2, అక్టోబర్ 2015, శుక్రవారం

వేణుగానం - సిక్కిల్ నీల కుంజుమణి సోదరీమణులు



ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పింపగన్ అని ఒక కవి ఎప్పుడో అన్నాడు. అది ఆనాటి కాలమాన పరిస్థితులను బట్టి చెప్పబడింది. ఈనాడు ఎంతో ఓర్పుతో, శ్రమతో, పట్టుదలతో స్త్రీలు కష్టతరమైన విద్యలలో రాణించి దేశవిదేశాలలో పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు. వారు నేర్వలేని విద్యలేదు, చేయలేని వృత్తి లేదు. అటువంటి కష్టతరమైనదే వేణుగానం. ఈ వేణుగానం ఎవ్వరికైనా నేర్వటానికి కష్టమే ఎందుకంటే ఇది పూర్తిగా ఊపిరికి సంబంధించిన కళ. శ్వాసపై పూర్తి పట్టు ఉంటేనే ఈ విద్య అబ్బుతుంది. అంతేకాదు, వేణువు ఋతువునుబట్టి సంకోచ వ్యాకోచాలు చెంది శబ్దం మారుతూ ఉంటుంది. కళాకారులు నిరంతరం వేణువు ధ్వనితో సమన్వయం అయితేనే దానిలో స్వరాలను పలికించగలరు. అటువంటి కళను నేర్చుకొని దశాబ్దాలపాటు కళాపిపాసకులను రంజించినవారు సిక్కిల్ నీల కుంజుమణి సోదరీమణులు.

తమిళనాడు కళలకు, దేవాలయములకు, సాంప్రదాయానికి ప్రసిద్ధి. అక్కడి ప్రజల జీవితంలో ఇవి అంతర్భాగం. అలాగే సమాజం, ప్రభుత్వాలు కూడా వీటిని నిలబెట్టి అభివృద్ధికి తోడ్పడ్డాయి. అందుకే అక్కడ కళలు ఇంకా అలరారుతున్నాయి. ఈ కళలకు పుట్టిల్లు తంజావూరు. సంగీత త్రయమైన త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి ఇక్కడ జన్మించిన వారే. అక్కడి ప్రకృతిలో, జీవనాడిలో కళలు నిండి ఉన్నాయి. ఆ తంజావూరు జిల్లాలోనే సిక్కిల్ అనే గ్రామంలో అళియూర్ శ్రి నటేశ అయ్యర్ అనే ప్రఖ్యాత మృదంగ విద్వాంసుని ఇంట 1930లో కుంజుమణి, 1940లో నీల జన్మించారు. వీరి పెదనాన్నగారైన శ్రీ అళియూర్ నారాయణస్వామి అయ్యర్ వేణుగాన విద్వాంసుడు. ఆయన స్ఫూర్తితో కుంజుమణి చిన్ననాటినుండే వేణుగానంపై ఆసక్తి పెంచుకున్నారు. ఆయన కూడా కుంజుమణిలో ఉన్న ఆసక్తిని ప్రోత్సహించారు. మృదంగ విద్వాంసుడు కావడంతో లయజ్ఞానాన్ని కుంజుమణికి అందజేశారు. చిన్న వయసులోనే కుంజుమణి రాగాలను గుర్తు పట్టేవారు. తన పదవ ఏట కుంజుమణి తన మొదటి కచేరీని నాగూరులో రాధా కల్యాణం సందర్భంగా తండ్రి కోరికపై చేశారు. అప్పటినుండీ దేవాలయ ఉత్సవాలలో కచేరీలు, తరువాత తంజావురు మొదలైన ప్రాంతాలలో కచేరీలు చేశారు కుంజుమణి.

పదేళ్ల వయస్సు తేడా ఉండటంతో అక్క కుంజుమణిని చూసి, అక్క వద్ద వేణువు నీర్చుకోవటం మొదలు పెట్టింది నీల. అక్షరాలు కూడా వ్రాయటం రాని వయసులోనే రాగాలను ఆలపించేది నీల. నీల తన ఏడవ ఏడున సిక్కిల్ లోని సింగార వేలవర్ మందిరంలో మొట్ట మొదటి కచేరీని చేసింది. నీల ప్రావీణ్యం పొందిన తరువాత తంజావూరు విశ్వనాథస్వామి దేవాలయంలో మొట్టమొదటిసారిగా అక్కాచెల్లెళ్లు కలిసి కచేరీ చేశారు. ఆ సభలో వారిని ప్రేక్షకులు ఎంతో అభినందించారు, ఆదరించారు.

ఆనాటి సమాజంలో స్త్రీలు వేదిక ఎక్కి పాడటం ధనవంతుల కుటుంబాలలో ప్రోత్సహించేవారు కాదు. అయినా నీల కుంజుమణిల తండ్రి నటేశ అయ్యర్ వీరిని ప్రోత్సహించారు. పదహారవ ఏట వివాహం చేసుకున్న కుంజుమణికి అత్తవారింట తన కళను వృత్తిగా పెంపొందించుకోవటానికి ప్రోత్సాహం లభించలేదు. భర్త వాయుదళంలో పనిచేసేవారు. మొదట్లో ఆయన కూడా కుంజుమణిని ప్రోత్సహించలేదు. తరువాత ఆయన ఉద్యోగ రీత్యా ముంబై తదితర ప్రాంతాలకు వెళ్లి అక్కడ నాగరికతను చూసి భార్య కూడా తన వేణుగానాన్ని ముందుకు కొనసాగించాలని నిర్ణయించుకొని ఆమెను ప్రోత్సహించారు. కొన్నేళ్ల విరామం తరువాత నీలకుంజుమణి సోదరీమణులు చెన్నైలో జంటగా తమ సంగీత ప్రస్థానాన్ని మళ్లీ మొదలు పెట్టారు.

ఇక ఈ అక్కాచెల్లెళ్ల జంట సంగీత ప్రపంచంలో ఎంతో పేరుప్రతిష్ఠలు పొందారు. వీరి ప్రతిభకు గుర్తింపుగా 1973లో కలైమామణి బిరుదు, 1989లో సంగీత నాటక అకాడెమీ పురస్కారం, 1997లో సంగీత కలైశిఖామణి, 2002లో సంగీత కళానిధి, 2004లో భారత ప్రభుత్వం ద్వారా పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. ఎన్నో ఏళ్ల సంగీత సేవ అనంతరం కుంజుమణి గారు 2010లో పరమపదించారు. నీల గారి కుమార్తె మాలా చంద్రశేఖర్ గారు కూడా ప్రఖ్యాత వేణువాద్య కళాకారిణి. తల్లి, పెదతల్లి బాటలో నడిచి ఈ సంగీత సేవను కొనసాగిస్తున్నారు. అలాగే కుంజుమణి గారు మనుమడు గురుచరణ్ అమ్మమ్మల సంగీత ప్రతిభను పుణికిపుచ్చుకొని గాత్ర సేవలో తరిస్తున్నారు. సిక్కిల్ సోదరీమణులు, మాలా చంద్రశేఖర్ గారు కలసి వాయించిన ఒక కృతి చూడండి.

ఎందరో మహానుభావులు అందరికీ వందనములు!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి