27, జనవరి 2017, శుక్రవారం

విశాల హృదయం - భారతదేశానికి ఎంతో అవసరం


విశాల భారతదేశం మనది హిమాలయాలకు నిలయమిది
ఇలాంటి దేశంలో ప్రజలంతా విశాల హృదయంతో మెలగాలి 

అని ఓ కవి రాసిన పాటను చిన్నప్పుడు విని నేర్చుకున్నాను. కానీ, ఆ విశాల హృదయం తప్ప మిగతావన్నీ మనకు అబ్బేశాయి. ఇంకా ఇంకా భారతీయుని మనసు సంకుచితమై పోతోంది. భిన్నత్వం విశాల హృదయం ఇవ్వకపోగా మనుషులను ముక్కలు ముక్కలు చేస్తుంటే బాధగా ఉంది. మా పంటలకు నీళ్లు ఉండవు, మేము తాగటానికి పక్కవాళ్లకు నీళ్లివ్వమని ఓ ఇద్దరు, మీ మతమేమో దరిద్రం, మాదేమో ఘనం అని మరో ఇద్దరు..ఓ నాలుగు మాటలు మాట్లాడగానే మీదే కులం అని అడిగే మరో ఇద్దరు...చదవేస్తే ఉన్న మతిపోయినట్లుంది భారతీయుని చందం. ప్రతి దానికీ వితండవాదం. స్వేచ్ఛ పేరుతో విశ్శృంఖలపు ఆలోచనలు, వేర్పాటు వాదానికి బీజాలు. కారణాలు?

1. ప్రగతి ఫలాలు అందరికీ అందకపోవటం, ఉన్నతమైన జీవనశైలి అందరికీ అందుబాటులో లేకపోవటం. అవకాశాలు అవినీతి, బంధుప్రీతి, ప్రతిభను కాలరాస్తున్నాయి.
2. పెరిగిన జనాభాతో ఉద్యోగాల కోసం చదువులు అన్నట్లుంది. ఇటువంటి చదువులు మనుషులకు సంస్కారం ఇవ్వకపోగా నిర్వీర్యమైన ఆలోచనాధోరణిని పెంపొందిస్తున్నాయి.
3. ఉన్నత విద్యలో వ్యక్తిత్వానికి స్థానం పోయింది. దీనితో మనుషుల్లో ఓర్పు, సహనం, శ్రమపడే తత్త్వం దారుణంగా తగ్గిపోయాయి.
4. పోటీ పరుగులలో, స్వార్థం పెరిగిపోయి త్యాగం, సేవా భావాలు బాగా తగ్గిపోయాయి.
5. స్వతహాగా నీతి, మానవ సేవ, భక్తి మొదలైన మంచి లక్షణాలను బోధించే భారతీయ సనాతన ధర్మ శాస్త్రాలకు నేటి ఆంగ్ల విద్యలో స్థానం చాలా చాలా తగ్గిపోయింది.

వీటితో ప్రజలలో అశాంతి, యువతలో బలహీనమైన వ్యక్తిత్వాలు, ఇతరులపై దౌర్జన్యాలు...వెరసి సంకుచిత హృదయాలు. బాధాకరమైన విషయమేమిటంటే ఇది వరకు భారత దేశంలో విద్యావంతులు, ధనవంతులలో చాలామందికి విశాలహృదయముండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విద్యావంతులు, మేధావులలో ఈ సంకుచితత్వం మరింత పెరిగింది.

సనాతన ధర్మం భారతీయతకు మూలం. మరి మన మూలాలను వదిలేస్తే మన ముంగిట నిలిచేవి ఇటువంటి దుష్పరిణామాలే. ఆంగ్ల విద్య అవసరం, నిజమే. కానీ, వ్యక్తిత్వం వికాసం విద్య కన్నా ముఖ్యమైనది. చదువుతో అది అబ్బకపోతే తరువాతి తరాలు అతి త్వరగా మానసిక జబ్బులు, ఆత్మహత్యలు,గృహహింస, విడాకులవంటి విపరీతాలకు పోయే అవకాశం ఉంది. పోలీసులు, లాయర్లు, డాక్టర్లు కొంత మేరకే సమస్యలను పరిష్కరించగలరు. సింహభాగం పరిష్కారాలు మన వ్యక్తిత్వాలనుండే రావాలి. సనాతన ధర్మ బోధన అంటే రామాయణ భారత భాగవతాలు గుడ్డిగా బోధించటం కాదు. వాటిని పరిశోధించి, వివరించి, సారాన్ని అందించి సమస్యలకు పరిష్కారాలకు ఉదాహరణలు తెలపాలి. పురాణాలలో గాథలు చాలా మటుకు నేటి తరానికి అంతగా రుచించవు. కాబట్టి వీలైనంత మన మూలాలైన వేదవాఙ్మయాల అధ్యయనంతో పాఠ్యాంశాలు ముడి పడి ఉండాలి. వివేకానంద, రామకృష్ణ పరమహంస, చిన్మయానంద వంటి మహానుభావులు మనకు ఇటువంటి అధ్యయనాలు చేసి వాటి సారాన్ని చాలా వివరంగా అందించారు. విద్యావ్యవస్థలో వీటికి చోటు లభిస్తే బాగుంటుంది.

ప్రపంచ సంస్కృతులకు పుట్టినిల్లు మన సనాతన ధర్మం అని ఎందరో విదేశీయులు చెప్పారు. కానీ, మనమేమో, దానికి విరుద్ధంగా మరింత అజ్ఞానం వైపు పరుగెడుతున్నాం. ఏది కనబడితే దాని వెంటబడి, వెలకట్టలేని మన ధర్మపు విలువలను, శక్తిని నిర్లక్ష్యం చేస్తున్నాం. భారత భాగ్యవిధాతలైన బాలబాలికలకు, యువతీయువకులకు మన ధర్మ సారాన్ని, మహత్తును, శక్తిని ఆస్వాదించి అనుగమించే వసతలు ఇస్తేనే ఈ జాతికి మనుగడ, ఈ గడ్డపై పుట్టిన మానవునికి నేతృత్వ లక్షణాలు కలుగుతాయి.  తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు, ప్రభుత్వాలు ఈ దిశగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది.

నిజంగానే విశాల భారతదేశంలో విశాల హృదయం కలిగి ఉండటానికి ఎన్నో అవకాశాలు. భాష, రంగు, రూపు, ఆహారపు అలవాట్లు, ఆచారా వ్యవహారాలు, నమ్మకాలు, విశ్వాసాలు...ఇవన్నీ ఎంతో వైవిధ్యభరితమైనవి. అలాగే ధర్మపథాలు ఎన్నో. పక్కవారి అభిప్రాయాలను గౌరవించి, ఆదరించి, సహనంతో, సౌభ్రాతృత్వంతో ఉండే చదువులను, సంస్కారాలను మన పిల్లలకు అందేలా కృషి చేద్దాం.

జై హింద్

అక్కిరాజు ప్రసాద్ 27/01/2017

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి