RightClickBlocker

22, ఆగస్టు 2016, సోమవారం

కంచికి పోతావా కృష్ణమ్మా - వేటూరి భావ వీచిక


కంచికి పోతావా కృష్ణమ్మా ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచిలో ఉన్నది బొమ్మ అది బొమ్మ కాదు ముద్దుగుమ్మ

త్యాగరాజ కీర్తనల్లే ఉన్నాది బొమ్మ రాగమేదో తీసినట్టు ఉందమ్మా
ముసిముసి నవ్వుల పూవులు పూసింది కొమ్మ మువ్వ గోపాలా మువ్వ గోపాలా మువ్వ గోపాల అన్నట్టుందమ్మా
అడుగుల్లో సవ్వళ్లు కాదమ్మా అవి ఎడదల్లో సందళ్లు లేవమ్మా

రాసలీల సాగినంక రాధ నీవేనమ్మా రాతిరేళ కంట నిదర రాదమ్మా
ముసిరిన చీకటి ముంగిట లేచింది కొమ్మ ముద్దు మురిపాల మువ్వ గోపాలా నీవు రావేల అన్నట్టుందమ్మా
మనసు దోచుకున్న ఓయమ్మా నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా

వేటూరి సుందరరామమూర్తిగారి సాహిత్యంలో జానపద హంగులు, శాస్త్రీయ సొబగులు మేళవించి ఉంటాయి. అటువంటి గీతమే ఈ కంచి పోతావా కృష్ణమ్మా అనే గీతం. నాయిక కబుర్లు తెలుసుకునే ప్రక్రియను ఎంతో అందంగా జానపదాల్లో వేటూరి వారు మనకు అందించారు. ఆ నాయిక గాథను వర్ణించటానికి వేటూరి వారు కంచిని, చిన్ని కృష్ణుని ఎన్నుకున్నారు. కంచిలో ఉన్న ఆ ముద్దుగుమ్మ ఎలా ఉంటుందో వివరించారు. త్యాగరాజ కీర్తనల్లె ఉన్నాదీ బొమ్మ అన్నాడు. వాగ్గేయకారులలో త్యాగరాజస్వామి అగ్రగణ్యుడు. ఆయన కీర్తనలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఆ కీర్తనల ఔన్నత్యాన్ని ఈ ముద్దుగుమ్మ రూపానికి సారూప్యంగా తెలిపారు. కీర్తనల రాగం కూడా భావానికి తగినట్లుగా ఉండటం త్యాగయ్య సంకీర్తనల ప్రత్యేకత. రాగాన్ని ఆలాపిస్తే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉందిట ఆ ముద్దు గుమ్మ. ముసి ముసి నవ్వులనే పూలు తన ముఖంలో పూయించందట ఆ నాయిక. మువ్వ గోపాలా మువ్వ గోపాలా అని పిలిచినట్లుందట. ఆమె అడుగులు వేస్తుంటే వచ్చే మువ్వల సవ్వడులు ఆమె హృదయ స్పందనలట. ఇటువంటి సాహిత్యం వేటూరి వారికే సాధ్యం. నాయిక మధురమైన భావనలు ఆమె హృదయస్పందనలుగా, ఆమె పదమంజీరముల సవ్వడులుగా కవి ప్రస్తుతించారు. బృందావనిలో రాసలీల (ఏవండోయ్ రాసలీల అంటే శృంగారం కాదు, ఒకరితో ఒకరు మైమరచి ఆడుతూ పాడుతూ జరుపుకునే వేడుక) ముగియగానే రాధ పరిస్థితి ఎలా ఉందో అలాంటిదట నాయిక పరిస్థితి. రాతిరంతా నిదుర రాదట, చీకటి తొలగకముందే (తెల్లవారకముందే) లేచిన ఆ ముద్దు గుమ్మ మువ్వ గోపాలా నీవు రావేలా అన్నట్లుగా ఉందట. ఆ నాయకుడు కృష్ణుని ద్వారా తన మనసు దోచుకున్న ఆ నాయికను తన మనసులో ఉన్న భావనను వ్యక్త పరచవలసిందిగా కోరుతున్నాడు.

నాయిక పట్ల తనకున్న భావనలను వార్తాహరునికి నాయకుడు వ్యక్తపరచే గీతం ఇది. ఆ వార్తాహరుడే కృష్ణుడు, ఆ నాయిక కంచిలో ఉన్నట్లు భావన. వేటూరి వారు నాయకుని భావ వీచికలను ఆవిష్కరించిన రీతి ఎంత అద్భుతమో బాలు గానం కూడా అంతే మధురం. ఈ గీతం ఆలాపనలో బాలు కనబరచిన భావ సౌందర్యం, లాలిత్యం సున్నితమైన ప్రేమకు ప్రతీకగా నిలిచింది. అలాగే, సుశీలమ్మ ఆలాపనలు కూడా చాలా లలితంగా ఉంటాయి. ఇక చిత్రం విషయానికొస్తే, నాయకునిగా చంద్రమోహన్ జీవితంలో ఇది మరో మంచి చిత్రం. సగటు మధ్య తరగతి మగాడి మనోవికారాలను అద్భుతంగా ప్రతిబింబించే పాత్ర ఇది. అలాగే, నాయిక పాత్రలో నటి సులక్షణ ఎంతో చక్కగా నటించారు. ప్రేమికులనుండి భార్యా భర్తలుగా మారిన ఓ జంట మధ్య ఉండే ఆటుపోట్లను వీరిద్దరు చక్కగా పాత్రలలో జీవించి మనలను అలరించారు. మామ మహదేవన్ మోహన రాగంలో కూర్చిన ఈ గీతం తెలుగు చలన చిత్ర గీతాలలో ఒక మంచి మధురమైన గీతంగా నిలిచింది. కళాతపస్వి విశ్వనాథ్ గారి దర్శకత్వంలో జంధ్యాల సంభాషణలు, నటీనటుల ప్రతిభ, సంగీత దర్శకులు, గాయనీ గాయకుల పటిమతో ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. 

20, ఆగస్టు 2016, శనివారం

నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా - ఆరుద్ర కృష్ణభక్తి గీతం


నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా
వేణువు విందామని నీతో ఉందామని నీ రాధ వేచేనయ్యా! రావయ్యా! ఓ కృష్ణయ్యా!
ఓ గిరిధర! మురహర! రాధా మనోహరా!

నీవు వచ్చే చోట నీవు నడిచే బాట మమతల దీపాలు వెలిగించాను
కుశలము అడగాలని పదములు కడగాలని కన్నీటి కెరటాలు తరలించాను
ఓ గిరిధర! మురహర! నా హృదయేశ్వరా! నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా!
కృష్ణయ్యా! ఓ కృష్ణయ్యా! కృష్ణయ్యా! ఓ కృష్ణయ్యా!
గోపాలా! గోవింద గోవింద గోవింద గోవింద గోపాలా!

నీ పదరేణువునైనా పెదవుల వేణువునైనా బ్రతుకే ధన్యమని భావించాను
నిన్నే చేరాలని నీలో కరగాలని నా మనసే హారతిగా వెలిగించాను
ఓ గిరిధర! మురహర! నా హృదయేశ్వరా! ఒకసారి దయచేసి నాతిని దయచూడరా!
కృష్ణయ్యా! ఓ కృష్ణయ్యా! కృష్ణయ్యా! ఓ కృష్ణయ్యా!
గోపాలా! గోవింద గోవింద గోవింద గోవింద గోపాలా!రాధ మధుర భక్తిని మనోజ్ఞంగా ఆవిష్కరించిన మరో సినీ గీతం ఈ నువ్వు వస్తావని అనే గీతం. 1978లో విడుదలైన మల్లెపూవు చిత్రంలో ఆరుద్ర గారు రచించిన ఈ గీతానికి సంగీతం చక్రవర్తి గారు అందించగా రాధ మనోభావనను అద్భుతంగా వాణీ జయరాం గారు తమ గళంలో మనకు అందించారు. ఆరుద్రగారి అసలు పేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి. ఆరుద్ర సినీ గేయ రచయితే కాకుండా కవితలు, కథలు, నాటకాలు, గ్రంథాలు రచించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ప్రముఖమైన రచనలలో సమగ్రాంధ్ర సాహిత్యం అనే 12 భాగాల పరిశోధనాంశం. ఆయన 1950 నుండి 1993 వరకు సినీ గేయ రచయితగా, సంభాషణల రచయితగా ఎంతో పేరు ప్రతిష్ఠలు పొందారు. ప్రముఖ కవి శ్రీశ్రీ వీరి మేనమామ. అలాగే ప్రముఖ రచయిత్రి డాక్టర్ రామలక్ష్మి వీరి సతీమణి. ఆరుద్ర ఇతర ప్రముఖ రచనలలో 1948 కాలం నాటి నిజం రజాకార్ల అరాచకాల నేపథ్యంలో రచించిన త్వమేవాహం అనే అద్భుతమైన సాహితీ సౌరభం. శ్రీశ్రీ లాగానే ఆరుద్ర కూడా మంచి విప్లవ రచయిత. కమ్యూనిష్టులతో అనుబంధం ఆయన రచనలపై ప్రభావం చూపింది. తిరువళ్లువార్ రచించిన తమిళ ప్రబంధం తిరుక్కురళ్‌ను ఆయన ఆంధ్రీకరించారు. రాముడికి సీత ఏమవుతుంది అనే సంచలనాత్మకమైన రచన కూడా చేశారు. ఆయన రచించిన కొన్ని అద్భుతమైన సినీ గేయాలు:

చెట్టులెక్కగలవా ఓ నరహరి, నారాయణా హరి నారాయణా, పాలకడలిపై శేషతల్పమున, నీల గగన ఘనశ్యామ - చెంచులక్ష్మి, మనసే అందాల బృందావనం - మంచి కుటుంబం, హైలో హైలెస్సా హంస కదా నా పడవ, మహాదేవ శంభో, జో జో జోల - భీష్మ, రంభ ఊర్వశి తలదన్నే రమణీ లలామ ఎవరు? - వీరాభిమన్యు, సిరి సిరి లాలి చిన్నారి లాలి - భక్త ప్రహ్లాద, ఈ మౌనం ఈ బిడియం -  డాక్టర్ చక్రవర్తి, ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వుల, హలో హలో ఓ అమ్మాయి - ఇద్దరు మిత్రులు, కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది - ఉయ్యాల జంపాల, ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట - మంచి మనసులు, యమునా తీరమున సంధ్యా సమయమున - జయభేరి, పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలుకలు రెండు - రాము, ధనమేరా అన్నిటికీ మూలం - లక్ష్మీ నివాసం, చింతచెట్టు చిగురు చూడు - అదృష్టవంతులు, చంటి బాబు ఓ బుజ్జిబాబు - అందరూ దొంగలే, నువ్వడిగింది ఏనాడైనా కాదన్నానా, మబ్బే మసకేసిందిలే - వయసు పిలిచింది, మరు మల్లియ కన్నా తెల్లనిది - మల్లెపూవు, గోగులు గోగులు పూచే ఓ లచ్చా గుమ్మడి - ముత్యాల ముగ్గు, అబ్బోసి చిన్నమ్మా, సమూహ భోజనంబు  - అందాల రాముడు, అమ్ము కుట్టి అమ్ము కుట్టి - పెళ్లి పుస్తకం...ఇలా ఎన్నో ఎన్నెన్నో.

ఇక ఈ గీతానికి వస్తే రాధ మధుర భక్తికి ప్రతిబింబం. తనలోని భావనలన్నిటినీ స్వామికి  తాను నాయికయై సమర్పించింది. విరహం, భక్తి, వైరాగ్యం, శృంగారం, శరణాగతి అన్నీ కలబోసిన భక్తి రాధది. ఆ భావనలను ఆరుద్రగారు అచ్చతెనుగులో అద్భుతంగా పండించారు. వేణుమాధవుని కోసం బృందావనమంతా వేచియుందిట, ఆయన వస్తే ఆయన వేణుగానం వింటూ కాస్త సమయం గడుపుదామని రాధ వేచియుందట. ఎవరా కృష్ణుడు? గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోకులాన్ని కాపాడిన గిరిధరుడు, ముర అనే రాక్షసుని సంహరించిన వాడు, రాధ మనసు దోచుకున్నవాడు.

స్వామి వచ్చే చోట, ఆయన నడిచే బాట అంతా మమతల దీపాలు వెలిగించిందట. అంటే, హృదయాన్ని ఆయనకు సమర్పించి ఆయనను ఆహ్వానిస్తోంది. స్వామి క్షేమ సమాచారం తెలుసుకొని ఆయన పాదాలు కడగటానికి కన్నీటి కెరటాలను తరలించిందట. ఆ రాధా హృదయేశ్వరుని దర్శనానికై తపిస్తున్న రాధ హృదయ స్పందన ఎంత అందంగా ఉందో కదా? అందుకే రాధ మధురభక్తికి ప్రతిబింబమైంది.

మధురభక్తిలో మరో ప్రత్యేకత ఆ స్వామి భక్తి సామ్రాజ్యంలో కించిత్ స్థానమున్నా చాలు జన్మ ధన్యమే అన్న భావన. అదే భావన రాధ మనసునుండి వెలువడింది. ఆయన పాదాలు తాకిన ధూళి అయినా, ఆయన పెదవలుపై వేణువైనా చాలు అని భావించింది రాధ మనసు కనుగొన్న కవి హృదయం. మధురభక్తికి తారాస్థాయి నేను అన్న భావన పటాపంచలై స్వామిలో ఐక్యం కావటం. ఆ స్వామిని చేరుకోవాలని ఆయనలో ఏకమవ్వాలని తన మనసును హారతిగా సమర్పించిందిట ఆ రాధ. తనపై దయచూపమని స్వామిని వేడుకునే రాధ భావనలను అత్యంత నిర్మలంగా ఆవిష్కరించారు ఆరుద్ర గారు.

మధురభక్తి సోపానంలో ఎన్నో భావవ్యక్తీకరణలు. స్వామిని నాయకునిగా భావించి, ప్రేమించి, ఆరాధించి, ఆయన రానందుకు అలిగి, కోపగించి, దుఃఖించి, వచ్చినంత అలుక చూపి, స్వామి బుజ్జగింపులో కరగి, ఆయన ప్రేమ సామ్రాజ్యంలో ఓలలాడి, తనను తాను మరచి, నాది-నేను అన్న అహంకార లక్షణాలు విడిచే సోపానం ఇది. తాను ఆయన అనే ద్వైత భావం నుండి అద్వైత భావనకు చేరుకునే కష్టతర ప్రయాణం ఇది. భౌతిక ప్రపంచంలో ఉన్న వారికి ఈ భావన అర్థం కాక విపరీతార్థాలు తీసి ఆ మధురభక్తిలో ఉన్న వారి పట్ల వివక్ష చూపి హింసించిన సందర్భాలు ఎన్నో. అన్ని ఆటుపోట్లనూ తట్టుకొని మధుర భక్తులు స్వామిలో ఐక్యమై ముక్తిని పొందారు. అటువంటి వారిలో రాధ అగ్రగణ్యురాలు. ఆ మధుర భక్తులకు దేహస్ఫురణలు, దేహానికి సంబంధించిన అవలక్షణాలు ఏవీ అంటవు. వారి తనువు, మనసు అణువణువు స్వామే. ఆ భావననే ఆరుద్రగారు ఈ గీతం ద్వారా మనకు అందించారు. కృష్ణభక్తి సామ్రాజ్యంలో ఈ గీతానికి ఒక స్థానం తప్పకుండా ఉంటుంది. మనకు ఇంతటి అద్భుతమైన గీతాన్ని అందించిన ఆరుద్రగారికి జోహార్లు. ఈ మధుర భక్తి గీతాన్ని వాణీ జయరాం గారు మనోహరంగా ఆలపించారు. చక్రవర్తి గారి సంగీతం ఆరుద్రగారి సాహిత్య క్షీరానికి తేనెలా తోడైంది. ఈ ముగ్గురి ప్రతిభకు ఫలమే ఓ సుందర కృష్ణభక్తి గీతం.12, ఆగస్టు 2016, శుక్రవారం

శ్రీ వరలక్ష్మీ నమస్తుభ్యం - ముత్తుస్వామి దీక్షితుల వరలక్ష్మీ వ్రతం కృతి


శ్రీ వరలక్ష్మీ నమస్తుభ్యం వసుప్రదే
శ్రీ సారస పదే రసపదే సపదే పదే పదే

భావజ జనక ప్రాణ వల్లభే సువర్ణాభే
భానుకోటి సమాన ప్రభే భక్త సులభే
సేవకజన పాలిని  శ్రిత పంకజ మాలిని
కేవల గుణశాలిని కేశవ హృత్కేళిని

శ్రావణ పౌర్ణమీ పూర్వస్థ శుక్రవారే
చారుమతీ ప్రభ్రుతిః పూజితాకారే
దేవాది గురు గుహ సమర్పిత మణిమయ హారే
దీనజన సంరక్షణ నిపుణ కనక ధారే
భావనాభేద చతురే భారతీ సన్నుత వరే
కైవల్య వితరణపరే కాంక్షిత ఫలప్రదకరే 

సకల సంపదలను కలిగించే వరమహాలక్ష్మికి నమస్కారములు. కలువల వంటి అందమైన పాదములు కలిగిన, తీయని పలుకులు పలికే ఆ తల్లికి పదే పదే నమస్కారములు. మన్మథుని తండ్రియైన శ్రీమహావిష్ణువు పత్నియైన, బంగారు కాంతితో కోటి సూర్యుల ప్రకాశం కలిగిన, భక్తులకు సులభయమైన, సేవక జనులను పాలించే, భక్తులచే కలువల మాలలతో పూజించబడే, సకల శుభ గుణసంపన్నురాలైన, కేశవుని హృదయములో ఆటాడే ఆ వరమహాలక్ష్మికి నమస్కారములు. శ్రావణ పౌర్ణమి ముందటి శుక్రవారమునాడు చారుమతి మొదలైన వారిచే పూజించబడిన, దేవతలు, కుమారస్వామిచే మణిఖచితమైన హారములను స్వీకరించిన, దీనులను రక్షణలో నిపుణురాలైన, దారిద్య్రంలో  ఉన్నవారికి కనకధారను కురిపించే, విచక్షణలో చతురురాలైన, సరస్వతిచే కొలువబడిన, మోక్షాన్ని ప్రసాదించే పరదేవతయైన, కోరిన కోర్కెలు తీర్చే వరమహాలక్ష్మికి నమస్కారములు.

ముత్తుస్వామి దీక్షితుల వారి ఈ కృతి వరలక్ష్మి గురించి ప్రత్యేకంగా వ్రాయబడింది. శ్రీరాగంలో అందంగా కూర్చబడిన ఈ కృతిలో వరలక్ష్మీ వ్రతం శ్రావణ పౌర్ణమి ముందటి శుక్రవారం నాడు జరుపుకోవటం గురించి ప్రస్తావన ఉంది. దీక్షితులవారు సిద్ధులు. అందుకే వారి నోట వచ్చిన పలుకులు దేవతా నివాసాలైనాయి. అటువంటిదే ఈ మహాలక్ష్మి స్తుతి. పల్లవి-అనుపల్లవిలోనే ఆయన పొందిన అనుభూతిలోని ఆధ్యాత్మిక ఔన్నత్యం మనకు అర్థమవుతుంది. వసుప్రదే, శ్రీ సారస పదే, సపదే, పదే పదే అన్న పదప్రయోగంలో దీక్షితులవారి ఉపాసనా శక్తి ప్రతిబింబిస్తుంది. చరణాలలో ఆయన సంస్కృత భాషా వైభవం సువర్ణమయమై ప్రకాశిస్తుంది. నన్ను బాగా ప్రభావితం చేసిన పదాలు కేశవ హృత్కేళిని మరియు భావనాభేద చతురే అన్నవి. శ్రీమహావిష్ణువు హృదయంలో ఆడుకునే తల్లిగా దీక్షితులవారు అమ్మను వర్ణించారు. నిజమే. ఆ పరమాత్మ హృదయస్థానంలో నిలిచి ఆయనను నిత్యం రమింపజేసే తల్లికి ఆ పదం ఎంత సముచితం కదా? భావనలలో భేదాన్ని చూపించటం చతురత కలిగిన తల్లిగా వాగ్గేయకారులు స్తుతించారు. అంటే భక్తుల భావనలను బట్టి అనుగ్రహించే తల్లి అని నా అభిప్రాయం. అలాగే దుష్టశిక్షణలో పరమాత్మకు తోడుగా, భక్తసులభగా, స్వామికి హృదయేశ్వరిగా నిత్యం సేవించే తల్లికి ఎన్ని లక్షణాలో. అందుకే గుణశాలిని అని మొదటి చరణంలో చెప్పి రెండవ చరణంలో భావనా భేద చతురే అని సంపూర్ణం చేశారు. కృతి ఆఖరి పంక్తిలో కైవల్య వితరణ పరే కాంక్షిత ఫలప్రదకరే అని పలికి పరము ఇహము రెండితా మన కోరికలను తీర్చే కల్పవల్లిగా ఆ వరమహాలక్ష్మిని కొనియాడారు. ఇటువంటి భావనలు ఉపాసనలో సిద్ధి పొందిన వారి నోట మాత్రమే ఆవిష్కరించబడుతాయి.  దీక్షితుల వారి ఆధ్యాత్మిక సంపదకు శతసహస్ర వందనాలు.

అందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు.  శ్రీవరలక్ష్మీ నమస్తుభ్యం అనే కృతిని మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు ఆలపించగా వినండి.

మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్నీచ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్!

7, ఆగస్టు 2016, ఆదివారం

ఔరా అమ్మక చెల్లా ఆలకించి నమ్మడమెలా


శ్రీకృష్ణుని లీలలను వర్ణించటం మన తరమా? ఆ స్వామి తత్త్వం తెలుసుకోవటం అంత సులభమా?  ఆయన గాథలు నమ్మశక్యంగా ఉంటాయి. ఈ భావనలను వ్యాస భగవానుడిని నుండి పోతన వరకు ఎందరో భాగవతోత్తములు మనకు తెలియజేశారు. అటువంటి భావనే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మనకు ఆపద్బాంధవుడు అనే చిత్రంలోని ఔరా అమ్మక చెల్లా అనే గీతం ద్వారా అందించారు. అద్భుతమైన జానపద ప్రయోగంతో రచించిన ఈ గీతం కృష్ణ తత్త్వ మహత్వాన్ని మనకు తెలియజేస్తుంది. వివరాలు ఈ బ్లాగు పోస్టులో.

ఔరా అమ్మక చెల్లా ఆలకించి నమ్మడమెలా
అంత వింత గాధల్లో ఆ నందలాలా
బాపురే బ్రహ్మకు చెల్లా వైనమంత వర్ణించ వల్ల
రేపల్లె వాడల్లో ఆనందలీల
అయినవాడే అందరికీ అయినా అందడు ఎవరికీ
అయినవాడే అందరికీ అయినా అందడు ఎవరికీ
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా ఛాంగుభళా


నల్ల రాతి కండలతో కరుకైనవాడే
వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే
నల్ల రాతి కండలతో కరుకైనవాడే ఆ నందలాలా
వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె ఆనందలీలా
ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలి పెట్టే ఆ నందలాలా
జాణ జానపదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనందలీలా
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా ఛాంగుభళా

ఆలమంద కాపరిలా కనిపించలేదా ఆ నందలాలా
ఆలమందుకాలుడిలా అనిపించు కాదా ఆనందలీల
వేలితో కొండను ఎత్తే కొండంత వేలు పట్టే ఆ నందలాలా
తులసీ దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా ఛాంగుభళా

ఉత్తర భారతంలో నందలాలా అంటే నందుని ముద్దుబిడ్డ అయిన కృష్ణుడు. లాడ్లా అనే పదం నుండి లాలాగా రూపాంతరం చెందింది. ఆయన లీలలు గోకులమంతటికీ ఆనందం కలిగించాయి కాబట్టి సిరివెన్నెల ఆయనను ఆనందలీల అన్నారు. ఈ ఆ నందలాల, ఆనందలీల అన్న రెండు ఒకేలా ధ్వనించే పద సంపుటిని పునాదిగా చేసుకొని ఈ మహత్తరమైన గీతాన్ని మనకు అందించారు. అమ్మక చెల్ల, చాంగుభళా వంటి పదాలను మళ్లీ మనకు గుర్తు చేసి తెలుగుదనం సుగంధాలను మళ్లీ గుబాళింపజేశారు. ఆ కృష్ణుని వైనాన్ని వర్ణించటం బ్రహ్మ వల్ల కూడా కాదు అని సిరివెన్నెల ఈ గీతంలో తెలిపారు. కృష్ణుని తత్త్వానికి మూలం అన్నిటా తానే ఉండి, ఏదీ తనకు అంటించుకోని తామరాకు మీది నీటిబొట్టు చందం. ఆ రహస్యాన్ని అయినవాడే అందరికీ, అయినా అందడు ఎవ్వరికీ అన్న పంక్తితో మనకు తేటతెల్లం చేశారు. ఆ కృష్ణుడు బాలుడా? గోపాలుడా? లోకాలను పాలించేవాడా? ఎలా తెలిసేది అని కృష్ణ తత్త్వంలో మునిగి తేలే ఆశ్చర్యాన్ని మనోజ్ఞంగా వ్యక్త పరచారు.

నల్లరాతి-వెన్నముద్ద..కరుకుదనం-సుతిమెత్తదనానికి ప్రతీకగా ఆ కృష్ణుని నుతించారు. ఆ పదాలను సముచితంగా గానం చేశారు బాలు, చిత్ర.  తాను ఆయుధాలను పట్టను అని దుర్యోధనుడికి మాట ఇచ్చి విజయునికి రథ సారథిగా నిలిచాడు. ఎంత గొప్ప సందేశం కదా మనకు? మనకు సారథి ఆ జగద్గురువైన శ్రీకృష్ణుడు. ఈ తత్త్వాన్ని సిరివెన్నెల మనకు ఎంతో అందంగా తెలియజేశారు. గోపకులంలో రాసలీలలతో, తన మహిమలతో మనకు జ్ఞానాన్ని గీత ద్వారా బోధించాడు ఆ కృష్ణుడు. శ్రీకృష్ణుడు పలికిన ప్రతి మాట, వేసిన ప్రతి అడుగు, ప్రతి లీల, ప్రతి చేష్ట మనకు సందేశం కలిగినదే. అన్నిటా మునిగి తేలుతూ స్థితప్రజ్ఞత ఎలా సంపాదించుకోవాలో కృష్ణుడు మనకు తెలిపాడు. ఆ గొప్ప తత్త్వాన్ని జాణ జ్ఞాన పదాలతో జ్ఞాన గీతి పలుకునటే అన్న పంక్తిలో సిరివెన్నెల తెలిపారు. పశువుల కాపరిలా కనిపించే కృష్ణుడు మరోవైపు కాలుడిలా కనిపించాడు. గోకులం కోసం గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలిపై ఎత్తిన పరమాత్మ ఆ కృష్ణుడు. కొండంత అండగా మనకు సాయం నిలిచే ఆపద్బాంధవుడు ఆ ఆనందమూర్తి. భక్తితో కొలిచి సమర్పించిన తులసీదళానికి బద్ధుడైనాడు ఆ కృష్ణుడు అన్న తులాభారం గాథను మనకు చివరి పంక్తిలో మనకు అందించారు.

సీతారామశాస్త్రి గారి తెలుగులో సౌందర్యంతో పాటు లోతైన భావ సంపద పొదిగి ఉంటుంది. అంతేనా? దివ్యత్వాన్ని అలదుకున్న పద ప్రయోగం ఉంటుంది. ముఖ్యంగా అయాన రాసిన సంగీత, నాట్య, భక్తి రస ప్రధాన గీతాలలో ఇవి మరింత ప్రకాశిస్తాయి. అటువంటి గీతమే ఔరా అమ్మక చెల్లా. మనకు అర్థమయ్యే పదాలతో అనంతమైన భావనను అందించే అరుదైన కవి సిరివెన్నెల. కృష్ణతత్త్వం తెలియాలంటే ఆ నందలాలా రాసలీలలను, నందగోపకుల్ ఆనంద పారవశ్యాన్ని, ఆ యశోదమ్మ వాత్సల్యాన్ని, రాధమ్మ ప్రేమను అనుభూతి చెందాలి. ఈ గీతం వింటుంటే సిరివెన్నెల వారి అనుభూతులు అలా హృదయఫలకంపై కదలాడుతూ కనిపిస్తాయి. కీరవాణి గారు ఈ గీతానికి సంగీతంతో అద్భుతంగా అలంకరించారు. విశ్వనాథ్ గారి దర్శకత్వ ప్రతిభ ఈ పాట చిత్రీకరణలో కనబడుతుంది. సాహిత్యానికి అనుగుణంగా దానికి గాత్రంతో ప్రాణప్రతిష్ఠ చేసిన గాయకులు బాలు, చిత్ర గార్లు. వీరందరిలోని ప్రతిభా సరస్వతికి నా వందనాలు.