RightClickBlocker

26, ఆగస్టు 2017, శనివారం

నీ లీల పాడెద దేవా - జానకమ్మ గీతం మరియు చిత్ర విశేషాలు
నీ లీల పాడెద దేవా - 1962లో విడుదలైన మురిపించే మువ్వలు చిత్రంలో జానకమ్మ పాడిన అద్భుత గీతం. తమిళంలో కొంజుం సాలంగై అనే చిత్రం డబ్బింగ్ ఈ చిత్రం. సంగీత దర్శకులు ఎస్.ఎం. సుబ్బయ్య నాయుడు గారు. నాయకుడు జెమినీ గణేశన్, నాయిక మహానటి సావిత్రి. సింగార వేలనే దేవా అనే పాటకు ఎవరు నాదస్వరానికి దీటుగా పాడగలరు అని సుబ్బయ్యనాయుడు గారు ఆలోచిస్తూ అప్పటి గాయనీమణులను అడిగితే పి. లీల గారు నాదస్వరం స్థాయి స్వరాలను పాడగలిగే గాత్రం జానకమ్మ గారికి ఉందని వారి పేరును సుబ్బయ్య నాయుడు గారికి ప్రతిపాదించారుట.  అంతే. ఓ అద్భుతం ఆవిష్కరించబడింది. ఊహించలేని గమకాలు, ఆ వేగం. సంగీతం పెద్దగా ఏమీ నేర్చుకోని శిష్ట్లా జానకమ్మ గారి గాత్రంలో నాదస్వర స్థాయికి దీటైన స్వరాలు పలికాయి. ఆ గీతం అజరామరమైంది. తమిళంలో వచ్చిన సింగార వేలనే దేవా అన్న పాటను ఆరుద్రగారు తెలుగులోకి నీ లీల పాడెద దేవా అని అనువదించారు. సుబ్బయ్య నాయుడు గారు శ్రీరాములు నాయుడు గారి పక్షిరాజా స్టూడియోలో పని చేసేవారు. తమిళ సినీ పరిశ్రమలో తొలి సంగీత దర్శకులు వీరు. ఎమ్మెస్ విశ్వనాథన్ గారు వీరి శిష్యులు. అరుణాచలం గారు ప్రఖ్యాత నాదస్వర విద్వాంసులు టీఎన్ రాజరత్నం పిళ్లై గారి శిష్యులు. ఈ చిత్రంలో నాదస్వరం వాయించే సమయానికి ఆయన వయసు 41 సంవత్సరాలు. తరువాత రెండేళ్లకే ఆయన మరణించారు.


కొంజుం సాలంగై రాజుల కాలం నాటి కథ. ఈ చిత్రంలో భరత నాట్య నృత్యాంశాలు కూడా ప్రత్యేకం. నర్తకీమణులు కమలా లక్ష్మణ్, కుచలకుమారి గార్ల మధ్య పోటీగా సాగే నృత్య గీతం ఈ చిత్రానికి మరో ముఖ్యాంశం. జానకమ్మ గారి పాటను ముంబై రామన్ స్టూడియోలో రికార్డు చేయగా అరుణాచలం గారి నాదస్వరాన్ని చెన్నైలో రికార్డు చేశారు. సాంకేతికంగా పెద్దగా వసతులు లేకపోయినా రెండిటినీ అద్భుతంగా మిక్స్ చేసి ఓ రసగుళికను ఆవిష్కరించారు సుబ్బయ్యనాయుడు గారు. కొంజుం సాలంగై అద్భుతమైన సంగీతానికి, నృత్యాలకు, కళ్లకు మిరుమిట్లు గొలిపే సెట్లకు ప్రసిద్ధి. మంచి విజయం సాధించిన ఈ చిత్రం మహానటి సావిత్రి 100వ చిత్రం కావటం విశేషం. ఈ చిత్రం పోలిష్ భాషలో కూడ విడుదలైంది. ఈ చిత్రంలో సుశీలమ్మ, లీలమ్మ, సౌందర్‌రాజన్ గారు, రాధ-జయలక్ష్మి, శూలమంగళం రాజ్యలక్ష్మి గార్లు కూడా పాడారు. ఆద్యంతం సంగీత నృత్య ఘట్టాలతో సాగే 3 గంటల రసరమ్య కావ్యం కొంజుం సాలంగై.ఇటువంటి ప్రయోగాన్నే 1969లో విడుదలైన హిందీ చలన చిత్రం సచ్చాయీలో ఆశాభోస్లే గానంలో తిరుచెరై శివసుబ్రహ్మణ్య పిళ్ల్లై గారు నాదస్వరం వాయించగా మోరే సైయ్యా పక్డే బైయ్య అన్న గీతంగా చిత్రీకరించారు. దీనికి సంగీత దర్శకులు శంకర్ జైకిషన్.నీ లీల పాడెద దేవా ఆభేరి రాగంలో కూర్చబడింది. వల్లీదేవసేనా సమేతుడైన సుబ్రహ్మణ్య స్వామిని నుతించే గీతం ఇది. జానకమ్మ ప్రతిభను శాశ్వతం చేసిన గీతం ఇది. అవలీలగా పాడేశారు ఆవిడ. క్లిష్టమైన సంగతులు కలిగిన ఈ గీత సాహిత్యము.


ఆ ఆ ఆ ఆ
నీ లీల పాడెద దేవా
మనవి ఆలించ వేడెద దేవా
నను లాలించు మా ముద్దు దేవా

నీ లీల పాడెద దేవా
నీ లీల పాడెద దేవా

సింధూర రాగంపు దేవా
 ఆ ఆ ఆఆ  ఆ ఆ ఆ ఆఆ
దివ్య శృంగార భావంపు దేవా
వల్లి చెలువాలు నిను కోరు నీవు రావా
ఎలమి నీ లీల పాడెద దేవా

అనుపమ వరదాన శీల ఆ
అనుపమ వరదాన శీల
వేగ కనుపించు కరుణాలవాల
ఎలమి నీ లీల పాడెద దేవా

నీ లీల పాడెద దేవా
నను లాలించు నా ముద్దు దేవా
నీ లీల పాడెద దేవా
నీ లీల పాడెద దేవా
సగమపని నీ లీల పాడెద దేవా
నిసనిదపమ గామగరిసని పానిసగమపా మగరిస నిదమప గరిని
నీ లీల పాడెద దేవా

సా రీ సా నిసరిసా నినిస పపనినిసా మమపపనినిసా గగస గగస నినిస పపని మమప గగమమపపనినిసస గరిని
పా నిదపమగరిసని సగగసగగ సగమప గరిసని సగసా
నినిప మమప నీపనీప సాపనీపసా నిదపమగరి సగసా
గామపనిసా నిసగరిసరిని సాసనీ నిసదని సాసని
గరిని గరిగ నిరిగరి నిగరిని
నిరిని నిసస నిరిని నిసస నిదప
నిరినిసా ఆ ఆ ఆ ఆ
రినీసపానిసాపసామపనిసరీ ఆ ఆ ఆ
సానిపాని సాసనీ సాసనీ
పానిపస పానిదనీ మాదనిపానిదనీసరిసా
పానిదనిసరిసా మగాపమ
సాసరిని నీసరిపా సాసని సాససాససాస సరి గరిసని సరిగరిస
రిసనిదపా పనిమప సనిదపమ పమగరి సగమప పనిమప సనిదనిపనిప పనిమప గరినిసదనిమపని

దక్షిణ భారత మీరా - గాయని వాణీ జయరాం గారి విశేషాలుఆమె రూపం నిండైన వ్యక్తిత్వానికి నిలువుటద్దం. ఆమె గానం సమ్మోహనం. ఆమె గళంలో భక్తి, రక్తి అంతే మధురంగా పండుతాయి. "పూజలు చేయ పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను..." - పాట ఆమె గళంలో వింటే సప్తస్వరాలను సరస్వతీ దేవి పలికించినట్లే ఉంటుంది. ఆ స్వామి గుడి తలుపులు తీయవలసిందే. "తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ" అంటే ఆ సూర్యనారాయణుడు వెనువెంటనే ఒప్పుకోవలసిందే. "ఆనతినీయరా హరా" అంటే ఆ హరుడు అనుమతి ప్రసాదించి తీరాలి. "బోల్ రే పపీహరా" అని పాడితే ఆ వసంతకోకిల మన ఎదుట నిలిచి పలుకవలసిందే. "మానస సంచరరే" అనే కృతి పాడితే ఆ శ్రీకృష్ణుడు ఆమె మదిలో నిలిచి తీరుతాడు. "ఒక బృందావనం సోయగం" అని వలపు గీతమాలపిస్తే పాడితే యువత ఉర్రూతలూగారు. ఆ స్వరరాణి కలైవాణి నుండి వాణీ జయరాంగా పేరొందింది.  ఆ మధుర గాయని వివరాలు ఈ బ్లాగుపొస్టులో.

30 నవంబర్ 1945వ సంవత్సరంలో మద్రాసు రాష్ట్రంలోని వెల్లూరులో జన్మించిన కలైవాణికి ఐదుగురు సోదరీమణులు, ముగ్గురు సోదరులు. తల్లి పద్మావతి కర్నూలులో జన్మించినవారు కావటంతో తెలుగులో పాడటం అలవాటైంది. ఆవిడే వాణి గారి తొలి గురువు. తల్లి రంగరామానుజ అయ్యంగార్ వారి వద్ద సంగీత శిక్షణ పొందారు. ఆయన వద్దే వాణిని తల్లి కర్ణాటక సంగీత శిక్షణ కోసం చేర్పించారు. అయిదేళ్ల వయసులోనే ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తనలు అపూర్వమైన రాగాలలో వాణి నేర్చుకుని పాడగలిగారు. తరువాత కడలూరు శ్రీనివాస అయ్యంగారు గారి వద్ద కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్నారు. వెల్లూరులో నాలుగవ తరగతి వరకు చదువుకున్న తరువాత వాణి గారికి మరింత మంచి సంగీత శిక్షణ ఇప్పించేందుకు వారి కుటుంబం చెన్నైకి తరలి వెళ్లారు. అక్కడ వాణి ప్రఖ్యాత సంగీత విద్వాంసులు జీఎన్ బాలసుబ్రహ్మణ్యం గారికి శిష్యులైన టీఆర్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. ఎన్నో జీఎన్‌బీ కృతులపై పట్టు సాధించారు. తరువాత శెమ్మంగూడి శ్రీనివాస అయ్యరు గారి శిష్యులైన ఆరెస్ మణి గారి వద్ద స్వాతి తిరునాళ్ కీర్తనలు నేర్చుకున్నారు. ఎనిమదవ ఏటనే ఆకాశవాణి మద్రాసులో పాడారు. పదేళ్ల వయసునుండే పూర్తి స్థాయి కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీలు చేశారు. చిన్ననాటి నుండే హిందీ సినీ గీతాలంటే ఎంతో మక్కువ కలిగిన వాణి గారు స్కూలులో 22 వేర్వేరు కళలతో బహుముఖ ప్రజ్ఞ కలిగిన విద్యార్థిగా అవార్డును పొందారు. బీఏ ఎకనామిక్స్ చదువ్తున్నప్పుడు కళాశాలల స్థాయిలో డిబేట్ కార్యక్రమాలలో బహుమతులు పొందారు.  చదువు పూర్తైన తరువాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మద్రాసు బ్రాంచిలో ఉద్యోగంలో చేరారు. తరువాత 1967లో ఉద్యోగరీత్యా హైదరాబాదుకు బదిలీ చేయబడ్డారు. కొన్నాళ్లకే జయరాం గారిని వివాహం చేసుకున్నారు. వివాహానంతరం ముంబై వెళ్లారు.

ముంబైలో వాణి గారు భర్త జయరాం గారి ప్రోద్బలంతో పాటియాలా ఘరానాకు చెందిన ఉస్తాద్ అబ్దుల్ రెహ్మాన్ ఖాన్ గారి వద్ద హిందూస్తానీ శాస్త్రీయ సంగీత శిక్షణను పొందారు. ఆ సమయంలోనే గురువు గారి సలహాతో బ్యాంకు ఉద్యోగానికి స్వస్తి చెప్పి పూర్తి స్థాయి సంగీత సాధనకు తన సమయాన్ని అంకితం చేశారు. అప్పుడు ప్రఖ్యాత సంగీత దర్శకులు వసంత్ దేశాయి గారు ప్రఖ్యాత గాయకులు కుమార గంధర్వ గారితో ఒక మరాఠీ ఆల్బం చేస్తున్నారు. ఆ ఆల్బంలో గంధర్వ గారితో కలిసి రుణానుబంధచ అనే గీతం వాణీ జయరాం పాడారు. 1971వ సంవత్సరం వాణీ జయరాం గారి జీవితంలో ఓ ముఖ్యమైన మైలురాయి. హృషీకేశ్ ముఖర్జీ గారి దర్శకత్వంలో వచ్చిన గుడ్డీ అనే చిత్రంలో వసంత దేశాయి గారు వాణీ జయరాం గారికి అవకాశం ఇచ్చారు. ఆ చిత్రంలోని బోల్ రే పపీహరా, హరి బినా కైసే జీయూ, హంకో మన్ కీ శక్తి అనే పాటలు అద్బుత విజయం సాధించాయి. వాణీ జయరాం గారికి తాన్సేన్ సమ్మాన్ అవార్డు, బెస్ట్ ప్రామిసింగ్ సింగర్ అవార్డు, ఆలిండియా సినీగోయర్స్ అవార్డు పొందారు. ఈ పాటలు ఇప్పటికీ సంగీతాభిమానుల హృదయాలలో నిలిచే ఉన్నాయి. 1972లో హిందీలో ఎంతో పేరొందిన మీనాకుమారి గారి పాకీజా చిత్రంలో నౌషాద్ గారి సంగీతంలో మోరా సాజన్ అనే పాట పాడారు.  తెలుగు సినీ చిత్రాలలో తొలి అవకాశం 1973లో అభిమానవంతులు చిత్రానికి ఎస్పీ కోడండపాణి గారి సంగీతంలో వెంపటి చిన సత్యం గారు నృత్య దర్శకత్వంలో ప్రముఖ కూచిపూడి నర్తకి శోభానాయుడు గారు నర్తించగా ఎప్పటివలె కాదురా అన్న జావళిని వాణీజయరాం గారు పాడారు. హిందీలో చిత్రగుప్త, మదన్‌మోహన్, ఓపీ నయ్యర్, ఆర్డీ బర్మన్, జైదేవ్, కళ్యాణ్‌జీ-ఆనంద్‌జీ, లక్ష్మీకాంత్-ప్యారేలాల్  మొదలైన మహామహులైన సంగీత దర్శకుల వద్ద పాడారు. మహమ్మద్ రఫీ, ముకేశ్, మన్నా డే, కిశోర్ కుమార్, ఆశా భోస్లే గార్లతో యుగళ గీతాలు పాడారు. 1974 ప్రాంతంలో ముంబై నుండి చెన్నై వచ్చి తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ సినిమాలలో గాయనిగా స్థిరపడ్డారు.

1974లో విడుదలైన అమ్మాయిల శపథం అనే చిత్రంలో నీలి మేఘమా జాలి చూపుమా అనే గీతం వాణీ జయరాం గారి తెలుగు సినీ ప్రస్థానంలో మెరిసిన గీత రాజం. 1975లో విడుదలైన కే బాలచందర్ గారి తమిళ చిత్రం అపూర్వ రాగంగళ్‌లో ఎమ్మెస్ విశ్వనాథన్ గారి సంగీతంలో పాడిన పాటలకు వారికి తమిళంలో ఉత్తమ గాయనిగా జాతీయస్థాయి అవార్డును పొందారు. 1978వ సంవత్సరంలో విడుదలైన మల్లెపూవు చిత్రంలో చక్రవర్తిగారి సంగీత దర్శకత్వంలో నువ్వు వస్తావని బృందావని అన్న అద్భుతమైన ఆరుద్ర గారి పాటను పాడారు. అదే సంవత్సరంలో వచ్చిన మరోచరిత్ర అనే బాలచందర్ గారి మరో చరిత్ర చిత్రంలో ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీతంలో విధి చేయు వింతలెన్నో అనే అద్భుతమైన పాటను పాడారు. అదే సంవత్సరంలో తెలుగులో వయసు పిలిచింది అనే చిత్రంలోని నువ్వడిగింది ఏనాడైనా వద్దన్నానా అనే గీతం వాణీ జయరాం గారి విలక్షణమైన గీతాలలో ఒకటి. 1979లో విడుదలైన మీరా అనే హిందీ చలనచిత్రం వాణీ జయరాం గారి సినీ జీవితంలో మరచిపోలేని మైలురాయి. పండిట్ రవిశంకర్‌గారు ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించగా 12 మీరా భజనలను వాణీ జయరాం గారు పాడారు. మోరేతో గిరిధర్ గోపాల అనే గీతానికి 1980వ సంవత్సరానికి ఉత్తమ గాయనిగా ఫిలింఫేర్ అవార్డు పొందారు. అలాగే 1979లో విడుదలైన కే విశ్వనాథ్ గారి ఆణిముత్యం శంకరాభరణంలో పాటలకు తెలుగులో ఉత్తమ గయని అవార్డును పొందారు. బ్రోచేవారెవరురా, మానస సంచరరే, దొరకునా ఇటువంటి సేవ వంటి అద్భుతమైన గీతాలను కేవీ మహాదేవన్ గారి దర్శకత్వంలో పాడారు. 1979లోనే కే బాలచందర్ గారి దర్శకత్వంలో విడుదలైన గుప్పెడు మనసు చిత్రంలో ఎమ్మెస్ విశ్వనాథన్ గారి సంగీతంలో బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి నేనా పాడనా పాట అన్న విలక్షణమైన గీతాన్ని గానం చేశారు. 1981లో విడుదలైన సీతాకోక చిలుక చిత్రం వాణీ జయరాం గారికి ఎంతో పేరు తెచ్చింది. ఇళయరాజా గారి సంగీతంలో మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా, అలలు కలలు, సాగర సంగమమే అన్న సంగీత ప్రధానమైన ప్రేమ గీతాలు ఎంతో ప్రజాదరణ పొందాయి.1980వ దశకంలో ఇళయరాజా వంటి ప్రముఖ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఎన్నో తమిళ తెలుగు చిత్రాలలో వాణీ జయరాం గారు పాడారు. తరువాతి కాలంలో వాణీ జయరాం గారికి తెలుగు సినీ జగత్తులో పేరు రావటానికి ప్రధాన కారణం కళాతపస్వి విశ్వనాథ్ గారి చిత్రాలే. 1987లో విడుదలైన శృతిలయలు చిత్రంలో కేవీ మహాదేవన్ గారి సంగీతంలో ఇన్నిరాశుల యునికి (బాలు గారితో), ఆలోకయే శ్రీబాలకృష్ణం, శ్రీ గణనాథం భజామ్యహం (పూర్ణచందర్ గారితో) అనే పాటలు తెలుగు సినీ అభిమానుల నోట మారు మ్రోగాయి. 1988లో విడుదలైన స్వర్ణ కమలం చిత్రంలో ఇళయరాజా గారి సంగీతంలో బాలుగారితో కలసి వాణీ జయరాం గారు పాడిన అందెల రవమిది పదములదా అనే గీతం ఎంతో ప్రజాదరణ పొందింది. భానుప్రియ గారి నాట్యకౌశలానికి వాణీ జయరాం గారి గానం వన్నె తెచ్చింది. 1991లో బాపు గారి చిత్రం పెళ్లి పుస్తకంలో త్యాగరాజస్వామి వారి జగదానంద కారక అనే కృతిని పాడారు. 1992లో విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన స్వాతి కిరణం చిత్రం వాణీ జయరాం గారి తెలుగు సినీ నేపథ్య గాన ప్రస్థానంలో పతాక స్థాయి అనుకోవచ్చు. ఆ చిత్రంలో ఆనతినీయరా హరా అనే పాటకు వారికి జాతీయ స్థాయిలో ఉత్తమ గాయానిగా అవార్డు వచ్చింది. ఈ చిత్రంలొ వారు పాడిన తెలిమంచు కరిగింది, ప్రణతి ప్రణతి, శివాని భవాని, జాలిగా జాబిలమ్మ, వైష్ణవి భార్గవి, కొండ కోనల్లో పాటలు అనే పాటలు అజరామరమై నిలిచాయి. మొత్తం మీద విశ్వనాథ్ గారి చిత్ర గీతాలతో వాణీ జయరాం గారికి ఎంతో పేరు ప్రతిష్ఠలు వచ్చాయి. 1980,90 దశకాలలో తెలుగు తమిళ భాషలలో ఎన్నో అద్భుతమైన సినీ గీతాలను వాణీ జయరాం గారు పాడారు.

జాతీయ స్థాయిలోనే కాకుండా, గుజరాతీ, ఒడియా, తమిళ, తెలుగు భాషలలో ప్రాంతీయ స్థాయి ఉత్తమగాయని అవార్డులను పొందారు. కలైమామణి, సంగీత పీఠ్ సమ్మాన్, తమిళనాడు ప్రభుత్వం వారి ఎం కే త్యాగరాజ భాగవతార్ జీవన సాఫల్య పురస్కారం, ఇలింఫేర్  జీవన సాఫల్య పురస్కారం, కాముకర అవార్డు, సుబ్రహ్మణ్య భారతి అవార్డు, రేడియో మిర్చి మరియు రెడ్ ఎఫెం జీవన సాఫల్య పురస్కారం, ఘంటసాల జాతీయ పురస్కారం, దక్షిణ భారత మీరా అవార్డు మొదలైన ఎన్నో పురస్కారాలను, గుర్తింపులను పొందారు. సినీ గీతాలే కాకుండా ఎన్నో భక్తి గీతాలను, లలిత గీతాలను ఆలపించారు. దూరదర్శన్‌లో కూడా పాడారు. వీరు పాడిన లక్షీ, దుర్గా స్తోత్రాలు, స్కంద షష్టి కవచం, శృంగేరి శారదాదేవి గీతాలు, పరాశక్తి గీతాలు మొదలైనవి ఎంతో పేరు పొందాయి. భారత దేశంలో ఉన్న దాదాపు ముఖ్యమైన భాషలన్నిటిలోనూ వాణీ జయరాం గారు 8000కు పైగా పాటలు పాడారు. వీరి భర్త జయరాం గారు సితార్ విద్వాంసులు. నిరాడంబరమైన జీవితం క్రమశిక్షణతో జీవిస్తున్న వాణీ జయరాం గారు తనకు ఇష్టమైన పాటలలో ఒకటిగా మొరటోడు చిత్రంలోని హే కృష్ణా మళ్లీ నీవే జన్మిస్తే అన్న గీతాన్ని పేర్కొన్నారు. గానానికి భాషాజ్ఞానం చాలా ముఖ్యమని భావిస్తారు వాణీ జయరాం గారు. ప్రేమలేఖలు చిత్రంలోని ఈరోజు మంచిరోజు అని సుశీలమ్మ గారితో కలసి అద్భుతంగా పాడిన గీతం వాణీజయరాం గారి ఇష్టమైన మరో పాట. క్యాన్సర్ ఆసుపత్రులలో, అనాథాశ్రమాలలో పాటలు పాడి ప్రేమను పంచుకునే మనస్తత్వం వారిది. కర్ణాటక సంగీతంలో పరిశోధన చేసి కొత్త కొత్త విషయాలను వెలుగులోకి తీసుకు వస్తున్న విదుషీమణి వీరు. దొరకునా ఇటువంటి సేవ అన్న త్యాగయ్య భావనను వేటూరి గారు శంకరాభరణంలో గుర్తు చేయగా వాణీ జయరాం గారు పవిత్రమైన నాద సాధనతో కొనసాగిస్తున్నారు. వారి సంగీత ప్రస్థానం ఇలాగే వైభవంగా ఓ యజ్ఞంలా సాగాలని ప్రార్థన. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.

వాణీ జయరాం గారికి జాతీయ స్థాయి అవార్డును తెచ్చిపెట్టిన  ఆనతినీయరా హరా (స్వాతి కిరణం - 1992) గీతం వీక్షించండి.

20, ఆగస్టు 2017, ఆదివారం

నా కోసం - కథానిక"యమునా తీరమున సంధ్యా సమయమున వేయి కనులతో రాధా వేచియున్నది కాదా!"...అరవై ఐదేళ్ల రామారావు శ్రావ్యంగా పాడుతూ భార్య కనకం దగ్గరకు వచ్చి "వేయి కనులతో కనకం వేచియున్నది కాదా" అని ఆమె చెంగు లాగుతూ పాడాడు. "ఇదిగో! మా అమ్మా నాన్న ఎంచక్కా కనకమహాలక్ష్మి అని పేరు పెట్టి మహాలక్ష్మి అని పిలుచుకునే వాళ్లు. నేను పుట్టాక మా నాన్నకు వ్యాపారంలో బోలెడు కలిసి వచ్చిందిట. పెళ్లయ్యాక మీ పుణ్యమా అని నా పేరు మోటుగా కనకం చేసేశారు...మహాలక్ష్మీ అని పిలవకూడదూ"...అంది. "కనకం! పెళ్లై 38 ఏళ్లు అయ్యింది. ఇప్పుడు కొత్తగా నీ పేరు మహాలక్ష్మి అని ఎలా పిలవను? నా పాలిట బంగారం నువ్వు. అందుకే కనకమే నాకిష్టం" అని నవ్వుతూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. "అబ్బో! ఈ మాటలకేమి? పోనీలేండి. నా పేరు మీకు మంచి చెస్తే మనకు మంచి చేసినట్లే కదా!" అని నవ్వుతూ భర్త కళ్లలోకి చూసింది. "ఏవండీ! పిల్లలు దూరంగా ఉన్నారు, మీరు రిటైర్ అయ్యారు. ఇదివరకంటే వాళ్ల అవసరాలు, మీ అవసరాలలో నా జీవితం తీరిక లేకుండా ఉండేది. ఇప్పుడు పెద్దగా పని ఉండటం లేదు. పిల్లల దగ్గరకు వెళ్లి ఉండే వయసు కాదు. వాళ్ల సంసారాల్లో వాళ్లు నిలదొక్కుకొని స్వతంత్రంగా ఉండవలసిన సమయం. మనం ఎక్కువ జోక్యం చేసుకోకూడదు. అందుకనే నా ఆలోచనలలో, నా జీవితంలో ఓ పెద్ద అగాథంలా ఉంది ఈ ఖాళీ సమయం. రోజు చాలా భారంగా గడుస్తోంది..." అని నిట్టూర్పుగా అంది కనకం.

"నిజమే కనకం! ఇన్నేళ్ల నుండి పిల్లల పెంపకం, నా అభివృద్ధి అనే సుదీర్ఘ సేవలో నీ సమయమంతా గడిచిపోయింది. నువ్వన్నట్లు పిల్లలు వాళ్ల జీవితాలు వాళ్లు వెళ్లబుచ్చుతున్నారు. మన ప్రమేయం ఇప్పుడు అనవసరం. ఏదో పిల్ల పాప అవసరానికి వెళ్లటం తప్ప ఇప్పుడప్పుడే మనం వాళ్లతో కలిసి జీవించకపోవటమే అందరికీ మంచిది. మనం ఎంత నవీన దృక్పథంతో ఉన్నామనుకున్నా, తరాల మధ్య అంతరం ఉంటుంది. మన ఆలోచనలు, చేసే పనులు వాళ్లకు నచ్చక పోయే అవకాశమే ఎక్కువ...." అని అన్నాడు. "కనకం! నిన్న వాకింగ్ చేస్తున్నపుడు వేంకటేశ్వర్లు గారితో సంభాషణల్లో నేను నా జీవితంలో కొన్ని తప్పులు చేశాను అని అర్థమైంది. నేను, నా ఉద్యోగాభివృద్ధి, పరపతి మీద ధ్యాసతో నీ ఆశలు, ఆశయాలను విస్మరించాను. నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది, నీకు కూడా జీవితంలో తృప్తిగా ఏదో ఒకటి సాధించాలని ఉంటుంది అని ఆలోచించలేకపోయాను. నన్ను క్షమించు" అని కళ్లలో నీళ్లు నిండగా అపరాధ భావనతో కనకం చేతులు పట్టుకున్నాడు. తన మనసులో ఉన్న వేదనకు మూల కారణం భర్త గ్రహించి అంత తొందరగా, అంత పరిపూర్ణంగా స్పందిస్తాడని ఊహించని కనకం కరిగి పోయింది. "ఏమండీ! నిజమే! నాకు కూడా జీవితంలో ఏదో సాధించాలి అన్న భావన ఎన్నో ఏళ్లు ఉండేది. కొన్నేళ్లు మరుగున పడిపోయినా మళ్లీ ఇప్పుడు అది చిగురెత్తి నన్ను ప్రశ్నిస్తోంది. ఆ మాట మీతో చెప్పలేక అగాథంలా ఉంది అన్నాను. మీరు నా మనసులోని మాట కనుక్కున్నారు. గతం గురించి అనవసరం. మీరు కావాలని చేయాలేదు కదా!! మీరు పిల్లలు నా జీవితంలో మూడింట నాలుగ వంతు. మిగిలిన ఆ పావు భాగాన్ని ఇప్పటికైనా నా స్వావలంబనకు ప్రతిబింబంగా చేసుకొవాలని, నా ఆశయాలకు మార్గదర్శకంగా ఉండాలని మనసు పరి పరి విధాలుగా కోరుకుంటోంది..." అంది కనకం.

"కనకం! ఓ వారం సమయం తీసుకో. నీకు ఏమి చేయాలనుందో, ఏమి చేస్తే నీ మనసులోని వెలితి కొంతైనా పూడుతుందో బాగా ఆలోచించి నాకు చెప్పు. మనకున్న ఆర్థిక పరిమితులలో నేను తప్పకుండా నీ ఆశయాలను నెరవేర్చటానికి వందశాతం నా వంతు ప్రయత్నం చేస్తాను" అన్నాడు రామారావు. కనకం ఆలోచనలో పడింది. "ఏదో సాధిద్దాము అనే కానీ, ఏమి సాధించాలో తెలియదే. బాధ్యతల సాగరం దాటే సరికి అస్తిత్వమే కోల్పోయానా ఏమిటి?" అని గాభరా పడింది. అంతలో సర్దుకొని తన మాతృత్వపు మధురిమలు, రామారావు భార్యగా పొందిన గుర్తింపు నెమరు వేసుకొని కర్తవ్యం గురించి మనసు దృఢపరచుకుంది.

మర్నాడు కనకం అమీర్‌పేట్ షాపింగుకు వెళ్లింది. అక్కడ రోడ్డు మీద నడుస్తుంటే తన వయసు మనిషే ఎదురై "మీ పేరు కనకమహాలక్ష్మి కదూ!" అని అడిగింది. ఎవరో వెంటనే గుర్తుపట్టని కనకం "అవునండీ! మీరు?...". "నేను పీయుసీలో క్లాస్స్మేట్ వనజను" అంది. "వనజా! నువ్వా! ఎంతలా మారిపోయావ్? అసలు గుర్తుపట్టలేకపోయాను. ఎన్నేళ్లయ్యింది...." అని సంభ్రమంగా అంది కనకం. "నువ్వు మాత్రం అలాగే సన్నగా రివటలా ఉన్నావే అందుకే గుర్తుపట్ట గలిగాను" అంది. ఆ తరువాత ఇద్దరు పిచ్చాపాటీ, అలనాటి కబుర్లు ఓ గంటసేపు. మాటల మధ్యలో వనజ "అవునూ! నీకు గుర్తుందా? ఎన్సీసీలో నీకు మంచి పేరొచ్చింది. నీకు సర్టిఫికేట్ ఇస్తూ నువ్వు దేశసేవ చేయాలమ్మా అని ఆనాడు ముఖ్య అతిథి అన్నారు. ఏమైనా సేవ చేయగలిగావా లేక పతి-బిడ్డల సేవేనా" అంది. కనకానికి అసలు తాను ఎన్సీసీ శిక్షణ పొందినట్లు, అందులో తనకు విశిష్ట పతకం లభించినట్లు అసలు గుర్తే లేదు. తన జీవితంలో అంత ముఖ్యమైన ఘట్టం ఎలా మరచాను అనుకుంది. ఓ రెండు గంటల ఆత్మీయ సంభాషణ తరువాత "వనజా! మేము కూకట్‌పల్లిలో ఉంటాము. తప్పకుండా మా ఇంటికి రా. టచ్‌లో ఉందాము" అని చిన్ననాటి స్నేహితురాలిని ఆలింగనం చేసుకొని ఇంటికి తిరిగి వెళ్లింది.

రాత్రికి కనకంలో అంతర్మథనం తీవ్రమైంది. ఆలోచనా తరంగాలు ఓ నలభై ఏళ్లు వెనక్కి వెళ్లాయి. తాను పీయుసీ చదివే రోజులు అవి. ఎంతో ఉత్సాహంగా, దేశమంటే అత్యున్నత భావాలు కలిగి, దేశభక్తి గీతాలు పాడుతూ, కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ ఉన్నప్పుడు మహిళా క్యాడెట్‌గా ఎన్సీసీలో చేరాలని ప్రగాఢమైన కోరిక. కాలేజీలో డ్రిల్ మాష్టారు సత్యం గారు కూడా కనకాన్ని ఎన్సీసీలో చేరటానికి ప్రోత్సహించారు. ఇంట్లో అమ్మనాన్న ఒప్పుకోలేదు. వారికి చెప్పకుండా ఎన్సీసీలో చేరింది. తరువాత ఇంట్లో తెలిసి తిట్టినా మౌనంగా భరించింది. "ఆడపిల్లవు, చదువు పూర్తి కాగానే పెళ్లి చేసుకొని సుఖంగా ఉండక ఈ దేశసేవ నీకెందుకు చెప్పు? " అని వాళ్లు నీరుగార్చటానికి ప్రయత్నించినా గట్టిగా పట్టు పట్టి ఎన్సీసీ శిక్షణ మంచి గుర్తింపుతో పూర్తి చేసింది. నాన్న గారి ఆర్థిక పరిస్థితులు, ఇంట్లో ఇంకా పెళ్లి కావలసిన నలుగురు ఆడపిల్లలున్న సంసారం వలన చదువు పీయూసీ పూర్తవుతూనే వివాహం చేసుకుంది కనకం. ఇన్నాళ్లకు మళ్లీ తనకు అ విషయం గుర్తుకు చేసినందుకు వనజకు మనసులో కృతజ్ఞతలు తెలుపుకుంది. తనకు భర్త ఇచ్చిన వారం రోజుల సమయంలోపే తన ఆలోచనలను దృఢ పరచుకుంది.

"ఏవండీ! మానవ సేవే మాధావ సేవ అని ఎందరో పెద్దలు చెప్పారు. ఇన్నాళ్లూ నాలో మరుగున పడ్డ ఓ కోణాన్ని నిన్న నా కాలేజీ స్నేహితురాలు వనజ సమయానికి గుర్తు చేసింది. నాకు నిజంగా ఈ సమయంలో స్ఫూర్తినిచ్చేది ఈ సమాజానికి సేవ చేయటం. నేను ఆ మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నాను. మీ అభిప్రాయం ఏమిటి? " అని పక్క మీద నిద్రపోతున్న రామారావుతో కనకం అంది. రామారావు సమాధానం చెప్పలేదు.

కనకం భర్తతో మాట్లాడుతున్నా అతని దగ్గరినుండి సమాధానం లేదు. రామారావు నిద్రలోనే గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. ఊహించలేని ఆ ఆకస్మిక మరణానికి కనకమహాలక్ష్మి ప్రపంచం తల్లక్రిందులైంది. పిల్లలు వచ్చారు, అంత్యక్రియలు, కర్మకాండ జరిగిపోయాయి. "అమ్మా! మేము ఇక్కడ నెలల తరబడి ఉండలేము కదా! మాతో పాటు అమెరికా రా, కొన్నాళ్లు నీకు కూడా కాస్త మార్పుగా ఉంటుంది" అని కొడుకు కూతురు కనకంతో అన్నారు. కానీ కనకం భర్త మరణం షాక్‌నుంచి తేరుకోలేదు. పైగా తనకు భర్తతో ఉన్న అనుబంధాన్ని పిల్లలతో పంచుకోవాలని కూడా ఎన్నడూ అనిపించలేదు. ఇప్పుడు తాను అమెరికా వెళ్లి నిరంతరం తన మానసిక పరిస్థితితో వారికి అసౌకర్యం కలిగించకూడదు అన్న భావనతో "నేను ఇప్పుడు రాలేనులేరా. కొన్నాళ్లు నా అంతట నేను ఉండాలి. నా పయనమెటో నిర్ణయించుకోవాలి" అని మృదువుగా చెప్పి పిల్లలను పంపించేసింది.

మనసులో ఎన్నో ప్రశ్నలు. తన ఆశయానికి ఓ రూపం వస్తోంది అనే సమయంలో భర్త మరణించటం ఏమిటి? పిల్లలకు తన మధ్య ఉన్న ఈ దూరాన్ని ఒంటరిగా ఎలా దాటటం? అని దుఃఖం, "మీకేం? హాయిగా దాటిపోయారు, మీ సుఖాలన్నీ చక్కగా అమరిపోయాయి..నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్లిపోయారు" అని రామారావు మీద కోపం. వచ్చిపోయేవాళ్ల సానుభూతిని కూడా భరించలేని పరిస్థితి..ఇలా, ఎన్నో వికారాలు. ఏమీ తెలియని స్థితి ఒకరోజైతే ఎక్కడలేని ధైర్యం మరో రోజు.ఒక్కోసారి మనుషులు కావాలి అన్న భావన, మరెన్నో సార్లు అబ్బ, ఎవరూ వద్దు, నా మానాన నేను జీవించాలి అన్న భావన.

కొన్నాళ్లు శూన్యం ఆవరించిన జీవితం కనకమహాలక్ష్మి. మొదట్లో పలకరింపులకు బంధువులు, ఇరుగు పొరుగు. తరువాత అది కూడా తగ్గిపోయింది. ఓ మూడు నెలలు కనకం ఒంటరి జీవితం అనుభవించింది. ఏ పని చేసినా తన ఒక్క దానికోసమే చేసుకోవాలి. ఇన్నాళ్లూ రామారావు కోసం వచ్చిపోయే స్నేహితులు, బంధువులు వాళ్ల కోసం ఏర్పాట్లు. ఇప్పుడు కేవలం తన కోసమే వంట. ఇలా మొదలైంది ఆమె సత్యాన్వేషణ. పిల్లలు, భర్త ప్రపంచంగా జీవితంలో సింహభాగం గడిచిపోయింది. అంతకుముందెన్నడూ బయట పనులలో తనను రామారావు భాగస్వామిని చేయలేదు. ఇప్పుడో? పూర్తిగా భిన్నమైన జీవితం. కరెంటు, ఫోను వగైరా బిల్లులు, పెన్షన్ పనులు, బ్యాంక్ పనులు ఇంటి పనులు...ప్రతిదీ తనదే బాధ్యత. ఇంటర్నెట్ ఎలా వాడాలి అన్నది కూడా ఇప్పుడే శ్రీకారం. అలా తప్పటడుగులతో కనకం తన జీవితంలోని తరువాయి భాగాన్ని మొదలు పెట్టింది. పీయూసీ చదువుకుంది కాబట్టి వ్యవహారాల్లో అంత కష్టపడకుండానే విషయాలను అవగాహన చేసుకుంది.

కొన్నాళ్లకు వనజ ఫోన్ చేసింది. విషయం తెలిసి తనతో పాటు మరో ముగ్గురు చిన్ననాటి స్నేహితులను తీసుకుని కనకం ఇంటికి వచ్చింది. పలకరింపులు, నిట్టూర్పులు పూర్తయ్యాయి. ఎక్కువ శాతం మంది స్నేహితులు, బంధువులు కనకానికి పిల్లల దగ్గరకు వెళ్లమని సూచించినా ఆమెకు ఆ సలహా నచ్చలేదు. తాను తిరిగి నిలదొక్కుకొని తనకు వెళ్ళాలి అన్న భావన కలిగినప్పుడే తన ఓన్ టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో వెళ్లాలని తీర్మానించుకుంది. స్నేహితులతో తన ఆశయాన్ని చర్చించింది.

"నువ్వున్న పరిస్థితులలో ఇవన్నీ అవసరమా! నీకు పెన్షన్ వస్తుంది, దానితో నీ జీవితానికి ఢోకా లేదు, అమెరికా వెళ్లి ఎంచక్కా పిల్లలతో సమయం గడిపేయవచ్చు. ఈ సమాజ సేవలో ఎన్ని లొసుగులో  ఎన్ని కష్టాలో నీకు తెలియట్లేదు.." అని ఒక స్నేహితురాలు. "సమాజసేవలో నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ పోయి నువ్వు రోడ్డు మీదికోస్తే పిల్లలు దానిని హర్షించరు కనకమహాలక్ష్మి" అని మరో స్నేహితుడు..."ఆడదానివి, అందులోనూ ఒంటరిగా ఉంటావు, ఈ సమాజసేవ వల్ల నీకు ఒరిగేదేమిటి?" అని ఇంకో స్నేహితురాలు...తలా ఓ నిరుత్సాహపరచే సలహా లేదా కామెంటు. ఒక్క వనజ మాత్రం "కనకమహాలక్ష్మీ! జీవితం తల్లక్రిందులైంది అన్న పరిస్థితిలో నీ స్థానంలో ఉండే చాలా మంది స్త్రీలు పిల్లల దగ్గరకు వెళ్లిపోతారు లేదా ఎటూ కదలని స్తబ్దైన జీవితంలోకి వెళతారు. కానీ, నీ నిర్ణయం అలా లేదు. జీవిత భాగస్వామిని కోల్పోవటం అనేది చాలా పెద్ద దెబ్బ, అయినా నీ అస్తిత్వం కోసం పాటుపడే దిశగా నువ్వు ఆలోచిస్తున్నావు. అది మన దేశానికి చాలా శుభ పరిణామం. నీకు నా పూర్తి సపొర్ట్" అని కనకం ఆలోచనలను దృఢపరచింది.

స్నేహితులు వెళ్లిపోయిన తరువాత కనకం రీడింగ్ టేబుల్ దగ్గర లైటు పెట్టుకొని తన ఆలోచనలకు అక్షర రూపం ఇవ్వటం మొదలు పెట్టింది.

"వ్యక్తిత్వ వికాసం - నేటి భారతీయులలో కొరవడిన అది ముఖ్యమైన లక్షణం. ఈ వ్యక్తిత్వ వికాసాన్ని చిన్నప్పటినుండే పిల్లలకు అలవాటు చేస్తే? ఆలోచనే ఆహా అనిపిస్తోంది. అమలు చేయగలిగితే? కొంతమంది బాలబాలికలైనా స్వావలంబన, మానసిక దృఢత్వంతో నేటి సమాజపు సమస్యలను ఎదుర్కునే వ్యక్తిత్వం పొందగలరు. ఎందరో బాలబాలికలు మానసిక బలం లేక చదువుల్లో పోటీ ప్రపంచంలో నిలువలేకున్నారు, యువతీయువకులు వైవాహిక మరియు ఉద్యోగ జీవితాలలో సమస్యలను ఎదుర్కోలేక సతమతమవుతున్నారు. కొద్ది మంది బాలబాలికలు మరియు యువతీ యువకులకైనా జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కునే వ్యక్తిత్వాన్ని శిక్షణ ద్వారా, అవగాహన ద్వారా అందించ గలిగితే నాకు ఎంతో ఆత్మ సంతృప్తి. ఇదే నా మిగిలిన జీవిత లక్ష్యం. దానికి ముందు నేను దృఢ సంకల్పంతో ఉండాలి. దానికి సాధన నేడే ప్రారంభం".

రాసుకున్న అక్షరాలను పదే పదే చదువుకుని, రేపటి కోసం ఎదురు చూస్తూ నిద్రలోకి జారుకుంది  కనకం. మరునాడు ఉదయమే లేచి తన ఆలోచనలకు కార్యరూపం ఇచ్చింది. మూడు నెలల సమయంలో ఆర్కే (రామారావు - కనకం) పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఇన్స్టిట్యూట్ అని పాఠశాల, కళాశాల విద్యార్థులకు వారి వయసును బట్టి ప్రణాలిక సిద్ధం చేసి దానికి ఇద్దరు మనస్తత్వ నిపుణులు, ఇద్దరు విద్యావేత్తల సేవలను వినియోగించుకొని విద్యాసంస్థలతో అనుసంధానం ఏర్పరచుకోవటంలో కనకం సఫలమైంది. రెండేళ్ల కఠోర శ్రమ తరువాత ఆర్కే ఇన్స్టిట్యూట్ హైదరాబాదే కాదు ఇతర ప్రాంతాలలో కూడా పేరొందింది. ప్రముఖుల జీవిత పాఠాలు, చరిత్రలోని ఘటనలు, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన పుస్తకాలు, శిక్షణా కార్యక్రమాలను తన ప్రణాలికలో విద్యార్థుల తరగతి, వయసు మరియు అవగాహనకు తగినట్లుగా రూపొందించి ఆ ప్రణాలికల అమలులో తాను ముందుండి నడిపించింది కనకం. ఓ ఐదేళ్లలో ర్యాగింగ్, యాసిడ్ అటాక్, బాలికలపై అత్యాచారం, గృహ హింస వంటి ఎన్నో క్లిష్టమైన సమస్యలను ఎదుర్కునే ప్రణాలికలు విస్తృతంగా ప్రచారం చేసింది ఆర్కే ఇన్స్టిట్యూట్.

"విద్యార్థినీ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం అనే ముఖ్యమైన అంశంపై ప్రభావవంతమైన, విజయవంతమైన శిక్షణను, ప్రణాలికలను అందిస్తున్న ఆర్కే పర్సనాలిటీ డెవలప్మెంట్ సంస్థ అధినేత్రికి తెలంగాణా ప్రభుత్వం వారి విశిష్ట సేవా పురస్కారాన్ని అందజేయవలసిందిగా గవర్నర్ గారిని కోరుతున్నాము..."...క్రిక్కిరిసిన రవీంద్రభారతి ఆడిటోరియం హాలులో గవర్నర్ చేతుల మీదుగా సేవా పురస్కారాన్ని అందుకునే వేళ కనకం మనసులో భావోద్వేగం, ఏదో సాదించానన్న ఆత్మ సంతృప్తి, మరో పదేళ్లు సేవ చేయాలన్న ఉత్సాహం కలిగాయి. ఎదురుగా కూర్చొని చప్పట్లు కొడుతూ ఆనందబాష్పాలు తుడుచుకుంటున్న స్నేహితురాలు వనజ, అమెరికా నుండి మర్నాడు ఇంటర్నెట్‌లో తల్లి గురించి వచ్చిన వార్తలను చూసి పొంగిపోయిన బిడ్డలు ఆమె ఆనందంలో, ఆ స్థాయికి చేరటంలో పడ్డ కష్టాలలో భాగస్వామ్యులు. నేడు వంటింటికి పరిమితం కాని వనిత కనకమహాలక్ష్మి. ఆ ఇంకేముంది పెన్షన్ వస్తుంది జీవితం గడిచిపోతుంది అని అనుకునే అగమ్యగోచరమైన వితంతువు కాదు. పిల్లలే జీవితం అనుకుంటూ పిల్లలపై ఆధార పడని సాధికరత పొందిన తల్లి ఆమె. ఆర్కే అనే ఒక బ్రాండ్‌కు మారుపేరు కనకం. సమాజ సేవ చేస్తూ ఆర్థిక స్వావలంబన కలిగిన ధీర వనిత. ఆమె ఒక మార్గదర్శి. స్ఫూర్తిప్రదాత.

"నా కోసం" అని పరితపిస్తూ ముందడుగు వేయలేకపోతున్న ప్రతి మహిళకు ఈ కథానిక అంకితం!

- ప్రసాద్  అక్కిరాజు 

కళలకు కాణాచి - విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల
విజయనగరం - ఆ భూమిలో ఏముందో! సంగీతానికి, సమస్త కళలకు పుట్టినిల్లు విజయనగరం. ఆ ప్రాంతాన్ని పాలించిన పూసపాటి గజపతి రాజులు ఆ కళలు వర్ధిల్లేలా వసతులు కల్పించి ప్రోత్సహించారు. ఆ పట్టణంలోని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల అంటే తెలియని కళాభిమానులుండరు. 1919వ సంవత్సరంలో మహారాజా పూసపాటి విజయరామ గజపతిరాజు గారు ఈ కళాశాలను స్థాపించారు. తొలుత దీనిని విజయరామ గానపాఠశాల అని నామకరణం చేశారు. మొట్టమొదటి ప్రిన్సిపాల్‌గా హరికథా పితామహులు అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు కాగా, ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసులు ద్వారం వేంకటస్వామి నాయుడు గారు తొలి ప్రొఫెసర్. విజయరామ గజపతి రాజు గారి తరువాత వారి కుమారులైన అలక్ నారాయణ గజపతి రాజు గారు ఆ సంస్థ పేరును శ్రీ విజయరామ సంగీత మరియు నృత్య కళాశాలగా మార్చారు. వివిధ విభాగాలను ఏర్పాటు చేశారు. తరువాతి మహారాజా పీవీజీ రాజు గారు ఈ కళాశాలను ఎంతో అభివృద్ధి చేశారు. 1955వ సంవత్సరంలో ఈ కళాశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. ఇక్కడ సంగీత నృత్య విభాగాలలో డిప్లొమా మరియు డిగ్రీ కోర్సులు ఉన్నాయి.ఇక మహారాజా కళాశాలలో పనిచేసిన వారు, నేర్చుకున్న వారి జాబితా చూస్తే ఆ కళాశాల ఘన చరిత్ర తెలుస్తుంది - ప్రధాన అధ్యాపకులుగా ద్వారం వేంకటస్వామి నాయుడు గారు, ద్వారం నరసింగరావు నాయుడు గారు, ద్వారం భావనారాయణరావు గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు, శ్రీరంగం గోపాలరత్నం గారు, ద్వారం దుర్గాప్రసాదరావు గారు మొదలైన ప్రముఖులు పని చేశారు. వారి శిక్షణ పొందిన వారు వేలాది మంది విద్యార్థులు గురువులై ఆ పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు. ద్వారం వంశంలో ఎందరో ఈ సంస్థలో చదివిన వారే. ఘంటసాల వేంకటేశ్వరరావు గారు, పులపాక సుశీలమ్మ గారు, సాలూరి రాజేశ్వరరావు గారు, సాలూరి హనుమంతరావు గారు, కొమాండూరి కృష్ణమాచార్యుల వారు, మంచాల జగన్నాథరావు గారు, మారెళ్ల కేశవరావు గారు, ముళ్లపూడి లక్ష్మణరావు గారు, ముళ్ళపూడి శ్రీరామమూర్తి గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు, మహామహోపాధ్యాయ నూకల చినసత్యనారాయణ గారు...ఇలా ఎందరో ప్రముఖులకు సంగీత విద్యను అలదిన సంస్థ మహారాజా కళాశాల. అక్కడి గాలిలో, నీటిలో, మనుషులలో సంగీతం అంతర్భాగం అని చెప్పటం అతిశయోక్తి కాదు.


గాత్రం, వయోలిన్, వీణ, మృదంగం, భరతనాట్యం, కూచిపూడి, కథక్‌లలో ఆంధ్రా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా డిగ్రీ మరియు డిప్లోమా కోర్సులు ఈ కళాశాల ద్వారా చేయవచ్చు. దాదాపు 100 ఏళ్ల చరిత్ర గల ఈ కళాశాల తెలుగు జాతికి చేసిన సేవ ఎనలేనిది. పద్మ అవార్డులు, సంగీత కళానిధి బిరుదులు పొంది మన కళల ఖ్యాతిని ఖండాంతరాలు వ్యాపింపజేసిన ప్రముఖులకు విద్యను ఇచ్చిన సరస్వతీ నిలయం ఇది. స్థాపించి పోషించిన ఆ మహారాజులకు, ప్రమాణాలు పాటించి ప్రతిభకు ప్రాణం పోసిన ప్రధాన అధ్యాపకులకు శతసహస్ర వందనాలు. ద్వారం కుటుంబ సభ్యులకు ఈ కళాశాలతో ఉన్న సుదీర్ఘమైన అనుబంధం, వారు ఈ సంస్థకు చేసిన సేవ చిరస్మరణీయం. ఆ కుటుంబ సభ్యులకు మనం ఎంతో రుణపడి ఉన్నాము.

ప్రముఖ గాయని, సంగీత అధ్యాపకురాలు, ద్వారం వేంకటస్వామి నాయుడు గారి మనుమరాలు, ద్వారం భావనారాయణరావు గారి కుమార్తె ద్వారం లక్ష్మి గారు ఫేస్బుక్‌లో నా యీ పోస్టుకు కామెంటుగా ఈ వివరాలు ఇచ్చారు:

"మా కుటుంబంలో మీరు చెప్పిన నలుగురు ప్రధాన అధ్యాపకులతో పాటు మా మేనత్త గారు ద్వారం మంగతాయారు గారు, ద్వారం రమణకుమారి గారు, ద్వారం మనోరమ గారు, నేను (మొత్తం ద్వారం కుటుంబం నుండి ఎనమండుగురం) ఈ కళాశాలలో పని చేశాము. ఈ కళాశాలలో చదువుకున్న మా ఇతర కుటుంబ సభ్యులు - మా అమ్మ గారు గుమ్మలూరి వరదమ్మ గారు, పెద్దమ్మ గారు గుమ్మలూరి రమణమ్మ గారు ఇక్కడ చదివారు. మా పెద్దమ్మమ్మ కుమారుడైన శ్రీ జోగారావు గారు ఇక్కడ లెక్చరర్‌గా పని చేశారు. వారి కుమారులు శాస్త్రి గారు ఇక్కడ పని చేస్తున్నారు. మా అత్త గారి వైపు కూడా ఇద్దరు పెద మామ గార్లు ఇక్కడ సంగీతం నేర్చుకున్నారు. మా ద్వారం కుటుంబానికి ఈ కళాశల పుట్టినిల్లు, ఓ దేవాలాయం. మా కుటుంబానికి ఈ కళాశాలతో అవినాభావ సంబంధం ఉంది ". 

19, ఆగస్టు 2017, శనివారం

అలనాటి గాయనీమణి ఎల్.ఆర్ ఈశ్వరి గారి సినీ ప్రస్థానం విశేషాలు


ఆమె పేరు వింటేనే ఉత్సాహం ఉరకలేస్తుంది. చిన్న-పెద్ద అని లేకుండా అందరూ ఆమె గళంలోని కైపుకు దాసోహమైన వాళ్లే. దశాబ్దాల పాటు మత్తెక్కించే పాటలతో పాటు ఎన్నో భక్తి గీతాలను కూడా పాడి దక్షిణాది సినీ అభిమానులను అలరించిన గాయని ఎల్. ఆర్. ఈశ్వరి. వీరి పూర్తి పేరు లూర్డ్-మేరీ రాజేశ్వరి ఈశ్వరి. 1939 డిసెంబరు 7న చెన్నైలో రోమన్ కేథలిక్ దంపతులైన ఆంథోనీ దేవరాజ్, రెజీనా మేరీ నిర్మల దంపతులకు జన్మించారు. అమ్మమ్మ వైపు వారు క్రైస్తవులు, నాయనమ్మ వైపు వారు హిందువులు కావటంతో రెండు కుటుంబాలకూ ఆమోదయోగ్యంగా అలా పేరు పెట్టుకున్నారు.

ఆరేళ్ల వయసులోనే భర్త  దేవరాజ్ మరణించటంతో  నిర్మల ముగ్గురు పిల్లల కుటుంబాన్ని నడిపే భారం తన మీద వేసుకుని, సినీ గీతాలలో కోరస్ పాడే ఉద్యోగంలో చేరారు . చిన్ననాటి పేదరికం వలన  ఎల్. ఆర్. ఈశ్వరికి  సంగీతం నేర్చుకునే అవకాశం రాలేదు. సిలోన్ రేడియోలో పాటలు విని నేర్చుకునే వారు. తల్లితో కలిసి కోరస్‌లో పాడటంతో ఆమె సినీ జీవితం ఆరంభమైంది. తొలి అవకాశం మనోహర అనే తమిళ చిత్రంలో జిక్కి గారితో కోరస్ పాటలో వచ్చింది. ఈ చిత్రం 1954లో ఎల్వీ ప్రసాద్ గారి దర్శకత్వంలో తమిళంలో, అదే సంవత్సరంలో డబ్ చేయబడి తెలుగు, హిందీ భాషలలో విడుదలైంది. అలాగే, 1957లో విడుదలైన సువర్ణసుందరి చిత్రంలో సుశీలమ్మ పాడిన పిలువకురా అనే పాట కోరస్‌లో కూడా పాడారు. 1958లో విడుదలైన తమిళ చిత్రం నల్ల ఇడత్తు సంబంధం అనే చిత్రంలో సంగీత దర్శకులు కేవీ మహాదేవన్ గారు మూడు పాటలు పాడే తొలి అవకాశాన్నిచ్చారు. షావుకారు జానకి, ఎం.ఆర్ రాధ నటించిన ఈ చిత్రం విజయం సాధించగా ఎల్.ఆర్ ఈశ్వరి సినీ నేపథ్య గాయని ప్రస్థానం మొదలైంది. తెలుగులో తొలి అవకాశం 1958లోనే కేవీ మహాదేవన్ గారి సంగీత దర్శకత్వంలో విడుదలైన దొంగలున్నారు జాగ్రత్త అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. తమిళ చిత్రాలలో 1961లో విడుదలైన పాశమలర్ అనే చిత్రంలో పాటలతో ఎల్.ఆర్ ఈశ్వరి గారి ఉత్థానం ప్రారంభమైంది. తమిళ దర్శకులు ఏ పీ నాగరాజన్ గరు అప్పటికే ఎం ఎస్ రాజేశ్వరి అనే గాయని ఉండటంతో రాజేశ్వరి ఈశ్వరి పేరుని ఎల్.ఆర్ ఈశ్వరి గా మార్చారు.
ఇక 1960-70 దశకాలు ఎల్.ఆర్ ఈశ్వరి గళంలో వెలువడిన పాటలు మత్తు, గమ్మత్తుతో వీక్షకులను ఉర్రూతలూగించాయి. సుశీలమ్మ, జానకమ్మ మాధుర్యానికి, సొగసుకు మారుపేరైతే ఎల్.ఆర్ ఈశ్వరి ఈ కైపున్న పాటలకు ట్రేడ్ మార్క్ అయ్యారు. తెలుగులో పాండవ వనవాసం, ప్రతిజ్ఞాపాలన, ఉమ్మడి కుటుంబం, భార్యా బిడ్డలు, రైతుబిడ్డ, రౌడీలకు రౌడీలు, మంచి మిత్రులు, అందమైన అనుభవం, అంతులేని కథ, నిండు మనసులు, నాగమల్లి, మరోచరిత్ర, పుట్టినిల్లు మెట్టినిల్లు, అమ్మాయిల శపథం, అగ్గి బరాట, శ్రీవారు మావారు, ముత్తైదువ, రామాలయం, గౌరి, మంచి చెడు, ధనమా దైవమా, శ్రీమంతుడు, జరిగిన కథ, జమీందారు గారి అమ్మాయి, అల్లూరి సీతారామరాజు, రైతు కుటూంబం, మానవుడు దానవుడు, మాతృదేవత, ప్రేం నగర్, దేవుడు చేసిన మనుషులు, రాజకోట రహస్యం, అమ్మ మాట, జీవన తరంగాలు, ప్రాణం ఖరీదు, అన్నదమ్ముల సవాల్, భక్త ప్రహ్లాద, శ్రీకృష్ణ పాండవీయం, మొరటోడు, ప్రేమ జీవులు, దీక్ష ఆలీబాబా నలభై దొంగలు, బాలమిత్రుల కథ, అగ్గిదొర, ఇదాలోకం మొదలైన ఎన్నో తెలుగు చిత్రాలకు పాటలు పాడారు.

ఎల్.ఆర్ ఈశ్వరి గారి పాడిన పాటల్లో - గాలిలోన పైట చెంగు, పాములోళ్లమయ్య, మాయదారి సిన్నోడు, ఆకులు పోకలు ఇవ్వద్దు, లేలేలేలేలే నా రాజా, భలే భలే మగాడివోయ్, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, నందామయా గురుడ నందామయా, గుడిలోన నా సామి, తీస్కో కోకోకోలా, బోల్త పడ్డావు చిన్ని నాయనా వంటి మత్తెక్కించేవి ఎంతో పేరు పొందాయి. . విజయలలిత, హలం, జ్యోతిలక్ష్మి వంటి శృంగార నర్తకీమణులకు ఎల్.ఆర్ ఈశ్వరి గారు పాడారు. ఇంతే కాకుండా, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారికి ఎన్నో తమిళ తెలుగు చిత్రాలలో నేపథ్య గాయనిగా పాటలు పాడారు. తమిళంలో ఎన్నో అమ్మవారి భక్తి గీతాల ఆల్బంస్ పాడారు. అలాగే క్రైస్తవ భక్తి గీతాలు కూడా పాడారు. తమిళం, తెలుగులో ఎక్కువ పాటలు పాడిన ఆవిడ కన్నడంలో, మళయాళంలో కూడా ఎన్నో బహుళ ప్రాచుర్యం పొందిన పాటలు పాడారు. ఘంటసాల, టీఎం సౌందర్‌రాజన్, పీబీ శ్రీనివాస్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, యేసుదాసు, సుశీలమ్మ, జానకమ్మ, వాణీ జయరాం మొదలైన వారితో కలిసి పాడారు. సత్యం, చక్రవర్తి, కేవీ మహాదేవన్, ఎమ్మెస్ విశ్వనాథన్ వంటి మేటి సంగీత దర్శకుల వద్ద పని చేశారు.

1970వ దశకం చివరలో లో నేపథ్య సంగీతం నుండి కనుమరుగైన ఎల్. ఆర్ ఈశ్వరి గారు 2011లో శింబు నటించిన ఓస్తే అనే తమిళ చిత్రం ద్వారా పునః ప్రవేశం చేశారు. ఆ తరువాత తమిళ కన్నడ చిత్రాలలో పాడారు. మొత్తం 14 భాషలలో ఆవిడ పాటలు పాడారు. పాట ఎంత చలాకీనో, మనిషి కూడా అంతే చలాకీ. వందల ప్రైవేట్ కచేరీలలో పాల్గొన్న ఎల్. ఆర్ ఈశ్వరి గారు అవివాహిత. ఈ మధ్య కాలంలో టెలివిజన్ పాటల పోటీల కార్యక్రమాలలో జడ్జిగా పాల్గొన్నారు. కలైమామణి, స్వరాలయ పురస్కారాలు అందుకొని, 77 ఏళ్ల వయసులో కూడ ఉత్సాహంగా పాడగలుగుతున్న విలక్షణ గాయని ఎల్.ఆర్ ఈశ్వరి గారు. బాలసుబ్రహ్మణ్యం గారు వీరిని ఎల్. ఆర్ భాస్వరం అని ఆటపట్టిస్తుంటారు. భాస్వరంలా ఉరకలెత్తే గాయనీమణి అని ఆయన భావన.

ఎల్. ఆర్. ఈశ్వరి గారి పాటల్లో నాకు చాలా  ఇష్టమైన పాట 1972లో విడుదలైన అమ్మ మాట చిత్రంలో జ్యోతి లక్ష్మి పై చిత్రీకరించబడీన మాయదారి సిన్నోడు. తెలుగునాట సంచలనం సృష్టించిన ఈ పాట ఇటీవలే రీమిక్స్ కూడా చేయబడింది. నారాయణ రెడ్డి గారు రచించిన ఈ పాటకు సంగీతం రమేష్ నాయుడు గారు. అటు తరువాత 1978లో విడుదలైన మరో చరిత్ర చిత్రంలోని భలే భలే మగాడివోయ్ అన్న పాట. ఆచార్య ఆత్రేయ గారు రచించగా, ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీతం అందించిన ఈ పాటను బాలు, ఎల్.ఆర్ ఈశ్వరి గారు కలిసి పాడారు. ఈ పాటను కమల్ హాసన్, సరితలపై చిత్రీకరించారు. భాషేతర ప్రేమ నేపథ్యమైన ఈ చిత్రంలో ఈ పాటలో ఎల్. ఆర్ ఈశ్వరి గారి మత్తెక్కించే గాత్రం సమ్మోహనం. ఎల్. ఆర్. ఈశ్వరి గారికి పరమాత్మ ఆయురారోగ్యాలు, మరెంతో గాత్ర సేవా భాగ్యం ప్రసాదించాలని ప్రార్థన

అదిగదిగో గగనసీమ - దేవులపల్లి కృష్ణశాస్త్రి రచన రావు బాలసరస్వతి, ఎమ్మెల్ వసంతకుమారి గానంలోఅదిగదిగో గగనసీమ అందమైన చందమామ ఆడెనోయి
ఇదిగిదిగో తేలి తేలి చల్లనైన పిల్లగాలి పాడెనోయి 
సా రి గ మ ప ద ని సా సా దా ప మ రి గ మ రి సా

హాయి హాయి ఈ లోకం తీయనైనదీ లోకం
నీ ఇల్లే పూలవనం నీ సర్వం ప్రేమ ధనం మరువకోయి ఈ సత్యం


నీ కోసమే జగమంతా నిండెనోయి వెన్నెలలు
చేలలోని గాలిపైన తీయనైన తూలికలు
చెరుచుకోకు ఈ సౌఖ్యం చేతులార ఆనందం
ఏనాడును పొరపడకో ఏమైనా త్వరపడకో
మరల రాదు రమ్మన్నా మాయమైన ప్రేమ ధనం
చిగురింపదు తిరిగి వాడి చెడిన పూలవనం మరువకోయి ఈ సత్యం


దేవులపల్లి కృష్ణశాస్త్రి - ఆ పేరంటేనే తెలుగుదనం. మాటల మువ్వలు భావానికి మురిసి నర్తిస్తే అది కృష్ణశాస్త్రి గీతమవుతుంది. ఆ పదాలేమీ కఠినంగా ఉండవు, పామరులకు కూడా తేటతల్లమే. అందరి హృదయవీణలు మీటి మోహన రాగాలు పలికిస్తాయి. భావానికి మారు పేరు కృష్ణశాస్త్రి. అందులోనూ లలిత సంగీతానికి ఆయన సాహిత్యం ప్రాణవాయువు. తెలుగునాట కృష్ణా గోదావరులున్నంత వరకూ కృష్ణశాస్త్రి సాహిత్యం మకుటాయమానంగానే ప్రకాశిస్తుంది. అటువంటి ఓ గీతమే 1953లో విడుదలైన నా ఇల్లు అనే చిత్రంలోని అదిగదిగో గగనసీమ అనే భావవీచిక.

చిత్ర నేపథ్యం:

ఆనాటి సినీ మహామహులు చిత్తూరు వుప్పలదడియం నాగయ్య గారు నిర్మించి దర్శకత్వం వహించిన ఈ కళాఖండంలో నాగయ్య గారు నాయకుడు, ప్రఖ్యాత నర్తకి టీ ఆర్ రాజకుమారి గారు నాయిక. ఈ రాజకుమారి గారి కుటుంబానికి చెందినవారే జ్యోతిలక్ష్మి, జయమాలిని. ఈ చిత్రంలో ప్రతినాయిక తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితగారి తల్లి సంధ్య సోదరి విద్యావతి. రాజకుమారి, విద్యావతి గార్ల అద్భుతమైన నటనతో ఈ చిత్రం మంచి విజయమే సాధించినా పార్టనర్ల మోసం చేసి నాగయ్యగారికి చిల్లి గవ్వ కూడా దక్కలేదు. చిత్రానికి సంగీతం నాగయ్య గారు, అద్దేపల్లి రామారావు గారు అందించారు.రావు బాలసరస్వతీ దేవి గారు, ఎమ్మెల్ వసంతకుమారి గారు, జిక్కి గారు, ఎమ్మెస్ రామారావు గారు, నాగయ్య గారు ఈ చిత్రానికి నేపథ్య గాయకులు. ఈ చిత్రానికి సంభాషణలు కూడా కృష్ణశాస్త్రి గారే.

పాట వివరాలు:

తెలుగు నేపథ్య సంగీతంలో తొలి గాయనీమణుల్లో ఒకరైన బాలసరస్వతి గారు, ఎమ్మెల్ వసంతకుమారి గారు కలిసి పాడిన ఓ అరుదైన గీతం అదిగదిగో గగన సీమ. పాటలో ప్రధాన గాత్రం బాలసరస్వతి గారిదే. ఎంత మధురంగా పాడారంటే వినే వారు ఆనందంలో తేలిపోవలసిందే. ఈ గీతంలో అద్భుతమైన భావం. మంచి ఆశావహమైన స్ఫూర్తిని కలుగజేస్తూ కర్తవ్యాన్ని కూడా బోధిస్తుంది ఈ గీతం. సాహిత్యంలో కృష్ణశాస్త్రి ముద్ర అణువణువునా గోచరిస్తుంది. నాగయ్య గారు ఈ పాటను సారంగ రాగంలో కూర్చారు. ఈ గీతం నాగయ్య గారి సంగీత ప్రతిభను సూచిస్తుంది. తరువాత ఇదే బాణీలో ఎన్నో దేశభక్తి, లలిత గీతాలు తెలుగు సంగీత ప్రపంచంలో వచ్చాయి. ఇల్లు, ప్రేమ ఎంత ముఖ్యమైనవో తెలిపే సందేశాత్మకమైన భావగీతి ఇది. బాలసరస్వతి గారి గాత్రంలో ఆ చెప్పలేని పట్టులాంటి మృదుత్వం ఉంటుంది, ఆ స్వరలక్షణం లలిత భావ గీతాలకు ఎంతో శోభనిచ్చేది. ఎమ్మెల్ వసంతకుమారి గారు అప్పటికే మేటి గాయని అయినా నాగయ్య గారిపై గౌరవంతో, బాలసరస్వతి గారి గొంతులో గొంతు కలిపి అద్భుతమైన ఏకగాత్రం అనిపించేలా పాడారు. ఆనాటి సామాజిక పరిస్థితుల వలన బాలసరస్వతి గారు సుశీలమ్మ, లీల, జిక్కి లాగా బహుళంగా పాడలేకపోయినా, పాడినవి అమృత గుళికలు. మలయమారుతంలా వీచే ఈ గీతం విని ఆనందించండి. 

నీ దయ రాదా - త్యాగరాజస్వామి కృతి


నీ దయ రాదా రామ నీ దయ రాదా!

కాదనే వారెవరు కళ్యాణ రామా! 

నను బ్రోచే వాడవని నాడే తెలియ
ఇన వంశ తిలక ఇంత తామసమా!

అన్నిటికికధికారివని నేఁ బొగడితి
మన్నించితే నీ మహిమకుఁ దక్కువా!

రామ రామ రామ త్యాగరాజ హృత్సదన
నా మది తల్లడిల్లగ న్యాయమా వేగమే!


ఓ రామా! నీకు నాపై దయ కలుగదా? నీకు దయ రాకున్ననూ కాదనే వారున్నారా?  ఓ సూర్యవంశ శ్రేష్ఠుడా! నన్ను బ్రోచేవాడవు నీవేనని నీకు ముందే తెలుసు. అయినా ఇంత తామసమా? అన్నిటికీ నీవే అధికారివని నేను నిన్ను నుతించినాను. నన్ను మన్నించితే నీ మహిమకు ఏమైనా తక్కువగునా? త్యాగరాజుని హృదయములో నివసించే ఓ రామా! నా మనసు తల్లడిల్లేలా చేయుట నీకు న్యాయమా? వీగమే నన్ను బ్రోవుము.

- సద్గురువులు త్యాగరాజస్వామి

నిందాస్తుతిలో త్యాగరాజ స్వామి అనేక కృతులు రచించారు. క్లేశములో ఉన్నప్పుడు భక్తునికి భగవంతునిపై ఆగ్రహం కలగటం అనేది ఎందరో వాగ్గేయకారుల కృతులలో మనం గమనించవచ్చు. తనను బ్రోచుటలో ఆలస్యమెందుకు అని ప్రశ్నించే సంభాషణలో ఎన్నో కృతులు వచ్చాయి. అటువంటిదే నీ దయ రాదా? నిజంగా ఆయనే తనకు దిక్కు అని ప్రతి సాధకునికి తెలుసు. కానీ, ఆశ నిరాశ అయినప్పుడు మనలోని వికారాలు ఒకింత ఒలకటం మానవ సహజం. నీ దయ రాదా అన్న కృతిలో త్యాగయ్య ఇటువంటి భావనలనే వ్యక్తపరచారు. నీ అంతటి వాడు లేడు, నీవు తప్ప వేరే లేరు అని నుతిస్తూనే బ్రోచుటకు తామసమా అని పలికారు. అన్నీ నీవనుకున్నానే, నన్ను కాపాడితే నీ మహిమలకేమైనా తక్కువా అని నిష్ఠూరంగా ప్రశ్నించారు. నా మనసును కష్టపెట్టడం నీకు న్యాయమా అని నిలదీశారు. భక్తిమార్గంలో అనేక రకలా భావనలు వస్తాయి అన్న దానికి ఈ కృతి మరో నిదర్శనం. వసంతభైరవి రాగంలో త్యాగరాజస్వామి వారు ఈ కీర్తనను స్వరపరచారు. ఈ కీర్తనను తెలుగు, తమిళ చిత్రాలలో పొందు పరచారు. సుశీలమ్మ పూజ అనే చిత్రంలో ఆలపించగా, యేసుదాసు ఆరు సింధుభైరవి చిత్రంలో ఆలపించారు. యేసు దాసు గారి ఆలాపన ఇదిగో

చలి గాలి వీచింది - రావు బాలసరస్వతి గారి లలిత గీతం


లలిత గీతాల స్వర్ణయుగం రావు బాలసరస్వతి గారితోనే ప్రారంభమైందని వారి పాటలు విన్నప్పుడు ఖచ్చితంగా చెప్పవచ్చు. ఓ నాలుగు దశాబ్దాల పాటు సాగిన ఈ స్వర్ణ యుగంలో బాలమురళిగారు, ఘంటసాల మాష్టారు, శ్రీరంగం గోపాలరత్నం గారు, చిత్తరంజన్ గారు, వేదవతీ ప్రభాకర్ గారు, విజయలక్ష్మీ శర్మ గారు, సురేఖా మూర్తి గారు, ఛాయా దేవి గారు, ద్వారం లక్ష్మి గారు..ఇలా ఎందరో గాత్ర సంపద కలిగిన కళాకారులు సాలూరి రాజేశ్వరరావు గారు, బాలాంత్రపు రజనీకాంతరావు గారు, పాలగుమ్మి విశ్వనాథం గారు మొదలైన మహామహుల సంగీతం స్వరపరచగా అద్భుతమైన గీతాలను పాడారు. దేవులపల్లి వారు, వింజమూరి శివరామారావు గారు, రజనీ, పాలగుమ్మి వారు, ఆరుద్ర, దాశరథి గారు మొదలైన రచయితలు అమూల్యమైన లలిత సంగీత సాహిత్యాన్ని మనకు అందించారు.

రావు బాలసరస్వతీదేవి గారి పాటలు శోధించి విన్న కొద్దీ వారిపై గౌరవం ద్విగుణీకృతమవుతోంది. వారి లలిత సంగీత ప్రతిభ అసామాన్యం. సైగల్ గారి ప్రభావం తనపై ఉందని చెప్పుకున్న బాలసరస్వతి గారు వారి శైలిని ఎంతగా తన లలిత సంగీత గానంలో కనబరచారో ఒక్కొక్క గీతంలో మరింత తెలుస్తోంది. భావానికి తేనె అలది అలా సెలయేటి ధారలా తన గళంలో సాహిత్యాన్ని ఒలికించారు వారు. అటువంటి గీతమే చలి గాలి వీచింది. ఈ గీతాన్ని యూట్యూబ్ ప్రకారం వింజమూరి శివరామారావు గారు రచించారని ఉంది. మరో వెబ్ సైట్లో ఆరుద్ర గారని ఉంది. సాహిత్య శైలి చూస్తే శివరామారావు గారి రచనే అని నా భావన. సంగీతం సుసర్ల దక్షిణామూర్తి గారు అని యూట్యూబ్ ఉవాచ. లలిత సంగీత సామ్రాజ్ఞి బాలసరస్వతి గారని వారి పాటలు వింటే అర్థమవుతుంది. ఈ గీతంలో వారి గళం ఎంత లేతగా ఉంటుందో! సుసర్ల వారి సంగీతంలో లలిత సంగీతం వినటం ఇదే మొదటి సారి.

చలి గాలి వీచింది తెలవారబోతోంది ఇకనైన ఇల్లు చేరవా 
ప్రియా ఇకనైన ఇల్లు చేరవా ఓ ప్రియా ఇకనైన ఇల్లు చేరవా!

ఎదురు తెన్నులు చూచి ఎద బెదిరి పోయింది
నిదురలో పడు తనువు నిలబెట్టుకున్నాను 
ఇకనైన ఇల్లు చేరవా ఓ ప్రియా ఇకనైన ఇల్లు చేరవా

బరువాయె నా మేను చెరువాయె కన్నీళ్లు
విరహ వేదనను ఏమో మరి మోయలేను 
ఇకనైన ఇల్లు చేరవా ఓ ప్రియా ఇకనైన ఇల్లు చేరవా

ఉత్సాహంగా సాగే ఈ మధురమైన లలిత గీతం బాలసరస్వతి గారి గానంలో ఆలకించి ఆనందించండి. 

సుందరాంగ మరువగలేనోయ్ రావేల - సంఘం చిత్రంలోని ఆపాత మధురం


సంఘం - 1954లో విడుదలైన ఓ అద్భుత కళాఖండం. ఏవీఎం వారి బ్యానర్‌లో వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించటానికి ప్రధాన కారణం కథ, వైజయంతిమాల, అంజలీదేవిల మేటి నటనాకౌశలం. ముఖ్యంగా వైజయంతిమాల గారిది మైమరపించే నటన. దాదాపుగా వీరిద్దరి భుజాల మీదే సినిమా నడుస్తుంది. అన్న ఎన్‌టీఆర్ గారు కూడా చాలా అందంగా ఉంటారు. ఈ చిత్రానికి ఆర్ సుదర్శనం గారు సంగీత దర్శకత్వం వహించగా తోలేటి వేంకటరెడ్డి గారు పాటలను రచించారు. నాయికలకు టీ.ఎస్. భగవతి మరియు సుశీలమ్మ నేపథ్య గానం చేశారు. 63 ఏళ్ల క్రితం ఇటువంటి చిత్రం వచ్చిందంటే ఓ సంచలనమే అనుకోవాలి. ఎంతో అభ్యుదయ భావాలను ప్రోత్సహించిన చిత్రం ఇది. చక్కని ఇతివృత్తం, మధ్య మధ్యలో హాస్యం, నటీనటుల సహజ హావభావాలు, సంగీత నృత్యాలు, చిత్రీకరణ ఈ చిత్రానికి ఆయువుపట్లు. రాణి, కామిని పాత్రలలో వైజయంతిమాల, అంజలి పోటీ పడి నటించారు. చిలక పలుకుల తెలుగులో వైజయంతిమాల తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. స్నేహితురాళ్లుగా వీరిద్దరూ చిత్రాన్ని డామినేట్ చేశారు.  ఈ చిత్రం తొలుత తమిళంలో నిర్మించబడి (పెణ్), తరువాత తెలుగులో, తరువాత హిందీలో (లడ్కీ) విడుదలై మూడు భాషల్లోనూ విజయం సాధించాయి.

ఈ చిత్రంలో సుశీలమ్మ, టీఎస్ భగవతి గారు పాడిన సుందరాంగ మరువగలేనోయ్ రావేల అనే కృష్ణ ప్రేమ గీతాన్ని మనోజ్ఞంగా తోలేటి వారు రచించంగా పాటలో తన్మయులై నటించారు నాయికలు. ఎంత సుందరమైన గీతమో! పాట సాహిత్యమొక వైపు, ఈ ఇరువురు అందమైన నాయికల నటన మరొక వైపు. ప్రేక్షకుల మనసులు దోచుకొని ఈ గీతాన్ని అజరామరం చేశాయి. ఆర్ సుదర్శనం గారు ఏవీఎం వారికి ఆస్థాన సంగీత విద్వాంసులు. చక్కని వీణా వాదనం, పక్క వాయిద్యముల ధ్వానములతో ఈ పాట అనుక్షణం అలరిస్తుంది. మేను పులకరింపజేస్తుంది. ఆపాత మధురం అని ఊరకే అనలేదు సుమా! సంగీతానికి, నటనకు, భావానికి, చిత్రీకరణకు సమమైన ప్రాధాన్యతనిచ్చి పాటలను కూర్చిన రోజులవి. నటీమణుల ప్రతిభను ప్రకాశింపజేసే సాంకేతిక నైపుణ్యం ఆనాటీ దర్శకులలో ఉండేది. తోలేటి వారి పద ప్రయోగం గమనించండి. చక్కని చిక్కని తెలుగులో లయబద్ధమైన పదమంజరిని రచించారు. ఈ సాహిత్యానికి సంగీత దర్శకులు ఉపయోగించిన వీణావాదనం మనోహరం. నాయికల కళ్లలో వలపులు, ఎదురుచూపులు అద్భుతః. టీఎస్ భగవతి గారు తమిళ చలనచిత్రసీమలో ప్రఖ్యాత గాయని. ఇక సుశీలమ్మ సంగతి చెప్పేదేముంది? వీరిద్దరి యుగళగీతం ఆద్యంతం రసజ్ఞులకు కర్ణామృతమే. ఈ మేటి వన్నె గల గీతాన్ని వీక్షించండి. సాహిత్యం ఇదిగో!

సుందరాంగ మరువగలేనోయ్ రావేల
నా అందచందములు దాచితి నీకై రావేల

ముద్దు నవ్వుల మోహన కృష్ణా రావేల
నవ్వులలో రాలు సరాగాలు రాగమయ రతనాలు

మేని కనులలో వాలు చూపుల ఆ వేళ
నను జూసి కనుసైగ జేసితివోయి రావేల

కాలి మువ్వల కమ్మని పాట ఆ వేళ
ఆ మువ్వలలో పిలుపు అదే వలపు మురిపెముల కలగలుపు

హృదయ వీణ తీగలు మీటి ఆ వేళ
అనురాగ రసములే చిందితివోయి రావేల

మనసు నిలువదోయ్ మధు వసంతమోయ్ రావేల
పూవులు వికసించే ప్రకాశించే ప్రేమతో పలవించే 


17, ఆగస్టు 2017, గురువారం

భక్త జన వత్సలే - నామదేవుని అభంగ్


భక్త జన వత్సలే యేయి ఓ విఠ్ఠలే
కరుణాకల్లోలే పాండురంగే

సజల జలద ధర పీతాంబర పరిధాన
యేయి ఉద్ధరణే కేశీరాజే

నామా మ్హణే తు విశ్వాచీ జననీ
క్షీరాబ్ధి నివాసిని జగదంబే

ఓ విఠ్ఠలా! భక్తులపై వాత్సల్యము కల పాండురంగా! ఈ భక్తునిపై కరుణతో రమ్ము! నీటితో నిండిన నల్లని మేఘము వంటి శరీరముతో, పీతంబరము ధరించి నన్ను ఉద్ధరించటానికి రమ్ము ఓ కేశవా! నామదేవుడు నీవు పాలకడలిలో నివసించే జగన్మాతవని విశ్వసిస్తున్నాడు. ఈ భక్తుడిపై కరుణతో రమ్ము!

నామదేవుడు మహా భక్తుడు. పాండురంగ విఠలుని జగన్మాతగా భావించి పలికిన మరాఠీ అభంగ్ ఇది. అచంచలమైన భక్తికి మరాఠా ప్రాంతం సుప్రసిద్ధి. తుకారాం, నామదేవుడు, జ్ఞానేశ్వరుడు, ఏకనాథ్ సక్కుబాయి, సమర్థ రామదాసు మొదలైన మహాభక్తులకు ఆ నేల జన్మభూమి. నామదేవుడు కొలిచిన ఆ పండరిపుర విఠలుడు ఆయనతో పాటు ఎందరో భక్తులను బ్రోచి మోక్షాన్ని ప్రసాదించాడు. అభంగములు పరమాత్మను భక్తితో ప్రస్తుతించే అద్భుత సంగీత సుమాలు. అభంగములు భక్తుడిని పరమాత్మను విడదీయరాని బంధంలో ముడివేసేవి. అటువంటి అభంగమే ఈ భక్త జన వత్సలే. కర్ణాటక సంగీత సాంప్రదయంలో అభంగములకు స్థానం ఉంది. బృందావన సారంగ రాగంలో కూర్చబడిన ఈ అభంగమును అరుణా సాయిరాం గారు పాడారు.అలనాటి మధుర గాయని పీ లీల విశేషాలు


"నా తండ్రే నేను గాయనిగా స్థిరపడటానికి కారణం" అని చెప్పారు పొరయాతు లీలమ్మ గారు. రెండు దశాబ్దాల పాటు దక్షిణ భారత దేశపు భాషలలో మధురమైన గాత్రంలో శ్రోతలను మైమరపించిన కంఠం పీ లీల గారిది. 1934 మే 19న  కేరళలోని పాలక్కాడ్ జిల్లా చిత్తూరులో జన్మించిన పీ లీల కుంజమీనన్-మీనాక్షి అమ్మ దంపతులకు మూడవ బిడ్డ. తండ్రి ప్రోత్సాహంతో త్రిభువనమణి భాగవతార్, చెంబై వైద్యనాథ భాగవతార్ వంటి మేటి గాయకుల వద్ద కర్ణాటక సంగీతంలో శిక్షణను పొందారు. కూతురిని గాయనిగా చూడాలనుకున్న మీనన్ గారు ఆమెను చెన్నై తీసుకువెళ్లి గురుకుల పద్ధతిలో వడక్కన్‌చెర్రి రామభాగవతార్ గారి వద్ద శాస్త్రీయ సంగీతాన్ని నేర్పించారు. చెన్నైలో మహామహులైన అరైకుడి, చెంబై, జీఎన్‌బీ వంటి వారి సంగీతం వినే అవకాశం లీలకు దక్కింది. విన్న వెంటనే నేర్చుకోగలిగిన ప్రతిభ కలిగిన లీలకు చిన్ననాటినుండే పోటీలలో బహుమతులు వచ్చాయి. దుర్గాబాయి దేశ్‌ముఖ్ గారు ఆమెకు ఆంధ్ర మహిళా సభ ద్వారా తొలి కచేరీ అవకాశం కలిగించారు. కొలంబియా రికార్డింగ్ సంస్థ ద్వారా నేపథ్య గాయనిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన లీల ఇక వెను తిరిగి చూడలేదు.

తమిళ, తెలుగు భాషలు రాకపోయినా, మళయాళంలో ఆ పాటలు రాసుకొని అద్భుతమైన ఉచ్చారణతో ఆ రెండు భాషలలో పేరొందారు. అలా 1948లో ఆమె సినీ ప్రస్థానం మొదలైంది. తెలుగులో మొట్టమొదటి సారిగా 1949లో మనదేశం, కీలుగుర్రం, గుణసుందరి కథ చిత్రాలలో పాడారు. ఘంటసాల గారు ఆమెకు మనదేశం చిత్రంలో పాడే అవకాశం కలిగించారు. గుణసుందరి కథ చిత్రంలో శ్రీరంజని గారిపై "శ్రీతులసి జయతులసి" అనే భక్తి గీతం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక వరుసగా పాతాళభైరవి మొదలు పాండవవనవాసం వరకు ఓ 15-16 ఏళ్ల పాటు లీల గారు తెలుగు నేపథ్య గాయనీమణుల్లో అగ్రశ్రేణిలో నిలిచారు. 1960 దశకం చివరి భాగానికి ఆవిడ గొంతులో మాధుర్యం తగ్గింది. అప్పటికి సుశీలమ్మ, జిక్కి, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి మొదలైన వారు బాగా నిలదొక్కుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే నేపథ్య గాయని అంటే సుశీలమ్మే అనే పరిస్థితి అప్పటికి వచ్చేసింది. ఆపైన లీల గారు తెలుగులో పెద్దగా పాడలేదు. కాకపోతే ఆమె భక్తి పాటల ప్రపంచంలో ప్రైవేట్ ఆల్బంస్ ఎన్నో చేసి చాలా పేరుపొందారు, తన సంగీత ప్రస్థానాన్ని కొనసాగించారు. ఆమె పాడిన నారాయణీయం, మూకాంబిక శతకం, అష్టపదులు దక్షిణాదిన ఎంతో పేరుపొందాయి.

లీలగారి తెలుగు సినీ జీవితంలో మరువలేని మైలురాయి లవకుశ చిత్రం. 1963లో విడుదలైన ఈ చిత్రంలో ఆమె సుశీలమ్మ కలిసి లవకుశులకు అందించిన గాత్రం అజరామరమై నిలిచింది. ప్రతి ఒక్క పాట చాలా పేరొందింది. ఒకరకంగా తెలుగు నేపథ్య సంగీత జీవితంలో లీల గారికి  ఈ చిత్రం పతాక స్థాయి అని చెప్పుకోవచ్చు. 1968లో మహానటి సావిత్రి అందరూ మహిళలతో నిర్మించిన చిన్నారిలోకం చిత్రానికి లీలగారు సంగీత దర్శకత్వం వహించారు.

పాతాళభైరవి, బ్రతుకుతెరువు, జయసింహ, మిస్సమ్మ, చిరంజీవులు, తెనాలి రామకృష్ణ, మాయాబజార్, సువర్ణసుందరి, బబ్రువాహన, అప్పుచేసి పప్పుకూడు, పెళ్లినాటి ప్రమాణాలు, శాంతినివాసం, రాజమకుటం, జగదేకవీరుని కథ, పాండురంగ మహాత్య్మం, వేంకటేశ్వర మహాత్య్మం, లవకుశ, గుండమ్మ కథ, పరమానందయ్య శిష్యుల కథ, తిరుపతమ్మ కథ, దక్ష యజ్ఞం, సీతారామకళ్యాణం, పెళ్లి సందడి, మాంగల్య బలం  వంటి ఎన్నో చిత్రాలలో పాడారు. మొత్తం మీద దక్షిణాది భాషలలో 5000కు పైగా పాటలు పాడారు. 1984లో విడుదలైన ఎన్‌టీరామారావు గారి శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర చిత్రంలో నీవెవరో నీ జన్మం ఏదో అనే పాట ఆవిడ తెలుగు చిత్రాలలో పాడిన ఆఖరిది. లీలగారికి 1992లో తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డును, భారత ప్రభుత్వం 2006లో మరణానంతరం పద్మభూషణ్ అవార్డులను ప్రదానం చేశారు. వారికి  హృదయపూర్వకమైన నివాళి.

ఆవిడ పాటిన పాటలలో నాకు అత్యంత ప్రియమైనది రాజమకుటం చిత్రంలోని సడి చేయకో గాలి సడి చేయబోకే.

దేశమును ప్రేమించుమన్నా - మహాకవి గురజాడ
107ఏళ్ల క్రితం గురజాడ అప్పారావు గారు రచించిన ఆ దేశభక్తి పద్య సంపుటి ఇప్పటికీ ఎంత సముచితమో గమనించండి. కాలం ధాటిని తట్టుకునే శక్తి కొంత మంది కవుల రచనలకు మాత్రమే ఉంటుంది. వాటిలో గురజాడ ఈ రచన ఒకటి.

దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వట్టి మాటలుకట్టి పెట్టోయ్
గట్టి మేల్ తల పెట్టవోయ్!

పాడి పంటలు పొంగి పొర్లే
దారిలో నువు పాటు పడవోయ్
తిండి కలిగితె కండ గలదోయ్
కండ గలవాడేను మనిషోయ్ !

ఈసురోమని మనుషులుంటే
దేశమేగతి బాగుపడునోయ్?
జల్దుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరుకులునించవోయ్!

అన్ని దేశాల్ క్రమ్మవలెనోయ్
దేశి సరుకుల నమ్మవలెనోయ్
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సంపద లబ్బవోయ్ !

వెనక చూసిన కార్యమేమోయ్?
మంచి గతమున కొంచెమేనోయ్
మందగించక ముందు అడుగేయ్
వెనక పడితే వెనకేనోయ్ !

పూను స్పర్ధను విద్యలందే
వైరములు వాణిజ్యమందే
వ్యర్ధ కలహం పెంచబోకోయ్
కత్తి వైరం కాల్చవోయ్!

దేశాభిమానం నాకు కద్దని
వట్టి గొప్పలు చెప్పుకోకోయ్
పూని యేదైనను వొక మేల్
కూర్చి జనులకు చూపవోయ్!

ఓర్వలేమి పిశాచి, దేశం
మూలుగులు పీల్చేసెనోయ్
ఒరుల మేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయ్ !

పరుల కలిమికి పొరలి యేడ్చే
పాపికెక్కడ సుఖం కద్దోయ్ ?
ఒకరి మేల్ తన మేలనెంచే
నేర్పరికి మేల్ కొల్లలోయ్ !

స్వంత లాభం కొంత మానుకు
పొరుగు వాడికి తోడు పడవోయ్
దేశ మంటే మట్టి కాదోయ్,
దేశ మంటే మనుషులోయ్ !

చెట్ట పట్టాల్ పట్టుకొని
దేశస్థు లంతా నడవ వలెనోయ్
అన్న దమ్ముల వలెను జాతులు
మతములన్నీ మెలగ వలెనోయ్ !

మతం వేరైతేను యేమోయ్?
మనసు లొకటై మనుషులుంటే
జాతి యన్నది లేచి పెరిగి
లోకమున రాణించునోయ్!

దేశమనియెడి దొడ్డ వృక్షం
ప్రేమలను పూలెత్త వలెనోయ్
నరుల చమటను తడిసి మూలం
ధనం పంటలు పండ వలెనోయ్!

ఆకులందున అణగి మణగి
కవిత కోయిల పలుక వలెనోయ్
పలుకులను విని దేశమందభి
మానములు మొలకెత్త వలెనోయ్ !!

నక్కలోళ్ల సిన్నదాన్ని - వింజమూరి అనసూయాదేవి జానపద గీతం


వాలుకొప్పు పెట్టుకొని కట్టమీద పోత ఉంటే
వాడు సూచే సూపులకు వాలుకొప్పు జారిపోయే

శిద్దలయ్య కొండ మీద సిన్ని కూర కోసే దాన్ని
ఊరు చూడు దుమ్ము చూడు దున్నపోతుల బారు చూడు
బెంగులూరి కోనేట్కాడ రాయి కోసే చిన్నవాడ!

సూదులో దబ్బనాలో ఏస్కోలేదా హాయో తీస్కోలేదా హాయో
పాలపూసలు పగడాల పూసలు ఏస్కోలేదో హాయో తీస్కోలేదా హాయో
ఆరికోళ్లు నెమలికోళ్లు ఏస్కో లెదా హాయో తీస్కో లేదా హాయో

వింజమూరి అనసూయాదేవి గారు జానపద సంగీత ప్రపంచానికి చేసిన సేవ అంతా ఇంతా కాదు. ఒక ప్రాంతం కాదు, తెలుగు మాట్లాడే అన్ని ప్రాంతాల మాండలికాలను పరిశీలించి అక్కడి గ్రామీణ జీవితాలను ప్రతిబింబించే గీతాలను సంపాదించి వాటికి సంగీతం కూర్చి తాను పాడి ఇతర గాయకుల చేత పాడించారు. అటువంటి వాటిలో ఒకటి ఈ నక్కలోళ్ల సిన్నదాన్ని అనే గీతం. అనసూయాదేవి గారు, వసంత గారు పాడిన గీతానికి సంగీతం అనసూయ గారు, బీ గోపాలం గారు అందించారు. అమెరికాలో టెక్సాస్‌లో తన కూతురు ప్రఖ్యాత నాట్య కళాకారిణి రత్నపాప గారి దగ్గర స్థిరపడిన అనసూయ గారు ఇటీవాలే 97వ పుట్టినరోజు జరుపుకున్నారు. వారిలో ఉన్న ప్రతిభకు, వారు కళారంగానికి చేసిన సేవకు కనీసం పద్మభూషణ్ ఇవ్వాల్సిన మాట. ఆవిడ బ్రతికుండగా ఆ అవార్డు వస్తుందని ఆశిద్దాం. అవార్డులదేముందండీ అనే అల్లాటప్పా ప్రతిభ కాదు వీరిది. దాదాపు 85 ఏళ్ల సుదీర్ఘ సంగీత యానం అనసూయ గారిది. భారత ప్రభుత్వం వీరి ప్రతిభను గుర్తించాలి. అది చారిత్రాత్మక అవసరం. లేకపోతే ప్రతిభ అన్న పదానికి అర్థం లేదు.


16, ఆగస్టు 2017, బుధవారం

క్షీరాబ్ది కన్యకకు - అన్నమాచార్యుల అమ్మ వారి నీరాజనం

అమ్మ వారి నీరాజనం ఒకటైన  అన్నమాచార్యుల వారు రచించిన క్షీరాబ్ది కన్యకకు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు పాడగా ఎంతో ప్రాచుర్యం పొందింది. అన్నమాచార్యుల వారికి సంకీర్తనలలో అమ్మ అలమేల్మంగను ఎన్నో కృతులలో కొనియాడారు. ఈ నీరాజనం సంకీర్తన తెలుగిళ్లలో, ముఖ్యంగా వివాహాది శుభకార్యాలలో ఎక్కువగా వినబడుతుంది.


క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని 
నీరజాలయకును నీరాజనం 

జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు 
నెలకొన్న కప్పురపు నీరాజనం 
అలివేణి తురుమునకు హస్త కమలంబులకు
నిలువు మాణిక్యముల నీరాజనం

పగటు శ్రీ వేంకటేశు పట్టపురాణియై 
నెగడు సతి కళలకును నీరాజనం 
జగతినలమేల్మంగ చక్కదనములకెల్ల 
నిగుడు నిజ శోభనపు నీరాజనం

- సద్గురువులు తాళ్లపాక అన్నమాచార్యుల వారు

క్షీర సాగర మథనంలో ఆవిర్భించింది కాబట్టి మహాలక్ష్మిని క్షీరాబ్ది కన్యక అంటారు. ఆ అందమైన పదసంపుటిని అన్నమాచార్యుల వారు తన సంకీర్తనా నీరాజనంలో పల్లవి ఆరంభంలోనే ఉపయోగించారు. ఆ తల్లి అలా ఆవిర్భవించిన వెంటనే శ్రీమహావిష్ణువును వరించింది. నీటీలో పుట్టినది కాబట్టి తామరపూవుకు నీరజ అని పేరు వచ్చింది. ఆ తామరపూవులో నివసించే తల్లిని నీరజాలయగా అన్నమాచార్యుల వారు అభివర్ణించారు. కలువలవంటి కన్నులు గల తల్లికి, చక్కనైన ఆకృతి కలిగియున్న తల్లికి కర్పూరపు నీరాజనమట, నల్లని కురులతో ఉన్న ఆమె కొప్పుకు, కమలముల వంటి హస్తములకు మాణిక్యాలతో నీరాజనంట. ప్రకాశించే లావణ్యము కల శ్రీవేంకటపతికి పట్టపురాణియై వర్ధిల్లే ఆ తల్లికి యున్న కళలకు నీరాజనమట. ప్రపంచమంతా వ్యాపించే ఆ అలమేలుమంగ చక్కదనాలకు పాటలతో నీరాజనమట. అన్నమాచార్యుల వారి కృతులలో ప్రత్యేకత వారి అనుభూతులు పదములై జాలువారటం. తిఉర్చానూరులో వెలసిన ఆ పద్మావతీ దేవిని చూస్తే ఈ సంకీర్తన ఎటువంటి అనుభూతితో సద్గురువులు రచించారో అర్థమవుతుంది. ఆరాత్రికముగా చెప్పబడి, తరువాత ఆరతిగా రూపాంతరం చెందిన అర్చనా విధి హారతి. పగటి పూట కూడా వెల్గిచించబడి చేయునది కాబట్టి ఆరాత్రికము అయింది. ఇవి ఏక హారతి, దీప హారతి, ధూప హారతి, కర్పూర హారతి, కుంభ హారతి వంటి అనేక రకములు. ఈ కృతిలో అన్నమాచార్యుల వారు కర్పూర నీరాజనంతో పాటు, నవరత్నాలతో, గానముతో నీరాజనం పలికారు.

ఈ సంకీర్తన గురించి ప్రస్తావించినప్పుడు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి గాత్ర వైభవం గురించి చెప్పుకోవాలి. అన్నమాచార్యుల వారి కీర్తనలకు కొన్నింటికి ఆవిడ మరింత వెలుగులు దిద్దారు అనిపిస్తుంది. అన్నమయ్య కృతులను శాశ్వతం చేయటంలో సుబ్బులక్ష్మి గారు తనవంతు కృషి చేశారు. ఆవిడలోని పవిత్రత, భక్తి భావాలు ఆమె గానంలో ప్రకటితమవుతాయి. ఆవిడ పాడిన ఈ సంకీర్తన వీడియో చూస్తే అది అర్థమవుతుంది. 

గోపాలకృష్ణుడు నల్లన - రావు బాలసరస్వతీదేవి గారి లలిత గీతం

గోపాలకృష్ణుడు నల్లన గోకులములో పాలు తెల్లన
కాళిందిలో నీళ్లు చల్లన పాట పాడవే నా గుండె ఝల్లన

మా చిన్ని కృష్ణయ్య లీలలు మంజుల మధు మురళి ఈలలు
మా కీరసారికల గోలలు మాకు ఆనంద వారాశి ఓలలు

మా ముద్దు కృష్ణుని మాటలు మరువరాని తేనె తేటలు
మా పూర్వ పుణ్యాల మూటలు మమ్ము దరిచేర్చు తిన్నని బాటలు

ఎంత చక్కని లలిత గీతమో కదా! లలిత గీతాలలో కృష్ణభక్తికి, గోపికల మనోభావనలకు ప్రత్యేక స్థానం ఉంది. ఆ గోపస్త్రీల హృదయాలలోని భావఝరులను లలిత గీతాలు చక్కగా ఆవిష్కరిస్తాయి. నల్లనయ్య, గోకులంలోని దధి క్షీర నవనీతాలు, యమునా నది, కాళింది, కృష్ణయ్య వేణు గానం, ముద్దు ముద్దు మాటలు, గోపకులం ఆనందడోలికలు..ఇవి లలిత సంగీతంలో పండినంతగా శాస్త్రీయ సంగీతంలో పండవేమో అని నా అభిప్రాయం. ఇక ఈ గీతానికి వస్తే - 1947లో విడుదలైన రాధిక అనే చిత్రంలో వెంపటి సదాశివబ్రహ్మం గారు రచించగా సంగీతం సాలూరి హనుమంతరావు గారు అందించారు. లలిత సంగీత సామ్రాజ్ఞి రావు బాలసరస్వతీదేవి గారు ఆలపించారు. లలితగీతాల కోసమే బాలసరస్వతి గారు జన్మించారా అన్నట్లు ఈ గీతాలు వారి గళంలో జాలువారుతాయి. సదాశివబ్రహ్మం గారు ఎంతో ప్రతిభ ఉన్న రచయిత. వారి చలనచిత్ర గీతాలు అజరామరమైనవి. ఈ గీతంలో రచయిత గోపెమ్మ మనసును అద్భుతంగా ఆవిష్కరించారు. ఆయన ఉపయోగించిన పదాలు తెలుగుదనం ఉట్టిపడుతూ భావాన్ని లలితంగా ప్రవహింపజేశాయి. మంజులు మధు మురళి ఈలలు, కీరసారికల గోలలు, ఆనంద వారాశి ఓలలు, దరిచేరు తిన్నని బాటలు...ఇవన్నీ భావంతో పాటూ తెలుగు భాషా వైభవాన్ని ఇనుమడింపజేశాయి. అంతే చక్కగా హనుమంతరావు గారు సంగీతం అందించారు. బాలసరస్వతి గారి గానం మాధుర్యభరితమైన ప్రవాహమే.

నేటి తరం వారికి ఈ ప్రముఖులు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. వారి కోసం ఈ అలనాటి ప్రజ్ఞాశాలుల విశేషాలు కొన్ని.

1.రావు బాలసరస్వతీదేవి గారు


తెలుగు సినీ పరిశ్రమలోని తొలి తరం గాయనీమణుల్లో బాలసరస్వతి గారు అగ్రగణ్యులు. లలిత గీతాల గానంతో ఆకాశవాణిలో, నేపథ్య గీతాల గానంతో చలనచిత్ర పరిశ్రమలో తొలి గాయనిగా పేరొందారు. 1928లో ఇప్పటి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో జన్మించిన వీరు చిన్నతనంలోనే చిత్తజల్లు పుల్లయ్య గారి దర్శకత్వంలో విడుదలైన సతీ అనసూయ, భక్త ధ్రువ చిత్రాలలో పాడారు. సంగీతం ఆలత్తూరు సుబ్బయ్య గారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. ప్రముఖ హిందీ గాయకులు సైగల్ గారి ప్రభావం బాలసరస్వతి గారిపై ఉండేది. సైగల్ గారి లలితమైన శైలే బాలసరస్వతి గారి గాత్ర ధర్మమైంది. బాలనటిగానే పేరొందిన వీరు తొలుత తమిళం, తరువాత తెలుగు చలనచిత్రాలలో నటించారు. మొత్తం 15 చిత్రాలకు పైగా నటించారు. నటన తగ్గించి గాయనిగా స్థిరపడ్డారు. 1940 నుండి 67 వరకు గాయనిగా 85కు పైగా చిత్రాలలో పాడారు. వారి సినీ మరియు లలిత గీతాలు ప్రజల మనసుల్లో నిలిచిపోయాయి. హాయమ్మ హాయి, తానే మారెనా, ధరణికు గిరి భారమా, తలుపు తీయునంతలోనే, కనుగొంటి కనుగొంటి వంటి ఎన్నో గీతాలు ప్రజల మనసులను దోచుకున్నాయి. మహామహులైన తెలుగు తమిళ సంగీత దర్శకులకు తమ గానం అందించారు. అందరు మేటి గాయకులతోనూ పాడారు. ఆకాశవాణిలో 65 ఏళ్లు పాడిన ఘనత వీరిది. 90 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ వారి గాత్రంలోని లాలిత్యం ఏ మాత్రమూ తగ్గలేదు. కోలంకి రాజా వారిని వివాహం చేసుకున్న వీరు ఆయన మరణించిన తరువాత ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రాజావారి భూముల వివాదంలో కోర్టుల చుట్టూ తిరగలేక బాధ పడ్డారు. ప్రస్తుతం హైదరాబాదులో వారి మనుమడి దగ్గర ఉంటున్నారు.

2. సాలూరి హనుమంతరావు గారు:


సాలూరి సన్యాసిరాజు గారి కుమారుడైన వీరు ప్రఖ్యాత సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు గారి అన్నగారు. వీరు 1944-78 మధ్య దక్షిణాదిన చలనచిత్రాలకు సంగీతం అందించారు. అందులో ఒకటి రాధిక చిత్రం. 1917లో విజయనగరం జిల్లా సాలూరు సమీపంలోని శివరామపురంలో వీరు జన్మించారు. వీరు ద్వారం వేంకటస్వామి నాయుడు గారి వద్ద శాస్త్రీయ సంగీత శిక్షణను పొందారు. కర్ణాటక మరియు హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాలలో నైపుణ్యం పొందారు. వీరు మొట్టమొదట 1947లో చిత్తజల్లు పుల్లయ్య గారి దర్శకత్వంలో, అంజలీదేవి నాయికగా విడుదలైన గొల్లభామ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. అల్లావుద్దీన్ అద్భుతదీపం, చరణదాసి, ఉషా పరిణయం, దక్ష యజ్ఞం, చంద్రహాస, బాంధవ్యాలు, రైతుబిడ్డ, ఆరాధన మొదలైన 75 చిత్రాలకు సంగీతాన్ని అందించి 1980లో మరణించారు.

3. సదాశివబ్రహ్మం గారు:


వెంపటి సదాశివబ్రహ్మం గారు అలనాటి కథలు, పాటలు, సంభాషణల రచయిత. 1905లో తూర్పు గోదావరి జిల్లాలో జన్మించిన వీరు తొలుత 1941లో విడుదలైన చూడామణి అనే చిత్రానికి సంభాషణలు, పాటలు, కథ అందించారు. తరువాత తెనాలి రామకృష్ణ (1941,56), పల్నాటి యుద్ధం (1947), రాధిక (1947), కీలుగుర్రం, సంసారం, పక్కింటి అమ్మాయి, కన్యాశుల్కం, చరణదాసి, భలే రాముడు, సువర్ణ సుందరి, శారద, అప్పు చేసి పప్పు కూడు, చెంచులక్ష్మి, ఇల్లరికం, లవకుశ, పరమానంద శిష్యుల కథ మొదలైన ఎన్నో అద్భుతమైన చిత్రాలకు సాహిత్యాన్ని అందించారు. భలే రాముడు చిత్రంలోని ఓహో మేఘమాల, అవకుశ చిత్రంలో లేరు కుశలవుల సాటి అన్న పాట ఎంత ప్రజాదరణ పొందిందో అందరికీ తెలిసిందే. లవకుశ మరియు రహస్యం చిత్రాలలోని పద్యాలు చాలమటుకు వీరు రచించినవే. గీత రచయితగా కన్నా, సంభాషణలు, కథా రచయితగా వీరు పేరొందారు. సదాశివబ్రహ్మం గారు 1968లో చెన్నైలో మరణించారు. 

15, ఆగస్టు 2017, మంగళవారం

కంట జూడుమి - త్యాగరాజ స్వామి కృతి


కంట జూడుమి ఒక పరి క్రీగంట జూడుమి! 

బంటుడై వెలయు బాగుగాని తప్పు 
తంటలెల్ల మానుకొన్న నన్ను క్రీగంట జూడుమి! 

అలనాడు సౌమిత్రి పాద సేవ 
చెలరేగి సేయు వేళ సీతతో 
పలికి చూచినంత పులకాంకితుడై 
పరగిన యటు త్యాగరాజుని క్రీగంట జూడుమి!

ఓ రామా! నీ బంటునైన నన్ను ఒకసారి క్రీగంట చూడుము! నా తప్పు పనులన్నీ మానుకొన్నాను. ఆ నాడు నీకు ఎంతో సేవ చేసిన లక్ష్మణుని గురించి సీతతో పొగడగా ఆ సౌమిత్రి ఎంతో సంతోషించాడు. నన్ను కూడా ఆ విధంగా కంట పెట్టుకొని చూడుము.

- సద్గురు త్యాగరాజ స్వామి

త్యాగరాజస్వామి వారి వేడుకోలు కృతులలో కంట జూడుమి ఒకటి. తన తప్పులను తెలుసుకున్నాను కరుణ చూపించమని అయన స్వామిని ప్రార్థించాడు. తనకు నిరంతరం సేవ చేసే లక్ష్మణుని కనిపెట్టుకుని ఉన్నట్లు తనను కూడా చూసుకోమన్నాడు. భక్తునికి-భగవంతుని మధ్య సంభాషణలలో ఎన్ని రకాలో కదా? ఆ వైవిధ్యాన్నే త్యాగరాజస్వామి ఈ కృతి ద్వారా తెలియజేశాడు. వాచస్పతి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని ఎమ్మెల్ వసంతకుమారి గారు గానం చేశారు.


శ్రీరామపట్టాభిషేకం - శ్రీమద్రామాయణం యుద్ధకాండ 128వ సర్గ


శ్రీరామనవమి అనంతరం దశమి నాడు శ్రీరామపట్టాభిషేకం చేయటం భద్రాద్రిలో ఆనవాయితీ. శ్రీరామ పట్టాభిషేకానికై జరిగిన సన్నాహాలు, పట్టాభిషేక మహోత్సవాన్ని వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణం యుద్ధకాండ 128వ సర్గలో వర్ణించారు.

రామన్న తన తల్లి కైకకు తండ్రి దశరథుడిచ్చిన మాట ప్రకారం వనవాసానికి వెళ్లి, ఆ సమయంలో రావణునిచే అపహరించబడిన సీతను కాపాడటానికి అధర్మానికి ఒడిగట్టిన రావణుని సంహరించి ధర్మ స్థాపన చేస్తాడు. వనవాస సమయంలో భరతుని పాలన చేయమనగా, ఆతడు అన్న పాదుకలనుంచి 14 ఏళ్లు ఆయన దాసునిగా రాజ ధర్మాన్ని నిర్వర్తించాడు. యుద్ధం తరువాత రాముడు అయోధ్యకు తిరిగి రాగా, రామన్నను రాజ్యాన్ని స్వీకరించవలసిందిగా భరతుడు కోరాడు. రాముడు తిరిగి రాజ్యాన్ని చేపట్టడానికి అంగీకరించాడు.

వనవాసం వలన పెరిగిన జటాఝూటములమును ముడివిప్పి మంగళ స్నానం చేశాడు. అనేక రకాల సుగంధ లేపనాలను ఆయనకు అలదగా ఆయన అద్భుతంగా ప్రకాశించాడు. శతృఘ్నుడు రామలక్ష్మణులను అలంకరించారు. దశరథుని పత్నులు సీతమ్మను అలంకరించారు. కౌసల్య వానర పత్నులను అలంకరించింది. సుమంత్రుడు రథాన్ని తీసుకురాగా రాముడు దానిని అధిరోహించాడు. సుగ్రీవుడు, హనుమంతుడు కూడా మంగళ స్నానములు చేసి తమను తాము అలంకరించుకున్నారు.

భరతుడు పగ్గాలు చేపట్టగా, లక్ష్మణుడు వింజామర వీచగా, శతృఘ్నుడు ఛత్రము పట్టగా రాముడు అయోధ్య వీధులలో రధముపై విహరించాడు. సుగ్రీవుడు శత్రుంజయమను ఏనుగునెక్కాడు. వానరులందరూ మానుష రూపము ధరించారు. ప్రజలందరూ రామునికి జయ జయ ధ్వానాలు పలికారు. సంగీత వాద్యములతో నృత్యములతో ఆ రాముడు అయోధ్యాపురాన్ని కలయబెట్టాడు. తన మంత్రులతో సుగ్రీవ విభీషణాదులతో తన మైత్రిని గురించి ప్రస్తావించాడు. రాముని పలుకులతో హర్షించిన ప్రజలు తమ ఇళ్లపై పతాకాలను ఎగురవేశారు.

రాముడు రాజప్రాసాదాన్ని చేరుకొని తొలుత ముగ్గురు మాతలకు నమస్కరించాడు. సుగ్రీవాదులకు ఉచితమైన వసతులు చూడమని భరతునితో చెప్పాడు. భరతుడు సుగ్రీవుని రామ పట్టాభిషేకానికై ఏర్పాట్లను ఆరంభించవలసిందిగా కోరాడు. తదనుగుణంగా సుగ్రీవుడు జాంబవంతుని, హనుమంతుని, వేగదర్శిని, ఋషభుని నాలుగు సాగరములనుండి పవిత్ర జలాలను తీసుకు రావలసిందిగా ఆదేశించాడు. వానరులు వారి ఆదేశాల మేరకు 500 నదుల నీరు తీసుకు వచ్చారు. శతృఘ్నుడు రాజ గురువైన వశిష్ఠుల వారితో ఆ జలాల గురించి తెలిపాడు.

వశిష్ఠుడు నవరత్న ఖచితమైన సింహాసనం మీద సీతారాములను ఆసీనులు కావలసిందిగా కోరాడు. వశిష్ఠ, జాబాలి, వామదేవ,కాశ్యప,కాత్యాయన, సుయజ్ఞ, గౌతమ, విజయ మహర్షులు రాముని పవిత్రమైన సుగంధ జలాలతో అభిషిక్తుని చేశారు. మనువును అలంకరించిన నవరత్న ఖచితమైన కిరీటముతో రాముని అలంకరించి రాముని ఆశీర్వదించారు.  శతృఘ్నుడు తెల్లని ఛత్రము పట్టుకోగా, విభీషణుడు, సుగ్రీవుడు వింజామర వీచారు. వాయుదేవుడు ఇంద్రుని బహుమతిగా వంద కలువలున్న స్వర్ణమాలను బహుకరించాడు. వాయుదేవుడు ముత్యాల మరియు ఇతర రత్నాల హారాలను రామునికి సమర్పించాడు. అప్సరసలు నృత్యం చేశారు. ప్రకృతి పుష్పములతో, ఫలములతో పులకరించింది.

రాముడు తొలుత బ్రహ్మణులను, తరువాత సుగ్రీవ అంగదాదులకు కానుకలు అందజేశాడు. సీతమ్మకు ముత్యాల హారాన్ని బహుకరించాడు. రాముడు సీతతో ఆ హారాన్ని సభలో అత్యంత పరక్రమవంతుడు, బుద్ధిమంతుడు, వినయసంపన్నుడు మరియు సమస్త శుభగుణములు కల్వానికి బహుకరించమనగా సీతమ్మ ఆ హారాన్ని హనుమకు ఇచ్చింది. రాముడు మిగిలిన వానరులకు కూడా కానుకలిచ్చాడు. తరువాత సుగ్రీవాదులు కిష్కింధకు, విభీషణుడు లంకకు తిరిగి వెళ్లారు.

ఎన్నగ మనసుకు రాని - త్యాగరాజ స్వామి కృతి


ఎన్నగ మనసుకు రాని పన్నగ శాయి సొగసు
పన్నుగ గనుగొనని కన్ను లేలే? కంటి మిన్ను లేలే?

మోహముతో నీలవారివాహ కాంతిని గేరిన
శ్రీహరిని గట్టుకొనని దేహమేలే? ఈ గేహ మేలే?

సరసిజ మల్లె తులసి విరజాజి పారిజాత
విరులచే పూజించని కరము లేలే? ఈ కాపురము లేలే?

మాలిమితో త్యాగరాజునేలిన త్యాగరాజ మూర్తిని
లాలించి పొగడని నాలికేలే? సూత్ర మాలికేలే? 

మనసు ఎంచలేని శేషసాయి సొగసును కనుగొనలేని కన్నులెందుకు? కంటిరెప్పలెందుకు? తన్మయత్వంతో నీలమేఘ కాంతిని కలిగిన శ్రీహరి రూపమును తన యందు స్థిరము చేసుకోలేని ఈ దేహమెందుకు? ఈ గృహమెందుకు? కలువలు, మల్లెలు, తులసి, పారిజాత పుష్పములచే ఆ రాముని పూజించలేని చేతులెందుకు? గృహస్థాశ్రమమెందుకు? మక్కువతో త్యాగరాజును ఏలిన ఆ స్వామిని లాలించి పొగడని నాలుకెందుకు? హారములెందుకు?

- సద్గురు త్యాగరాజ స్వామి

త్యాగరాజస్వామి వారు ఈ కృతి నీలాంబరి రాగంలో స్వరపరచారు. నీలాంబరి జోలపాడి విశ్రాంతిని కలిగించి నిదురలోకి తీసుకు వెళ్లే అద్భుతమైన రాగం. ధీర శంకరాభరణ జన్యమైన ఈ రాగం పవిత్రతను, భక్తిని, తల్లి లాలనను చక్కగా పండిస్తుంది. త్యాగరాజస్వామి ఎన్నగా మనసుకు రాని, ఉయ్యాలలూగవయ్యా, లాలియూగవే, దీక్షితుల వారి అంబా నీలాయతాక్షి, శ్యామశాస్త్రి గారి బ్రోవవమ్మ, పొన్నయ్య పిళ్లై గారి అంబా నీలాంబరి, నారాయణ తీర్థుల వారి మాధవ మామవ దేవా, ఊతుక్కాడు వేంకటసుబ్బయ్య గారి మణినూపురధారి ఈ రాగంలోనే స్వరపరచబడ్డాయి. ప్రతి ఒక్కటి కూడా ముందు చెప్పిన లక్షణాలను చక్కగా ఆవిష్కరించాయి. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు ఈ కృతిని మనోజ్ఞంగా ఆలపించారు. 1946లో విడుదలైన త్యాగయ్య చిత్రంలో చిత్తూరు నాగయ్య గారు, గుబ్బి జయమ్మ గారు కూడా ఎంతో భావగర్భితంగా ఆలపించారు

నానాటి బతుకు నాటకము - తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తన


నానాటి బతుకు నాటకము 
కానక కన్నది కైవల్యము 

పుట్టుటయు నిజము పోవుటయు నిజము 
నట్టనడిమి కాలము నాటకము 
యెట్టనెదుట గలదీ ప్రపంచము
కట్టకడపటిది కైవల్యము 

కుడిచేదన్నము కోక చుట్టేది
నడిమంత్రపు పని నాటకము 
వొడిగట్టు కొనినవుభయ కర్మములు 
గడి దాటినపుడె కైవల్యము 

తెగదు పాపము తీరదు పుణ్యము 
నగి నగి కాలము నాటకము 
ఎగువనె శ్రీ వేంకటేశ్వరుడేలిక 
గగనము మీదిది కైవల్యము

-తాళ్లపాక అన్నమాచార్యులవారు


ఇల్లు-వాకిలి-తల్లిదండ్రులు-పిల్లలు-పనివాళ్లు-కళకళలాడే ఇల్లు-తల్లిదండ్రులు కాలం చెందటం-పిల్లలు పెళ్లిళ్లై బయటకు వెళ్లిపోవటం-భార్య-భర్త/పనిమనిషి-> దంపతుల్లో ఎవరో ఒకరు ముందు పోవటం-> ఒంటరి పక్షి/పనిమనిషి->గూడు చినబోయెరా!ఒక జీవితకాలం చూస్తే ముందు ఏమీ లేదు, వెనుక ఏమీ లేదు. ఓ నాటకంలో పాత్రలు పోషించటం, దేహం శిథిలమైనప్పుడు ఆత్మ కొత్త గూడు వెతుక్కోవటం...నట్టనడుమ ఎందుకీ అహంకారం? అంతా మన చేతుల్లోనే ఉన్నట్లు, మనుషులపై ఆధిపత్యపు పోరు, మౌనయుద్ధాలు..ఉన్నన్నాళ్లూ హాయిగా మనసు తేలికగా ఉంచుకొని సమయం రాగానే కొత్తగూటికి స్వేచ్ఛగా ఎందుకు ఎగిరిపోలేకున్నాము?

మనం మోసుకొచ్చిన బరువులు కొన్నైతే, కొత్తగా వేసుకున్న బరువులు మరిన్ని - సంస్కారాలు, కర్మఫలాలు (సంచిత, ప్రారబ్ధ, ఆగామి)...అన్నీ కలిసి ఆ పక్షిని  ఈ భూమ్మీదే మోక్షం పొందని ఆత్మగా తిప్పి తిప్పి జననమరణమనే చక్రబంధంలో కట్టిపడేస్తున్నాయి. కొన్ని కర్మ ఫలాలు బ్రహ్మజ్ఞానంతో పటాపంచలైతే మరి కొన్ని అనుభవించవలసినదే. కాకపోతే ఆ అనుభవంలో దేహాత్మ స్ఫురణ కలిగిన వానికి తామరాకు మీద నీటిబొట్టులా ఆ కర్మఫలాల వల్ల కలిగే బాధ తగ్గుతుంది. దీనికి సద్గురువే శరణ్యం. కర్మఫలాలు ఎలా ఉన్నా, జీవితమనే నాటకంలో సంసారబంధాలు,అనుబంధాల వలన కలిగే దుఃఖానికి భక్తి జ్ఞాన వైరాగ్యాములలో ఏదైనా మందే. భక్తితో భారం భగవంతునిపై వేస్తే, జ్ఞానంతో అజ్ఞానం తొలగి స్థితప్రజ్ఞత కలుగుతుంది. ఎవరో కొందరు కారణ జన్ములకు తప్ప ఎక్కువ శాతం మనుషులకు వైరాగ్యము అన్ని అవస్థలు దాటిన తరువాతే పరిపక్వమవుతుంది..ఈ కర్మలు, తద్వారా పాపపుణ్యముల లెక్క ఎప్పటికీ తెగనిదే. ఆ రెండిటి లెక్కలు దాటగలిగితేనే మోక్షము. అందుకు ఉన్నది ఒక్కటే దిక్కు  పరమాత్ముడైన శ్రీవేంకటేశ్వరుడు.

ఈ అన్నమయ్య కృతిని సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి గారు రేవతి రాగంలో స్వరపరచగా భారతరత్న ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు తితిదే వారి ఆల్బంలో పాడి దానిని శాశ్వతం చేశారు. ఈ సంకీర్తనలోని సందేశం అర్థం చేసుకుంటే జీవితంలో దుఃఖము దూరమవుతుంది. శాశ్వతానందము కలుగుతుంది.


కడలి దరి దాక నడచెదము గాక - దేశభక్తి గీతం


కడలి దరి దాక నడచెదము గాక
చదలురుగు దాక కదలెదము గాక
ఆ కడలి ఆ చదలు ఏకమగు గాక
చేయి చేయి హాయినిడి చేరి విడిపోక

చీకటుల్ చెదరగా శృంఖలాల్ బెదర
తోడుగా నీడగా మా గాంధి నడువగా
అడుగిడిన జగమదర మా గాంధి నడువగా

మన ప్రభుత మన ఘనత కొని తెచ్చు వరకు
మన గాంధి మన తండ్రి మది నిలుపుకొనుచు
కనులలో ఒక జ్యోతి గళములో ఒక గీతి
మా మనసులో మెరయు ఒక ప్రేమహేతి

బరువులకు బాధలకు శిరసొరగనీక
బ్రతుకు చావుల మాట మది చొరగనీక
ఈ ఆశ ఈ రీతి కొనసాగు వరకు
చేయి చేయి హాయినిడి చేరి విడిపోక

అటు స్నేహమిటు స్నేహమొలికుంచుకొనుచు
అటు దివ్వె అటు దివ్వె వెలిగించుకొనుచు
అవని అంతా ప్రేమ గృహమైన వరకు
ఆ అంచు ఈ అంచు కలిపేయువరకు


(గాంధీ మహాత్ముని దండి సత్యాగ్రహం యాత్ర సందర్భంగా రచించినబడిన గీతం, పాలగుమ్మి విశ్వనాథం గారి సంగీతంలో ఆకాశవాణి ద్వారా వెలువడిన దేశభక్తి గీతం)

14, ఆగస్టు 2017, సోమవారం

నాదయోగి నేదునూరి కృష్ణమూర్తి

(నేదునూరి  వారి  వెబ్  సైట్ మరియు ఇతర మూలాల ఆధారంగా)

శాస్త్రీయ సంగీతం మూర్తీభవిస్తే అది నేదునూరి కృష్ణమూర్తి గారవుతుందా అన్నట్లు ఆయన వ్యక్తిత్వం ప్రకాశించింది. దాదాపు ఏడు దశాబ్దాల సుదీర్ఘమైన కర్ణాటక శాస్త్రీయ సంగీత ప్రస్థానం నేదునూరి వారిది. తన వ్యక్తిత్వాన్ని మాటల ద్వారా కాకుండా సంగీతం ద్వారా తెలియజేసిన మహా సంగీత గురువులు నేదునూరి కృష్ణమూర్తి గారు. వారి జీవిత విశేషాలు ఈ వ్యాసంలో.

1927వ సంవత్సరం అక్టోబరు 10న రామమూర్తి పంతులు, విజయలక్ష్మి దంపతులకు పిఠాపురం సమీపంలోని కొత్తపల్లి గ్రామంలో కృష్ణమూర్తి గారు జన్మించారు. రామమూర్తి పంతులు గారు పిఠాపురం మహారాజావారి కొలువులో పని చేసే వారు. తల్లి విజయలక్ష్మి గారు అష్టపదులు, తరంగాలు, ఆధ్యాత్మ రామాయణ సంకీర్తనలు పాడుతూ ఉంటే విని బాలుడైన కృష్ణమూర్తిలో సంగీతం పట్ల అభిలాష పెరిగింది. వయోలిన్ విద్వాంసులు వేమన దొర గారు, అప్పారావు గారు, కల్లూరి వేణుగోపాలరావు గారు వీరి చిన్ననాటి గురువులు.  విజయనగరం రిటైర్డు తహిసిల్దార్ గారు అయిన అప్పలనరసింహం గారు తరచూ కల్లూరి వారింటికి వచ్చే వారు. వారి సహాయంతో కృష్ణమూర్తి గారు 1940వ సంవత్సరంలో విజయనగరంలోని మహారాజ కళాశాలలో సంగీతాభ్యాసం ఆరంభించారు. తొలుత ద్వారం నరసింగరావు నాయుడు గారి వద్ద వయోలిన్ మరియు గాత్ర సంగీత శిక్షణను పొందారు. ద్వారం వేంకటస్వామి నాయుడు గారు మరియు నరసింగరావు నాయుడు గార్ల సలహాతో గాత్రసంగీతం మీదే దృష్టిపెట్టాలని నిర్ణయించుకున్నారు. నరసింగరావు నాయుడు గారి సలహతో లయజ్ఞానం కోసం మృదంగం విద్వాంసులు కోలంక వేంకటరాజు గారి వద్ద శిక్షణను పొందారు. 1945లో కచేరీలు ఇవ్వటం ప్రారంభించారు. తొలి కచేరీ జన్మస్థలమైన కొత్తపల్లిలోనే.

కాకినాడలోని సరస్వతీ గానసభలో ఒకసారి ప్రఖ్యాత వేణువాద్య కళాకారులు టీఆర్ మహాలింగం గారు కచేరీ చేయవలసి ఉండగా ఆయన అనుకోని కారణాల వల్ల సమయానికి రాలేకపోయారు. వారు వచ్చేంత వరకూ  నేదునూరి వారు ఆ సభలో కచేరీ చేశారు. కొద్దికాలంలోనే మంచి కళాకారుడిగా పేరు తెచ్చుకున్నారు. సరస్వతీ గాన సభ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన పోటీలలో ప్రథమ బహుమతి కూడా కృష్ణమూర్తి గారు గెలుచుకున్నారు. తరువాత కొన్నాళ్లు రేడియోలో కచేరీలు విని నేర్చుకున్నారు. ప్రముఖుల కచేరీలకు వెళ్లి స్వరాలు రాసుకొని సాధన చేసి తన విద్యను పదునుపెట్టుకున్నారు. ఈ విధంగా స్వయంకృషితో ఆయన సాధన చేశారు. గురువులైన నరసింగరావు నాయుడు గారు, వేంకటరాజు గారు శిష్యునికి ప్రక్క వాయిద్య కాళాకారులుగా పని చేయటం తనకు వారి ఆశీర్వాదంగా భావించారు కృష్ణమూర్తి గారు. తన గాత్రశైలిని అప్పటికే పేరుపొందిన మహామహోపాధ్యాయులు డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారి శిష్యుల శైలితో పోల్చి చూసుకొని పినాకపాణి గారి శైలి చాలా బాగుందని గ్రహించారు. ఆయన వద్ద శిష్యరికం చేయాలని నిర్ణయించుకున్నారు.  1949వ సంవత్సరంలో పినాకపాణి గారి అనుమతితో వారి వద్ద శిష్యరికం మొదలు పెట్టారు. పినాకపాణి గారిది అద్భుతమైన గమక సంపద మరియు సంగతులు కలిగిన శైలి. వారి శిక్షణలో కృష్ణమూర్తిగారు పూర్తి కళాకారునిగా ఎదిగారు. తనదైన బాణీని ఏర్పరచుకున్నారు. పినాకపాణి శిష్యులలో ప్రముఖ త్రయం వోలేటి వేంకటేశ్వర్లు గారు, నూకల చినసత్యనారాయణ గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు. కానీ, ఈ ముగ్గురి గాత్రం ధర్మము మరియు శైలి చాలా భిన్నమైనవి. జీఎన్ బాలసుబ్రహ్మణ్యం, అరైకూడి, శెమ్మంగూడి మొదలైన తమిళ సంగీత మహామహుల ప్రభావం నేదునూరిపై చాలా ఉండేది. పినాకపాణి గారికి అరైకూడి వారంటే ఎంతో గౌరవం. అందుకే ఆయన కృష్ణమూర్తి గారికి ఆ శైలిలోనే నేర్పించారు. గురువు గారికి తనమీద ఎంతో అభిమానమని, తన గాత్రధర్మానికి తగినట్లుగా శిక్షణనిచ్చారని, ఆ శిక్షణే తన సంగీతం శ్రేష్టం కావటానికి కారణమని కృతజ్ఞతా భావంతో కృష్ణమూర్తి గారు తెలిపారు. పినాకపాణి గారి వద్ద కృష్ణమూర్తి గారు ఎన్నో అరుదైన కృతులను, రాగాలను నేర్చుకున్నారు. కృష్ణమూర్తి గారు పినాకపాణి గారిని సద్గురువులుగా, గొప్ప మనిషిగా, అపారమైన వాత్సల్యమున్న పెద్దగా, మేధావిగా అత్యంత గౌరవ భావం కలిగి ఉండేవారు. కర్నూలు మెడికల్ కాలేజీలో పని చేస్తున్న పినాకపాణి గారి వద్ద తన అభ్యాసాన్ని మరపురాని జ్ఞాపకంగా ఆయన గుర్తు చేసుకునే వారు. తనను పినాకపాణి గారు స్నేహితునిగా, సోదరునిలా చూసుకునే వారని కృష్ణమూర్తిగారు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వీరిద్దరూ ఒక్కొక్కసారి అర్థరాత్రి వరకు సాధన చేసే వారట.

నేదునూరి గారి విద్వత్తు అనతికాలంలోనే వారిని చెన్నై తీసుకు వెళ్లింది. 1951వ సంవత్సరంలో మద్రాసు సంగీత అకాడెమీ అధ్యక్షులైన చెంబై వైద్యనాథ భాగవతార్ గారు నేదునూరి వారిని అక్కడ పాడవల్సిందిగా కోరారు. ఆ సభకు హాజరైన చెంబై, జీఎన్‌బీ నేదునూరి వారి విద్వత్తుకు ముగ్ధులైనారు. తరువాత పాల్ఘాట్ మణి, పళని సుబ్రహ్మణ్య పిళ్ళై వంటి కళాకారులు కృష్ణమూర్తి గారితో కచేరీలలో పాల్గొన్నారు. తరువాత నేదునూరి వారి ఖ్యాతి దేశ విదేశాల్లో వ్యాపించింది. ఆయన అనేక దేశాలలో కచేరీలు చేశారు. మద్రాసు సంగీత సభలలో పేరు పొందారు. తమిళ కళాకారులు మరియు ఆ రాష్ట్రంలోని శాస్త్రీయ సంగీతాభిమానుల మన్ననలు పొందిన అరుదైన తెలుగు గాయకుల్లో ఒకరిగా ప్రఖ్యాతి పొందారు. నేదునూరి కృష్ణమూర్తి గారు అనేక సంగీత కళాశాలలో అధ్యాపకునిగా, ప్రిన్సిపాల్‌గా పని చేశారు. తొలుత 1963లో విజయవాడలో, తరువాత హైదరాబాదులో, తరువాత విజయనగరంలో, చివరగా మళ్లీ విజయవాడలో పని చేసి 1985లో పదవీ విరమణ చేశారు. రెండు దశాబ్దాల సమయంలో ఆయన ఓ నాలుగేళ్లు డెప్యుటేషన్ మీద తిరుపతి శ్రీవేంకటేశ్వర సంగీత కళాశలలో పని చేశారు. అక్కడ ఉన్నప్పుడే తితిదే వారి అన్నమాచార్య ప్రాజెక్టు కింద 60కి పైగా అన్నమాచార్య కృతులను స్వరపరచారు. ఆయన స్వరపరచిన కొన్ని అన్నమయ్య కీర్తనలు - ఏమొకో చిగురుటధరమున (తిలంగ్), ఒకపరికొకపరి వయ్యారమై (ఖరహరప్రియ), భావములోన (శుద్ధ ధన్యాసి), చేరి యశోదకు (మోహన), నానాటి బతుకు నాటకము (రేవతి), ముద్దుగారే యశోద (కురంజి) మొదలైనవి. భారతరత్న ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు నేదునూరి వారి వద్ద ఈ కృతులను నేర్చుకుని, వాటిని పాడి ఆయన బాణీలను శాశ్వతం చేశారు. నేదునూరి వారు ఎన్నో రామదాసు కీర్తనలను కూడా ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చారు. పండు వయసులో 108వ అన్నమాచార్య కీర్తనను స్వరపరచి తన సంగీత విద్వత్తును ప్రపంచమంతా చాటారు. ఆకాశవాణి భక్తిరంజని కార్యక్రమాలకు నేదునూరి వారు ఎంతో సేవను అందించారు. భద్రాచల రామదాసు కీర్తన్లను, తరంగాలను ప్రచారం చేశారు. ఎందరో కళాకారులకు ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా పేరు వచ్చేందుకు తోడ్పడ్డారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సంగీత విభాగంలో విసిటింగ్ ప్రొఫెసర్‌గా అయిదేళ్లు పని చేశరు. కర్ణాటక సంగీతంలో శాస్త్రీయతను కాపడేందుకు ఆయన నాద సుధా తరంగిణి అని ఒక ట్రస్టును స్థాపించారు. అన్నమయ్య పదసౌరభాలు అనే 108 కీర్తనల సాహిత్యం, భావం, స్వరాలు కలిగిన మూడు భాగాల పుస్తక సంపుటిని ఈ సంస్థ ద్వారా ప్రచురించారు. శ్రీవేంకటేశ్వర మరియు నాగార్జున విశ్వవిద్యాలయాలలో లలితకళల విభాగానికి అధిపతిగా సేవలను అందించారు.

నేదునూరి వారి సంగీత ప్రస్థానంలో ఎన్నో బిరుదులు, ఎన్నో గౌరవాలు. 1976లో చెన్నై కృష్ణ గాన సభ వారి సంగీత చూడామణి, 1980లో విశాఖ సంగీత అకాడెమీ వారి సంగీత కళాసాగర, 1981లో నాద సుధానిధి, 1982లో గాన కళానిధి మరియు గాయక చూడామణి, 1986లో కేంద్ర సంగీత నాటక అకాడెమీ వారి ఉత్తమ శాస్త్రీయ సంగీత విద్వాంసుని అవార్డు,  1989లో సంగీత విద్వన్మణి, సంగీత విద్యాభాస్కర, నాదయోగి, 1991లో శ్రీకళాపూర్ణ, కంచి కామకోటి పీఠం వారి ఆస్థాన విద్వాన్, 1992లో ప్రతిష్ఠాత్మకమైన సంగీత కళానిధి, 2002లో రాజాలక్ష్మి అవార్డు, 2010లో తితిదే మరియు విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానాల ఆస్థాన విద్వాన్, మొదలైనవి కొన్ని. రాజకీయ ప్రేరితమైన పద్మ అవార్డులు ఇటువంటి మహానుభావునికి ఒక్కటి కూడా రాకపొవటం ఆ అవార్డులకే అవమానం. అయితేనేమి, నేదునూరి నాదయోగిగా ఈ దేశానికి చేసిన సేవలు ఎనలేనివి. వారి శిష్యపరంపర గంగాప్రవాహంలో ప్రతిభతో, శాస్త్రీయతతో కొనసాగుతూనే ఉంది. కళాప్రపూర్ణ దోమాడ చిట్టబ్బాయి గారు, పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారు, మల్లాది సోదరులు, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు, సరస్వతీ విద్యార్థి గారు, డాక్టర్ శేషులత గారు నేదునూరి వారి శిష్య ప్రముఖులలో కొందరు. శాస్త్రీయత, శృతి శుద్ధతకు, గమకాలకు, స్వర ప్రస్తారాలకు నేదునూరు వారు పెట్టింది పేరు. అంచున్న తెల్లని పంచె, లాల్చీ, కండువా, నుదుటన విభూతి రేఖలు, ముఖంలో గాంభీర్యము, పవిత్రమైన జీవనంతో నాదసాధన చేసిన ఈ సంగీతయోగి 2014 డిసెంబర్ 8న ఆ నాదబ్రహ్మలో ఐక్యమైనారు. పరిపూర్ణమైన సంగీత జీవనంతో వారి ఆత్మ ఆ శంకరుని పాదాల వద్దకు చేరి దేవలోకాలను ఎప్పటికీ అలరిస్తూనే ఉంటుంది. నేదునూరి కృష్ణమూర్తి గారి సాధనకు, సంగీత ప్రజ్ఞకు, వారి వ్యక్తిత్వానికి శతసహస్ర వందనాలు.

నేదునూరి వారు స్వరపరచి, గానం చేసిన పలుకుతేనెల తల్లి పవళించెను అనే అన్నమాచార్యుల వారి కృతి విని ఆనందించండి. 

11, ఆగస్టు 2017, శుక్రవారం

"పలుకు తేనెల తల్లి" వేదవతీ ప్రభాకర్ గారి విశేషాలు


నా చిన్నతనంలో ఆవిడ పాట కోసం ఆకాశవాణి, దూరదర్శన్ కార్యక్రమాలలో మా కుటుంబమంతా ఎదురు చూసే వాళ్లము. వారి వ్యక్తిత్వం ఎంత నిండైనదో వారు పాడే పద్ధతిలో, వారి నడవడికలో అర్థమవుతుంది. హుందాతనానికి వారు ప్రతిబింబం. పరిచయం లేకపోయినా వారిని చూడగానే గౌరవభావం కలుగుతుంది. లలిత సంగీతానికి, లాలిపాటలకు మారు పేరు వారు. ప్రఖ్యాత లలిత భక్తి సంగీత గాయని శ్రీమతి వేదవతీ ప్రభాకర్ గారి విశేషాలు ఈరోజు.

కన్నడ దేశంలో పుట్టి పెరిగి, తెలుగు భాష నేర్చుకొని లలితసంగీతంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న గాయనీమణి వేదవతి ప్రభాకర్ గారు. మైసూరు-బెంగుళూరు మధ్య గల రామనగరిలో రుక్మిణి-శ్రీకంఠయ్య దంపతులకు వేదవతి గారు జన్మించారు. బెంగుళూరులో పెరిగిన వీరు అక్కడే పదేళ్ల వయసునుండి చెన్నమ్మ గారి వద్ద కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. వీరి తరువాతి గురువు ముద్దులపల్లి లక్ష్మీనరసింహ శాస్త్రి గారు. శ్రీకంఠయ్య గారు బెంగుళూరు గాయన సమాజంలో సభ్యునిగా ఉండటంతో పిల్లలను ప్రతి వారమూ గొప్ప గొప్ప సంగీత విద్వాంసుల కచేరీలకు తీసుకు వెళ్లేవారు. కానీ, అప్పటి కుటుంబపు కట్టుబాట్ల వల్ల వేదికలెక్కి పాడలేకపోయారు. వివాహం ఐపీఎస్ ఆఫీసర్ అయిన రొద్దం ప్రభాకరరావు గారితో జరగటంతో తెలుగునాట ప్రవేశం జరిగింది. మారుమూల ప్రాంతాలలో ఉండవలసి రావటంతో తెలుగు నేర్చుకోవలసి వచ్చింది. అత్తమామలు కళలపట్ల ఆసక్తి కలవారు కావటంతో వారు వేదవతి గారిలోని సంగీత ప్రతిభను బాగా ప్రోత్సహించారు. అనంతపురంలో అత్తమామల దగ్గరకు వెళ్లినప్పుడల్లా వారు వేదవతి గారి కోసం సంగీత గురువును రప్పించే వారు, వారికి కొన్ని కృతులు నేర్చుకునే అవకాశం కల్పించేవారు. భర్తకు నిరంతరం బదిలీలు వచ్చే ఉద్యోగం కావటంతో వారి ఈ సంగీత సాధనకు అంతరాయాలు వచ్చాయి.

ఒకసారి అప్పటి భారత రాష్ట్రపతి, వారి సతీమణి విజయవాడ వచ్చిన సందర్భంలో రోటరీ వారి సభలో అప్పటి ప్రఖ్యాత గాయని శ్రీరంగం గోపాలరత్నం గారు  పాడవలసి ఉండగా ఆవిడ జ్వరంతో రాలేకపోవటంతో వేదవతి గారు అప్పటికప్పుడు ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తనను పాడవలసి వచ్చింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ వారిని ఆకాశవాణిలో పాడవలసిందిగా ఆహ్వానించారు. తెలుగుభాష పూర్తిగా రాకపోవటంతో ఆవిడ శ్రీరంగం గోపాలరత్నం గారి సోదరులు శ్రీరంగం గోవిందాచార్యుల వారి వద్ద తెలుగు భాషతో పాటు 15 పాటలు నేర్చుకుని పాడారు. అతి తక్కువ సమయంలోనే ఆకాశవాణి బీ గ్రేడ్ కళాకారిణిగా గుర్తించబడ్డారు. నేదునూరి వారు స్వరపరచిన అన్నమాచార్య కీర్తనలు, బాలమురళి గారు స్వరపరచిన ఇతర గీతాలను ఆవిడ పాడారు. గొప్ప గొప్ప కళకారుల సహచర్యంలో ఆకాశవాణి ద్వారా సేవలందించారు. తరువాత వారు తెలుగు మరియు కన్నడ చిత్రాలలో సాంప్రదాయ గీతాలు పాడారు. జాతీయ స్థాయిలో వారికి అవకాశం జీవీ అయ్యరు గారి ఆదిశంకరాచార్య చిత్రంలో వచ్చింది. ఆ చిత్రంలో కనకధారా స్తోత్రం శ్లోకాలతో పాటు మరెన్నో శ్లోకాలను వేదవతి గారు ఆలపించారు. రామకృష్ణ మఠం వారి ప్రైవేట్ ఆల్బం, తితిదే వారి నవరాత్రి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు, పురందరదాసుల కృతుల క్యాసెట్లు పాడారు. ఆకాశవాణిలో ఏ గ్రేడ్ కళాకారిణిగా ఎంతో పేరొందారు. భర్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డీజీపీ అయినా వేదవతి గారిని ఎంతో ప్రోత్సహించారు. వీరు మంత్రాలయంలో గురు శుక్రవారాలలో నాద నమన అనే కార్యక్రమాన్ని ఆరంభించి ఔత్సాహికులైన కళాకారులకు ప్రోత్సాహం కలిగించారు. వేదవతి గారు పాలగుమ్మి విశ్వనాథం గారి వద్ద కూడా శిక్షణను పొందారు.

ఇక వేదవతి గారి గాత్ర వైశిష్ట్యానికొస్తే - శ్రావ్యమైన శాస్త్రీయ సంగీతంతో పాటు మనసును హత్తుకునే లలిత భావ గీతాలకు వారి గాత్రం పెట్టింది పేరు. భావాన్ని అద్భుతంగా ఒలికించే వారి గానం శ్రోతలను ఆనందంలో ఓలలాడిస్తుంది. పాలగుమ్మి వారి రచన, సంగీతంలో వచ్చిన "అమ్మ దొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ" అన్న పాటను వేదవతి గారు పాడిన రీతి దశాబ్దాలైనా ఇప్పటికీ తెలుగువారి హృదయాలను తాకుతూనే ఉంది. ఓ ఆడబిడ్డ యొక్క తల్లి మనసును ఆవిష్కరించే ఈ గీతం ఆ తల్లీ-కూతుళ్ల మధ్య గల బంధంలోని భావనలను అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. పాలగుమ్మి వారి సాహిత్య సంగీతాలతో కలసి వేదవతి గారి గానం తెలుగువారి మనసులను హత్తుకొని హృదయాలను కరిగిస్తుంది. దేవులపల్లి వారి పూవులేరి తేవే చెలి పోవలె కొవలెకు, మధూదయంలో మంచి ముహూర్తం వంటి అద్భుతమైన లలిత గీతాలు, శివపాదమునుంచ నేను శిలనైనా కారాదా అన్న అరిపిరాల విశ్వం గారి భక్తి లలిత గీతం, జో అచ్యుతానంద జో జో ముకుందా అనే అన్నమాచార్యుల వారి కృతి మొదలైనవి వేదవతి గారి గళంలో ఎంతో ప్రాచుర్యం పొందాయి. జో జో ముకుందా అన్న ఆల్బంలో ఉన్న ప్రతి గీతమూ వారి గాత్ర సౌందర్యానికి ఉదాహరణలు. తప్పకుండా బిడ్డలు అన్నీమరచి నిద్రపోయేలా ఉంటాయి. వింజమూరి శివరామారావు గారి మధురానగరి సమీపంలో అనే గీతం కూడా వీరి గాత్ర సౌరభాన్ని ఆవిష్కరిస్తుంది. వేదవతి గారి మంగళహారతులు కూడా ఎంతో పేరు పొందాయి. శీతాద్రి శిఖరాన అన్న బేతవోలు రామబ్రహ్మం గారి హారతిని బాలమురళి గారి తరువాత వేదవతి గారు పాడిన రీతి తెలుగు నాట దేవాలయాలలో మారు మ్రోగింది. నేదునూరి వారి వద్ద నేర్చుకున్న అన్నమాచార్యుల వారి "పలుకు తేనెల తల్లి" అనే సంకీర్తన వేదవతి గారి గాత్రంలో ఎంతో ప్రాచుర్యం పొందింది.

ఆకాశవాణిలో భక్తిరంజనితో పాటు అనేక లలిత సంగీత కార్యక్రమాలలో వేదవతి గారు పాడారు. మీరాబాయి భజనలను సి. నారాయణ రెడ్డి గారు అనువదించగా పాలగుమ్మి విశ్వనాథం గారి సంగీతంలో వేదవతి గారు పాడారు. ఈ గీతాలు ఎంతో పేరుపొందాయి. ఇవి విన్న హెచ్.ఎం.వీ కంపెనీలో పని చేసే మంగపతి గారు వేదవతి గారి చేత ఈ సినారె గారి మీరా గీతాలను పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీత దర్శకత్వంలో పాడించారు. తిరుప్పావై, దేవీ స్తోత్రాలు, భజనలు వీరికి ఎంతో పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి. అమెరికా, కెనడా, ఇంగ్లండు దేశాలతో పాటు అనేక ప్రాంతాలలో 1000కి పైగా కచేరీలలో వేదవతి గారు పాడారు. 2012లో ఉగాది పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం, అపురూప అవార్డు, తెలుగు కళాసమితి వారి కేవీరావు-జ్యోతి రావు అవార్డు మొదలైన పురస్కారాలను వేదవతి గారు పొందారు. సుదీర్ఘమైన సంగీత ప్రస్థానంలో వేదవతి గారు లబ్దప్రతిష్ఠులు, ఎన్నేళ్లైనా వారి గాత్రంలో మాధుర్యం అలానే నిలిచి ఉండటం వారి సాధనను, జీవనశైలిని ప్రతిబింబిస్తుంది. వేదవతి-ప్రభాకరరావు దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వేదవతి గారికి ఆ భగవంతుడు మరింత సేవా భాగ్యాన్ని, గాత్ర సౌలభ్యాన్ని ప్రసాదించాలని శుభాకాంక్షలు.