4, మార్చి 2016, శుక్రవారం

స్పూర్తిదాయక గీతాలు - మౌనంగానే ఎదగమని, కలకానిది విలువైనది


అపజయాలు, ఒత్తిళ్లు, కష్టాలు, పరాభవాలు, కుంగుబాట్లు, ఒంటరితనాలు, అన్యాయం జరిగిందన్న ఆవేశం, ఆక్రోశం...ఇలా మనిషికి నిజజీవితంలో ఎన్నో మనోవికారాలు. వాటి వల్ల జీవిత రథం దారి తప్పే అవకాశం ఉంది. ఇవన్నీ సహజమే, చాలా సార్లు ఎలా ఈ జీవితం అన్న ప్రశ్న వస్తుంది. అప్పుడే కావాలి ప్రేరణ. ఒక్కసారి ఆలోచనలు అనే చీకటి గదిలోంచి బయటకు వెళ్లి చూస్తే ఈ కష్టాలు, బాధలు పడేది మనం ఒక్కళ్లమే కాదు అని అర్థమవుతుంది. సమాజంలో మనకన్నా కష్టాలలో ఉండి కూడా స్ఫూర్తితో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే వారిని చూస్తే ప్రేరణ కలుగుతుంది, ముందడుగు వేయాలన్న సంకల్పం చిగురిస్తుంది. ఎప్పుడైతే ఇవి దాటలేనివి, ఇవ నాకొక్కరికే వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అన్న ఆలోచనలు వస్తాయో ఆ క్షణమే సమాజం వైపు చూడాలి, అంతర్ముఖులం కావాలి.

ఈ మానసిక స్ఫూర్తికి ఆది మనలోనే. ఏదో ఒక దానిపై నమ్మకం ఉండాలి. అది దైవం కావచ్చు, గురువు కావచ్చు, ఇంకో వ్యక్తి కావచ్చు, లేదా స్వయం శక్తి కావచ్చు. చాలా సార్లు కష్టాల కడలి అనిపిస్తుంది. ఆ సమయంలో మనకు సనాతన ధర్మం అందించిన వాఙ్మయం తప్పకుండా తోడ్పడతాయి. అనాదిగా మానవ జన్మ ఎత్తిన ప్రతి వానికీ కష్టాలు తప్పలేదు. ఇది అవతార పురుషులైనా, యోగులైనా, మహాత్ములైనా...ఎవ్వరైనా సరే. వారు నమ్ముకున్న ధర్మం వారికి ఎలా ఈ సాగరాన్ని దాటడానికి సహాయ పడింది అన్నది మనకు రామాయణ, భారత, భాగవతాలు, పురాణాలు, భగవద్గీత స్పష్టంగా తెలిపాయి. రాముడి జీవితంలో ఎన్ని కష్టాలు రాలేదు? పాండవుల జీవితంలో ఎన్ని బాధలు? ధర్మమే వారికి బాసటగా నిలిచింది.

కలియుగ లక్షణమే అశాంతి, కల్లోలం, మోసం. కాబట్టి మానవునికి కష్టాలు దాటాలంటే మరింత స్ఫూర్తి, వ్యక్తిత్వ వికాసం, ధర్మము మరియు దైవంపై నమ్మకం కావాలి. స్ఫూర్తి మనలోనే కలగాలంటే కొంత కష్టమే. అందుకే ఓ గ్రంథమో, ఓ మహనీయుని చరిత్రో, ఓ చిత్రమో, ఓ కథో, ఓ గీతమో, లేకుంటే మరో వ్యక్తి సాంగత్యమో...ఇలా ఏదో ఒకటి స్ఫూర్తినిస్తుంది. బాధల్లో ఉన్న మనిషికి సంగీతం సాంత్వనను ఎందుకిస్తుందో తెలుసా? అది హృదయాన్ని తాకే కళ కాబట్టి, దైవం అందులో నివాసముంటుంది కాబట్టి. సంగీతానికి అక్షరం ప్రాణవాయువు. ఆ అక్షరం మనిషి మనోభావాలకు ప్రతిరూపం. అందుకే మన మనుసులోని భావాలను కవి అక్షరాలతో స్వరయుక్తంగా తాకితే వెంటనే స్పందన ఉంటుంది. అందుకే, మనోవికారాలతో మనం క్రుంగిపోతున్నప్పుడు భావయుక్తమైన గీతాలు మనలను ఉత్తేజపరచి వికారాన్ని కాస్త తగ్గిస్తాయి. అటువంటి రెండు గీతాలు మీకోసం.

1. మొదటిది నా ఆటోగ్రాఫ్ చిత్రంలో చిత్ర పాడిన మౌనంగానే ఎదగమని అన్న గీతం. ప్రేమలో దారుణంగా విఫలమైన ఒక యువకుడు దారుణంగా క్రుంగిపోతాడు. జీవించటం వ్యర్థం అన్న దిగులుతో హైదరబాదు వచ్చి తిండికి కూడా అవస్థ పడుతూ ఉంటాడు. ఆ సందర్భంలో అంధులచే ఒక సంగీత విభావరి ఏర్పాటు చేసి వారికి స్ఫూర్తిదాయకురాలైన ఒక యువతి పాడే పాట అతనికి మార్గదర్శకంవుతుంది. అతనిలో మార్పు మొదలవుతుంది. ఎటువంటి వైకల్యాలు ఉన్నా, ఆటుపోట్లు ఎదురైనా ముందుకు సాగమని ఉద్బోధిస్తుంది. మన తలరాతను మనం మార్చుకోవచ్చన్న అద్భుతమైన సత్యాన్ని తెలుపుతుంది. ఎక్కువ ఆర్భాటాలు లేకుండ ఎదగటం, ఎదిగిన కొద్దీ వినయంతో మెలగాలని చెబుతుంది. అపజయం కలిగితే క్రుంగిపోరాదని ఋతువుల సమయంలో ఆకులురాలిన చొటే కొత్త చిగురు వస్తుంది అన్న సారూప్యంతో మనలకు ధైర్యాన్నిస్తుంది. మజిలీ చేరటానికి ఎంతో దూరం అన్నదాని గురించి ఎక్కువ ఆలోచించంకుండా ఎన్నోదారులున్నాయి అని ఆలోచిస్తే మంచిందని సలహా ఇస్తుంది. యుగయుగాలుగా మనకు తెలుస్తున్న సత్యం - ఏ బాధ కూడా శాశ్వతం కాదు. తప్పకుండా తిరిగి చిరునవ్వు నవ్వే రోజు వస్తుంది. ఏ గొప్ప పని మొదలు పెట్టినా మొదట ఎన్నో అవరోధాలు వస్తాయి. కానీ, వాటికి భయపడక ముందుకు సాగాలి. విశ్వకళ్యాణానికి చేసిన సాగరమథనంలో తొలుగ గరళమే పుట్టింది, తరువాతే అమృతం. అలాగే ప్రతి మంచిపనికి ముందు విఘ్నాలుంటాయి, తరువాతే విజయం. కష్టాలు దాటితే ఆనందమనే నిధి మనం సొంతమవుతుంది. ఇది జీవిత సత్యం అని పలుకుతుంది. నుదుటి రాతలు, చేతి గీతలు అన్నీ మన ప్రయత్నంతో మార్చ వచ్చు. కావలసింది శ్రమ, ధైర్యం. అటువంటి ధీర శ్రామికుల ముందు విధి కూడా తలవంచుతుంది, దైవం వారిని అనుగ్రహిస్తుంది. ఆ విధంగా ముందుకు సాగి చరిత్రలు రాయాలి అని హితవు పలుకుతుంది.

గీతం మనలోని బలహీనతలను పక్కకు పెట్టి, శక్తులకు జీవం పోసి మనకు మంచి ప్రేరణనిస్తుంది. మానవ జన్మ అన్న తరువాత ఏదో ఒక లోపం తప్పదు. ఆ లోపాలను అధిగమించి స్వశక్తులై ముందుగు సాగించటానికి ఇలాంటి గీతాలు ఎంతో ఉపయోగపడతాయి. చంద్రబోస్ గారు ఇటువంటి గీతం ఒక మంచి సందేశాత్మక చిత్రమైన నా ఆటోగ్రాఫ్‌లో అందించటం మన అదృష్టం. కీరవాణి గారి సంగీతం కూడా సందేశానికి సముచితంగా ఉంటుంది. చిత్ర గారి గానం దానికి శాశ్వతత్వాన్ని ఆపాదించింది.

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది

అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలినచోటే కొత్త చిగురు కనిపిస్తుంది.


దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా
దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా
భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా
బాధవెంట నవ్వుల పంట ఉంటుందిగా
సాగరమథనం మొదలవగానే విషమే వచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమొచ్చింది.
అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది
కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది
తెలుసుకొంటే సత్యమిది
తలచుకుంటే సాధ్యమిది

చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో
మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో
పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో
మారిపోని కథలే లేవని గమనించుకో
తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు
నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే వ్రాయాలి
మా ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా
మా సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి
అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి

2. రెండవ గీతం వెలుగునీడలు చిత్రంలోని శ్రీశ్రీ గారి రచన "కలకానిది విలువైనది" అనే గీతం. మనిషికి ఎన్ని రకాల కష్టాలో? చిత్రంలో నాయికకు వివాహం చేసుకున్న కొన్నాళ్లకే భర్త యాక్సిడెంటులో మరణిస్తాడు. తీరని దుఃఖంలో జీవితం దుర్భరమయమనే భావనలో నలిగిపోతున్న ఆమెకు స్నేహితుడు ఈ గీతం ద్వారా సాంత్వననిచ్చి ఆమెలో మళ్లీ జీవించాలన్న సంకల్పాన్ని కలిగిస్తాడు. డాక్టర్ వృత్తిలోకి తిరిగి ప్రవేశించేలా చేస్తాడు. భార్యా భర్తలలో ఎవరు ఇలా అకాల మరణం చెందినా ఉన్న వారికి వర్ణించలేని వ్యథే. కానీ, అది వారు కోరి తెచ్చుకున్నది కాదు. అలాగే జీవితాంతం నిరర్థకంగా ఆనందానికి దూరంగా ఉండటం కూడా సరి కాదు. జీవిత భాగస్వామి మరణించినా కుటుంబం, సమాజం, దేశం పట్లా బాధ్యతలున్నాయి. ఆయుష్షు ఉన్నంత కాలం సకారాత్మక ధోరణితో జీవించాలి, ఏదో ఒకటి సాధించాలి. అన్నది ఈ గీతం సందేశం. కలకాదు, బ్రతుకు ఎంతో విలువైనది, దానిని కన్నీళ్లతో వృథా చేయకు అని చెబుతుంది ఈ గీతం. దానికి సారూప్యంగా, గాలి వీచినప్పుడు పూల తీగ నేల కూలితే దానిని అలానే వదిలేస్తామా? మృదువుగా నిలబెట్టి నీళ్లు పోసి మళ్లీం జీవం పోయమూ? జీవితం కూడా అంతే. అకాల మరణమనే పెనుగాలి వస్తే అంతటితో జీవితాన్ని ముగించకూడదు. మళ్లీ నిలబెట్టాలి. చీకటిలోనే అలమటించటమెందుకు? కలతలకు లొంగి మానసిక స్థైర్యాన్ని కోల్పోయి కవరించటం ఎందుకు? సాహసమే జ్యోతిగా చేసుకొని ముందుకు సాగాలి అని ఎంతో అద్భుతంగా చెబుతుంది. సముద్రపు లోతుల్లో ఆణిముత్యాలు ఉన్నట్లు శోకాల సముద్రం చాటున సుఖము కూడా ఉంది. జీవితంలో ఏదీ కూడా మన దగ్గరికి రాదు. మనమే కష్టపడి సాధించుకోవాలి అని ఒక దిశను నిర్దేశిస్తుంది.

శ్రీశ్రీగారు ఎంతటి ఉదాత్తమైన గీతాన్ని అందించారో సాహిత్యం చూస్తే అర్థమవుతుంది. యోగ్యత ఉన్న కవి హృదయం నుండి వెలువడే అక్షర సత్యాలు ఇవి. ఘంటసాల మాష్టారు భావ సౌందర్యం ప్రకాశించేలా అద్భుతంగా గానం చేశారు. పెండ్యాల వారి సంగీతం , ఏఎన్నార్ సావిత్రిల నటన ఈ పాటను సంపూర్ణం చేసి అత్యుత్తమ గీతాలలో ఒకటిగా నిలిపాయి.

కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనె బలి చేయకు
కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనె బలి చేయకు

గాలి వీచి పూవుల తీగ నేల వాలి పోగ
జాలి వీడి అటులేగాని వదులవైతువా
చేర దీసి నీరు పోసి చిగురించ నీయవా

అలముకున్న చీకటిలోనె అలమటించనేల
కలతలకే లొంగి పోయి కలువరించనేల
సాహసమను జ్యోతిని చేకొని సాగిపో

అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే
ఏది తనంత తానై నీ దరికి రాదు
శోధించి సాధించాలి అదియే ధీర గుణం


మడిసి అన్నాక కష్టాలు రాకుండా ఉంటాయా చెప్పండి!. శోకం, మానసిక వ్యధ, ఆందోళన, కన్నీళ్లు ఇవన్ని అందరికి ఎప్పుడోకప్పుడు వచ్చేవే. మరి అప్పుడు ఏమిటి చెయ్యటం?.  ఏమి చెయ్యొచ్చో అన్నదానికి ఈ పాటలు మంచి ఉదాహరణలు . పాజిటివ్ ఆలోచనలతో పోరాడమని వీటి సారాంశం. ఎందుకంటే అనుకూల (పాజిటివ్) ఆలోచనలు వ్యతిరేక (నెగటివ్)  ఆలోచనల కన్నా చాలా బలమైనవి. కొన్ని అనుకూల ఆలోచనలతో ఒక వ్యతిరేక ఆలోచనను పోరాడటం దీనిలో మొదటి మెట్టు. రెండోది - ఉన్న పరిస్థితిలోంచి బయటకు ఎవ్వరు లాగలేరు. అది మనం అడుగు వేస్తె తప్ప అవ్వని పని. అడుగు వెయ్యటానికి, ఆలోచనలు రావటానికి పక్కనవాళ్ళు సాయపడగలరు.

ఆశ వదలకుండా ఒక అడుగు అనుకూల ఆలోచనతో వేస్తె అక్కడ తప్పకుండా మనకున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అందుకనే మన పెద్దలు అన్నారు - సమస్య ఉంటే పది మందితో చెప్పుకోవాలిరా అని. దాని అర్థం సానుభూతి పొందటానికి కాదు - కష్టంలో ఉన్న మనిషి యొక్క మానసిక పరిస్థితి అడుగు ముందుకు వేసే ఆలోచనలను రానివ్వకపోవచ్చు. అలాంటప్పుడు నలుగురితో కలిసి, మాట్లాడితే - కొత్త ఆలోచనలు మన మనస్సులోకి వెళ్లే అవకాశం ఎక్కువ. అలాగే, నలుగురుతో మాట్లాడితే మనకున్న సమస్యకన్నా ఇంకా పెద్ద సమస్య కనిపించొచ్చు. అప్పుడు మన సమస్యను 'ఆ ఇది చాలా చిన్నది, నన్నేమి చెయ్యలేదు, పాపం వాళ్ళు ఇంకా ఎంత పెద్ద భవసాగరంలో ఉన్నారో' అని కొట్టి పారేసే అవకాశం వస్తుంది. అంటే - ఒక అనుకూల ఆలోచన మొదలయ్యినట్టే కదా? అది చాలు సమస్యను పూర్తిగా అధిగమించటానికి.

మరి కష్టాలు దాటడానికి సాధనాలు ఏమిటి? 1. ముందడుగు వేసే ధైర్యం - ఇక్కడ మనకు ఆ పరిస్థితిలో ధైర్యం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మన చుట్టూ ఉన్న వ్యవస్థను ఆశ్రయించాలి - కుటుంబం, బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు, గురువులు, తోటి పనివారు, పుస్తకాలు.  కానీ మొట్టమొదటి అడుగు మనమే వెయ్యాలి. పక్కవాళ్ళు వేయించారు అని అనిపించినా అది మన మనస్సు చెప్పనిదే జరగదు. 2. పరిష్కారం ఉంది అనే నమ్మకం, భగవంతుడు ఎప్పటికీ మనల్ని ఇలానే ఉంచడు అన్న విశ్వాసం.

గీతలో కృష్ణ పరమాత్మ, శంకరాచార్యుల వారు, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు....ఇలా ఎందరో మనకు కష్టమయమైన జీవితాన్ని ఎలా సాగించాలో చక్కగా బోధించారు.  ఈ రెండు గీతాలు కూడా ఆ కోవకు చెందినవే . ఈ రెండు గీతాలు అప్పుడప్పుడూ వింటూ ఉంటే జీవితంలో మనం దిగులుతో కుంగిపోకుండా, మనకు వచ్చే సమస్యలను అధిగమిస్తూ ఖచ్చితంగా ముందుకు  సాగిపోతాము. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి