14, ఆగస్టు 2017, సోమవారం

నాదయోగి నేదునూరి కృష్ణమూర్తి

(నేదునూరి  వారి  వెబ్  సైట్ మరియు ఇతర మూలాల ఆధారంగా)

శాస్త్రీయ సంగీతం మూర్తీభవిస్తే అది నేదునూరి కృష్ణమూర్తి గారవుతుందా అన్నట్లు ఆయన వ్యక్తిత్వం ప్రకాశించింది. దాదాపు ఏడు దశాబ్దాల సుదీర్ఘమైన కర్ణాటక శాస్త్రీయ సంగీత ప్రస్థానం నేదునూరి వారిది. తన వ్యక్తిత్వాన్ని మాటల ద్వారా కాకుండా సంగీతం ద్వారా తెలియజేసిన మహా సంగీత గురువులు నేదునూరి కృష్ణమూర్తి గారు. వారి జీవిత విశేషాలు ఈ వ్యాసంలో.

1927వ సంవత్సరం అక్టోబరు 10న రామమూర్తి పంతులు, విజయలక్ష్మి దంపతులకు పిఠాపురం సమీపంలోని కొత్తపల్లి గ్రామంలో కృష్ణమూర్తి గారు జన్మించారు. రామమూర్తి పంతులు గారు పిఠాపురం మహారాజావారి కొలువులో పని చేసే వారు. తల్లి విజయలక్ష్మి గారు అష్టపదులు, తరంగాలు, ఆధ్యాత్మ రామాయణ సంకీర్తనలు పాడుతూ ఉంటే విని బాలుడైన కృష్ణమూర్తిలో సంగీతం పట్ల అభిలాష పెరిగింది. వయోలిన్ విద్వాంసులు వేమన దొర గారు, అప్పారావు గారు, కల్లూరి వేణుగోపాలరావు గారు వీరి చిన్ననాటి గురువులు.  విజయనగరం రిటైర్డు తహిసిల్దార్ గారు అయిన అప్పలనరసింహం గారు తరచూ కల్లూరి వారింటికి వచ్చే వారు. వారి సహాయంతో కృష్ణమూర్తి గారు 1940వ సంవత్సరంలో విజయనగరంలోని మహారాజ కళాశాలలో సంగీతాభ్యాసం ఆరంభించారు. తొలుత ద్వారం నరసింగరావు నాయుడు గారి వద్ద వయోలిన్ మరియు గాత్ర సంగీత శిక్షణను పొందారు. ద్వారం వేంకటస్వామి నాయుడు గారు మరియు నరసింగరావు నాయుడు గార్ల సలహాతో గాత్రసంగీతం మీదే దృష్టిపెట్టాలని నిర్ణయించుకున్నారు. నరసింగరావు నాయుడు గారి సలహతో లయజ్ఞానం కోసం మృదంగం విద్వాంసులు కోలంక వేంకటరాజు గారి వద్ద శిక్షణను పొందారు. 1945లో కచేరీలు ఇవ్వటం ప్రారంభించారు. తొలి కచేరీ జన్మస్థలమైన కొత్తపల్లిలోనే.

కాకినాడలోని సరస్వతీ గానసభలో ఒకసారి ప్రఖ్యాత వేణువాద్య కళాకారులు టీఆర్ మహాలింగం గారు కచేరీ చేయవలసి ఉండగా ఆయన అనుకోని కారణాల వల్ల సమయానికి రాలేకపోయారు. వారు వచ్చేంత వరకూ  నేదునూరి వారు ఆ సభలో కచేరీ చేశారు. కొద్దికాలంలోనే మంచి కళాకారుడిగా పేరు తెచ్చుకున్నారు. సరస్వతీ గాన సభ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన పోటీలలో ప్రథమ బహుమతి కూడా కృష్ణమూర్తి గారు గెలుచుకున్నారు. తరువాత కొన్నాళ్లు రేడియోలో కచేరీలు విని నేర్చుకున్నారు. ప్రముఖుల కచేరీలకు వెళ్లి స్వరాలు రాసుకొని సాధన చేసి తన విద్యను పదునుపెట్టుకున్నారు. ఈ విధంగా స్వయంకృషితో ఆయన సాధన చేశారు. గురువులైన నరసింగరావు నాయుడు గారు, వేంకటరాజు గారు శిష్యునికి ప్రక్క వాయిద్య కాళాకారులుగా పని చేయటం తనకు వారి ఆశీర్వాదంగా భావించారు కృష్ణమూర్తి గారు. తన గాత్రశైలిని అప్పటికే పేరుపొందిన మహామహోపాధ్యాయులు డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారి శిష్యుల శైలితో పోల్చి చూసుకొని పినాకపాణి గారి శైలి చాలా బాగుందని గ్రహించారు. ఆయన వద్ద శిష్యరికం చేయాలని నిర్ణయించుకున్నారు.  1949వ సంవత్సరంలో పినాకపాణి గారి అనుమతితో వారి వద్ద శిష్యరికం మొదలు పెట్టారు. పినాకపాణి గారిది అద్భుతమైన గమక సంపద మరియు సంగతులు కలిగిన శైలి. వారి శిక్షణలో కృష్ణమూర్తిగారు పూర్తి కళాకారునిగా ఎదిగారు. తనదైన బాణీని ఏర్పరచుకున్నారు. పినాకపాణి శిష్యులలో ప్రముఖ త్రయం వోలేటి వేంకటేశ్వర్లు గారు, నూకల చినసత్యనారాయణ గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు. కానీ, ఈ ముగ్గురి గాత్రం ధర్మము మరియు శైలి చాలా భిన్నమైనవి. జీఎన్ బాలసుబ్రహ్మణ్యం, అరైకూడి, శెమ్మంగూడి మొదలైన తమిళ సంగీత మహామహుల ప్రభావం నేదునూరిపై చాలా ఉండేది. పినాకపాణి గారికి అరైకూడి వారంటే ఎంతో గౌరవం. అందుకే ఆయన కృష్ణమూర్తి గారికి ఆ శైలిలోనే నేర్పించారు. గురువు గారికి తనమీద ఎంతో అభిమానమని, తన గాత్రధర్మానికి తగినట్లుగా శిక్షణనిచ్చారని, ఆ శిక్షణే తన సంగీతం శ్రేష్టం కావటానికి కారణమని కృతజ్ఞతా భావంతో కృష్ణమూర్తి గారు తెలిపారు. పినాకపాణి గారి వద్ద కృష్ణమూర్తి గారు ఎన్నో అరుదైన కృతులను, రాగాలను నేర్చుకున్నారు. కృష్ణమూర్తి గారు పినాకపాణి గారిని సద్గురువులుగా, గొప్ప మనిషిగా, అపారమైన వాత్సల్యమున్న పెద్దగా, మేధావిగా అత్యంత గౌరవ భావం కలిగి ఉండేవారు. కర్నూలు మెడికల్ కాలేజీలో పని చేస్తున్న పినాకపాణి గారి వద్ద తన అభ్యాసాన్ని మరపురాని జ్ఞాపకంగా ఆయన గుర్తు చేసుకునే వారు. తనను పినాకపాణి గారు స్నేహితునిగా, సోదరునిలా చూసుకునే వారని కృష్ణమూర్తిగారు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వీరిద్దరూ ఒక్కొక్కసారి అర్థరాత్రి వరకు సాధన చేసే వారట.

నేదునూరి గారి విద్వత్తు అనతికాలంలోనే వారిని చెన్నై తీసుకు వెళ్లింది. 1951వ సంవత్సరంలో మద్రాసు సంగీత అకాడెమీ అధ్యక్షులైన చెంబై వైద్యనాథ భాగవతార్ గారు నేదునూరి వారిని అక్కడ పాడవల్సిందిగా కోరారు. ఆ సభకు హాజరైన చెంబై, జీఎన్‌బీ నేదునూరి వారి విద్వత్తుకు ముగ్ధులైనారు. తరువాత పాల్ఘాట్ మణి, పళని సుబ్రహ్మణ్య పిళ్ళై వంటి కళాకారులు కృష్ణమూర్తి గారితో కచేరీలలో పాల్గొన్నారు. తరువాత నేదునూరి వారి ఖ్యాతి దేశ విదేశాల్లో వ్యాపించింది. ఆయన అనేక దేశాలలో కచేరీలు చేశారు. మద్రాసు సంగీత సభలలో పేరు పొందారు. తమిళ కళాకారులు మరియు ఆ రాష్ట్రంలోని శాస్త్రీయ సంగీతాభిమానుల మన్ననలు పొందిన అరుదైన తెలుగు గాయకుల్లో ఒకరిగా ప్రఖ్యాతి పొందారు. నేదునూరి కృష్ణమూర్తి గారు అనేక సంగీత కళాశాలలో అధ్యాపకునిగా, ప్రిన్సిపాల్‌గా పని చేశారు. తొలుత 1963లో విజయవాడలో, తరువాత హైదరాబాదులో, తరువాత విజయనగరంలో, చివరగా మళ్లీ విజయవాడలో పని చేసి 1985లో పదవీ విరమణ చేశారు. రెండు దశాబ్దాల సమయంలో ఆయన ఓ నాలుగేళ్లు డెప్యుటేషన్ మీద తిరుపతి శ్రీవేంకటేశ్వర సంగీత కళాశలలో పని చేశారు. అక్కడ ఉన్నప్పుడే తితిదే వారి అన్నమాచార్య ప్రాజెక్టు కింద 60కి పైగా అన్నమాచార్య కృతులను స్వరపరచారు. ఆయన స్వరపరచిన కొన్ని అన్నమయ్య కీర్తనలు - ఏమొకో చిగురుటధరమున (తిలంగ్), ఒకపరికొకపరి వయ్యారమై (ఖరహరప్రియ), భావములోన (శుద్ధ ధన్యాసి), చేరి యశోదకు (మోహన), నానాటి బతుకు నాటకము (రేవతి), ముద్దుగారే యశోద (కురంజి) మొదలైనవి. భారతరత్న ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు నేదునూరి వారి వద్ద ఈ కృతులను నేర్చుకుని, వాటిని పాడి ఆయన బాణీలను శాశ్వతం చేశారు. నేదునూరి వారు ఎన్నో రామదాసు కీర్తనలను కూడా ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చారు. పండు వయసులో 108వ అన్నమాచార్య కీర్తనను స్వరపరచి తన సంగీత విద్వత్తును ప్రపంచమంతా చాటారు. ఆకాశవాణి భక్తిరంజని కార్యక్రమాలకు నేదునూరి వారు ఎంతో సేవను అందించారు. భద్రాచల రామదాసు కీర్తన్లను, తరంగాలను ప్రచారం చేశారు. ఎందరో కళాకారులకు ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా పేరు వచ్చేందుకు తోడ్పడ్డారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సంగీత విభాగంలో విసిటింగ్ ప్రొఫెసర్‌గా అయిదేళ్లు పని చేశరు. కర్ణాటక సంగీతంలో శాస్త్రీయతను కాపడేందుకు ఆయన నాద సుధా తరంగిణి అని ఒక ట్రస్టును స్థాపించారు. అన్నమయ్య పదసౌరభాలు అనే 108 కీర్తనల సాహిత్యం, భావం, స్వరాలు కలిగిన మూడు భాగాల పుస్తక సంపుటిని ఈ సంస్థ ద్వారా ప్రచురించారు. శ్రీవేంకటేశ్వర మరియు నాగార్జున విశ్వవిద్యాలయాలలో లలితకళల విభాగానికి అధిపతిగా సేవలను అందించారు.

నేదునూరి వారి సంగీత ప్రస్థానంలో ఎన్నో బిరుదులు, ఎన్నో గౌరవాలు. 1976లో చెన్నై కృష్ణ గాన సభ వారి సంగీత చూడామణి, 1980లో విశాఖ సంగీత అకాడెమీ వారి సంగీత కళాసాగర, 1981లో నాద సుధానిధి, 1982లో గాన కళానిధి మరియు గాయక చూడామణి, 1986లో కేంద్ర సంగీత నాటక అకాడెమీ వారి ఉత్తమ శాస్త్రీయ సంగీత విద్వాంసుని అవార్డు,  1989లో సంగీత విద్వన్మణి, సంగీత విద్యాభాస్కర, నాదయోగి, 1991లో శ్రీకళాపూర్ణ, కంచి కామకోటి పీఠం వారి ఆస్థాన విద్వాన్, 1992లో ప్రతిష్ఠాత్మకమైన సంగీత కళానిధి, 2002లో రాజాలక్ష్మి అవార్డు, 2010లో తితిదే మరియు విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానాల ఆస్థాన విద్వాన్, మొదలైనవి కొన్ని. రాజకీయ ప్రేరితమైన పద్మ అవార్డులు ఇటువంటి మహానుభావునికి ఒక్కటి కూడా రాకపొవటం ఆ అవార్డులకే అవమానం. అయితేనేమి, నేదునూరి నాదయోగిగా ఈ దేశానికి చేసిన సేవలు ఎనలేనివి. వారి శిష్యపరంపర గంగాప్రవాహంలో ప్రతిభతో, శాస్త్రీయతతో కొనసాగుతూనే ఉంది. కళాప్రపూర్ణ దోమాడ చిట్టబ్బాయి గారు, పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారు, మల్లాది సోదరులు, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు, సరస్వతీ విద్యార్థి గారు, డాక్టర్ శేషులత గారు నేదునూరి వారి శిష్య ప్రముఖులలో కొందరు. శాస్త్రీయత, శృతి శుద్ధతకు, గమకాలకు, స్వర ప్రస్తారాలకు నేదునూరు వారు పెట్టింది పేరు. అంచున్న తెల్లని పంచె, లాల్చీ, కండువా, నుదుటన విభూతి రేఖలు, ముఖంలో గాంభీర్యము, పవిత్రమైన జీవనంతో నాదసాధన చేసిన ఈ సంగీతయోగి 2014 డిసెంబర్ 8న ఆ నాదబ్రహ్మలో ఐక్యమైనారు. పరిపూర్ణమైన సంగీత జీవనంతో వారి ఆత్మ ఆ శంకరుని పాదాల వద్దకు చేరి దేవలోకాలను ఎప్పటికీ అలరిస్తూనే ఉంటుంది. నేదునూరి కృష్ణమూర్తి గారి సాధనకు, సంగీత ప్రజ్ఞకు, వారి వ్యక్తిత్వానికి శతసహస్ర వందనాలు.

నేదునూరి వారు స్వరపరచి, గానం చేసిన పలుకుతేనెల తల్లి పవళించెను అనే అన్నమాచార్యుల వారి కృతి విని ఆనందించండి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి