RightClickBlocker

25, నవంబర్ 2016, శుక్రవారం

జొన్నవిత్తుల వారి తెలుగుభాషా వైభవంపై గీతం


మాతృభాష కన్నతల్లి వంటిది. దానిని విస్మరిస్తే కన్నతల్లిని విస్మరించినట్లే. మాతృభాషను గౌరవిస్తే కొన్ని తరాలు తరిస్తాయి. లేకుంటే అంతటితో ఆ భాషా ప్రవాహం ఆగిపోయి పరధర్మం పాలైపోతాము. అక్షరాలను నేర్చుకోవటం, వ్రాయటం, చదువగలిగి మాధుర్యాన్ని ఆస్వాదించటంతో పాటు, భావాలను మాతృబాషలో వ్యక్తపరచగలగటం మన కనీస ధర్మం. భాష  కేవం పదల అల్లిక కాదు. దివ్యత్వం చేత ప్రచోదనమైన శబ్దవాహిని. మహానుభావుల నోట పలుకబడిన దివ్యవాహిని. జ్ఞానం, మేధస్సు, ఆధ్యాత్మిక శక్తి కలబోసిన పదాల సమ్మేళనం మాతృభాషా ప్రవాహం.

మందార మకరంద మాధుర్యాల రుచిని తెలిపేది భాష. మధురసపు మామిడి పండ్ల తీయదనాన్ని తెలిపేది ఈ భాష. ఋతువుల లక్షణ సంపదను ఆవిష్కరించేది భాష. కళల ఆకృతిని చిత్రపటంగా మనముందుంచేది భాష. మనుషులను బంధాలతో అల్లి ఐక్యతతో ముందుకు నడిపేది భాష. నవరసాల భావావిష్కరణ చేసేది భాష. పురాణేతిహాసముల ధర్మాలను ప్రస్ఫుటింపజేసేది భాష. మానవ జీవన వాహినిలో సంస్కృతి సాంప్రదాయలను అవిరామంగా అందించేది బాష.

భాషా వైభవం కొన్ని శతబాదాల పాటు శతికోటి ప్రభల వెలుగు వెలిగి ఆంగ్ల మాధ్యమంలో బోధన వచ్చిన తరువాత ఓ అర్ధ శతాబ్ద సమయంలో తీవ్రంగా క్షీణించ సాగింది. ఉపాధికై ఆంగ్లమాధ్యయం తప్పని సరి కావటంతో తెలుగు మాట్లాడే ప్రాంతాలలోనే తెలుగు బోధన తగ్గిపోయింది. నేను 1980  దశకంలో తెలుగును మొదటి భాషగా తీసుకోగలిగాను, అప్పుడు చెప్పగలిగిన ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. ఇప్పుడు రెండూ లేవు. భాష అటకెక్కింది. ఆంగ్లభాషా ప్రవాహంతో కలిసి పరుగెత్తలేకపోతోంది. తెలుగుభాష అనే వృక్షానికి తిరి ప్రాణం పోయవలసింది ఇళ్లలోనే. తల్లిదండ్రులు పిల్లలతో తెలుగులో మాట్లాడాలి, తెలుగును నేర్పించాలి, తెలుగు భాషా మాధుర్యాన్ని చవిచూపించాలి. సమాజంలో తెలుగు వాడకం చాలా వేగంగా తగ్గుతున్నా,  తెలుగు భాష ప్రాభవం పునరుజ్జీవమై గొదావరిలా ఉప్పొంగాలని కోరుకునే వారు ఎందరో. భాషాభివృద్ధికి, భాషాభిమానం పెంచటానికి, భాషా వినియోగం పెంపొందించటానికి కృషి చేస్తున్న వాళ్లు ఎందరో. ఇప్పటికీ తేటతేనె తెలుగులో అమృత రస ధారలనొలికించే కవులెందరో. రసహృదయులింకెందరో. వారందరికీ శతసహస్రవందనాలు.

తెలుగు భాషా వైభవం చాటే ఎన్నో గీతాలు వచ్చాయి. ఎన్నో అజరామరమైనాయి. అటువంటి వాటిలో ప్రముఖ సినీ గేయ రచయిత, సాహితీవేత్త జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు రచించిన ఈ గేయం ఎంతో పేరుపొందింది. చక్కని భాష, ఆ భాష వైభవాన్ని తెలిపే చారిత్రాత్మక ప్రస్తావనలు, భాషలో ఉన్న సౌందర్యం, లాలిత్యం ఈ గీతం ద్వారా మనకు రచయిత అందించారు. తెలుగుదనాన్ని ఆస్వాదించటానికి ఈ గీతం ఓ మంచి అవకాశం. ఇంత చక్కని గీతం అందించిన జొన్నవిత్తుల వారికి హృదయపూర్వక నమస్కారములు.

చక్కెర కలిపిన తియ్యని కమ్మని తోడు పెరుగు తెలుగు
చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు
నన్నయ తిక్కన ఎఱ్ఱన పితికిన ఆవు పాల పొదుగు
చదువుల తల్లికి  సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు

హిమగిరి జలనిధి  పదముల అమరిన  జిలుగు వెలుగు తెలుగు
గణ యతి ప్రాసల ధ్వని రస శాఖల కవితలల్లు పులుగు
నవ నవ పథముల కవితా రధములు సాగిపోవు  నెలవు
అలవోకగ అష్టావధానములు సేయు కవుల కొలువు

అల్లసాని అల్లికల జిగిబిగిని అమృతధార తెలుగు
శ్రీనాథుని కవితాశుధారలో  అమరగంగ  పరుగు
రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో
రస ధారయై ధ్రువ తారయై  మన దేశ భాషలను లెస్సయై
దేవ భాషతో చెలిమిచేసి పలు దేశ  దేశముల వాసికెక్కినది

మన అక్షరాల  తీరు మల్లెపాదు కుదురు
మన భాష పాల కడలి భావం మధు మురళి
అజంత పదముల అలంకృతం మన భాష అమృత జనితం
భారత భాష  భారతి నుదుట తెలుగు భాష తిలకం

బాలమురళీరవం - ఓంకారాకారిణి


బాలమురళీకృష్ణ గారి రచనల్లో పాండిత్యంతో పాటు దేవతాస్వరూపము యొక్క గుణవిభవ వర్ణన ప్రత్యేకంగా ఉంటుంది.ఆయన రచించిన మరో కృతి పరిశీలిద్దాం. వాగ్గేయకారులు రాగం యొక్క పేరును కృతిలో ఉపయోగించటం ఒక ప్రక్రియ. ముత్తుస్వామి దీక్షితుల వారు ఈ ప్రక్రియకు చాలా ప్రసిద్ధి. త్యాగరాజ స్వామి వారు కూడా అక్కడక్కడా దీనిని ఉపయోగించారు. వారి పరంపరలో ఐదవ తరం శిష్యులైన బాలమురళీకృష్ణ గారు కూడా ఈ ప్రక్రియను తమ రచనల్లో బాగా ఉపయోగించారు. ఈ ఓంకారాకారిణి లవంగి రాగంలో కూర్చబడినది. ఆ పేరును చరణంలో ఉపయోగించారు. ఆ త్రిపురసుందరిని నుతిస్తూ బాలమురళి గారు ఈ కృతిలో బీజాక్షరాలతో పాటు శక్తివంతమైన పదాలను ఉపయోగించారు. వాగ్గేయకారుల పరంపరకు వన్నె తెచ్చారు.

ఆ అమ్మను ఓంకార ఆకారముగా, మన అహంకారాన్ని నశింపజేసేదిగా ప్రార్థిస్తున్నారు. ఒక్క హూంకారంతో శత్రువులను సంహరించే తల్లి హ్రీం అనే బీజాక్షరానికి రూపముగా, శివుని ధర్మపత్నిగా కొనియాడారు. తన ముద్రైన మురళిని ఉపయోగిస్తూ, ఆ గాన సుధాలహరిలో విహరించే అమ్మగా, పరమశివునిచే ప్రేమించబడిన త్రిపురసుందరిగా, కరుణారసంతో నిండిన లాలిత్యము గల సుందరిగా,వరం, అభయము ఇచ్చే సమస్త శుభాంగిగా ప్రస్తుతించారు. దాదాపుగా దీక్షితుల వారి కృతులలోని ఔన్నత్యాన్ని ఈ కృతిలో మనం గమనించవచ్చు. లవంగి రాగము కూడా ఆయన బాలమురళీకృష్ణ గారి సృష్టే. ఈ రాగంలో నాలుగే (స రి మ ద) స్వరాలు ఉన్నాయి. ఇలాంటి ప్రయోగం చేసినందుకు తమిళ శాస్త్రీయ సంగీత పండితులు గగ్గోలు పెడితే ఆయన మరింత ధైర్యంగా ఇటువంటి రాగాలు మరికొన్ని కూడా సృష్టించారట. కనకాంగి రాగ జన్యమైన ఈ లవంగి సాహిత్యానికి దివ్యత్వాన్నిచ్చింది. ఈ కృతికి బాలమురళి గారు చెప్పిన చిట్టస్వరాలు ఆయన మేధోసంపత్తికి మచ్చుతునక. నిజంగా ఆయనలాంటి వాగ్గేయకారుల తరంలో జన్మించటం మన అదృష్టం. వారికి మరో మారు నివాళి. ఈ కృతిని బాలమురళిగారి గళంలోనే వినండి.


ఓంకారాకారిణీ! మదహంకార వారిణీ! అవతుమాం!

హూంకార మాత్ర శత్రు దమనీ! హ్రీంకార రూపిణి! రుద్రాణీ!

మురళీ సుధా లహరీ విహారీ! పురరిపు ప్రేమిత త్రిపుర సుందరీ!
కరుణారస భరిత లలిత లవంగీ! వరదా! అభయదా! సకల శుభాంగీ!

24, నవంబర్ 2016, గురువారం

బాలమురళీరవం - అమ్మా ఆనందదాయిని వర్ణం


ఆయన రచించిన అద్భుతమైన వర్ణం అమ్మా ఆనందదాయిని - గంభీర నాట రాగంలో. బాలమురళి గారి ప్రత్యేకత కవితా పటిమ. భక్తితో పాటు కవిత్వపు సువాసనలు తెలుగులో ఆయన గుబాళించారు. అందుకే ఆయన కర్ణాటక సంగీతంలో కొత్త విప్లవానికి నాంది పలికారు. విన్నకొద్దీ ఆయన ప్రజ్ఞ మరింత తేటతెల్లమవుతుంది. నాకు సంగీత జ్ఞానం లేదు కాబట్టి ఈ వర్ణానికి స్వరాలు రాయలేదు. స్వరాలలోనే అసలు అందం. గంభీర నాటలోని గంభీరమంతా ఈ కృతిలో కనబరచారు బాలమురళి గారు.

అమ్మా ఆనంద దాయిని అకార ఉకార మకార రూపిణివమ్మ నిను నమ్మి బాల మురళీగానమ్ము చేసి ధన్యుడనైతిని

నీ నిర్వికార నిరామయ మూర్తి తరణి శత కిరణ సుశమమయముగ నిలిచే హృది
సకలము నవరస భరితము నిరతము నిరవధిక సుఖము అనుభవమమ్మా

శివే శివే శివే వేవేల వరాలరాశివే మొరాలింపు

సదానంతానందామృతం సత్సంగీతం

ఏది నిజంబెయ్యదసత్యమని తెల్పగ ప్రార్థింతును నే తెలియ

ఇన బింబ సమాన ముఖ బింబ కదంబ నికురుంబ మదంబ ఉమసాంబ

అంతర్యాగమున నిను కొలిచి పురాకృత ఖలంబుల విముక్తునిగ
నేనైతి సకల శుభ గుణా వినుత మునిగణావన గుణ త్రిగుణాతీతా
విధి హరి గణపతి శరవణభవ శుక శౌనక అసుర సుర గణ రతిపతి
సురపతి వినుత శివే నిరతిశయ శివే శివే పరమ పరశివే శివే శివే

https://www.youtube.com/watch?v=TKcgJ0VuNvQ

14, నవంబర్ 2016, సోమవారం

షోడశోపచారములురామయ్యా! నీ తారక మంత్రము నాకు భవ తారకము. నా మనసునే మందిరము చేసుకొని నిన్ను ఆ యింటికి ఆహ్వానిస్తున్నాను. వచ్చి నన్ను పావనము చేయవయ్యా! సీతమ్మ! లోకమాతా! నీ చల్లని చూపులే మాకు సకల సౌభాగ్యములు! స్వామితోడ వచ్చి మా గృహమును పావనము చేయవలసినది!! మీ పాదములకు నా హృదయ కమలమును సమర్పించి

రామయ్యా! వచ్చావా నా తండ్రీ! నీ కొరకు నా కళ్లు కాచి ఎదురుచూస్తున్నానయ్యా! అమ్మా సీతమ్మా నా ప్రార్థనలు విని స్వామిని తోడ్కొని వచ్చావా? ఎంత దయ తల్లీ నీది?

ఇదిగోండి మీ పాదాలు కడుగ అర్ఘ్యము. మీ చరణ ధూళి సోకినంత నా ఇల్లు పావనమైంది. నా జన్మ ధన్యమైంది. ఆనందబాష్పాలు కలబోసిన నీటితో మీ పాదాలు కడుగ అనుమతీయండి! రామయ్యా! సీతమ్మా! ఇదిగో మీ చేతులు కడుగ పాద్యము! స్వామీ! ఎంత సుందర చరణములో నీవి? అమ్మా సీతమ్మ! నీ మట్టెలు స్వామి ప్రేమకు సంకెతమే కదా? ఆహా ఏమి నా భాగ్యము? లోకపావని, రఘురాముడు మా ఇంట అడుగు పెడుతున్నారు!

అమ్మా! అయ్యా! లోపలికి రండి! మీ కోసం రత్నఖచిత సింహాసనాలు సిద్ధం చేయలేకపోయాను, కానీ, నా చేతితో నేసిన పట్టు వస్త్రము కప్పిన ఆసనముంచాను! అదిగో! మా పెరట్లో పూచిన మల్లికా జాజి పారిజాత సంపంగులనుంచి మీకై వేచి ఉన్నాను! సుఖాసీనులు కండి! ఓ సౌగంధికా పుష్పములారా! అమ్మకు, అయ్యకు మీ సువాసనలతో సౌఖ్యాన్ని కలిగించండి!

స్వామీ! అమ్మా! ఇదిగో ఆచమనం! ముల్లోకాల సద్భక్తులకు దర్శనమిచ్చి అలసి సొలసి వచ్చి ఉంటారు. ఈ జలంతో మీ గొంతులు కాస్త తడుపుకోండి. ఇదిగిదిగో మధుపర్కం. ఆ తేనె-పెరుగు మీ మధురమైన పలుకులకు ఉపకరిస్తుంది. పలుకు తేనెల తల్లి సీతమ్మా! నీ మాటలే మాకు వరాల మూటలు. స్వామి ఉన్నాడని సిగ్గు పడకమ్మా!

రామయ్యా!సీతమ్మా! పాలు, పెరుగు, తేనె, శర్కర,నెయ్యితో, నారికేళ జలముతో, చక్కగా గంధము అరగదీసి సుగంధ ద్రవ్యములను చేర్చిన నీటితో స్నాననికి అన్నీ సిద్ధంగా ఉంచాను. హాయిగా స్నానం చేయండి. మర్చిపోకండేం! ఆ స్నానపు జలాలను కాస్త నా సేవనకు ఉంచండి. ఇదుగోండి, మీ స్నానాంతరం ధారణకు వస్త్రము, ఉపవీతము.

ఆహా! ఏమి సౌందర్యమయ్యా రామయ్య! ఎంత లావణ్యమమ్మా సీతమ్మ! రెండు కళ్లూ చాలటం లేదు! నను కన్న తల్లీ! నా తండ్రి రామయ్యా! ఇదుగో నా భక్తి అనే గంధపు చెక్కతో అరగదీసిన గంధము...నుదుట ధరించండి! నా హృదయమును ఈ పుష్పము ద్వారా మీకు సమర్పిస్తున్నాను. ధరించండి! ఇదిగిదిగో! మీ సౌకర్యానికై సాంబ్రాణి ధూపము! మీ మందిరమంతా చక్కని సువాసనతో నిండాలి.

రామయ్యా! సీతమ్మా! ఇదుగో! జ్యోతిస్స్వరూపులైన మీకు ఈ దీపం! అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి నాకు జ్ఞానజ్యోతిని ప్రసాదించండి. నా శ్రీమతి ఎంతో శ్రమపడి మీకు నివేదించటానికి భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు, చోష్యాలు, పానీయాలు సిద్ధం చేసింది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మీ రూపమైన ఈ నివేదనమును శుభ్రమైన వెండి పాత్రలో సేవించండి. మీకు ఇష్టమైనవి భుజించండి! మీ చేతులు శుభ్రం చేసుకోవటానికి ఇదిగోండి ఆచమనం! అమ్మా! ఇదిగో లేత తమలపాకులు, మా పెరట్లో పెరిగిన తీగవి, ఆ సున్నం, వక్కలు, ఇతర సుగంధ ద్రవ్యాలు వేసి స్వామికి తాంబూలం అందించు తల్లీ!

రామయ్యా! సీతమ్మా! అంతా సౌఖ్యమే కదా! మీ దివ్యమంగళ రూపాలను నేను ఏమని పొగడెదను? ఇదిగో నీరాజనం. ఏకహారతి, పంచహారతి అందుకోండి. పంచభూతములలోనూ, సమస్త దేవతామూర్తులలోనూ, ప్రకృతిలోను, నాలోను ఉన్న మీ మహత్తులను తెలిపే మంత్ర పుష్పం పఠిస్తున్నాను. దశరథపుత్రుడైన రాముని తెలుసుకునేందుకు ఆ సీతావల్ల్భుడైన మిమ్ములను ధ్యానిస్తున్నాను. జనకుని పుత్రికయైన సీతమ్మను తెలుసుకునేందుకు ఆ రామపత్నియైన మిమ్ములను ధ్యానిస్తున్నాను. మీరు మమ్ములను అనుగ్రహించెదరు గాక. అన్ని దిక్కులా, ,అంతటా, నా దేహమనే దేవాలయంలో స్థిరమై ఉన్న మీకు ప్రదక్షిణ నమస్కారములు సమర్పిస్తున్నాను. తెలిసీ తెలియక చేసిన పాపములను, ఈ జన్మలోనూ, ఇతర జన్మలలోనూ చేసిన పాపములు నశించుటకు ప్రదక్షిణము చేస్తున్నాను. నేను పాపుడను, పాప కర్మలను చేసే వాడిని, పాపాత్ముడను, పాపము వలన పుట్టిన వాడను. నన్ను తరించటానికి మీ కరుణను కురిపించవలసింది. మీరు తప్ప నాకు వేరే దిక్కెవ్వరూ లేరు. కాబట్టి కరుణతో నన్ను రక్షించండి.