RightClickBlocker

26, నవంబర్ 2015, గురువారం

దైవం మానుష రూపేణ - జానీ శంకరీయంనమస్సోమాయ చ రుద్రాయ చ తామ్రాయ చ అరుణాయ చ...

కార్తీక సోమవారం, సూర్యోదయం ఇంకా కాలేదు, తెలిమంచు దట్టంగా ఆవరించి ఉంది. పూజా మందిరంలో శ్రీరుద్ర పఠనం శ్రావ్యంగా జరుగుతోంది. సనాతమైన శివ పంచాయతనంలో స్ఫటిక లింగానికి విద్యాశంకర శర్మ గారు పవిత్రమైన గోదావరీ జలాలతో అభిషేకం చేస్తున్నారు. మహాన్యాసముతో తానే రుద్రునిగా మారి అభిషేచనం చేస్తున్నారు. నుదుట విభూతి రేఖలు, మల్లె పూవులా తెల్లని వస్త్రాలు, మెడలో రుద్రాక్షమాల ధరించి తన్మయత్వంతో రుద్ర విధిని సాగిస్తున్నారు. ఇల్లంతా శివమయమై ప్రకాశిస్తోంది.

"శంకరం! ఒరేయ్ శంకరం! అర్జెంటుగా బయటకు రా".. స్నేహితుడు జానీ పిలుపుతో. జానీ గొంతు విని వెంటనే లేచి బయటకు వెళ్లాడు శంకరం. "ఏమయ్యింది రా జానీ?" అని అడిగాడు. "ఆయేషా ఆయాసపడుతూ పడిపోయింది. ఎందుకో భయంగా ఉంది. త్వరగా కారు తీసుకొని బయలుదేరు". క్షణం ఆలోచించకుండా కారు తీసుకొని ఇద్దరూ జానీ ఇంటికి వెళ్లారు. ఆయాసపడుతున్న ఆయేషాను హుటాహుటిన పదిహేను కిలోమీటర్ల దూరాన ఉన్న రాజమండ్రి ఆసుపత్రికి తీసుకు వెళ్లారు.

"సమయానికి తీసుకు వచ్చారు. వీరికి గుండెపోటు వచ్చింది. ఒక వారం తరువాత బైపాస్ సర్జరీ చేయాలి. ఈలోపు డబ్బు సమకూర్చుకోండి" అని డాక్టర్ చెప్పాడు. స్నేహితులిద్దరూ ఇంటి దారి పట్టారు. "జానీ! రేపు మధ్యాహ్నం ఇద్దరం రాజమండ్రి వెళ్లి నాకు మా నాన్న గారిచ్చిన అర ఎకరం పొలం అమ్మి డబ్బులు సిద్ధం చేసుకుందాం.." అన్నాడు. "ఒరేయ్! ఇంట్లో కామేశ్వరితో చర్చించకుండా హడావిడి నిర్ణయాలు తీసుకోవద్దు. నీకున్నది ఆ అర ఎకరం ఒక్కటే. తొందరపడకు. ప్రభుత్వాసుపత్రిలో ప్రయత్నిద్దాం అక్కడ ఉచితంగా చేస్తారు" అని చెప్పాడు. "జానీ! నా నిర్ణయం మారదు. ప్రభుత్వాసుపత్రిలో ఏమి జరుగుతుందో నాకు తెలుసు. అయేషా ప్రాణాలు కావాలనుకుంటే నేను చెప్పిన మాట విను" అని గట్టిగా చెప్పి కారు దిగి ఇంట్లోకి వెళ్లాడు.

"ఏవండీ! మీకు జానీ అన్నయ్యకు ఉన్న సాన్నిహిత్యం నాకు తెలుసు, కానీ తన్నుమాలిన ధర్మం పనికి రాదు కదా. మనకున్న ఏకైక ఆస్తి ఆ అర ఎకరం. అది కూడా పోతే పిల్ల పెళ్లి, మన వృద్ధాప్యం...." భార్య కామేశ్వరి మాట పూర్తి కాకుండానే "కామేశ్వరీ! జానీ కుటుంబం నాకు చేసిన సాయానికి నేను ఏమి చేసినా రుణం తీర్చుకోలేను" అని వివరాలు చెప్పాడు.

"జానీ నేను ఎనిమిదవ తరగతి నుండి డిగ్రీ పూర్తి అయ్యే వరకు ఒకే స్కూలు, కాలేజీలో చదువుకున్నాం. అప్పుడు 1991వ సంవత్సరం. నేను డిగ్రీ మొదటి సంవత్సరం. మా అమ్మ, నాన్న రాజమండ్రి నుండి మా ఊరు రావటానికి బస్సెక్కారు. బస్సు రాజమండ్రి పొలిమేర దాటగానే అదుపు తప్పి బోల్తా పడింది. రాత్రి సమయం, అప్పట్లో అంబులెన్సుల వసతి లేదు. ఫోన్లు అన్నిచోట్లా ఉండేవి కాదు. ఆ సమయంలో అక్కడికి దగ్గరలో ఉన్న దర్గాలో ప్రార్థనలు ముగించుకొని వస్తున్న జానీ, అతని తండ్రి ఈ బస్సు ప్రమాదం చూసి దగ్గరకు వచ్చి వెంటనే రోడ్డుపై వచ్చే వాహనాలలో గాయపడ్డవారిని ఆస్పత్రులకు తరలించారు, కదలలేని వారికి జానీ తండ్రి ప్రథమ చికిత్స చేశారు. ఆయన హోమియోపతీ డాక్టర్. బాగా గాయపడ్డా అమ్మ, నాన్నలను ఆస్పత్రికి తరలించి, వారికి స్వయంగా తన రక్తం దానం చేసి ప్రాణాలు పోశారు.

ఆ తరువాత నేను ఊరికి వెళ్లినపుడు నాన్న గారు ఇలా చెప్పారు. "శంకరం! మన సనాతన ధర్మం చెప్పినట్లు ఈ ప్రపంచంలోని ప్రతి చరాచరములోనూ పరమాత్మ ఉన్నాడు. మన అదృష్టం బాగుండి ఈ పుణ్యాత్ముడు మనకు ఆ సమయంలో పరమాత్మ రూపుడై రావటం వలన ఈరోజు మేము బతికి ఉన్నాము. మనం చదువుకున్న శాస్త్రాల సారం మానవ ధర్మాన్ని పాటించి పరమాత్మను అంతటా చూడగలగటం. నమకంలో చెప్పినట్లు ఆ పరమ శివుడు అన్ని రూపాలలోనూ ఉన్నాడు. దీనికి నిరూపణ నాకు దక్కిన ఈ పునర్జన్మ. వారి మతం ఏదైనా ఇటువంటి వారికి ఎప్పటికి కృతజ్ఞులమై ఉందాము. ఎప్పటికీ వారిలాంటి మానవత్వమున్న మనుషులను నీ జీవితంలో సన్నిహితులుగా  ఉంచుకో. వారికోసం ఏదైనా చేయి. రెండో ఆలోచనే వద్దు".

ఆ మాటలు నన్ను చాలా ప్రభావితం చేశాయి. అప్పటినుండీ నేను జానీ అన్నదమ్ముల్లా జీవితంలో ప్రతి విషయంలో తోడునీడగా మెలుగుతున్నాము. మంచే మాకు మతము. నేను పాటించే మార్గం మన ఇంటి గోడలు దాటేంతవరకే. తరువాత విశ్వజనీనమైన శక్తిని ఇలాంటి వారిలో చూసి అనుభూతి చెందటం వరకే నా ఆలోచన."

"నిజమేనండీ...కానీ, వాళ్ల మతం మన మతాన్ని ద్వేషిస్తుంది, మన సాంప్రదాయాలకు పూర్తిగా విరుద్ధమైన సాంప్రదాయాలను ప్రచారం చేస్తూ హింసను చాటుతుందనిపిస్తుంది..."

"కామేశ్వరీ! మతాలు, ఆచారాలు, సాంప్రదాయాలు అవి పుట్టిన దేశ కాలమాన పరిస్థితులను బట్టి. ఇస్లాం ఆరంభమైన ప్రాంతాలలో ఆ సమయంలో ఉన్న సమస్యలకు, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వారి ప్రాతిపదికలు రాసుండవచ్చు. అలాగే మనకు కూడా. ఆ రాజులు మన దేశంపై దండెత్తి అప్పటి మన ఆలయాల సంపదను చూసి ఓర్వలేక, ఇక్కడి మతాన్ని పాటించకుండా, వారి ధర్మాన్ని మనపై రుద్దాలనే దురుద్దేశంతో దారుణాలకు పాల్పడ్డారు. దాని వలన ఇస్లాం మతానికి చాలా చెడ్డ పేరు వచ్చింది. అలాగే, మనకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత హిందూ ఐక్యతను ఛిద్రం చేయటానికి, మైనారిటీల పేరుతో ఓట్లు పొందటానికి రాజకీయ పార్టీలు ప్రజలను విభజించారు. దీనిని ఇస్లాం మత పెద్దలు, ఇస్లాం మతాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న వారు ఖండించలేదు. దానితో హిందూ-ముస్లింల మధ్య ఒక పెద్ద అగాథం ఏర్పడింది. కానీ, మతానికి ప్రతిబింబం వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం బాగున్నప్పుడు ఇక మతంతో పనేమిటి? ఇక ఆచారాలంటావా? హిందువులలో వేర్వేరు మార్గాలను పాటించేవారిలో వైరుధ్యాలు లేవా? కాబట్టి లోతుగా పరిశీలించటం నేర్చుకో. తప్పకుండా మన ధర్మాన్ని ప్రశ్నించే వారిని ఎదుర్కోవాలి, మన ధర్మం ఉనికికి హాని కలిగించే వాటిని తిప్పి కొట్టాలి. కానీ, మతం పేరుతో ప్రజలపై ద్వేషం పెంచుకోకూడదు..."

కామేశ్వరి మౌనంగా ఉండిపోయింది. శంకరం అర ఎకరం పొలం అమ్మటం, అయేషాకు ఆపరేషన్ జరిగి తిరిగి ఆరోగ్యవంతురాలు కావటం, శంకరం-జానీల స్నేహం మరింత వికసించి దృఢపడింది. కామేశ్వరి మనసులో అయ్యో ఉన్న ఆస్తి కాస్తా పోయిందే అన్న అసంతృప్తితో కూడిన కోపం అలానే ఉంది.

కాలచక్రం తిరిగింది. ఐదేళ్లు గడిచాయి. శంకరం-కామేశ్వరిల కూతురు కళ్యాణి పిఠాపురంలో డాక్టర్ ఉమర్ ఆలీ షా విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో తన డాక్టరేట్ పనిలో భాగంగా కొన్ని ప్రాచీన గ్రంథాలపై అధ్యయనం చేస్తోంది. కామేశ్వరి కూతురు దగ్గరకు వెళ్లింది. పీఠం చూసిన తరువాత కామేశ్వరి ఉమర్ ఆలీ షా గారి విశాల హృదయానికి, వారి ఆధ్యాత్మిక వికాసానికి ముగ్ధురాలైంది. తెలుగు భాషపై ఆలీషా గారికి గల మక్కువ, సనాతన ధర్మాన్ని గౌరవించే ఇస్లాం మతంలోని శాంతికాములైన గొప్పవారి వివరాలు తెలుసుకొని తన అజ్ఞానానికి చింతించింది. నాడు భర్త చెప్పిన విషయాలను మనసులో అవగతం చేసుకోగలిగింది.

కళ్యాణి, కామేశ్వరి తిరిగి గ్రామానికి కలిసి వస్తున్నప్పుడు తన ఇంటి దారి కాకుండ జానీ గారి ఇంటివైపు అడుగులు వేసింది. కామేశ్వరిని చూసి అయేషా, జానీ ఆశ్చర్య పడ్డారు. "అమ్మా! ఇంతవరకూ మా ఇంట మీరు అడుగు పెట్టలేదు. ఈరోజు రావటం ఎంతో సంతోషం. అల్లా మా ఇంటికి పార్వతీదేవిని పంపించినట్లుగా ఉంది..." అన్నారు.

కామేశ్వరి దగ్గరకు వచ్చి అయేషా చేతులు పట్టుకొని - "ఇన్నాళ్లూ నాలోని సందేహాలు తీరలేదు. అడుగు మీ ఇంటి వైపు పడలేదు. మనిషి వ్యక్తిత్వం నిర్మలమైతే ఇక మతానికి, కులానికీ, రంగుకు, రూపానికి అక్కడ తావు లేదు అన్నది నాకు పిఠాపురంలో అవగతమైంది. నేడు మీ ఇంటికి రావటం నా భాగ్యంగా భావిస్తున్నాను" అంది. కామేశ్వరిని, కళ్యాణిని ఇంట్లోకి సాదరంగా అహ్వానించారు అయేషా-జానీ దంపతులు. నిర్ఘాంతపోయింది కామేశ్వరి - ఎదురుగా వ్యాసం పీఠం పెట్టుకొని చక్కగా వేదమంత్రాలు వల్లిస్తున్న జానీ కొడుకు బాషా. స్పష్టమైన ఉచ్ఛారణతో "శన్నో మిత్ర శం వరుణః...శన్న ఇంద్రో బృహస్పతిః..." ఎంతో శ్రావ్యంగా ఆలపిస్తున్నాడు. తెల్లని లాల్చీ పైజమా, తలపై తెల్లని టొపీ, నల్లని గడ్డం, ముఖంలో ప్రశాంతత...రూపమేమో స్వచ్ఛమైన ముస్లిం, పలికేదేమో సుస్వర వేదమంత్రాలు..ఇరవై ఎనిమిదేళ్ళ బాషాలో దివ్యత్వం ఉట్టిపడుతోంది. చిన్నవాడైనా చేతులెత్తి నమస్కరించింది కామేశ్వరి.

కామేశ్వరిని చూసి చిరునవ్వుతో పలకరించి నమస్కరించాడు బాషా. "అమ్మా! మీరూ, చెల్లాయి కళ్యాణి మా ఇంటికి రావటం ఎంతో సంతోషం. నాకు వేద విద్యపై ఆసక్తికి కారణం శంకరం గారు. వారి ప్రోత్సాహంతో, మద్దతుతో సనాతన ధర్మంలోని గొప్పతనాన్ని తెలుసుకునే అవకాశం కలిగింది" అని చెప్పాడు. మాటల్లోనే శంకరం అక్కడికి వచ్చాడు. కామేశ్వరి భర్తతో తన అవగతాన్ని వివరించింది. "కామేశ్వరీ - పిఠాపురంలో నివసించిన దత్తవతారులు శ్రీపాద శ్రీవల్లభులు అల్లా అర్థాన్ని వివరించారు. అల్లా అనే పదం అల్-అహ అనే రెండు పదాలనుండి ఆవిర్భవించింది. అల్ అనగా శక్తి అహ అనగా శక్తిని ధరించువాడు. అనగా పరమాత్మ. సనాతన ధర్మంలో ఇది శివపార్వతుల తత్త్వానికి పూర్తి సారూప్యత కలది. ఈ విషయాన్ని నేను బాషాతో ప్రస్తావించగా అతనిలో మన సాంప్రదాయం గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత కలిగింది. దాని ఫలితమే నీ ముందున్న వేదపండితుడైన బాషా..." అన్నాడు.

అందరూ హాయిగా తమలో వికసించిన ఆధ్యాత్మిక సుమాల పరిమళాలను కాసేపు పంచుకున్నారు. అల్లా లేదా శివశక్తి తత్త్వం ఆ ఇంట అంతటా నిండిపోయింది. అటు తరువాత అల్లాహో అక్బర్ అన్న మసీదు ప్రార్థనలు కామేశ్వరికి నమస్సోమాయ చ రుద్రాయ చ లాగానే మధురంగా, దివ్యంగా ధ్వనించాయి.

18, నవంబర్ 2015, బుధవారం

అమ్మ, నాన్న - స్వార్థపు అమెరికా పిల్లలు

(ఈ కథ సగటు తెలుగు తల్లిదండ్రుల పరిస్థితిని ప్రతిబింబింపజేసేది. చాలా మంది అమెరికాలో ఉన్న పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎంతో బాధ్యతాయుతంగానే ఉంటున్నారు. లేని మిగితావారిని ఉద్దేశించినది మాత్రమే)


"అమ్మా! నేనే. పదహరో తారీఖున నా స్నేహితురాలు సుమ హైదరాబాదు వస్తోంది. దానితో రెండు మూడు రకాల పొడులు, నేను మొన్న వచ్చినప్పుడు వదిలేసి వెళ్లిన పట్టుచీరలు, పుల్లారెడ్డి స్వీట్స్ పంపించు. వాళ్లు సైదాబాదులో ఉంటారు. నాన్నను వెళ్లి ఇచ్చి రమ్మను. నేను వచ్చేటప్పుడు వాళ్ళకు బోలెడు వస్తువులు తెచ్చాను...."

మొదలయ్యింది పొద్దునే కృష్ణవేణికి కూతురు స్రవంతి నుండి ఈ "ఇండియా-అమెరికా"ల మధ్య సరఫరా చర్చలు. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ప్రతి ఏడాది, రెండు మూడు సార్లు జరిగే తంతు ఇది.

"వేణీ! ఆలోచించు! తల్లికి పిల్లల పట్ల ప్రేమ ఉంటుంది. కానీ, అది ఇలా ఉండకూడదే. ఏ వస్తువులు అవసరమో అనవసరమో, ఎక్కడ ఉన్నా అక్కడి సమాజంలో ఎలా కలిసిపోవాలో నేర్పాలి. మనం ఏం చేస్తున్నాం? వాళ్లకు మన జీవితాన్ని అందించాలన్న తపనలో తప్పటడుగులు వేస్తున్నాము"...అన్నాడు భర్త వేంకటేశ్వరరావు.

"చాల్లే ఊరుకోండీ! పిల్ల అంత దూరంలో ఉంది. ఒక అచ్చటా-ముచ్చటా లేదు. పాపం ఎంత కష్టపడుతోందో అక్కడ. ఇంత మాత్రం మనం భరించలేమా? కన్న తల్లిదండ్రులుగా..."

"వేణీ! ఖర్చులు నువ్వు లెక్క రాయవు. కానీ, నువ్వు చేసే సరఫరాతో మనం ఇంకో సంసారాన్ని పోషించవచ్చు"..

"మీరు మీ పిచ్చి మాటలు...ఆపండి".

రెండు వారాలకు తల్లికి స్రవంతి ఫోన్. "అమ్మా! నాకు రెండో నెల. నవంబర్ నెలాఖరులో డెలివరీ. నువ్వు నవంబర్ మధ్యకు వచ్చి మే మధ్య వరకు ఉండాలి. నేను చేసుకోలేను. మా అయన టికెట్ బుక్ చేస్తాడు. నాన్నను ఇన్ష్యూరెన్స్ తీసుకోమను. నువ్వు డాక్టర్ దగ్గర అన్ని పరీక్షలు చేయించుకొని, ఆరునెలలకు సరిపడా మందులు, నాకు, పుట్టబోయే బిడ్డకు హోమియో మందులు తీసుకు రావాలి. నాన్నకు టికెట్ పెట్టలేను. ఒక ఆరునెలలు ఆయనను చెల్లాయి దగ్గర ఉండమని చెప్పు". ...

ఒక పక్క కూతురు గర్భవతి అన్న సంతోషం, మరో పక్క కూతురు తమ ఇద్దరినీ కాకుండా తనను ఒక్కదానినే రమ్మని చెప్పటం, మాట్లాడిన పద్ధతి కృష్ణవేణి కాసేపు నలిగిపోయింది. తేరుకొని, "ఏవండీ, విన్నారుగా. డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోండి నాకోసం"...

బీపీ, షుగర్, మోకాళ్ల నొప్పులు కృష్ణవేణికి ఉన్న వ్యాధులు. మందులతో, ఎక్సర్సైజుతో కొంత అదుపులోనే ఉన్నాయి. పని ఎక్కువైతే మోకాళ్లు నొప్పులు వస్తాయి. పెద్ద కూతురు స్రవంతి అమెరికాలో. చిన్న కూతురు శ్రావణి హైదరబాదులో ఇటీవలే వివాహం అయ్యింది. ఆంధ్రాబ్యాంకులో పని చేసి స్రవంతి పెళ్లి కాగానే ఐదేళ్లముందే వాలటరీ రిటైర్మెంట్ తీసుకుంది కృష్ణవేణి. భర్త వేంకటేశ్వరరావు ఎస్బీఐలో సర్వీసు చేసి రిటైర్ అవ్వబోతున్నాడు. ఇద్దరి సర్వీసులో దాచుకున్న సొమ్ము, కృష్ణవేణి రిటైర్మెంట్ డబ్బుతో ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేశారు. నిజం చెప్పాలంటే ఇంక పెద్దగా బ్యాంకులో డబ్బులు లేవు, నెల నెలా వచ్చే పింఛను తప్ప. ఇంటి అద్దె లాంటి ఖర్చులు లెవు కాబట్టి సంసారం పెద్ద ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. దంపతులిద్దరూ జాగ్రత్తపరులే.

"శ్రావణీ! అక్క అమెరికాకు నన్నొక్కదాన్నే రమ్మంటోంది. నాన్న ఒక్కరూ ఉండటం కష్టం, మంచిది కాదు. మరి నీ దగ్గర....".

"అమ్మా! నాకు అత్తగారితోనే సరిపొతోంది. ఆఫీసు, ఇల్లు, అత్త గారు...ఇంక నాన్న కూడానా...అందులో నాన్న అది కరెక్టు కాదు ఇది కరెక్టు కాదు అని కామెంట్స్ చేస్తుంటారు. ఈయనకు అవి ఇష్టం ఉండదు. సర్దిచెప్పే ఓపిక, సమయం నాకు లేదు. మీరే ఏదో ఒకటి చేసి నాన్నను కూడా అమెరికాకు తీసుకువెళ్ళండి...".

అవాక్కయ్యింది కృష్ణవేణి. "ఎంత కష్టపడి పెంచాము పిల్లల్ని? ఆడపిల్లలని లెక్క చేయకుండా వారికి కావలసినంత స్వేచ్ఛనిచ్చి, మంచి చదువులు చదివించి పెళ్లిళ్లు చేస్తే ఒక్క నిమిషంలో ఇద్దరూ ఇలా తమ సౌకర్యాన్ని, స్వార్థాన్ని వాళ్లు ఎలా చూసుకుంటున్నారు" అని నిర్ఘాంతపోయింది. భర్తకు విషయాలు తెలిస్తే నొచ్చుకుంటాడని అబద్ధమాడింది.

"ఏవండీ! మీరు రాకుండా నేను ఆరు నెలలు ఉండలేను. స్రవంతికి ఎన్ని డబ్బు ఇబ్బందులున్నాయో అల్లుడు ఏమంటున్నాడో! కాబట్టి నా గ్రాట్యూటీ డబ్బులు పెట్టి మీకు టికెట్ కొంటాను. ఇద్దరం కలిసే వెళదాము..."

"వేణీ! ఇలా ప్రతి దానికి మన రిటైర్మెంట్ డబ్బులు వాడితే ఇక మన వృద్ధాప్యానికి ఏమి మిగులుతాయి? నేను ఒక్కడినే ఉంటాను. శ్రావణిని కూడా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నాకు వంట వచ్చు, పనిమనిషి ఉంటుంది..."

"ఏవండీ! మీరు లేకుండా నేను ఒక్క వారం రోజులు కూడా ఇంతవరకు ఒంటరిగా ఎక్కడికీ వెళ్లలేదు. మీరు రావలసిందే. ఇది నా నిర్ణయం". లక్ష రూపాయలు గ్రాట్యూటీ నుండి ఈ టికెట్ కోసం స్వాహా...వేంకటేశ్వరరావు అయిష్టంగానే ఒప్పుకున్నాడు.

ప్రయాణానికి రెండు నెలల ముందు నుండి స్రవంతి ఫోన్లలో ఆర్డర్లు. అమ్మా ఆ ఘాగ్రా చోళీ, ఫలానా పట్టు చీరా, శ్రీవారికి ఫలానా కుర్తా పైజామా, రకరకాల పిండి వంటలు, ఖరీదైన ఇతర వస్తువులు..డబ్బు మాత్రం వేణి-వేంకటేశ్వరరావు దంపతుల జేబులోవే. దాదాపుగా ఈ దుబారా ఖర్చులు యాభైవేలకు పైగానే.

"సార్! అమెరికా ప్రయాణం అంటున్నారు కాబట్టి ఇద్దరూ ఎక్జిక్యూటివ్ మాష్టర్ హెల్త్ చెకప్ చేయించుకోండి. ఇవి కాకుండా గుండెకు, కిడ్నీలకు సంబంధించిన కొన్ని పరీక్షలు చేయాలి" ఈ దంపతుల ఫిజీషియన్ దాక్టర్  శ్రీధర్ సలహా. తప్పదు కదా అని బిల్లు కౌంటర్ దగ్గరకు వెళ్లి ఎంత అని అడిగారు. రెండు నిమిషాలలో టక టక కంప్యూటర్లో అన్నిటికీ లెక్కవేసి "మొత్తం పరీక్షలాకు 40 వేలు అవుతుందండీ! " అని బిల్లు చేసే వ్యక్తి చెప్పాడు. వేంకటేశ్వరరావుకు గుండె ఆగినంత పని అయ్యింది. ఎక్కడినుండి తేవాలి ఇంత డబ్బులు, ఎందుకింత ఖర్చు ఇప్పుడు....వెను దిరిగి ఇంటికి వెళ్లారు దంపతులు.

"అమ్మా స్రవంతీ! మా హెల్త్ చెకప్‌కు 40 వేలు అవుతుందిట. మేము ఏమీ చేయించుకోము. రోజూ వేసుకునే మందులే ఆర్నెలలకు తెచ్చుకుంటాము..చాలదా".

"నాన్నా! మీకు అర్థం కాదేంటి? ఇక్కడ ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే, ఇన్షూరెన్స్ కవరేజ్ లేకపోతే నా ఆస్తిపాస్తులు అమ్మి కట్టాలి. మీకున్న క్రానిక్ డిసీజెస్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల ఖర్చులు విజిటర్ ఇన్షూరెన్స్‌లో కవర్ అవ్వవు...మీరు పరీక్షలు చేయించుకుని మీ ముఖ్యమైన భాగాలు ఆరోగ్యంగా ఉన్నాయని తెల్చుకోవాల్సిందే..."

కూతురి కర్కశత్వం విని వేంకటేశ్వరరావు దిగులు పడ్డాడు. తన సేవింగ్స్ అకౌంట్లో ఉన్న డబ్బులతో ఇద్దరికీ పరీక్షలు చేయించారు. భగవంతుని దయ వలన ఏమీ పెద్ద ఇబ్బందులు లేవు. ఆరునెలలకు సరిపడా జలుబు, దగ్గు, జ్వరం, మోకాళ్ల నొప్పులు, విరేచనాలు, వాంతులు, తలనొప్పి వగైరా వగైరా సమస్త రోగాలకు అల్లోపతీ మందుల ఖర్చు పదిహేను వేలు. ఇవి కాక కూతురికి, పుట్టబోయే బిడ్డకు హోమియోపతీ మందుల ఖర్చు మరో ఐదువేలు...తడిసి మోపెడు. భార్యా భర్తలు ఈ అపరిమితమైన, అలవికాని ఖర్చులతో నీరసపడ్డారు.

ప్రయాణం వారం రెండురోజుల్లోకి వచ్చింది. విమానంలో ఎకానమీ క్లాసు టికెట్టుతో ఒక్కరికి నలభై ఆరు కేజీల బరువు మాత్రమే తీసుకు వెళ్లవచ్చు. దంపతుల బట్టలు, అప్పటికి కొన్న సామాను బరువు కలిపితే ఒక్కొక్కరికీ యాభై కేజీలు దాటాయి. తమకు కావలసిన వస్తువులను తీసేసి కూతురి ఆనందం కోసం,తమ ఆరోగ్యం కోసం అతి ముఖ్యమైనవి పెట్టుకుని అతి కష్టం మీద సూట్కేసుల బరువు సరి చేశారు. వెళ్లేముందు రోజు రాత్రి స్రవంతి అత్తగారినుండి ఫోన్. "వదినగారూ! నేను మర్చిపోయాను. మా వాడికి జీడిపప్పు పాకం చాలా ఇష్టం. రెండు కేజీలు అవి, వాడికి, అమ్మాయికి బట్టలు, అలాగే మా అమ్మాయి వస్తువులు కొన్ని ఇస్తాను..పట్టుకెళ్లండి". వియ్యపరాలు కావటంతో మొహమాటపడి అలాగే అంది కృష్ణవేణి.

"వేణీ! మన చెకిన్ లగేజీ నిండింది. ఎక్కడ పెడతావు ఇవి? ఏవండీ! హ్యాండ్ లగేజీలో పెట్టుకుందాం. బాగుండదు అల్లుడు, వియ్యాలవారు ఏమైనా అనుకుంటారు..." ఏడు కేజీల హ్యాండ్ లగేజీలో వియ్యాలవారి వస్తువులు పట్టించే సరికి అవి కూడా నిండాయి.

అన్నీ సర్దుకొని, ఇల్లు తాళం పెట్టి బయలుదేరారు దంపతులు. వాషింగ్టన్ విమానాశ్రయంలో స్రవంతి,అల్లుడు రిసీవ్ చేసుకున్నారు. బయటకు రాగానే కారు ఎక్కేలోపు ఒళ్లు గడ్డ కట్టుకుపోయేంత చలి. బ్రతుకు జీవుడా అని ప్రయాణపు అలసటతో ఇంటికి చేరారు. ఇక మొదలైంది వారికి నరకం.

స్రవంతి నిండు చూలాలు కావటంతో ఇంటిల్లిపాది వంట భారం వేణిపైనే పడింది. ఇవికాక రెండు పూటలా సింక్ నిండా అంట్లు, వారానికొకసారి ఇల్లు వాక్యూం క్లీనింగ్, బండెడు బట్టలు ఉతకటం...రోజంతా ఊపిరి పీల్చుకునే సమయం లేకుండా వేణి పగలు రాత్రి పని చేస్తోంది. మొదట్లో వేంకటేశ్వరరావు భార్యను పట్టించుకోలేదు. మెల్లమెల్లగా వేణిపై ఉన్న పనిభారం అర్థమయ్యింది. సహాయం చేయటం మొదలు పెట్టాడు. అంట్లు తోమటం, బట్టలు వాషర్ డ్రైయర్ లో వేయటం.....భారంగా రోజులు గడుస్తున్నాయి.

పిల్ల కానుపు అయ్యింది. బారసాల చేశారు. మొత్తం వంటా కృష్ణవేణే. దాదాపు యాభై మంది. ఆరోజు మొదలయ్యాయి ఆమెకు ఆరోగ్య సమస్యలు. విపరీతమైన మోకాళ్లనొప్పులు, మెడ, చేతుల నొప్పులు...గ్లాసు ఎత్త లేదు, అడుగు వేయలేదు. చంటి బిడ్డకు స్నానం చేయించాలి..కూతురికి సాయం చేయాలి..బండెడు పని ఇంట్లో. అతి కష్టం మీద ఎవ్వరికీ చెప్పకుండ ఒక నెల గడిపింది వేణి. తరువాత మెల్లగా స్రవంతికి చెప్పింది.

"స్రవంతీ! నాకు విపరీతమైన మెడనొప్పి, మోకాళ్లనొప్పులు వస్తున్నాయి. పెయిన్ కిల్లర్స్ పని చేయటం లేదు. ఇక్కడ ఎవరైన దాక్టర్..."

స్రవంతి "అమ్మా! నేను ముందే చెప్పాను. ఇండియాలో ఆరోగ్య సమస్యలకు ఇక్కడ డాక్టర్లు అక్కడిలా అందుబాట్లో ఉండరు. ఇక్కడ ఒక ఇండియన్ డాక్టర్ ఉన్నాడు. అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తాను. కానీ, నువ్వు హైదరబాద్ డాక్టరుకు ఫోన్ చేసి కనుక్కో ఏమైనా మందులు చెబితే తెప్పిస్తాను"....

"స్రవంతీ! అవన్నీ అయిపోయాయి. డాక్టర్ ఫోన్లో చెప్పలేను అని అంటున్నారు. నువ్వు ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకో..."

అతి కష్టం మీద మరో వారం తరువాత డాక్టర్ అపాయింట్మెంట్ దొరికింది. ఫీజు 100 డాలర్లు. ఇన్షూరెన్సులో కవర్ అవ్వదు. తెచ్చుకున్న డాలర్లలో 100 ఇచ్చింది వేణి. "స్రవంతీ! యువర్ మదర్ మే నీడ్ కంప్లీట్ రెస్ట్ ఫర్ అ వీక్. ఇఫ్ ఈవెన్ ఆఫ్టర్ దట్ ద పెయిన్స్ డోంట్ రెడ్యూస్, వి నీడ్ టు డు ఎ స్కాన్ ఆఫ్ హర్ నెక్ అండ్ నీస్. దే విల్ కాస్ట్ టు  థౌసండ్ డాల్లర్స్.  ఇన్షూరెన్స్ డస్నాట్ కవర్ దీస్. ." స్రవంతికి గుండెలో రాయి పడింది. రెండు వేల డాలర్లా అని మారు మాట్లాడకుండా తల్లిని ఇంటికి తీసుకు వచ్చింది. ఒక వారం పాటు పని తనే చేసుకుంది. వేణి నొప్పులు తగ్గలేదు.

"నాన్నా! ఏం చేయను? రెండు వేల డాలరు పెట్టి పరీక్షలు చేయించే స్థోమత నాకు లేదు. మా ఆయన ఏవిటీ గోల అని విసుక్కుంటున్నారు. అమ్మ ఓర్చుకోవాల్సిందే. ఇంకా నాలుగు నెలలు ఉంది మీ ఆరు నెలలు పూర్తి అవ్వటానికి. నాకు బిడ్డ, మీ సాయం కావాలి..ఎలా"..

ఇంకో వారం చూద్దామని వేణి సర్ది చెప్పింది. నొప్పులు తగ్గక పోగా మానసిక వత్తిడితో, చలి విపరీతం కావటంతో, అసలు వ్యాయామం లేకుండా, బయటకు వెళ్లలేని మంచు కురిసే సమయంలో రోగం మరింగ తీవ్రమయ్యింది. వేణి పూర్తిగా మంచాన పడింది.

వేంకటేశ్వరరావు వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు. "అమ్మా స్రవంతీ! మీ అమ్మ ఇలానే ఉంటే చాలా కష్టం. మేము వెంటనే ఇండియా వెళ్లిపోతున్నాము. టికెట్ మార్పించుకున్నాము. రేపు ఆదివారం మా ప్రయాణం." అని తెగేసి చెప్పేశాడు. షాక్ తిన్నది స్రవంతి. అమ్మ పరిస్థితి చూసి ఏమీ అనలేకపోయింది.

మొహాలు నల్లగా పెట్టుకొని స్రవంతి, ఆమె భర్త వేణి దంపతులను ఇండియా విమానం ఎక్కించారు. రెండు రోజుల ముందునుండే ఇండియా అనగానే వేణిలో ఉత్సాహం మొదలయ్యింది. హైదరాబాదులో దిగారు. డాక్టరుకు చూపించుకున్నారు. స్పాండిలైటిస్, ఆర్థరైటిస్ చలికి, శారీరిక ఒత్తిడికి తీవ్రతరమయ్యాయని డాక్టర్ చెప్పాడు. తగిన వ్యాయామాలు, మందులు వాడి కుదుట పడటానికి ఒక రెండు నెలలు పట్టింది. పిల్లల సహాయం లేకుండానే మొత్తం భారాన్ని వేంకటేశ్వరరావు మోశాడు. భార్యను కంటికిరెప్పలా కాపాడుకున్నాడు.
ఆ రెండు నెలలూ వారిద్దరి మధ్య అమెరికాలో ఇంటికి బందీ అయ్యే జీవితం, ఆ చలి, పిల్లల స్వార్థంతో కూడిన నిస్సహాయత చర్చాంశాలు. భారతదేశం స్వర్గం అన్న భావన కలిగింది.

స్రవంతి నుండి తల్లికి ఫోన్ - "అమ్మా! మీరు ముందు వచ్చేశారని మా అత్తగారు బయలుదేరుతున్నారు అమెరికాకు. నాకు చాలా వస్తువులు కావాలి. మీరు కొని ఇవ్వండి..."

వేణి మనసు ఉగ్రమైంది. "స్రవంతీ! మా దగ్గర ఇంక వనరులు లేవు. మా సేవింగ్స్ అంతా ఖర్చైపోయాయి. మా జీవితం మొత్తం మీకోసం అన్నట్లుగానే బతికాం. ఇప్పటివరకు కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఖర్చులు మేమే పెట్టుకున్నాము. కానీ, ఇక మా వల్ల కాదు. నీ ఆడంబరాలకు, నీకు నిరంతరం సప్లై చేయటానికి మా దగ్గర డబ్బులు లేవు. మీ ఆయనో నువ్వో మీ అత్తగారికి డబ్బులు పంపించి మీకు కావలసిన వస్తువులు తెప్పించుకోండి. మేము చిల్లి గవ్వ కూడా ఖర్చు పెట్టము. అంతే కాదు, ఇక ముందు నీకు ఏది కావాలన్నా మీరు ఇండియా వచ్చినప్పుడు మీ డబ్బుతో కొనుక్కోండి. మీరు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు నాకు చేతనైంది వండి పెడతాను. కానీ మీ గొంతెమ్మ కోర్కేలు తీర్చలేను. సారీ అమ్మా! ఈ విషయం మీ ఆయనకు కూడా చెప్పు".

స్రవంతి నోట మాట రాలేదు. ఫోన్ పెట్టేసింది. వేంకటేశ్వరరావు ఆశ్చర్యపోయాడు. "వేణీ! ఈ పనే రెండేళ్ల నాడు చేస్తే ఎంత బాగుండేది? మన చరమాంకానికి డబ్బులు మరింత మిగిలేవి. ఇప్పటికైన మించిపోయింది లేదు. నేను ప్రైవేట్ బ్యాంకులో కన్సల్టెంట్‌గా చేరతాను. నాకు ఓపిక ఉన్నన్నాళ్లూ చేస్తాను. మన ఇద్దరి వరకూ హాయిగా జరిగిపోతుంది. పిల్లల పెళ్లిళ్లు చేశాము చాలు. మన బాధ్యత అంతటితో ముగిసింది. ఇకనైనా వారికోసమే బతుకకుండా మన ఆనందం, మన స్వీయోద్ధరణకు సమయాన్ని వెచ్చిద్దాం. ఏమంటావ్?"

"అవునండీ! నాకు కూతుళ్లిద్దరూ కనివిప్పు కలిగించారు. పూర్తిగా తమ స్వార్థం కోసం నా వైపు నుండి మానవతా దృక్పథం కూడా చూపించలేదు. మీ మాటే నా మాట. మన ప్రతిక్షణం ఇక పూర్తిగా మన కోసమే సద్వినియోగం కావాలి. అలాగే చేసుకుందాం"

మరునాడు స్రవంతి ఫోన్ చేసింది. వేంకటేశ్వరరావు ఇలా చెప్పాడు - "చూడమ్మా! మా జీవితమంతా ఎంతో కష్టపడి మిమ్మల్ని పెంచాము. ఉద్యోగాలు, పెళ్లిళ్ల వరకే మా బాధ్యత. మీ పిల్లలు, మీ అమెరికా అవసరాల కోసం మా వైపు నుండి ఒక్క నిమిషం కూడా ఆలోచించ కుండా అక్కడి పరిస్థితులకు భయపడి, అక్కడ అడ్జెస్ట్ అవ్వకుండా, ఇక్కడి మా ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోకుండా మీరు వ్యవరిస్తున్నారు. మీ పిల్లలు మీ బాధ్యత. మాది కాదు. మేము ఇప్పుడు సంపాదించే వయసు దాటి పోయాము. మీరు 25 ఏళ్లు దాటినా కూడా స్వావలంబన లేకపోవటం ఒకరకంగా మా పెంపకంలో లోపమే. మేము దీనిని సరిదిద్దాలని నిర్ణయించుకున్నాం. మీకు కష్టమైనా ఇదే సరైన నిర్ణయం. ఇకనైనా మా పరిస్థితులను అర్థం చేసుకొని మీ పనులు, మీ అవసరాలను మీరే పరిష్కరించుకోండి."

నెల తరువాత దంపతులిద్దరూ ఉత్తర భారత దేశ యాత్రకు ఒక ఇరవైమంది స్నేహితులతో కలిసి రైలు టికెట్లు బుక్ చేసుకున్నారు. దానికోసం ప్రణాలికలు సిద్ధం చేయటంలో మునిగిపోయారు. 

6, నవంబర్ 2015, శుక్రవారం

విధాత తలపున ప్రభవించినది - సిరివెన్నెల హృదయకమల వికాసం


విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం - ఓం
ప్రాణ నాడులకు స్పందననొసగిన ఆది ప్రణవ నాదం- ఓం
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం

సరసస్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం

ప్రాగ్దిశ (ప్రాకృత) వీణియపైన దినకర మయూఖ తంత్రుల పైన
జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన
పలికిన కిలకిల స్వనముల స్వర గతి జగతికి శ్రీకారము కాగా
విశ్వకావ్యమునకది భాష్యముగ

విరించినై ...

జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాదతరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం
అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా
సాగిన సృష్టి విలాసమునే

విరించినై ...

నా ఉచ్చ్వాసం కవనం
నా నిశ్వాసం గానం
సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతంకొన్ని గీతాలు ఆ కవి హృదయాన్ని ఆవిష్కరించటంతో పాటు భాషకే వన్నె తెస్తాయి. అజరామరమవుతాయి. అలాంటి ఓ గీతం సిరివెన్నెల చిత్రంలోని సరసస్వర సుర ఝరీ గమనమౌ అనే సీతారామశాస్త్రి గారి గీతం. గీతం యొక్క రూపం కవి యొక్క హృదయం. సంగీతానికి అర్థం తెలిపిన గీతం ఇది. సృష్టిలో మొట్టమొదటి శబ్దం ఓం. ఇది ఎలా ఉద్భవించింది? బ్రహ్మ తలపులలో ఉద్భవించినది. విశ్వానికి మూలం ఓం అని దీని అర్థం. నాడులన్నిటికీ స్పందనను ఇచ్చిన తొలి శబ్దం ఓం కారము. ప్రణవంగా చెప్పబడినది ఈ ఓంకారము. అంటే నిరంతరం ప్రస్తుతించబడేది అని అర్థం. విశ్వమంతటా ఓంకార నాదం నిరంతరం  వస్తూనే ఉంటుంది. వినేంత నిర్మలత్వం పెంచుకుంటే అది వినిపిస్తుంది. ఈ నాదం విశ్వరూపమై కనులనే కొలనులో ప్రతిబింబిస్తే, గుండెలోతులలో ప్రతిధ్వనించిన బ్రహ్మదేవుని వీణా గానమే ఈ సంగీతం. మంచిరసాలతో నిండిన స్వరాలు గంగాప్రవాహంలా సాగే అవతరించిన సంగీతం సామవేదము యొక్క సారము. ఈ రసహృదయుడు పాడిన గీతం జీవన గీతం. తానే బ్రహ్మయై గీతాన్ని రచించి వీణయై దానిని వినిపించాడు కవి. తూరుపు దిక్కనే వీణపై, సూర్యుని కిరణాలనే తంత్రులపై, మేలుకొన్న పక్షుల రవములు నీలి ఆకాశమనే వేదికపైన పలికిన కిలకిల స్వరములే స్వరజతులై ఈ జగత్తుకు శ్రీకారాము కాగా, విశ్వమనే కావ్యమునకు ఈ గీతం భాష్యముగా కవి హృదయం తానే బ్రహ్మగా ఆవిష్కరించింది. జన్మించే ప్రతి శిశువు పలికే జీవితం యొక్క అద్భుతమైన నాద తరంగాలు, చైతన్యము పొందటం ద్వారా కలిగిన స్పందనల వలన ఆ హృదయ ధ్వనులు మృదంగ నాదంగా, ఆది అంతములులేని రాగము, ఆది తాళములో, అనంతమైన జీవన వాహినిగా సాగిన సృష్టి లీల కవి బ్రహ్మ కలమున జాలువారింది, గాయకుని నోట పలికింది. ఆ గీతం ఉచ్ఛ్వాస అయితే గానం నిశ్శ్వాస అయ్యింది.

సృష్టి ఆద్యంతమూ నాదప్రవాహం ఏయే రూపాలలో మనకు ఆవిష్కరిస్తుందో ఇంత కన్నా అందంగా, పవిత్రంగా మనకు ఎవ్వరూ తెలియజేయలేరు అంటే అతిశయోక్తి కాదు. ఏ వాగ్గేయకారుడి అనుభూతికీ ఇది తక్కువ కాదు. ఎందుకంటే ఈ గీతం అనంతమైన విశ్వము, పరమాత్మ లీలలు, నిరంతర ప్రవాహంగా సాగే నాదానుసంధానాలకు సంబంధించింది. వేటూరి గారు ఈ నాదప్రవాహాన్ని శంకర గళనిగళము, శ్రీహరి పదకమలము అన్నారు. అది కూడా ఇటువంటీ అనుభూతి జనితమైన భావనే. సృష్టి స్థిలయములలో జీవరాశికి కలిగే స్పందనలు, ఆ సృష్టిలీలలో ప్రకృతిలో కలిగే ఉదయాస్తమయాలు, ప్రకృతికి స్పందించే జీవకోటి భావవ్యక్తీకరణలు...అన్నీ ఆ నాదోద్భవములే. వీటికి ఓంకారం ఆది. ఆ ఓంకారంతో అనుసంధానమయినదే సామవేదం. దాని సారమే సంగీతము. ఈ భావనను దివ్యంగా అందించే గీతంలో కవి హృదయాన్ని ఆవిష్కరించే పాత్ర అంధుడిది. అంధుడైనంత మాత్రాన భావనలు, విశ్వవిలాసపు రసాస్వాదన ఉండదు అనుకోవటం చాలా తప్పు. దృష్టి లేకపోతేనేమి? అంతర్ముఖుడైన కళాకారుడు తాదాత్మ్యతతో అన్నిటినీ అనుభూతి చెంది ఆలపించే గీతం ఇంత అందంగానే ఉంటుంది.

భావానికి ఔన్నత్యం కర్మేంద్రియముల స్థాయిని దాటి జ్ఞానేంద్రియముల ద్వారా చూడగలిగినప్పుడు. ఆ భావనకు భాష, సంగీతం తల్లిదండ్రులు. సీతారామశాస్త్రిగారి ఈ గీతం ఆయన పొందిన దివ్యానుభూతికి పతాకస్థాయి. నాదప్రవాహం ఓంకారమునుండి పుట్టి సృష్టిలోని అణువణువులోనూ భాగమైనందువల్లే దానికి దివ్యత్వం కలిగింది. నాదాన్ని శరీరమంతా నిరంతరం కలిగియున్నవాడు శివుడని త్యాగరాజస్వామి కొలిస్తే సృష్టి చేస్తూ విపంచిపై బ్రహ్మ అనుభూతి చెందాడు అని సీతారామశాస్త్రిగారు మనకు మనోజ్ఞంగా చెప్పారు.  సామసంగీత రాయ అని అన్నమచార్యుల వారు శ్రీవేంకటేశ్వరుని కొలిచితే ఇక్కడ ప్రకృతితో తల్లీనమైన పరమాత్మ వ్యక్తీకరణగా మనకు సీతారామశాస్త్రిగారు వివరించారు.

ఇక భాషా సంపదకు వస్తే ఈ గీతం తెలుగు భాషకే మరో మారు ప్రాణం పోసింది. అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల, నడుము, బొడ్డు, ముద్దు వంటి పదాలతో బూతు సాహిత్యం కల్తీ సారాలాగా తెలుగు చిత్రసీమలో పారుతున్న సమయంలో మనకు విశ్వనాథ్ గారు దివ్యౌషధమైన సంగీత సాహిత్య ప్రచోదనమైన చిత్రాలను అందించి భాషకు, సంస్కృతికి, సాంప్రదాయానికి ప్రాణం పోశారు. వారి దివ్యదృష్టికి సీతారామశాస్త్రిగారి దివ్యానుభూతి తోడైతే ఇక తెలుగుదనానికి తక్కువేమిటి? సాహిత్యంలోని ప్రతి అక్షరం కూడా పరమాత్మ తత్త్వాన్ని ఆవిష్కరించేదే. విధాత తలపు, అనాది జీవన వేదం, ఆది ప్రణవ నాదం, విశ్వరూప విన్యాసం, విరించి విపంచి గానం, సరసస్వర సురఝరీ గమనము, సామవేద సారం, ప్రాగ్దిశ వీణ, దినకర మయూఖ తంత్రులు, జాగృత విహంగ తతులు, వినీల గగనము, జగతికి శ్రీకారము, విశ్వకావ్యమునకు భాష్యం, జీవన నాద తరంగం, హృదయ మృదంగ ధ్వానం, అనాది రాగం, అనంత జీవన వాహిని, సృష్టివిలాసం, ఉచ్ఛ్వాస, నిశ్శ్వాస ఇలా ప్రతి ఒక్క అక్షరం కూడా చైతన్యపూరితమై, ప్రాకృతికమై మనసును తాకినవే.

సంగీతం గురించి ఏమి చెప్పను? కేవీ మహదేవన్ గారు స్వయంగా సామగానాన్ని అందించారేమో అనిపిస్తుంది. హరిప్రసాద్ చౌరాసియా గారి అద్భుతమైన వేణువాద్యం ఈ గీత సాహిత్యానికి ఎంతో వన్నె తెచ్చింది. అవ్యక్తానుభూతిని కలిగించేది వేణువాదనం. దానికి మూర్తీభవించిన ప్రతిభ చౌరాసియా గారిది. భావానికి గాయకుడి గళం జీవం. బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీలమ్మ గారు ఈ పాటలోని సాహిత్యానికి అమృతత్వం ఇచ్చారు. ముఖ్యంగా బాలుగారు పల్లవిలోను, పాటచివరి సాహిత్యంలోనూ కనబరచిన మాధుర్యం న భూతో న భవిష్యతి. ఇది వారి నేపథ్య గాయక జీవితంలో కలికితురాయి.

ఓంకారానికి సనాతన ధర్మంలో గల ప్రాధాన్యతను సాహిత్యం, సంగీతం, గాత్రంలో పరిపూర్ణంగా ప్రతిబింబించిన ఈ గీతం సిరివెన్నెల చిత్రానికే కాదు భారత దేశ సినీ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఈ గీతానికి సీతారామశాస్త్రిగారికి ఉత్తమ గేయరచయితగా, బాలుగారికి ఉత్తమ గయాకునిగా జాతీయ అవార్డులు రావటం వారి ప్రతిభకు, రసావిష్కరణకు సార్థకత.

ఎన్ని మార్లు విన్నా ఈ గీతం మరింత మధురంగా అనిపిస్తుంది.దివ్యత్వాన్ని కురిపిస్తూనే ఉంటుంది.