22, ఫిబ్రవరి 2016, సోమవారం

తొలిరేయి గీతాలు - వెన్నెలలోనే వేడి ఏలనో (పెళ్లినాటి ప్రమాణాలు)



తొలిరేయి అనగానే మధుర భావనలు, ప్రేమానురాగాలు, విరహముతో పాటు ఉత్సాహం కూడా భార్యా భర్తలలో వస్తుంది. ఆ భావనలన్నిటికీ చిహ్నంగా 1958వ సంవత్సరంలో విడుదలైన పెళ్లినాటి ప్రమాణాలు చిత్రంలో "వెన్నెలలోనే వేడి ఏలనో" అనే గీతాన్ని తొలిరేయి గీతంగా దర్శకులు కేవీరెడ్డి గారు మనకు అందించారు. తొలిరేయి గీతాలు శీర్షికన మూడవ సంచికగా ఈ గీతం వివరాలు మీ ముందుంచుతున్నాను.

వెన్నెలలోనే వేడి ఏలనో వేడిమిలోనే చల్లనేలనో
ఈ మాయ ఏమో జాబిలి ఈ మాయ ఏమో జాబిలి
వెన్నెలలోనే విరహమేలనో విరహములోనే హాయి ఏలనో
ఈ మాయ ఏమో జాబిలి ఈ మాయ ఏమో జాబిలి

మొన్నటి కన్నా నిన్న వింతగా నిన్నటి కనా నేడు వింతగా
నీ సొగసూ నీ వగలూ హాయి హాయిగా వెలసేనే

రూపము కన్నా చూపు చల్లగా చూపుల కన్నా చెలిమి కొల్లగా
నీ కళలూ నీ హొయలూ చల్ల చల్లగా విరిసేనే

1959వ సంవత్సరానికి తెలుగులో ఉత్తమ చలన చిత్రంగా జాతీయ అవార్డు అందుకున్న ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు రాసినవారు పింగళి నాగేంద్రరావు గారు. ఘంటసాల మాష్టారు సంగీతంలో మాష్టారు, లీలగారు పాడిన గీతం మంచి పేరు తెచ్చుకుంది. వెన్నెలలో వేడి ఎందుకు, ఆ వేడిలోనే చల్లదనం ఎందుకు అని నాయికానాయకులు పాటను ఉత్సాహంగా ఆరంభిస్తారు. అంతలోనే వెన్నెలలో విరహమెందుకు, ఆ విరహంలోనే హాయి ఎందుకు అని మధుర భావనలను పలుకుతారు. అన్నీ వెన్నెలకు ఆపాదించటం ఆ చందమామకు ఆ వెన్నెలకే తెలియాలి. వెన్నెలలోని చల్లదనం తొలికలయికకు బీజం వేస్తుంది. ఈ చల్లదనం, ఈ విరహపు వేడి, ఈ హాయి అన్నీ చందమామ మాయే అంటున్నారు పింగళి వారు. నిజమే. లేకుంటే ఇన్ని భావనలు ఒకే చోట ఒకే సమయంలో ఎలా కలుగుతాయి?

మూడు ముళ్ల బంధంలో ఒకటవ్వబోయే జంట భావాలలో మొన్నటికి-నిన్నటికి నిన్నటికి-నేటికి ఎంత మార్పు? వలపులు ఎంత త్వరగా విరిసి గుబాళిస్తాయో కదా? ఆ భావననే పింగళి వారు మొదటి చరణంలో తెలిపారు. భర్త తన భార్యలోని ఈ సొగసు, వగలు ఎంత హాయిగా ఉన్నాయో అని తొలిరేయికి నాంది పలుకుతాడు. రూపము కన్నా అతని చూపులు చల్లగా ఉంటే, ఆ చూపుల కన్నా అతని చెలిమి పుష్కలంగా ఉందిట. ఇదీ ఆమె భావన. అతని కళలు, హొయలు చల్ల చల్లగా విరిసాయిట. అదీ ఆమె తొలిరేయి వేసిన అడుగు. ఈ విధంగా భార్యాభర్తల భావవ్యక్తీకరణతో ఒకరినొకరు ఉత్సాహపరచుకుంటూ, ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో, మధురమైన రేయిని మధురాతిమధురంగా చేసుకున్నారు. ఘంటసాల మాష్టారు-లీలమ్మ శ్రావ్యంగా పాడిన ఈ పాటలో ఏఎన్నార్, జమున జంట జీవించి ఈ గీతానికి ఔన్నత్యాన్నిచ్చారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి