RightClickBlocker

26, సెప్టెంబర్ 2015, శనివారం

పాకశాస్త్రం - పవిత్రమైన యజ్ఞం


వంట చేయటం ఒక శాస్త్రమే. పాకశాస్త్రమని చెప్పింది మన ఆగమం. నైపుణ్యంతో పాటు ముఖ్యమైన లక్షణాలు కొన్ని ఉండాలి:

1. వంట చేసేటప్పుడు పాత్ర శుద్ధి, వస్తుశుద్ధి మరియు దేహశుద్ధి తప్పనిసరి. పాత్రశుద్ధి తినేవారి ఆరోగ్యం కోసం, పరమాత్మ స్వీకరణ కోసం. వస్తుశుద్ధి రుచికోసం, దోషనివారణ కోసం.  శరీరశుద్ధి మనసుకు, మనశ్శుద్ధి కర్మకు, కర్మశుద్ధి వంటలలోకి ప్రసరిస్తుంది. స్నానం కుదరకపోయినా, తలదువ్వుకొని (వెంట్రుకలు రాలకుండా), కాళ్లు చేతులు శుభ్రం చేసుకొని చేయాలి. అలాగే దేహపుష్టి కూడా ముఖ్యం. ఓపిక, బలం లేని వాళ్లు వంట చేస్తే వంటలు కూడా నీరసంగానే వస్తాయి.

2. వంట చేసేటప్పుడు ప్రశాంతమైన మనసుతో ఉండాలి. వంటలోని ప్రతి అడుగులోనూ ఈ ప్రశాంతత రుచికి తోడ్పడుతుంది. ముక్కలు సరైన పరిమాణంలో ఉండటం, ఉప్పుకారం సరైన మోతాదులో ఉండటం, సరైన పాళ్లలో ఇతర పదార్థాలు ఉండటం, సరైన విధంగా ఉడకటం...వీటన్నిటిలో వంట చేసే వారి ప్రశాంతత ప్రతిబింబిస్తుంది. పిల్లలపై, జీవితభాగస్వామిపై, అత్తగారిపై, యజమానిపై, వృత్తిపై ఉన్న కోపం వంట చేసే సమయంలో మీ మనసులో ఉంటే, వంట అదే వికారంతో వస్తుంది. అలాగే భారమైన మనసుతో చేస్తే వంట అదే విధంగా రుచిని పొందుతుంది.

3. తినేవారిపై ప్రేమతో చేయాలి. వారంతా సంతోషంగా, తృప్తిగా సరిపడా తినాలి, వారు ఆత్మానందపరితుష్టులవ్వాలి. ఈ ఆలోచనలతో ఉంటే ఫలితం అలానే ఉంటుంది. వీళ్ల దుంపతెగ నేను ఎలా చేసినా వీళ్లకు నచ్చదు, ఎంత తింటారో, వీళ్లు తినే తిండికి ఇదే ఎక్కువ..ఇలాంటి ఆలోచనలతో చేస్తే ఆ భావాలే ఆ వంటలకు అలదుతాయి.

4. ధ్యాస వంటపై ఉండాలి. అష్టావధానం చేస్తే ఫలితం అలానే ఉంటుంది. వంట చేస్తూ ఆఫీసులో పనో లేక సాయంత్రం చూడబోయే సినిమాపైనో లేక పండగకు కొనాల్సిన వస్తువుల గురించో ఆలోచన ఉంటే మోతాదులు సరిగా కుదరవు. వంట కూడా ఒక యజ్ఞమే. ధ్యాస, పవిత్రత అన్నివిధాలా తప్పనిసరి.

5. తినేవారి ఇష్టాయిష్టాలను బట్టి చేయాలి. వండిన పదార్థాన్ని పరమాత్మ భుజిస్తాడు అన్నదానిని నమ్మి చేయాలి.
బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైన తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం

అని పరమాత్మ చెప్పాడు. అన్నాది పక్వములు, పాకశాస్త్రం, భోక్త అన్నీ యజ్ఞాలే.

కాబట్టి వంట అంటే ఆషామాషీగా టూ మినిట్స్ మ్యాగీలా చేయకండి. లోనికి వెళ్ళే ప్రతి మెతుకు అగ్నిదేవునికి సమర్పణ. శరీరం యజ్ఞకుండం, చేసిన ప్రతి పదార్థం పూర్ణాహుతి ఫలం పొందాలి అన్న భావనతో చేయండి. పదిరకాలు చేయటం కాదు ముఖ్యం, చేసినవి శుద్ధిగా, పవిత్రంగా, సద్భావనలతో చేయటం, ఆ విధంగా భావించి భుజించటం ముఖ్యం.

అన్నాద్భ్వంతి భూతాని....అన్నమునుండే అన్ని ప్రాణులు జన్మించాయి. కాబట్టి అన్నాదులను తయారుచేయటంలో కూడా శ్రద్ధ, భక్తి, పవిత్రత ముఖ్యం. అందుకే మీరు ఎనంతి హోటళ్లలో తిన్నా, ఇంట్లో అమ్మ, భార్య వండిన వంటకు సమానం కానే కావు. ఎందుకంటే ఇంటి ఇల్లాలు ఈ భావనలతోనే చేస్తుంది కాబట్టి. హోటళ్లలో వంటవాడు రోజూ చేసి చేసి, ఎంతో ఎక్కువ మోతాదులు చేసి, సమయాభావం వలన, పదర్థాలు, పాత్రలు, మనస్సు, తనువు శుద్ధిలేక పదార్థాలు శరీరానికి ఆరోగ్యకరం కావు.23, సెప్టెంబర్ 2015, బుధవారం

అర్ధనారీశ్వరం


అందమైన ఆమె కాలి గజ్జెల చప్పుడు దగ్గరవుతున్న కొద్దీ గుండె వేగంగా కొట్టుకుంటోంది. మెల్ల మెల్లగా ఆ రవం పెరుగుతోంది. ఆమె తలలోని సంపెంగ పూవు సువాసనలు వలపుల అలలను రేపుతున్నాయి. గజ్జెల చప్పుడు నెమ్మదించింది. తన స్వప్న సుందరి మాయమైందా అని అతడు తల ఎత్తి చూశాడు. ఎదురుగా ఎవ్వరూ లేరు. పక్కకు తిరిగి చూశాడు. నిరాశా చెందాడు. ఆ కావ్య కన్యక కానరాలేదు. దిగాలుగా తలదించుకొని తన కలంపై దృష్టి పెట్టాడు.

మలయమారుతములు వీచినట్లు వీచి నా మనసును దోచుకున్న ఓ యెంకి!
కలభగమనమున వచ్చినట్లు వచ్చి నా ఎడదన నిలిచిన ఓ సఖి!
నీ గాఢపరిష్వంగనమున రమించి ఆత్మానందమునొందాలని తపించితి
నీ వలపుల చూపుల పరవశించి నన్ను నేను మరవ ఆశించితి
ఏల ఈ విరహ పరీక్ష నాకు? ఎందుకీ కలహ ప్రణయము నాతో?

అని తెల్లని కాగితంపై కావ్యకన్యక రూపం పక్కనే చక చక అక్షర మాలను వ్రాసాడు. వెనకనుండి ఫక్కున నవ్వు వినపడింది. ఎవరా అని ఆ రసికుడు వెనుదిరిగి చూశాడు. జలపాతంలో నీళ్లలా గల గల నవ్వులు కురిపిస్తోంది...అరవిరిసిన కురులు, చారడేసి కలువరేకుల్లాంటి కళ్లు, నల్లని కాటుక, కళ్లలో చిలిపి నవ్వు, సిగ్గుతో విరిసిన ఎర్రని బుగ్గలు, మేలిమి ముత్యాల పలువరుస, నుదుట పాపిటి బిళ్ల, చెవులకు వేలాడే జూకాలు, ఆకుపచ్చ పట్టుపావడాకు తెల్లని ఓణీ చూస్తే కోనసీమలో వరిపొలాలపై తెల్లని మేఘాలు కమ్మినట్లుంది. కంటి రెప్పలార్చకుండా చూస్తూనే ఉన్నాడు.

ఇంతలో కళ్లముందు చిటికె..కవి మహారాజా! కలలేనా! ఎదుట ఉన్న భామతో మాటలు ఏమైనా?!!...విరహంతో ఉన్న కవి ఎదుట ఉన్న సజీవ శిల్పరూపాన్ని చూసి ముగ్ధుడైనాడు. ప్రేమావేశంలో చేయి పట్టి లాగబోయాడు. మృదువుగా చేయి వదిలించుకొని పరుగెత్తుకు వెళ్లి గుమ్మం చాటున నిలబడి మళ్లీ కిలకిలా నావ్వింది. అబ్బా! ఈ నవ్వుకు కోటి వరహాలైన చాలవు అని మైమరచి కళ్లుమూసుకున్నాడు. కళ్లు తెరిచేంతలో ఆమె మాయం. నిట్టూర్చి మళ్లీ కలం, పుస్తకం, అలోచనలో పడ్డాడు.

ఆ 24ఏళ్ల కన్య కరణం గారి ఏకైక కూతురు శివాని. ఈ కవి 27 ఏళ్ల సుందరం, మునసబు గారి అబ్బాయి. తొలిసారి వీళ్లు కలిసింది పట్టిసీమ వీరభద్రుని బ్రహ్మోత్సవాలలో. జ్ఞాపకాల పందిరిలోకి ఒదిగిపోయాడు సుందరం.

వీరభద్రుడికి వీరంగాలు చేస్తూ భక్తులు బారులు తీరున్నారు. అవతల ఒడ్డున ఉన్న సుందరం "అబ్బా! ఇంత జనంలో దర్శనం ఎంత సమయం పడుతుందో" అని చికాకుగా పడవ ఎక్కాడు. నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో వెంటనే ఒడ్డుకు చేరాడు. దృష్టి మరలింది. ఇసుకలో ఆనందహేలలో నాట్యం చేస్తోంది 20 ఏళ్ల పడుచు పిల్ల. పక్కనే క్యాసెట్ ప్లేయరు, అందులో "ఆనందతాండవమాడే శివుడు అనంతలయుడు చిదంబర నిలయుడు" అని సుశీలమ్మ పాట వస్తోంది. ఆ పాటలో లీనమై ఆ కన్య నర్తిస్తోంది. "నగరాజసుత చిరునగవులు చిలుకంగ సిగలోన వగలొలికి ఎగిరి ఎగిరి దూకంగ సురగంగ" అన్న సాహిత్యానికి చిరునవ్వులు చిందిస్తూ సర్వేశ్వరునివైపు చూసే పార్వతిగా, మరుక్షణమే స్వామి సిగలోన ఎగిసిపడుతున్న గంగగా అద్భుతమైన ఆహార్యాన్ని అభినయిస్తోంది. ఇసుక తిన్నెలు పరవశంతో చూస్తున్నాయి. నీటి అలలు ఆగిపోయి దివినుండి భువికి దిగిన అప్సరస హేలను కన్నులార్పకుండా చూస్తున్నాయి. కూచిపూడి అభినయం చూస్తూ సమయాన్నే మరచిపోయాడు సుందరం. "అమ్మా శివానీ!" అని ఇసుకలో నడువలేక ఆయాసపడుతున్న కరణంగారు దగ్గరకు వచ్చి గట్టిగా పిలిచేంతవరకూ అతనికి,ఆమెకు ఈ లోకం తెలియలేదు. యాదృచ్ఛికమో లేదా దైవసంకల్పమో, ఇద్దరూ ఒకేసారి కళ్లు తెరచారు. అతనికి తెలియకుండా ఇసుక తెన్నెలపై అద్భుతమైన చిత్రం గీసాడు. ఆమెకు తెలియకుండానే శివుని నటరాజ రూపం ఆ నృత్యహేలలో ఇసుక తెన్నెలపై మలచబడింది. అతని సౌందర్య పిపాసను చూసి ఆమె నివ్వెరపోయింది. ఆమె నృత్యంలోని పవిత్రతను చూసి అతడు మాటరాక నిలిచిపోయాడు. చూపులు కలిసాయి. మనసులు కలిసాయి. వెనుదిరిగి చూస్తూ గుడిలోకి వెళ్లింది శివాని. అంతే, వీరభద్రుని దర్శనం సంగతి మరచి ఇంటికి వచ్చి కలం పట్టాడు సుందరం. అలా మొదలైంది ప్రణయగాథ. తొలిచూపులోనే ఒకటయ్యారు. జ్ఞాపకాల పొదరిల్లునుండి బయటకు వచ్చాడు సుందరం.

"నాన్నా సుందరం! మన కరణం గారి అమ్మాయి శివాని ఢిల్లీలో సంగీత నాటక అకాడెమీ వారి వార్షిక నృత్యోత్సవాలలో పాల్గొనేందుకు ఒక నృత్యరూపకం చేయాలిట. దానికి కావలసిన సాహిత్యం నువ్వు రాయగలవేమో అని ఆయన అడిగారు. ఏమంటావ్?" అని మునసబు గారు సుందరాన్ని అడిగారు. సరిగా వినలేదు సుందరం. "నాన్నా సుందరం నిన్నే!..." అని మళ్లీ కేక. శివాని పేరు మాత్రమే వినబడింది. ముందు వెనుక ఆలోచించకుండా సరే అన్నాడు సుందరం.

"అమ్మా శివానీ! నీ నృత్యరూపకం కోసం సాహిత్యాన్ని వ్రాయటానికి మునసబుగారి అబ్బాయి సుందరం వచ్చాడు. వివరాలు చర్చించుకోండి.." కరణం గారు వాకిట్లో కుర్చీ వేసుకొని దస్తావేజులు చూస్తూ తన ముందు నించున్న సుందరాన్ని లోనికి వెళ్లమని చెప్పాడు.

ఆరడుగుల విగ్రహం, విశాలమైన నుదురు, కళ్లలో ప్రశాంతత, ముఖంలో సరస్వతీ దేవి అనుగ్రహం, ఉంగరాల జుట్టు, తెల్లని లాల్చీ, అంచు పంచె, రంగు కడువా...రాజకుమారుడిలా ఉన్న సుందరం లోనికి అడుగుపెట్టాడు. ఎదురుగా తన ప్రణయరాశి నిలుచుని ఉంది. ప్రేమావేశం పొంగినా, తమాయించుకొని "నాన్న గారు విషయం చెప్పారు. అంతటి పెద్ద కార్యక్రమానికి సాహిత్యాన్ని అందించే అర్హత నాకు ఉందో లేదో తెలియదు. కానీ, మీతో కలిసి పని చేయటం నాకు మహదానందం" అని మనసులోని మాటను చెప్పాడు. "సుందరం గారూ! మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మీ భావావేశం నాడు పట్టిసీమ ఒడ్డునుండి ప్రతి రోజూ చూస్తునే ఉన్నాను. సందేహించకండి" అని అర్ధనారీశ్వరం అనే నృత్యరూపకం యొక్క వివరాలు చెప్పింది. "మీరు ఆదిశంకరుల అర్ధనారీశ్వర స్తోత్రం విన్నారా? అందులో ఈ తత్త్వం అద్భుతంగా వర్ణించారు ఆయన. అది సంస్కృతంలో ఉంది. దానిని సులువైన తెలుగుభాషలో ఒక 2 గంటల రూపకంగా చేయాలని నా సంకల్పం. ఏమంటారు?".

"మంచి సబ్జెక్టు. నాకు స్తోత్రం తెలియదు. మీరు వివరించండి. నేను తెలుగులో అక్షర రూపమిచ్చే ప్రయత్నం చేస్తాను..."అని ఆమె కళ్లలోకి చూశాడు. ఆత్మవిశ్వాసం, ఆరాధన, గౌరవం అన్నీ కలబోసినట్లుగా ఉన్నాయి ఆమె చూపులు. "రండి, వెనుక శివాలయంలో రంగమండపంలో మాట్లాడుకుందాం" అని గుడి వైపు అడుగులు వేసింది ఆ శివాని. ఆమె నడుస్తుంటే "మరాళీ మందగమనా మహాలావణ్య శేవధీ" అన్న లలితాసహస్రనామావళిలోని నామాలు గుర్తుకు వచ్చాయి సుందరానికి. చిన్నప్పుడు అమ్మ నేర్పిన స్తోత్రం అతనికి చాల ఇష్టమైనది. దానికి భాష్యం కూడా పదిహేనేళ్ల వయసులోనే వ్రాసాడు సుందరం. మంచి కవే కాదు. సుందరం మంచి శాస్త్రీయ సంగీత గాయకుడు కూడా. 10 ఏళ్లపాటు సంగీతాన్ని మంచి గురువుల వద్ద అభ్యసించాడు. అలాగే చూస్తూ ఆమె వెనుక నడిచాడు.

విశాలమైన ప్రాంగణంలో కోటేశ్వరస్వామి-సర్వమంగళాదేవి దేవస్థానం. ముందు భాగంలో ఎత్తైన రంగమండపం. అక్కడ అమ్మ-అయ్యల కళ్యాణోత్సవాలు జరుగుతాయి. ప్రతియేడు శివరాత్రి బ్రహ్మోత్సవాలలో, దేవీనవరాత్రుల సమయంలో శివాని అక్కడ కూచిపూడి నృత్యసేవతో అమ్మను అయ్యను కొలుస్తుంది. అక్కడ ఉన్న మెట్లపైన కూర్చోమని సుందరానికి సంజ్ఞ చేసి క్యాసెట్ ప్లేయరులో ప్లే నొక్కింది. బాలసుబ్రహ్మణ్యం గారి "చాంపేయ గౌరార్థ శరీరికాయై కర్పూర గౌరార్థ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమశ్శివాయైచ నమశ్శివాయ.." అని శ్రావ్యంగా గీతం వస్తోంది. శివాని క్షణంలో గజ్జెకట్టి శివపార్వతుల రూపం ధరించింది. కైలాసం దిగి వచ్చినట్లు నర్తించింది. స్తోత్రం మొత్తాన్ని తన నృత్యప్రదర్శనతో వివరించింది. కొన్ని నిమిషాల పాటు భౌతికమైన వాంఛలకు దూరంగా సుందరం ఆమెలో అర్ధనారీశ్వర రూపాన్ని దర్శించి రమించాడు. భక్తిభావం ఉప్పొంగి అతని నోట "బంగరువన్నెల మేని మెరుపుల అల్లిన జడ సొబగుల శివాని ఒక వంక, కర్పూర ధవళకాంతి మేని నగవుల రాజిల్లెడి జటాధర భవుడొక వంక, ఏకమై విశేషమై జగతినలరించ నటించె అర్ధనారీశ్వరుడు...." అని ఆశువుగా, శ్రావ్యంగా రాగయుక్తంగా అలపించాడు. ఆశ్చర్యపోయింది ఆతని అయత్నకృత కవితాధారకు. మరల ఆనందహేలలో నర్తించింది. వీరిరువురి గాత్ర నాట్య సంయోగానికి చుట్టూ చేరిన భక్తులు తన్మయులై అర్ధనారీశ్వర తత్త్వాన్ని కన్నుల పండువగా విని దర్శించారు.

తమ తమ ఇళ్లకు చేరుకున్న సుందరానికి, శివానికి తమ అభిరుచులు కలిశాయి అన్న విషయం అర్థమయ్యింది. అలాగే తాము జంట కావాలన్న సంకల్పం దృఢమైంది. కానీ, నృత్యరూపకం పూర్తయేంత వరకు ఆ ఆలోచనలను బహిర్గతం చేయకుండా పక్కకు పెట్టారు. ఒక వారం గడిచేసరికి నృత్యరూపకానికి కావలసిన సంభాషణలు, తెలుగు గేయం, రాగ లక్షణాలు సిద్ధమైనాయి. దాదాపు రెండు నెలలపాటు సుందరం శివానీల జంట అహర్నిశలు శ్రమపడ్డారు. తపస్సులా సాగింది వారి సాధన. సాహిత్యాన్ని, గాత్రాన్ని శివాని మెరుగుపెడితే అభినయాన్ని, భావప్రకటనను సుందరం మెరుగుపెట్టాడు. 2 గంటల రూపకానికి సాధన రోజూ ఆరు గంటల పాటు సాగింది. శివపార్వతుల తత్త్వము ఇద్దరికీ పరిపూర్ణంగా అబ్బింది. ఇద్దరి ముఖాలలో తేజస్సు వచ్చింది. ఆ రెండు నెలలపాటు ఇద్దరూ ఒక పూట భోజన, సుందరం శివపంచాక్షరీ జపం, శివాని గౌరీపూజ శ్రద్ధా భక్తులతో చేశారు.

ఢిల్లీ సంగీత నాటక అకాడెమీ వారి వార్షిక నృత్యోత్సవాలు. వేదికపై శివపార్వతుల అర్ధనారీశ్వర రూపంలో పెద్ద ఇత్తడి విగ్రహం. రూపానికి ఒక పక్క విభూతి మరో పక్క పసుపు అద్దారు. ఒక పక్క మూడవనేత్రం మరొక పక్క కుంకుమ, ఒక పక్క సర్పము, మరొక పక్క బంగారు వంకీ, సిగలో ఒకపక్క గంగ, మరొక పక్క మల్లెపూలు, ఒక కాలికి పాము, మరో కాలికి గజ్జెలు, ఒక పక్క జింక చర్మము, ఇంకో పక్క పట్టు చీర...ఈ విధంగా ఆ ఆదిదంపతుల ఏకమైన రూపం వేదికపై ప్రకాశిస్తోంది. ఇరు పక్కల దీపాలు. ఓం నమశ్శివాయ అన్న నామం హాలులో చిన్నగా అంతటా వినబడుతోంది. వేదికపైకి  వాయిద్య సహకారం ఇచ్చే కళాకారులను పరిచయం చేశారు. ఆ నాటి కళాకారిణి కుమారి శివానిని పరిచయం చేశారు. వేదికపై ఉన్న అర్థనారీశ్వర రూపాన్ని ముమ్మూర్తులా పోలేలా నడుచుకుంటూ వచ్చింది శివాని. ప్రేక్షకులలో కూర్చొని ఉన్న కరణం గారు, మునసబుగారు ఆతృతతో ఎదురుచూస్తున్నారు.

"సభా రూపంలో ఉన్న పార్వతీపరమేశ్వరులకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో మా బృందం వేదికపైనున్న అర్థనారీశ్వర తత్త్వాన్ని ప్రదర్శించబోతున్నాము. ఈ అంశం ఎంచుకోవటానికి కారణం అభేద్యమైన ఈ ఆదిదంపతుల తత్త్వము. ప్రకృతీపురుషులుగా, లోకానికి తల్లిదండ్రులుగా, క్రమశిక్షణ-దయలకు ప్రతిరూపంగా..ఇలా మనం వేసే ప్రతి అడుగులోనూ పార్వతీపరమేశ్వరులు ఆదర్శప్రాయం. మన తల్లిదండ్రులు వీరి రూపమే. ఈ లోకంలో జరిగే విలాసం వీరి లీలలే. హిమవంతుని కుమార్తె అయిన పార్వతి, లయకారకుడు, బూడిద పూసుకొని పాములను ధరించి, భిక్షమెత్తుకునే శివుని ఎందుకు మోహించిందో ఆమెకు మాత్రమే తెలుసు. ఆ వివరాలను ఈ రూపకంలో ప్రస్తావించే ప్రయత్నం చేశాము. ఒకటైన పార్వతీ పరమేశ్వరుల హేల అనిర్వచనీయమైనది. దానిని మనకు ఆదిశంకరాచార్యుల వారు ఆధ్యాత్మిక సంపదగా అందించారు. వారి స్తోత్రాన్ని ప్రేరణగా తీసుకొని మా వాడపల్లిలోని శ్రీ సుందరం గారు అర్ధనారీశ్వర తత్త్వాన్ని గేయము మరియు సంభాషణల రూపంలో ఈ రూపకానికి ప్రాణం పోశారు. అంతే కాదు, ఈరోజు వారు ఈ రూపకానికి గాత్ర సహకారం కూడా అందించబోతున్నారు. వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను". సభ కరతాళధ్వనులతో మారుమ్రోగింది. సుందరం గంభీరంగా, ప్రశాంతమైన వదనంతో, వినయంతో వేదికపైకి వచ్చి సభకు నమస్కరించారు. కళాకారులు తమ తమ స్థానలను అలంకరించటానికి తెర ఒక రెండు నిమిషాల పాటు దించారు.

తెరలేచింది. అద్భుతమైన కైలాస పర్వత శ్రేణి చిత్రం వేదిక వెనుకభాగాన కైలాసాన్ని తలపిస్తోంది. దాని ముందు అర్ధనారీశ్వరుల విగ్రహం. "వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ" అన్న శ్లోకంతో రూపకం ఆరంభమైంది. రెండు గంటలు ఎలా సాగిందో ప్రేక్షకులకు తెలియదు. శివతత్త్వం, దేవీ తత్త్వం, అర్ధనారీశ్వర తత్త్వం సంగీత నృత్య ప్రదర్శనలలో ఆధ్యాత్మిక ఔన్నత్యంతో ఆవిష్కరించారు శివాని-సుందరంల జంట. లయకారుడైన శివుని గాంభీర్యం, రౌద్రం, ఆనంద తాండవం, తపోదీక్ష ఒక పక్క, దయామయి అయిన పార్వతి ప్రేమ, కరుణ, శాంతము, పతిభక్తి మరో పక్క, వెంట వెంట వైవిధ్య భరితమైన లక్షణాలను అద్భుతంగా అభినయంలో శివాని ప్రదర్శించింది. సముచితమైన స్వర రాగ భావ గర్భితమైన గాత్రాన్ని సుందరం అందించాడు. సభ ఆనందపరవశంలో తేలియాడింది. ప్రదర్శన ముగిసింది. సత్కారాలు, అభినందనలు, ఆటోగ్రాఫులు...పొద్దుపోయేదాకా నడిచాయి.


రైలులో సుందరం, శివాని, కరణం గారు, మునసబు గారు ఢిల్లీనుండి విజయవాడ బయలుదేరారు. ఆగ్రా సమీపిస్తోంది. దూరంగా తాజ్‌మహల్ మెరుస్తోంది. కంపార్టుమెంటు తలుపు దగ్గర నిలబడి తాజ్‌మహల్ అందాలను ఆస్వాదిస్తున్నాడు సుందరం. అతని మదిలో ఇంకా అర్ధనారీశ్వరమే మెదులుతోంది. "సుందరంగారు - నా మనసులోని మాట చెబుతున్నాను. ఈ రూపకం సాధనకు మునుపు మీతో చిన్నపిల్లలా, చిలిపిగా ప్రవర్తించాను. కానీ, ఈ రెండు నెలల సాంగత్యం నాలో ఎన్నో ఆలోచనలను రేపింది. ఆత్మావలోకనం చేసుకునేలా చేసింది. కళను పరమాత్మతో అనుసంధానం చేసుకోవటానికి ప్రయత్నిస్తే అది ఊహించరాని ఆనందం ఇస్తోంది. ఈ అనుసంధానంలో అర్థం చేసుకునే భాగస్వామి ఉంటే ఆ అనుభూతి ఎంత మధురమో ఈ రెండు నెలలలో తెలిసింది. మన ప్రేమను దైవానికి అనుసంధానం చేశాము ఈ సాధనలో. అందుకే ఫలితం అద్భుతంగా ఉంది. వీలైనంత త్వరగా మనిద్దరం పవిత్ర బంధంలో ఒకటైతే మన సాధన మరింత వికసిస్తుందని నాకు నమ్మకం కలిగింది...మీరేమంటారు?".

సుందరం ఆమె కళ్లలోకి చూశాడు. చేతితో దూరంగా ఉన్న తాజ్‌మహల్ చూపి "అలాగే. నీకు తోడు నీడగా ఉండటం నా అదృష్టం. అసంపూర్ణమైన నా కళాపిపాసకు ఈ రెండు నెలలలో నువ్వు పరిపూర్ణతనిచ్చావు. మోహావేశంలో కవితలు రాసే రసికుడినుండి నన్ను భగవంతునితో అనుసంధానం చేసుకునేలా ఈ సాధన నాకు తోడ్పడింది. పరమాత్మను వర్ణించటంలో ఉన్న సంతృప్తి, పుష్టి, ఆనందం పాంచభౌతికమైన మన దేహవర్ణనలో దొరకలేదు నాకు. ఈరోజు నా మనసు ఆ అమృతాన్ని చవిచూసింది. అది నీతో నాకు నిత్యము లభిస్తుందన్న నమ్మకం ఉంది. ధర్మే చ అర్థే చ నాతి చరామి శివానీ! " అన్నాడు. ఎదురుగా చందమామ, వెన్నెలలో తాజ్‌మహల్, పక్కనే యమునా నది. వీటి సాక్షిగా వారిద్దరూ పవిత్రబంధంలో కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు.

"నాన్నా సుందరం! నాకేమి అభ్యంతరం లేదు. పార్వతీదేవి లాంటి శివాని మన ఇంటి కోడలిగా రావటం మన అదృష్టం. కానీ...వారు బ్రాహ్మణులు...మనం....". "నాన్నా! మీరు మా ఇద్దరి జంట అందరికీ మంచి చేస్తుందని నమ్ముతున్నారా?" అని మునసబుగారిని అడిగాడు సుందరం. "ఇది వరకు ఏమో, కానీ, మీ సాధన, ప్రదర్శన చూసిన తరువాత పరిపూర్ణంగా నమ్ముతున్నాను" అని సమాధానం చెప్పాడు మునసబు గారు. వెంటనే ఆయన కరణం గారింటికి వెళ్లాడు. "కరణం గారు! ఆడ దిక్కు లేని ఇల్లు మాది. పిల్లలిద్దరూ ఇష్ట పడ్డారు. మీరు అంగీకరిస్తే....."

"మునసబు గారూ! వీరిద్దరి ప్రేమ శరీరాలకు సంబంధించింది కాదు అని నాకు అర్ధనారీశ్వర తత్త్వం సాధనలోనే అర్థమయ్యింది. పరమాత్మను అనుభూతి చెందే మార్గంలో ఇద్దరూ ఒకటవుతామంటున్నారు. ఈ దేహంతో వచ్చి ఈ దేహంతో పోయే కులానికి ఆ పరమాత్మ అనుభూతిలో ఎక్కడండీ స్థానం? ఆధ్యాత్మికోన్నతికి తోడ్పడని జ్ఞానం ఎందుకండీ? నేను ఈ వివాహానికి కులం పేరుతో అడ్డుపడితే నేను నమ్మిన దైవం పట్ల కృతఘ్నత చూపినట్లే. నా నిత్యకర్మానుష్ఠానం వృథా. అమ్మాయి అబ్బాయి సాంగత్యం పవిత్రమైనది. నటరాజ సేవలో అమ్మాయి ఉంది, ఆ సేవకు ప్రాణమైన సాహిత్య సంగీతాలను అబ్బాయి అందించాలనుకుటున్నాడు. వీరిద్దరినీ ఒకటి చేయటం మన ధర్మం" అని అన్నాడు. కరణం గారి పరిశీలనకు, జ్ఞానానికి, వ్యక్తిత్వవికాసానికి తలవంచి నమస్కరించాడు మునసబు గారు. శివాని సుందరం వంక చూసి సిగ్గుతో తలవంచింది. సుందరం తన జీవితంలో అడుగిడబోతున్న జ్ఞానజ్యోతిని చూసి చిరునవ్వు నవ్వాడు.

జగత్తుకు మూలమైన పార్వతీ పరమేశ్వరుల అర్ధనారీశ్వరమే ప్రతి ఇంటిలో ఉండే భార్యాభర్తలు. ఇద్దరూ పరిపూర్ణంగా అనుసంధానమైతే ప్రతి భార్యాభర్తా ఆదిదంపతులే. ప్రతి సంతానమూ వారి అనుగ్రహపాత్రులే.

19, సెప్టెంబర్ 2015, శనివారం

ఏమొకో చిగురుటధరమున - అన్నమాచార్యుల మధురభక్తి - శోభారాజు గారి ఆలాపన


భక్తి అనేకరకాలు. అందులో ఒకటి మధురభక్తి. భక్తుడైన కవి తాను నాయికయై, పరమాత్మను నాయకునిగా ఎంచుకొని, ఆ పరమాత్మ, నాయికల నవరసములతో కూడిన లీలలను వర్ణిస్తాడు. ఈ విధంగా నాయికా నాయకుని భావనతో పరమాత్మను కొలిచే భక్తిని మధుర భక్తి అంటారు. ఇటువంటి మధురభక్తిలో శృంగార రసము దేహానికి సంబంధించినది కాదు. పంచభూతములతో కూడిన శరీరానికి సంబంధించిన శృంగారం ఈ మధురభక్తిలోని శృంగారం ఒకటి కాదు. మధురభక్తి ఆత్మ-పరమాత్మలకు సంబంధించినది. అది కూడా అందరికీ లభ్యమయ్యేది కాదు. నిర్మలమైన భక్తి కలిగిన జ్ఞానులకు మాత్రమే అందుబాటులో ఉండేది మధురభక్తి. ఈ మధురభక్తియందు రమించే భక్తుని యొక్క భక్తికి సోపానము మోక్షమే. దీనిని రుచి చూసిన భక్తుడు ఎన్నటికీ దానికి దూరం కాలేడు.

కలియుగంలో నామసంకీర్తనే ఉత్తమ భక్తి మార్గమని ఆగమశాస్త్రములు చెబుతున్నాయి. అందులో మధురమైన గీతములను ఆలపించటం ఎంతో శ్రేష్ఠమైనది. పరమాత్మ నామామృతం చెవులకు సోకగానే శృంగార రస నాయిక కరగి పోయి నిద్రకు దూరమవుతుంది. ఒకవేళ నిద్రించినా కూడా స్వప్నములో కూడా తన కాంతుడైన ఆ పరమాత్మ రూపమునే దర్శిస్తుంది. అతని నామమును తలచుచు, పరవశురాలవుతుంది. ఆ లీలలో మునిగి తేలుచు చటుక్కున స్వప్నావస్థనుండి బయట బడుతుంది. అది కలయని తెలుసుకొని దిగాలు పడుతుంది. స్వామికి దూరమైన ప్రతి నిమిషము ఆవేదన చెందుతుంది. ఈ ఆవేదన త్రికరణ శుద్ధిగా ప్రకటితమవుతుంది. ఆ భక్తితో కూడిన ఆవేశము మధురభక్తి యొక్క ప్రధాన లక్షణము. అటువంటి మధురభక్తిలో ఓలలాడే కవి మరింత ముందుకు వెళతాడు. పరమాత్మ గుణవైభవములను వర్ణిస్తాడు, మధురమైన సంకీర్తనలు అతని నోటినుండి వెలువడుతాయి. మధురభక్తిలో ఉపచారములు, అలుకలు, సరసములు, నయగారములు, అలంకరణలు, ఉత్సవాలు, ఊరేగింపులు, రతిక్రీడలు...అన్నీ భాగమే. కానీ, అవి పరమాత్మ, నాయిక యొక్క ఆతమకు సంబంధించినవి.


మరి మధురభక్తిని ఎవరు అనుభూతి చెందారు? ద్వాపరయుగంలో గోపికలు, రాధ, కలియుగంలో నమ్మాళ్వారు, గోదాదేవి, మీరాబాయి, జయదేవుడు మొదలైన వారు ఈ మార్గంలో నడిచిన వారే. అలానే, తెలుగు భాషలో తొలి వాగ్గేయకారుడు, పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు కూడా మధురభక్తి మార్గంలో ఎన్నో శృంగార సంకీర్తనలను రచించారు. మధురభక్తిని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చారు అన్నమయ్య.

కవి (అనగా నాయిక) ఒక సంకీర్తనలో రాముని తల్లి కౌసల్యగా, ఇంకొక కీర్తనలో కృష్ణుని తల్లి యశోదగా, మరొక కీర్తనలో శ్రీనివాసుని తల్లి వకుళమాతగా తనను తాను భావించుకొనును. ఆయారూపములలో ఉగ్గుపాలు తాగించటం, జోల పాడటం, వెన్నముద్దలు తినిపించటం, ఊయలలూపటం, అల్లరిచేసిన మందలించటం, బుజ్జగించటం, పొగడటం వంటివెన్నో స్వామి సేవలో భాగంగా ఆవిష్కరించారు అన్నమయ్య. సేవకురాలి రూపంలో సేవించటం, చెలికత్తెగా రాయబారం పంపటం, రాధ రూపంలో అలుగుట, గోపికవలె ఆర్తి చెందటం, సత్యభామ వలె మత్సరమును చూపటం, రుక్మిణివలె ఆరాధించటం...ఇంతలోనే అలమేల్మంగ రూపము పొందును, మరంతలోనే అలిగి ఒక మూలన కూర్చొనును. ఈవిధంగా అన్నమయ్య తనను తాను నాయికల రూపంలో ఊహించుకొని స్వామిని మురిపించి మరపించి తాను పరవశము పొందును, విరహముతో దుఃఖము చెందును, ఆవేశపడును, ఆవేదన పొంది, చివరకు ఆయనను పొంది దివ్యమైన సంగమంలో చెప్పరాని అనుభూతిని పొందుతారు. అది విశేషమైన సంయోగము, భగవద్విషయము, అనుభవైకవేద్యము. భౌతికమైన స్త్రీపురుషుల రతి మాయాప్రేరితము కావున ఆ అనుభూతి ఎక్కువ కాలము నిలువదు. కానీ, మధురభక్తి వలన కలిగే భగవద్రతి శాశ్వతమైనది. ఒక్కసారి ఆ స్వామిరూపము మనసులో స్థిరమైన తరువాత ఇతర వికారములేవీ కూడా ఆ భగవదాకారాన్ని తుడిపివేయలేవు. ఆ ఆనందమును హరించలేవు. అందుకే అన్నమయ్య మధురభ్కతిలో ఓలలాడి స్వామి రూపమును దర్శించి తనలోనే నిలుపుకొని మోక్షమును పొందారు. ఆయన ఆనందం శాశ్వతం. ఆయన శృంగార రచనలలో భగవద్రతి ప్రస్ఫుటము. అందుకే అవి పాడినప్పుడు మనకు ఏ భౌతిక స్త్రీ-పురుష రతికి సంబంధించిన వికారములు కలుగవు.

సద్గురువులు తాళ్లపాక అన్నమాచార్యుల వారి శృంగార సంకీర్తనలలో ఏమొకో చిగురుటధరమున రమణీయమైనది.  సాహిత్యం పరిశీలిద్దాం:

ఏమొకో చిగురుటధరమున యెడనెడ కస్తురి నిండెను 
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదుకదా 

కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపై తోచిన 
చెలువం బిప్పుడిదేమో చింతింపరె చెలులు
నలువున ప్రాణేశ్వరుపై నాటిన యా కొనచూపులు
నిలువుగ పెరకగ నంటిన నెత్తురు కాదుగదా

ముద్దియ చెక్కుల కెలకుల ముత్యపు జల్లుల చేర్పుల
వొద్దికలాగు లివేమో ఊహింపరె చెలులు
గద్దరి తిరు వేంకటపతి కామిని వదనాంబుజమున 
అద్దిన సురతపు చెమటల అందము కాదుగదా

ఏమో! అలమేలుమంగ లేతపెదవిపై అక్కడక్కడ కస్తూరి నిండియున్నది. ఆ ఇంతి స్వామికి వ్రాసిన పత్రిక కాదు కదా? చెలులారా! చకోరపక్షి వలె అందమైన కనులుగల అలమేలుమంగ కంటి చివరలు కెంపులవలె ఎర్రగా తోచుచున్న ఈ అందమిప్పుడిదేమిటో ఆలోచించండి.అందముగా ప్రాణేశ్వరునిపై నాటిన ఆ కంటి కొన చూపులు నిలువుగా స్వామిని పెరికినప్పుడు  అంటిన రక్తం కాదు కదా? ముద్దైన చెక్కిలి పక్కభాగములు ముత్యాల జల్లువలె అందముగా అనురాగముతో ఒప్పినవివేమో ఊహించరే! నేర్పరి అయిన శ్రీవేంకటేశ్వరుడు తాను వలచిన అలమేలుమంగ యొక్క కలువవంటి ముఖముపై రతితో అద్దిన స్వేదబిందువుల అందము కాదు కదా?

విభుడైన శ్రీవేంకటేశ్వరునితో సంగమించిన తరువాత అలమేలుమంగ  రూపురేఖలను వర్ణించే అద్భుతమైన శృంగార సంకీర్తన ఇది. అమ్మవారి చెలికత్తె ఇతర చెలులతో పలికే వర్ణనగా అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తనను ఆవిష్కరించారు. స్వామితో రమించిన తరువాత పద్మావతీదేవి లేత పెదవులపై గల కస్తూరిని ఆమె స్వామికి రాసిన పత్రికతో పోల్చారు వాగ్గేయకారులు.  జింకనుండి లభించే ఒక సుగంధము కస్తూరి. ఈ కస్తూరిని తిరుమలలో స్వామి నిత్యపూజలో ఉపయోగిస్తారు. ఆ కస్తూరి స్వామినుండి అమ్మకు అంటగా అది ఆమెకు స్వామిపై గల భావనలను తెలిపేలా ఆమె అధరాలపై నిండి ఉంది అని మనోజ్ఞంగా అన్నమాచార్యుల వారు మనకు తెలియజేస్తున్నారు. ఇది మధురభక్తిలో ఒక లక్షణం. ఆ నాయికా నాయకుల రతిలో పదునైన చూపులతో పెరకినప్పుడు వచ్చే నెత్తుటి చాయలను నాయిక యొక్క కంటిచివరలో గల ఎరుపుదనానికి సామ్యము చూపారు అన్నమయ్య. రతికేళిలో ఇది భౌతికంగా తోచినా మధురమైన భావన కాబట్టి అది పవిత్రంగా నిలచింది. అలాగే,  నాయిక చెంపల పక్క భాగాలు ముత్యాల జల్లులా మెరుస్తున్నాయి అన్న భావనను స్వామితో రతిలో ఆయన అద్దిన చెమట బిందువులతో సారూప్యం చూపారు.

ఈ సంకీర్తన మధురభక్తికి నిఘంటువు. నాయికా నాయకుల మధ్య  జరిగిన మధురమైన సంగమం యొక్క ఆనవాళ్లను నాయిక ముఖముపై గల రకరకాల లక్షణాలతో పోలిక చేయటం. ఇది కేవలం భావన మాత్రమే అయినా వాగ్గేయకారులు తమను తాము నాయికగా ఊహించకుంటే ఆ భావనలు పదప్రవాహంలో ఇంత అందంగా జాలువారవు. శ్రీవేంకటేశ్వరుని నమ్ముకొన్న మధురభక్తుడు అన్నమాచార్యులవారు. లక్ష్మీదేవి నుండి గోపిక వరకు గల అన్ని నాయిక పాత్రాలు ఆయనవే. చివరకు చెలికత్తె కూడే తానెయై ఈ సంకీర్తనను అందించారు.

అన్నమాచార్యుల వారి ఈ సంకీర్తనను మొట్టమొదట తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీవేంకటేశ్వర గీతమాలిక అనే ఆల్బంలో ప్రఖ్యాత భక్తి సంగీత గాయని, అన్నమయ్య మానస పుత్రిక, అన్నమయ్య పదకోకిల పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారు ఎంతో భావ సౌందర్యంతో, మధురభక్తితో ఆలపించారు. ఒక భక్తి సంగీత కళాకారునికి రససిద్ధి ఎంత ముఖ్యమో శోభారాజు గారు అన్నమయ్య సంకీర్తనలు విన్నప్పుడు అర్థమవుతుంది. అలమేలుమంగకు చెలికత్తెగా ఆ తల్లి స్థితిని అన్నమయ్య కళ్లకు కట్టినట్లు వర్ణిస్తే, ఆ భావాన్ని ఎంతో మృదువుగా, భగవద్రతితో శోభారాజు గారు ఆలపించారు. ఈ సంకీర్తన ఆరంభం ఆలాపనలోనే గాయని సన్నివేశానికి సముచితమైన సందర్భాన్ని ఆవిష్కరించారు. అలమేలుమంగమ్మకు స్వామితో కలిగిన మధురమైన రతి తరువాత ఎటువంటి మానసిక శారీరిక స్థితిలో ఉన్నారో ఈ గీతాలాపనలో శోభారాజు గారు మనకు రమణీయంగా పాడి వినిపించారు. చిగురుటధరము ఎంత మృదువుగా ఉంటుందో ఆ భావనను తన గానంలో ఒలికించారు శోభారాజు గారు.

అలాగే అలమేలుమంగ స్థితిని వర్ణిస్తున్న చెలికత్తె మనోభావాన్ని, చెలులకు చేసే విన్నపాన్ని శోభారాజు గారు చరణాలలో ఎంతో భావగర్భితంగా ఆలపించారు. మొదటి చరణంలో చెలువంబిప్పుడిదేమో చింతించరె చెలులు అన్న పదాలను, అలాగే నలువున ప్రాణేశ్వరుపై అన్న చోట ప్రత్యేకమైన ఆలాపనతో సన్నివేశానికి ప్రాణం పోశారు. తదుపరి పంక్తిలో ఉపమానాన్ని ఎంతో సున్నితంగా ఉచ్చరించి రాగయుక్తంగా ఆలపించారు.

శోభారాజు గారు అన్నమాచార్యుల వారి సాహిత్యంలోని లాలిత్యాన్ని, మాధుర్యాన్ని శాస్త్రీయ సంగీతంతో మేళవించి, ఎక్కడా ఆ సున్నితత్వం కోల్పోకుండా ఆలపించారు. అది వారి ప్రత్యేకత. శాస్త్రీయత పేరుతో భావాన్ని వెనక్కునెట్టి గమకాలతో పాడితే ఆ సంకీర్తనకు న్యాయం చేకూర్చినట్లు కాదు అన్నది నాకు వారి ఈ గీతాలాపనలో అందిన సందేశం. ఈ గీతాలాపనలో మరొక ప్రత్యేకత చరణాల మధ్య గల జతులు. నాయికా నాయకుల వృత్తాంతాన్ని ఆవిష్కరించే భావం కాబట్టి ఈ సంకీర్తన నృత్య ప్రదర్శనలకు ఎంతో అనువైనది. స్వామి, అలమేలుమంగలను మార్చి మార్చి భావానికి ఉపయుక్తంగా ప్రదర్శించటంలో నృత్యకళాకారిణి తన ప్రతిభను ఎంతో అందంగా ప్రకటించ వచ్చు. ఈ గీతాలాపనలో వీణావాదనం, గజ్జెల శబ్దము, తబలా వాద్య సహకారములతో లలితమైన సంగీతాన్ని అంతే లలితమైన శోభారాజు గారి ఆలాపనకు కూర్చారు స్వరకర్త. అలాగే రెండవ చరణంలో కామిని వదనాంబుజమున అద్దిన సురతపు చెమటల అన్న చోట సాహిత్యంలోని సందేశాన్ని, సందర్భాన్ని పరిపూర్ణమైన భావానుభూతితో ఆలపించారు శోభారాజు గారు. సంకీర్తన చివరలో ఆరంభానికి సరిపడే ఆలాపనతో ముగించారు. భావాన్ని నిర్మలంగా పాడగలిగే గాయని శోభారాజు గారు. అందుకే ఈ సంకీర్తన వారి గళంలో ఎంతో సుందరంగా పలికింది. అన్నమాచార్యుల వారి తత్త్వాన్ని సమాజశ్రేయస్సు కోసం ప్రచారం చేస్తున్న డాక్టర్ శోభారాజు గారికి ఇంత చక్కని సంకీర్తనను అందించినందుకు కృతజ్ఞతలు.

ఈ సంకీర్తన ఈ లంకెను  క్లిక్ చేసి, కీర్తనను ఎంచుకొని ప్లే చేసి వినండి. 

18, సెప్టెంబర్ 2015, శుక్రవారం

శ్రీగణనాథం భజరే చిత్త పరాశక్తి యుతంశ్రీగణనాథం భజరే చిత్త పరాశక్తి యుతం

నాగ యజ్ఞ సూత్ర ధరం నాద లయానంద కరం

ఆగమాది సన్నుతం అఖిల దేవ పూజితం
యోగిశాలి భావితం భోగిశాయి సేవితం

రాగద్వేషాది రహిత రమణీయ హృదయ విదితం
శ్రీగురుగుహ సమ్ముదితం చిన్మూల కమలస్థితం

"ఓ మనసా! సకల గణములకు అధిపతియైన, ఆదిపరాశక్తితో యున్న వినాయకుని భజించుము

సర్పమును యగ్జోపవీతముగా ధరించిన వానిని, నాదమును, లయమును ఆనందకరముగా చేయువానిని భజించుము.

వేదములలో నుతించబడిన వానిని, సమస్త దేవతలచే పూజించబడిన వానిని, యోగులలో ఉత్తమునిగా భావించబడిన వానిని, శ్రీమహావిష్ణువుచే సేవించబడిన వానిని, రాగద్వేషములకు అతీతమైన, అందమైన హృదయములలో అగుపించేవానిని, సుబ్రహ్మణ్యునికి ఆనందం కలిగించే వానిని, చిత్ యొక్క మూలమనే కమలములో నివసించే వినాయకుని భజించుము. "

ముత్తుస్వామి దీక్షితులు పరదేవతానుగ్రహంతో ఆ తల్లిపైనే కాకుండా, సమస్త దేవతలపైనా అద్భుతమైన మంత్ర సమానమైన కృతులను రచించారు. వాతాపి గణపతిం భజే లో విఘ్నేశుని తత్త్వాన్ని పరిపూర్ణమైన ఆధ్యాత్మిక వికాసంతో ఆవిష్కరిస్తే ఈ శ్రీ గణ నాథం భజరే లో దాని యొక్క సూక్ష్మ రూపాన్ని ప్రతిపాదించారు.

గణపతి జ్ఞానమునకు, బుద్ధి వికాసానికి, అష్టైశ్వర్య సిద్ధికి ప్రతీక అని మనం ఇహములో భావించితే దేహములో మూలాధార చక్రమందు నిలిచే దేవతా స్వరూపమని ఈ కృతిలో ప్రస్తావించారు. పరాశక్తితో కూడి ఉండే గణపతికి ఒక ప్రత్యేకత ఉంది. శ్రీవిద్యా చిద్భవానందుడు అని గణపతికి పేరు. ఆ పరాశక్తి చిత్ నుండి ఆమె ఆనందముగా ఉన్నప్పుడు ఉద్భవించినాడు గనుక ఆమెలోని సచ్చిదానందమునకు గణపతి ప్రతీక. తల్లీ బిడ్డలుగా కన్నా సమస్త జగత్తునందు వ్యాపించి యున్న ఆదిపరాశక్తి, ఆ శక్తిలోని మూలము గణపతిగా భావించితే ఆ గణపతి-పరాశక్తిలను వినాయక చవితితో పాటు దీపావళి వంటి పండుగలలో పూజించే ఆనవాయితీ ఎందుకు వచ్చిందో అర్థమవుతుంది. కన్నడ దేశంలో వినాయక చవితిని గౌరీగణేశుల పూజగా వైభవంగా జరుపుకుంటారు. ఈ సాంప్రదాయం ఇతర ప్రాంతాలలో కూడా అనాదిగా ఉంది.

దీక్షితుల వారు ఈ నిగూఢమైన రహస్యాన్ని తన గణపతి కృతులలో ఇనుమడింపజేశారు. నాగయజ్ఞ సూత్రధరం నాదలయానందకరం అని అనటంలో పరమేశ్వరుని వైభవాన్ని గణపతి ఎలా పొందాడో మనకు తెలియజేసే ప్రయత్నం చేశారు కృతికర్త. శంకరుని శక్తితో నాదము, లయములో మనకు కలిగే ఆనందానికి కారకుడు గణపతి. అంటే మనలో ఆయా నాడులను ప్రేరితం చేసి మనలను ఆ దివ్యనాదహేలను రమించేలా చేయువాడు అని అర్థం. ఎంత అద్భుతమైన భావమో చూడండి. వేదములలో నుతించబడిన వాడు, అంటే? సనాతనుడు. వేదములకు ఆద్యంతములు లేవు. కాబట్టి ఆయన శాశ్వతుడు. సమస్త గణములకు అధిపతిగా ఊరకే నియమించబడలేదు. ఆది దంపతుల శక్తి ఏకమై గణపతిరూపంలో ఆవిర్భవిస్తే ఆ రూపము గణములకు అధిపతిగా ఉపయుక్తమైంది. ఆ పార్వతీ పరమేశ్వరుల పట్ల అపారమైన భక్తి కలిగిన గణపతి ఏ విధంగా నారాయణ మంత్రాన్ని జపించి గణాధిపత్యం పొందాడో మనందరికీ తెలిసిందే. ఆదిపరాశక్తి చిత్ నుండి ఉద్భవించిన వాడు, శంకరుని మూలాధారమందు నివసించువాడు కాబట్టే ఉత్తమమైన యోగిగా భావించబడ్డాడు. ఇంతటి యోగి రాగద్వేషములకు అతీతమైన వాడు, అందమైన హృదయములలో కనిపించేవాడు అని దీక్షితులవారు తరువాతి సాహిత్యంలో నుతించారు. అఖరి పంక్తిలో శ్రీగురుగుహ సమ్ముదితం చిన్మూల కమలస్థితం అని ఆయన ప్రస్తుతించారు. ఇక్కడ గురుగుహుడంటే ఆయన ముద్ర కాబట్టి తనకు ఆనందాన్ని కలిగించినవాడు అని అర్థం గోచరించినా, అసలు విషయం కార్తికేయునికి ఆనందం కలిగించినవాడు అని అర్థం. శరీరంలో నడుము క్రింది భాగాన ఉన్న మూలాధార చక్రమునకు అధిదేవత గణపతి. ఈ చక్రము కళంకములేని, నిర్మలమైన, అప్పుడే పుట్టిన బాలుని యొక్క ఆనంద స్థితిని సూచిస్తుంది. సరైన విధంలో జాగృతమైతే రాగద్వేషములకు అతీతమైన జ్ఞానమును కలిగిస్తుంది. ఇదీ గణపతి తత్త్వం. నాలుగు రేకుల కమలంలో 'లం' అనే బీజాక్షరంతో గణపతి ఈ మూలాధార క్షేత్రంలో నివసిస్తాడు.

దీక్షితులవారు కృతులలో దేవతామూర్తి లక్షణాలు, యంత్ర మంత్ర సారములు చాల సూక్ష్మంగా, పవిత్రంగా అవిష్కరించారు. ఈశమనోహరి రాగంలో కూర్చబడిన శ్రీగణనాథం భజరే గణపతి వైభవాన్ని ఇదే లక్షణాలతో రచించబడింది. పిల్లలు నేర్చుకుని పాడేలా ఈ కృతి సాహిత్యం మరియు స్వరాలు ఉంటాయి.

యూట్యూబ్ వీడియో వీక్షించండి.

14, సెప్టెంబర్ 2015, సోమవారం

పాప్ సంగీత మహారాణి - ఉషా ఊతుప్


నిండైన విగ్రహం, పెద్ద అంచు కంచిపట్టు చీర, నుదుటన రూపాయి బిళ్లంత పెద్ద బొట్టు,కళ్లకు కాటుక,మెడలో నగలు, చేతులనిండా గాజులు, చక్కగా అల్లుకున్న జడ, తలలో బోలెడు మల్లెపూలు,ఎక్కడున్నా గుర్తుపట్టే చక్కని నవ్వు...ఏవండోయ్ పాతసినిమాల్లో కథానాయికో లేక ఏ ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారో అనుకొని పొరబడేరు...ఆవిడ పాడితే సింహం గర్జించినంతలా నినదిస్తుంది, ఆవిడ పాటలో మధువొలుకుతుంది, ఆవిడ ఉత్సాహం చూస్తే పదహారేళ్ల పడుచు పిల్లా అనిపిస్తుంది. ఆవిడ పేల్చే ఛలోక్తులకు, కనబరచే సమయస్ఫూర్తికి ప్రేక్షకులు పొట్టలు చెక్కలయ్యేలా నవ్వి కరతాళ ధ్వనులతో హాలు మారు మ్రోగాల్సిందే. ఆవిడ వైవిధ్యానికి ప్రతిబింబం, సాంప్రదాయానికి దర్పణం...భారతీయ సంగీత సామ్రాజ్యంలో తొలి పాప్ మరియు జాజ్ సంగీత గాయని శ్రీమతి ఉషా ఊతుప్ గారి గురించి మాట్లాడుతున్నానండీ...

ఇప్పుడే ఆవిడ రెండు గంటలు ఏకధాటిగా పాడిన కచేరీ నుండి బయట పడ్డానండీ. బయట చల్లని గాలి, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. నా చెవులలో తుప్పు వదిలిపోయింది. నా చిన్ననాటి ఉత్సాహంతో మనసు నాట్యం చేసింది. రెండు గంటలపాటు నన్ను నేను మరచిపోయాను. శిల్పకళావేదికలో కూర్చున్న వేలాదిమంది లయబద్ధంగా ఆవిడ తో కలిసి జోష్ గా పాడారు.

ఒకటా రెండా? దాదాపు 50 ఏళ్ల సంగీత ప్రస్థానం పద్మశ్రీ బిరుదు పొందిన ఉష ఊతుప్ గారిది. తమిళ కుటుంబంలో ముంబాయిలో పుట్టి, కేరళీయుడిని వివాహం చేసుకొని, బెంగాలులో స్థిరపడిన విశేష గాయన ఆవిడ. సినీ సంగీతంలో ఎన్నో పాప్ మరియు ఉరకలెత్తించే పాటలు పాడటంతో పాటు ఈ ప్రపంచంలో శాంతి, సౌభ్రాతృత్వము, ప్రేమ, సహనం మొదలైన వాటికోసం తన సంగీతం ద్వారా ఎన్నో సేవలందిస్తున్నారు. ఆవిడ పాట మొదలు పెట్టగానే చిన్నా పెద్దా వయసు తేడా లేకుండా, ఆడా మగా ఆలోచన లేకుండా అందరూ నాట్యం చేసేంతగా ఆ గానం ఉత్తేజపరస్తుంది.

ఐ బిలీవ్ ఇన్ మ్యూజిక్ అన్నది ఆవిడ నినాదం. అవధుల్లేని ఆనందాన్ని కలిగించటానికి తన జీవితం చేశానని ఆవిడ చెప్పిన మాటలు కచేరీలలో ఆవిడ పాట శైలి గమనిస్తే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరిలోనూ ఒక గాయకుడు ఉన్నాడు. ఆ గాయకుడు తన సంకోచాన్ని విడిచి హాయిగా పాడితే ఒత్తిడి తొలగి శాంతి చేకూరుతుంది అన్న భావాన్ని విశ్వసించి ప్రేక్షకులను తనతో పాటు పాడించి ఆ కార్యక్రమాన్ని ఒక కుటుంబ గానంలాగా చేస్తారు ఉషా ఊతుప్ గారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు, సామాజిక సేవా సంస్థలకు, ప్రకృతి వైపరీత్యాలకు విరాళాల సేకరణకు ఆవిడ గత నలభై ఏళ్లుగా కచేరీలు చేస్తూనే ఉన్నారు.

68 ఏళ్ల వయసులో ఏ మాత్రం గాత్రధర్మం తగ్గని స్వరపేటిక ఆవిడది. 2012 సంవత్సరంలో సాత్ ఖూన్ మాఫ్ అన్న చలన చిత్రానికి ఆమెకు ఫిలింఫేర్ ఉత్తమ నేపథ్యగాయని పురస్కారం లభించింది. 1970, 80 దశకాలాలో ఆమె ఎన్నో హిందీ చలన చిత్ర గీతాలు పాడారు. వాటిలో హరే రామ హరే కృష్ణ చిత్రంలోని హరే రామ హరే కృష్ణ, డిస్కో డ్యాన్సర్ చిత్రంలోని కోయి యహా నాచె నాచె, అర్మాన్ చిత్రంలోని రంబా హో, ప్యార్ దుష్మన్ చిత్రంలో హరి ఓం హరి, షాలిమార్ చిత్రంలో వన్ టూ చ చ చ, షాన్ చిత్రంలో దోస్తో సే ప్యార్ కియా లాంటి ఎన్నో ప్రాచుర్యం పొందిన పాటలు ఉన్నాయి. ఇవే కాక ఎన్నో ప్రైవేట్ ఆల్బంలు ఎన్నో భారతీయ భాషలలో చేశారు.

ఏ భాషలో పాడితే ఆ భాష ప్రజలు ఆమెకు అభిమానులయ్యారు. సంగీతానికి భాష కుల మత ప్రాంతీయ భేదాలు లేవని నిరూపించారు. ఇతర గాయకులకు భిన్నంగా పాశ్చాత్య సంగీతాన్ని భారతీయతతో కలబోసి, భారతీయతకు పట్టం కట్టి సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసిన అరుదైన మహిళ ఉషా ఊతుప్ గారు. భారతీయ స్త్రీని ఒక బలమైన శక్తిగా, ఉత్సాహవంతమైన మూర్తిగా, పరిపూర్ణమైన కళాకారిణిగా ప్రపంచానికి ఆవిష్కరించడంలో ఉషా ఊతుప్ గారి పాత్ర ఎంతో ముఖ్యమైనది. భగవంతుడు ఆమెకు ఈ సేవాభాగ్యాన్ని ఎప్పటికీ కొనసాగించాలని ప్రార్థన.  

13, సెప్టెంబర్ 2015, ఆదివారం

బ్రోచేవారెవరురా? నిను వినా రఘువరా!


బ్రోచేవారెవరురా? నిను వినా రఘువరా!

ఓ చతురాననాది వందిత నీకు పరాకేలనయ్యా!
నీ చరితము పొగడలేని నా చింత దీర్చి వరములిచ్చి వేగమె నను

సీతాపతే! నాపై నీకభిమానము లేదా?
వాతాత్మజార్చితపాద! నా మొరలను వినరాదా?
ఆతురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవె కదా
పాతకమెల్ల పోగొట్టి గట్టిగ నా చేయి పట్టి విడువక నను 

మైసూర్ వాసుదేవాచార్యుల వారు 20వ శతాబ్దపు వాగ్గేయకారులలో ప్రముఖులు. త్యాగరాజస్వామి వారి శిష్యపరంపరకు చెందిన వీరు మైసూరులో జన్మించినా సింహభాగం కృతులు తెలుగు సంస్కృత భాషలలోనే రచించారు. పట్నం సుబ్రహ్మణ్య అయ్యరు వద్ద సంగీతం నేర్చుకొని మైసూరు మహారాజుల సంస్థానంలో విద్వాంసులుగా ఎంతో పేరొందారు వీరు. వీరి కృతులలో బ్రోచేవారెవరురా ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. మైసూరు మహారాజా జయచామరాజ వడయార్ రచించిన ఎన్నో కీర్తనలకు ఆయన సంగీతం కూర్చారు. ఆయన సంస్కృతంలో, కర్ణాటక సంగీతంలోఎంతటి విద్వాంసుడో అంతే వినయ సంపన్నుడు. ఆయన తన చివరి సంవత్సరాలను చెన్నై రుక్మిణీదేవి అరుండేల్ కళాక్షేత్రలో గడిపారు. అక్కడ ఒకసారి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు వచ్చి బ్రోచేవారెవరురా కీర్తన అద్భుతంగా గానం చేస్తే "నేను నా కూతురని గుర్తు పట్టలేదు, ఇంత అందంగా ఆభరణాలతో అలంకరించుకొని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గళంలో వస్తే..." అన్నారుట.200కు పైగా కృతులను రచించిన ఆయన అభినవ త్యాగరాజుగా పిలువబడ్డాడు. తన ముద్రగా 'వాసుదేవ' అనే పదాన్ని ఉపయోగించారు.  బ్రోచేవారెవరురా అనే కృతిలో ఆయన రాముని ఇలా వేడుకుంటున్నారు:

"ఓ శ్రీరామా! నువ్వు కాక నన్ను కాపాడేవారు ఎవ్వరు? ఓ బ్రహ్మాది దేవతలచే పూజించబడిన రామా! నీకు పరాకు ఎందుకు? నీ వైభవాన్ని పొగడలేను నేను. నా చింతలను తీర్చి, వరాలిచ్చి త్వరగా నన్ను బ్రోవుము!

ఓ సీతాపతీ! నీకు నాపై అభిమానము లేదా? ఓ హనుమంతునిచే కొలువబడిన పాదాములు కలవాడా! నా ప్రార్థనల్ను వినుము! ఆ గజేంద్రుడు ప్రార్థించగానే ఆత్రముగా వచ్చి బ్రోచిన శ్రెహరివి నీవు కదా! నా పాపాలన్నిటినీ పోగొట్టి నా చేయిని గట్టిగా పట్టుకొని నన్ను విడువకుము!"మానవుడు శరీరంలో శక్తి, వయసు ఉన్నంత కాలం అహంకారం విర్రవీగి భగవంతుడు గుర్తుకు రాడు. కష్టాలు ఎదుర్కొన్నప్పుడు, శరీరం క్షీణించినప్పుడు, ధైర్యము కోల్పోయినప్పుడు పరమాత్మను తలచుతాడు. దీనికి చక్కని ఉదాహరణ భాగవతంలోని గజేంద్ర మోక్షం. మదగజం ఆడ ఏనుగులతో సరససల్లాపాలాడుతూ సరస్సులో క్రీడిస్తుండగా స్థానబలిమి కలిగిన మొసలి ఆ కరిరాజు కాలిని పట్టిన సన్నివేశంలో ఆ ఏనుగు శరీరంలో శక్తిని నశించి, ప్రాణములు పట్టుకోల్పోయి, మూర్ఛ వచ్చే పరిస్థితులలో పరమాత్మను దీనంగా ప్రార్థిస్తాడు. అపుడా అ హరి పరుగు పరుగున వచ్చే సన్నివేశాన్ని మహాకవి  పోతన ఎంతో అద్భుతంగా వివరించారు:

సిరికింజెప్పడు శంఖచక్రయుగముం జేదోయి సంధింపడే
పరివారంబును జీరడభ్రగపతిం బన్నింపడాకర్ణికాం
తరధమ్మిల్లము జక్కనొత్తడు వివాదప్రోత్థిత శ్రీకుచో
పరిచేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై

"గజేంద్రుని ప్రాణములను రక్షింపవలెనను ఉత్సాహము ఉరకలు వేస్తుండగా ఆ శ్రీహరి, శ్రీదేవికైన చెప్పడు, శంఖచక్రములను ధరించడు, అనుచరులనెవ్వరిని పిలువడు, పక్షిరాజైన గరుడుని సిద్ధపడుమని తెలుపడు. చెవుల వరకు జాలువారిన కేశములనైనను సవరించడు. తనవ్రేళ్లకు చుట్టుకొనిన శ్రీదేవి యొక్క పైటచెంగును కూడా విడిచి పెట్టకుండా అట్లే లేచి వడి వడిగా ఆకాశ మార్గమున నడచి పోసాగెను"

ఆ విధంగా హరి వచ్చి మకరిని చక్రంతో సంహరించి కరిని కాపాడుతాడు. ఈ ఘట్టాన్ని కృతికర్త బ్రోచేవారెవరురాలో ప్రస్తావించారు. వాగ్గేయకారులు మన శ్రుతి స్మృతి పురాణాలను తమ సంకీర్తనలలో ప్రస్తావించటం వారి సనాతనధర్మ బద్ధతను, జ్ఞానాన్ని సూచిస్తుంది. వాసుదేవాచార్యుల వారి రచనా శైలి భక్తిమార్గాన్ని ప్రబోధించే భాగవతంలోని భక్తుల శైలికి సారూప్యత కలిగింది. గజేంద్రుని శ్రీహరి కాపాడిన వృత్తాంతము దాదాపుగా ప్రతి వాగ్గేయకారుడూ ప్రస్తావించాడు. త్యాగరాజ స్వామి తన కృతులు 'మరి మరి నిన్నే', 'ఈ మేను కలిగినందుకు ', 'మురిపెము కలిగ గద ', రామదాసు 'ఏమయ్య రామ ', 'పాహిమాం శ్రీ రామా ' అన్న కీర్తనలలో,  అలాగే అన్నమాచార్యుల వారు ఎన్నో సంకీర్తనలలో  దీనిని ప్రస్తావించారు. కారణం - అందులో జీవి ప్రవృత్తి, పరమాత్మ కరుణ చాలా అద్భుతంగా వివరించబడటం వలన. సారాంశం - వాసనలు తొలగి, వికారములు నశించి, భక్తితో కూడిన శరణాగతితో ప్రార్థించినపుడు పరమాత్మ తప్పక అనుగ్రహిస్తాడు. మన సంకల్ప లోపము, ప్రయత్న లోపము తప్ప ఆయన అనుగ్రహానికి లోపమే లేదు. బ్రోచేవారెవరురా అని ఇంత అద్భుతంగా నుతించిన వాసుదేవాచార్యుల వారిని కూడా శ్రీరాముడు అలాగే అనుగ్రహించాడు.

ఎందరో మహానుభావులు అందరికీ వందనములు!

ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి గళంలో బ్రోచేవారెవరురా.

10, సెప్టెంబర్ 2015, గురువారం

శ్రీనాథుని చాటు పద్యాలు - పల్నాడు విశేషాలుకవులు దేశకాలమాన పరిస్థితులను, ప్రజల సామాజిక పరిస్థితులను తమ రచనలలో వివరించి ఉండకపోతే మనకు వారసత్వంగా ఏమీ మిగిలేదు కాదు. అన్నీ కాలగర్భంలో నామరూపాలు లేకుండా పోయేవే. పల్నాడు చరిత్ర శ్రీనాథుని రచనల ద్వారా మనకు శాశ్వతమైంది.

శ్రీనాధుడు కవిసార్వభౌముడు అన్న బిరుదు పొందిన గొప్ప కవి. కాకపోతే తన కృతులను అశాశ్వతమైన రాజులకు సమర్పించి, వారి మెప్పు కోసం రచనలు చేసి, భోగభాగ్యాలు అనుభవించి ఆ రాజులు అంతరించాక గర్భదారిద్ర్యంలో పన్నులు కట్టలేక దుఃఖిస్తూ మరణించాడు.

నాగార్జునసాగర్ డాం దిగువ దక్షిణ భాగాన గల గుంటూరు జిల్లాలోని కొంత భాగాన్ని పల్నాడు అంటారు. పొందుగుల, మాచర్ల, వెల్దుర్తి, గురజాల, రెంటచింతల, పిడుగురాళ్ల, గుత్తికొండ,కారంపూడి మొదలైన ప్రాంతాలు పల్నాడుగా పరిగణించబడతాయి. పల్లవరాజులు పాలించిన ప్రాంతం కాబట్టి పల్లవనాడు, అది రూపాంతరం చెంది పల్నాడుగా ప్రసిద్ధి చెందింది. సున్నపు రాళ్లు, మండే ఎండలు, తుమ్మ చెట్లు...అప్పట్లో సాగు నీటి వ్యవస్థ లేక వెనుకబడిన ప్రాంతంగా ఉండేది. ప్రబంధకవి శ్రీనాథుడు ఇక్కడి చరిత్రను పల్నాటి వీరచరిత్రగా అద్భుతంగా రచించాడు.

దాయాదులైన నలగామ రాజు, మలిదేవ రాజుల మధ్య జరిగే పోరాటం ఈ పల్నాటి వీరచరిత్ర ఘట్టం. పల్నాటి వీరులైన బ్రహ్మనాయుడు, బాలచంద్రుడు, నాయకురాలు నాగమ్మ మొదలగు వారి ఈ యుద్ధంలో పాల్గొంటారు. పల్నాడులోని కారంపూడి (కార్యమపూడి ఈ విధంగా రూపాంతరం చెందింది) ఈ యుద్ధానికి రణభూమి. ఎందరో వీరులు ప్రాణాలు కోల్పోయి వంశాలు నశించిపోతాయి ఈ యుద్ధంలో.

ఇటువంటి సీమలో శ్రీనాథుడు విస్తృతంగా పర్యటించాడు. అక్కడి ప్రజల పేదరికాన్ని చాటు పద్యాలలో రచించారు.
జొన్న కలి, జొన్న యంబలి, 
జొన్నన్నము, జొన్న కూడు, జొన్నలె తప్పన్
సన్నన్నము సున్న సుమీ
పన్నుగ పల్నాటి సీమ ప్రజలందరకున్!

కలి అంటే ఈనాటి వారికి తెలియకపోవచ్చు. బియ్యాన్ని కడుగగా వచ్చిన నీటిని పులియబెడితే దానికి కలి అంటారు. పేదలకు బియ్యం ఎక్కడ? అందుకని ఆ కలికి కూడా జొన్నలే, గంజి కూడా జొన్నలదే, అన్నము కూడా జొన్నలతో వండినదే. ఏది తిన్నా జొన్నలతోనే అక్కడ దొరికింది. పల్నాటి సీమలో ప్రజలందరికీ సన్నబియ్యముతో అన్నము దొరకనే లేదుట.

చిన్న చిన్న రాళ్లు చిల్లర దేవళ్లు
నాగులేటి నీళ్లు నాపరాళ్లు
సజ్జ జొన్న కూళ్లు సర్పంబులును దేళ్లు
పల్లెనాటి సీమ పల్లెటూళ్లు

చిన్న రాళ్లతో ఇళ్లు, వైభవంలేని దేవస్థానాలు, నాపరాళ్లు, నాగులేరు నీళ్లు, సజ్జలు, జొన్నల అన్నము, పాములు, తేళ్లతో ఉన్నాయిట పల్నాటిలోని పల్లేటూళ్లు. నాగులేరు దాచేపల్లి దగ్గర ఇప్పటికీ చూడవచ్చు. ఇక్కడ నాయకురాలు నాగమ్మ విగ్రహం కూడా ఉంది. పల్నాడులో ఇప్పటికీ చిన్న చిన్న రాళ్లతో పేర్చిన ఇళ్లు, ప్రహరీ గోడలు, పాములు తేళ్లు బాగా కనిపిస్తాయి.

రసికుడు పోవడు పల్నా
డెసగంగా రంభ యైన నేకులె వడుకున్
వసుధేశుడైన దున్నును
కుసుమాస్త్రుండైన జొన్న కూడే కుడుచున్

ఈ చాటువులో శ్రీనాథుని వ్యంగ్యాన్ని గమనించవచ్చు. రసికుడు ఈ ప్రాంతానికి రాడట, రంభ కూడా ఇక్కడ ఏకులు (నూలు వడకటానికి గింజలు తీసిన మెత్తటి పత్తి) వడుకుతుందట. పత్తి చెట్లు కూడా పల్నాటి ప్రాంతంలో బాగా కనిపిస్తాయి. రాజైనా కూడా ఇక్కడ భూములు దున్నుతాడట, మన్మథుడు కూడా ఇక్కడ జొన్న కూడే తింటాడట. వ్యంగ్యాస్త్రాలు, అతిశయోక్తి చాటు పద్యాలలో చక్కగా వ్యక్తమవుతాయి. దానికి ఉదాహరణ ఈ పద్యము.

సిరిగల వానికి జెల్లును
దరుణుల పదియారు వేల దగ బెండ్లాడన్
దిరిపెమున కిద్దరాండ్రా
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్

శ్రీనాథుని ప్రసిద్ధి చెందిన చాటు పద్యాలలో ఇది మొదటిది. పల్నాటి సీమలో నీటి ఎద్దడిని చూసి భరించలేక ఈ పద్యాన్ని వ్రాసాడు ఆయన. ఓ పరమేశ్వరా! సిరిని గల ఆ శ్రీకృష్ణునికి పదహారువేలమందిని పెళ్లాడితే చెల్లింది. బిచ్చమెత్తుకునే నీకు ఇద్దరు ఎందుకు, పార్వతి చాలు, గంగను ఈ ప్రాంతపు ప్రజల కోసము విడిచిపెట్టు అని ప్రార్థిస్తాడు.

ఇలా పల్నాటి పరిస్థితులను వివరించాడు శ్రీనాథుడు. ఇంకొన్ని పద్యాలలో కార్యమపూడిని, గురజాలను, మాచర్ల చెన్నకేశవుని గూర్చి కూడా ఆయన వర్ణించాడు. ఆ వివరాలు రెండో భాగంలో.


బాధ్యతలు - నిజాలుచెవులలో ఇయర్ ఫోన్సు, నడుముల క్రిందకు జారే జీన్సు ప్యాంటు, చేతులు లేని టీ షర్ట్, రెండు భుజాలపై ఏ రూపమో తెలియని పచ్చబొట్లు...జుట్టుకు పెయింటు వేశాడా అన్నట్లుగా నిక్కబొడిచిన వెంట్రుకలు, కాళ్లకు చెరో రంగు జోళ్లు, కళ్లకు నల్లని సన్ గ్లాసెస్.."ఓ మధూ ఓ మధూ నా మనసు నాది కాదు ఓ మధూ"....అని బన్నీ పాటను పాడుకుంటూ "మమ్మీ బై" అని చెప్పి ఇంటి బయట ఉన్న హార్లీ ఎక్కి రయ్ రయ్ అనేలా స్టార్ట్ చేసి దూసుకు వెళ్లిపోయాడు 'మ్యాడీ'. గుమ్మం ముందేమో వేంకటేశ్వర్లు, వరలక్ష్మి అని బోర్డు ఉంది,కొడుకు పేరు 'మ్యాడీ' ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? తల్లిదండ్రులు చక్కగా వేణుమాధవ అని పేరుపెడితే స్టైలుగా మ్యాడీ అని మార్చుకున్నాడు. ఇక ఈ 20 ఏళ్ల కుర్రాడి సంగతి అటుంచి, వీడి చెల్లెలు 17 ఏళ్ల సుమ దగ్గరకు వెళదాం. హమ్మయ్య పేరు మటుకు పరవాలేదండోయ్. ఊపిరి పీల్చుకున్నారా? గదిలో చూడండి. నడుము క్రింద ఒక ఆరంగుళాల వరకు బట్టలు వేసుకొని, అదే విధంగా పైన కూడా ఆచ్ఛాదన అరకొరగా వస్త్రాలున్న వీరవనితల ఫోటోలు నలుదిక్కులా..విడిచిన బట్టలు చెల్లాచెదురుగా, ఎంగిలి ప్లేటు, గ్లాసు చదువుకునే బల్లమీద. మడిమలు నాలు అంగుళాల ఎత్తుగల చెప్పులు ఎదురుగా...చెప్పనలవి కాదు ఆ గది రూపం.

ఇదీ నేటి మన కథకు వేదిక. వేంకటేశ్వర్లు ఆగర్భ శ్రీమంతుడు. తండ్రి వారసత్వంగా వచ్చిన రియల్ ఎస్టేటు వ్యాపారాన్ని మరింత వృద్ధి చేసి నాలుగు చేతులు ఆరు మెదళ్లుగా సంపాయించాడు. భార్య వరలక్ష్మి రాజకీయాల్లో ఆరితేరిన మహిళ. రాష్ట్ర మంత్రివర్గంలో సీనియర్ మంత్రి. నిరంతరం వచ్చిపోయే వారు, ఫోన్లు, ఎత్తుకు పై ఎత్తులు ఆమె దినచర్య. వేంకటేశ్వర్లు జీవితమంతా కష్టపడి ఒక 10 కోట్లు వెనకేస్తే వరలక్ష్మి రెండేళ్లలో సంపాయించింది ఆ డబ్బును. బంజారాహిల్స్ నివాసం. ఇద్దరికీ మహాభక్తి సుమా. పూజలు, వ్రతాలు, హోమాలు, ప్రపంచంలో కనీ వినీ ఎరుగని దేవుళ్ల ఉపాసనలు...

త్వరలో కొడుకు కాలేజీ చదువు పూర్తవతుంది వాడిని ఎంబీయే చదివించి తన వ్యాపారంలోకి దింపాలని తండ్రి ఆశ. కూతురును తన తరువాత ఎమ్మెల్యేగా తీర్చిదిద్దాలని తల్లి కోరిక. దీనికోసం చేయని పూజలేదు, మొక్కని దేవుడు లేడు. వీళ్లకు కనిపించని దేవుడిదే తప్పు వీళ్ల పూజలందుకోలేకపోతే అన్నట్లు ఉంటుంది వ్యవహారం. వృత్తులు వేరైనా భార్యాభర్తల ఆలోచనా విధానం ఒక్కటే. వీలైనంత సంపాదించాలి, పిల్లలకు ఇవ్వాలి, వారిని తమ వారసులుగా నిలబెట్టాలి.

"జయా! వంట ఏం చేస్తున్నావ్" అని వంటమనిషి జయను అడిగింది 80 ఏళ్ల లక్ష్మమ్మ. ఆవిడ వేంకటేశ్వర్లు తల్లి. గంజాయివనంలో తులసిమొక్క ఆవిడ. ఏం లాభం? పండుటాకులా రాలటానికి సిద్ధంగా ఉంది. కొడుకు కోడలు, మనుమడు, మనవరాలి పోకడలు చూసి కుప్పకూలిపోతుంది ఆమె హృదయం. ఎటు పరుగెడుతున్నారు వీళ్లు? డబ్బు వీళ్లను ఎంతటి హీనస్థితికి తీసుకు వచ్చింది? ఇదేనా నేను, మా ఆయన కోరుకున్నది? అని పరిపరి విధాలా ఆలోచించి ఏమీ చేయలేక దేవుడి ముందు కూర్చుని ప్రార్థించి కన్నీరు కార్చి వెళ్లి పడుకుంది.

"పెద్దమ్మ గారు, ఈరోజు పిల్లలు, అయ్యగారు అమ్మగారు బయట తింటామన్నారు. మీకు నిన్నటి కూర చారు ఉన్నాయి ఫ్రిజ్ లో. ఒక్కరి కోసం వంట ఎందుకు అని ఏమీ చేయలేదు".."మరి వంటింట్లో ఏం చేస్తున్నావే?" లక్ష్మమ్మ ప్రశ్నార్థకంగా అడిగింది. "ఆమ్లెట్ తినాలనిపించింది పెద్దమ్మ గారూ, వేసుకుని తింటున్నా"..."సొమ్మొకడిది సోకోకడిది" అని తలపట్టుకుంది ఆ అవ్వ.

రియల్ ఎస్టేట్ వ్యాపారులు మంత్రిగారితో మీటింగులో ఉన్నారు. వేంకటేశ్వర్లు మంత్రిగారితో దీర్ఘ సమాలోచనలో ఉన్నాడు. ఫోను నాలుగైదు సార్లు మ్రోగింది. కొత్త నెంబరు అని పట్టించుకోలేదు. ఒక గంట తరువాత తల్లి లక్ష్మమ్మ నుండి ఫోన్. ఎత్తాడు. ఆవిడా రోదిస్తూ "ఒరేయ్ వేంకటేశ్వర్లూ...మన మాధవ అపోలో హాస్పిటల్ లో ఉన్నాడుట. వేగంగా వెళుతూ ఉంటే లారీ గుద్దిందిట"..ఫోన్ పెట్టేసింది.  హతాశుడైనాడు వేంకటేశ్వర్లు. పరుగు పరుగున అపోలో హాస్పిటల్ చేరుకున్నాడు. భార్యకు ఫోన్ చేస్తే దొరకలేదు. విమాన ప్రయాణంలో ఉంది. పిల్లాడు స్పృహలో లేడు. "సార్! మీ అబ్బాయి హెల్మెట్ పెట్టుకోలేదు. పగలు పూటే తాగి బండి అతి వేగంగా నడుపుతున్నాడు. లారీని చూసుకోలేదు మలుపు దగ్గర. వెళ్లి గుద్దేశాడు...తలకు బలమైన గాయం తగిలింది..48 గంటల వరకు ఏమీ చెప్పలేము" అన్నాడు ఎమర్జెన్సీ డాక్టర్.

వరలక్ష్మి రెండు గంటల తరువాత ఆసుపత్రికి చేరుకుంది. భార్యను చూసి గట్టిగా ఏడ్చేశాడు వేంకటేశ్వర్లు. ఇంతలో వరలక్ష్మికి ఫోను. "మేడం..క్షమించాలి..మీకు నేరుగా ఫోన్ చేస్తున్నాను. మీ అమ్మాయి కాలేజీకి మూడు నెలలుగా సరిగ్గా రావట్లేదు. ఎవరో అబ్బాయితో బయట కనిపించిందని వేరే స్టూడెంట్స్ చెబుతున్నారు. మొదటి సంవత్సరం ఫెయిల్ అయ్యింది. ఆ పరీక్షలు కూడా రాయలేదు. పిల్ల ఆరోగ్యంగా కూడా కనిపించటం లేదు..ఇలా అయితే అమ్మాయి భవిష్యత్తు..." ఫోన్ పెట్టేసింది వరలక్ష్మి.

కళ్లెదుట జరుగుతున్నది ఏమిటో అర్థం కాలేదు. తమ కలలు కరిగిపోతున్నాయా అని ఆలోచనలో పడ్డారు ఆ దంపతులు. ఇంటికి వచ్చారు. లక్ష్మమ్మ దిగాలుగా కూర్చొని ఏడుస్తోంది. కొడుకు కోడలిని చూసింది. దగ్గరకు వెళ్లి "మీ ఇద్దరితో నేను మాట్లాడాలి". "ఏంటమ్మా! ఒక పక్క పిల్లాడు చావుబతుకుల్లో ఉన్నాడు,మధ్యలో నీ గోల ఏంటి?" "ఏంటత్తయ్యా! పిల్లలిద్దరి గురించి తల బ్రద్దలవుతోంది అంత ముఖ్యమైన విషయం ఏమిటి"...

"వాళ్ల గురించే. నాయనా! పిల్లలు చేయి దాటిపోతున్నారు. అలవాట్లకు, డబ్బుకు బానిసలై జీవితంలో క్రమశిక్షణ లేకుండా ఉన్నారు. రండి చూపిస్తాను ఏమి జరుగుతోందో." అని వాళ్లిద్దరినీ  పిల్లల గదుల్లోకి తీసుకెళ్లి అక్కడ జరుగుతున్న చిందరవందర జీవితాన్ని అరాచకాన్ని వివరించింది. కళ్లముందు ఉన్న నిజాన్ని తట్టుకోలేకపోయారు ఆ భార్యాభర్తలు. సిగరెట్లు, బాటిల్సు, అశ్లీల పుస్తకాలు, డీవీడీలు, గర్భనిరోధక మాత్రలు, విడిచిన బట్టలు...ఇంకా ఇంకా ఎన్నో...

"నాయనా! డబ్బు మనలను నలుగురికి సాయపడేలా, నలుగురికి ఉపాధి కలిగించేలా, ధర్మకార్యాలు చేయటానికి ఉపయోగపడాలి. ఆ డబ్బు మన జీవితంలో బాధ్యతలను విస్మరించి, ధర్మాన్ని విడిచిపెట్టి, తప్పుదారులు పట్టి కూడాబెట్టటానికి కాదు. అమ్మా వరలక్ష్మీ! సమాజ సేవ మంచిది. ఎంతో ఉత్తమమైన సేవ. కానీ, ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. మీరు కన్న బిడ్డలు వీళ్లు. మీకు సమయం లేకపోతే వారిని కనే హక్కు లేదు మీకు. కన్న తరువాత మీ బాధ్యత నిర్వర్తించకపోతే పరిణామాలు ఏమిటో చూశారు కదా. ఇకనైనా మేల్కొనండి. పిల్లలు ఏమి చేస్తున్నారో, ఎక్కడున్నారో, ఎవరితో తిరుగుతున్నారో, ఏమి తింటున్నారో ఇవి తెలుసుకోవటం మీ కనీస బాధ్యతలు. ఇవి పూర్తి చేసిన తరువాతే మీ వృత్తులు, సామాజిక బాధ్యతలు."

వేంకటేశ్వర్లు, వరలక్ష్మికి పరిస్థితి అర్థమయ్యింది. జరుగుతున్న ఘోర నష్టానికి కారణం తామే అని తెలుసుకున్నారు. ఆసుపత్రికి బయలుదేరి దారిలో వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. "స్వామీ! మా బాధ్యతలు విస్మరించి డబ్బు కోసం, పదవులకోసం మేము కన్న పిల్లలపై దృష్టి లేకుండా వ్యవహరించాము. ఇంకొక్క అవకాశం కావాలి స్వామీ! అని నిజాయితీగా ప్రార్థించారు. ఆసుపత్రికి చేరుకున్నారు. "మేడం. మీ అబ్బాయి ప్రాణానికి అపాయం లేదు. ఆపరేషన్ చేశాము. ఒక వారం ఇక్కడే ఉండాలి" అన్నాడు డాక్టర్. తల్లిదండ్రులు భగవంతునికి కృతజ్ఞతగా మొక్కారు.

సాయంత్రం సుమను పిలిచి ప్రక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడారు "తల్లీ, ఇన్నిరోజులు నీతో సమయం గడప లేకపోయాము, వంటవాళ్లపై, పనివాళ్లపై వదిలేశాము...మమ్మల్ని క్షమించు" అన్నారు. "మమ్మీ, డాడీ! నాకు కూడా మా ఫ్రెండ్స్ లాగా మీతో గడపాలని, మీతో కలిసి తినాలని ఉండేది. మీకు సమయం లేక నేను ఒక అబ్బాయితో చనువుగా ఉంటున్నాను. ఇంట్లో దొరకని రిలాక్సేషన్ అతని దగ్గర పొందుదామని తప్పటడుగు వేశాను...నన్ను ఒంటరి తనం వెంటాడుతోంది. అన్నయ్య మాట్లాడడు, మీకు సమయం లేదు...అందుకని ఇలా ఉంది నా జీవితం. ఇంట్లో వంట మనిషి కూడా మీకు టైం లేదన్న విషయాన్ని అలుసుగా తీసుకుంటోంది...."

వరలక్ష్మి  కళ్ల వెంట నీళ్లు జల జల రాలాయి. వేంకటేశ్వర్లు తలదించుకున్నాడు. పిల్ల ఎంత నలిగిపోయిందో అర్థమై ఇద్దరికీ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలన్న సంకల్పం కలిగింది. వేంకటేశ్వర్లు వెంటనే ఆఫీసుకు ఫోన్ చేశాడు. అక్కడ నిజాయితీగా పని చేసే ఇద్దరు ఉద్యోగులను తన ప్రాజెక్టులకు డైరెక్టర్లుగా నియమించాడు. రోజులో సాయంత్రమంతా తనకు సమయం ఉండేలా పనిని వారి మధ్య విభజించాడు. వరలక్ష్మి మంత్రి పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా మాత్రం ఉండాలని నిర్ణయించుకొంది. ప్రతి ఉదయం, సాయంత్రం, వారాంతం పిల్లలతో గడిపి వారి యోగక్షేమాలు చూసుకోవాలని నిర్ణయించింది.

పదిరోజుల తరువాత "మాధవా! పద, నిన్ను నడిపిస్తాను" అని చెప్పి పార్కుకు తీసుకువెళ్లి ఒక చేతిని తన భుజంపై వేసుకొని, రెండో చేయి పట్టుకొని కొడుకును నడిపించే ప్రయత్నం చేశాడు వేంకటేశ్వర్లు. "సుమా! ఈరోజు మీ ప్రిన్సిపాల్ ను కలవాలి. వెళ్లి మనం డిస్కస్ చేసిన ప్లాన్ వివరించి ఇంకో అవకాశం ఇవ్వమని అడుగుదాం. నీకోసం గారెలు, అల్లం పచ్చడి చేశాను తిను" అంది వరలక్ష్మి. లక్ష్మమ్మ పూజా మందిరం ముందు నిలుచుని స్వామికి తన కృతజ్ఞతను తెలిపింది. ఆరు నెలల తరువాత మాధవ పూర్తిగా కోలుకున్నాడు. సుమ మొదటి సంవత్సరం పరీక్షలు పాసై రెండవ సంవత్సరం కోసం కోచింగులో చేరింది. వేంకటేశ్వర్లు, వరలక్ష్మి కేబీఆర్ పార్కులో తేలికపడిన మనస్సుతో వడివడిగా వాకింగ్ చేస్తున్నారు. "ఏవండీ! నాదో ఆలోచన! మనం అక్రమంగా సంపాదించిన డబ్బును దేవస్థానానికి సగం, వృద్ధుల ఆశ్రమానికి సగం ఇచ్చేద్దాం...నాలోని అపరాధ భావం తగ్గుతుంది...వెంటనే వేంకటేశ్వర్లు "అలాగే" అని ఓకే చెప్పి కార్యోన్ముఖుడైనాడు.

9, సెప్టెంబర్ 2015, బుధవారం

విశ్వనాథేశ్వర సంకల్పంకార్తీక సోమవారం, కోటిపల్లి గ్రామం. ఉత్తరం వాకిలి పెంకుటిల్లు, చుట్టూ కొబ్బరి చెట్లు, వాటి మధ్య రకరకాల పూల మొక్కలు, కాయగూరల చెట్లు, ప్రధాన ద్వారం గుండా చూస్తే ఇంటికి వెనుక పక్క తులసి కోట, దానిలో ప్రకాశిస్తున్న శ్రీతులసి మొక్క, కోటలో దీపం...మధ్యాహ్నం 12:30 గంటల సమయం. ఇంటికి ఆగ్నేయాన హోమగుండం దగ్గర కంచుకంఠంతో "చతుస్సాగర పర్యంతం గోబ్రాహణేభ్యో శుభం భవతు...ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రః ఆపస్తంభ సూత్రః కృష్ణ యజుశ్శాఖాధ్యాయీ కాశీవిశ్వనాథేశ్వర శర్మ అహం భో అభివాదయే"...అని ప్రవర పఠిస్తూ చెవులను చేతులతో తాకి అభివాదం చేశాడు ఆ బ్రహ్మజ్ఞాని. తాను చేసిన హోమ ఫలాన్ని పరమేశ్వరునికి సమర్పించి, రక్షను ధరించి హోమ గుండం వద్ద నుండి లేచి కృతజ్ఞతా భావంతో మనసులో పరమేశ్వరుని నిలిపి ప్రార్థించాడు.

"ఈశ్వరా! నీ సేవలో జీవితాన్ని గడిపే భాగ్యం కలిగించినందుకు నేను నీకు ఏమి ఇచ్చి నా రుణం తీర్చుకోగలను? నా కర్మఫలాలను నీకు సమర్పిస్తున్నాను. మంచైనా చెడైనా కన్న తండ్రిలా స్వీకరించి నన్ను కరుణించు. అమ్మా సర్వమంగళా! నీ అపారమైన దయావృష్టిని నాపై కురిపించు, నన్ను సన్మార్గంలో నడిపించు".

అడుగు వంటింటి వైపు పడిందో లేదో వరుణుడి వృష్టి పూలవానలా కురిసింది. శర్మ గారి శిరసును తాకి, జల జల శరీరమంతా తడిసి పాదాలను స్పృశించింది. తెల్లని ధోవతీ, నుదుట, భుజాలు, చేతులు, హృదయస్థానంలో తెల్లని విభూతి రేఖలు, నొసట నల్లని రక్ష, దానికి క్రింద అర్థరూపాయి బిళ్లంత బొట్టు. ఆ వర్షం కురిసి ఆయన శిరసుపై పడుతుంటే గంగ శివుని శిరస్సులో దిగి ఆయనకు అభిషేకం చేసినట్లుగా అనిపించింది. మమకారం లేని చిరునవ్వు, తృప్తితో కూడిన ప్రశాంతత, ఈశ్వరుని హృదయంలో దర్శించిన యోగానుభూతి...ఆయన తనువంతా మెరిసిపోతోంది. ఒక పక్క సూర్యుని కిరణాలు, ఇంకోపక్క చల్లని చిరుజల్లు. సూర్యచంద్రులు ఆ శివయోగిని ఆశీర్వదించటానికి వచ్చారా అన్నట్లు.

గాంభీర్యంతో అడుగులు వేస్తూ వంట ఇంట ప్రవేశించాడు యాజులు గారు. అన్నపూర్ణమ్మ వెండి గ్లాసులో మజ్జిగ, రెండు అరటి పళ్లు పళ్లెంలో పెట్టి ఆయనకు అందించింది. "నీకో" అన్నట్లుగా కళ్లతో అన్నపూర్ణమ్మ వైపు చూశాడు విశ్వనాథేశ్వర శర్మ. ముప్ఫై ఏళ్ల వైవాహిక జీవితంలో కష్టంలోనూ సుఖంలోనూ తనతో కలసి నడిచిన ధర్మపత్ని కళ్లలో "మీ తరువాత" అన్న సమాధానం గోచరించింది. ఉద్విగ్నుడై "కార్తీకమాసం ఉపవాసం, ధర్మాలన్నీ ఆచరించావు, ఇంక ఆలస్యం చేయవద్దు. నువ్వు కూడా తెచ్చుకో" అని మృదువుగా ఆమెకు చెప్పాడు. సరే అని వెళ్లి తనకూ మజ్జిగ, ఒక అరటి పండు తెచ్చుకొని ఆయన ముందు కూర్చుంది.

"ఏవండీ! మన విశాలాక్షి నిన్న సాయంత్రం వచ్చి వెళ్లింది. అన్నయ్య గారు వేదపాఠశాల సరిగా నడవటం లేదని సందేశం పంపించారు. దానికి ఏమీ తోచటం లేదు. అల్లుడు గారు మొహమాటంతో మీ ముందుకు రాలేకపోతున్నారు. పాఠశాలను పునరుద్ధరించాలి, లేకపోతే పొట్ట చేతబట్టుకొని విశాఖపట్నమో రాజమండ్రో వెళ్లకతప్పదు అని అన్నాడట"....విశాలాక్షి ఈ దంపతుల కూతురు. ఎంతో పేరుపొందిన శంకర వేద పాఠశాలను నడిపే యజ్ఞనారాయణ శర్మ గారి పుత్రుడు విశ్వేశ్వర శర్మకు విశాలాక్షినిచ్చి పదిహేనేళ్ల నాడు పెళ్లి చేశాడు. కాలం మారింది. ఘనంగా సాగిన వేదపాఠశాల కళ తప్పింది. ఇంగ్లీషు చదువుల మోజులో కొత్త విద్యార్థులు పాఠశాలలో చేరటం మానేశారు. యజ్ఞనారాయణ శర్మగారింట్లో సంసారం భారంగా నడుస్తోంది.

విశ్వనాథేశ్వరశర్మ గారు మడత కుర్చీలో పడుకొని దీర్ఘంగా అలోచించాడు. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అన్న శ్రీకృష్ణుని మాటలు గుర్తుకొచ్చాయి. లేచి నిలబడ్డాడు. "పూర్ణా! నేను అమ్మాయి ఇంటి దాకా వెళ్లి వస్తాను" అని చెప్పి బయలుదేరాడు.

"బావగారూ, నాయనా విశ్వేశ్వరా! పరిస్థితి అర్థం అయ్యింది. పరిస్థితులకు తల వంచి మనలను మనం కుంగదీసుకోకూడదు అన్నది నాకు సనాతన ధర్మంలో అర్థమైన విషయం. వేదాధ్యయనం వజ్రంలాంటిది. దాని విలువ ఎన్నేళ్లైనా తరగదు. తాత్కాలికంగా ఉపాధి లేకపోయినా మనం దిగులు పడకుండా ధైర్యంగా నిలబడాలి. మన విద్యే మనకు దారి చూపిస్తుంది. నాకు రెండు మార్గాలు కనిపిస్తున్నాయి

1. వేదపాఠశాలలో వేదవాఙ్మయం నేర్పటంతో పాటు వాటి అర్థాలను తెలిపి నవీన సాంకేతిక పరిశోధనకు మన వేద సంపద ఎలా ఉపయోగపడుతుందో నేర్పిద్దాం. ఇటీవలే మన ప్రధానమంత్రి వేదాలలో ఆధునిక శాస్త్ర సాంకేత పరిజ్ఞానంతో చేయబడిన ఆవిష్కరణల గురించి వేల ఏళ్ల క్రితం ప్రస్తావించబడ్డాయి అని చెప్పారు. ఆ అంశాలను పాఠ్యాంశాలుగా వయసుకు తగ్గ క్లిష్టతతో నేర్పుదాం. మన వేద సంహితను పరిశోధన చేసి పాఠ్యాంశాలుగా మార్చేందుకు కావలసిన నిధుల కోసం ప్రధానమంత్రికి వినపత్రాన్ని సమర్పిద్దాం. ఒకవేళ నిధులు అందకపోతే నాకున్న 4 ఎకరాలలో రెండు అమ్మి నీకు నిధులు అందజేస్తాను. మన పాఠశాలలో ఒక ప్రణాలిక్గా ఈ పాఠ్యాంశాలను నేర్పి వారిని శాస్త్రజ్ఞులకు దీటుగా తయారు చేసి ప్రభుత్వానికి, ప్రైవేటు పరిశోధనా సంస్థలకు సలహాదారులుగా వెళ్లేలా ప్రయత్నం చేద్దాం. వేదగణితాన్ని మరింత లోతైన వివరాలతో విద్యార్థుల మేధస్సు పెరగటానికి ఉపయోగించే ప్రణాలికను రూపొందించుదాం

2. నేటి చదువులతో వ్యక్తిత్వ వికాసమనేది కల్లగా మరింది. ఏమాత్రం ఒత్తిడిని విద్యార్థులు తట్టుకోలేకపోతున్నారు. వారికి మన సనాతన ధర్మం పాటించటం ద్వారా  ఎలా ఒత్తిడి అధిగమించగలరో నేర్పుదాం. చిన్న పిల్లలకు మన ధర్మం క్రమశిక్షణను, నిరాడంబరమైన జీవనము ఎలా అందజేసిందో పాఠ్యాంశాలుగా తెలుపుదాం. వారానికి రెండు రోజులు ఇంగ్లీషు పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులను మన పాఠశాలకు రప్పించి వారిని దృఢమైన పౌరులుగా తీర్చుదిద్దుదాం. దీనికి కావలసిన అంశాలను నేను సిద్ధం చేయగలను. వీటిని కంప్యూటర్ల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా అందజేద్దాం. మన పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ నేర్పి ఈ అంశాలను రూపొందించటంలో భాగస్వాములను చేద్దాం."

విశ్వేశ్వరుడు మామగారి ముందు చూపుకు, మనోనిబ్బరానికి ముగ్ధుడైనాడు. అతని మదిలో సంకల్పం చిగురించింది. మామగారిలో జ్ఞానస్వరూపుడైన దక్షిణామూర్తిని దర్శించాడు. యజ్ఞనారాయణశర్మ గారి కళ్లలో ఆశ చిగురించింది. ఇద్దరూ లేచి విశ్వనాథశర్మ గారికి అభివాదం చేశారు. విశాలాక్ష్మి తండ్రికి నమస్కరించింది. "తల్లీ! నీ సంసారం గురించి భయం లేదు. పరమేశ్వరుడే మనకు మార్గదర్శకం" అని చెప్పి ఆశీర్వదించి ఇంటికి వెళ్లి భార్యతో వివరాలు చెప్పాడు. ఎన్నడూ భర్తలో అధైర్యం చూడలేదు ఆ స్త్రీ. ఈరోజు కూడా అంతే. అందుకే ఆయన సంకల్పం సిద్ధిస్తుందని నమ్మింది. పార్వతీదేవిలా ఆ విశ్వనాథుని వామభాగంలో ఒదిగిపోయింది.

ఏడాది గడిచింది. విశ్వనాథేశ్వరశర్మ సంకల్పం, నమ్మకం, శ్రద్ధ, నేతృత్వం విశ్వేశ్వరశర్మ పట్టుదల, పరిశ్రమ, ఓర్పు, విశాలాక్షీ అన్నపూర్ణల సహకారం, యజ్ఞనారాయణశర్మ గారి ఆశీర్వాదం, వేదపాఠశాలలోని విద్యార్థుల ప్రజ్ఞ, ఉత్సాహం అన్నీ ఫలించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేద గణితం, వేద సాంకేతిక విద్యకు పాఠ్యాంశాలుగా గుర్తింపునిచ్చింది. కర్ణాటక ప్రభుత్వం విశ్వనాథశర్మ-విశ్వేశ్వరశర్మలను మైసూరు వేదపాఠశాలలో ఇదే పాఠ్యాంశాన్ని పొందుపరచటానికి సలహాదారులుగా నియమించింది. చైతన్య-నారాయణ విద్యాసంస్థలు తమ విద్యార్థుల వ్యక్తిత్వవికాసానికి సనాతనధర్మ పాఠ్యాంశాలను నేర్పేందుకు విద్యార్థులను కోటిపల్లి పంపే ఏర్పాట్లు చేసింది. ఆరునెలలు తిరగక ముందే శంకర వేదపాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఐదువందలకు పైగా దాటింది.

రెండేళ్ల తరువాత ఢిల్లీ విజ్ఞానభవన్ ఉపాధాయ దినోత్సవ వేడుకలు - "ఈరోజు ఎంతో ముఖ్యమైన రోజు. నేను మన ధర్మం యొక్క గొప్పతనాన్ని మన దేశ భవిష్యత్తుకోసం ఎలా ఉపయోగించాలో అని కన్న కలలు నిజమైన రోజు. ఎక్కడో మారుమూల కోటిపల్లిలో ఉన్న ఇద్దరు వేదపండితులు భుక్తి గడవని పరిస్థితిలో ధర్మంపై తమకు గల విశ్వాసాన్ని నమ్మకాన్ని ఆధారంగా చేసుకొని అద్భుతాలు సాదించారు. ఇటువంటి ప్రణాలికకు సృష్టికర్త అయిన శ్రీ కాశీవిశ్వనాథేశ్వరశర్మ గారికి ప్రతిష్ఠాత్మకమైన బృహస్పతి పరిశోధనా పురస్కారాన్ని అందజేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను"....

అన్నపూర్ణమ్మ, విశాలాక్షిల కళ్లు, చెవులు నమ్మలేకపోతున్నాయి. ఎదురుగా వేదికపై ఎరుపు-ఆకుపచ్చ అంచులు గల పట్టు పంచె ధరించి,కండువా వేసుకొని, నుదుటిపై విభూతి రేఖలు, గంధం, దానిపై కుంకుమ, మెడలో రుద్రాక్షలు, ముచ్చటైన శిఖ...శివయోగి, ఆయన పక్క ఆనందంగా విశ్వేశ్వరుడు, ఆ వెనుక వేదాన్ని వల్లిస్తూ బ్రహ్మతేజస్సు గల విద్యార్థులు వెలిగిపోతున్నారు. విశ్వనాథేశ్వర శర్మను, విశ్వేశ్వర శర్మను కౌగిలించుకున్నాడు ముఖ్య అతిథి...ప్రతి ఒక్క విద్యార్థికి అభివాదం చేసి ఒక శాంత్రి మంత్రం చెప్పించాడు ఆయన. ఇంతలో మైకులో "ఇప్పుడు మన దేశ ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోడీ గారు ఈ బృందాన్ని సత్కరిస్తారు...."..ప్రధానమంత్రి తనమెడలో దండవేసి శాలువా కప్పుతుంటే విశ్వనాథేశ్వర శర్మ ఇలా ప్రార్థించాడు

"ఈశ్వరా! నీ సేవలో జీవితాన్ని గడిపే భాగ్యం కలిగించినందుకు నేను నీకు ఏమి ఇచ్చి నా రుణం తీర్చుకోగలను? నా కర్మఫలాలను నీకు సమర్పిస్తున్నాను. మంచైనా చెడైనా కన్న తండ్రిలా స్వీకరించి నన్ను కరుణించు. అమ్మా సర్వమంగళా! నీ అపారమైన దయావృష్టిని నాపై కురిపించు, నన్ను సన్మార్గంలో నడిపించు".

సభ కరతాళధ్వనులతో మారుమ్రోగింది. కోటిపల్లి దేశప్రసిద్ధమైంది. శంకర వేదపాఠశాల దేశానికి దిశానిర్దేశకమైంది. ఈ సనాతన ధర్మ గంగా ప్రవాహం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది.

స్వామి సమర్థ రామదాసుమొగల్ సామ్రాజ్యపు రాక్షసరాజులు భరతభూమిని కొల్లగొడుతున్న రోజులవి. నిర్దాక్షిణ్యంగా భవ్యమైన మన ఆలయాలపై దాడి చేసి, విగ్రహాలను ధ్వంసం చేసి, ఆలయాల సంపదను దోచుకొని సనాతన ధర్మానికి తూటాలు పొడిచిన 16వ శతాబ్దపు మొదటి సంవత్సరాలు అవి. ఔరంగజేబు భరతజాతి సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేయాలని అతి క్రూరంగా స్త్రీలను చెరబట్టి, మగవారిని మతమార్పిడి చేయించి సనాతన ధర్మం ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న గడ్డు కాలం అది. అప్పుడు అవతరించారు ఒక మహనీయుడు. ఆవిరైపోతున్న హిందూ వారసత్వ సంపదను, బలహీనమవుతున్న సనాతన ధర్మ పునాదులను రక్షించి పునరుద్ధరించి ధర్మ సంస్థాపన చేయటానికి అవతరించారు స్వామి సమర్థ రామదాసు.

పవిత్రమైన గోదావరీ తీరాన మరాఠా గడ్డపై ఒక సాంప్రదాయ హిందూ కుటుంబంలో 1608 శ్రీరామనవమి నారు సంవత్సరంలో రాణూబాయి మరియు సూర్యాజీ దంపతులకు జన్మించాడు సూర్యతేజస్సు గల బాలుడు. అతనికి తల్లిదండ్రులు నారాయణ్ అని నామకరణం చేశారు. ఎనిమిదవ ఏటనే తండ్రి మరణించటంతో నారాయణుడిలో జీవితం, జనన మరణాలపై ప్రశ్నలు తలెత్తి అంతర్మథనం మొదలైంది. శోధన చేస్తున్న అతనికి మూడేళ్ల తరువాత స్వయంగా రాముడే ప్రత్యక్షమై రామ త్రయోదశాక్షరీ మంత్రాన్ని జపించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. రాముని అనుగ్రహంతో నారాయణుడు ఆ మంత్రాన్ని అహోరాత్రులు జపించటం మొదలు పెట్టాడు. అంతటితో ఆతనికి రామదాసు అన్న నామం వచ్చింది. తల్లిదండ్రులు అతనికి వివాహం చేయతలపెట్టారు. వివాహ సమయంలో పఠించబడే మంత్రాలలో అతనికి 'సావధాన్ ' అనే పదము బిగ్గరగా వినబడింది. అది తనకు మేల్కొలుపుగా గుర్తించి వివాహ స్థలమును వదలి నాసిక్ వెళ్లి అక్కడ 12 ఏళ్లు తపస్సు చేశాడు. ఈ సమయంలో హనుమంతుడు రామదాసుకు వెన్నుదన్నుగా నిలిచి అతనికి అణిమాది అష్టసిద్ధులను ప్రసాదించారు. ఆ హనుమంతుడే ధర్మ స్థాపన కోసం ఒక ఉద్యమాన్ని ఆరంభించవలసిందిగా సమర్థ రామదాసును ఆదేశించారు.

హనుమంతుని ఆజ్ఞతో సమర్థ రామదాసు దేశాటన మొదలు పెట్టారు. దేశం నలుదిక్కులా తిరిగి సమాజంలో జరుగుంతున్న ఘోరాలను చూశారు, పరిస్థితులకు గల కారణాలను ఆకళింపు చేసుకున్నారు. మొగలాయీల అరాచకాలను అడ్డుకోవాలంటే హిందువులను సంఘటితం చేయాలని సంకల్పం చేసుకొన్నారు. సనాతన ధర్మంలో దేవాలయాలను ప్రజలను ఏకం చేసే గొప్ప సాధనాలు. అందుకే సమర్థ రామదాసు దేశవ్యాప్తంగా హనుమాన్ దేవాలయాలను నిర్మించారు. ఈ దేశంలో ప్రాచీనమైన హనుమాన్ దేవాలయాలలో సింహాభాగం రామదాసు గారి సమయంలో నిర్మించబడినవే. భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న దురాచారాలను ఖండించారు. కులం పేరుతో జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడారు. మహిళలు సమాజ నిర్మాణంలో పాల్గొనాలని ఉద్బోధించి వారిని ఇళ్లనుండి బయటకు వచ్చేలా చేశారు. రాండుని, హనుమంతుడిని ఎంతో నిష్ఠతో కొలిచిన రామదాసుకు పండరీపురంలోని విఠలుని అనుగ్రహం కలిగింది. ఒక బ్రాహ్మణుని రూపంలో స్వయంగా విఠలుడే వచ్చి ఆయనను పండరీపురం తీసుకువెళ్లి అద్భుతమైన అనుభూతిని ప్రసాదిస్తాడు. అలాగే, మాహూరుగఢ్ దత్తాత్రేయుని అనుగ్రహం కూడా పొందారు సమర్థులు.

మొగల్ రాజుల దాష్టిణ్యాన్ని ఎదుర్కోవటానికి ధైర్యము, శౌర్యము, త్యాగము కల వీరుడు కావాలని తెలుసుకొని మరాఠావీరుడైన శివాజీని తన శిష్యునిగా అంగీకరిస్తారు. అతనికి నిరంతరం సలహాలిస్తూ ధర్మ సంస్థాపన దిశగా శివాజీని ముందుకు నడిపించారు. రాగద్వేషాలు లేకుండా రాజ్యాన్ని పాలించటంలో ఎంతో తోడ్పడ్డారు. శివాజీ నేతృత్వంలో సనాతన ధర్మాన్ని ఇస్లాం రాజుల నుండి కాపాడటంలో కృతకృత్యులయ్యారు సమర్థ రామదాసు.తన ఆధ్యాత్మిక సిద్ధాంతాలను ప్రతిబింబించేలా ఆయన ఎన్నో అద్భుతమైన రచనలను చేశారు. వాటిలో ముఖ్యమైనది దాసబోధ. గురు శిష్యుల సంవాదంగా సాగే ఈ దాసబోధ ద్వారా పరబ్రహ్మ తత్త్వము, ఆత్మ, మాయ, జనన మరణాలపై అద్భుతమైన వివరాలను ఆవిష్కరించారు. పామరులకు కూడ అర్థమయ్యేలా, సనాతన ధర్మంలో జీవన శైలిని, వ్యక్తిత్వ వికాసాన్ని తన రచనల ద్వారా తెలియజేశారు. మనాచీ శ్లోకములన్నది ఆయన మరో ప్రసిద్ధమైన రచన. అలాగే హనుమంతుడిపై ఎన్నో రచనలను చేశారు.

మన తెలంగాణా రాష్ట్రంలో ఆయన ద్వార మనకు అందిన సంపదలు నిజామాబాద్ జిల్లాలోని సారంగపూర్ హనుమాన్ దేవాలయము, హైదరబాద్ జియాగూడా లోని కేసరి హనుమాన్ ఆలయం. ఇవి స్వయంగా అయ్న నిర్మింపజేసిన మందిరాలు. ఎంతో మహిమాన్వితమైనవి. అలాగే ప్రస్తుత మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో ఎన్నో భవ్యమైన మందిరాలను ఆయన నేతృత్వంలో నిర్మించారు. తంజావూరులో సమర్థ రామదాసు మఠం అక్కడి శరభోజి మహారాజుల కాలంలో ఎంతో వైభవాన్ని పొందింది.

రామదాసు తన చివరి రోజుల్లో ఎక్కువ సమయాన్ని ఎవరూ లేని అడవి ప్రాంతాల్లో గడపటానికి ఇష్టపడ్డారు. సజ్జన్ గఢ్ వద్ద శివాజీ మహారాజు ఆయనకు ఒక కోటను ఇచ్చి అక్కడ అన్ని వసతులు ఉండేలా ఏర్పాటు చేశాడు. సమర్థ రామదాసు అక్కడే ఎన్నో ఏళ్లు తపస్సు చేసి సిద్ధి పొందారు. ఆయన శిష్య పరంపర ఎంతో మహనీయమైనది. రామనామాన్ని జపిస్తూ ఆయన దేహాన్ని త్యాగం చేశారు. ఆ సమయంలో ఒక దివ్యతేజస్సు ఆయన దేహాన్ని వీడి రాముని విగ్రహంలో ఐక్యమైంది.

ఆయన బోధలలో శరీర వాంఛలకు దూరంగా ఉండటం, సత్సాంగత్యము, రాముని మనసులో కొలువటం, కోపాన్ని, అహంకారాన్ని, మోహాన్ని జయించటం, అందరిని ప్రేమించటం, అందరిలోనూ పరమాత్మను చూడగలగటం, సర్వస్య శరణాగతి మొదలైనవి ఎంతో ప్రాముఖ్యతను పొందాయి. ఆయన శిష్య పరంపరలో 20 శతాబ్దంలో కర్ణాటక వరదహళ్లిలో నివసించిన భగవాన్ శ్రీధర స్వామి ప్రముఖులు. వీరు రామదాసు గారి బోధలను, ఆయన ఆధ్యాతిక వైభవాన్ని ఎంతో ప్రచారం చేశారు.

ఈ విధంగా భరతజాతిలో సనాతన ధర్మ పరిరక్షణకు తోడ్పడ్డ వారిలో సమర్థ రామదాసు వారు అగ్రగణ్యులు.

శ్రీరామ జయరామ జయ జయ రామ!

7, సెప్టెంబర్ 2015, సోమవారం

మహాలక్ష్మీ కామేశ్వరీయం


"కావేటి రంగ రంగా మాయన్న కస్తూరి రంగ రంగా" అని కావమ్మ కూని రాగాలు తీస్తూ కళ్లజోడు పైకి కిందకి జరుపుకుంటూ బియ్యంలో రాళ్లు ఏరుతోంది. "అత్తయ్యా! కాఫీ ఇదిగో" అని మహాలక్ష్మి వేడి వేడి కాఫీ గ్లాసు తెచ్చి పక్కన పెట్టి రుస రుసన వెళ్లిపోయింది.

"ఒసేయ్ మహాలక్ష్మీ! కాస్త అత్త అంటే గౌరవం చూపించవే. ఎంత మేనత్తనైతే మాత్రం ఇంత అలుసుటే? మా అత్తగారంటే నాకు ఎంత భయం భక్తి అనుకున్నావ్? ఏ పనైనా ఆవిడ ఇష్ట ప్రకారం జరగాల్సిందే. అదే నాకు వేదం..నువ్వూ ఉన్నావ్..."

"ఆ ఆపాటి మొహమా అర్ధ సేరు పసుపా అని సామెత. మా పెళ్లిలో మీరు చేసిన గోలకు నేను కాబట్టి కాఫీ పోస్తున్నా..ఇంకోళ్లైతేనా...ఎంతైనా మేనత్తవు. చూడకపోతే లోకం ఆడిపోసుకుంటుందని ఊరుకుంటున్నా"

"ఒసేయ్! ఎంత పొగరే నీకు! ఏదో తమ్ముడు కదా అని మీ నాయన బోడి పదివేల కట్నానికి మా నారాయణకు ఇస్తాను అని వస్తే కాదనలేకపోయాను. మీ అమ్మ ఒక్కగానొక్క ఆడపడుచునైన నా మీద చూపిన జాణతనం, అమర్యాద నేను మర్చిపోయానుటే...వెధవ సంత..."

"ఇదిగో ముసలావిడా! నన్ను ఏమన్నా అను...మా అమ్మను అంటే మాత్రం ఊరుకునేది లేదు. ఎప్పుడో చిన్నప్పుడే మొగుడు పోతే మిమ్మల్ని మీ అబ్బాయిని ఇంట్లోనే పెట్టుకొని పోషించింది మా అమ్మ. ఆవిడ దేవత. మీరు పెట్టిన ఆరళ్లకు ఆవిడ కాబట్టి ఊరుకుంది..ఇంకోళ్లు ఇంకోళ్లు అయితేనా..."

"అవునే..మీ అమ్మ దేవత నేనో కొరివి దెయ్యాన్ని. నా ఖర్మ..."...

నారాయణ వసారాలో కూర్చుని తల్లీ పెళ్లాల మధ్య జరుగుతున్న మహాభారత సంగ్రామం వింటున్నాడు. "ఆ! రోజూ ఉండేదే. నేను తల దూర్చకూడదు" అని మనసులో అనుకున్నాడు పేపరులో మునిగిపోయాడు.

"ఒరేయ నారాయణా! ఏవిటిరా ఇవాళ నీ పెళ్లాం అగ్గిపుల్ల వెలిగించట్లు లేదు...నాకు ఆకలి మండిపోతోంది...ముందే చెబితే ఎదో ఇంత ఎసరు పదేసేదాన్ని కదా..ఏమయ్యిందో కనుక్కో..."

నారాయణ పడక గదిలోకి వెళ్లాడు. అపర కైకలా మహాలక్ష్మి జుట్ట విరబోసుకొని కాటుక కళ్లుదాటి, కళ్లెర్రబడి వల వల ఏడుస్తోంది. "లక్ష్మీ...ఏమయ్యింది?" ఉలుకులేదు పలుకులేదు. ముఖం పక్కకు తిప్పుకుంది. కొంగు బిగించి నోట్లో అద్దుకొని కళ్లకు ఆవిరి పెట్టుకుంటోంది మహాలక్ష్మి. పచ్చని మేని చాయ, కాళ్లకు పచ్చని పసుపు, చేతులకు గోరింటాకు, గల గల లాడే మామిడి పిందెల వెండి గజ్జెలు, చేతులకు ఆకుపచ్చని గాజులు,మధ్య మధ్యన బంగారు గాజులు, పసుపు రంగుకు ఆకు పచ్చ అంచు మడి పట్టు చీర, తలలో చెదరిన మల్లెల మాల...కోపంలో కూడా మహాలక్ష్మి అమ్మవారిలా వెలిగిపోతోంది. ఈ అందం చూసే కదూ నేను పడిపోయింది అని మురిసిపోయాడు నారాయణ.

"లక్ష్మీ! నా బంగారు లక్ష్మీ! ఏమయ్యిందో చెప్పరాదూ! నాకు ఆకలిగా ఉంది..." చర్రున లేచింది మహాలక్ష్మి "అవును! భోజనం అనే సరికి పెళ్లాం గుర్తుకొస్తుంది..ఉందిగా మీ అమ్మ వెళ్లి ఆవిడను అడగక పోయారా"...."అది కాదు లక్ష్మీ...నీ చేతి వంట తిని అమ్మ చేసే వంటలు నచ్చవే..అయినా రోజూ నువ్వే చేస్తున్నావు కదా"..."ఇదిగో చూడండీ...మేనత్త మొగుడు కూడా ఒక మొగుడేనా అని ఒక సామెత. కానీ నేను ఎప్పుడూ మిమ్మల్ని అలా చూడలేదు. మా అమ్మను నానా మాటలంది అత్తయ్య. నా వల్ల కాలేదు..."

"అది కాదు లక్ష్మీ...అమ్మకు నువ్వంటే వల్లమాలిన ప్రాణం...ఏదో చాదస్తంతో రెండు మూడు మాటలంటే ఇంత రాద్ధాంతం చేయాలా.."

"ఏవండీ! మన మనసుకు దగ్గరైనవి, సున్నితమైనవి రెండు మూడు విషయాలుంటాయండీ. అందులో పుట్టిల్లు ఒకటి..మా నాన్న ఆవిడ తమ్ముడే...మా అమ్మ పరాయిదనేగా అంతేసి మాటలు అనటం"..

ఇంతలో డిగ్రీ చదువుతున్న ఇరవై ఏళ్ల వీళ్ల ముద్దుబిడ్డ వాణి పరుగెత్తుకుంటూ వచ్చింది. "అమ్మా! ఎందుకేడుస్తున్నావు?". "ఏమీ లేదమ్మా! మా పుట్టింటివాళ్లు గుర్తుకొచ్చారు...". "నాన్నా! ఏమైంది? నువ్వైన చెప్పు, అమ్మ ఏడుస్తుంటే నాకస్సలు నచ్చటం లేదు". "ఏముంది తల్లీ! మీ బామ్మ చాదస్తం..." అని మొత్తం వివరించాడు.

వాణి మెల్లగా తల్లి వద్దకు వెళ్లి ఆవిడను హత్తుకొని "అమ్మా! మా ఇంటి మహాలక్ష్మివి నువ్వు. బాధపడితే ఎలా? ఒక్కసారి ఆలోచించు. బామ్మకు మనం తప్ప ఎవ్వరూ లేరు. ఎప్పుడో చనిపోయాడు తాతయ్య. నాన్న, అత్తయ్యలను ఎంతో కష్టపడి పెంచింది. నిజమే, తాతయ్య అమ్మమ్మ బామ్మను చేరదీసి ఆశ్రయమిచ్చారు. కానీ, ఆవిడ తన ఖర్చులు, పిల్లలకు అయిన ఖర్చులు లెక్కకట్టి తాతయ్యకు ఏడాదికోమారు ఇచ్చేది అని నువ్వే చెప్పావు నాకు బాగా గుర్తు. అలాగే అమ్మమ్మ చనిపోయినపుడు బామ్మ తాతయ్యకు, నీకు అండగా నిలబడిందని కూడా నువ్వే చెప్పావు. బామ్మకు వృద్ధాప్యము మీరుతోంది, కాబట్టి ఓపిక నశిస్తోంది..దాని వల్ల ఏవో మాటలు అంటూ ఉంటుంది...అంత మాత్రాన నీ మీద, అమ్మమ్మ మీద ద్వేషం ఉందని కాదు కదా? ఆలోచించు"...

"నిజమేనే లక్ష్మీ! నీకు రెండు పురుళ్లు, నీకు సుస్తీ చేసినప్పుడు అమ్మే కదా సమస్తం చూసుకుంది? నువ్వు అత్తయ్యకు బాలేక మూడు నెలలు ఊరికి వెళ్లాల్సి వచ్చినప్పుడు అమ్మే కదా పిల్లలకు, నాకు వండి పెట్టింది? మన రామం చదువుకు డబ్బు అవసరం వచ్చినప్పుడు అమ్మే కదా సర్దుబాటి చేసింది? తనకు ఓపికున్నంత కాలం నిన్ను వంటింట్లోకి కూడా రానీయలేదే? అమ్మకు నువ్వంటే ఆపేక్ష...అవును మర్చిపోయా! నువ్వు కట్టుకున్న మడి పట్టు చీర మా బామ్మదని నీకోసం అమ్మ ఇరవై ఏళ్లు దాచి ఉంచి ఇచ్చింది...అలాగే నువ్వు వేసుకున్న గాజులు కూడా...నీ పట్టీలు నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టిన మొదటి శ్రావణ శుక్రవారానికి అమ్మ తన పొలం డబ్బులతో కొన్నవే..ఎన్నేళ్లు వచ్చాయో చూడు..."

మహాలక్ష్మి క్రోధం చల్లారింది.. కళ్లలో తప్పు చేశానన్న భావన కలిగింది. గబ గబ లేచి వంటింట్లోకి వెళ్లి వంకాయ కూర, మామిడికాయ పప్పు, పులిహోర, పాయసం చేయటానికి ఉపక్రమించింది.

నారాయణ వాణిని తీసుకొని అమ్మ దగ్గరకు వెళ్లాడు. "ఏవిట్రా నారాయణా! నీ పెళ్లాం మీ ఇద్దరినీ నా మీద యుద్ధానికి పంపిందా ఏం? నాకేం భయం లేదు. ఈ క్షణం మన వూరు వెళ్లి పోయి నాకు చేతనైంది నేను వండుకు తింటాను. ఈ కోడలు ఆరళ్లు నేను భరించలేను".

"అమ్మా! ఊరికే నోరు పారేసుకోకు...చిన్న చిన్న విషయాలు రాద్ధాంతం చేస్తే ఎలా? లక్ష్మి నీ సొంత మేనకోడలు. నువ్వే తనను కోడలు కావాలని పుట్టినప్పటినుంచి అనుకున్నావు. నాకు బాగా గుర్తు, మామయ్య అడగగనే నువ్వు ఎంత సంబర పడ్డావో? నువ్వు వంటింట్లో జారిపడి నడుము నొప్పితో రెండేళ్లు నడవలేకపోయావు..లక్ష్మి కదూ నీకు సమస్తం అందించింది? పసిపిల్లలా నీకు స్నానం చేయించి, చీరకట్టి, మూడు పూటలా నీ కాళ్లకు మర్దనం చేసింది. నువ్వు రెండ్రోజులు అక్కయ్య దగ్గరకు వెళితే నీ గురించి దిగాలు పడి ఫోన్ చేసిందే..మర్చిపోయావా?"

"అమ్మా! అత్తాకోడళ్ల మధ్య పాతికేళ్ల బంధం మీది, కొత్తగా అరచుకోవటానికి కారణాలు వేరే. నీలో ఓపిక నశించింది, తనకూ ఇంట్లో గుర్తింపు లేదన్న అభిప్రాయం ఏర్పడింది..నువ్వు చిన్న చిన్న విషయాలు పట్టించుకోకుండా ఉండు, నీకు నచ్చిన విషయాలను తనతో చెబుతూ ఉండూ. అలాగే, నేను, పిల్లలు తనకు వీలైనంత సహాయం చేస్తాం ఇంటి పనిలో..."

కావమ్మ ఆలోచనలో పడింది. "నిజమేరా నారాయణా! నాకు ఓపిక తగ్గి కోపం పెరిగింది...నేను నా వయసుకు తగ్గ ఆలోచన చేయటం లేదు. పాపం లక్ష్మి ఎంత పని అని చేస్తుంది...నాకు ఒంట్లో శక్తిలేదు. ఎదిగొచ్చిన పిల్లలు రామం వాణి సాయం చేయాలి దానికి..నేను కూడా లక్ష్మిని వదిలి ఉండలేనురా. ఒకటా రెండా, పాతికేళ్ల ముచ్చట్లు మావి. పనిలో పడి లక్ష్మి తిండి సరిగా తినదు. నా చాదస్తంతో నేను ఏదో మాట్లాడతాను..."

"అమ్మా! నీకు కావల్సింది విశ్రాంతితో పాటు, ప్రేమానురాగాలు. తనకు కావలసింది తను పడే కష్టానికి గుర్తింపు, అందులో సాయం...రెండూ మనందరం కలిసి వేసే చిన్న చిన్న అడుగులే అయినా కుటుంబాన్ని ఉత్సాహంగా ఐక్యంగా ఉంచటానికి సహాయపడతాయి"

కొడుకు వ్యక్తిత్వానికి కావమ్మ మురిసిపోయింది. తండ్రిలోని సంతులనకు, సమదృష్టికి వాణికి నారాయణ పట్ల ఆరాధనా భావం మరింత దృఢమైంది. ఇంతలో వంటింట్లోనుండి కేక "ఏవండోయ్, అత్తయ్యా! మీ మాటల్లో పడి భోజనం సంగతి మర్చిపోయారు...అత్తయ్యా మీకిష్టమని మావిడికాయ పప్పు, పులిహోర పాయసం చేశాను, ఏమండోయ్ మీకోసం గుత్తివంకాయ వండాను...త్వరగా వచ్చి తినండి..నాకూ ఆకలి దంచేస్తోంది. సాయంత్రం వదిన వాళ్లింట్లో వ్రతానికి వెళ్లాలి అందరం..."

నారాయణ టీ కప్పులో తుఫాను వెలిసింది అని సంతోషించాడు. అత్తాకోడళ్లు కబుర్లలో మునిగిపోయారు...యత్ర అత్త కోడలు ఓర్పు చూపుతారో, యత్ర ఇంటి మగవాడు సమదృష్టితో వ్యవహరిస్తాడో తద్గృహం స్వర్గమవుతుంది. సర్వే గృహాః స్వర్గో భవంతు"

6, సెప్టెంబర్ 2015, ఆదివారం

కలువ యొక్క పరిణామాలు - మానవ జీవితానికి సారూప్యత


కలువపూవు యొక్క పగలు రాత్రి పరిణామాలు మానవునికి ఎంతో మార్గదర్శకం. ఈ ప్రక్రియ మానవుని జీవితానికి ప్రతిబింబం. ఈ పుష్పానికి గల ప్రత్యేకమైన లక్షణాలను, మానవ జీవితానికి గల సారూప్యతను దగ్గరగా పరిశీలిద్దాం.

1. మురికి, బురదనీటినుండి కలువ బీజం నీటిమొక్కగా ఆవిర్భవిస్తుంది. కర్మఫలముల సంకెల వలన కలిగే కష్టాలతో కూడినది మానవ జన్మ. ఆ సంకెలకు ప్రతీక ఈ బురదనీరు. ఎన్నో కష్టాల మధ్య కొన్ని సుఖాలు మానవ జీవితం. ఎంత బురద నీరైతే అంత అందమైన కలువ పుడుతుంది. ఎంత కష్టమయ జీవితమైతే అంత సుందరమైన వ్యక్తిత్వం మానవునికి కలుగుతుంది.

2. కలువు మొక్క యొక్క బీజాలు మానవుని పుష్టికి, శక్తికి, సామర్థ్యానికి ప్రతీక. ఈ బీజాలలో అద్భుతమైన లోపరహితమైన, ఆకార సారూప్యత గల ఆకుల రూపం దాగి ఉంటుంది. నీటి ద్వారా ఆ బీజాలు కావలసిన శక్తితో అనుసంధానమై మనోహరమైన ఆకులుగా పరిణమిస్తాయి. అదే మనిషి సామర్థ్యాన్ని దైవ శక్తితో అనుసంధానం చేసి జీవన పరిణామంలో దివ్యత్వ సాధనకు ప్రతీక. మనిషి ముందడుగుకు సంకల్పం మూలం. బీజమే సంకల్పానికి ప్రతిబింబం.

3. ఆ బురదనుండి పుడుతుంది అందమైన పువ్వు యొక్క బలమైన కాడ. కష్టాలను దాటుతూ, అనుభవాలతో గట్టిపడేది మానవుని వ్యక్తిత్వము. అదే పువ్వు యొక్క కాడ.  ఇది బలంగా ఉన్నా, వంచితే వంగుతుంది. అంటే, దృఢమైన వ్యక్తిత్వమున్నా మనిషి పరిస్థితులను బట్టు తన్ను తాను మలచుకోగలడు. కాడ మనిషి లాఘవాన్ని సూచిస్తుంది.

4. కలువ పూవు వికసించటం అంటే మనిషి అనుభవాలు, జీవిత పాఠాల ద్వారా జ్ఞానాన్ని పొంది తన వ్యక్తిత్వ వికాసం చేసుకోవటం. ఎలా అయితే కలువ రెక్కలు సూర్యుని కాంతితో నెమ్మదిగా విచ్చుకుంటాయో, అలాగే మనిషి వ్యక్తిత్వం జ్ఞానమనే వెలుగుతో వికసించి దివ్యత్వాన్ని పొందుతుంది. వికసించిన కలువ దివ్యత్వానికి ప్రతీక.

5. రోజంతా సూర్యుని కాంతితో అనుసంధానమై కలువు విప్పి ప్రకాశించి లోకానికి ఆనందదాయకమవుతుంది. జ్ఞాని కూడా అంతే. తన జ్ఞానజ్యోతితో లోక కళ్యాణానికి పాటుపడతాడు.

6. సూర్యాస్తమయం తరువాత కలువ ఎలా విచ్చుకుందో అలాగే ముడుచుకుంటుంది. మరుసటిరోజు సూర్యునితో అనుసంధానమై మరో ఆరంభం. జ్ఞాని కూడా రాత్రి సమయాన తనలోని మాలిన్యాలను తొలగించుకుంటాడు. మరుసటిరోజు జీవితం పునః ప్రారంభమవుతుంది. జ్ఞానికి ప్రతి రాత్రి ఒక మరణం, ప్రతి ఉదయం ఒక జననం. నిన్నటితో పనిలేదు. నేటిలోనే జీవితం, నేదే రేపటికి పునాది.

మానవ జీవితానికి ఇంతటి ప్రత్యక్ష సారూప్యత గల కలువ అందుకే సగుణోపాసనలో ఎంతో ముఖ్యమైన స్థానం పొందింది. సమస్త దేవతలకు కలువలతో అర్చన ఎంతో ప్రియం. సూర్యునికి ఎర్రని కలువలతో పూజ చేస్తే ఎంతటి రోగాలైన హరిస్తాయి అన్నది సనాతన ధర్మం చెప్పిన విషయం. ఎర్రని కలువలను దాదాపు ప్రతి దేవతా మూర్తీ చేతిలో ధరించినట్లుగా మన వాఙ్మయాలు చెబుతున్నాయి. వీలైతే ఏడాదికోమారు 108 కలువలతో మీకిష్ట దైవాన్ని కొలిచే ప్రయత్నం చేయండి. తప్పక తదనుగుణమైన ఫలితం లభిస్తుంది.

రాబోయే వినాయక చతుర్థి నాడు స్వామిని ఎర్రని తెల్లని కలువలతో పూజించండి. స్వామి సంతుష్టుడవుతాడు. సర్వే జనాః సుఖినోభవంతు. 

5, సెప్టెంబర్ 2015, శనివారం

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే - చైతన్య మహా ప్రభు


పెద్ద రెండంతస్థుల మందిరము, విశాలమైన కిటికీలగుండా అస్తమించే సూర్యుని కిరణాలు భవ్యమైన కృష్ణుని విగ్రహం పాదాలు తాకి స్వామికి తమ కృతజ్ఞతను తెలుపుతున్నాయి. సాయంసేవలో పూజారి నిమగ్నుడైనాడు.  విగ్రహానికిరు ప్రక్కలా నిలువెత్తు ఇత్తడి దీపాల ప్రకాశం, మట్టి ప్రమిదెల దీపాలతో దేవాలయ లోగిలి, ఆవరణ వెలిగిపోతోంది. ఘంటానాదం శ్రావ్యంగా ఆ పరిసరాలంతా మారు మ్రోగిపోతోంది. మందిరపు ద్వారాలు మూసి ఉన్నాయి.

ఒక చిన్నబాలుడు పంచెకట్టి, నామములు ధరించి కృష్ణ భక్తిలో మైమరచి భగవంతుని మూర్తి చూడాలన్న ఆత్రంతో దేవాలయం కిటికీలోంచి తొంగి చూశాడు. ఆశ్చర్యం! పూజారి రూపంలోనే ఇంకొక మహాతేజస్సు గల వ్యక్తి కాషాయ వస్త్రాలు ధరించి, నామములు పెట్టుకొని, అహంకార రాహిత్యానికి సూచికగా శిరస్సు మరియు ముఖముపై వెంట్రుక లేకుండా గీయించుకొని, మెడలో పూల మాల, చేతిలో చిరుతలు, కాలికి గజ్జెలు కట్టి పరవశంలో నర్తిస్తున్నాడు. జయ కృష్ణ కృష్ణ కృష్ణ హరే అని శ్రావ్యంగా ఆలపిస్తున్నాడు. ఇంతలో స్వామి విగ్రహానికి కిరుప్రక్కలా మరిద్దరు అదే రూపము గల దివ్యస్వరూపులు వెలసి స్వామికి వింజామరలు వీయటం మొదలు పెట్టారు. ఆశ్చర్యం! మరుక్షణం స్వామి ఎదుట అదే రూపం గల మరో భక్తుడు పంచహారతులిస్తూ ప్రత్యక్షమైనాడు. ఇలా ఐదు నిమిషాల సమయంలో దేవాలయ ప్రాంగణమంతా ఒకే రూపం గల భక్తుల సమూహంతో నిండిపోయింది.

వారందరూ అరమోడ్పు కనులతో, కనుల స్వామి రూపాన్ని నింపుకొని, ఆయన ప్రేమను అనుభవిస్తూ ఒకే లయలో శృతిలో రాగంలో ప్రభువును కొలుస్తూ నర్తిస్తున్నారు. వ్యత్యస్త పాదలయతో హరే కృష్ణా హరే కృష్ణా అని, జయ రాధా మాధవా జయ కుంజ బిహారీ అని అనేక విధాల స్వామిని అనర్గళంగా నుతిస్తున్నారు. మందిరమంతా దివ్య నాదంతో, వారి వారి భక్తి ప్రేరితమై ప్రభువు యొక్క శక్తి ప్రచోదనమై అణువణువు దివ్యత్వంతో నిండింది. అలా ఎన్ని గంటలు సాగిందో తెలియదు...మిగిలిన రూపాలన్నీ మాయమైనాయి. ఒక్క దివ్య మంగళ రూపం మాత్రం ధ్యాన స్థితిలో ప్రభువు ముందు నిశ్చలమై నిలిచి ఉంది. అతనే చైతన్య మహా ప్రభు. కృష్ణ భక్తిని భరత భూమిలో దశదిసల వెదజల్లిన మహానుభావుడు.

కడలి అంత ప్రాశాంతత, దివ్య సుందర రూపం, మెరిసే బంగారు మేని ఛాయ, ప్రేమ, కరుణలు నిండిన కన్నులు, అడుగు వేసిన చోటల్లా ఎర్రని కలువలు వెలుస్తాయన్నంత శ్రీచరణాలు, మోక్షాన్ని సూచించే తెల్లని ఊర్ధ్వ పుండ్రము, భుజములపై శంఖ చక్రముల సమాశ్రయణము ...చూసే వారికి వెంటనే ఆరాధనా భావం కలిగే మంగళ రూపం ఆ చైతన్య ప్రభువుది.

చైతన్య ప్రభువు శిష్య బృందంతో నృత్యం చేస్తూ తన నివాసమునుండి బయటకు అడుగుపెట్టి పురీ నగర వీధులలో ఆ జగన్నాథుని హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే మంత్రాన్ని పాడుతూ వెళుతున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్కరు నెమ్మ నెమ్మదిగా కృష్ణమంత్రాన్ని పఠిస్తూ ఆయనతో పాటు వీధులలో సాగారు. పది మంది కాస్తా వేయి మంది అయినారు. ఊరు ఊరంతా కదలింది. పురీ నగరమంతా కృష్ణ నామ స్మరణతో మారుమ్రోగింది...

జగన్నాథుని భవ్యమైన మందిరాన్ని సమీపిస్తోంది ఈ భక్త ప్రవాహం. పారవశ్యంలో ఎక్కడికి వెళుతున్నామో బాహ్య ప్రపంచాన్ని మరచి నర్తిస్తూ నుతిస్తోంది ఆ వాహిని. జగన్నాథుని ముఖ్యద్వారం ముందుకు వచ్చింది ఆ భక్తసాగరం. ఆశ్చర్యం. ఒక్కసారిగా మందిరమంతా దీపాలతో వెలిగిపోయింది. ఘంట దానంతట అదే శ్రావ్యమైన లయలో మ్రోగ సాగింది. మందిరమంతా కృష్ణ నామ స్మరణతో నిండిపోయింది. అక్కడ ఉన్న భక్తులందరూ బాహ్య ప్రపంచాన్ని మరచి ప్రభు నామస్మరణలో తేలియాడారు. చైతన్యప్రభువు బృందం మందిరంలో ప్రవేశించింది...అవధులు లేని ఆనందం, ఉత్సాహంతో నృత్యం, ఎదురుగా బలభద్ర సుభద్రా సమేతుడైన జగన్నాథుడు. ఈ భక్త సమూహంతో చైతన్య ప్రభువు ఆ లోకేశ్వరుని కొలుస్తున్నారు. మందిర ప్రాంగణమంతా కృష్ణనామే. రాత్రంతా జరుగుతూనే ఉంది..మందిరం మూయలేదు, ప్రభువు మేల్కొనే ఉన్నాడు...

ఈ ఆనందహేలలో జగన్నాథుడు కూడా చేరాడు. తన అష్టభార్యలతో దిగి వచ్చి ఆ లయబధ్ధమైన నృత్యగాన హేలలో పాల్గొన్నాడు. జగన్నాథ దేవాలయం బృందావనంగా మారింది. పూలు వికసించాయి, తరులు ఉప్పొంగాయి. పక్షులు ఆలపించాయి. పశుపక్షి గణం ఆనందకేళిలో మునిగిపోయాయి. పసిపిల్లలు, స్త్రీ పురుషులు మైమరచి కృష్ణునితో నర్తించారు. ఎంత సమయం గడిచిందో తెలియదు. ఆకలిదప్పులు లేవు, నిద్రాహారాలు లేవు భక్తులకు. తెల్లవారబోతోంది. జగన్నాథుడు తన స్వస్థానానికి చేరుకున్నాడు. భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. ఆశ్చర్యం! వారికి మెలకువ వచ్చేసరికి చేతిలో వెన్నముద్ద, వారి వారి శరీరంలోని అనారోగ్యాలు అన్నీ తొలగి పోయాయి. కుష్ఠు వ్యాధి గలవాడు పరమ తేజస్సు గల శరీరంతో స్వాస్థుడైనాడు. క్షయ వ్యాధి ఉన్నవానికి దగ్గు మాటేలేదు, అవిటివానికి కాళ్లు వచ్చాయి, కళ్లు లేని వానికి కళ్లు వచ్చాయి...అందరూ ఆనందబాష్పాలతో జగన్నాథుని మందిరంలోకి పరుగెత్తి వెళ్ళారు. ప్రభువు ముంగిట చైతన్య ప్రభువు ధ్యానమగ్నుడై ఉన్నాడు. శ్రీకృష్ణుని రూపంలో జగన్నాథుడు చైతన్య ప్రభువు ఎదుట నిలిచాడు. ఆ పరమాత్మ రూపం అలానే ఉంది, ఈ ప్రభువు హృదయస్థానంలో కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతితో మరో జగన్నాథుడు సూక్ష్మరూపంలో.

ఆ ప్రభువు ఈ ప్రభువు మధ్య తేడా తెలియకున్నది. అదే తేజస్సు, అదే మందహాసము, అదే ప్రశాంతత, అదే నిర్మోహము, అదే కృపా వీక్షణము...తామెవరో మరచిన భక్తులకు జగన్నాథుని ఏకరూపం అనేకములుగా కనిపించింది. వారు తారతమ్య భేదం లేకుండా నేను భావనను వీడి కృష్ణగానం చేశారు....తరించారు...పురీ నగరం పరిశుద్ధమైంది. అందరూ జీవాత్మను పరమాత్మతో అనుసంధనం చేసుకున్నారు. మోక్షం పొందారు.

చైతన్య ప్రభువు మొదలుపెట్టిన ఈ కృష్ణ నామస్మరణ మహాయజ్ఞం అలా గంగా ప్రవాహంలా నిరాటంకంగా కొనసాగుతునే ఉంది. కృష్ణ తత్త్వం జగద్విదితమయ్యింది. ఎందరో చైతన్య ప్రభువు లాంటి భక్తులు జన్మించి తరించారు. భరతజాతి కృష్ణుని భక్తిలో ముక్తి పొందుతునే ఉంది.

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే  రామ రామ  రామ హరే హరే

3, సెప్టెంబర్ 2015, గురువారం

కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు - అనంతాళ్వారుఅనంతాళ్వారు తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తులలో అగ్రగణ్యుడు. భగవద్రామానుజుల ఆజ్ఞమేరకు స్వామికి పుష్పమాలా కైంకర్యం చేయటానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. స్వామికి పూలమాలలను అల్లటానికి ఆయన ఒక పూలతోటను పెంచదలచి, దానికి నీరు అందించే ఒక చెరువును త్రవ్వాలని నిశ్చయిస్తాడు. ఇతరుల సహాయము తీసుకోకుండా, తాను, తన ధర్మపత్ని మాత్రమే ఆ చెరువును తవ్వాలని సంకల్పం చేసుకొని కార్యం ఆరంభిస్తాడు. అనంతాళ్వారు గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే అతని భార్య గంపలలో ఎత్తుకొని వెళ్లి దూరంగా ఆ మట్టిని పోసేది.

ఆ సమయంలో ఆమె నిండు చూలాలు. ఆమె పరిస్థితిని చూసి శ్రీవేంకటేశ్వరుడు వారివురికి సాయపడటానికి ఒక పన్నెండేళ్ల బాలుని రూపంలో అక్కడి వస్తాడు. ఆ గర్భిణికి సాయం చేస్తానని నమ్మించి ఆ మట్టిని పారబోయటంలో తోడ్పడతాడు. ఈ విషయం తెలుసుకున్న అనంతాళ్వారు కోపంతో ఆ బాలునిపైకి గునపాన్ని విసురుతాడు.  ఆ గునపం బాలుని గడ్డానికి తగిలి రక్తం స్రవిస్తుంది. బాలుడు ఆనందనిలయం లోకి వెళ్లి కనబడకుండా దాక్కుంటాడు. శ్రీవారి ఆలయంలో అర్చకులు స్వామి వారి విగ్రహంలో గడ్డం వద్ద రక్తం కారటం చూసి ఆ విషయాన్ని అనంతాళ్వారుకు తెలియజేస్తారు. అనంతాళ్వారుకు స్వామికి తనపై గల అనుగ్రహం అర్థమవుతుంది. అర్చకులు స్వామి రక్తస్రావం అయిన చోట పచ్చకర్పూరం అద్దుతారు.ఇప్పటికీ స్వామివారి గడ్డానికి పచ్చకర్పూరం అద్దటం తిరుమల ఆలయంలో ఆచారంగా కొనసాగుతునే ఉంది. అనంతాళువారు ఉపయోగించిన గునపం శ్రీవారి ఆలయంలో ముఖ్యద్వారం కుడివైపు పైన భాగంలో వేలాడదీసి కనబడుతుంది. ఈ సంఘటనను అన్నమాచార్యుల వారు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు అనే ప్రసిద్ధమైన సంకీర్తనలో ప్రస్తావించారు. రెండవ చరణంలో ' అచ్చపు వేడుకతోడ అనంతాళువరికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు ' అని నుతించారు. ఈ సంకీర్తనలో కురువరతినంబి, తొండమాన్ చక్రవర్తి, అనంతాళ్వారు, తిరుమలనంబి, తిరుకచ్చినంబి  మొదలైన స్వామి భక్తులను ఆ కలియుగ ప్రత్యక్ష దైవం ఎలా కరుణించి అనుగ్రహించాడో, వేర్వేరు పరిస్థితులలో ఆయన లీలలను అన్నమాచార్యుల వారు అద్భుతంగా తెలియజేశారు. అందుకే అన్నమాచార్యుల వారి కీర్తనలలో అంత మహిమ ఉంది. మంత్రసమానమైన కీర్తనలను మనకు అందించిన మహనీయుడు ఆయన.

తిరుమల తిరుపతి దేవస్థానం వారు విడుదల చేసిన శ్రీవేంకటేశ్వర గీతమాలిక అనే ఆల్బంలో ప్రఖ్యాత గాయని శ్రీమతి శోభారాజు గారు ఈ గీతాన్ని అద్భుతంగా పాడారు. భగవంతుని సేవలో ప్రధానమైనది భక్తిలోని నిజాయితీ, శ్రద్ధ. ఈ లక్షణాలను పరమభక్తుల ఉదాహరణలతో అన్నమాచార్యుల వారు తమ సంకీర్తనలో పొందుపరచగా శోభారాజు గారు ఎంతో సుందరంగా హిందోళంలో ఆలాపించారు.

డాక్టర్ శోభారాజు గారితో గల నాకు పరిచయంలో వారి వ్యక్తిత్వం నన్ను ఎంతో ప్రభావితం చేసింది. భక్తిలో వారు కనబరచే భావప్రాధాన్యత మరియు తాదాత్మ్యత వారిని నేను అమ్మా అని పిలిచేలా చేసింది. అన్నమాచార్యుల వారి సంకీర్తనల వైభవాన్ని చాటే మహత్కార్యానికి జీవితాన్ని అంకితం చేసిన వారు భక్తి సూత్రాలను పరిపూర్ణంగా పాటిస్తూ తమ గళం ద్వారా సద్గురువుల, వేంకటేశ్వరస్వామి సేవ చేస్తున్నారు. కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు అన్న సంకీర్తనలోని అంతరార్థాన్ని, ఆ మహాభక్తుల వివరాలను శోభారాజు గారి మాటలలో ఎన్నో మార్లు విన్నాను. పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారి గాత్రంలో కొండలలో నెలకొన్న అనే సంకీర్తనను వినండి

2, సెప్టెంబర్ 2015, బుధవారం

నీవు నాకు శ్వాసగా మెలిగితే నీవె నాకు తోడుగా నిలిచితేనీవు నాకు శ్వాసగా మెలిగితే నీవె నాకు తోడుగా నిలిచితే
నీ చూపుల కరగిన నా హృదయం నీ దయన కలిగిన సంకల్పం

జన్మ జన్మల వాసనలను వదలి పొరల పొరల మకిలిని విడిచి
అంతులేని నీ వెలుగును చూచి అనంతమైన నిన్ను గ్రహించి

ఎదకు బరువైన ఆలోచనలను వదలి ఎదను తేలిక చేసుకొంటూ
పుడమి పొలిమేరలను విడచి కడలి అంచులను దాటుకుంటూ

గాలిలో తేలే బూరలా అలా అలా ఎక్కడికో సాగిపోవాలనుంది
రెక్కలొచ్చిన పక్షిలా స్వేచ్చగా ఎక్కడికో ఎగిరిపోవాలనుంది

ప్రభూ! నీ కరుణావృష్టిని నాపై కురిపించు! నీకు దాసుడనయ్యే వరమును అనుగ్రహించు!

నమ్మితి నా మనంబున - శ్రీమదాంద్ర మహాభాగవత రుక్మిణీ కల్యాణ ఘట్టము


నమ్మితి నా మనంబున సనాతనులైన యుమామహేశులన్
మిమ్ము పురాణదంపతుల మేలు భజింతు గదమ్మా! మేటి పె
ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిసేయుమమ్మ! నిన్
నమ్మిన వారికెన్నటికి నాశము లేదు గదమ్మ! ఈశ్వరీ!

శ్రీమదాంద్ర మహాభాగవతము దశమ స్కంధములోని రుక్మిణీ కల్యాణ ఘట్టములో మహాకవి పోతన కురిపించిన అమృత వర్షము ఈ పద్యము. శ్రీమహాలక్ష్మి అంశగా రుక్మిణి భీష్మకుని కుమార్తెగా జన్మిస్తుంది. మాధవుని వలచి, అతనే తనపతి యని, ఆతని కోసమే జీవించి, అతనిని మనసారా నమ్మి కొలిచింది. అన్నలు ఆమెకు శిశుపాలునితో వివాహము నిశ్చయించగా ఆమె అగ్నిద్యోతుడను బ్రాహ్మణునితో శ్రీకృష్ణునికి సందేశము పంపగా, ఆ యదుభూషణుడు ఆమె ప్రేమను స్వీకరించి ఆమె పట్ల తనకు గల మక్కువను ప్రకటించి, వివాహము చేసుకోవటానికి నిర్ణయిస్తాడు.  బ్రాహ్మణునితో తాను వచ్చి రుక్మాదులను ఓడించి రుక్మిణిని రాక్షస వివాహమాడుతానని సందేశము పంపిస్తాడు. అప్పుడు ఆ రుక్మిణి కార్యసిద్ధికై లోకానికి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులను నుతించే పద్యం ఇది. దైవాంశసంభూతులైన వారికి దైవముతో పని ఏమిటి అన్న ప్రశ్నకు ఈ పద్యం మరొకసారి సమాధానం తెలుపుతుంది. ఎంతటివారలైన పరమాత్మను కొలిచి ఈ విశ్వంలో భక్తి, శ్రద్ధ, విశ్వాసము, కృతజ్ఞత చాటారు. రాముడైనా, కృష్ణుడైనా, సీత, రుక్మిణులైనా పరమాత్మను కొలిచి ధర్మ నిష్ఠకు గల ప్రాముఖ్యతను శాశ్వతం చేశారు.

రుక్మిణి ఇలా ప్రార్థించింది. "ఓ పార్వతీ! సనాతనులైన పార్వతీ పరమేశ్వరులను నా మనసులో నమ్మినాను. ఆది దంపతులైన మిమ్ములను నేను శ్రధ్ధతో పూజిస్తున్నాను కదమ్మా! ఓ అమ్మలకు అమ్మవైన పార్వతీ దేవీ! నీవు దయ అనే సాగరానికి రూపము కదా! నిన్ను నమ్మిన వారికి నాశము లేదు కదమ్మా! హరిని నాకు పతిగా చేయుము తల్లీ!

అంత ఆర్తితో, భక్తితో ఆ ధర్మపరాయణ అయిన రుక్మిణి ప్రార్థించగా అమ్మ వినకుండా ఉంటుందా? వెంటనే శ్రీకృష్ణుడు బలరామాదులతో వచ్చి రుక్మిణిని కొనిపోయి వివాహమాడతాడు. ఆమె మనోరథమును సఫలము చేస్తాడు. రుక్మిణి యొక్క హరిభక్తి ఎటువంటిదో పారిజాతాపహరణ వృత్తాంతములో మనకు తెలిసినదే. పదియారువేలమంది సఖులున్నా శ్రీకృష్ణునికి రుక్మిణి అంటే అమితమైన ప్రేమ, ఎందుకంటే ఆమె భక్తి నిర్మలత్వముతో కూడినది. నీ చరణ కమలాల నీడయే చాలు ఎందుకోయీ స్వామీ బృందావనాలు అన్న భావనను ఆమె నిరంతర హరిధ్యానయై ప్రకటించింది. స్వామి కూడా నీ నయనకమలాల నేనున్న చాలు ఎందుకే ఓ దేవి నందనవనాలు అన్న భావనతో ఆమెకు తన వక్షస్థలంలో శాశ్వత స్థానం కలిగించాడు.

రుక్మిణీ కల్యాణ ఘట్టం కేవలం ఒక గాథ కాదు. ఎంతో మహత్తు కలది. వివాహం కానీ కన్యలు ఈ ఘట్టాన్ని పవిత్రంగా పారాయణం చేస్తే తప్పక వివాహమవుతుందని ఎంతో మంది అనుభవాలు చెబుతున్నాయి. దానికి కారణం ఆ పద్యాలలో గల హరి భక్తి, రుక్మిణికి గల నైర్మల్యం స్త్రీలకు అలది వారు కూడా శుద్ధులై మంచి భర్తను పొందుతారు.

శ్రీకృష్ణ పాండవీయం చిత్రంలో ఈ రుక్మిణీ కల్యాణ ఘట్టంలోని కొన్ని పద్యాలను పొందుపరచారు. వీక్షించండి.