5, ఆగస్టు 2015, బుధవారం

సర్వమంగళ నామా సీతారామా రామా



సర్వమంగళ నామా సీతారామా రామా
శర్వవినుతా శాంతిదాతా రామా రామా

మనసులోని మాయ బాపి రామా రామా
మనువుమా నీ మోము జూపి రామా రామా

నీవు నేనను భేద బుద్ధి మాపి మాలో
నిలుపుమా నీ జ్ఞానసిధ్ధి రామా రామా

కామ క్రోధ లోభ మోహ పాశంబుల
కడకు ద్రోసి కావుమయ్యా రామా రామా

ఏకశిలా పుర వాసా సీతారామా రామా
లోకేశా బహురూప విలాసా రామా రామా

రామకృష్ణ గోవింద నారాయణా
రామకృష్ణ గోవింద నారాయణా
రామకృష్ణ గోవింద నారాయణా
ప్రేమించి పాలించు నారాయణా

తెలుగు చలనచిత్రాలలో రామునిపై ఎన్ని పాటలున్నాయో. అయినా, ప్రతి పాట జనరంజకమే. కారణం రామభక్తిలో ఉన్న మహత్తు.  రామభక్తి సామ్రాజ్యంలో ఎందఱో మహానుభావులు తరించారు. వారిలో మహాకవి పోతన ఒకరు. పోతన మనకు శ్రీమదాంధ్ర మహాభాగగవతం అనే అమృతాన్ని తెలుగులో అందించారు. ఆయన జీవితాన్ని తెరకు మొట్టమొదట ఎక్కించిన మహానుభావులు చిత్తూర్ నాగయ్య గారు. ఆయన పేరు తలచుకోగానే సంత స్వరూపం, మృదువైన భాషణ, భక్తీ రసము గుర్తుకు వస్తాయి. అటువంటిది ఆయన నటనా ప్రతిభ. 73 ఏళ్ల నాటి పాట ఇది. ఇంకా దీనిలోని భక్తి, ఆధ్యాత్మికత భావాలు గుబాళిస్తూనే ఉన్నాయి. 1942లో విడుదలైన భక్తపోతన చిత్రం లోనిది. సముద్రాల రాఘవాచార్య గారి సాహిత్యం, చిత్తూరు నాగయ్య గారి సంగీతం మరియు గానం. పోతన అంటే నాగయ్య గారేనా అని అనిపించేలా జీవించారు ఆయన ఈ పాత్రలో. సంపదలపై నిరాసక్తి, రాముడే సర్వస్వము అనే భావాలను అద్భుతంగా పండించారు ఆయన. మహానటుడు, తనకు ఉన్నదంతా పంచి, చివరకు గర్భదారిద్ర్యంలో మరణించి కైవల్యం పొందారు. 

1 కామెంట్‌: