28, జనవరి 2017, శనివారం

వినరో భాగ్యము విష్ణు కథ - అన్నమాచార్యుల వారి హరికథా సుధ


వేదవ్యాసుల వారు పరమాత్మ లీలలను ప్రపంచానికి తెలియజేయటానికి, ఆయన భక్తుల అనుభవాలను, వారి భక్తి యొక్క గొప్పతనాన్ని తెలియజేయటానికి భాగవతామృతాన్ని మనకు అందించారు. ఆ గాథలను వాగ్గేయకారులు కుడా మనకు తమ సంకీర్తనల ద్వారా తెలియజేశారు. మన తెలుగు గడ్డపై పుట్టిన వాగ్గేయకారులలో అగ్రగణ్యులైన తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలలో భగవంతుడు, భక్తులను ప్రస్తవిస్తూ అద్భుతమైన ఆధ్యాత్మిక సందేశాన్ని అందించేవి ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి వినరో భాగ్యము విష్ణు కథ.

వినరో భాగ్యము విష్ణు కథ
వెనుబలమిదివో విష్ణు కథ 

ఆది నుండి సంధ్యాది విధులలో
వేదంబైనది విష్ణుకథ
నాదించేనిదే నారదాదుల చే
వీధి వీధులనే విష్ణుకథ

వదలక వేద వ్యాసులు నుడివిన
విదిత పావనము విష్ణుకథ
సదనంబైనది సంకీర్తనై
వెదకిన చోటనే విష్ణుకథ 

గొల్లెతలు చల్లలు గొన కొని చిలుకగ
వెల్లివిరియాయె విష్ణుకథ
ఇల్లిదే శ్రీవేంకటేశ్వరు నామము
వెల్లి గొలిపెనీ విష్ణుకథ


విష్ణు కథలు వినటమనేది ఓ భాగ్యము. ఈ విష్ణు కథ వెనుబలము. యుగయుగాలుగా సంధ్యావందనం మొదలైన నిత్యవిధులలో వేదముగా చెప్పబడింది విష్ణు కథ. నారదుడు మొదలైన హరి భక్తాగ్రగణ్యుల నోట వీధి వీధుల ఈ విష్ణు కథ నాదమై నిలిచింది. గట్టి సంకల్పంతో వేదవ్యాసుల వారు పలికిన పావన చరితము ఈ విష్ణు కథ. సంకీర్తనలను నిలయంగా చేసుకున్నది ఈ విష్ణు కథ. గోపికలు వెన్న కోసం మజ్జిగను చిలికే సమయంలో ఈ విష్ణు కథ వారి నోట వెల్లి విరిసింది. ఇక్కడ తిరుమలలో వెలసిన శ్రీవేంకటేశ్వరుని నామాన్ని ప్రకాశింపజేసింది   విష్ణు కథ. 

ఈ కీర్తనను పరిశీలిస్తే ఓహో, ఇంతమంది చేత చెప్పబడింది, కాబట్టి తప్పకుండా విష్ణు కథ మహత్తును చాటేది అనిపించినా, ప్రతి చరణంలో అంతరార్థం నిగూఢమై ఉంది. జీవాధరమైన వాడు విష్ణుమూర్తి. అనగా సృష్టి యొక్క స్థితికి కారకుడు. మన శరీరానికి వెన్ను పూస ఎలాంటిదో ఈ విశ్వానికి శ్రీహరి అలాంటి వాడు అని పల్లవిలోనే చెప్పక చెప్పారు అన్నమాచార్యుల వారు. విశ్వంలోని కణకణములోనూ అణువణువైన వాడు విష్ణువు. అలాగే, సంధ్యాది విధులలో వేదంగా చెప్పబడింది విష్ణు కథ అన్నారు. సంధ్యావందనమనేది ఎంత ముఖ్యమైన విధో మనకు సనాతన ధర్మ ప్రవక్తలు చెబుతూనే ఉంటారు. అన్నమాచార్యులు వారు దానిని మరింత ప్రభావవంతంగా చెప్పారు. ఈ విధిలో కేశవ నామాలతో కూడిన ఆచమనము అంశం. దేహములోని వివిధ భాగములలో నివసించే శ్రీహరి అంశలను ప్రస్తావించే ఈ విషయాన్ని అన్నమాచార్యుల వారు మొదటి చరణంలో పలికారు. ఈ విశ్వానికి జాగృతమైన శక్తిని అందించే సంధ్యావందన విధిలో విష్ణు కథ నిబిడీకృతమై ఉందని మనకు తెలిపారు. అలాగే నారదుడు విష్ణు భక్తులలో శ్రేష్ఠుడు. నిరంతర హరినామ స్మరణతో ఆయన మహిమలను ముల్లోకాలకు చాటే మహర్షి ఆయన. ఆయన నోట పలుకబడిన గాథలు జీవరాశి ఉత్థానానికి సోపానాలు. కలియుగంలో నామస్మరణమే ముక్తికి మార్గం అన్నది ఆర్యోక్తి. అందుకే నారదుని పేరు ప్రస్తావించి ఆ మార్గం యొక్క ప్రాముఖ్యతను చాటారు అన్నమాచార్యుల వారు. 

భాగవతం యొక్క లక్ష్యం భగవంతుని నమ్ముకొని ఉన్నత గతులను పొందిన వారి విశేషాలను తెలుపటంతో పాటు లీలావేష్టితమైన విష్ణుమాయను, దానికి సృష్టిస్థితిలయములలో గల స్థానాన్ని మనకు తేటతెల్లం చేయటం కూడా. ఎప్పుడైతే మనకు సృష్టి రహస్యం అవగతమవుతుందో అప్పుడు మనకు భవబంధనాలు దూరమవుతాయి. మనమెవరమో ఎందుకు జన్మించామో ఎలా జీవించాలో అర్థమవుతాయి. జీవన్ముక్తి లభిస్తుంది. భక్తి, శరణాగతితో కష్టాల కడలి ఎలా దాటగలమో తెలిపేవి భాగవత గాథలు. వేదవ్యాసుల వారు ఈ లక్ష్యాన్ని శ్రీమద్భాగవతం ద్వారా ఉత్తమోత్తమంగా సాధించారు. పావనమైన భాగవత గాథల ద్వారా విష్ణు కథలను తెలిపిన ఆయన పేరును ప్రస్తావించి అన్నమాచార్యుల వారు మనకు మార్గదర్శకులైనారు. మరి ఆ విష్ణు కథ ఎక్కడ నిలిచింది? కలియుగంలో సంకీర్తనలలో. అన్నమాచార్యుల వారి కీర్తనలో హరివైభవమెంత అందంగా ఉంటుందో మనకందరికీ తెలిసిందే. అందుకే అవి మంత్రసమానమై నిలిచాయి. మనం ఎక్కడ వెదకితే అక్కడే విష్ణు కథలు మనకు కనబడతాయి. అంటే, ఆధ్యాత్మికోన్నతికి కావలసింది మనలో సంకల్పం.  

గోకులంలో గోపికలు చల్లను చిలుకుతూ ఉన్నప్పుడు విష్ణుకథలు వెల్లివిరిసాయి అని అన్నారు అన్నమయ్య. నిరంతరం ఆ కృష్ణుని తలచుతూ తన్మయత్వంలో ఉండే గోపికల నోట ఆయన గాథలు తప్ప వేరే ఎముంటాయి? కాకపోతే ఇక్కడ చల్లను చిలుకటం ఎందుకు ప్రస్తావించారు? మజ్జిగను చిలికి చిలికి వెన్నను తీసినట్లు మనం సాధన ద్వారా శాశ్వతమైన దానిని పొందవచ్చు అని మనకు సారూప్యతనిచ్చి విష్ణు భక్తి గొప్పతనాన్ని సుళువుగా తెలియజేశారు. అలాగే, కలియుగంలో మన పాలిట కల్పవృక్షమైన శ్రీవేంకటేశ్వరుని నామంలో విష్ణ కథలు ప్రకాశిస్తున్నాయని ముగించారు. గోవింద, వేంకట మొదలైన నామముల అర్థం చూస్తే అన్నమాచార్యుల వారి ఉద్దేశం మనకు అవగతమవుతుంది. కలిదోషములను హరించేది ఆ శ్రీనివాసుని స్మరణ. ఆయన నామంలోనే సమస్తము. అదే మనకు అభయము, వరదము, మోక్షప్రదాయకము. 

మనకు మార్గాలను ప్రభావవంతంగా తెలిపేవారు సద్గురువులు. తన సంకీర్తనల ద్వారా దారి చూపిన అన్నమయ్య మనకు సద్గురువులయ్యారు. ఒక్కో సంకీర్తన భవసాగరాన్ని దాటే అద్భుత సాధనం. అటువంటి రచనలు చేయటానికే ఆయన అవతరించారు.  అన్నమాచార్యుల వారిలోని శ్రీహరి అంశకు శిరసు వంచి పాదాభివందనాలు. 

ఈ సంకీర్తనను గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు ఎంతో శ్రావ్యంగా, భక్తి భావంతో ఆలపించారు. విని తరించండి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి