28, జనవరి 2016, గురువారం

గుళ్లో రామాయణాలు - 5

గుళ్లో రామాయణాలు - 5


రామాపురం గ్రామం పురాతనమైన రామాలయం. కృష్ణదేవరాయల కాలంలో కట్టిందిట. ఆ స్థంబాలు, ఆకృతులు, మూర్తులు చూస్తే అర్థమవుతుంది. కానీ, గుడిలో దీపం పెట్టే దిక్కు లేదు, నైవేద్యానికి అంతకన్నా దిక్కు లేదు. పూజారి వారానికొకసారి పక్క ఊరినుండి తన ఇష్టం ఉంటే వస్తాడు. లేకపోతే లేదు. ఆయన ఐదు ఊళ్ల పూజారి.

ఊళ్లో పెద్దయ్య ఉండబట్టలేక కలెక్టరు దగ్గరకు వెళ్లాడు:

"అయ్యా! మన రామాపురంలో రామాలయం, వారానికి ఒక సారి కూడా తెరిచి ఉంచట్లేదు. మా పెద్దలు ఈ ఆలయం ఎంతో మహిమాన్వితమైనదని చెప్పేవారు..."

"అదేంటండీ! పూజారి రోజూ పూజలు, నివేదనలు చేస్తున్నట్లు వీఆర్వో రికార్డులు ఉన్నాయి. చూడండి...ఊరకే నా సమయాన్ని వృథా చేయకండీ" అని రికార్డులు పెద్దయ్య ముందుంచాడు.

నిర్ఘాంతపోయాడు పెద్దయ్య. అందులో, రామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు, దానికి లక్ష రూపాయలు ఖర్చు పెట్టినట్లు, లెక్కలు బిల్లులతో సహా ఉన్నాయి. నోట మాట రాక తిరిగి వచ్చాడు.

పూజారి, వీఆర్వోల అవినీతి ఆ రాముడు గమనిస్తూనే ఉన్నాడు.

తిమ్మాపురం గ్రామం:

"మంత్రి గారు! మన లలితా పరమేశ్వరి గుడిని పునరుద్ధరించాలి. అమ్మ ఈ గ్రామాన్ని కాపాడే దేవత. దానికి నిధులు విడుదలయ్యేలా కలెక్టరు గారికి చెప్పండీ!"...

"ఆ గుడి ప్రభుత్వం ఆధీనంలో లేదయ్యా. అయినా, మీ మీరు వాళ్లు నా పార్టీకి ఓటు వెయ్యలేదు. నేనెందుకు సాయం చేయాలి? ఊళ్లో ఉత్సవాలకు మమ్మల్ని పిలవరు, మా నాయకులను సత్కరించరు, డబ్బులకు మాత్రం మా దగ్గరికి వస్తారు. పోయి మీరు వోటేసిన ఆ ప్రతిపక్ష ఎమ్మెల్యేను అడగండి..." అని కసురుకున్నాడు.

దేవుడికి పార్టీలా? అంతా చూస్తూనే ఉంది ఆ పరమేశ్వరి.

హైదరాబాదులో ఒక కాలనీలో గుడి ప్రయత్నాలు:

అసోసియేషన్ ప్రతినిధులు కార్పొరేటర్ గారితో - "అయ్యా, మన ఎమ్మెల్యే గారిని కలిసి ఈ కాలనీ ప్రజలు కోరుతున్నట్లు ఈ సీతారాముల గుడిని కట్టించటానికి సాయం చేయండి.."

"సీతారాములతో పాటు, సాయిబాబా విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తేనే ఎమ్మెల్యే గారు నిధులు విడుదల చేయిస్తాడట. అయినా, సీతారాముల గుళ్లెందుకయ్యా! ఎవ్వరూ చిల్లి గవ్వ కూడా హుండీలో వేయరు! అదే సాయి బాబా గుడి అయితే నెలకు కొన్ని లక్షలు వస్తాయి...ఆలోచించండి..."

వెంటనే కాలనీ అసోసియేషన్‌లో రాజకీయాలు: అవును షిర్డీ సాయి విగ్రహం కూడా ఉండాలని కొందరు, లేదు ముందు తలచినట్లుగానే సీతారాముల గుడి అని ఇంకొందరు. నెలలపాటు ప్రతిష్ఠంబన, చివరకు ఆదాయం కోసం భయపడి షిర్డీ సాయిదే ప్రధాన విగ్రహం, పక్కన చిన్న రాముల వారి విగ్రహం.

సాయిబాబా...సీతారాముల మధ్య కూడా రాజకీయాలా? ఆదాయం కోసం గుళ్లా...అంతా ఆ పైవాడు గమనిస్తూనే ఉన్నాడు.

2 కామెంట్‌లు:

  1. SASIKALA VOLETY, Visakhapatnam.28 జనవరి, 2016 8:50 AMకి

    మన దేవాలయాల దుర్భర పరిస్థితుల గురించి, రాజకీయ రొచ్చులో, రాములోరి గుడి గురించి, దేవుళ్ళని కలెక్షన్ల కోసం స్థాపిస్థున్న.వైనం చాలా బాగా రాసారు. ఏ గుడి కెళ్ళినా ముందు పెద్ద ఫ్లెక్సీలు, వాటిమీద ఛోటా, బడా నాయకుల బొమ్మలతో. దీనికన్నా ఇంట్లో మనస్పూర్తిగా ఒక నమస్కారం పెట్టుకోవడం ఉత్తమోత్తమం అనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి
  2. అవునండీ. దుర్భరంగా ఉంది పరిస్థితి.

    రిప్లయితొలగించండి