RightClickBlocker

18, జులై 2016, సోమవారం

షిర్డీ సాయి వైభవం - సాయీ శరణం! బాబా శరణు శరణం!షిర్డీ సాయి మహాత్యం, ఆయన భక్తి సామ్రాజ్యంలో ఉన్న మాధుర్యం అనుభవైకవేద్యం. మనిషికి ఉండే వికారాలకు, సంస్కారాలకు అనుగుణంగా మార్గాన్ని చూపిన సద్గురువు ఆయన. అహంకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని విభిన్నమైన రీతులలో వెలిగించిన అవతారమూర్తి సాయి. యోగి అంటే ఎలా ఉండాలో ఈ యుగంలో జీవించి చూపించిన నిర్గుణ పరబ్రహ్మ సాయి. కోట్లాది భక్తులు ఆయనను ఆరాధించి తరించినారు. శ్రద్ధ సబురీ అన్న నినాదాలతో మనకు మార్గదర్శకుడైనాడు. కలియుగ అవలక్షణమైన ధనం, స్త్రీలోలత్వం మొదలైన వాటికి, కులమత జాడ్యాలకు దూరంగా సర్వమానవ సౌభ్రాతృత్వంతో కొత్త శకానికి నాంది పలికాడు సాయి. కొందరు మాయల ఫకీరని భావించినా, మరికొందరు ఆగ్రహించే పిచ్చివాడని ప్రేలాపించినా, సాయి యోగి, సద్గురువు, అవతరా పురుషుడు అన్నది ఆయన జీవిత చరిత్ర, ఆయన మహిమలు తెలుసుకుంటే అవగతమవుతుంది. మానవత్వానికి, మోక్షానికి మతంతో సంబంధం లేదన్నది సాయి మనకు నిరూపించిన సత్యం. అందుకే ఆయన శిష్యులలో ఒకరైన ఉపాసనీ బాబా అద్భుతమైన స్తోత్రాన్ని సాయి మీద రచించారు. అందులో రెండు శ్లోకాలు:

సదా సత్స్వరూపం చిదానంద కందం
జగత్ సంభవస్థాన సంహార హేతుం
స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపంతో ప్రకాశించే, జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు కారణమైన, భక్తులకై మానుష జన్మనెత్తిన సద్గుర్వు, ఈశ్వరుడైన సాయినాథునికి నమస్కారములు.

సదా నింబవ్రృక్షస్య మూలాధివాసాత్
సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం
తరుం కల్పవృక్షాధికం సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

ఎల్లప్పుడూ వేపచెట్టు నీడలో నివసిస్తూ, కామ్యములను తీర్చే కల్పవృక్షాన్ని మించి సాధించి వేప చేదును అమృతంగా మార్చిన సద్గురువు, ఈశ్వరుడు అయిన సాయినాథునికి నమస్కారములు.

షిర్డీ సాయి చరిత్ర పలుమార్లు పలుభాషల్లో ప్రచురితమైంది, చలనచిత్రంగా తీయబడింది. వాటన్నిటిలోనూ, విజయచందర్ గారు బాబాగా నటించిన షిర్డీ సాయిబాబా మహాత్యం చిత్రం ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది. 1986లో విడుదలైన ఈ చిత్రానికి కే వాసు దర్శకత్వం వహించగా ఇళయరాజు సంగీతం, ఆచార్యా ఆత్రేయ పాటలు గేయరచన చేశారు. ఆ చిత్రంలో బాబాను చూపినంత ఉన్నతంగా మరే చిత్రంలోనూ, టీవీ సీరియల్‌లోనూ చూపించలేదు. ఆ షిర్డీ సాయిబాబా మహాత్యం చిత్రంలోని ఒక అద్భుతమైన గీతం సాయీ శరణం బాబా శరణు శరణం అనే పాట. కేజే యేసుదాసు గారు అత్యద్భుతంగా గానం చేశారు. ఆ గీతం వివరాలు:


హే పాండురంగా! హే పండరినాథా!
శరణం! శరణం! శరణం!

సాయీ శరణం! బాబా శరణు శరణం!
సాయి చరణం గంగా యమున సంగమ సమానం!
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే!
మా పాండురంగడు కరుణామయుడు సాయే!


విద్యా బుద్ధులు వేడిన బలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై!
పిల్లాపాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై!
తిరగలి చక్రం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణురూపుడై!
మహళ్సా శ్యామాకు మారుతిగాను మరి కొందరికి దత్తాత్రేయుడుగా
యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు ధన్యులజేశాడు!

పెను తుపాను తాకిడికి అలమటించు దీనులను ఆదరించె తాననాథ నాథుడై!
అజ్ఞానము అలముకొన్న అంధులను చేరదీసి అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై!
వీధి వీధి బిచ్చమెత్తి వారి వారి పాపములను పుచ్చుకొని మోక్షమిచ్చే పూజ్యుడై!
పుచ్చుకున్న పాపములను ప్రక్షాళన చేసుకొనెను ధౌత్యక్రియ సిద్ధితో శుద్ధుడై!
అంగములను వేరు చేసి ఖండయోగ సాధనలో ఆత్మశక్తి చాటినాడు సిద్ధుడై!

జీవ రాశులన్నిటికీ సాయే శరణం సాయే శరణం!
దివ్యజ్ఞాన సాధనకు సాయే శరణం సాయే శరణం!
ఆస్తికులకు సాయే శరణం నాస్తికులకు సాయే శరణం!
భక్తికి సాయే శరణం ముక్తికి సాయే శరణం!

ఈ గీతం షిరిడీ సాయి తత్త్వానికి పూర్ణప్రతీక. ఎందుకంటే, సాయి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలన్నిటినీ ఈ గీతం క్రోడీకరించింది. సాయి ప్రధాన లక్షణాలు ఏమిటి? వీధుల తిరుగుతూ ఆహారం స్వీకరించటం. దాని అర్థం వారి వారి పాప సంచయాలను తీసుకోవటం. శ్రద్ధా భక్తులతో తనకు సమర్పించిన వారికి మోక్ష మార్గాన్ని ప్రసాదించాడు సాయి. ఎన్నో సార్లు ఆపదలో ఉన్న వారిని మనకు వింత చేష్టలు అనిపించే చర్యలతో కాపాడే వాడు. అగ్నిలో ఎక్కడో పడబోతున్న బిడ్డను తన చేయిని కొలిమిలో పెట్టి కాపాడాడు. విభూతిని వేరే ఊరికి పంపించి ఒక స్త్రీకి సుఖ ప్రసవాన్నిచ్చాడు. అలాగే, పాము కాటుతో మరణభయంలో ఉన్న భక్తునిపై కోపాన్ని చూపి ఆ విషాన్ని పైకి పాకకుండా గద్దించి శమింపజేశాడు. బిడ్డలు లేని వారికి బిడ్డలను అనుగ్రహించాడు. ఊరికి కలరా వ్యాధి అంటకుండా తిరగలి తిప్పి పిండిని పొలిమేరలలో చల్లించాడు. భక్తితో తనను శివునిగా కొలిచిన మేఘుని కరుణించాడు. గంగాయమునలను తన పాదాలవద్ద ప్రత్యక్షం చేశాడు. ఎందరో యోగులకు మార్గాన్ని చూపించాడు. తనను శ్రద్ధాభక్తులతో సేవించిన లక్ష్మీబాయిని కరుణించాడు. కొందరికి హనుమంతుడైతే మరికొందరికి దత్తావతారుడైనాడు. ఈ సాయే పాండురంగడని భక్తులకు స్వప్న సాక్షాత్కారమిచ్చాడు. ఇలా ఎన్ని? ఆ మహిమలను ఈ గీతం చక్కగా ఉట్టంకిస్తుంది.

పండరినాథుడైన పాండురంగడు, ఈ బాబా ఒక్కడే అన్న నమ్మకంతో ఈ గీతం ఆరంభమవుతుంది. కలియుగంలో గురుతత్త్వానికి ఉత్తమ ఉదాహరణ సాయి అన్న భావన ఆయన భక్తులకు తప్పకుండా ఏదో ఒకరోజు కలుగుతుంది. అటువంటి వాడే దాసగణు. ఆయన నోట ఇటువంటి గీతం అందించటం దర్శకుల ప్రతిభకు తార్కాణం. సాయే అందరు దేవుళ్లు అని నమ్మే వారికి వేరే క్షేత్రాలతో పనేముంది? అందుకే వారందరూ షిర్డీలో సాయి సేవలోనే గడిపి తరించారు. ఎవరు ఎలా భావిస్తే వారికి ఆ దేవతా స్వారూపంలో కనిపించాడు. యద్భావం తద్భ్వతి అన్నది మనకు సనాతన ధర్మం చెప్పినదే. దానిని మరోమారు నిరూపించాడు సాయి. సంశయమున్న వాని అహంకారమణచి తన మహాత్యాన్ని తెలిపాడు. గర్జిస్తున్న మేఘాలను శాంతపరచి అనాథులను కాపాడాడు. జ్ఞానమంటే అజ్ఞానాన్ని తొలగించటమే అని ఎన్నో ఉదాహరణలతో మనకు తెలిపాడు. లోభిత్వంతో దీపాలకు నూనె ఇవ్వని వ్యాపారికి నీళ్లతో దీపం వెలిగించి కళ్లుతెరిపించాడు. ఆత్మశక్తితో దేనినైనా సాధించవచ్చని ఖండ యోగము ద్వారా నిరూపించాడు. భగవద్గీత, రామాయణం మొదలైన వాని సారాన్ని, ప్రయోజనాన్ని వేర్వేరు భక్తులకు వారి మనసుకు హత్తుకునేలా తెలిపాడు. అందుకే సాయి జ్ఞానసాధనకు సద్గురువుగా నిలిచాడు. మతమౌఢ్యంతో ఉన్న ప్రజలను ఏకం చేశాడు. ఉత్సవాల ద్వారా ప్రజలలో ఐక్యతను చాటాడు. అందుకే ఆయన సమర్థ సద్గురువుగా కొనియాడబడ్డాడు.

ఆచార్య ఆత్రేయ ఈ గీతంతో సాయి తత్త్వాన్ని మనోజ్ఞంగా ఆవిష్కరిస్తే ఇళయరాజా గారి సంగీతం ఆధ్యాత్మికతను, గురు వైభవాన్ని కురిపిస్తుంది. ప్రతి పదంలోనూ భక్తి, విశ్వాసాలను ఆత్రేయగారు పొందుపరచారు. అలాగే, పల్లవి నుండి ఆఖరి అక్షరం వరకు రోమాంచకంగా సాగే సంగీతాన్ని ఇళయరాజా గారు అందించారు. ఇటువంటి ప్రత్యేకమైన గీతాలకు ప్రత్యేకమైన వ్యక్తి గాయకుడిగా కావాలి. మతాతీతమైన భక్తికి యేసుదాస్ గారి కన్నా ఉత్తములెవరు? క్రైస్తవుడైనా, గురువాయూర్ కృష్ణుడిని, శబరిమలై అయ్యప్పను అద్భుతంగా నుతించిన అమృత గళం ఆయనది. అందుకే ఈ గీతం కూడా ఆయన స్వరాలలో మరింత ప్రకాశించింది. షిర్డీలో మహళ్సాపతి మొదలైన అచంచలులైన సాయి భక్తుల భక్తి విశ్వాసాలను ఆయన తన గాత్రంలో ఆవిష్కరించారు. ముప్ఫై ఏళ్ల తరువాత కూడా ఈ గీతం సాయి భక్తుల హృదయాలలో సుస్థిరంగా నిలిచి ఉంది.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!

14, జులై 2016, గురువారం

వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి - వేటూరి వారి పద సమ్మోహనం


ఒక కవికి భావవ్యక్తీకరణలో ఔన్నత్యం అతనికి వచ్చే ప్రేరేపణ వల్ల కలుగుతుంది. ఒక సినీ గేయరచయితకు దర్శకుని ఆత్మసౌందర్యం ఆ గేయం యొక్క భాషా ప్రవాహంలో వెలువడుతుంది. వేటూరి వారు విశ్వనాథ్ గారి ఆత్మసౌందర్యానికి ప్రతీకగా ఎన్నో అద్భుతగీతాలు రాశారు. అందులో ఒకటి  సప్తపది చిత్రంలోఈ వ్రేపల్లియ ఎదఝల్లున అనే గీతం. సంగీత-నాట్యశాస్త్రాల పట్ల మక్కువ కలిగి ఆ విద్యను అభ్యసించిన ఇద్దరు కళాకారుల మధ్య గల ప్రేమ నేపథ్యంలో చిత్రీకరించబడిన అద్భుత రస కావ్యం ఇది. ప్రేమ భరితం, కృష్ణ తత్త్వ పూరితం, కృష్ణలీలా వినోద మిళితం. రాసలీల అనగానే కృష్ణుడు గుర్తుకు వస్తాడు. రేపల్లెలో ఆ కృష్ణుని లీలలు ఎన్ని? అనంతం, అమోఘం, అనిర్వచనీయం. అంతటా తానే, అన్నిటా తానే, అయినా ఎవరి సొంతమూ కాదు, ఏదీ ఆయనకు అంటదు. ఆ లీలాకృష్ణుని వినోదభరితమైన రాసలీలలకు అద్భుతమైన  ఆవిష్కరణ ఇచ్చారు వేటూరి వారు.  సాహిత్యం పరిశీలిద్దాం.

వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆ నందన మురళి ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి


కాళింది మడుగున కాళీయుని పడగల
ఆబాలగోపాలమా బాలగోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల జూడ
తాండవమాడిన సరళి గుండెలనూదిన మురళి ఇదేనా ఇదేనా ఆ మురళి

అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి
జీవన రాగమై బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల బ్రోచిన మురళి ఇదేనా ఇదేనా ఆ మురళి
వేణుగానలోలుని మురిపించిన  రవళి
నటనల సరళి ఆ నందన మురళి ఇదేనా ఆ మురళి  మువ్వల మురళి ఇదేనా ఆ మురళి


మధురా నగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనా గీతి పలికించి
సంగీత నాట్యాల సంగమ సుఖ వేణువై
రాసలీలకే ఊపిరి పోసిన అందెల రవళి ఇదేనా ఇదేనా ఆ మురళి

రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళిరేపల్లె ఎద ఝల్లులో పొంగిన నాదం ఆ శ్రీకృష్ణుని మురళీధ్వని అట. ఎంత అద్భుతమైన భావన? గోకులమంతా శ్రీకృష్ణునికి దాసోహం అని ఆయన వేణుగానలహరిలో పరవశులైన సమయంలో గుండెలోతుల్లో నుండి జన్మించిన రవళి ఆ నాదంతో అనుసంధానమైతే? అదే భావన వేటూరి వారు మనకు అందించారు.

కాళింది మడుగులో కాళీయుడనే నాగరాజు విషపు పడగలపై వ్యత్యస్త పాదములతో నర్తిస్తూ వాని పొగరణచి విజేయుడై నిలచిన శ్రీకృష్ణుడు తన నాట్య భంగిమలతో ఆ గోకులవాసుల గుండెలనూదాడట. ఆహా! ఏమి సన్నివేశం!! కన్నులకు కట్టినట్లుగా రచించారు వేటూరి వారు.

ఒక రాగంలో తొలుత చెవులను అలరించిన ఆ నాదం తరువాత పలుకలేని భావనలు కలిగించి, మరల మరల వినిపించి ఆ గోపికలపై మరులు కురిపించిందట. కృష్ణుని సమ్మోహనం అక్కడి వారి జీవన రాగమైంది. అంటే, ప్రతి అడుగూ లయబద్ధమై కృష్ణం సర్వంగా సాగింది. ఆ కన్యల కళ్లు కలువలులా విచ్చుకోవటానికి కారణం స్వామి వేణుగాన ప్రేరిత చంద్రవీక్షణాలట. బృందావనంలో జరిగే ఈ రాసహేల మన మనసుల్లో ఆవిష్కరించారు వేటూరి వారు.

ఆఖరి చరణంలో రాధ తత్వం యొక్క సువాసనలు మనకు అలదారు వేటూరి వారు. యమునా తీరమున సంధ్యా సమయములో రాధ వేయి కళ్లతో వేచి చూస్తుంటే, ఆ రాధ ఆరాధనా గీతం పలికితే దానికి ప్రేరణ స్వామి వేణుగానమే కదా? భిన్నమైనా స్వామిలో ఏకమైన భక్తురాలు రాధ. సంగీతము, నాట్యము సంగమానికి కారణమైన ఆ వేణువు రాసలీలకు ఊపిరి పోసిందట.

ఇన్ని విధాలా ఆ స్వామి మురళీ రవాన్ని నుతించిన అతికొద్ది సినీగీతాలలో ఈ వేటూరి వారి గీతం ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. కారణం, అందులోని సాహితీ సంపద, భావ వ్యక్తీకరణ, తెలుగు భాషా సౌందర్యం. తెలుగు భాషలో ఉన్న గొప్పతనం నానార్థాలు. ఒకే పదం రెండు మార్లు వచ్చిందేమిటా అనుకుంటాము. కానీ, వాటిలో అద్భుతమైన  విలక్షణమైన అర్థం నిబిడీకృతమై ఉంటుంది. అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల జూడ...అన్న పద సంపుటి గమనించండి. ఆ+చెరువున (కాళింది మడుగున) అచ్చెరువున (అచ్చెరువు ఆశ్చర్యానికి వికృతి)...అద్భుతమైన పదప్రయోగం కదూ! అలాగే, అనగల రాగమై, అనలేని రాగమై అన్న పంక్తులలో వ్యక్తావ్యక్తమైన భావనలను ఆవిష్కరించారు కవి. ఆఖరి చరణంలో మళ్లీ ఒకేలా ధ్వనించే పదాల అర్థభేదాన్ని పదప్రవాహంలా సాగించారు వేటూరి వారు.

చాలా సార్లు వేటూరి వారు మాస్ పాటల కవి కదా? ఇటువంటి గీతాలు ఎలా రాశారో అనిపిస్తుంది. కానీ, దానికి ప్రేరణ దర్శకులే. కాశీనాథుని విశ్వనాథ్ గారి ఆధ్యాత్మిక, సాహిత్య, సంస్కృతీ వికాసం ఆయన ప్రతి చిత్రంలోని ప్రతి సన్నివేశంలోనూ గోచరమవుతుంది. ఆనాటి కాలానికి కాస్త వివాదాస్పదమైన కులాంతర వివాహం ఈ చిత్రం కథ అయినా, సంస్కృతి, సాంప్రదాయాలను, కళలను పూర్తిగా గౌరవిస్తూనే అద్భుతమైన చలనచిత్రాన్ని మనకు అందించారు. ఆ ప్రతిభ ఈ రేపల్లియ ఎద ఝల్లున అనే గీతంలో రవళిస్తుంది. ప్రియుడు వేణుగానంలో ప్రతిభామూర్తి అయితే ప్రేయసి వివాహిత అయిన నాట్యకళా కోవిదురాలు. వేర్వేరు కులాలలో జన్మించిన వీరు ఒకటి ఎలా అయ్యారు? దానికి ఒక నిప్పులాంటి బ్రాహ్మణుడు ఎలా వెసులుబాటు కలిగించాడు అన్నది చిత్రం యొక్క అద్భుతమైన గాథ. అందులో ఎన్ని అద్భుతమైన పాత్రలు? ఏమి గీతాలు? వేటూరి వారి కలంలో ఒక్కొక్క గీతం ఒక్కొక్క రసగుళిక. విశ్వనాథ్ గారి ప్రత్యేకత కళలతో పాటు ఉన్నతమైన సందేశాన్ని కూడా పొందుపరచటం. దానికి తగ్గట్లు పాత్రలను రూపొందించటం. ఇక మామ మహదేవన్ గారి సంగీతం బాలు-సుశీలమ్మల జంటగాత్రహేల ఈ గీతాన్ని అజరం అమరం చేశాయి. వేటూరి వారి సినీ వినీలాకాశంలో ఈ గీతం ఒక ధృవతార. ఇటువంటి గీతాలతో వేటూరి వారి తెలుగు భాషా సౌగంధికలు శాశ్వతమైపోయాయి. 

8, జులై 2016, శుక్రవారం

మొహమాటం సన్నాయి నొక్కుళ్లు

మొహమాటాల మారాజులం, మారాణులం మనం. ఇష్టాయిష్టాలు, నిజం కుండలు బద్దలు కొట్టినట్లు చెబితే అవతల వాళ్లు నొచ్చుకుంటారని మనకు మొహమాటాన్నిచ్చాడేమో దేవుడు అనిపించినా, ఈ మొహమాటంతో చాలాసార్లు మహా తంటానండోయ్. మొహమాటం వల్ల కలిగే కొన్ని సన్నివేశాలు మీకోసం

----------------------------------------------------------

"కూర ఎలా ఉందండీ వదినా?"

"అద్భుతంగా ఉందమ్మా! ఎలా చేశావు వదినా?"

(మనసులో నా ఖర్మ, ఇదీ ఓ కూరేనా, ఉప్పులేదు, కారం లేదు, కుక్కలు కూడా తినవు ఈ కూరను అని తిట్టుకుంటూ)

"అయితే ఇంకాస్త తినండి వదినా"...అని, వదిన వారిస్తున్నా కంచంలో మరింత ఆ కూర. పాపం వదిన...మింగలేక కక్కలేక మొహం అదోలా పెట్టలేక భావాలన్నీ దిగబెట్టుకొని ఓ అరగంట కష్ట పడి, సగం కూర వదిలేస్తుంది.

"చూశారా మా వదిన? నేను రెండో సారి కూర వేస్తే ఎంత పొగరుగా వదిలేసిందో? ఎంత బావుందండీ కూరా"

"నీకు బాగుంటే ఆవిడకు బాగుండాలని లేదు కదోయ్.."

"అంటే, మీ ఉద్దేశం ఏమిటి? కూర బాలేదా?"

"అబ్బా! అలా కాదు. నాకు చాలా నచ్చింది..."

"మరైతే రాత్రికి కూడా అదే తినండి. బోలెడు మిగిలింది. "

------------------------------------------------------------------
అత్తారింటికి ఓ పూజకు వెళ్లిన అల్లుడు గారి గాథ.

"వీళ్ల దుంపతెగ. ఎంత సేపైనా కానివ్వరు. నాకు గంటసేపటినుండి ఆకలి. అసలే షుగర్ పేషెంటును. ఇంకా భోజనానినికి ఎంత టైం పడుతుందోకాస్త కనుక్కో బాబూ!"

"పూజ పూర్తయింది భోజనాలు సిద్ధం అన్నయ్య గారూ"

ఇంతలో పెద్దరికం చూపించాలి కదా, అందుకని మొహమాటానికి "నాకేం తొందరమ్మా! ముందు పెద్దవాళ్లను కానీయండి."

"అలాగే అన్నయ్యా!"

ఇంకో బంతి పూర్తయ్యేలోపు ఈయనగారి ఆత్మారాముడి గగ్గోలు పెళ్లాం మీదకు మళ్లింది.

"ఏమేవ్! పుట్టింటికొస్తే చాలు మొగుడు, వాడి బాగోగులు అసలు పట్టవు. రెండు గంటలనుండి ఇక్కడ ఆకలితో నక నకలాడుతున్నా. నీకు గానీ, మీ వాళ్లకు గానీ ఇక్కడో పక్షి ఉన్నాడు వాడికి కాస్త కాఫీ, టీ చూసుకుందామని ఉండదు. అయినా ఏమి చాదస్తమో మీ వాళ్లది. ఎంతంత సేపు పూజలు. త్వరగా పూర్తి చేయరు. ఎక్కడలేని తీరికంతా పూజలోనే.."

"ఏవండీ! మా వదిన మిమ్మల్ని ఇందాకే తినమని అడిగింది. ఎందుకు తినలేదు.."

"ఆ నువ్వు చెప్పలేదని. మీ వాళ్లకు లేకపోయినా నాకు పెద్దలను గౌరవించటం తెలుసు"

"ఎందుకండీ అంతలేసి మాటలు, ఇదుగోండి తినండి" అని ప్లేటులో ఇచ్చింది.

బ్రతుకు జీవుడా అని గబ గబ లాగించాడా ఇంటి అల్లుడు. పెళ్లై దశాబ్దాలైనా దశమ గ్రహమే.

--------------------------------------------------------------------
కార్లో ఎనిమిది సీట్లు ఉన్నది 9 మంది. 6 గంటలు ప్రయాణం.

"సర్దుకు పోదాలే వదినా! మనమేగా! ఒక్క మనిషేగా ఎక్కువ, మనిద్దరం వెనకాల కూర్చుందాం"

"వద్దులే వదినా! 6 గంటలు ప్రయాణం, ఇంకో 2వేలు ఎక్కువవుతుంది అంతేగా, పెద్ద బండి మాట్లాడుకుందాం"

"పర్లేదు వదినా. డబ్బులు దండగ. 8 సీట్లదే మాట్లాడండి"

"అన్నయ్యగారూ! మీకు నడుం నొప్పి కదా, మేము ఆడవాళ్లం వెనకసీట్లో సర్దుకుంటాం లేండి. మీరు మధ్యలో కూర్చోండి. వసతిగా ఉంటుంది.."

"అలాగే అమ్మాయ్"

ఆ రోడ్డు హైదరబాదు దాటగానే గతుకులు. ఇక వెనక సీట్లో కూర్చున్న ఆ వదిన గారి సణుగుడు:

"కాళ్లు జాపుకునేందుకు లేదు. వెధవ వ్యాను. ఈ మగాళ్లకు కాస్త కూడా మనమీద ధ్యాస ఉండదు. ఈ గతుకులు దాటేలోపు మన నడుములు, మోకాళ్లు పోయేటట్టున్నాయి."

"అవునొదినా, బాత్రూంకి ఆపినప్పుడు మారుదామని చెప్పేదా?"

"వద్దులే వదినా. పెద్దవాళ్లు ఏమైనా అనుకుంటారు. మళ్లీ జీవితాంతం ఈ మాట ఉండిపోతుంది. అమ్మో అయ్యో ఈ మోకాళ్లు బిగుసుకుపోతున్నాయి..."

-----------------------------------------------------

షాపులో వదిన-ఆడపడుచు-అత్తగారు

"వదినా, అత్తయ్య గారు - మీకు ఎటువంటి చీర కావాలో చెప్పండి. తెప్పిస్తాను."

"నీ ఇష్టం అమ్మాయ్. నువ్వు ఏది కొన్నా సరే."
"నీ ఇష్టం వదినా. నేను అన్నీ కట్టుకుంటాను"

"ష్యూరా! మీరు సెలెక్టు చేసుకుంటే బాగుంటుంది కదా!"

"అలా ఏమీ లేదు. ముగ్గురికీ నువ్వే సెలెక్ట్ చెయ్యి "

"వదినా! మీకు ఈ వంగపండు రంగు చీర కొన్నాను. ఎలా ఉంది"

"బాగుంది వదినా"

"అత్తయ్యగారు! మీకు ఈ ఆకుపచ్చ చీరకొన్నాను ఎలా ఉంది"

"బాగుందమ్మాయి"

ఇంటికి వచ్చాక..

"అమ్మా! నాకు ఈ రంగు ఏం బాగుంటుందే. కొట్టొచ్చినట్టుండదూ! వదినకు అంతమాత్రం తెలీదా?"

"హా! నిజమేనే. నాది మాత్రం, నాకు ఆ ముదురు ఆకుపచ్చ అసలు నచ్చదు. లైట్ ఆకుపచ్చ అయితే బాగుంటుంది. ఏమోనమ్మా! అంతా ఆమెగారి ఇష్టం"

"పోనీ, వదినను అడిగి మార్చేసుకుందామా?"

"వద్దులేవే! తాను కొన్నవి మనం కట్టుకోలేదని సాధిస్తుంది"

------------------------------------------------------------------------------

7, జులై 2016, గురువారం

ఆషాఢం ఎడబాట్లు-శ్రావణ సమీరాలు


"ఏవండీ! బామ్మ, అమ్మ చెప్పినప్పుడు అంతగా తెలియలేదు. కానీ మిమ్మల్ని వదిలి నెలరోజులు...ఈ ఆషాఢం అవసరమా? " అంది శ్రావణి బుంగమూతితో భర్తను హైదరాబాదుకు సాగనంపుతూ. "శ్రావణీ! ఇప్పటికి అర్థమైందా నా పరిస్థితి ఏమిటో? అయినా, అంతా మన మంచికే. ఈ ఎడబాటు మన బంధాన్ని మరింత దృఢం చేస్తుంది. నువ్వు లేకుండా నాకు మాత్రం తోస్తుందా? ఎంత, నెలరోజులేగా?" అని సర్ది చెప్పి శ్రావణిని వాళ్ల పుట్టింట్లో దించి హైదరాబాదు బయలుదేరాడు ఆదిత్య. మనసంతా శ్రావణి మీదే. నాలుగు నెలలు కూడా కాలేదు. నెలరోజుల పాటు శ్రావణిని విడిచి పెట్టి ఉండాలా? ఏం చేస్తాం అని బస్సెక్కాడు. ఆలోచనలు నాలుగు  నెలలు వెనక్కి వెళ్లాయి. తమ పెళ్లినాటి మధురస్మృతులు అతని పెదవులపై చిరునవ్వునొలికించాయి.

"పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేను పెండ్లి కూతురు" అనే అన్నమాచార్యులవారి సంకీర్తన నాదస్వరంలో వస్తూ ఉంటే తలంబ్రాలు పోసుకుంటున్నారు శ్రావణి-ఆదిత్య. పక్కనే శ్రావణి చెల్లెలు, ఆదిత్య చెల్లెలు ఉత్సాహంగా "అక్కా! వంగకు", అన్నయ్యా! ఎత్తిపొయ్యి" అని చెబుతూ గలగలా మంటపమంతా సందడి చేస్తుంటే, వధూవరులు ఎవ్వరి మాట కూడా వినే పరిస్థితిలో లేరు. కళ్లు కలిసాయి, మనసులు ఏకమయ్యాయి, పవిత్ర బంధం వారి చేతులలో ఆనంద తాండవంతో  ఒకరిపై ఒకరు లయబద్ధంగా తలంబ్రాలను జలపాత ధారలుగా పోసుకుంటున్నారు. ఎవ్వరి మాట వినకుండా మైమరపుతో, ఆరాధనతో వేడుకను జరుపుకుంటున్నారు. "బాబూ, అమ్మా, తలంబ్రాలు సంపూర్ణం" అని పురోహితుడు తట్టి పలకరిస్తే వారు తమ ఆలోచనలనుండి బయటక వచ్చి కిలకిలా నవ్వుకున్నారు. పసుపు బట్టలతో కొంగు ముడి వేసుకొని శ్రావణి-ఆదిత్యల జంట అరుంధతీ నక్షత్రం చూడటానికి బయటకు వెళ్లారు. మాఘమాసం చల్లని వెన్నెలలో సప్తర్షి మండలంలో అరుంధతి అద్భుతంగా కనబడింది. వధువు సిగ్గుతో వరుని కళ్లలోకి చూసి అతనికి నమస్కరించింది. వరుడు ఆమెను గట్టిగా చేయిపట్టుకొని తిరిగి మంటపంలోకి నడిపించుకు తీసుకు వచ్చాడు.

"అమ్మా! శ్రావణీ! మీ వారి పేరు చెప్పి కుడి కాలు లోపలికి పెట్టు" అని అత్తగారు రాజేశ్వరి అడిగింది. సిగ్గుతో "శ్రీనివాస ఆదిత్య" అని చెప్పి లోపలకు అడుగిడింది. పసుపు బట్టలతో, నుదుటన బాసికం, జీలకర్ర-బెల్లం, తలంబ్రాలు, కర్పూర హారాలు, పారాణి, కళ్లకు కాటుక, బుగ్గన చుక్క...ఆ జంట సీతారాముల్లా వెలిగిపోతున్నారు. శోభనానికి ముహుర్తం మర్నాడు రాత్రి కావటంతో దంపతుల కొంగు ముడి విప్పారు. వేరుగా పడుకున్నా వారి ఆలోచనలు అన్నీ ఆ  మధురమైన వివాహ బంధంపైనే. "వదినా, ఏమిటా పరధ్యానం" అని గిల్లికజ్జాలు ఆడే ఆదిత్య చెల్లెలు ఆమని మాటలకు చిలకలా నవ్వి తలవంచుకోవటమే తప్ప నోట మాట రావటంలేదు.  "అన్నయ్యా! అప్పుడే మమ్మలని మర్చిపోయావురా" అని ఆమని ఆదిత్యను ఆటపట్టిస్తుంటే "పోవే! నీకు పనీ పాట లేదు" అని మృదువుగా చెల్లిని మందలించినా, అతని ఆలోచనలన్నీ శ్రావణిపైనే.

మాఘమాసం, నిండు పున్నమి వెన్నెల, డాబాపై ఆదిత్య-శ్రావణి. చందమామ వైపు చూస్తూ మైమరపులో ఉన్నారు. "ఆదిత్యా!" అనబోయి సిగ్గుతో ఏవండీ అంది. ఆదిత్య-శ్రావణి చిన్ననాటి స్నేహితులు. 15ఏళ్ల అనుబంధం వాళ్లది. పేరు పెట్టి పిలిచే అలవాటు. ఏవండీ అనే సరికి "ఎవరిని" అని అడిగాడు ఆదిత్య. "మిమ్మల్నే" అని సొట్టబుగ్గలతో నవ్వుతూ శ్రావణి బదులిచ్చింది. "ఇదేదో బావుందోయ్! కొత్త హోదా వచ్చినట్లుంది. "ఐ ఫీల్ ఎలివేటెడ్" అన్నాడు చిలిపిగా. "అవునవును. కానీ, ఎలివేషన్ కంస్ విత్ రెస్పాన్సిబిలిటీ" అండోయ్ అంది శ్రావణి. సరే కానీ, "తొలిరేయి మాటలతో కాలక్షేపమా..నేరం..." అని చేయిపట్టుకొని దగ్గరకు లాగి హత్తుకున్నాడు శ్రావణిని"..."అబ్బాయిగారి ఆత్రం చూస్తుంటే..." అని బలంగా తప్పించుకొని దూరంగా వెళ్లింది. "అటు చూశారా! తార-జాబిలి ఒకటైనట్లు ఉంది. ఈ శుభసమయంలో మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఏమీ అనుకోకండీ!" అంది. "ఏమిటబ్బా" అని ఆశ్చర్య పడుతూ సరే అన్నాడు ఆదిత్య. "ఇన్నేళ్లు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఏ నిర్ణయమైనా, అడుగినా మనది, మీది కాదు నాది కాదు. కాబట్టి ఏమి చేసినా ఒకటే మాట మీద ఉండాలి. దానికి నాకు కొన్ని ప్రమాణాలు కావాలి" అంది శ్రావణి. "ప్రమాణాలు ఏ ప్రమాణమో?" అన్నాడు. "చిన్నవేలెండి" అని మొదలు పెట్టింది "1. మన ఇద్దరి మధ్య ఏ సమస్య వచ్చినా దానికి కారణం మూడవ  వ్యక్తి కాకూడదు, పరిష్కారం కూడా మూడవ వ్యక్తినుండి రావటం నాకు ఇష్టం లేదు. ఏదైనా సరే మనిద్దరమే చర్చించి పరిష్కరించుకోవాలి 2. ఇద్దరం ఒకరి కుటుంబాలను ఒకరం వాళ్ల వాళ్ల పద్ధతులను, సాంప్రదాయాలను, వ్యక్తిత్వాలను గుర్తించి గౌరవించుకోవాలి. మనిద్దరం ఒకరికొకరు  ఇన్నేళ్లనుండి తెలిసినా, మనం పెరిగిన వాతావరణాలు వేరు. అందుకే ఈ నిబంధన 3. ఏట్టి పరిస్థితిలోనూ ఒకరిపై ఒకరు నమ్మకం పోగొట్టుకోకూడదు 4. మన సంసారం వివరాలు బయట వాళ్లకు తెలిసే వీల్లేదు 5. మనిద్దరికీ ఎవరికి వారి వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలి. ఈ స్వేచ్ఛకు లక్ష్మణ రేఖ మనిద్దరమూ కలిసి గీచుకోవాలి..." అంది. "నాకేమి అభ్యంతరం లేదు. కానీ, ఇవి ఆచరణలో పెట్టగలమా? ఐడియలిస్టిక్ అనిపిస్తున్నాయి..." అన్నాడు ఆదిత్య. "నిజమే, కానీ, వీటిని అమలు పరచటం అసాధ్యం కూడా కాదు" అంది శ్రావణి. సరే ప్రయత్నిద్దాం అని తన రెండు చేతులూ తీసుకొని తన చేతులతో కలిపి ప్రమాణం చేశాడు. తారాచంద్రుల సాక్షిగా "నాతి చరామి" అన్నారు. రతీమన్మథులు ఏకమై ఆ జంటకో శుభోదయానికి నాంది పలికారు.

"శ్రావణీ! ఉగాది పదిరోజుల్లోకి వచ్చింది. పండక్కు ఆమని వాళ్లను పిలుద్దామనుకుంటున్నాను. నీకేమైనా  ఆలోచనలు ఉన్నాయా?" అడిగింది రాజేశ్వరి. "మొదటి పండుగ కదా అత్తయ్యగారు, అమ్మ వాళ్లు బెజవాడ రమ్మంటున్నారు. ఇంకా తుది నిర్ణయం కాలేదు. ఈయనతో మాట్లాడాలి" అంది. తాను కోరుకున్న సమాధానం రాకపోవటంతో మౌనంగా రాజేశ్వరి లోపలికి వెళ్లిపోయింది. అర్థం చేసుకొని శ్రావణి ఆదిత్యతో "ఏవండీ! అత్తయ్యగారు మనం పండుగకు ఇక్కడ ఉంటామనుకున్నారు.  అమ్మ నాన్న బెజవాడ రమ్మన్నారు . ఏం చేద్దాం?" అంది. ఆదిత్య ఆలోచించి రాజేశ్వరి వద్దకు వెళ్లి "అమ్మా! మొదటి పండుగ కదా! మేము బెజవాడ వెళితే బాగుంటుందని నా అభిప్రాయం. రెండేళ్ల క్రితం ఆమని పెళ్లి కాగానే దీపావళి పండుగకు నువ్వు వాళ్లిద్దరూ మనింటికి రావాలని గట్టిగా కోరుకున్నావు, అడిగావు గుర్తుందా? ఎంచక్కా శ్రీరామనవమికి ఆమనిని, బావగారిని మనింటికి రమ్మను, నలుగురం కలిసి కళ్యాణం చేయించుకుంటాము. ఏమంటావ్?". కొడుకు అంతరంగం అర్థం చేసుకొని రాజేశ్వరి "శ్రావణీ! అలాగే. మీరిద్దరూ ఉగాదికి బెజవాడ వెళ్లండి. నేను రామనవమి ఏర్పాట్లు చూసుకుంటాను" అంది.  శ్రావణి ఫోన్ అందుకొని "ఆమనీ! పండక్కు బెజవాడ వెళుతున్నాను. నువ్వు, అన్నయ్యగారు వచ్చినప్పుడు మేము ఉండట్లేదు. నీకోసం ఓ సర్ప్రైజ్. పండగ రోజు అత్తయ్య గారు నీకు దాని రహస్యం విప్పుతారు.." అని చెప్పింది. "ఏమీ పరవాలేదు వదినా! అన్నయ్య ఇందాకే నాకు ఫోన్ చేశాడు. అన్నీ చెప్పాడు.  హాయిగా మొదటి పండుగ బెజవాడలో జరుపుకోండి" అని సంతోషంగా ఫోన్ పెట్టేసింది ఆమని. "వదిన గారు! మీరు అన్నయ్యగారు కూడా పండగకు బెజవాడ రావాలని మా కోరిక, కానీ అమ్మాయి వాళ్లు వస్తున్నారని అల్లుడు గారు చెప్పారు..." అని శ్రావణి తల్లి కామేశ్వరి చెప్పబోయింది. "వదిన గారూ! మొదటి పండుగ, హాయిగా అమ్మాయి, అల్లుడితో జరుపుకోండి. ఈ ఫార్మాలిటీస్ ఏమీ వద్దు. మేము ఇంకోసారి వస్తాము" అంది. అలా మొదలైంది ఆ కుటుంబంలో ఆ కోడలి రాకకు, ఆమె వ్యక్తిత్వానికి, ఆమె ఇష్టాయిష్టాలకు స్థానం ఇవ్వటం.

"శ్రావణీ! ఏమి ఆషాఢ పట్టే! నువ్వు లేకుండా నెల రోజులు ఇంట్లో నేను ఎలా?. నువ్వు వచ్చిన తరువాత నేను చేసే వంటలు మీ మామయ్యగారికి నచ్చట్లేదు. నీ పానీ పూరీలు, నూడిల్స్, బిరియానీలు నావల్ల కాదు. నేనేం చెయ్యను?" అంది రాజేశ్వరి. "అదేం లేదు అత్తయ్యా! ఎవరి హస్తవాసి వాళ్లది. మీ వంట కూడా అద్భుతంగా ఉంటుంది.  నేను ఆషాఢానికి రావాలని బామ్మ, అమ్మ పట్టుబడుతున్నారు" అంది. "అయినా, నా రెసిపీలు కావాలంటే ఒక్క ఫోన్ కాల్ మాత్రమే అత్తయ్యా.." గల గలా నవ్వేసింది శ్రావణి. మీ మందులు, మామయ్యగారి మందులు ఎప్పుడు ఏవి వేసుకోవాలో అన్నీ పుస్తకంలో రాసి పెట్టాను. రెండు రోజులకోసారి నాకు ఇద్దరూ లెక్క చెప్పాలి" అంది అత్తమామలతో శ్రావణి. "ఏవండోయ్ నేను ఉండను కదా అని బయట తిళ్లు తినకండి. బుద్ధిగా అమ్మ చేతి వంట మాత్రమే తినండి. అమ్మ ప్రేమతో చేసే వంట అమృతం అని భావించి తినండి. నా వంటల మీద కావాలని వంకలు పెట్టినట్లు అత్తయ్యగారి వంటల మీద వంకపెట్టకండి..." అని భర్తకు వంద పాఠాలు చెప్పింది.

బస్సు టోల్ గేట్ వద్ద ఆగడంతో మధురస్మృతుల్లోనుంచి బయటకు వచ్చాడు ఆదిత్య. శ్రావణి...చిన్ననాటి స్నేహితురాలు శ్రీమతి కావటం తన అదృష్టం అనుకున్నాడు. ఇంటికి ఫోన్ చేశాడు. "అమ్మా! నేను బయలుదేరాను. ఉదయం ఐదింటికల్లా ఇంట్లో ఉంటాను" అని రాజేశ్వరితో చెప్పాడు. గంటలో ఫోను.."శ్రీవారూ! ఎక్కడుంది బస్సు?" అని శ్రావణి అడిగింది. "బస్సు ఎక్కడో ఉందిలే, మా మనస్సు మాత్రం అక్కడే ఉంది" అన్నాడు ఆదిత్య. "అబ్బాయి గారికి ప్రాసలు వస్తున్నాయే.."...అంది నవ్వుతూ స్రావణి. "విరహం ఎటువంటి వారి చేతనైనా కవిత్వం చెప్పిస్తుందోయ్" అని ఆశువుగా ఒక కవిత చెప్పాడు. కళ్లలో నీళ్లు తిరిగి, నోటమాట రాక శ్రావణి "మళ్లీ మాట్లాడతానండీ" అని ఫోన్ పెట్టేసింది.

తరువాతి పదిహేనురోజులు హైదరాబాదు-బెజవాడలోని ఈ రెండు కుటుంబాల మధ్య ఎన్ని ఫోన్లో, ఎన్ని స్కైప్ కాల్స్లో, ఎన్ని వాట్సాప్ సందేశాలో పరమాత్ముడికే ఎరక. "శ్రావణీ ఫలాన వస్తువెక్కడ? పనీర్ కూర ఎలా చేయాలి? శ్రావణీ ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? అత్తయ్యగారు, మామయ్య గారు మందులేసుకుంటున్నారా?.." ఇవి సాధారణ ప్రశ్నలైతే, భార్యా భర్తల మధ్య వందల సంభాషణలు."ఏం తిన్నారండీ"  "ఏదో తిన్నాలే, నీకెందుకు, వెళ్లావుగా..." "అబ్బా! అడిగితే ఒక తప్పు, అడక్కపోతే ఒక తప్పు"..."అలా కాదోయ్! అసలే జీవితం యాంత్రికంగా ఉంటే, నువ్వు తిన్నారా లేదా అని ప్రశ్నలు వేస్తే అన్నీ తెలిసి కూడా  అడుగుతుందేమిటి అని నా విసుగు..." "అసలు ఈ ఆషాఢ పట్టి ఎందుకు వచ్చింది?" "నేను హాయిగా మా అమ్మ నాన్నలతో కొన్నాళ్లు ఉండటానికి" "మరి నేను కూడా అంతేగా?" "అంటే, నేను లేకపోతే మీకు హాయిగా ఉందన్నమాట" "మరి నువ్వు అన్నది కూడా అదేగా"...ఇలా గిల్లి కజ్జాలు కాసేపు, విరహపు వేదనలు కాసేపు...

"ఇవన్నీ కాదు కానీ, అత్తకోడలు ఒక చోట ఉండకూడదు అన్నారు, భార్యాభర్తలు అనలేదు కదా? మనిద్దరం ఎంచక్కా అన్నవరం వెళదాము. ఏమంటావ్?" అన్నాడు ఆదిత్య. "ఏవండీ! అసలు ఆషాఢమాసంలో భార్యాభర్తలు ఒకచోట ఉండటం అనేది నిషిద్ధం. అత్తాకోడళ్లు కాదు. ముందు తరాలలో స్త్రీలకు చిన్నవయసులో వివాహమయ్యేది. దానివల్ల గర్భధారణలో ఉండే ఆటుపోట్లు తట్టుకునే శక్తి అందరికీ ఉండేది కాదు. ఇదివరకు మన సాంప్రదాయంలో పెళ్లిళ్లు ఎక్కువగా ఉత్తరాయణంలో (మాఘం నుండి జ్యేష్టం వరకు) జరిగేవి. ఆషాఢం సమయానికి గర్భం దాల్చే అవకాశం ఉంది కాబట్టి, ఆ గర్భ రక్షణకు, భార్యాభర్తలు ఒకచోట ఉండరాదు అనే వాళ్లు. ఇప్పుడు మాతృత్వానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం ఎంతో పురోగతి సాధించింది. కాబట్టి, ఈ సాంప్రదాయానికి పెద్దగా ప్రాధాన్యత లేదు. అందుకని, అన్నవరం వగైరా వగైరా తరువాత. పెద్దవాళ్ల మాటలకు ఎదురు ఎందుకు చెప్పటం అని నేను కాదనలేదు. ఈ ఒక్కసారే కదా..." అంది.

"శ్రావణీ! తెలంగాణాలో బోనాలు అంటే ఏమిటో అనుకున్నానే! ఎంత అద్భుతంగా చేస్తున్నారో! వచ్ఛేసారు మనిద్దరం, ఆమని కలిసి బోనాల్లో పాల్గొందాము. వి ఆర్ మిస్సింగ్ యూ హియర్" అంది రాజేశ్వరి శ్రావణితో. "అత్తయ్యా! అవునా! నేను టీవీలో చూడటమే.  ఎప్పుడూ వెళ్ళలేదు. వచ్చే సంవత్సరం సరదాగా వెళదాం" అంది శ్రావణి. "అత్తయ్యా!నేను గోరింటాకు పెట్టుకున్నా" అని అత్తగారికి వాట్సాప్ తన అందమైన చేతుల ఫోటోలను  పంపించింది. అది చూసి రాజేశ్వరికి కొడుకు-కోడలి పెళ్లి రోజులు గుర్తుకు వచ్చాయి. శ్రావణిని పెళ్లి కూతురిని చేసే రోజు అది. "ఆమనీ! నేను మంచి గోరింటాకు ఆకులు సంపాదించాను. మన నలుగురికీ వస్తాయి. నేను చెల్లాయితో పంపిస్తాను. మీరూ పెట్టుకోండి" అని ఫోన్లో ఉత్సాహంగా చెప్పింది శ్రావణి. . మంచి మంచి డిజైన్లు వాట్సాప్ లో  పంపించింది.  అమ్మాయి ఉత్సాహానికి రాజేశ్వరి, ఆమని సంతోషపడి పోటీపడి  గోరింటాకు పెట్టుకున్నారు. పెళ్లినాడు అందరూ అడగటమే - "ఎంత బాగున్నాయి వదినా  ఈ డిజైన్లు...ఎవరు పెట్టారు" అని ఓ వదిన అడిగితే "మా శ్రావణి పంపింది..ఎలా పెట్టుకోవాలో మెళకువలు  చెప్పింది..ఇట్టే పెట్టేసుకున్నాము" అని సమాధానం గర్వంగా చెప్పింది రాజేశ్వరి. ఆ పెళ్లినాటి మధుర జ్ఞాపకాలు ఆమెలో తెలియని ఆనందాన్ని నింపింది.

ఆషాడం నెల గడిచిపోయింది. వేసవి వేడి గాలులు తగ్గి నైరుతి ఋతుపవనాలు  చురుగ్గా తెలుగు రాష్ట్రాల్లో పురోగమిస్తున్నాయి. కామేశ్వరి శ్రావణిని హైదరాబాదు తీసుకువెళ్లేముందు రాజేశ్వరికి ఫోన్ చేసింది. "వదినగారు! అమ్మాయిని రేపు తీసుకు వస్తున్నాము. ఆషాఢపట్టి..." అని కానుకల గురించి మాట్లాడబోయింది. "వదిన గారూ! మీరేమి తీసుకోవద్దు. అమ్మాయిని తీసుకు రండి చాలు. వివరాలు మీరు వచ్చాక మాట్లాడుకుందాం" అంది. కామేశ్వరికి అర్థం కాలేదు. హైదరాబాదులో ఆవిడకు కావలసినట్లుగా కొనమని అంటారేమో అని అనుకుంది. శ్రావణి, తల్లిదండ్రులు హైదరబాదు చేరుకున్నారు. పలకరింపులు పూర్తయ్యాక, మధ్యాహ్నం రాజేశ్వరి కామేశ్వరిని పిలిచి "వదిన గారు! పెళ్లి ముందర నేను ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ, ఈ నాలుగు నెలలలో నాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి. మన బిడ్డలే మనకు నిజమైన సంపదలు, కానుకలు. మీ అమ్మాయి మా ఇంటికి వచ్చిన తరువాత మా జీవితంలో వచ్చిన మార్పులే మాకు వెలకట్టలేని కానుకలు. అలాగే, మీ పట్ల మా వాడు కూడా బాధ్యతాయుతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి, ఇక మీదట మన మధ్య ఎటువంటి కానుకలు, ఆర్భాటాలు వద్దు. కావలసింది మనమందరం కలిసి ఒక కుటుంబంలా ఉండటం" అంది. కామేశ్వరి కళ్లలో నీళ్లు తిరిగాయి. తన బిడ్డ ఔన్నత్యం, అత్తవారింట ఉన్న విలువలకు, ప్రేమానురాగాలకు ఎంతో సంతోషించింది.

"శ్రీవారూ! ఈ నెలరోజుల దూరం మనకు మంచే చేసింది అనిపిస్తోంది. ఏమంటారు?". "ఆ!ఆ! మంచే చేసింది. ఇక్కడ మాత్రం ఎదురుచూపులు దావానలాన్ని సృష్టించేశాయి..." అన్నాడు ఆదిత్య. "ఏవండోయ్! లెక్క ప్రకారం ఆషాఢం అంటే గ్రీష్మ ఋతువే. కాబట్టే, దావానలాలు ఓకే! శ్రావణం వచ్చేసింది, శ్రావణి మీ ఎదుట ఉంది. ఇంక అంతా వర్షాలు, చల్లదనమే" అని చిలిపిగా నవ్వింది.  "ఏదీ! శ్రావణ సమీరాల చల్లదనం ఇంకా తెలియటం లేదే? ఇంకా దగ్గరికి రావాలేమో"  అని  శ్రావణిని దగ్గరకు తీసుకున్నాడు. "వదినా! నీ ఆషాఢం ఏమో కానీ, మా అన్నయ్యకు నీ మీద ప్రేమ మాత్రం పదింతలు పెరిగింది" అని దూరం నుండి  గట్టిగా అరిచింది ఆమని. అందరూ పకపకా నవ్వేశారు. భార్యభర్తల అనురాగం, కుటుంబసభ్యుల ఆనందంతో ఆ ఇల్లు నిత్య కళ్యాణం-పచ్చతోరణంలా ముందుకు సాగింది.

4, జులై 2016, సోమవారం

ఓలాయణం - రెండవ భాగం


జీవితంలో స్వావలంబన మనకు ఉంటే జీవితం అంత ఫలప్రదంగా ఉంటుంది. కాశన్న దీనికి ఉదాహరణ.

సార్! బాగున్నారా!

ఇది వరకు ఎప్పుడైనా కలిసామా?

అవును సార్. నేను మీ కంపెనీకి క్యాబ్ నడిపే వాడిని. మిమ్మల్ని రెండు మూడు సార్లు మీ ఇంటి దగ్గర దింపాను.

అవునా. గుర్తులేదులే.

ఏం పేరు?

కాశన్న

ఆఫీసులకు క్యాబ్ మానేసి ఓలాలో ఎందుకు పని చేస్తున్నావు?

డబ్బులు సరిగ్గా ఇవ్వరు సార్ ఏజెంట్లు. అంతే కాకుండా, చాలా కంపెనీలు క్యాబ్‌లు మానేశాయి. వాళ్ల వాళ్ల బస్సులు ఏర్పాటు చేసుకున్నాయి.

కొంచెం వయసు పైబడిన వాడులా అనిపిస్తే అడిగాను...

నీ వయసెంత?

55 ఏళ్లు సార్.

ఏం చేస్తున్నారు పిల్లలు?

బాబు ఎంబీఏ చదివి ఐసీఐసీఐ బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు. అమ్మాయి డిగ్రీ చదువుతోంది.

అవునా! మీ అబ్బాయిది ఐసీఐసీఐలో ఏం ఉద్యోగం?

అసిస్టెంట్ మేనేజర్ సార్. 30 వేలు జీతం.

నువ్వు ఎంత సంపాదిస్తావు?

దాదాపు 25 వేలు సార్.

అమ్మాయి డిగ్రీ తరువాత ఏమి చేయాలనుకుంటోంది?

టీచర్ అవ్వాలనుకుంటోంది సార్. ఎమ్మెస్సీ, బీఈడీ చేయాలి. గవర్నమెంటు సీటు వస్తుందని గ్యారంటీ లేదు కదా సార్.

అమ్మాయి బాగా చదువుతుందా?

బానే చదువుతుంది సార్. సాయంత్రం టైలరింగ్ చేస్తుంది. నెలకు ఓ పదివేలు సంపాదిస్తుంది. మా అబ్బాయికి కూడా డిగ్రీలో, ఎంబీఏలో మంచి మార్కులు వచ్చాయి.

అబ్బాయి సంపాయిస్తున్నాడు కదా? ఇంకా నువ్వు కష్టపడాలా?

వాడికి కూడా కావాలి కద సార్. వాడి సంపాదన అంతా మేమే తింటే వాడికి పెళ్లైతే అవసరాలకు ఎలా? అందుకని వాడి జీతంలో సగం దాచుకోమని చెప్పాను.

అవునా. చాలా చక్కగా ఆలోచిస్తున్నావు కాశన్నా! నీ నుంచి చాలా నేర్చుకోవాలి.

ఏం లేదు సార్. నా పిల్లలకు నేను భారం కాకూడదు. వాళ్ల భవిష్యత్తుకు నేను సాయం చేయాలి. అంతే నా ఆలోచన.

మరి నీ భార్య?

రోడ్డు స్వీపర్ సార్. జీహెచెంసీలో కాంట్రాక్టు ఉద్యోగం. ఎనిమిది వేలు ఇస్తారు. ఉదయం 6-12 వరకు ఉద్యోగం. మధ్యాహ్నం ఇంట్లో ఉంటుంది.

తెలంగాణా వచ్చినాక మీకు తేడా ఏమన్నా కనిపిస్తుందా?

కేసీఆర్ చెప్పింది చేస్తాడు సార్. ఆ నమ్మకం ఉంది. లంచగొండి కాదు అనిపిస్తుంది.

మరి ఇల్లు ఏమైనా ఏర్పాటు చేసుకుంటున్నావా?

లేదు సార్. వీలైనంత డబ్బులు దాచుకుందామనే ఆలోచన. ఇల్లు అంటే ఉన్న డబ్బులన్నీ పెట్టాలి. అదో తలనొప్పి సార్. అద్దె ఇల్లు బెస్ట్. ఇక్కడ కాకపోతే ఇంకోచోట.

ఇంతలో ఇల్లొచ్చేసింది. డబ్బులు కట్టేసి కాశన్న చెప్పిన మాటలు ఆలోచిస్తూ ఇంట్లోకి వెళ్లాను. అది చేయాలి ఇది చేయాలి ఇది కొనాలి అది కొనాలి అనే తాపత్రయానికి ఒక సమాధానం దొరికింది అనిపించింది.

3, జులై 2016, ఆదివారం

గంగానదిపై సినీ గీతాలు - గంగమ్మ మహాత్యం మూడవ భాగం

దేవప్రయాగ వద్ద భాగీరథి-అలకనందల సంగమం - అటుతరువాత ఇది గంగగా పిలువబడుతుంది

గంగమ్మ రమణీయ అవతరణ గురించి రామాయణంలోనే కాకుండా మరెన్నో చోట్ల  చెప్పబడింది. ఈ రమణీయ గాథను బాపు-రమణలు సీతాకళ్యాణం చిత్రంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు వివరించే సందర్భంగా ఒక పాటను పొందుపరచారు. అద్భుతమైన ఈ గీతాన్ని పీబీ శ్రీనివస్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణ బృందం పాడారు. ఈ చిత్రానికి ఆరుద్ర గారు, సి. నారాయణరెడ్డి గారు గేయ సాహిత్యం అందించారు. సాహిత్యాన్ని పరిశీలిస్తే ఇది నారాయణరెడ్డి గారి శైలిలో కనిపిస్తుంది. అందుకనే, ఆయన రచన అని అనుకుంటున్నాను. ఇటువంటి ఘట్టాలను చిత్రీకరించలంటే బాపు-రమణలను మించినదెవరు? అద్భుతమైన చిత్రీకరణతో భగీరథ యత్నాన్ని మనకు అందించారు. కేవీ మహదేవన్ గారి సంగీతం సన్నివేశాలకు సముచితంగా సాగుతుంది. ఎన్ని మార్లు ఏ భాషలో ఏ విధంగా విన్నా, గంగావతరణం రోమాంచమే. అందుకే ఈ గీతం చరిత్రలో నిలిచిపోయింది.


ఇనవంశ జలజాత దినకరుడు సత్య నిరతుడు ధర్మవ్రతుడు భగీరథుడు
తన ముత్తాతల తరింప జేయగ గగనగంగనే జగతికి దించగ తపమొనరించెను ఆనాడు
అదియే నదియై నడిచెను ఈనాడు
మెచ్చితిని తపమో భగీరథా! నిశ్చల నిరంతర మనోరథా!
ఇచ్చెదను వరమి దిగి వచ్చెదను ధరకు మరి నను ధరించే యోధుడెవ్వడు నను ధరించే నాథుడెవ్వడు
ప్రభో శూలపాణే విభో విశ్వనాథా!
మహాదేవ శంభో! మహేశా! త్రినేత్రా!
శివా! కాంత శాంత స్మరారే పురారే వదన్యే వరాణ్యే నమామ్యోగణ్యః!
గళమున గరళము ధరించినావే! తలపై గంగను భరించలేవా? భవా! శివా! శివా!
కదిలింది కదిలింది గంగ! కదిలి ఉప్పొంగింది గంగ!
పరమ రాజస భావ పరిచుంబిత నిచాంగ!  కదిలింది కదిలింది గంగ! కదిలి ఉప్పొంగింది గంగ!
ఆకాశమే అదరగా! ఐరావతం బెదరగా!
నందనవనం పెగలగా! బృందారకులు చెదరగా!
సాగింది సాగింది గంగ! సాగి చెలరేగింది గంగ!
దూకింది దూకింది గంగ! ఉద్రేకాతిరేకాంతరంగ!
హరుని శిరమున పోటులెత్తగా! బ్రహ్మాండభాడము బీటలెత్తగా!
ఉల్లల గంగామపూర్ణికా వీచికా కల్లోల ధాటి ఒక కంట వీక్షించి
సురగంగ గర్వమ్ము విరువంగ నెంచి  సంకీర్ణ తటుజటాఝటులనుప్పొంగించి దుర్గమ్ముగా మలచినాడు గంగనద్భుతంగా బంధించినాడు
జడయను అడవిని వడి వడి అడుగిడి జాడ యెరుంగనిదై
తడబడి నడచుచు గడగడ వణుకుచు సుడివడి పోయినదై
ఒకపరి ఇటుచని ఒకపరి అటుచని మొకమే చెల్లనిదై
అగుపించని ఆ గగనగంగకై ఆక్రందించె భగీరథుడు
ఆ మొరవిని సురధుని చెరవిడిపించెను కరుణాభరణుడు పురహరుడు
ఉరికింది ఉరికింది గంగ ఉన్ముక్త మానస విహంగ మున్ముందుగా భగరీథుడు నడువంగా తన మేన సరికొత్త తరగలుప్పొంగ
జల జల పారుతూ గల గల సాగుతూ చెంగుమని దూకుతూ చెలరేగి ఆడుతూ తుళ్లుతూ తూలుతూ  నిక్కుచూ నీల్గుచూ ముంచివేసెను జహ్నుముని ఆశ్రమమును
కనలి ఆ ముని మ్రింగె గంగా ఝరమును
తరలింది తరలింది గంగా! సాగరుల పాపములు కడుగంగా! సద్గతులను వారికొసగంగా!
అల భగీరథు పేరిలపైన నిలపంగ! తాను భాగీరథిగా! పుణ్యమొసగే నదిగా! తరలింది తరలింది గంగా!అలాగే, గంగోత్రి అనే చిత్రంలో వేటూరి సుందరరామమూర్తి గారు ఒక అద్భుతమైన గీతాన్ని అందించారు. ఎం.ఎం. కీరవాణి గారు అమృతవర్షిణి  రాగంలో ఈ గీతాన్ని కూర్చి కల్పనతో కలిసి అద్భుతంగా పాడారు కూడా.


ఓం! ఓం!ఓం!జీవన వాహిని! పావని!
కలియుగమున కల్పతరువు నీడ నీవని!
కనులు తుడుచు కామధేను తోడు నీవని!
వరములిచ్చి భయము తీర్చి శుభము కూర్చు గంగాదేవి!
నిను కొలిచిన చాలునమ్మ! సకల లోక పావని!
భువిని తడిపి దివిగ మలచి సుడులు తిరుగు శుభగాత్రి!
గంగోత్రి గంగోత్రి గంగోత్రి గంగోత్రి
గల గల గల గంగోత్రి! హిమగిరి ధరి హరిపుత్రి! జీవన వాహిని! పావని!

మంచు కొండలో ఒక కొండ వాగులా ఇల జననమొందిన విరజా వాహిని!
విష్ణు చరణమే తన పుట్టినిల్లుగా శివగిరికి చేరిన సురగంగ నీవని!
అత్తింటికి సిరులనొసగు అలకనందవై సగర కులము కపాడిన భాగీరథివై!
బదరీవన హృషీకేశ హరిద్వార ప్రయాగముల మణికర్ణిక తనలోపల వెలసిన శ్రీ వారణాసి!
గంగోత్రి గంగోత్రి గంగోత్రి గంగోత్రి
గల గల గల గంగోత్రి! హిమగిరి ధరి హరిపుత్రి!

పసుపు కుంకుమతో పాలు పన్నీటితో శ్రీగంధపు ధారతో పంచామృతాలతో
అంగాంగము తడుపుతూ! దోషాలను కడుగుతూ! గంగోత్రికి జరుపుతున్న అభ్యంగన స్నానం!

అమ్మా! గంగమ్మా! కృష్ణమ్మకు చెప్పమ్మా! కష్టం కలిగించొద్దని!
యమునకు చెప్పమ్మా సాయమునకు వెనకాడొద్దని!
గోదారికి కావేరికి యేటికి సెలయేటికి కురిసేటి జడివానకి దూకే జలపాతానికి నీ తోబుట్టువులందరికి చెప్పమ్మా మా గంగమ్మా!

జీవ నదివిగా ఒక మోక్షనిధివిగా! పండ్లు పూలు పసుపుల పారాణి రాణిగా!
శివుని జతలనే తన నాట్య జతులుగా!జలకమాడు సతులకు సౌభాగ్యదాత్రిగా!
గండాలను పాపాలను కడిగివేయగా!ముక్తినదిన మూడు మునకలే చాలుగా!
జలదీవెన తలకు పోసే జననీ! గంగా భవానీ!ఆమె అండ మంచు కొండ! వాడని సిగ పూదండ!
గంగోత్రి గంగోత్రి గంగోత్రి గంగోత్రి!
గల గల గల గంగోత్రి! హిమగిరి ధరి హరిపుత్రి!

వేటూరి వారి గీతం గంగమ్మ భువికి రావటాన్ని , గంగమ్మ ఒడ్డున ఉన్న క్షేత్రాలను, ఆ గంగమ్మ మహత్తును అద్భుతంగా ప్రస్తావించింది.  పరదేవతను కొలిచి, ప్రార్థించే విధంగానే భారతదేశం గంగమ్మను కొలుస్తుంది అని మరోమారు  ఈ  గీతం చెబుతుంది.  గంగానది జన్మ స్థానమైన గంగోత్రికి వెళితే ఈ విషయం అర్థమవుతుంది.  భారతదేశ సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఇదే.  గంగమ్మ ఒడ్డున ఉన్న క్షేత్రాల గురించి తరువాయి భాగాలలో తెలుసుకుందాము.

గంగా మహాత్యం మొదటి భాగం, రెండవ భాగం 

2, జులై 2016, శనివారం

ఓలాయణం - మొదటి భాగం

ఈ మధ్య ఓలా క్యాబ్‌లో ఆఫీసునుండి ఇంటికి వస్తున్నాను. ఎక్కినవాడిని ఊరుకోకుండా డ్రైవర్లతో మాట్లాడటం. వాళ్ల భవసాగరాల గాథలు వినటం జీవితంలో ఓ భాగం అయిపోయింది. ఆ సంభాషణల సింహావలోకనమే ఈ ఓలాయణం ధారావాహికం.

ఓలాయణం - మొదటి భాగం:

ఏం భిక్షపతి! బానే నడుస్తోందా ఈ క్యాబ్ జీవితం? ఎంత సంపాదిస్తావు నెలకు?

ఏం చెప్పను సార్! రోజుకు 15 గంటలు నడపాల్ల్సి వస్తోంది. ఇది వరకు జీడిమెట్లలో కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసే వాడిని. నాలుగేళ్ల క్రితం దాన్ని మూసేశారు. రోడ్డున పడ్డాను.

మరి క్యాబ్ నీదా లేక డ్రైవింగ్ ఒక్కటేనా?

నాదే సార్. ఓ రెండేళ్లు డ్రైవరుగా పని చేశాను. అందరూ క్యాబ్ నడిపితే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి అని చెప్పారు. అందుకని ఓ మూడు లక్షల అప్పుకోసం ప్రయత్నించాను. మీలాంటి సార్ ఒకరు బ్యాంక్ మేనేజర్ ఎటువంటి హామీ పత్రాలు లేకుండా నాకు లోన్ ఇప్పించారు.

ఫ్యామిలీలో ఎంతమంది?

నేను, నా భార్య, ముగ్గురు మగపిల్లలు, అమ్మ, నాన్న. నాన్న కూడ డ్రైవర్‌గా చేసే వాడు. ఇప్పుడు చేతకావటం లేదు. ఇంట్లోనే ఉంటున్నాడు.

నెలకు ఎంత వస్తుంది ఆదాయం?

25-30వేల దాక వస్తుంది. లోన్లు చిట్టీలు పోను ఏమీ మిగలవు సార్.

మరి పిల్లల స్కూలు?

ఈ మధ్య నవోదయ స్కూలులో ముగ్గురు పిల్లలకు  అడ్మిషన్ వచ్చింది. ఇప్పటి వరకు ప్రైవేట్ స్కూలులో చదువుతున్నారు. చాలా ఖర్చైంది సార్ వాళ్ల చదువులకు.

నవోదయ స్కూళ్లు బాగుంటాయా?

పిల్లలు బాగా చదువుతారు సార్. కాబట్టి స్కూల్ ఎలాంటిది అని ఆలోచించలేదు.

మరి నువ్వు రాత్రింబవళ్లు నడిపితే పిల్లల చదువులు?

మా ఆవిడ టెంత్ క్లాస్ వరకు చదివింది. పిల్లలకు ఇప్పటివరకు తనే చెప్పింది. చాలా కష్టపడుతుంది సార్.

ఆదివారాలు కూడా నడుపుతావా?

తప్పదు సార్.

ఇంత డ్రైవింగ్ చేస్తే నీ ఆరోగ్యం...

రాత్రి ఇంటికి వెళ్లేసరికి నడుం నొప్పి, కాళ్లు చేతులు విపరీతంగా లాగుతాయి సార్. తలనొప్పిగా ఉంటుంది. కానీ, తప్పదు. ఈమధ్య ఒకసారి క్యాబ్‌కు యాక్సిడెంట్ అయ్యింది. దాదాపు 40వేలు రిపేర్లకు ఖర్చయ్యింది. బ్యాంకులో ఒక్క రూపాయి కూడా లేదు సార్.

మరి డ్రైవర్ ఉద్యోగం మానేసి క్యాబ్‌కు ఎందుకు వచ్చావు?

తెలియక సార్. క్యాబ్‌లో చాలా కష్టాలు ఉన్నాయి సార్. లోన్లు, ఆరోగ్యం, రాత్రిపూట నడపటం...

నీకు ఎన్నేళ్లు?

ముప్ఫై ఐదు సార్.

మరి ఏమైనా దాచుకున్నావా?

పెద్దగా ఏమీ లేదు సార్.

రేపు పొద్దున నీకు నీ కుటూంబానికి ఆరోగ్య సమస్యలు వస్తే ఎలా? ఆరోగ్యశ్రీ కానీ, ఇన్షూరెన్స్ కానీ ఉన్నాయా?

లేవు సార్.

గవర్నమెంటు ఈ మధ్య తక్కువ ప్రీమియంకు ఇన్షూరెన్స్ ఇస్తుంది. తెలుసా?

తెలీదు సార్.

వెంటనే తెలంగాణా మరియు భారత ప్రభుత్వం వారి ఆరోగ్య భీమా పథకాల వివరాలు చూపించాను. చాలా సంతోషించాడు. దిగేటప్పుడు సార్ ఎప్పుడైనా ఏదైనా వివరాలు కావాలంటే మీకు ఫోన్ చేయ్యచ్చా అని అడిగాడు. తప్పకుండా అని చెప్పాను. భిక్షపతి కళ్లలో కొంచెం ధైర్యం కనబడింది. 

గంగా స్తోత్రం - గంగమ్మ మహాత్యం రెండవ భాగం


సతోపనాథ్ భాగీరథ్ ఖరక్ హిమానీనదాల కలయిక వద్ద ఉత్తరాఖండ్‌లో పుట్టిన అలకనంద పవిత్ర బదరీనాథ్ క్షేత్రం గుండా ప్రవహిస్తూ దాదాపు 190 కిలోమీటర్ల పాటు హిమాలయాలలో తన హొయలు ఒలికిస్తూ ఉంటుంది. దీని ఉపనదులు నందాకిని, మందాకిని, పిందర్. గర్వాల్ ప్రాంతంలోని ఐదు ప్రాంతాలలో ఐదు ఉపనదులను కలుపుకుంటుంది. అవి విష్ణుప్రయాగ వద్ద ధవళగంగ, నందప్రయాగ వద్ద నందాకిని, కర్ణప్రయాగ వద్ద పిందర్, రుద్రప్రయాగ వద్ద మందాకిని, దేవప్రయాగ వద్ద భాగీరథి నదులు. ఈ పంచ సంగమ క్షేత్రాలు ఉత్తరాఖండ్ గంగాయనంలో పవిత్రమైనవి. దేవప్రయాగ వద్ద భాగీరథితో కలసిన తరువాత అలకనంద గంగానదిగా పిలువబడుతుంది. హిమాలయ పర్వతాల గుండా దాదాపు 250 కిలోమీటర్లు ప్రవహించి ఋషీకేష్ వద్ద మైదాన ప్రాంతాలలో ప్రవేశిస్తుంది. ఈ మొత్తం దూరమూ గంగమ్మ ఎత్తైన పర్వతాల మధ్య చాలా లోతైన లోయలలో మెలికలు తిరుగుతూ నాగకన్యలా ఉంటుంది. పల్లం కావటంతో ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. హృషీకేశ్ నుండి హరిద్వార్, అక్కడినుండి ఉత్తరప్రదేశ్‌లో 800 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఈ పావన గంగ మహాత్యం వివరాలు మరిన్ని తెలుసుకుందాం.

ఉత్తరాఖండ్‌లోని దేవభూమిలో అలకనంద-భాగీరథుల ప్రవాహం చూస్తే మీకు గంగమ్మ ఎందుకు ప్రత్యేకమైనదో అర్థంవుతుంది. ఇక్కడి చాలా ప్రాంతాలకు ఇంకా రోడ్లు లేవు. యోగులు, సిద్ధులు, సన్యాసులు, బైరాగులు ఈ ప్రాంతాలలో హాయిగా తిరుగుతూ ఈ గంగమ్మ జడపాయల సోయగాన్ని చూసి ఆనందిస్తూ ఉంటారు. ఇక్కడ చెప్పలేనన్ని జలపాతాలు, అనంతమైన ప్రకృతి సౌందర్యాలు.  మంచి, చలి, వాన లెక్క చేయక వీళ్లు వందల కిలోమీటర్లు కొండలు ఎక్కుతూ దిగుతూ అడవుల గుండా నడుస్తూ ఉంటారు. ఆ భూమే వారి నివాసం. ఆ గంగమ్మ ఆనవాళ్లే వారికి భృతి ద్యుతి. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఆ దేవభూమిలో నివసిస్తారు. అంతటి మహోన్నతమైన ప్రాకృతిక జీవనానికి మూలం గంగానది.

హరిపాదాన పుట్టావంటే గంగమ్మ శ్రీహరి పాదాన పుట్టావంటే గంగమ్మ
ఆ హిమగిరిపై అడుగెట్టావంటే గంగమ్మా! కడలి కౌగిలిని కరిగావంటే గంగమ్మా!
నీ రూపేదమ్మా! నీ రంగేదమ్మా! నీ రూపేదమ్మా! నీ రంగేదమ్మా!
నడిసంద్రంలో నీ గడపేదమ్మా! గంగమ్మా!
నీలాల కన్నుల్లో సంద్రమే! నింగి నెలవంక సంద్రమే!

అని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు గంగమ్మను వర్ణిస్తూ అద్భుతమైన గీతాన్ని శుభసంకల్పం చిత్రానికి అందించారు. ఆ హారి పాదాన పుట్టిన గంగ, శివుని శిరమున నిలచి, భువిలో అవతరించి  మనలను తరిస్తోంది. గంగమ్మను నుతిస్తూ అనేక స్తోత్రాలు మన కాలగమనంలో వచ్చాయి. అటువంటి ఒక అద్భుతమైన స్తోత్రం ఈ పోస్టులో. దీనిని ఆదిశంకరులు రచించారు అని చాలా చోట్ల చెప్పబడింది. కానీ, శంకరులు తమ ఇతర రచనలలో ఎక్కడా పేరును ఉపయోగించలేదు. ఈ స్తోత్రంలో ఉంది. స్తోత్ర ధార మరియు భావం కూడా శంకరుల రచనలా అనిపించటం లేదు. ఆయన శిష్య పరంపరలో ఎవరైనా రచించారేమో అనుకుంటున్నా. అయినా, అద్భుతమైన స్తోత్రం.


దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళ తరంగే
శంకర మౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే

భాగీరథి సుఖదాయిని మాతః తవ జల మహిమా నిగమే ఖ్యాతః
నాహం జానే తవ మహిమానం పాహి కృపామయి మామజ్ఞానం

హరిపదపాద్య తరంగిణి గంగే హిమవిధుముక్త ధవళ తరంగే
దూరీ కృత మమ దుష్కృతి భారం కురు కృపయా భవసాగరపారం

తవ జలమమలం యేన నిపీతం పరమపదం ఖలు తేన గృహీతం
మాతర్గంగే త్వయి యో భక్తః కిల తం ద్రష్టుం న యమః శక్తః

పతితోద్ధారిణి పావని గంగే ఖండిత గిరివరమండిత భంగే
భీష్మజనని హే మునివర కన్యే పతిత నివారిణి త్రిభువన ధన్యే

కల్పలతామివ ఫలదాం లోకే ప్రణమతి యస్త్వాం న పతతి శోకే
పారావారిణి విహరిణి గంగే విముఖయువతికృతతరళాపాంగే

తవ చేన్మాతః స్తోతః స్నాతః పునరపి జఠరే సోపి న జాతః
నరకనివారిణి జాహ్నవి గంగే కలుషవినాశిని మహిమోత్తుంగే

పునరసదంగే పుణ్యతరంగే జయ జయ జాహ్నవి కరుణాపాంగే
ఇంద్రమకుటమణిరాజితచరణే సుఖదే శుభదే భృత్యశరణ్యే

రోగం శోకం తాపం పాపం హర మే భగవతి కుమతికలాపం
త్రిభువనసారే వసుధాహారే త్వమసి గతిర్మమ ఖలు సంసారే

అలకానందే పరమానందే కురు కరుణామయి కాతరవంద్యే
తవ తట నికటే యస్య నివాసః ఖలు వైకుంఠే తస్య నివాసః

వరమిహ నీరే కమఠో మీనః కిం వా తీరే శరటః క్షీణః
అథవా శ్వపచో మలినో దీనస్తవ న హి దూరే నృపతికులీనః

భో భువనేశ్వరి పుణ్యే ధన్యే దేవి ద్రవమయి మునివరకన్యే
గంగాస్తవమివమమలం నిత్యం పఠతి నరో యః స జయతి సత్యం

యేషాం హృదయే గంగా భక్తిః తేషాం భవతి సదా సుఖముక్తిః
మధురాకాంతా పజ్ఝటికాభిః పరమానంద కలిత లలితాభిః

గంగాస్తోత్రమిదం భవసారం వాంఛిత ఫలదం విమలం సారం
శంకరసేవక శంకరరచితం పఠతి సుఖీ స్తవ ఇతి చ సమాప్తః

ఓ సుర గంగా! భగవతీ! నీ ప్రవహించే తరంగాలతో ముల్లోకాలనూ తరించే తల్లీ! శంకరుని శిరమున విహరించే విమల గంగా! నా మనసు ఎల్లప్పుడూ నీ పదకమలములనే ధ్యానించు గాక!

ఓ భాగీరథీ! అందరికీ సుఖమును కలిగించే మాతా! నీ జలము యొక్క మహిమ వేదములలో నుతించబడినది. నీ మహిమ నాకు తెలియదు. అజ్ఞానునడైన నాపై కరుణ కురిపించి కాపాడుము!

శ్రీహరి పాదముల వద్ద పాద్యమైన ఓ గంగా!  మంచు వలె, చంద్రుని వలె, ముత్యము వలె ధవళకాంతితో ప్రకాశించే తరంగాలు కలిగిన అమ్మా! నా పాపములన్నిటినీ తొలగించి ఈ సంసార సాగరాన్ని దాటేలా అనుగ్రహించు!

ఓ గంగా మాతా! నీ శుద్ధమైన జలాన్ని స్వీకరించిన వారికి ముక్తి తప్పక లభిస్తుంది. నీ భక్తులను యమ ధర్మరాజు కూడా ఏమీ చేయలేడు.

ఓ జాహ్నవీ! పతితులను ఉద్ధరించే తల్లివు నువ్వు. హిమాలయాలను ఛేదిస్తూ ప్రవహించే నీ శోభ ఎంతో గొప్పది. భీష్ముని తల్లి, జహ్ను మహర్షి కుమార్తె అయిన నీవు ముల్లోకవాసులను భ్రష్టుత్వం బారి నుండి కాపాడుతున్నావు.

ఓ గంగా! నిన్ను పూజించే వారి కామ్యములను తీర్చే కల్పవృక్షానివి నీవు. నీ శరణు కోరేవారికి శోకమే ఉండదు. ప్రియుని చేర తపించే ప్రేయసిలా సాగరంలో కలువటానికి నీ పరుగులు సాగుతుంటాయి.

నిన్ను దర్శించి, స్తుతించి, నీ పావన జలతరంగాలలో స్నానం చేసిన వారికి మరల జన్మ లేదు. నరక ప్రాప్తిని నివారణ మరియు దోషాలను తొలగించే మహత్తు కల తల్లివి నీవు.

ఓ కరుణామయి గంగా! నీవు పుణ్యమైన తరంగాలనే అవయవములు కలదానవు. నీ పాదములు ఇంద్రుని కిరీటముచే అలంకరించబడినవి. నీ శరణు కోరిన వారికి సుఖము, శుభము కలిగించెదవు.

ఓ భగవతీ! నాలోని రోగాలను, శోకాన్ని, తాపమును, పాపములను, దుష్ట బుద్ధిని హరింపజేయుము. ముల్లోకములకు సారము నీవు, ఈ ధాత్రికి హారము వంటి దానవు. ఈ సంసార సాగరాన్ని దాటటానికి నీవే దిక్కు.

ఓ అలకనందా! పరమానందము కలిగించే తల్లీ! భీతావహులను కరుణతో అనుగ్రహిస్తావు. నీ ఒడ్డున నివసించే వారు వైకుంఠంలో నివసించే వారితో సమానం.

నీ నీటిలో తాబేలు లేదా చేపలా, నీ ఒడ్డున పేదవానిగా జీవించటం నీకు దూరంగా రాజువలె జీవించటం కన్నా ఎంతో ఉత్తమం.

ఓ భువనేశ్వరీ! జాహ్నవీ! నీవు పుణ్యకారిణివి, ధన్యవు. నీ స్తోత్రాన్ని పఠించే వారికి విజయం తథ్యము.

మనసులో గంగ పట్ల భక్తి కలిగియున్న వారికి సుఖము మరియు ముక్తి కలుగుతాయి. సుందరమైన, లలితమైన ఈ పదఝటి పరమానంద కారకము.

శివభక్తుడైన శంకరాచార్యులచే రచించబడిన ఈ గంగాస్తోత్రం కోర్కేలను తీర్చేది, విమలమైనది, సారవంతమైనది. పఠించేవారికి సుఖాన్ని కలిగించేది.

శివకేశవుల శక్తి కలిగినది కాబట్టే గంగ అంత పవిత్రమైన నదిగా అనాదిగా ఈ కర్మభూమిని కాపాడుతోంది. భగవతి అని ఆమెను కొలిచారంటేనే పరాశక్తిగా ఆమెను గుర్తించినట్లే కదా! మన సాంప్రదాయంలో పుణ్యవతులైన స్త్రీలను గంగాభాగీరథీ సమానురాలుగా చెప్పటం గంగమ్మకు మన జీవనశైలిలో ఉన్న స్థానాన్ని చెబుతుంది. అలాగే జ్యేష్ఠ మాసంలో గంగా-దశహరా అని నవరాత్రులు జరుపుకుంటారు. మనలోని పదిరకాల పాపాలను తొలగించే తల్లిగా ఆమెను కొలుస్తారు. గంగానదికి భారతీయ సనాతన ధర్మంలో ఉన్న స్థానం ఆ నదీ పరీవాహక ప్రాంతాలు పర్యటిస్తే తెలుస్తుంది. ఆ వివరాలు తరువాయి భాగాలలో తెలుసుకుందాం.

ఆకాశవాణి భక్తిరంజనిలో దశాబ్దాల క్రితం ప్రసారమైన ఈ గంగాస్తోత్రం శ్రవణం వినండి. దీనిని ఆకాశవాణి ఏ గ్రేడ్ కళాకారిణులు అరుంధతి సర్కార్, ఇందిరా కామేశ్వరరావు, సునందా శాస్త్రి, జోగుళాంబ గారు ఆలపించారు.