23, ఆగస్టు 2015, ఆదివారం

మది శారదాదేవి మందిరమే



మది శారదాదేవి మందిరమే కుదురైన నీమమున కొలిచే వారి

రాగభావమమరే గమకముల నాదసాధనలే దేవికి పూజ
సరళ తానములే హారములౌ వరదాయిని కని గురుతెరిగిన వారి

స్థిరమైన మనసుతో, నియమ నిష్ఠలతో కొలిచే వారి మది శారదాదేవి నిలయము అని కవి మల్లాది రామకృష్ణశాస్త్రి గారు మనకు ఈ శాస్త్రీయ గీతం ద్వారా తెలియజేస్తున్నారు. సరిగమలతో కూడిన గమకముల ద్వారా రాగము, భావము కూర్చబడగా, నాదోపాసనే దేవికి పూజ అవుతుంది. మృదువైన తాళమే దేవికి హారములవుతాయి. వరములొసగే ఆ దేవిని చూచి గ్రహించిన వారి మది శారదాదేవి మందిరము.

ఏ గురువు చెప్పినా, ఏ వాఙ్మయం చెప్పినా ఒకటే మాట. స్థిరమైన మనసు, నియమ నిష్ఠలతో విద్యను అభ్యసించితే ఆ సకలకళామతల్లి శారదాదేవి అనుగ్రహించి ఆ దేహమున నిలిచి అద్భుత పాండిత్యము, మనోవికాసముతో కూడిన కళా ప్రతిభను వెలువరుస్తుంది.

పరమాత్మ యొక్క ఏ దేవతా స్వరూపం యొక్క నామావళి పరిశీలించినా, సామగాన ప్రియము, చతుష్షష్టి కళా ప్రియము అనే నామాలు తప్పక ఉంటాయి. అందుకే పరమాత్మ యొక్క కళారాధనలో సంగీతానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే సంగీతంలో దేవతామూర్తిని వర్ణించే సాహిత్యాన్ని రాగ భావ లయ యుక్తంగా ఆవిష్కరిస్తారు. కాబట్టి సంగీత సేవలో సగుణోపాసన విడదీయరాని అంతర్భాగం. దేవతామూర్తి అనుగ్రహాన్ని పొందిన వాగ్గేయకారుల సాహిత్యం మంత్ర సమానం. అందుకే వాటిని శుద్ధ అంతఃకరణంతో భక్తి విశ్వాసాలతో గానం చేస్తే తప్పక అనుగ్రహం గాయకులకు కూడా లభిస్తుంది. నియమ నిష్ఠలు ఏ సాధనకైనా ముఖ్యం. కారణం? మనసు చంచలమైనది కాబట్టి నియమంతో, శ్రధ్ధతోనే కుదురు కలిగి అభ్యాసం సఫలీకృతమవుతుంది.

నాదాన్ని తనువంతా కలిగిన వాడు శివుడు అని త్యాగరాజస్వామి నాదతనుమనిశం అనే కృతిలో నుతించారు. పరమశివుడు సరిగమపదినస సప్తస్వర లోలుడని ఈ కీర్తనలో తెలియజేశారు త్యాగరాజస్వామి. నటరాజుగా ఆయన పార్వతీదేవితో కలసి ఆనందహేలలో సప్తస్వర మేళనమైన ఝణత్కారముల మధ్య నర్తిస్తాడు. అలాగే కచ్ఛపి, విపంచి మొదలైన నామములు గల వీణలను నిరంతరం వాయిస్తూ నాదలోలయై ఉంటుంది సరస్వతి. నారదుడు నిరంతరం మహతీ వీణా నాదంలో నారాయణుని నుతిస్తాడు. ఈ సందేశాన్నే రామకృష్ణశాస్త్రిగారు మనకు మది శారదాదేవి మందిరమే అన్న గీతం ద్వారా తెలియజేశారు.

సంగీతోపాసనలో త్రికరణశుద్ధికి మరింత ప్రాముఖ్యత ఉంది. సాహిత్యం యొక్క అవగాహన, రాగలక్షణాలపై పట్టు, భావ ప్రాధాన్యత, దేవతామూర్తిపై నమ్మకం...ఇలా ఎన్నో కోణాలు నాదోపాసనా విధిలో గురువులు శిష్యులలో పరిశీలిస్తారు. అవి కలిగిన శిష్యులే సంగీత సాధనలో సార్థకత పొందగలరు. గమకాలంటే రాగంలోని సౌందర్యాన్ని విశదీకరించటం. కాబట్టి గమకాలు పలిగినపుడు అందులో దేవతామూర్తి రమిస్తుంది. ఆ గమకాలకు భావ స్పష్టత కూడా చాలా ముఖ్యం. సంకీర్తనలలో ఎన్నో రకాలు - ద్వైత భక్తి, దాస్యము, శృంగారాన్ని ప్రస్ఫుటించే మధురభక్తి, ఆర్తి, సౌందర్య వర్ణన, విశేషమైన గుణముల వర్ణన, నిందాస్తుతి, శరణాగతి, చమత్కారం, వ్యంగ్యం ఇలా వాగ్గేయకారులు ఎన్నో రకాల భావనలను సగుణోపాసనలో కీర్తనల ద్వారా వ్యక్తపరచుతారు. కాబట్టి, ఆ భావనలను నాదంలో పొందుపరచాలి. అందుకే సంగీత సాధన కఠోరమైనది. ఫలితం కూడా అంతే.

మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు జయభేరి చిత్రంలో గురుశిష్య సంబంధాన్ని ఆవిష్కరించే సన్నివేశంలో ఈ అద్భుతమైన గీతాన్ని రచించారు. ఈ గీతానికి పెండ్యాల నాగేశ్వరరావు గారు సంగీతాన్ని అందించారు. ఘంటసాల, పీబీ శ్రీనివాస్, రఘునాథ్ పాణిగ్రాహి గారు కలసి పాడిన ఈ గీతం ఎంతో ప్రాచుర్యం పొందింది. కళ్యాణి రాగంలో రాగభావమమరే గమకముల మరియు సరళ తానములె హారములౌ అన్న సాహిత్యం వద్ద ఈ గాయకులు అద్భుతమైన సంగీత ప్రతిభను కనబరచి ఈ గీతాన్ని అజరామరం చేశారు. దానికి కారణం మల్లాది వారికి, పెండ్యాల వారికి, గాయకులకు కలిగిన శారదాదేవి అనుగ్రహమే. వీరందరూ తరువాత ఎంతో పేరు ప్రతిష్ఠలు పొంది కళామతల్లి పాదాలవద్దకు చేరిన వారే.

యూట్యూబ్ లో ఈ గీతాన్ని వీక్షించండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి