20, ఆగస్టు 2017, ఆదివారం

కళలకు కాణాచి - విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల




విజయనగరం - ఆ భూమిలో ఏముందో! సంగీతానికి, సమస్త కళలకు పుట్టినిల్లు విజయనగరం. ఆ ప్రాంతాన్ని పాలించిన పూసపాటి గజపతి రాజులు ఆ కళలు వర్ధిల్లేలా వసతులు కల్పించి ప్రోత్సహించారు. ఆ పట్టణంలోని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల అంటే తెలియని కళాభిమానులుండరు. 1919వ సంవత్సరంలో మహారాజా పూసపాటి విజయరామ గజపతిరాజు గారు ఈ కళాశాలను స్థాపించారు. తొలుత దీనిని విజయరామ గానపాఠశాల అని నామకరణం చేశారు. మొట్టమొదటి ప్రిన్సిపాల్‌గా హరికథా పితామహులు అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు కాగా, ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసులు ద్వారం వేంకటస్వామి నాయుడు గారు తొలి ప్రొఫెసర్. విజయరామ గజపతి రాజు గారి తరువాత వారి కుమారులైన అలక్ నారాయణ గజపతి రాజు గారు ఆ సంస్థ పేరును శ్రీ విజయరామ సంగీత మరియు నృత్య కళాశాలగా మార్చారు. వివిధ విభాగాలను ఏర్పాటు చేశారు. తరువాతి మహారాజా పీవీజీ రాజు గారు ఈ కళాశాలను ఎంతో అభివృద్ధి చేశారు. 1955వ సంవత్సరంలో ఈ కళాశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. ఇక్కడ సంగీత నృత్య విభాగాలలో డిప్లొమా మరియు డిగ్రీ కోర్సులు ఉన్నాయి.



ఇక మహారాజా కళాశాలలో పనిచేసిన వారు, నేర్చుకున్న వారి జాబితా చూస్తే ఆ కళాశాల ఘన చరిత్ర తెలుస్తుంది - ప్రధాన అధ్యాపకులుగా ద్వారం వేంకటస్వామి నాయుడు గారు, ద్వారం నరసింగరావు నాయుడు గారు, ద్వారం భావనారాయణరావు గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు, శ్రీరంగం గోపాలరత్నం గారు, ద్వారం దుర్గాప్రసాదరావు గారు మొదలైన ప్రముఖులు పని చేశారు. వారి శిక్షణ పొందిన వారు వేలాది మంది విద్యార్థులు గురువులై ఆ పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు. ద్వారం వంశంలో ఎందరో ఈ సంస్థలో చదివిన వారే. ఘంటసాల వేంకటేశ్వరరావు గారు, పులపాక సుశీలమ్మ గారు, సాలూరి రాజేశ్వరరావు గారు, సాలూరి హనుమంతరావు గారు, కొమాండూరి కృష్ణమాచార్యుల వారు, మంచాల జగన్నాథరావు గారు, మారెళ్ల కేశవరావు గారు, ముళ్లపూడి లక్ష్మణరావు గారు, ముళ్ళపూడి శ్రీరామమూర్తి గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు, మహామహోపాధ్యాయ నూకల చినసత్యనారాయణ గారు...ఇలా ఎందరో ప్రముఖులకు సంగీత విద్యను అలదిన సంస్థ మహారాజా కళాశాల. అక్కడి గాలిలో, నీటిలో, మనుషులలో సంగీతం అంతర్భాగం అని చెప్పటం అతిశయోక్తి కాదు.


గాత్రం, వయోలిన్, వీణ, మృదంగం, భరతనాట్యం, కూచిపూడి, కథక్‌లలో ఆంధ్రా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా డిగ్రీ మరియు డిప్లోమా కోర్సులు ఈ కళాశాల ద్వారా చేయవచ్చు. దాదాపు 100 ఏళ్ల చరిత్ర గల ఈ కళాశాల తెలుగు జాతికి చేసిన సేవ ఎనలేనిది. పద్మ అవార్డులు, సంగీత కళానిధి బిరుదులు పొంది మన కళల ఖ్యాతిని ఖండాంతరాలు వ్యాపింపజేసిన ప్రముఖులకు విద్యను ఇచ్చిన సరస్వతీ నిలయం ఇది. స్థాపించి పోషించిన ఆ మహారాజులకు, ప్రమాణాలు పాటించి ప్రతిభకు ప్రాణం పోసిన ప్రధాన అధ్యాపకులకు శతసహస్ర వందనాలు. ద్వారం కుటుంబ సభ్యులకు ఈ కళాశాలతో ఉన్న సుదీర్ఘమైన అనుబంధం, వారు ఈ సంస్థకు చేసిన సేవ చిరస్మరణీయం. ఆ కుటుంబ సభ్యులకు మనం ఎంతో రుణపడి ఉన్నాము.

ప్రముఖ గాయని, సంగీత అధ్యాపకురాలు, ద్వారం వేంకటస్వామి నాయుడు గారి మనుమరాలు, ద్వారం భావనారాయణరావు గారి కుమార్తె ద్వారం లక్ష్మి గారు ఫేస్బుక్‌లో నా యీ పోస్టుకు కామెంటుగా ఈ వివరాలు ఇచ్చారు:

"మా కుటుంబంలో మీరు చెప్పిన నలుగురు ప్రధాన అధ్యాపకులతో పాటు మా మేనత్త గారు ద్వారం మంగతాయారు గారు, ద్వారం రమణకుమారి గారు, ద్వారం మనోరమ గారు, నేను (మొత్తం ద్వారం కుటుంబం నుండి ఎనమండుగురం) ఈ కళాశాలలో పని చేశాము. ఈ కళాశాలలో చదువుకున్న మా ఇతర కుటుంబ సభ్యులు - మా అమ్మ గారు గుమ్మలూరి వరదమ్మ గారు, పెద్దమ్మ గారు గుమ్మలూరి రమణమ్మ గారు ఇక్కడ చదివారు. మా పెద్దమ్మమ్మ కుమారుడైన శ్రీ జోగారావు గారు ఇక్కడ లెక్చరర్‌గా పని చేశారు. వారి కుమారులు శాస్త్రి గారు ఇక్కడ పని చేస్తున్నారు. మా అత్త గారి వైపు కూడా ఇద్దరు పెద మామ గార్లు ఇక్కడ సంగీతం నేర్చుకున్నారు. మా ద్వారం కుటుంబానికి ఈ కళాశల పుట్టినిల్లు, ఓ దేవాలాయం. మా కుటుంబానికి ఈ కళాశాలతో అవినాభావ సంబంధం ఉంది ". 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి