలో పరిశీలిస్తారు. అవి కలిగిన శిష్యులే సంగీత సాధనలో సార్థకత పొందగలరు. గమకాలంటే రాగంలోని సౌందర్యాన్ని విశదీకరించటం. కాబట్టి గమకాలు పలిగినపుడు అందులో దేవతామూర్తి రమిస్తుంది. ఆ గమకాలకు భావ స్పష్టత కూడా చాలా ముఖ్యం. సంకీర్తనలలో ఎన్నో రకాలు - ద్వైత భక్తి, దాస్యము, శృంగారాన్ని ప్రస్ఫుటించే మధురభక్తి, ఆర్తి, సౌందర్య వర్ణన, విశేషమైన గుణముల వర్ణన, నిందాస్తుతి, శరణాగతి, చమత్కారం, వ్యంగ్యం ఇలా వాగ్గేయకారులు ఎన్నో రకాల భావనలను సగుణోపాసనలో కీర్తనల ద్వారా వ్యక్తపరచుతారు. కాబట్టి, ఆ భావనలను నాదంలో పొందుపరచాలి. అందుకే సంగీత సాధన కఠోరమైనది. ఫలితం కూడా అంతే.

మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు జయభేరి చిత్రంలో గురుశిష్య సంబంధాన్ని ఆవిష్కరించే సన్నివేశంలో ఈ అద్భుతమైన గీతాన్ని రచించారు. ఈ గీతానికి పెండ్యాల నాగేశ్వరరావు గారు సంగీతాన్ని అందించారు. ఘంటసాల, పీబీ శ్రీనివాస్, రఘునాథ్ పాణిగ్రాహి గారు కలసి పాడిన ఈ గీతం ఎంతో ప్రాచుర్యం పొందింది. కళ్యాణి రాగంలో రాగభావమమరే గమకముల మరియు సరళ తానములె హారములౌ అన్న సాహిత్యం వద్ద ఈ గాయకులు అద్భుతమైన సంగీత ప్రతిభను కనబరచి ఈ గీతాన్ని అజరామరం చేశారు. దానికి కారణం మల్లాది వారికి, పెండ్యాల వారికి, గాయకులకు కలిగిన శారదాదేవి అనుగ్రహమే. వీరందరూ తరువాత ఎంతో పేరు ప్రతిష్ఠలు పొంది కళామతల్లి పాదాలవద్దకు చేరిన వారే.

యూట్యూబ్ లో ఈ గీతాన్ని వీక్షించండి

15, ఆగస్టు 2015, శనివారం

స్వాతంత్య్రం వచ్చెనని సభలే చేసి సంబర పడగానే సరిపోదోయిపాడవోయి భారతీయుడా! ఆడి పాడవోయి విజయ గీతిక!

స్వాతంత్య్రం వచ్చెనని సభలే చేసి సంబర పడగానే సరిపోదోయి
సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి
ఆగకోయి భారతీయుడా కదలి సాగవోయి ప్రగతి దారుల
ఆకాశం అందుకొనే ధరలొకవైపు అదుపులేని నిరుద్యోగమింకొకవైపు
అవినీతి బంధుప్రీతి చీకటి బజారు అలముకొన్న ఈ దేశం ఎటు దిగజారు

కాంచవోయి నేటి దుస్థితి ఎదిరించవోయి ఈ పరిస్థితి

పదవీ వ్యామోహాలు కులమత భేదాలు భాషా ద్వేషాలు చెలరేగే నేడు
ప్రతి మనిషి మరియొకని దోచుకొనే వాడే తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునే వాడే
స్వార్థమీఅనర్థ కారణం అది చంపుకొనుటె క్షేమదాయకం

సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం
సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం
ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే లోకానికి మన భారత దేశం అందించినులే శుభ సందేశం

సరిగ్గా 55 ఏళ్లు ఈ పాట రచించి. అక్షరాలా ఇప్పటికీ పరిస్థితులు ఏమీ మారలేదు. ఇందులోని సందేశం పూర్తిగా సముచితం. శ్రీశ్రీ గారు భక్తి శృంగార రచనలనుండి విప్లవ రచయితగా మారుతున్న సమయంలో వచ్చిన గీతం ఇది. అటు తరువాత రెండు తరాలు గడిచినా ఇందులోని సందేశం మరింత ప్రాధాన్యతను పొందిందే తప్ప తరగలేదు. చెప్పబడిన సమస్యలు మరింత జటిలమయ్యయే తప్ప పరిష్కరించబడలేదు. కారణం?

1. ఏ ఇంటికైన పునాదులు ముఖ్యం. మన దేశానికి కూడా అంతే. మొదటి ప్రభుత్వం వేసిన తప్పటడుగులు అలానే కొనసాగి కుటుంబపాలనగా మారి దేశాన్ని రాచరికం కన్నా ఘోరమైన ప్రజాస్వామ్య ఖూనీ మార్గంలో నడిపించాయి.

2. మార్పు రావాలని ప్రజలు బలంగా కోరుకొని వోటు వేసినప్పుడల్లా ఆ మార్పును రాజకీయ కుతంత్రాలతో పడగొట్టింది కుటుంబపాలన, స్వార్థపు ప్రాంతీయ రాజకీయ పార్టీలు. ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా ప్రజస్వామ్యాన్ని అపహాస్యం చేసే రాజకీయ పక్షాలు నేటికి వటవృక్షాలైనాయి.

3. మార్పు నాయకులలో రావాలని ప్రజలు, ప్రజలలో రావాలని నాయకులు ఇలా ఒకరినొకరు కారణంగా వేలెత్తి చూపటం తప్ప మార్పును కోరుకునే వారు కలిసి ముందుకు నడచి వెళ్లటం లేదు. స్వార్థపు రాజకీయ ఎత్తుగడల కబంధ హస్తాల్లో నలిగిపోతున్నాయి మార్పు కోరుకునే భావ వీచికలు.

4. విద్యావ్యవస్థలో పూర్తిగా భారతీయత లోపించటం. ఉద్యోగాల కోసం విలువలను తెలిపే పాఠ్యాంశాలను పూర్తిగా తొలగించటం విద్యావ్యవస్థలోని వ్యాపార ధోరణి వల్లనే. నేటి విద్యా వ్య్వస్థలోని ప్రమాణాల వలన వలన హక్కులు-బాధ్యతలు-విలువలు తెలిసిన పౌరులు కాకుండా ఉద్యోగార్హతలు కలిగిన పౌరులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నారు.

ఈ పోటీ ప్రపంచం వలన మనుషులలో స్వార్థం పెరిగి పోయింది.  శ్రీశ్రీగారు చెప్పినట్లు మనలోని స్వార్థాన్ని చంపటం తప్ప వేరొక మార్గం లేదు భారతం దేశం బాగుపడాలంటే. ఏకదీక్షతో వ్యక్తిత్వ పరివర్తన కోసం మనం పాటుపడాలి. దానికి సనాతన ధర్మం మనకు ఎన్నో ఉపాయాలను ఇచ్చింది. ధర్మాన్ని తెలుసుకుని ఆచరిస్తే స్వార్థమనే సర్పం పడగలు విప్పకుండా ఉంటుంది. ధర్మాన్ని ఆచరిస్తే దేశ ప్రయోజనాలు అవే ప్రాధాన్యతను పొందుతాయి. ధర్మాన్ని ఆచరిస్తే బంధుప్రీతి, అవినీతి తగ్గుతాయి. ధర్మాన్ని ఆచరిస్తే చీకటి బజారులోకి వెలుగు నిండుతుంది. ధర్మాన్ని ఆచరిస్తే ధరలు తగ్గుతాయి, పదవులపై వ్యామోహముండదు, కులమత తారతమ్యాలు తొలగుతాయి. ఎవరి ధర్మం వారు పాటిస్తే అన్ని అనర్థాలూ దూరమవుతాయి. మరి ధర్మం పాటించాలంటే?

ధర్మాన్ని బోధించే వాఙ్మయాన్ని చదవాలి, పాఠ్యాంశాలలో చేర్చాలి. విలువలను విద్యకు మూలం చేయాలి. ధర్మాన్ని మూఢత్వంగా కాకుండా ప్రగతికి బాటగా ప్రభుత్వాలు పరిగణించాలి. వ్యక్తిత్వ వికాసం ఉద్యోగార్హత కావాలి. నాయకుల ఎన్నికకు ధీరత్వం, దేశభక్తి, స్వప్రయోజనాల త్యాగం ప్రధాన ప్రాతిపదిక కావాలి. సంస్కృతి, వారసత్వం మొదలైన వాటిపై అవగాహన పెరగాలి.

ఒక్కటి గుర్తు చేసుకోవాలి. ధర్మమంటే నవీనతకు, నాకరిగతకు, అభివృద్ధికి వ్యతిరేక పంథా కానే కాదు. ధర్మం ఏ పరిస్థితిలోనైనా మనిషిని ముందుకు నడిపిస్తుంది. కాలానుగుణంగా మారేది ధర్మం. కానీ, అది ప్రతిబంధకం ఎన్నటికీ కానే కాదు. శాస్త్ర సాంకేతిక పురోగతికి, పారిశ్రామీకరణ, పట్టణాలకు వలసలు ఇవేవీ ధర్మ వ్యతిరేకం కాదు. ధర్మమనేది వ్యక్తిత్వాన్ని నిర్ణయించేది. తద్వారా సమాజాన్ని నిర్దేశించేది. అందుకే ధర్మం మన జీవనశైలికి వెన్నెముక అయితే ఈ దేశం సమస్యలు ఒక్క పదేళ్లలో మాయమవుతాయి. ఎందుకంటే, మిగిలిన ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి మనకు. కేవలం పరాయి ధర్మం మోజులో పడి మన ధర్మాన్ని మనం వదిలేశాము కాబట్టే చాలా మటుకు సమస్యలు. స్వధర్మాన్ని గుర్తించి, గౌరవించి, పాటిస్తే మన బ్రతుకులు ప్రగతి బావుటాలే.

అప్పుడే పాడవోయి భారతీయుడా! ఆడి పాడవోయి విజయ గీతిక!

5, ఆగస్టు 2015, బుధవారం

సర్వమంగళ నామా సీతారామా రామాసర్వమంగళ నామా సీతారామా రామా
శర్వవినుతా శాంతిదాతా రామా రామా

మనసులోని మాయ బాపి రామా రామా
మనువుమా నీ మోము జూపి రామా రామా

నీవు నేనను భేద బుద్ధి మాపి మాలో
నిలుపుమా నీ జ్ఞానసిధ్ధి రామా రామా

కామ క్రోధ లోభ మోహ పాశంబుల
కడకు ద్రోసి కావుమయ్యా రామా రామా

ఏకశిలా పుర వాసా సీతారామా రామా
లోకేశా బహురూప విలాసా రామా రామా

రామకృష్ణ గోవింద నారాయణా
రామకృష్ణ గోవింద నారాయణా
రామకృష్ణ గోవింద నారాయణా
ప్రేమించి పాలించు నారాయణా

తెలుగు చలనచిత్రాలలో రామునిపై ఎన్ని పాటలున్నాయో. అయినా, ప్రతి పాట జనరంజకమే. కారణం రామభక్తిలో ఉన్న మహత్తు.  రామభక్తి సామ్రాజ్యంలో ఎందఱో మహానుభావులు తరించారు. వారిలో మహాకవి పోతన ఒకరు. పోతన మనకు శ్రీమదాంధ్ర మహాభాగగవతం అనే అమృతాన్ని తెలుగులో అందించారు. ఆయన జీవితాన్ని తెరకు మొట్టమొదట ఎక్కించిన మహానుభావులు చిత్తూర్ నాగయ్య గారు. ఆయన పేరు తలచుకోగానే సంత స్వరూపం, మృదువైన భాషణ, భక్తీ రసము గుర్తుకు వస్తాయి. అటువంటిది ఆయన నటనా ప్రతిభ. 73 ఏళ్ల నాటి పాట ఇది. ఇంకా దీనిలోని భక్తి, ఆధ్యాత్మికత భావాలు గుబాళిస్తూనే ఉన్నాయి. 1942లో విడుదలైన భక్తపోతన చిత్రం లోనిది. సముద్రాల రాఘవాచార్య గారి సాహిత్యం, చిత్తూరు నాగయ్య గారి సంగీతం మరియు గానం. పోతన అంటే నాగయ్య గారేనా అని అనిపించేలా జీవించారు ఆయన ఈ పాత్రలో. సంపదలపై నిరాసక్తి, రాముడే సర్వస్వము అనే భావాలను అద్భుతంగా పండించారు ఆయన. మహానటుడు, తనకు ఉన్నదంతా పంచి, చివరకు గర్భదారిద్ర్యంలో మరణించి కైవల్యం పొందారు.