4, అక్టోబర్ 2017, బుధవారం

చేర రావదేమిరా? రామయ్యా! - త్యాగరాజస్వామి కృతి



చేర రావదేమిరా? రామయ్యా! 

మేరగాదురా ఇక మహామేరుధీర! శ్రీకర! రామయ్య!

తల్లి తండ్రి లేని బాల తన నాథు గోరు రీతి పలుమారు వేడుకొంటే పాలించ రాదా?
వలచుచు నేను నీదు వదనారవిందమును తలచి కరుగ జూచి త్యాగరాజ సన్నుత!

ఓ రామయ్యా! నన్ను చేర రావేమిరా! మేరు పర్వతమంతటి మహా ధీరుడవు, శుభకరుడవు, ఇక నా వల్ల గాదురా రామయ్యా! తల్లి తండ్రి లేని బాలిక తన రక్షణను కోరే రీతి నేను అనేకమార్లు నిన్ను వేడుకొన్నాను.నన్ను పాలించ రాదా!  శివునిచే నుతించబడిన ఓ రామా! నీ మనసు కరుగుటకై,  నిన్నే కోరుచు,  నీ ముఖారవిందమును తలచుచున్నాను. నన్ను చేర రావేమిరా!

- సద్గురువులు త్యాగరాజస్వామి

మల్లాది సోదరులు గానం చేసిన ఈ కృతి రీతిగౌళ రాగంలో స్వరపరచబడినది.


శివకామేశ్వరీం చింతయేహం - దీక్షితులవారి చిదంబర క్షేత్ర కృతి


శివకామేశ్వరీం చింతయేహం
శృంగారరస సంపూర్ణకరీం

శివ కామేశ్వర మనః ప్రియకరీం
శివానంద గురుగుహ వశంకరీం

శాంత కళ్యాణ గుణ శాలినీం శాంత్యతీత కళా స్వరూపిణీం
మాధుర్య గానామృత మోదినీం మదాలసాం హంసోల్లాసినీం
చిదంబర పురీశ్వరీం చిదగ్ని కుండ సంభూత సకలేశ్వరీం

శృంగార రసాన్ని సంపూర్ణం చేసే శివకామేశ్వరీ అమ్మను నేను ధ్యానిస్తున్నాను. శివకామేశ్వరుని మనసును రంజిల్ల జేసే, శివానందయైన, గురుగుహుని నిర్దేశించే అమ్మను నేను ధ్యానిస్తున్నాను. శాంతము మొదలైన శుభకరమైన గుణములతో ప్రకాశిస్తూ, శాంతికి అతీతమైన కళలకు స్వరూపిణియై, మధురమైన గానామృతమును ఆనందించే, ఆనందాతిశయయై హంసపై భాసిల్లే, చిదగ్నికుండము నుండి జన్మించిన, సకల జీవరాశులకు రాజ్ఞియైన, చిదంబరపురానికి ఈశ్వరి అయిన శివకామసుందరిని నేను ధ్యానిస్తున్నాను.



ముత్తుస్వామి దీక్షితుల వారి క్షేత్ర కృతులలో చిదంబరంలో నటరాజునితో కూడి యున్న శివకామసుందరి అమ్మవారిని కొలిచిన కృతి ఇది. చిత్సభలో నటరాజుడు శివకామసుందరీ దేవిల వైభవం కళ్లారా చూడవలసినదే. అద్భుతమైన శైవక్షేత్రం చిదంబరం. తమిళనాడులో చెన్నైకి దక్షిణాన 231కిలోమీటర్ల దూరంలో కడలూరు జిల్లాలో చిదంబరం ఉంది. సనాతనమైన ఈ దేవాలయాన్ని చోళులు, పాండ్యులు, చేరులు, విజయనగర రాజులు పోషించారు. ఇప్పుడున్న కట్టడం 12వ శతాబ్దం నాటిది. 40 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో అనేకదేవతా సమూహమై యున్న ఈ దేవాలయం పంచభూత స్థలములలో ఆకాశాన్ని సూచించేది. శివరాత్రికి జరిగే నాట్యాంజలి ఉత్సవాలకు ఈ దేవస్థానం పేరొందింది. నాలుగు వైపుల నాలుగు గోపురముల ద్వారా ఈ దేవస్థానంలోకి ప్రవేశించ వచ్చు. ఐదు సభలకు ఈ క్షేత్రం ప్రసిద్ధి - చిత్సభ (గర్భగుడి), కనకసభ (నిత్యసేవలు జరిగే మంటపము), నాట్యసభ, వేయి స్థంభములతో సహస్రార చక్రాన్ని సూచించే రాజసభ, దేవసభ (గణేశుడు, సోమస్కందుడు,  శివానందనాయకి, చండికేశ్వరులకు నిలయమైన సభ). 14వ శతాబ్దంలో హిందూ ద్వేషి అయిన ఇస్లాం రాజు మాలిక్ కఫూర్ దాడులలో ఈ గుడిని కూడా ధ్వంసం చేయగా తరువాత దానిని పునరుద్ధరించారు.

దీక్షితుల వారు శివకామేశ్వరీ రూపంలో ఈ శివకామసుందరిని దర్శించి ఉపాసన చేశారు. ఈ కృతిలో లలితా సహస్రనామావళిలో చిదగ్ని కుండ సంభూతగా పలుకబడిన అమ్మవారిని ప్రస్తావించారు. అలాగే ఈ క్షేత్రంలో ఉన్న శివానంద నాయికను, స్కందుని కూడా ప్రస్తావించారు. శివుని ఆనందతాండవానికి చిదంబరం రంగస్థలం. ఆ తాండవంలో శివకామసుందరిని శృంగార రస సంపూర్ణకరిగా, హంసోల్లాసినిగా వర్ణించి స్థల పురాణానికి సార్థకత కలిగించారు. కళ్యాణి రాగంలో కూర్చబడిన ఈ కృతిని మల్లాది సోదరులు గానం చేశారు.