RightClickBlocker

31, జులై 2017, సోమవారం

మాదీ స్వతంత్ర దేశం - రజనీ దేశభక్తి గీతంరజనీ - ఆ పేరే తెలుగునాట లలితసంగీతానికి మారుపేరు. దేశభక్తి, లలిత గీతాలకు రజనీ హృదయం పుట్టినిల్లు. స్వాతంత్య్ర పూర్వము నుండి తొంభయ్యవ దశకం వరకు తెలుగునాట ఆకాశవాణి ద్వారా మారుమ్రోగిన పేరు బాలాంత్రపు రజనీకాంతరావు గారిది. ఆయన భారతావని స్వతంత్ర జాతిగా ఆవిర్భవించినప్పుడు రచించిన దేశభక్తి గీతం మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర జాతి. సంగీతం కూడా ఆయనే కూర్చారు. ఈ గీతాన్ని టంగుటూరి సూర్యకుమారి గారు ఆలపించారు. రజనీ గారి బహుముఖ ప్రజ్ఞ ఆయన గీతాల సాహిత్యంలో, సంగీతంలో మనకు సుస్పష్టంగా తెలుస్తుంది. భరతమాతకు ఈ గీతంలోని అద్భుతమైన పదాల ద్వారా రచయిత తన నివాళులను సమర్పించారు. ఈనాటి తరాల వారికి ఇటువంటి గీతాలు, వాటి అర్థాలు తెలియజేస్తే మన ముందు తరాల వారు ఈ భారతావనికి ఎటువంటి సేవ చేశారో తెలుస్తుంది. కొంతైనా దేశభక్తి అలవడుతుంది. టంగుటూరి సూర్యకుమారి గారు ఆనాడు నటనలో, గానంలో, నృత్యంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. వారు పాడిన దేశభక్తి గీతాలు ఈనాటికీ ప్రజల హృదయాలలో నిలిచిపోయాయి. రజనీ, శంకరంబాడి సుందరాచారి, బసవరాజు అప్పారావు, గురజాడ అప్పారావు, నిడదవోలు వెంకటరావు, అడవి బాపిరాజు, రాయప్రోలు సుబ్బారావు వంటి మహనీయుల సాహిత్యం సూర్యకుమారి గారి గళంలో అద్భుతంగా జాలువారింది. రజనీ గారు చాంద్రమానం ప్రకారం శతసంవత్సరాలు పూర్తి చేసుకుని హైదరాబాదులో నివసిస్తున్నారు. ఆయన ప్రముఖ తెలుగు కవి ద్వయమైన వేంకట పార్వతీశ కవులలో ఒకరైన బాలాంత్రపు వేంకటరావు గారి కుమారుడు. రజనీ కళాప్రపూర్ణ బిరుదాంకితులు. వారికి ఒక్క పద్మ అవార్డు రాకపోవటం ఎంతో శొచనీయం. సూర్యకుమారి గారంటే శంకరంబాడి సుందరాచారి గారు రచించిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతం యొక్క అద్భుతమైన గానం గుర్తుకొస్తుంది. వీరు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి సోదరుని కుమార్తె. సూర్యకుమారి గారు 1960వ దశకం నుండి లండన్‌లో స్థిరపడి 2005లో మరణించారు. రజనీ-సూర్యకుమారి గార్ల సమన్వయంలో వెలువడిన మాదీ స్వతంత్ర దేశం గీత సాహిత్యం, ఆడియో.

మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర జాతి 
భారతదేశమే మా దేశం భారతీయులం మా ప్రజలం 

వింధ్య హిమవత్ శ్రీనీలాద్రుల
సంధ్యారుణిత నవాశలు మావి 
గంగా గోదావరీ సహ్యజా
తుంగ తరంగిత హృదయాల్ మావి

ఆలయమ్ముల  శిల్పవిలాసం
ఆరామమ్ముల కళాప్రకాశం
మొగల్ సమాధుల రస దరహాసం  
మాకు నిత్య నూతనేతిహాసం

అహింసా పరమో ధర్మః 
సత్యంవద ధర్మంచర 
ఆదిఋషుల వేదవాక్కులు 
మా గాంధి గౌతముల సువాక్కులు

స్వతంత్రతా భ్రాత్రుత్వాలు 
సమత మా సదాశయాలు 
జననీ ఓ స్వతంత్ర దేవి   
గొనుమా నివ్వాళులు మావి 

నల్లని వాడా! నే గొల్ల కన్నెనోయ్! - వింజమూరి శివరామారావు గారి గీతంనల్లని వాడా! నే గొల్ల కన్నెనోయ్! పిల్లన గ్రోవూదుమోయ్! నా యుల్లము రంజిల్లగా!

నీ తీయని పాటలకై రేతిరి ఒంటిగ వచ్చితినే!
నా మనసు తనువు నా మనికే నీది కదా పిల్లన గ్రోవూదుమోయ్!! నల్లనివాడా!!

ఆకసాల మబ్బులనీ చీకటులే మూగెననీ!
నేనెరుంగనైతిని నీ తలపే వెలుంగాయె పిల్లన గ్రోవూదుమోయ్! నల్లనివాడా!!

మెరుపే నీ గోపికయై వలపే నా నెచ్చెలియై!
తోడి తెచ్చె నీ దరికీనాడు పండె నా నోములు పిల్లన గ్రోవూదుమోయ్!! నల్లనివాడా!!

- వింజమూరి శివరామారావు గారు

ఎంత అద్భుతమైన లలిత గీతమో! వింజమూరి శివరామారావు గారు సీత-అనసూయ సోదరీమణులతో పాటు వింజమూరి వంశంలో జన్మించిన మరో ప్రతిభామూర్తి. ఈయన ఆకాశవాణిలో ఎన్నో సంవత్సరాలు పని చేశారు. అద్భుతమైన లలితగీతాలు రచించారు. వీరు రచించిన రామాయణం గేయం అప్పట్లో ఆకాశవాణిలో మారుమ్రోగింది. సీత-అనసూయ గార్ల లాగానే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వీరికి మేనమామలు. కళాప్రపూర్ణ బిరుదాంకితులు శివరామారావు గారు. గౌతమి అనే కలం పేరుతో ఆయన రచనలు చేశారు. 600కు పైగా రేడియో నాటకాలను అందించారు.

గోపిక మనో భావనలను తెలిపే ఎన్నో లలిత గీతాలు వచ్చాయి. వాటిలో శివరామారావు గారి ఈ గీతం ప్రత్యేకమైనది. కృష్ణ భక్తిలో స్వామిపై ఉండే అధికారము, స్వామికి ఆత్మ నివేదన, ప్రేమానురాగాలు అనన్యమైనవి. అవే భావనలను కవి ఈ గీతంలో అద్భుతంగా ఆవిష్కరించారు. స్వామి తీయని పాటల కోసం అర్థరాత్రి ఒంటరిగా వచ్చిన గోపిక స్వామిని తన మనసు రంజిల్ల జేసేలా పిల్లనగ్రోవి ఊది పాడమని వేడుకుంటుంది. తన మనసు, తనువు, జీవితము అన్నీ స్వామివే అని తెలుపుతుంది. చీకటి వేళలో, ఆకాశంలో మబ్బులు మూగినా వాటిని లెక్క చేయక స్వామి తలపులే వెలుగుగా చూస్తూ ఆయన కోసమై వచ్చాను అని తెలియజేస్తుంది. మేఘముల మెరుపే గోపికగా, స్వామిపై ప్రేమయే సఖిగా తోడ్కొని తనను స్వామి దరికి తెచ్చెనని, తన నోములు పండాయని, పిల్లనిగ్రోవి ఊది పాడమని ఆ నల్లనయ్యను ప్రార్థిస్తుంది.   ఆత్మ నివేదన మధురభక్తికి సూచిక. నేను అన్న భావన మరచి, ధైర్యంగా స్వామి దరికి చేరుకునే గోపికల మనోభావనలను సూచించే గీతం ఇది. ఇక రావు బాలసరస్వతి గారి గానం ఈ భావానికి సాధనమైతే? అదో రసరమ్య గీతమే. కృష్ణభక్తిని అక్షర లక్షలుగా ప్రకటితం చేసిన బాలసరస్వతి గారి గానం లలిత సంగీత ప్రపంచంలో మకుటాయమానం. పట్టులాంటి మృదువైన గాత్రం వారిది. ముఖ్యంగా సాలూరి వారి గీతాలకు వారి గళం ఎంత నప్పుతుందో. ఈ గీతం ఎవరు స్వరపరచారో తెలియదు కానీ కళ్యాణి రాగంలో ఉంది కాబట్టి సాలూరి వారే అనుకుంటున్నాను. వారికి కళ్యాణి రాగమంటే ప్రాణం. గీతం వింటుంటే సాలూరి వారి ఛాయలు స్పష్టంగా తెలుసుతున్నాయి. లలిత సంగీతపు స్వర్ణయుగంలో బాలసరస్వతి గారి ఆణిముత్యపు గీతాలలో ఒకటైన నల్లని వాడా విని ఆస్వాదించండి. కృష్ణభక్తిలో తరించండి. 

29, జులై 2017, శనివారం

ఓం నమశ్శివాయ! చంద్రకళాధర! సహృదయ! - వేటూరి గీతం


ఓం నమశ్శివాయ! చంద్రకళాధర! సహృదయ! సాంద్రకళాపూర్ణోదయ! లయ నిలయ!

పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై
ప్రకృతి పార్వతి నీతో నడచిన ఏడు అడుగులే స్వరసప్తకమై
నీ దృక్కులే అటు అష్ట దిక్కులై నీ వాక్కులే నవరసమ్ములై
తాపస మందారా! నీ మౌనమే దశోపనిషత్తులై ఇల వెలయ!

త్రికాలములు నీ నేత్ర త్రయమై చతుర్వేదములు ప్రాకారములై
గజముఖ షణ్ముఖ ప్రమథాదులు నీ సంకల్పానికి ఋత్విజవరులై 
అద్వైతమే నీ ఆదియోగమై నీ లయలే ఈ కాలగమనమై
కైలాస గిరివాస! నీ గానమే జంత్రగాత్రముల శృతి కలయ!

- వేటూరి సుందరరామ్మూర్తి గారు

కవుల ఆధ్యాత్మిక దార్శనికత వారి రచనలలో తేటతెల్లమవుతుంది అన్నదానికి వేటూరి వారి ఓం నమశ్శివాయ అనే గీతం ప్రత్యక్ష నిదర్శనం. కళాతపస్వి ఆలోచనలను, శైలిని ప్రేక్షకుల హృదయాలలో నిలిపేలా చేసేవి వారి చిత్రాలలోని గీతాలు. అటువంటిదే ఓం నమశ్శివాయ అనే గీతం. వేటూరి వారికి సాగరసంగమంలో ఆ సందర్భానికి ఇటువంటి గీతాన్ని రాయమని చెప్పటం విశ్వనాథ్ గారి కళాత్మక దృష్టిని,ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సూచిస్తుంది.

నెలవంక చంద్రుని శిరసుపై గల సహృదయుడవు, పరిపూర్ణమైన కళలకు నిలయమైన వాడవు, లయ యందు నివసించే వాడవు అయిన శివా! నమస్కారములు. పృథివ్యాపస్తేజోవాయురాకాశములు ఐదు ముఖములుగా (సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ముఖములు), ఆరు ఋతువులు ఆభరణములైన ఆహార్యముగా, ప్రకృతి రూపిణియైన పార్వతి నీతో నడిచే అడుగులే సప్తస్వరాలు. నీ చూపులే అష్ట దిక్కులు, నీ పలుకులు నవరసాలు. నీవు తాపసులలో శ్రేష్ఠుడవు. నీ మౌనం నుండే ఉపనిషత్తులు ఈ భువిలో వెలసాయి. ఓ పరమశివా! నీకు నమస్కారములు. మూడు కాలములు నీ మూడు కళ్లుగా, నాలుగు వేదాలు నీ నివాసమైన కైలాసానికి ప్రాకారాలుగా, గణపతి, కుమారస్వామి మొదలైన ప్రమథ గణాలు నీ సంకల్పాన్ని అమలు చేసే ఋత్విజ శ్రేష్ఠులై, అద్వైత భావనతో నీ యోగము సనాతనమై, నీ  లయలు కాలానికి ముందడుగులై నీ గానం వాయిద్యములతో జంత్రగాత్రమై శృతిలో పలికినావు. ఓ కైలాసవాసా! నీకు నమస్కారములు.

సృష్టి స్థితి లయములలో లయకారకుడు శివుడు. ఆ లయానికి నాదం మూలం. నిరంతర నాద పరివేష్టితుడైన పరమ శివుడు ఆనంద తాండవంతో పాటు విలయతాండవం కూడా చేస్తూ నిరంతరం ధ్యానంలో ఉంటాడని మన వేద వాఙ్మయం ఘోషిస్తోంది. ఆ పరమశివుని కైలాస ప్రస్తారాన్ని ఒక్కసారి కళ్ల ముందుంచే ప్రయత్నం వేటూరి వారు ఈ గీతం ద్వారా చేశారు. సాహిత్యంలోని భావాన్ని పరిశీలిస్తే శివతత్త్వం ప్రస్ఫుటమవుతుంది. నీ మౌనమే దశొపనిషత్తులై ఇల వెలయ అని గీతాన్ని ముగించారు వేటూరి వారు. మౌనమేమిటి ఉపనిషత్తులేమిటి అని ప్రశ్న రావచ్చు. దక్షిణామూర్తి ఎవరు? శివుడే కదా? మౌనంతో ఋషులకు జ్ఞానబోధ చేసిన ఆ పరమశివుని సంకల్పం అద్భుతం. ఇటువంటి తత్త్వం వింటేనే మనసు పులకరిస్తుంది.

ఇళయరాజా గారి సంగీతం, వేటూరి వారి సాహిత్యం, జానకి గారి గాత్రంలో ఈ గీతం అజరామరమైంది. సాగర సంగమం చిత్రానికి ఇళయరాజా గారికి జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుని పురస్కారం లభించింది. వేటూరి గారికి, విశ్వనాథ్ గారికి, ఇళయరాజా గారికి ఇటువంటి గీతాన్ని అందించినందుకు మనం ఎంతో ఋణపడి ఉన్నాము. 

పరమపురుషమనుయామవయం సఖి - నారాయణ తీర్థుల తరంగం


పరమపురుషమనుయామవయం సఖి పరమ పురుషమనుయామ

సురుచిర హాసం సుందర నాసం తరుణరుణ కిరణాధర సరసం 

నంద కుమారం నగవర ధీరం బృందావన భువి వివిధ విహారం 
బృందారక గణ వందిత చరణారవింద మిళిత మణి మధుకర నికరం 

యువతీ గీత యోగి సులలితం కవి జన మానస కమల విలసితం 
శివ నారాయణ తీర్థ విరచితం శ్రీ గోపాల దయా రస మిళితం

- నారాయణ తీర్థుల వారు (శ్రీకృష్ణ లీలా తరంగిణి)

ఓ సఖులరా! పరమ పురుషుడైన ఆ శ్రీకృష్ణుని అనుసరిద్దాం రండి!  మోహనమైన చిరునవ్వుతో, అందమైన ముక్కుతో, సూర్యకాంతివలె ఎర్రగా ప్రకాశించే పెదవులు కలిగి రసపురుషుడైన ఆ కృష్ణుని అనుసరిద్దాం! నందుని కుమారుడు, అసమాన ధీరుడు, బృందావనంలో సంచరించే వాడు, దేవతలచే పూజించబడిన వాడు, వారి శిరసున ఉన్న కిరీటములలోని మణులచే ప్రకాశించిన చరణములు కలవాడు అయిన శ్రీకృష్ణుని అనుసరిద్దాం. శ్రీకృష్ణుని దయారసం మిళితమై నారాయణ తీర్థులు వారు రచించిన ఈ గీతం గోకులంలోని స్త్రీల గానం చేయగా యోగుల మనసులు ఆనందించాయి, కవుల హృదయ కమలములు వికసించాయి.

నారాయణ తీర్థుల వారు శ్రీకృష్ణుని లీలలను, ఆయన రూపాన్ని వర్ణించినంత మనోహరంగా ఇంక ఏ వాగ్గేయకారుడూ వర్ణించలేదంటే అతిశయోక్తి కాదు. శ్రీకృష్ణ లీలా తరంగిణిలో ఎన్నో కీర్తనల ద్వారా ఆయన బృందావన కృష్ణుని నుతించారు. అందులో ఒకటి ఈ పరమ పురుషమనుయామ అనే కీర్తన. శరదృతువులో బృందావనంలో వేణుగానం చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. అతని కోసం వేచి యున్న గోపికలు ఆ గానానికి ముగ్ధులై ఈ గీతాన్ని ఆలపించినట్లు, అక్కడి యోగులు, కవులు దానిని ఆస్వాదించినట్లు ఈ గీతం వివరిస్తుంది. బేహగ్ రాగంలో మల్లాది సోదరులు ఈ గీతాన్ని హృద్యంగా పాడి కృష్ణ తత్వాన్ని ఆవిష్కరించారు. విని తరించండి.


స్వామినాథ పరిపాలయాశు మాం - దీక్షితుల కృతి


స్వామినాథ పరిపాలయాశు మాం  స్వప్రకాశ వల్లీశ గురు గుహ దేవసేనేశ

కామజనక భారతీశ సేవిత
కార్తికేయ నారదాది భావిత
వామదేవ పార్వతీ సుకుమార
వారిజాస్త్ర సమ్మోహితాకార
కామితార్ధ వితరణ నిపుణ చరణ
కావ్య నాటకాలంకారాభరణ
భూమి జలాగ్ని వాయు గగన కిరణ
బోధ రూప నిత్యానంద కరణ

స్వప్రకాశుడవు, వల్లీ దేవసేనల పతివి, గురుగుహుడవు అయిన ఓ స్వామినాథా! నన్ను రక్షింపుము. ఓ కార్తికేయా! బ్రహ్మ విష్ణువు మరియు దేవతలచే పూజించబడిన వాడవు, నారదాది మునులచే భావించబడిన వాడవు. శివ పార్వతుల సుపుత్రుడవు. మన్మథునికి కూడా సమ్మోహనమైన ఆకారము కలవాడవు. నీ పదములను ఆశ్రయించిన వారి కామ్యములను తీర్చే నిపుణుడవు. కావ్యములు, నాటకము, అలంకారములు మొదలైన కళలను పెంపొందించే వాడవు, భూమి, నీరు, అగ్ని, వాయు మరియు ఆకాశములకు ప్రకాశమైనవాడవు, జ్ఞానస్వరూపుడవు, సచ్చిదానందమునకు కారకుడవు. నన్ను రక్షింపుము.

- ముత్తుస్వామి దీక్షితుల వారి  కృతి రంజని-గాయత్రిల యుగళ గాత్రంలో వినండి.


నీ నామ రూపములకు నిత్య జయ మంగళం - త్యాగరాజస్వామి మంగళ హారతినీ నామ రూపములకు నిత్య జయ మంగళం 
పవమాన సుతుడు పట్టు పాదారవిందములకు ||నీ నామ||
పంకజాక్షి నెలకొన్న అంక యుగమునకు ||నీ నామ||
నళినారి గేరు చిరునవ్వు గల మోమునకు ||నీ నామ||
నవ ముక్త హారములు నటియించు యురమునకు ||నీ నామ||
ప్రహ్లాద నారదాది భక్తులు పొగడుచుండు ||నీ నామ||
రాజీవ నయన త్యాగరాజ వినుతమైన ||నీ నామ||

మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం

"నీ నామునకు, రూపమునకు నిత్యము జయము, మంగళము కలుగు గాక! వాయుపుత్రుడైన హనుమంతుడు సేవించే నీ పాదములకు, కలువలవంటి కన్నులు గల సీత కూర్చునే నీ అంకములకు (తొడలకు), చిరునవ్వుతో చంద్రునివలె ఉండే నీ మోమునకు, మంచి ముత్యముల హారములు నర్తించే నీ వక్షస్థలమునకు, ప్రహ్లాదుడు, నారదాదులు పొగడే అందమైన కన్నులు కలిగి పరమశివునిచే నుతించబడిన నీకు మంగళము"

- సద్గురువు త్యాగరాజస్వామి శ్రీరామునికి పాడిన మంగళ హారతి


రారా కృష్ణయ్య - దాశరథి గీతందీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడు 
దేవుని నమ్మిన వాడు ఎన్నడూ చెడిపోడు
ఆకలికి అన్నము వేదనకు ఔషధం
పరమాత్ముని సన్నిధికి రావే ఓ మనసా

రారా కృష్ణయ్య రారా కృష్ణయ్యా
దీనులను కాపాడ రారా కృష్ణయ్యా
రారా కృష్ణయ్యా రారా

మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా
ఎదురు చూచు కన్నులలో కదిలేవయ్యా
పేదల మొరలాలించే విభుడవు నీవే
కోరిన వరములనొసగే వరదుడవీవే
అజ్ఞానపు చీకటికి దీపము నీవే
అన్యాయమునెదిరించే ధర్మము నీవే
నీవే కృష్ణా నీవే కృష్ణా నీవే కృష్ణా

కుంటివాని నడిపించే బృందావనం
గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం
మూఢునికి జ్ఞానమొసుగు బృందావనం
మూగవాని పలికించే బృందావనం
అందరినీ ఆదరించు సన్నిధానం
అభయమిచ్చి దీవించే సన్నిధానం
సన్నిధానం దేవుని సన్నిధానం సన్నిధానం

కరుణించే చూపులతో కాంచవయ్యా
శరణొసగే కరములతో కావవయ్యా
మూగవాని పలికించి బ్రోవవయ్యా
కన్నతల్లి స్వర్గములో మురిసేనయ్యా
నిన్ను చూచి బాధలన్నీ మరిచేనయ్యా
ఆధారము నీవేరా రారా కృష్ణా
కృష్ణా కృష్ణా రారా కృష్ణా 

శరణాగతితో ఆర్తితో వేడుకుంటే బ్రోచే కరుణామయుడు పరమాత్మ. ఈ సత్యాన్ని ఎన్నో ఉదాహరణలుగా మనకు సనాతన ధర్మ ప్రవాహంలోని వేద వాఙ్మయం, పురాణాలు, ఇతిహాసాలు, గాథలు ఘోషించాయి. కలియుగంలో కూడా సద్గురువుల కృపతో పరమాత్ముని అనుగ్రహం మనకు అంది అద్భుతాలు జరుగుతున్నాయి. బిడ్డలు లేని వాళ్లకు బిడ్డలు, బ్రతకడు అనుకున్న బిడ్డ పూర్ణాయుష్మంతుడు కావడం, మూగవానికి మాటలు రావటం వంటివెన్నో జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే తిరుమల స్వామి దర్శనం తరువాత మాట వచ్చిన మూగవాడే ఈ పరమాత్మ అనుగ్రహానికి సాక్షి. ఇసద్గురువుల అనుగ్రహంతో వైద్యులు పిల్లలు పుట్టరు అన్నవారికి పిల్లలు పుట్టిన సంఘటనలు ఎన్నో నాకు తెలుసు. అటువంటి వాటిని చలన చిత్రాలు కూడా ప్రస్తావించాయి. వాటిలో 1968లో విడుదలైన రాము చిత్రంలోని బాలుడి పాత్ర, రారా కృష్ణయ్యా అనే గీతం.

దేవాలయాలు సందర్శన కోసమే కాదు సత్పురుషుల, యోగుల సాంగత్యానికి కూడా అని మనకు కొన్ని చలనచిత్రాలు అద్భుతంగా తెలిపాయి. అప్పటి చిత్రాలలో దేవాలయ సన్నివేశాలు తప్పకుండా ఉండేవి. దీక్షతో, మంత్ర జప సాధనతో, అధివాసములతో, యంత్ర మహిమతో ప్రతిష్ఠించబడిన దేవాలయ మూర్తులు పరమాత్మ ప్రతిబింబాలు. అటువంటి దేవాలయాలు యోగులకు, సాధువులకు, భక్తులకు ఆలవాలమై పవిత్రమైన క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. అక్కడ దివ్యత్వం నిండి ఉంటుంది.  మన పాపాలను, మనసులలోని మలినాలను ప్రక్షాళన చేసుకునే అవకాశాన్ని దేవాలయాలు కలిగిస్తాయి. అటువంటి సన్నివేశమే రాము చిత్రంలోని ఈ గీత నేపథ్యం. తల్లి మంటలలో చిక్కుకొని మరణించటం చూస్తూ ఆ బాలుడు మాట కోల్పోతాడు. ఆ తండ్రి ఆవేదనతో డాక్టర్లకు చూపించగా అతనికి మాట వచ్చే అవకాశం లేదని చెబుతారు. అప్పుడు ఆ బాలుడు ఆత్మహత్య చేసుకోబోతాడు. తండ్రి కూడా నిరాశతో కొడుకుతో కలిసి సముద్రంలో మునిగిపోయే ప్రయత్నం చేయబోగా ఓ మందిరంలో కృష్ణుని రారా అని పిలుస్తున్న ఓ సాధువు పాట విని తండ్రీ కొడుకులు అక్కడికి వెళ్లి ఆ కృష్ణుని ప్రార్థిస్తారు. ఆ పరమాత్మ అనుగ్రహంతో మళ్లీ మరో అగ్నిప్రమాద సన్నివేశంలో బాలుడికి మాటలు వస్తాయి. అమ్మలా ప్రేమించే టీచరమ్మ మంటల్లో చిక్కుకోగా బాలుడు మాట్లాడే ప్రయత్నం చేసి అమ్మా అని పిలిచి సఫలమవుతాడు.

దాశరథి గారి గీతానికి ఆర్.గోవర్ధనం గారు సంగీతం అందించగా ఘంటసాల మాష్టారు ఈ భక్తి గీతాన్ని అద్భుతంగా పాడారు. పరమాత్మ సన్నిధే మనకు శరణు అన్న భావన ఈ గీతం కలిగిస్తుంది. ఇహపరాలు రెండిటిలోనూ మనలను తరించేది పరమాత్మే అన్నది ఈ గీతం ద్వారా దాశరథిగా చక్కగా తెలియజేశారు. ఘంటసాల మాష్టారు గళంలో భక్తివిశ్వాసాలు, శరణాగాతి సుస్ఫష్టంగా, భావరాగ యుక్తంగా మన హృదయాలను హత్తుకుంటాయి.


శ్రీ రామ జయ రామ శృంగార రామ యని - త్యాగరాజస్వామి కృతి


శ్రీ రామ జయ రామ శృంగార రామ యని చింతింప రాదె ఓ మనసా

తళుకు చెక్కుల ముద్దుబెట్ట కౌసల్య మును తపమేమి చేసెనో తెలియ

దశరథుడు శ్రీ రామ రారాయనుచు బిల్వ తపమేమి చేసెనో తెలియ

తమి మీర పరిచర్య సేయ సౌమిత్రి మును తపమేమి చేసెనో తెలియ 

తన వెంట చన జూచి యుప్పొంగ కౌశికుడు తపమేమి చేసెనో తెలియ 

శాపంబణగి రూపవతియౌటకహల్య మును తపమేమి చేసెనో తెలియ

ధర్మాత్ము చరణంబు సోక శివ చాపంబు తపమేమి చేసెనో తెలియ

తన తనయ నొసగి కనులార గన జనకుండు తపమేమి చేసెనో తెలియ

దహరంబు కరగ కరమును బట్ట జానకి తపమేమి చేసెనో తెలియ

త్యాగరాజాప్తయని పొగడ నారద మౌని తపమేమి చేసెనో తెలియ

రాముని వైభవాన్ని రామావతారంలోని వేర్వేరు పాత్రలు సన్నివేశాలతో కూర్చి అద్భుతంగా వర్ణించారు త్యాగరాజస్వామి. మెరిసే బుగ్గలపైన ఆ బాలరాముని ముద్దాడటానికి కౌసల్య ఎటువంటి తపస్సు చేసిందో? నిజమే, రాముని వంటి ధర్మమూర్తికి, అవతారపురుషునకు తల్లిగా లాలించే అదృష్టం కౌసల్యకు కలగటం తపఃఫలమే. ఆడుతూ పాడుతూ బుడి బుడి అడుగులు వేస్తున్న రాముని చూచి దశరథుడు రామా రారా అని పిలవటానికి ఏమి తపస్సు చేశాడో? లేక లేక బిడ్డలు కలుగగా ఆ నలుగురూ కారణ జన్ములు కావటం, వారికి తండ్రి దశరథుడు కావటం ఆయన చేసుకున్న తపఃఫలమే. అన్న అలసట తీర సేవ చేసే భాగ్యాన్ని లక్ష్మణుడికి దక్కటం అతని తపఃఫలమే. ఆదిశేషుని అవతారంగా చెప్పబడే లక్ష్మణుడు స్వామిని వీడి ఉండలేడని తెలిసి సోదరునిగా పుట్టించి అతనికి నిరంతర సేవాభాగ్యాన్ని ప్రసాదించాడు స్వామి. ఆ సౌమిత్రి ఏమి తపస్సు చేశాడో? యాగరక్షణకై తన వెంట వచ్చిన రాముని చూసి ఉప్పొంగిన విశ్వామిత్రుడు ఏమి తపస్సు చేశాడో? రామావతారంలో వశిష్ఠ విశ్వామిత్రాది ఋషులెందరో శ్రీరామునికి బోధ చేశారు, మార్గదర్శకులైనారు. వారిలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు బల అతిబల విద్యలతో పాటు అస్త్ర శస్త్రాలను ప్రసాదిస్తాడు. యాగరక్షణతో పాటు వారి వివాహానికి తోడ్పడతాడు. శాపవశాత్తు వేలయేండ్లు స్థాణువై నిలిచిన అహల్య రాముని పాదము సోకి తిరిగి చేతన కావటానికి ఏమి తపస్సు చేసిందో? ఆ ధర్మమూర్తియైన రాముని స్పర్శను పొందటానికి ఆ శివధనుస్సేమి తపము చేసిందో? పరమశివుని చాపము జనకునికి పూర్వీకులనుండి పరంపరగా వచ్చింది. రాముని కోసమే వేచియున్నట్లు జానకి స్వయంవరానికి కారకమై సాద్గుణ్యతను పొందింది. సకల సద్గుణ సంపన్నుడైన రామునకు తన బిడ్డను కన్యాదానం చేసే భాగ్యం పొందటానికి జనకుడు ఏమి తపస్సు చేశాడో? లోకపావని సీత జనకుని ఇంట పెరగటం, ఇక్ష్వాకు వంశ తిలకుడైన రాముని వివాహమాడటం జనకుని తపఃఫలమే.  శివధనుసు విరచిన రాముని చూచి హృదయము కరగి వరించిన జానకి ఏమి తపస్సు చేసిందో? నారదాదులు ఆ పరమశివునికి రాముడు ఆప్తుడని నుతించటానికి ఏమి తపస్సు చేశారో? ఇవన్నీ తెలియటానికి శ్రీరామ జయరామ అని నిరంతరం స్మరించమని చెబుతున్నారు త్యాగరాజస్వామి. రాముని వైభవం, ఆయన అనుగ్రహం పొందటానికి ఆయన నామమే ఉత్తమమైన సాధనం అని సద్గురువులు తెలియజేస్తున్నారు.

నేదునూరి కృష్ణమూర్తి గారు ఈ కృతిని అద్భుతంగా గానం చేశారు.  

సరసీరుహాసన ప్రియే - దురైస్వామి అయ్యరు కృతిసరసీరుహాసన ప్రియే! అంబ! సదా వీణా గానప్రియే! సదానంద హృదయే! మహిసదయే!

శరణాగతం మామవ! మంజుల చరణ కిసలయే!
సమ్మోదిత కవిజన హృదయే! సరోజ నిలయే! మణివలయే!

సరసీరుహాక్షి యుగళే అంబ!
శరణాగత దీన వత్సలే!
శరదిందు సుందర వదనే! విమలే!
సరస్వతీ! అంబ! సతి! దేశిక నుత గుణశాలే!
సతతం విద్యా లోలే! సదా సుశీలే!
సామజ! కుంభ స్తన యుగళే! ధవళే! 
సకల సామ్రాజ్య ప్రద! కర ధృత పుస్తక జాలే!

- పులియూరు దురైస్వామి అయ్యరు

కమలాసనుడైన చతుర్ముఖ బ్రహ్మకు ప్రియమైన అమ్మా సరస్వతీ! ఎల్లప్పుడూ వీణా గానమంటే ఇష్టపడే, సచ్చిదానందముతో నిండిన హృదయము కలిగి, ఈ భూమిపై అనుగ్రహము కలిగిన తల్లీ! చిగురులవలె మృదువైన చరణములు గలదానవు!  కవిజనుల హృదయాలకు ఆనందం కలిగించే తల్లివి! కమలములో స్థిరమై యున్న దానవు!మాకు నీవే శరణం. కలువలవంటి కన్నులు కలిగిన తల్లీ! నీవు శరణన్న దీనులపై వాత్సల్యము కలిగిన అమ్మవు. శరదృతువులో చంద్రుని వంటి సుందరమైన ముఖము కలిగిన దానవు, నిర్మలమైన తల్లివి. ఓ సరస్వతీ! ఉత్తమమైన స్త్రీవి నీవు! పుణ్యాత్ములచే పొగడబడిన గుణములకు నెలవు నీవు! ఎల్లప్పుడూ విద్యలలో నిమగ్నమైయుందువు, నిరంతరం సద్గుణ సంపన్నవు. సకల విద్యలను పూర్ణమైన స్తనములలో కలిగిన అమ్మవు, తెల్లని వస్త్రములు ధరించి, చేతిలో పుస్తకములు కలిగి సమస్త భోగములు ప్రసాదించే అమ్మవు నీవు! నీవే మాకు శరణము.

యువ గాయనీమణులు  రంజని-గాయత్రిల గాత్రంలో ఈ నాట రాగంలో ఈ కృతి వినండి

కదిరి నృసింహుడు కంబమున వెడలె - అన్నమాచార్యుల సంకీర్తన


కదిరి నృసింహుడు కంబమున వెడలె
విదితముగా సేవించరో మునులు 

ఫాల లోచనము భయదోగ్రముఖము
జ్వాలామయ కేసరములును
కాలరౌద్ర సంఘటిత దంతములు
హేలగతి ధరియించుక నిలిచె 

ముడివడు బొమ్మలు ముంచిన ఊర్పులు
గడగడనదరెడి కటములును
నిడుద నాలుకయు నిక్కు కర్ణములు
నడియాలపు రూపై వెలసె 

సకలాయుధములు సహస్ర భుజములు
వికట నఖంబులు వెసబూని
వెకలియగుచు శ్రీవేంకటేశ్వరుడు
ప్రకటపు దుష్టుల భంజించేనిదివొ

- సద్గురువు తాళ్లపాక అన్నమాచార్యుల వారు

నరసింహావతారంపై అన్నమాచార్యుల వారు ఎన్నో కీర్తనలు రచించారు. వాటిలో ప్రత్యేకమైనది ఈ కదిరి నృసింహుడు కంబమున వెడలె. అనంతపురం జిల్లాలోని ఖాద్రి నరసింహస్వామి క్షేత్రం సనాతనమైనది. ఖాద్రి అనగా బ్రహ్మదారువు చెట్టుతో చేయబడిన స్థంభము. హిరణ్యాక్షుని వధించటానికి నరహరి రూపంలో శ్రీమహావిష్ణువు ఆ ఖాద్రియందు అవతరించాడు. అందుకే ఆ క్షేత్రానికి ఖాద్రి నరసింహుడు అని పేరు వచ్చింది. కాలగమనంలో కదిరిగా మారింది. ఆ కదిరి నరసింహుని అవతరణికను అన్నమయ్య ఈ కీర్తన ద్వారా మనకు తెలియజేశారు.

కంబమునుండి వెడలిన ఆ నరసింహుని సేవించండి మునులారా అని అన్నమయ్య ఈ సంకీర్తనను ఆరంభించారు. అగ్ని నేత్రముతో, భయము కలిగించే ఉగ్రమైన ముఖముతో, జ్వలించే కేసరములతో, ప్రళయకాల రుద్రుని వలె భీకరమైన దంతములతో హేలగా నిలిచినాడు. ముడి పడిన కనుబొమ్మలు, బుసలు కొట్టే ఉచ్ఛ్వాస-నిశ్శ్వాసలతో, గడ గడ అదరుచున్న చెక్కిళ్లతో, బయటకు వెడలియున్న నాలుకతో, నిక్కబొడుచుకున్న చెవులతో, ప్రత్యేకమైన రూపంగా వెలసినాడు. సమస్త ఆయుధములు, ఎంచలేని భుజములు కలిగి భీకరమైన గోళ్లతో వేగముగా కదలుచు దుష్టులైన దానవులను సంహరించటానికి ఆ శ్రీవేంకటేశ్వరుడు (నరసింహుడు) అవతరించినాడు.ఆతని సేవించండి!

ఈ సంకీర్తన అఠాణ రాగంలో గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు అద్భుతంగా ఆలపించారు.


తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె యూగెగన - అన్నమాచార్యుల సంకీర్తన


తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె యూగెగన చెల్లుబడి నూగీని శ్రీరంగశిశువు

కలికి కావేరి తరగల బాహులతలనే 
తలగకిటు రంగ మధ్యపు తొట్టెలను
పలుమారు దనునూచి పాడగా నూగీని
చిలుపాల సెలవితో శ్రీరంగశిశువు

వేదములే చేరులై వెలయంగ శేషుడే
పాదుకొను తొట్టెలై పరగగాను
శ్రీదేవితో గూడి శ్రీవేంకటేశుడై
సేదదీరెడి వాడె శ్రీరంగశిశువు

తొలుత మఱ్ఱాకుపై వైభవంగా తేలియాడిన వాడు,వటపత్రశాయిగా పేరొందిన వాడు ఈ శ్రీరంగ శిశువు. లతలవంటి కావేరీ తరంగాలు బాహువులుగా,  పాటలు పాడబడుచు పెదవుల మూలలలో పాలు కలిగిన అందమైన బాలుడు శ్రీరంగములో తొట్టెలలో ఊగుచున్నాడు. వేదాలే హారములుగా ఆది శేషుడే ఊయలగా ఒప్పుగా లక్ష్మీదేవితో కూడిన వేంకటేశుడు సేదదీరుచున్నాడు. అతడే శ్రీరంగ శిశువు.

- సద్గురువులు తాళ్లపాక అన్నమాచార్యుల వారు.

నీలాంబరి రాగంలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించిన ఈ అన్నమాచార్యుల వారి సంకీర్తన ఆ శ్రీరంగంలోని చిన్ని కృష్ణుడు ఊయలలో ఊగే సేవను అద్భుతంగా తలపిస్తుంది. పాలు తాగి ఊయలలో ఆ చిన్ని కృష్ణునికి తిరువారాధనలో పాటలు పాడుచుండగా ఊగే మనోజ్ఞమైన దృశ్యాన్ని అన్నమయ్య మనకు ఈ సంకీర్తన ద్వారా ఆవిష్కరించారు. పాలకడలిలో ఆదిశేషునిపై సేదదీరే లక్ష్మీపతి, మార్కండేయుని తపస్సుకు మెచ్చి అతనిని మఱ్ఱాకుపై వెలసిన బాలుని ఉదరములోనికి ప్రవేశింపజేసి విశ్వ రహస్యాన్ని తెలుపుతాడు. ఆ వటపత్రశాయే ఈ బాలకృష్ణుడు అని అన్నమయ్య తెలిపారు.


(చిత్రం వటపత్రశాయి అలంకారంలో ఉడిపి శ్రీకృష్ణుడు)

మామవ సదా జననీ - స్వాతి తిరునాళ్ కీర్తన


మామవ సదా జననీ మహిషాసుర సూదని

సోమ బింబ మనోహర సుముఖి సేవకాఖిల
కామదాన నిరత కటాక్ష విలాసిని

కురు మే కుశలం సదా కమలనాభానుజే
నిరవధి భవ ఖేద నివారణ నిరతే
చారు నూతన ఘన సదృశ రాజిత వేణి
దారుణ దనుజాళి దారణ పటు చరితే

అమ్మా పార్వతీ దేవి! మహిషాసురుని సంహరించిన నీవు నన్ను ఎల్లప్పుడూ కాపాడుము! చంద్రుని వంటి ముఖముతో మా మనసులను దోచుకొనెదవు. నిన్ను సేవించే వారికి సమస్త కామ్యములను ఎల్లప్పుడూ అనుగ్రహించే కటాక్షముతో ప్రకాశించే అమ్మవు. కమలమును నాభిలో గల శ్రీహరి సోదరివి, అనంతమైన భవసాగరపు దుఃఖములను నివారించటములో నిపుణురాలవు. అందమైన నీ కురులు క్రొత్త మేఘములవలె ప్రకాశిస్తున్నాయి. దారుణమైన గుణములు కల్గిన రాక్షస సమూహాన్ని సంహరించిన ఘనమైన చరిత గల తల్లివి. నాకు ఎల్లప్పుడూ క్షేమాన్ని కలుగజేయుము.

- మహారాజా స్వాతి తిరునాళ్ కీర్తన సుధా రఘునాథన్  గారి గాత్రంలో వినండి.


రామా నిను నమ్మినవారము గామా - త్యాగరాజస్వామి కీర్తన


రామా నిను నమ్మినవారము గామా సకల లోకాభి 

పామర జన దూర వర గుణ ఘృణాపాంగ శుభాంగ ముని హృదయాబ్జ భృంగ 

వాలాయముగాను రాను జాగేల సుగుణ దశరథ నృపాల హృదయానందకార శ్రి లోల పాల వెలయుమిక
ఫాల లోచన హృదయాలయాప్త జన పాల కనకమయ చేల ఇక పరాకేల ఇపుడు మమ్మేల నీదు మనసేల రాదు

నీవే గతి యంటిని గాని నే వేరేమి ఎరుగను ముందర రావే నీ పద పంకజ భక్తి నీవే భావజారి నుత
దేవ నీదు పద సేవా ఫలము మము గావునే పతిత పావన త్రిదశ నాధనీయ ముని జీవనానిశము బ్రోవనేల శ్రీరామ 

ధారాధర నిభ దేహ జనాధార దురితాఘ జలద సమీర త్యాగరాజ హృదయాగార సార హీన సం
సారమందు వేసారి నిన్ను మనసార నమ్ము కొన నేరలేని నే నూరక ఇక విచారమందుటకు మేర గాదు శ్రీరామ

సమస్త లోకములకు ఆనందంకు కలిగించే శ్రీరామా! మేము నిన్ను నమ్మినవారము గామా? పామరులకు దూరుడవు, శ్రేష్ఠమైన గుణములు కలవాడవు, దయాకటాక్షములు గలవాడవు, శుభమైన అంగములు కలవాడవు, మునుల హృదయకమలములకు తుమ్మెద వంటి వాడవు నీవు. దశరథ మహారాజు హృదయమునకు ఆననందము కలిగించిన వాడవు మమ్ములను కాపాడుటకు వేగముగా రావేల? వచ్చి రక్షించుము. శివుని హృదయములో నివసించే వాడవు, ఆప్తజనులను పాలించే వాడవు, బంగారు వస్త్రములు ధరించే వాడవు, ఇంక పరాకెందుకు? ఇప్పుడు మమ్ములను కాపాడుటకు నీకు మనసేల కలుగుటలేదు? నీవే శరణన్నాను, నీ పాదపద్మముల భక్తి తప్ప వేరేమీ ఎరుగను, వేగముగా వచ్చి కాపాడుము. మన్మథుని శత్రువైన శివునిచే నుతించబడిన వాడవు, నీ పాదములను సేవించే ఫలము మమ్ములను కాపాడును కదా! పతితులను పావనము చేసే వాడవు, మూడులోకములకు అధిపతివి, మునుల జీవనమైన వాడవు, ఎల్లప్పుడూ మమ్ములను బ్రోచుటకేల ఆలస్యము? మేఘముల వంటి కాంతితో శరీరము గల శ్రీరామా! జనులకు ఆధారము నీవే. పాపములనెడి మేఘములను వాయువు వలె తరిమి కొట్టేవాడవు, శివుని హృదయములో నివసించే వాడవు, ఈ సారములేని సంసార సాగరమందు వేసారి నిన్ను మనసారా నమ్ముకొన్నాను, నిస్సహాయుడైయున్న నన్ను బాధ పెట్టుట ఇంక మర్యాద కాదు శ్రీరామా! మేము నిన్ను నమ్మినవారము, వేగమే వచ్చి మమ్ము రక్షించుము.

- సద్గురువు త్యాగరాజస్వామి

మోహన రాగంలో కూర్చబడిన ఈ కృతి ద్వారా త్యాగరాజస్వామి వారు తాను రామునితో చేసుకున్న విన్నపాలు, ఫిర్యాదులు, వేడుకోలు అన్నీ కలిపి ద్వైత భావనను కురిపించారు. రాముని వైభవాన్ని కొనియాడుతూనే తనను కాపాడటం లేదని కాస్త కినుక కూడా చూపించారు. ఎందరినో  బ్రోచిన నీవు నన్నెలా  బ్రోవవు అన్న భావనను ఈ కీర్తన ద్వారా వ్యక్తపరచారు. అన్నీ వదలి  నిన్ను నమ్ముకున్నాను అని ఆర్తితో నుతించారు. మోహన రాగం ఇటువంటి భావానికి పెట్టిన పేరు. మహారాజపురం సంతానం గారి గాత్రంలో మోహన రాగం మరింత సమ్మోహనంగా ఉంటుంది. ఆయన గాత్రంలో ఈ కృతి వినండి

దేవాది దేవ! సదాశివ! - త్యాగరాజస్వామి కృతి


దేవాది దేవ! సదాశివ! దిననాధ సుధాకర దహన నయన!

దేవేశ! పితామహ మృగ్య! శమాది గుణాభరణ! గౌరీ రమణ!

భవ! చంద్ర కళాధర! నీలగళ!
భాను కోటి సంకాశ! శ్రీశ నుత!
తవ పాద భక్తిం దేహి దీన బంధో!
దర హాస వదన! త్యాగరాజ నుత!

దేవాది దేవా! సూర్య చంద్రాదులు, అగ్ని మూడు కన్నులుగా గల సదాశివా! ఓ పరమేశ్వరా! పార్వతీ పతీ! శమదమాది గుణములచే అలంకరించబడిన నీవు బ్రహ్మ కూడా అందని వాడవు! శివా! చంద్రుని శిరసుపై ధరించి, గరళమును కంఠములో నిలుపుకొని, కోటి సూర్యుల ప్రకాశిస్తూ విష్ణువుచే నుతించబడిన వాడవు. త్యాగరాజునిచే నుతించబడి, చిరునవ్వు ముఖము కలిగిన ఓ దీనబంధో! నీ పదముల యందు భక్తిని నాకు ప్రసాదించుము!

- సద్గురువులు త్యాగరాజస్వామి

తిరువాయూరులో 1986వ సంవత్సరంలో ప్రధాని రాజీవ్ గాంధీ, ముఖ్యమంత్రి ఎంజీఆర్, విదేశాంగమత్రి పీవీ నరసింహారావు గారు ఉన్న సభలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, రాధ విశ్వనాథన్ కలిసి చేసిన కచేరీలో ద్వారం మంగతాయారు గారు వయోలిన్, కేవీ ప్రసాద్ గారు మృదంగం. వీరు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారికి 15 ఏళ్లు మృదంగ సహకారం అందించారు.  ఆ సభలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి-రాధా విశ్వనాథన్ కలిసి ఆలపించిన ఈ కృతి చూడండి. .

భజరే చిత్త బాలాంబికాం - ముత్తుస్వామి దీక్షితుల ఆధ్యాత్మిక సంపద


భజరే చిత్త బాలాంబికాం భక్త కల్ప లతికాం

నిజరూప దాన దక్ష చరణం
అరుణాం నిత్యాం కళ్యాణీం శర్వాణీం

శ్రీ వాగ్భవ కూట జాత చతుర్వేద స్వరూపిణీం
శృంగార కామ రజోద్భవ సకల విశ్వ వ్యాపినీం
దేవీం శక్తి బీజోద్భవ మాత్రృకార్ణ శరీరిణీం
దేవనుత భవ రోగ హర వైద్యపతి హృదయ విహారిణీం
భావ రాగ తాళ మోదినీం భక్తాభీష్ట ప్రదాయినీం
సేవక జన పాలన గురుగుహ రూప ముద్దు కుమార జననీం

ఓ మనసా! భక్తుల పాలిట కల్పతరువైన బాలాంబికను భజింపుము. నిజరూప దర్శన భాగ్యము కలిగించే చరణములు కలిగి, సూర్యకాంతి కలిగి, శాశ్వతమై, శుభకరమైన శర్వుని పత్ని అయిన ఆమ్మను భజింపుము. వాగ్భవ కూట బీజాక్షరములనుండి (లలితాదేవి పంచదశాక్షరీ మంత్రములోని మొదటి ఐదు బీజాక్షరాలైన క ఏ ఈ ల హ్రీం అనే అక్షర సంపుటిని వాగ్భవ కూట అంటారు) జన్మించిన, నాలుగు వేదాల స్వరూపిణి అయిన, శృంగార రూపిణిగా కామ రజో కూట బీజాక్షరములనుండి (పంచదశాక్షరిలోని తదుపరి ఆరు అక్షరాలు హ స క హ ల హ్రీం కామ రజో కూట అంటారు) ఉద్భవించిన, సమస్త లోకములు వ్యాపించియున్న బాలాంబికను భజించుము. శక్తి కూట బీజాక్షర సంపుటి నుండి (పంచదశాక్షరిలోని తదుపరి నాలుగు బీజాక్షరాలు స కల హ్రీం శక్తి కూటగా అంటారు) జన్మించిన, ఈ విధంగా అక్షరమాలా శరీరిణి అయిన దేవిని భజింపుము. దేవతలచే నుతించబడిన, ఈ దేహరోగములను హరించే వైద్యనాథుని హృదయ విహారిణి అయిన, భావము, రాగము, తాళములచే మోదము పొందే, భక్తుల కామ్యములను ప్రసాదించే అమ్మను భజించుము. సేవించే జనులను పాలిచించే, గురుగుహ రూపమైన కుమారస్వామి జనని అయిన బాలాంబికను భజింపుము.

- ముత్తుస్వామి దీక్షితుల వారు

దీక్షితుల వారు గొప్ప శ్రీవిద్యా ఉపాసకులు. మంత్ర సిద్ధి ద్వారా అమ్మ అనుగ్రహం పొందిన ఆధ్యాత్మిక సంపన్నులు. ఈ సాధనలోనే ఆయన అద్భుతమైన కీర్తనలు రచించారు. ఆయన కృతులలో మంత్ర శాస్త్రం ప్రకాశిస్తూ ఉంటుంది. బీజాక్షర యుతమై, లలితాసహస్ర నామావళి తత్వార్థ ప్రస్ఫుటమై ఉంటాయి. గురుగుహ అనే ముద్రతో ఆయన కీర్తనలు గుర్తించబడతాయి. కుమారస్వామిని గురుగుహునిగా కొలుస్తారు. దీక్షితుల వారు తనను ఆ అమ్మ తనయునిగా భావించి కొలిచి అనుగ్రహం పొందిన వాగ్గేయకారులు.  ఆయన రచించిన కమలాంబ నవావరణ కీర్తనలు, క్షేత్ర ప్రాధాన్యమైన కృతులు, నవగ్రహ కృతులు ఈ ఆధ్యాత్మిక సంపదతో నిండినవే. అటువంటిదే ఈ బాలాత్రిపురసుందరి కృతి. లలితాదేవి తత్వాన్ని ఆవిష్కరించే ఈ కృతిలో పంచదశాక్షరీ మంత్ర సంపుటిలోని బీజాక్షరాలను ప్రస్తావించే వాగ్భవ, కామ రజో, శక్తి కూటములను ప్రస్తావించి ఆయన తన మంత్రశాస్త్ర జ్ఞానాన్ని మనకు తెలియజేశారు. అంతే కాదు అమ్మ మహిమా వైభవాలను కూడా చక్కగా నుతించారు. కళ్యాణి రాగం అత్యంత శుభకరమైనది, ఆహ్లాదకరమైనది. గుణ వైభవ వర్ణనలకు ఈ రాగం ఎంతో ఉపయుక్తమైనది. భావయుక్తమైన పదాలతో, ఆధ్యాత్మిక ప్రాధాన్యమున్న చరణంతో దీక్షితుల వారు తన శ్రీవిద్యా ఉపాసనా బలానికి అక్షర రూపం ఇచ్చారు. తమిళనాడులోని అరియలూరు జిల్లాలోని కామరసవల్లిలో పార్వతీపరమేశ్వరులు సనాతనులై వెలసిన క్షేత్రం కర్కోటేశ్వర-బాలాంబిక దేవస్థానం. తిరువాయూరుకు ఉత్తరంగా కావేరీ నదికి ఆవల ఉన్న క్షేత్రం ఇది. వేళ ఏళ్ల చరిత్ర కలిగిన ఈ క్షేత్రంలో బాలాత్రిపురసుందరిగా అమ్మ కొలువబడుతుంది. ఆ అమ్మను నుతిస్తూ దీక్షితుల వారు ఈ కృతిని రచించారు.

యేసుదాసు గారి గళంలో ఈ భజరే చిత్త బాలాంబికాం వినండి.