RightClickBlocker

28, జనవరి 2017, శనివారం

వినరో భాగ్యము విష్ణు కథ - అన్నమాచార్యుల వారి హరికథా సుధ


వేదవ్యాసుల వారు పరమాత్మ లీలలను ప్రపంచానికి తెలియజేయటానికి, ఆయన భక్తుల అనుభవాలను, వారి భక్తి యొక్క గొప్పతనాన్ని తెలియజేయటానికి భాగవతామృతాన్ని మనకు అందించారు. ఆ గాథలను వాగ్గేయకారులు కుడా మనకు తమ సంకీర్తనల ద్వారా తెలియజేశారు. మన తెలుగు గడ్డపై పుట్టిన వాగ్గేయకారులలో అగ్రగణ్యులైన తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలలో భగవంతుడు, భక్తులను ప్రస్తవిస్తూ అద్భుతమైన ఆధ్యాత్మిక సందేశాన్ని అందించేవి ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి వినరో భాగ్యము విష్ణు కథ.

వినరో భాగ్యము విష్ణు కథ
వెనుబలమిదివో విష్ణు కథ 

ఆది నుండి సంధ్యాది విధులలో
వేదంబైనది విష్ణుకథ
నాదించేనిదే నారదాదుల చే
వీధి వీధులనే విష్ణుకథ

వదలక వేద వ్యాసులు నుడివిన
విదిత పావనము విష్ణుకథ
సదనంబైనది సంకీర్తనై
వెదకిన చోటనే విష్ణుకథ 

గొల్లెతలు చల్లలు గొన కొని చిలుకగ
వెల్లివిరియాయె విష్ణుకథ
ఇల్లిదే శ్రీవేంకటేశ్వరు నామము
వెల్లి గొలిపెనీ విష్ణుకథ


విష్ణు కథలు వినటమనేది ఓ భాగ్యము. ఈ విష్ణు కథ వెనుబలము. యుగయుగాలుగా సంధ్యావందనం మొదలైన నిత్యవిధులలో వేదముగా చెప్పబడింది విష్ణు కథ. నారదుడు మొదలైన హరి భక్తాగ్రగణ్యుల నోట వీధి వీధుల ఈ విష్ణు కథ నాదమై నిలిచింది. గట్టి సంకల్పంతో వేదవ్యాసుల వారు పలికిన పావన చరితము ఈ విష్ణు కథ. సంకీర్తనలను నిలయంగా చేసుకున్నది ఈ విష్ణు కథ. గోపికలు వెన్న కోసం మజ్జిగను చిలికే సమయంలో ఈ విష్ణు కథ వారి నోట వెల్లి విరిసింది. ఇక్కడ తిరుమలలో వెలసిన శ్రీవేంకటేశ్వరుని నామాన్ని ప్రకాశింపజేసింది   విష్ణు కథ. 

ఈ కీర్తనను పరిశీలిస్తే ఓహో, ఇంతమంది చేత చెప్పబడింది, కాబట్టి తప్పకుండా విష్ణు కథ మహత్తును చాటేది అనిపించినా, ప్రతి చరణంలో అంతరార్థం నిగూఢమై ఉంది. జీవాధరమైన వాడు విష్ణుమూర్తి. అనగా సృష్టి యొక్క స్థితికి కారకుడు. మన శరీరానికి వెన్ను పూస ఎలాంటిదో ఈ విశ్వానికి శ్రీహరి అలాంటి వాడు అని పల్లవిలోనే చెప్పక చెప్పారు అన్నమాచార్యుల వారు. విశ్వంలోని కణకణములోనూ అణువణువైన వాడు విష్ణువు. అలాగే, సంధ్యాది విధులలో వేదంగా చెప్పబడింది విష్ణు కథ అన్నారు. సంధ్యావందనమనేది ఎంత ముఖ్యమైన విధో మనకు సనాతన ధర్మ ప్రవక్తలు చెబుతూనే ఉంటారు. అన్నమాచార్యులు వారు దానిని మరింత ప్రభావవంతంగా చెప్పారు. ఈ విధిలో కేశవ నామాలతో కూడిన ఆచమనము అంశం. దేహములోని వివిధ భాగములలో నివసించే శ్రీహరి అంశలను ప్రస్తావించే ఈ విషయాన్ని అన్నమాచార్యుల వారు మొదటి చరణంలో పలికారు. ఈ విశ్వానికి జాగృతమైన శక్తిని అందించే సంధ్యావందన విధిలో విష్ణు కథ నిబిడీకృతమై ఉందని మనకు తెలిపారు. అలాగే నారదుడు విష్ణు భక్తులలో శ్రేష్ఠుడు. నిరంతర హరినామ స్మరణతో ఆయన మహిమలను ముల్లోకాలకు చాటే మహర్షి ఆయన. ఆయన నోట పలుకబడిన గాథలు జీవరాశి ఉత్థానానికి సోపానాలు. కలియుగంలో నామస్మరణమే ముక్తికి మార్గం అన్నది ఆర్యోక్తి. అందుకే నారదుని పేరు ప్రస్తావించి ఆ మార్గం యొక్క ప్రాముఖ్యతను చాటారు అన్నమాచార్యుల వారు. 

భాగవతం యొక్క లక్ష్యం భగవంతుని నమ్ముకొని ఉన్నత గతులను పొందిన వారి విశేషాలను తెలుపటంతో పాటు లీలావేష్టితమైన విష్ణుమాయను, దానికి సృష్టిస్థితిలయములలో గల స్థానాన్ని మనకు తేటతెల్లం చేయటం కూడా. ఎప్పుడైతే మనకు సృష్టి రహస్యం అవగతమవుతుందో అప్పుడు మనకు భవబంధనాలు దూరమవుతాయి. మనమెవరమో ఎందుకు జన్మించామో ఎలా జీవించాలో అర్థమవుతాయి. జీవన్ముక్తి లభిస్తుంది. భక్తి, శరణాగతితో కష్టాల కడలి ఎలా దాటగలమో తెలిపేవి భాగవత గాథలు. వేదవ్యాసుల వారు ఈ లక్ష్యాన్ని శ్రీమద్భాగవతం ద్వారా ఉత్తమోత్తమంగా సాధించారు. పావనమైన భాగవత గాథల ద్వారా విష్ణు కథలను తెలిపిన ఆయన పేరును ప్రస్తావించి అన్నమాచార్యుల వారు మనకు మార్గదర్శకులైనారు. మరి ఆ విష్ణు కథ ఎక్కడ నిలిచింది? కలియుగంలో సంకీర్తనలలో. అన్నమాచార్యుల వారి కీర్తనలో హరివైభవమెంత అందంగా ఉంటుందో మనకందరికీ తెలిసిందే. అందుకే అవి మంత్రసమానమై నిలిచాయి. మనం ఎక్కడ వెదకితే అక్కడే విష్ణు కథలు మనకు కనబడతాయి. అంటే, ఆధ్యాత్మికోన్నతికి కావలసింది మనలో సంకల్పం.  

గోకులంలో గోపికలు చల్లను చిలుకుతూ ఉన్నప్పుడు విష్ణుకథలు వెల్లివిరిసాయి అని అన్నారు అన్నమయ్య. నిరంతరం ఆ కృష్ణుని తలచుతూ తన్మయత్వంలో ఉండే గోపికల నోట ఆయన గాథలు తప్ప వేరే ఎముంటాయి? కాకపోతే ఇక్కడ చల్లను చిలుకటం ఎందుకు ప్రస్తావించారు? మజ్జిగను చిలికి చిలికి వెన్నను తీసినట్లు మనం సాధన ద్వారా శాశ్వతమైన దానిని పొందవచ్చు అని మనకు సారూప్యతనిచ్చి విష్ణు భక్తి గొప్పతనాన్ని సుళువుగా తెలియజేశారు. అలాగే, కలియుగంలో మన పాలిట కల్పవృక్షమైన శ్రీవేంకటేశ్వరుని నామంలో విష్ణ కథలు ప్రకాశిస్తున్నాయని ముగించారు. గోవింద, వేంకట మొదలైన నామముల అర్థం చూస్తే అన్నమాచార్యుల వారి ఉద్దేశం మనకు అవగతమవుతుంది. కలిదోషములను హరించేది ఆ శ్రీనివాసుని స్మరణ. ఆయన నామంలోనే సమస్తము. అదే మనకు అభయము, వరదము, మోక్షప్రదాయకము. 

మనకు మార్గాలను ప్రభావవంతంగా తెలిపేవారు సద్గురువులు. తన సంకీర్తనల ద్వారా దారి చూపిన అన్నమయ్య మనకు సద్గురువులయ్యారు. ఒక్కో సంకీర్తన భవసాగరాన్ని దాటే అద్భుత సాధనం. అటువంటి రచనలు చేయటానికే ఆయన అవతరించారు.  అన్నమాచార్యుల వారిలోని శ్రీహరి అంశకు శిరసు వంచి పాదాభివందనాలు. 

ఈ సంకీర్తనను గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు ఎంతో శ్రావ్యంగా, భక్తి భావంతో ఆలపించారు. విని తరించండి. 

27, జనవరి 2017, శుక్రవారం

విశాల హృదయం - భారతదేశానికి ఎంతో అవసరం


విశాల భారతదేశం మనది హిమాలయాలకు నిలయమిది
ఇలాంటి దేశంలో ప్రజలంతా విశాల హృదయంతో మెలగాలి 

అని ఓ కవి రాసిన పాటను చిన్నప్పుడు విని నేర్చుకున్నాను. కానీ, ఆ విశాల హృదయం తప్ప మిగతావన్నీ మనకు అబ్బేశాయి. ఇంకా ఇంకా భారతీయుని మనసు సంకుచితమై పోతోంది. భిన్నత్వం విశాల హృదయం ఇవ్వకపోగా మనుషులను ముక్కలు ముక్కలు చేస్తుంటే బాధగా ఉంది. మా పంటలకు నీళ్లు ఉండవు, మేము తాగటానికి పక్కవాళ్లకు నీళ్లివ్వమని ఓ ఇద్దరు, మీ మతమేమో దరిద్రం, మాదేమో ఘనం అని మరో ఇద్దరు..ఓ నాలుగు మాటలు మాట్లాడగానే మీదే కులం అని అడిగే మరో ఇద్దరు...చదవేస్తే ఉన్న మతిపోయినట్లుంది భారతీయుని చందం. ప్రతి దానికీ వితండవాదం. స్వేచ్ఛ పేరుతో విశ్శృంఖలపు ఆలోచనలు, వేర్పాటు వాదానికి బీజాలు. కారణాలు?

1. ప్రగతి ఫలాలు అందరికీ అందకపోవటం, ఉన్నతమైన జీవనశైలి అందరికీ అందుబాటులో లేకపోవటం. అవకాశాలు అవినీతి, బంధుప్రీతి, ప్రతిభను కాలరాస్తున్నాయి.
2. పెరిగిన జనాభాతో ఉద్యోగాల కోసం చదువులు అన్నట్లుంది. ఇటువంటి చదువులు మనుషులకు సంస్కారం ఇవ్వకపోగా నిర్వీర్యమైన ఆలోచనాధోరణిని పెంపొందిస్తున్నాయి.
3. ఉన్నత విద్యలో వ్యక్తిత్వానికి స్థానం పోయింది. దీనితో మనుషుల్లో ఓర్పు, సహనం, శ్రమపడే తత్త్వం దారుణంగా తగ్గిపోయాయి.
4. పోటీ పరుగులలో, స్వార్థం పెరిగిపోయి త్యాగం, సేవా భావాలు బాగా తగ్గిపోయాయి.
5. స్వతహాగా నీతి, మానవ సేవ, భక్తి మొదలైన మంచి లక్షణాలను బోధించే భారతీయ సనాతన ధర్మ శాస్త్రాలకు నేటి ఆంగ్ల విద్యలో స్థానం చాలా చాలా తగ్గిపోయింది.

వీటితో ప్రజలలో అశాంతి, యువతలో బలహీనమైన వ్యక్తిత్వాలు, ఇతరులపై దౌర్జన్యాలు...వెరసి సంకుచిత హృదయాలు. బాధాకరమైన విషయమేమిటంటే ఇది వరకు భారత దేశంలో విద్యావంతులు, ధనవంతులలో చాలామందికి విశాలహృదయముండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విద్యావంతులు, మేధావులలో ఈ సంకుచితత్వం మరింత పెరిగింది.

సనాతన ధర్మం భారతీయతకు మూలం. మరి మన మూలాలను వదిలేస్తే మన ముంగిట నిలిచేవి ఇటువంటి దుష్పరిణామాలే. ఆంగ్ల విద్య అవసరం, నిజమే. కానీ, వ్యక్తిత్వం వికాసం విద్య కన్నా ముఖ్యమైనది. చదువుతో అది అబ్బకపోతే తరువాతి తరాలు అతి త్వరగా మానసిక జబ్బులు, ఆత్మహత్యలు,గృహహింస, విడాకులవంటి విపరీతాలకు పోయే అవకాశం ఉంది. పోలీసులు, లాయర్లు, డాక్టర్లు కొంత మేరకే సమస్యలను పరిష్కరించగలరు. సింహభాగం పరిష్కారాలు మన వ్యక్తిత్వాలనుండే రావాలి. సనాతన ధర్మ బోధన అంటే రామాయణ భారత భాగవతాలు గుడ్డిగా బోధించటం కాదు. వాటిని పరిశోధించి, వివరించి, సారాన్ని అందించి సమస్యలకు పరిష్కారాలకు ఉదాహరణలు తెలపాలి. పురాణాలలో గాథలు చాలా మటుకు నేటి తరానికి అంతగా రుచించవు. కాబట్టి వీలైనంత మన మూలాలైన వేదవాఙ్మయాల అధ్యయనంతో పాఠ్యాంశాలు ముడి పడి ఉండాలి. వివేకానంద, రామకృష్ణ పరమహంస, చిన్మయానంద వంటి మహానుభావులు మనకు ఇటువంటి అధ్యయనాలు చేసి వాటి సారాన్ని చాలా వివరంగా అందించారు. విద్యావ్యవస్థలో వీటికి చోటు లభిస్తే బాగుంటుంది.

ప్రపంచ సంస్కృతులకు పుట్టినిల్లు మన సనాతన ధర్మం అని ఎందరో విదేశీయులు చెప్పారు. కానీ, మనమేమో, దానికి విరుద్ధంగా మరింత అజ్ఞానం వైపు పరుగెడుతున్నాం. ఏది కనబడితే దాని వెంటబడి, వెలకట్టలేని మన ధర్మపు విలువలను, శక్తిని నిర్లక్ష్యం చేస్తున్నాం. భారత భాగ్యవిధాతలైన బాలబాలికలకు, యువతీయువకులకు మన ధర్మ సారాన్ని, మహత్తును, శక్తిని ఆస్వాదించి అనుగమించే వసతలు ఇస్తేనే ఈ జాతికి మనుగడ, ఈ గడ్డపై పుట్టిన మానవునికి నేతృత్వ లక్షణాలు కలుగుతాయి.  తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు, ప్రభుత్వాలు ఈ దిశగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది.

నిజంగానే విశాల భారతదేశంలో విశాల హృదయం కలిగి ఉండటానికి ఎన్నో అవకాశాలు. భాష, రంగు, రూపు, ఆహారపు అలవాట్లు, ఆచారా వ్యవహారాలు, నమ్మకాలు, విశ్వాసాలు...ఇవన్నీ ఎంతో వైవిధ్యభరితమైనవి. అలాగే ధర్మపథాలు ఎన్నో. పక్కవారి అభిప్రాయాలను గౌరవించి, ఆదరించి, సహనంతో, సౌభ్రాతృత్వంతో ఉండే చదువులను, సంస్కారాలను మన పిల్లలకు అందేలా కృషి చేద్దాం.

జై హింద్

అక్కిరాజు ప్రసాద్ 27/01/2017

26, జనవరి 2017, గురువారం

జాతీయతా భావం


మనం ఎంత భావ దారిద్య్రంలో ఉన్నామంటే దేశం కోసం అన్న మాటలు మాట్లాడితే వాళ్లు అతివాదులుగా చిత్రీకరించబడుతున్నారు. జాతీయతా భావం లేకపోతే ఇక ప్రజల ఐక్యతకు ప్రాతిపదిక ఏమిటి? మువ్వన్నెల చీర చుట్టిన ఆ భిన్నత్వపు భరతమాత ఏదో మాటలకు కాదు. దానిలో  అంతర్లీనమైన శక్తి ఉంది, మనది, మనము అన్న అద్భుతమైన భావనను ఒక్క జాతీయతే ఇస్తుంది. కులం, మతం, భాష, రంగు, రూపం, ఆర్థిక స్థోమత ఇవేవీ ఐక్యతను ఇవ్వలేవు.

ఇటీవల నన్ను ఓ ప్రబుద్ధుడు ప్రశ్నించాడు - "అమెజాన్‌లో కాళ్లు దులుపుకునే పట్టా మీద భారత పతాకం ఉంటే దానికి వివాదమెందుకు? దేశంలో అంతకన్నా భయంకరమైన సమస్యలు ఉన్నాయి పరిష్కరించటానికి, ఈ కుహనా జాతీయవాదం ఎందుకు అని". సమస్యలు ఉన్నది నిజమే. కానీ ఒరేయ్ శుంఠా! పతాకం నువ్వననుకున్నట్లు నిర్జీవమైనది కాదు. ఓ అద్భుతమైన సంస్కృతికి, ఘన చరిత్ర గల కర్మభూమికి ప్రతీక. ఓ చిన్న సమస్య వస్తే దద్దరిల్లిపోయే పాశ్చాత్య సంస్కృతికి - ఏ సమస్య వచ్చినా అధిగమించే భారతీయ సంస్కృతికి గల తేడాను ప్రతిబింబించే ఓ జాగృత శక్తి. సమస్యల పరిష్కారం కోసమే జాతీయతావాదం. ఎక్కడో ఈశాన్య రాష్ట్రంలోనో కాశ్మీరు మంచు ప్రాంతాలలోనో ఉన్న కష్ట జీవుల సమస్యలు తెలియాలంటే ఇది మన దేశం అన్న భావన ఒక్కటే మార్గం. భారత దేశం నా మాతృ భూమి, భారతీయులంద్రూ నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను..అని ప్రతి దినం పాఠశాల ప్రతిజ్ఞలో పఠించటం భారతీయతను చాటటానికే. జాతీయత ఉన్నపళాన రాదు. నేర్పించాలి, చిగురింపజేయాలి, నీళ్లుపోసి మొక్కను పెంచినట్లు జాగ్రత్తగా పోషించాలి. దానికి పతాక గౌరవం, గీతాలాపన, ప్రతిజ్ఞ ద్వారా దృఢ సంకల్పం, త్యాగ నిరతి అనేవి నాలుగు మూలస్థంభాలు. అందుకేరా ప్రబుద్ధుడా ఆ జాతీయ పతాకం అంటే మాకు అంత గౌరవం. దానికోసం ఎటువంటి త్యాగానికైనా మేము సిద్ధమే.

దేశాలు, పతాకాలు, గీతాలు ఏర్పడింది ఉన్మాదానికి కాదు, అతివాదానికి అంతకన్నా కాదు. మన మన స్వార్థాలను దాటి ఒకే తాటిపైకి తీసుకు రావటానికి ఏర్పరచబడిన అద్భుత సాధనాలు. ఈ దేశ పౌరునిగా, ఈ దేశ అతిథిగా వాటిని గౌరవించటం కనీస ధర్మం, బాధ్యత. పిచ్చి పిచి ప్రేలాపనలతో జాతీయతను ప్రశ్నిస్తేనే మీరనుకునే అతివాదం సరైన సమాధానం చెబుతుంది. అసలు భరతజాతిని మించిన భిన్నత్వంలో ఏకత్వం ఎక్కడ ఉంది? ఎన్ని భాషలు, ఎన్ని సంస్కృతులు, ఎన్ని సాంప్రదాయాలు, ఎన్ని మాండలికాలు, ఎన్ని వేషభూషలు, ఎన్ని ఆహారవ్యవహారాలు? ఇన్నిటిని ఐక్యం చేయగలిగిందంటే ఆ శక్తి మానవాతీతమైనదేగా? మరి అంతటి శక్తిని కలిగిన త్రివర్ణ పతాకాన్ని, జాతీయగీతాన్ని అగౌరవపరస్తే మౌనంగా ఉండే వాళ్లు, ఆ అదో పెద్ద సమస్య కాదు అనుకునే వాళ్లలో జాతీయతా భావం లేనట్లే.

సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం అన్న బంకిం చంద్ర గారి గీతం విని దాని అర్థం తెలుసుకుంటే భారతీయత అంటే, భరతమాత అంటే ఏమిటో తెలుస్తుంది. జనగణ మంగళ దాయక జయహే భారత భాగ్య విధాత అన్న రవీంద్రుని మాటల ఆంతర్యాన్ని తరచి చూస్తే జాతీయత మహత్తు తెలిసి రోమాంచమవుతుంది. ప్రజల హితానికే జాతీయత, ప్రజల ఐక్యతకే జాతీయత, ప్రజల ఆనందానికే జాతీయత. పైడిమర్రి వేంకట సుబ్బారావు గారు రచించిన మన ప్రతిజ్ఞను చదివి అర్థం చేసుకుంటే జాతీయత ఎందుకో తెలుస్తుంది.

"భారత దేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వ కారణం. దీనికి అర్హత పొందుటకు సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతివారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవా నిరతి కలిగి ఉంటాను. వారి శ్రేయిభివృద్ధులే నా ఆనందానికి మూలం అని ప్రతిజ్ఞ చేస్తున్నాను."

భారతీయులందరూ నా సహోదరులు అన్న భావన ఉంటే చాలదూ? ఐక్యత దానంతట అదే వస్తుంది. జాతీయతా భావం గర్వ కారణమైతే అది ఎంత స్ఫూర్తిదాయకమో తెలుసా? ఆ జాతీయతా భావమే పటేల్‌ను మహనీయుని చేసింది. వందలకొలది రాజ్యాలను ఏకం చేసి భరతజాతికి ఓ రూపునిచ్చింది. మన వారసత్వం ఎలాంటిది? సుసంపన్నమైనది, బహువిధమైనది. అంటే ఎంతో విలువైనది, బహుళత్వం కలిగింది. ఈ భావాన్ని మదిలో నింపుకుంటే మన హృదయం ఎంత విశాలమవుతుందో గమనించారా? ఆ భావనను పొందటానికి మనం కృషి చేయాలి అన్న సంకల్పం వస్తే చాలు. అందుకే ప్రతిజ్ఞ. పెద్దలను గౌరవించటం, అందరితో మర్యాదపూర్వకంగా మసలుకోవటం మనకు వచ్చిన ఆ మహోన్నతమైన వారసత్వపు ప్రధాన లక్షణం. దేశమంటే ప్రజలే. ఆ ప్రజల పట్ల సేవా భావం కలిగి ఉండాలి అన్నది మనకు అనాదిగా చెప్పబడింది. అది భారతీయతకు మూలం. ఆ ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి నాకు ఆనందకారకం అన్న భావన  మన హృదయాలలో నిలుపుకుంటే ఇంక స్వార్థానికి తావేది? చూశారా? ఎంత గొప్ప ప్రతిజ్ఞో? ఈ సంకల్పం సాకారం చేస్తే ఇంక ఈ దేశంలో భావ దారిద్య్రానికి, స్వార్థానికి, కల్లోలానికి, విభజనవాదానికి తావేది?

ప్రజలను ఐక్యం చేయటానికే ఈ జాతీయ పండుగలు, పతాకావిష్కరణలు, గీతాలాపనలు. వాటికి కన్న తల్లిదండ్రులకన్నా గౌరవం ఉండి తీరాలి. అప్పుడే ఈ జాతి మనుగడ, శ్రేయోభివృద్ధి.

- అక్కిరాజు ప్రసాద్ 26/01/2017

22, జనవరి 2017, ఆదివారం

కలనైనా నీ వలపే - సముద్రాల జూనియర్‌ సాహితీ కవనం


తుషార శీతల సరోవరాన 
అనంత నీరవ నిశీధిలోన 
ఈ కలువ నిరీక్షణ...
నీ కొరకే రాజా..వెన్నెల రాజా!

కలనైనా నీ వలపే 
కలవరమందైన నీ తలపే
కలనైనా నీ వలపే

కలువ మిటారపు కమ్మని కలలు కళలు కాంతులు నీ కొరకేలే
చెలి ఆరాధన శోధన నీవే జిలిబిలి రాజా జాలి తలచరా

కనుల మనోరథ మాధురి దాచి  కానుక చేసే వేళకు కాచి
వాడే రేకుల వీడని మమతల వేడుచు నీకై వేచి  నిలచెరా

తెలుగు సినీ స్వర్ణయుగపు పాటల్లో శాంతినివాసం చిత్రంలోని కలనైనా నీ వలపే అన్న పాటకు ఓ ప్రత్యేక స్థానముంది. పాటకు భావం ప్రాణమైతే పదాలు ఆ భావానికి పట్టుగొమ్మలు. తెలుగు భాషలో ఉన్న మాధుర్యం ఎంత ఆస్వాదించినా తనివితీరదు. తుషారము, నీరవము, వెన్నెల రాజు, జిలిబిలి, మిటారపు, మనోరథము...ఎంత మంచి పదాలో! సముద్రాల రామానుజాచార్యుల వారి భావ వీచికలలో ఎంతటి సొగసో!ప్రముఖ రచయిత సముద్రాల రాఘవాచార్యుల వారి తనయుడు ఈ రామానుజాచార్యులు. తండ్రి నుండి తెలుగుదనం పుణికి పుచ్చుకున్న ఈయన ఎన్నో మంచి రచనలు చేశారు. గుంటూరు జిల్లా పెదపులివర్రులో 1923లో జన్మించిన ఈయన చిన్ననాటినుంచే పద్యాలు, కవితలు రచించారు. భాషతో పాటు చదువులో కూడా బాగా రాణించారు. రేడియో సర్వీసు మరియు మెయింటెనెన్స్‌లో డిప్లొమా చేశారు. ఆయనకు బాగా పేరు తెచ్చిన చిత్రం 1960లో వచ్చిన శాంతినివాసం. ఈ చిత్రంలో శ్రీరఘురాం జయరఘురాం పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. అటువంటి భక్తి గీతం రాసిన ఆయన దానికి భిన్నంగా కలనైనా నీ వలపే అన్న మనోజ్ఞమైన భావగీతి అందించారు. వినోదా వారి శాంతితో మొదలైన సముద్రాల రామానుజుల సినీ ప్రస్థానంలో బ్రతుకుతెరువు, తోడుదొంగలు, జయసింహ, పాండురంగమహత్మ్యం, ఆత్మబంధువు, ఉమ్మడికుటుంబం, తల్లా పెళ్లామా, రామాంజనేయయుద్ధం మొదలైన 70 సినిమాలు ఉన్నాయి. ఈ తండ్రీ కొడుకులను సముద్రాల సీనియర్-జూనియర్‌గా పిలిచేవారు.

రామానుజాచార్యుల వారి ఈ రచనలో ప్రేయసి భావనను ఎంతో లాలిత్యంతో తెలిపారు. కలువ చంద్రుని కొరకై ఎలా వేచి ఉంటుందో అలా ఈ ప్రేయసి తన ప్రియుని కోసం వేచియుంది అన్న భావనను తొలి పంక్తి తుషార శీతల సరోవరాన అనంత నీరవ నిశీథిలోన ఈ కలువ నిరీక్షణ...నీ కొరకే రాజా వెన్నెల రాజా అని అద్భుతమైన ఉపమానంగా ఆవిష్కరించారు.

వికసించే కలువ యొక్క కలలు, కళలు, కాంతులు అన్నీ ఆ చంద్రుని కొరకే అయినట్లు ఆ ప్రేయసి ఆరాధన, వెదకటం అన్నీ ఆ ప్రియునికేనని తెలిపారు. కళ్లలో తన కోరికల మాధుర్యాన్ని దాచి, ప్రియుడు వేంచేసే వేళకై ఎదురు చూస్తూ, వాడే రేకులలో వీడని మమతలతో వేడుకుంటూ చెలి నిలుచుని ఉన్నదని విశేషమైన పదజాలంతో పలికారు.

ఘంటసాల మాష్టారి సంగీతంలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. అందులో ఈ శాంతినివాసం ఒకటి. ఆ మహానుభావునికి గాయకునిగా ఎంతపేరు వచ్చిందో అంతే పేరు సంగీత దర్శకునిగా కూడా వచ్చింది. ఆయన సంగీత సారథ్యం వహించిన ఈ కలనైనా నీ వలపే అన్న గీతాన్ని తెలుగు అక్షరం ముక్క రాని లీలమ్మ గారు అద్భుతంగా పాడారు. ఆమె పాట వింటుంటే ఎక్కడా కూడా తెలుగు రాదని మనకు అవగతం కాదు. హిందోళ రాగంలో తెలుగు చలనచిత్ర గీతాలు ఎన్నో వచ్చాయి. వాటిలో ఒకటి కలనైనా నీ వలపే. ఈ గీతాన్ని లీలగారు తప్ప ఎవరూ అంత మధురంగా పాడలేరు. చిత్రంలో నాయిక ఎవరు అంటే చెప్పటం కష్టం. ఏఎన్నార్ అన్న పాత్ర వేసిన కాంతారావు భార్యగా దేవిక, ఏఎన్నార్ సఖిగా రాజసులోచన, దారితప్పిన కాంతారావును దారిలోకి తెచ్చే శ్రేయోభిలాషి మరియు స్నేహితురాలిగా కృష్ణకుమారి...ముగ్గురికీ సమానమైన పాత్రలే ఉన్నాయి. ఈ గీతం కృష్ణకుమారిపై చిత్రీకరించబడింది. కృష్ణకుమారి-కాంతారావుల మధ్య ఉండే స్నేహం (అతను ప్రేమగా అపార్థం చేసుకుంటాడు) ఈ గీతానికి సరైన నేపథ్యం కాకపోయినా, సమస్యలతో సతమవుతున్న అతనికి సాంత్వననిచ్చే పాత్రకు ఈ పాట సముచితమేనేమో? ఆ కాలంలో ప్రజలు ఈ పాత్రకు ఎలా స్పందించారో తెలియదు.

సముద్రాల జూనియర్ సాహిత్యానికి ఘంటసలా మాష్టారు సంగీతంలో పి.లీల గారు పాడిన కలనైనా నీ వలపే పాట చూసి ఆస్వాదించండి.

శబరిమలను స్వర్ణ చంద్రోదయం - యేసుదాసు అయ్యప్ప గానామృతం


హరిహర సుతుడైన అయ్యప్పను తలచగానే డాక్టర్ యేసుదాసు గారు గానం చేసిన హరివరాసనం పాట గుర్తుకొస్తుంది. స్వామి అయ్యప్ప అనే చలన చిత్రం 1975లో తమిళ మలయాళ భాషలలో విడుదలై ఘనం విజయం సాధించింది. ఆ చిత్రంలో కూడా యేసుదాసు గారు ఈ పాటను గానం చేశారు. అదే చిత్రంలో శబరిమలను స్వర్ణ చంద్రోదయం అనే మరో పాట ఆయన పాడారు. గీతాన్ని తెలుగులోకి ఎవరు అనువదించారో తెలియదు. సంగీతం దేవరాజన్ గారు.

అయ్యప్ప హరిహర సుతుడు. కోట్లాది భక్తులకు ఆరాధ్య దైవం. ప్రరి ఏడాది మకర సంక్రమణానికి ముందు గురుస్వామి నేతృత్వంలో 40రోజుల దీక్షగా స్వాములు మాల ధరించి శ్రద్ధా భక్తులతో పూజించి ఇరుముడితో కేరళలోని పత్తనమిట్ట ప్రాంతంలో ఉన్న శబరిమల చేరుకొని అక్కడి స్వామిని దర్శించుకుంటారు. ఆ హరిహరసుతుని పేరు ధర్మశాస్త. శివునికి మోహినీ అవతారుడైన శ్రీమహావిష్ణువుకు జన్మించిన వాడు ధర్మశాస్త. ఈ హరిహరసుతునిపై ఉన్న గాథలలో పండలం రాజావారి సుతునిగా ప్రాచుర్యం పొందినది ఒకటి. ఆ రాజావారి తొలుత ఈ బాలుని చూసినప్పుడు అతని మెడలో మణిహారం ఉందట. అందుకని అతనికి మణికంఠుడని నామకరణం చేశారు. ఈ విధంగా ధర్మశాస్త, మణికంఠ, అయ్యప్పగా ఆ హరిహరసుతుడు ఆ ప్రాంతప్రజలకు, దక్షిణ భారతదేశంలో ఎందరికో ఆరాధ్య దైవం.

శబరిమలలో ఉన్న ఈ ప్రధాన దేవాలయం పెరియార్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలోని కొండలలో పూంగవనం అడవుల మధ్య 3వేల అడుగుల ఎత్తులో ఉంది. ఈ దేవాలయం సంవత్సరంలో కొన్ని మార్లు మాత్రమే తెరిచి ఉంటుంది - మండలమహోత్సవం (దాదాపు నవంబర్ మధ్యనుండి డిసెంబర్ 26 వరకు), మకరవిళక్కు (మకర సంక్రాంతి సందర్భంగా), విషు పర్వదిన సందర్భంగా, సూర్యుని ప్రతినెలా సంక్రమణం రోజు.

అయ్యప్పస్వామిపై ఎన్నో చిత్రాలు, టీవీ ధారావాహికలు వచ్చాయి. వాటిలో 1975లో విడుదలైన స్వామి అయ్యప్పన్ చిత్రం ప్రధానమైనది. జెమినీ గణేశన్, సుకుమారన్ నాయర్, శ్రీవిద్య నటించారు. మాష్టర్ రఘు మణికంఠునిగా నటించారు. ఆ మాష్టర్ బాలనటుడిగా మలయాళం చిత్ర పరిశ్రమలో ఎంతో పేరుపొందాడు. పెద్దై రఘు నేడు కరణ్ అనే పేరుతో తమిళ చిత్రాల హీరోగా నటిస్తున్నాడు. ఈ స్వామి అయ్యప్పన్ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసి విడుదల చేశారు. అన్ని భాషలలోనూ పాటలు, చిత్రం ఘన విజయం సాధించాయి. తెలుగు అనువాదంలోని పాటలలో సింహభాగం యేసుదాసు గారు పాడారు.

ఈ శబరిమలను స్వర్ణ చంద్రోదయం అనే గీతంలో స్వామికి జరిగే అభిషేకాన్ని అందులోని వివరాలను మనకు తెలియజేశారు. ధర్మశాస్త అనగా ధర్మరక్షకుడు. ఆ స్వామికి నిత్యం జరిగే అభిషేకంలో పంచామృతాలు (ఆవుపాలు, పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదారలు), పన్నీరు, విభూతి,పంపానది పుణ్యజలాలు, పుష్పాభిషేకం, చందనాభిషేకం..ఇలా వైభవంగా అర్చన జరుగుతుంది. స్వామియే శరణమయ్యప్పా అని నామస్మరణ మారుమ్రోగుతూ ఉంటుంది ఈ దివ్యక్షేత్రం. ఈ పాట వింటే స్వామిని దర్శించి ఈ సేవలను కళ్లారా చూడాలన్న సంకల్పం కలుగుతుంది.  యేసుదాసు గారు పాడిన పాటను విని తరించండి.

శబరిమలను స్వర్ణ చంద్రోదయం ధర్మరక్షకుని సన్నిధిని అభిషేకం
లోకాల గారవించు అయ్యప్ప స్తోత్రం భక్తితో పాడుకుంటాం హృదయముల

ప్రీతియే ఉల్లమున పాలగును
అదే చల్లని నీ యెదన పెరుగవును
వెన్నయే నీవిచ్చు అనురాగం
నీకు నెయ్యభిషేకమునే జరిపిస్తాం
నీ జాడలలో నడిచే జీవులమయ్యప్పా
ఈ సర్వస్వం నీ ఆశీర్వాదం అయ్యప్పా
అయ్యప్పా శరణమయ్యప్పా అయ్యప్పా శరణమయ్యప్పా

పుణ్యమిచ్చే పన్నీరభిషేకం
జనులు భక్తితో చేసెడి పాలభిషేకం
దివ్య పంచామృతాన అభిషేకం
నీదు తనువంత జ్యోతివలె వెలిగేను
నీ జాడలలో నడిచే జీవులమయ్యప్పా
ఈ సర్వస్వం నీ ఆశీర్వాదం అయ్యప్పా
అయ్యప్పా శరణమయ్యప్పా అయ్యప్పా శరణమయ్యప్పా

దోసిట పుణ్యజలం అందుకొని
అదే నీ పేరు స్తుతియించి శిరసునుంచి
కరుగు విభూతితో అభిషేకం
హరి ఓం అని చందనంతో అభిషేకం
నీ జాడలలో నడిచే జీవులమయ్యప్పా
ఈ సర్వస్వం నీ ఆశీర్వాదమయ్యప్పా
అయ్యప్పా శరణమయ్యప్పా అయ్యప్పా శరణమయ్యప్పా