10, ఫిబ్రవరి 2016, బుధవారం

కృష్ణ భక్తి - మూడవ సంచిక

కృష్ణ భక్తి - మూడవ సంచిక



కృష్ణ భక్తిలో ఉన్న ప్రత్యేకత బాలునిగా లాలించి, చేష్టలను దర్శించి, అంతలోనే పరమాత్మగా అనుభూతి చెందటం. దీనినే మధుర భక్తిగా ప్రస్తుతించారు భాగవతులు. రాధ, గోపికలు మొదలు ఎందరో కృష్ణ భక్తులు తమ మధురభక్తితో తరించారు. వారికి స్వామి తప్ప ఇంక వేరే ఏమీ ఉండదు. మనలో కలిగే అన్ని భావనలూ స్వామితోనే పంచుకోవటం మధుర భక్తిలో ఒక లక్షణం. దీనివలన ఎన్ని కష్టాలైనా అవలీలగా దాటారు ఆ భక్తులు. అలాంటి వారిలో అన్నమాచార్యుల వారు అగ్రగణ్యులు. ఆ శ్రీకృష్ణుని బాలుడైన పరమాత్మునిగా భావించారు, అంతలోనే యశోదమ్మగా లాలించారు, గోపెమ్మగా ప్రేమించారు, భక్తునిగా సేవించారు, మణిమాణిక్యములతో పోల్చారు. ఆ మధురభక్తిలో ఎన్నలేని భావనలు, చివరకు శరణాగతితో స్వామికి సమర్పణము.

"భావయామి గోపాల బాలం" అనే సంకీర్తనలో ఎంత మనోజ్ఞంగా వర్ణించారో? ఆ బాల కృష్ణుడు నడుముకు కట్టుకున్న మేఖలము, అలంకరించ బడిన మణి ఘంటిక, మృదువైన శబ్దాలు చేస్తూ విలసిస్తున్నాయిట. కొంటె పదములు వేస్తూ, పెన వేసుకుంటూ, దూరమవుతూ, అద్భుతమైన నటన చేస్తూ ఉన్నాడుట. చిన్ని కృష్ణుని లీలలను ఎదురుగా దర్శించకుండా ఇలా రాయటం అసంభవం.

ఇంతలో ఆ బాలుని నవరత్నాలలో అద్భుతంగా పోల్చారు అన్నమాచార్యుల వారు. యశోద ముంగిట ముద్దులొలికే ముత్యంగా పోల్చారు..అంతటితో ఆగారా? తిద్దరాని మహిమల దేవకీ సుతుడు అన్నారు. ఆయన మహిమలను వర్ణించలేము అని బాలుడైన పరమాత్మ వైభవాన్ని చాటారు. గోపకుల స్త్రీ చేతుల మాణిక్యము, కంసుని పాలి వజ్రము, మూడులోకాలలో కాంతులను విరజిమ్మే పచ్చ, రతికేళిలో రుక్మిణికి పగడము, గోవర్ధన పర్వతానికి గోమేధికము, శంఖ చక్రాల సందులలో వైఢూర్యము, కాళీయుని పడగలపై పుష్యరాగము, శ్రీవేంకటాద్రిలో ఇంద్రనీలము, పాలసముద్రంలో దివ్యరత్నము...ఇవన్నీ ఆ శ్రీకృష్ణుడే. మరి ఆయన మన చెంతనే ఉన్న చిన్ని కృష్ణుడట, మనకు గతిగా నిలిచి కాపాడే కమలాక్షుడట, బాలుని రూపములో తిరిగే పద్మనాభుడట...ఇదీ ముద్దుగారే యశోద అనే సంకీర్తనలో అన్నమాచార్యుల వారు అనుభూతి చెంది కురిపించిన భావామృతవర్షిణి.

మరి ఆ చిన్ని కృష్ణునికి లాలి పాడాలి కదా? ఆయనే యశోదగా, గోపెమ్మలుగా భావించి అద్భుతంగా "లాలనుచునూచేరు లలనలిరుగడలా బాలగండవర గోపాల నిను చాలా" అని లాలించారు. "లలనాజనాపాంగ లలిత సుమచాప జలజలోచన దేవ సద్గుణ కలాప తలపులోపల మెలగు తత్త్వ ప్రదీపా..." అని బాలునికి లాలిపాడారు. అందులో ఒక బాలునిగా భావించారా? ఆ కలువకన్నులు కల వాడు సద్గుణాల రాశిగా, మన తలపులలో మెలిగే తత్త్వ ప్రదీపకునిగా దర్శించి నుతించారు. భక్తిలో జీవాత్మ-పర్మాత్మ తత్త్వములను ఎరిగి దాని నుండి అద్వైత భావనకు చేరుకునేలా మనకు ఇటువంటి సంకీర్తనలను అందించారు.

అందుకే కృష్ణ భక్తి సామ్రాజ్యంలో బాలుడి నుండి జగద్గురువు దాకా శతకోటి రూపానుభూతులకు ప్రత్యేక స్థానాలున్నాయి, అవి అన్నీ కలిపితే మధురమైన భక్తి రస సామ్రాజ్యంగా ప్రకాశిస్తుంది.

గోవింద కృష్ణజై గోపాల కృష్ణ జై!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి